ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దానియేలు చాప్టర్ 3

1. నెబుకద్నెసరురాజు అరువదిమూరల ఎత్తు, ఆరుమూరల వెడల్పుగల బంగారు విగ్రహమును చేయించెను. బబులోనియా దేశమునందలి దూరా మైదానమున దానిని నెలకొల్పెను.

2. అతడు ఉద్యోగులనందరిని అనగా పాలకులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, కోశాధికారులను, న్యాయమూర్తులను, న్యాయాధికారులను, దేశము నందలి ఇతర అధికారులను పిలిపించెను. వారు నెబుకద్నెసరు రాజు నెలకొల్పిన ప్రతిమ ప్రతిష్ఠకు హాజరుకావలెను.

3. ఆ అధికారులు ఎల్లరును ప్రోగయి ప్రతిషో త్సవములలో పాల్గొనుటకు విగ్రహము ముందు నిలుచుండిరి.

4. అంతట వార్తావహుడు పెద్దస్వరముతో ఇట్లు ప్రకటించెను: “ఎల్ల దేశములకును, జాతులకును, భాషలకును చెందిన ప్రజలారా!

5. బూరలు, పిల్లనగ్రోవులు, తంత్రీవాద్యములు, వీణలు, సుతులు మొదలగు వాద్యముల సంగీతము వినిపింపగనే మీరు నేలమీదికి శిరమువంచి నెబుకద్నెసరు రాజు నెలకొల్పిన సువర్ణప్రతిమను ఆరాధింపవలెను.

6. ఎవడైనను శిరమువంచి ప్రతిమనారాధింపడేని అతనిని గనగనమండు కొలిమిబట్టీలో పడవేయుదుము.”

7. కనుక ఎల్లదేశములకును, జాతులకును, భాషలకును చెందిన ప్రజలు, వాద్యముల సంగీతము వినిపింపగనే శిరము వంచి నెబుకద్నెసరు నెలకొల్పిన ప్రతిమనారాధించిరి.

8. అపుడు కల్దీయులు కొందరు యూదులమీద నేరముతెచ్చిరి.

9. వారు నెబుకద్నెసరు రాజుతో “ప్రభువులవారు కలకాలము జీవింతురుగాక!

10. బూరలు, పిల్లనగ్రోవులు, తంత్రీవాద్యములు, వీణలు సకల విధములగు వాద్యధ్వనులు విన్పించిన వెంటనే ఎల్లరును శిరస్సువంచి సువర్ణప్రతిమను ఆరాధింప వలెనని యేలిక కట్టడచేసితిరి.

11. శిరస్సువంచి దానిని ఆరాధింపని వానిని గనగనమండు అగ్నిగుండమున పడద్రోయుదునని శాసించితిరి.

12. మీరు కొందరు యూదులను బబులోనియా దేశమునకు అధికారులను చేసితిరికదా! షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనువారు మీ ఆజ్ఞలను ధిక్కరించిరి. వారు మీ దైవములను కొలుచుటలేదు. మీరు నెల కొల్పిన సువర్ణమూర్తిని ఆరాధించుటలేదు” అని చెప్పిరి.

13. ఆ మాటలకు రాజు ఆగ్రహము తెచ్చుకొని ఆ ముగ్గురిని తన సమక్షమునకు పిలిపించెను.

14. వారితో "షడ్రకు, మేషకు, అబేద్నెగోలారా వినుడు! మీరు నా దైవములను కొలువకుండుటయు, నేను నెలకొల్పిన బంగారుమూర్తిని ఆరాధింపకుండుటయు నిజమేనా?

15. ఇపుడు మీరు బూరలు, పిల్లన గ్రేవులు, తంత్రీవాద్యములు, వీణలు, సుతులు మొదలైన వాద్యముల సంగీతము వినగనే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే గనగనమండు కొలిమిబట్టీలో పడ “యింతును. నా బారినుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడునులేడు” అని పలికెను.

16. అందులకు షడ్రకు, మేషకు, అబేద్నెగో “రాజా! ఈ విషయముగూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు.

17. మేము సేవించు దేవుడు మమ్ము గనగనమండు అగ్నిగుండమునుండియు, మీ బారి నుండియు రక్షింపగల సమర్ధుడు మరియు ఆయన నీవశమున పడకుండా ఆయన మమ్ము రక్షించును.

