ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పరమగీతము చాప్టర్ 3

 1. నేను రాత్రివేళ పడకమీద పరుండి నా హృదయేశ్వరుని కొరకు గాలించితిని. కాని ఎంత వెదకినను అతడు దొరకడయ్యెను.

2. నేను లేచి నగరములోనికి వెళ్ళితిని. పట్టణ వీధులలోను, సందులలోను తిరుగాడితిని. నా హృదయేశ్వరుని కొరకు వెదికితిని. కాని ఎంత వెదకినను అతడు కన్పింపడయ్యెను.

3. నగరమునకు కావలికాయువారు నన్ను చూచిరి. “మీరు నా హృదయేశ్వరుని గాంచితిరా?" అని నేను వారిని ప్రశ్నించితిని.

4. వారు నన్ను దాటి వెడలిపోవగనే హృదయేశ్వరుడు నా కంటబడెను. నేనతనిని గట్టిగా పట్టుకొని వదలి పెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడుకొనివచ్చితిని. నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసికొని వచ్చితిని.

5. యెరూషలేము కుమార్తెలారా! జింకల పేరు మీదుగాను, లేళ్ళ పేరుమీదుగాను, నేను మీకానవెట్టి చెప్పుచున్నాను. నా ప్రియురాలు స్వయముగా మేలుకొనువరకు మీరామెకు నిద్రాభంగము కల్పింపవలదు.

6. ఎడారినుండి ధూమస్థంభమువలె కదలి వచ్చుచున్న ఇది యేమి? దానియందు సాంబ్రాణి, గోపరసముల సువాసనలు ఉన్నవి. అది వర్తకులమ్ము పరిమళ ద్రవ్యముల సువాసనలను గుబాళించుచున్నది.

7. అదిగో! సొలోమోనును పల్లకీలో ఎక్కించుకొని తీసికొని వచ్చుచున్నారు. ఈ యిస్రాయేలీయులలో శ్రేష్ఠులైన సైనికులు అరువదిమంది అతనికి అంగరక్షకులుగా నుండి బరాబరులు చేయుచున్నారు.

8. వారందరును ఖడ్గవిద్యలో నిపుణులు.  యుద్ధమున కాకలుతీరిన యోధులు. వారిలో ప్రతివాడును ఖడ్గము ధరించి, రాత్రియందెట్టి అపాయము వాటిల్లకుండునట్లు జాగ్రత్త పడును.

9. అది సొలోమోను స్వయముగా , తయారు చేయించుకొనిన పల్లకి. దానిని లెబానోను కొయ్యతో చేసిరి.

10. దాని గడెలను వెండితో చేసిరి. బంగారు దారముతో కుట్టిన వలువను దానిమీద కప్పిరి. యెరూషలేము మహిళలు అనురాగముతో నేసిన ఊదారంగు బట్టతో దానిలోని ఆసనమును కప్పిరి.

11. సియోను కుమార్తెలారా! సొలోమోను రాజును చూచుటకు రండు! ఆ రాజునకు ఆనందదాయకమైన అతని వివాహ దినమున రాజమాత అతడి శిరస్సును అలంకరించిన కిరీటమును అతడిప్పుడు ధరించియున్నాడు. ఆరోజు బహు సంతోషకరమైన రోజు.