1. తిరుగుబాటు చేయునదియు, భ్రష్టురాలును, తన ప్రజలను తానే పీడించునదియునైన యెరూషలేమునకు అనర్ధము తప్పదు.
2. అది ప్రభువు పలుకును ఆలింపదయ్యెను. ఆయన క్రమశిక్షణకు లొంగదయ్యెను. ఆయనను నమ్మదయ్యెను, ఆయనచెంతకు రాదయ్యెను.
3. దాని అధికారులు గర్జించు సింహములవంటివారు న్యాయాధిపతులు ఆకలిగొనిన తోడేళ్ళ వంటివారు. వారు తమ ఎరలో ఒక్క ఎముకనైనను, ఉదయమువరకు మిగిలియుండనీయరు.
4. దాని ప్రవక్తలు బాధ్యత తెలియనివారు, నిజాయితీ లేనివారు. యాజకులు పవిత్ర వస్తువులను అపవిత్రము చేయుదురు. ధర్మశాస్త్రమును తమకు అనుకూలముగా మార్చుకొందురు.
5. అయినను ప్రభువింకను ఆ నగరముననే ఉన్నాడు. అతడు అన్యాయమునకుగాక మన న్యాయమునకు పూనుకొనును. ప్రతి ఉదయము తన ప్రజలకు తప్పక న్యాయము తీర్చును. ఆయనకు మరుగైయున్నదేదియులేదు. అయినను అచటి అవినీతిపరులు , సిగ్గుమాలినవారై చెడుచేయుచునేయున్నారు.
6. ప్రభువిట్లనుచున్నాడు: నేను జాతులను సంపూర్ణముగా నాశనము చేసితిని. వారి నగరములను నేలమట్టము చేసితిని. వారి ప్రాకారములను బురుజులను కూలద్రోసితిని. వారి పట్టణములు నిర్మానుష్యమయ్యెను. వారి వీధులు నిర్జనములయ్యెను.
7. అది చూచి వారు నా పట్ల భయభక్తులు చూపుదురనియు, నా క్రమశిక్షణను అంగీకరింతురనియు, నేను నేర్పిన గుణపాఠమును గుర్తుంచుకొందురనియు నేనాశించితిని. కాని వారు అనతికాలముననే తాము పూర్వముచేసిన దుష్కార్యములు తిరిగి ప్రారంభించిరి.
8. కనుక మీరు కొంచెము తాళుడు. నేను జాతులమీద నేరముమోపు కాలమువరకు వేచియుండుడు. నేను జాతులను, రాజ్యములను ప్రోగుచేసి వారు నా కోపప్రభావమును గుర్తించునట్లు చేయుదును. నా క్రోధాగ్నివలన భూమియంతయు భస్మమగును.
9. "అపుడు నేను అన్యజాతి ప్రజలకు హృదయములు మార్చెదను. అది వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్ధన చేయుదురు, నన్నే సేవింతురు.
10. కూషుదేశ నదులకు ఆవలనుండియు , చెల్లాచెదరైయున్న నా ప్రజలు నాకు కానుకలు కొనివత్తురు.
11. యిస్రాయేలీయులారా! అపుడు మీరు మేము పూర్వము ప్రభువునకెదురు తిరిగితిమికదా'! అని సిగ్గుపడనక్కరలేదు. అపుడు నేను మీనుండి , గర్వాత్ములనెల్ల తొలగింతును. నా పవిత్ర నగరముపైని మీరు మరల పొగరుతో విఱ్ఱవీగరు.
12. దుఃఖితులగు దీనులను ప్రభువు నామమును ఆశ్రయించువారిగను మీ నడుమ శేషముగా ఉండనిత్తును,
13. యిస్రాయేలీయులలో శేషించినవారు ఎవరికిని కీడుచేయరు, కల్లలాడరు, మోసము చేయరు. వారెవరి భయమును లేక సురక్షితముగా మనుచు వృద్ధిలోనికి వత్తురు.
14. సియోను కుమారీ! ఆనందనాదము చేయుము. యిస్రాయేలూ! హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారీ నిండుహృదయముతో సంతసించి గంతులు వేయుము.
15. ప్రభువు నీ దండనము తొలగించెను. నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. యిస్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. కావున నీవు ఇక ఏ కీడునకును భయపడనక్కరలేదు.
16. ప్రజలు యెరూషలేముతో ' సియోనూ! నీవు భయపడకుము. భీతివలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు'" అని పలుకు రోజులు వచ్చుచున్నవి.
17. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును. ప్రేమతో నీకు నూత్నజీవమును ఒసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును.
18. ఉత్సవదినమునవలె ఆనందించును. ప్రభువిట్లనుచున్నాడు: నేను నీ వినాశమును తొలగించితిని. నీ అవమానమును తుదముట్టించితిని.
19. నేను త్వరలోనే నీ పీడకులను శిక్షింతును. కుంటివారిని రక్షింతును. ప్రవాసులను ఇంటికి కొనివత్తును. వారికి కలిగిన అవమానమును కీర్తిగా మారును. అపుడు లోకమంతయు వారిని స్తుతించును.
20. నేను చెదరిపోయిన మీ ప్రజలను మరల ఇంటికి కొనివచ్చుకాలము వచ్చుచున్నది. అపుడు మీరు ప్రపంచమందంతట కీర్తిని బడయుదురు. మరల వృద్దిలోనికి వత్తురు. ఇది ప్రభువు వాక్కు