18. కాని అతడు మమ్ము కాపాడకున్నను, మేము మీ దైవములనుగాని, మీరు నెలకొల్పిన సువర్ణ మూర్తినిగాని ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక!” అనిరి.

19. ఆ పలుకులకు నెబుకద్నెసరు మండిపడెను. షడ్రకు, మేషకు, అబేద్నెగోలవైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను. అతడు కొలిమిబట్టీని  ఏడురెట్లు అదనముగా వేడిచేయుడని సేవకులను ఆజ్ఞాపించెను.

20. ఆ ముగ్గురు మనుష్యులను బంధించి గనగనమండు కొలిమిబట్టీలో పడవేయుడని తన సైన్యమున బలాడ్యులైన వారితో చెప్పెను.

21. కనుక ఆ సైనికులు వారిని బంధించి గనగనమండు అగ్నిగుండమున పడవేసిరి. వారు చొక్కాయలు, అంగీలు, టోపీలు మొదలైన ఉడుపులతోనే అగ్నిలో పడిరి.

22. అగ్నిగుండము మిక్కిలిగా వేడెక్కవల యును అనెడి రాజాజ్ఞ తీవ్రమైనది. కనుక ఆ మనుష్యులను గుండముదగ్గరకు గొనిపోయిన వారుకూడా దాని జ్వాలలకు మాడిచచ్చిరి.

23. షడ్రకు, మేషకు, అబేద్నెగో బంధితులుగానే భగభగమండు మంటల నడుమపడిరి.

24. వారు దేవునికి స్తుతులు, వందనములు అర్పించుచు మంటలనడుమ నడచిరి.

25. అజరయా నిప్పులు నడుమ నిలుచుండి యిట్లు ప్రార్ధించెను:

26. “మా పితరుల దేవుడవైన ప్రభూ! నీకు కీర్తియు స్తుతియు కలుగునుగాక! నీ నామమునకు సదా గౌరవము కలుగునుగాక!

27. నీవు మాకు తగినట్లుగానే మాతో వ్యవహరించితివి. నీవు మాకు చేసిన కార్యములెల్ల యుక్తమైనవే, మాకు న్యాయముగానే తీర్పు తీర్చితివి.

28. నీవు మమ్మును మా పితరుల పవిత్రనగరమైన యెరూషలేమును నాశనము చేసినప్పుడు, న్యాయముగానే మెలిగితివి. మా పాపములకు మేము శిక్షను పొందవలసియేయున్నది.

29. మేము నీకు లొంగమైతిమి, నిన్ను విడనాడితిమి, ఎల్ల పాపములను చేసితిమి.

30. నీ ఆజ్ఞలను పాటింపమైతిమి. నీ చట్టములను గైకొనినయెడల మేము వృద్ధిలోనికి వచ్చియుండెడివారలము.

31. నేడు నీవు మాకు చేసిన తీర్పు మా పైకి రప్పించిన శిక్షయు యుక్తమైనవే.

32. నీ ఆజ్ఞలను పాటింపనివారును, నిన్ను ధిక్కరించు నీచులైన శత్రువుల చేతికి నీవు మమ్మప్పగించితివి. ప్రపంచమంతటిలోను దుష్టుడైన రాజునకు మమ్ము అప్పగించితివి.

33. నిన్ను పూజించు మేము అవమానము పొందితిమి. మేము సిగ్గుతో నోరువిప్పజాలమైతిమి.

34. నీవు మాతో చేసికొనిన నిబంధనమును రద్దు చేయకుము. మమ్ము సదా విడనాడకుము, అప్పుడు నీ గౌరవము నిలుచును.

35. మాకు నీ కరుణను నిరాకరింపకుము. నీవు ప్రేమించిన అబ్రహామునకు, నీ సేవకుడు ఈసాకునకు, పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము.

36. నీవు వారి సంతానమును ఆకసము నందలి చుక్కలవలెను, కడలియొడ్డునందలి యిసుక రేణువులవలెను వృద్ధిచేయుదునని బాసచేసితివి.

37. కాని ప్రభూ! నేడు మేమితర జాతులకంటెను స్వల్ప సంఖ్యాకులమైయున్నాము. మా పాపాలవలన మేమువసించు తావులందెల్ల మాకు అవమానము కల్గుచున్నది.

38. మాకిపుడు రాజుగాని, ప్రవక్తలుగాని, నాయకులుగాని లేరు. నీకు బలులు, దహనబలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు. నైవేద్యములర్పించి, నీ మన్నన బడయుటకు తగిన తావునులేదు.

39. మేము పశ్చాత్తాపహృదయముతో వినయాన్వితమైన మనస్సుతో నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్ళను, ఎడ్లను, బలిసిన వేలకొలది గొఱ్ఱె పిల్లలను దహనబలిగా గొనివచ్చిన వారినివలె నీవు మమ్ము అంగీకరింపుము.

40. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణమనస్సుతో నిన్ను అనుసరింతుముగాక! నిన్ను నమ్మినవారు ఏనాటికిని భంగపాటునొందరు.

41. మేము పూర్ణహృదయముతో నిన్ను అనుసరించి, నిన్ను ఆరాధించి, నీకు ప్రార్థన చేయుదుము.

42. నీవు మమ్ము దయతో, ఆదరముతో చూడుము. మేము భంగపాటును , పొందకుండునట్లు చేయుము.

43. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము.

44. నీ దాసులకు కీడుతలపెట్టువారికి సిగ్గు, అవమానము కలుగుగాక! నీవు వారి బలమును, దర్పమును వమ్ముచేయుము. వారి శక్తిని రూపుమాపుము.

45. నీవు మాత్రమే దేవుడవు. ప్రభుడవనియు, వైభవముతో లోకమంతటిని ఏలుదువనియు వారు గుర్తింతురుగాక!”

46. రాజసేవకులు చమురును, కీలును, నార పీచును, కట్టెలను అగ్నిగుండములో పడవేసి దానిని అధికముగ మండించిరి.

47. దానిమంటలు డెబ్బది ఐదు అడుగుల ఎత్తువరకు లేచెను.

48. అవి చుట్టును వ్యాపించి చేరువలోనున్న బబులోనీయులను మాడ్చి చంపెను.

49. కాని ప్రభువుదూత అగ్ని గుండము లోనికి దిగివచ్చి, అజరయ్య మరియు అతని సహచరు లతో ఉండి, అగ్నిజ్వాలలను గుండమునుండి బయటకు త్రోలెను.

50. అగ్నిగుండమున తేమతో కూడిన చల్లని గాలి విసరుచున్నదో అన్నట్లు చేసెను. కనుక నిప్పు మంటలా నరులకు సోకలేదు, వారికి బాధ కలిగింపను లేదు.

51. ఆ అగ్నిగుండమున ముగ్గురు యువకులు ఏక స్వరముతో ప్రభువునిట్లు స్తుతించి కీర్తించిరి:

52. “మా పితరుల దేవుడవైన ప్రభూ! "మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము.

53. నీ దివ్యనామమునకు సదా గౌరవమును కలుగునుగాక!

54. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక! దేవళములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తికలుగునుగాక!

55. నీవు దేవదూతలనెడు సింహాసనముపై ఆసీనుడవై క్రింది పాతాళలోకమువైపు పారజూతువు. నీకు సదా కీర్తి గౌరవములు కలుగునుగాక!

56. రాజసింహాసనముపై కూర్చుండియున్న నీకు నుతికలుగునుగాక! జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక!

57. ఆకాశ గోళమున నీకు నుతికలుగునుగాక! జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక!

58. సకల సృష్టి! ప్రభువును స్తుతింపుము. ఆయనను స్తుతించి సదా కీర్తింపుము.

59. ఆకాశమా! ప్రభువును స్తుతింపుము. ఆయనను స్తుతించి సదా కీర్తింపుము.

60. ప్రభువు దూతలారా! ఆయనను స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

61. ఆకాశము మీది జనులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

62. స్వర్గశక్తులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

63. సూర్యచంద్రులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

64. ఆకాశమందలి నక్షత్రములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

65. వర్ష హిమములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

66. సకల వాయువులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

67. అగ్ని ఉష్ణములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

68. శీతోష్ణములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

69. మంచు, పొగమంచులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

70. రేయింబవళ్ళారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

71. చీకటి వెలుగులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

72. నూగు మంచు, శీతలములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

73. పేరిన మంచు, హిమములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

74. మబ్బులు, మెరపులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

75. భూమీ! ప్రభువును స్తుతింపుము. ఆయనను స్తుతించి సదా కీర్తింపుము.

76. కొండలారా! తిప్పలారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

77. భూమిపై పెరుగు వృక్షములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

78. సరస్సులు, నదులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

79. నీటి బుగ్గలారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

80. జలచరములు తిమింగిలములారా! ప్రభువును స్తుతింపుడు.  ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

81. సకల పక్షులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

82. సాధుజంతువులు వన్యమృగములారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

83. భూమిమీది సకలనరులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

84. యిస్రాయేలు ప్రజలారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

85. ప్రభువు యాజకులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

86. ప్రభువు సేవకులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

87. భక్తిమంతులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

88. వినయాత్ములు, పవిత్రులునైన వారలారా! ప్రభువును స్తుతింపుడు. ఆయనను స్తుతించి సదా కీర్తింపుడు.

89. హనన్యా, మిషాయేలు అజరయలారా! ప్రభువును స్తుతింపుడు. ఆయన మనలను మృతలోకము నుండియు, మృత్యువు శక్తినుండియు కాపాడెను. గనగనమండు అగ్నిగుండమునుండియు, అగ్నిజ్వాలలనుండియు మనలను రక్షించెను.

90. ప్రభువు మంచివాడు. కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కరుణ కలకాలముండును. ప్రభువును పూజించుభక్తులారా! ఆయనను నుతింపుడు. దేవాధిదేవుని వినుతించి ఆయనకు వందనములర్పింపుడు. ఆయన కరుణ కలకాలమునుండును”.

91. అంతట నెబుకద్నెసరు రాజు ఆశ్చర్యముతో లేచినిలుచుండి, “మనము ముగ్గురు నరులను బంధించి అగ్నిగుండమున బడవేయలేదా?” అని తన ఉద్యోగులనడిగెను. వారు “ఔను ప్రభూ!” అని జవాబు చెప్పిరి.

92. అతడు “అట్లయినచో నాకు నలుగురు మనుష్యులు అగ్నిచుట్టు తిరుగుచున్నట్లు కన్పించు చున్నారేమి? వారికి బంధనములు లేవు. ఎట్టిబాధలు కలిగినట్లు లేదు. నాలుగవవాడు దైవకుమారునివలె ఉన్నాడు” అనెను.

93. నెబుకద్నెసరు మండుచున్న కొలిమిబట్టీ ద్వారమువద్దకు వచ్చి "షడ్రకు, మేషకు, అబేద్నెగోలారా! మీరు బయటికిరండు” అనెను. వారు వెంటనే వెలుపలికి వచ్చిరి.

94. పాలకులు, దేశాధి పతులు, సామంతులు, ఇతర అధికారులు ఆ ముగ్గురి చుట్టు గుమికూడి వారిని పరిశీలించిచూచిరి. నిప్పు వారికెట్టి హానియు చేయలేదు. వారి తలవెంట్రుకలు కమలలేదు. బట్టలు కాలలేదు. వారి దేహములపై పొగవాసన కూడ లేదు.

95. అప్పుడు రాజు ఇట్లనెను: “షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవునికి స్తుతికలుగును గాక! ఆయన తన దేవదూతనుపంపి తనను విశ్వ సించి, సేవించువారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పుతెచ్చుకొనికూడ తమ దేవునికి తప్ప అన్యదైవములకు మ్రొక్కరైరి.

96. కనుక నేను ఈ ఆజ్ఞను జారీచేయుచున్నాను. ఏ దేశమున కైనను, ఏ జాతికైనను, ఏ భాషకైనను చెందిన ప్రజలెల్ల రును ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుని తూలనాడుదురేని నేను వారిని కండతుండెములుగా నరికింతును. వారి ఇండ్లను దిబ్బలు కావింతును. ఏ దేవుడు కూడ ఇట్లు రక్షింపజాలడుకదా!”

97. అటుపిమ్మట రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు బబులోనియాదేశమున పెద్ద పదవులు ఒసగెను.