ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హబక్కూకు చాప్టర్ 2

1. ప్రభువు నాతో ఏమి చెప్పునో వినుటకును, అతడు నా ఫిర్యాదులకేమి బదులుచెప్పునో తెలిసికొనుటకును నేను కావలి బురుజునెక్కిన వేచియుందుననుకొనగా

2. ప్రభువు నాకు ఈ క్రింది జవాబు నొసగెను: “నేను నీకు తెలియజేయు దర్శన వివరమును నీవు స్పష్టముగ వ్రాత పరికరములపై వ్రాయుము. సులువుగా చదువుటకు వీలుగా ఉండునట్లు వ్రాయుము.

3. నేను నీకు వెల్లడిచేయు సంగతి నిర్ణీతకాలమున జరుగును. కాలపరిసమాప్తిన అది నిక్కముగా జరుగును, ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా నెరవేరునట్లు కనిపించినను నీవు దానికొరకు వేచియుండుము. అది తప్పక జరుగును, ఇక ఆలస్యము జరుగదు.

4. ఆ సంగతి యిది. సత్యవంతులుగాక, స్వాతిశయులైన దుష్టులు కొనసాగరు. అయితే నీతిమంతులు భక్తి విశ్వాసములవలన జీవింతురు. పీడకులకు ఐదు శాపములు

5. సంపదలు మోసముతో కూడినవి, ఆశబోతులు, గర్వాత్ములు మనశ్శాంతి లేనివారు మృత్యువువలె వారికిని సంతృప్తి ఉండదు అట్టివారు పాతాళమంత విశాలముగ ఆశపెట్టుకునియుండి సకలజనములను వశపరచుకొందురు, సకలజాతులను చెరపట్టుకుందురు.

6. తమవి కాని సంపదలను కూడబెట్టుకొను వారికనర్థము తప్పదు. తాకట్టుసొమ్మును విపరీతముగా ప్రోగుజేసికొను వారికనర్ధము తప్పదు. వారు ఎంతకాలము నిలుచుదురు? అని చెప్పుకొనుచూ మీరు ఉపమానరీతిగా వీరినిగురించి అపహాస్యపు సామెతలు వాడుదురుకదా!

7. మీరూహింపక మునుపే మీ వడ్డీదారులు మీపై పడుదురు. మిమ్ము హింసించువారు మెలకువతో వచ్చి మిమ్ము కొల్లగొట్టుదురు.

8. మీరు చాలజాతులను దోచుకొంటిరి. మీరు హత్యలుచేసిన కారణమున, లోకమునందును, దాని నగరములందును వసించుజనులను హింసించిన కారణమున, ఇపుడు మిగిలియున్న జాతులు మిమ్ము దోచుకొనును.

9. దౌర్జన్యము చేసి ఇతరులనుండి దోచుకొని వచ్చిన సొత్తుతో తమ కుటుంబములను సంపన్నము చేసికొనినవారికిని, ఆపదలనుండి తమ కుటుంబమును కాపాడుకోగోరిన వారికిని అనర్గము తప్పదు.

10. మీ పన్నాగములు మీ కుటుంబమునకు అవమానము తెచ్చెను. మీరు చాల జాతులను నాశనము చేయుటవలన మీ వినాశనము మీరే కొనితెచ్చుకొంటిరి.

11. మీ గోడలలోని రాళ్ళే మీకు వ్యతిరేకముగా మొరపెట్టును. ఆ మొర మీ యింటి వాసములనుండి ప్రతిధ్వనినిచ్చును.

12. నేరములతో నగరమును స్థాపించినవారికి హత్యలతో పట్టణమును నిర్మించినవారికి అనర్థము తప్పదు.

13. మీరు జయించిన జాతులు కష్టపడి కట్టినదంతయు అగ్గిచే బుగ్గిపాలు కావలెననియు, వారు అలసిసొలసి చేసిన శ్రమ , నిరకము కావలెననియు, సైన్యములకధిపతియైన ప్రభువు నిర్ణయించెను.

14. కాని సముద్రము నీటితో నిండియుండునట్లే, భూమి ప్రభువు కీర్తిని గూర్చిన జ్ఞానముతో నిండియుండును.

15. ప్రభువు ఘోర ఉగ్రతాపాత్రమును తమ పొరుగువానికి త్రాగనిచ్చి, వారి నగ్నత్వమును కాంచుటకు వారిని తప్ప త్రాగించి, మత్తులుగా చేయువారికి అనర్ధము తప్పదు.

16. మీ తరపున మీరు కీర్తికి బదులుగా, అపకీర్తి తెచ్చుకొందురు. మీరు కూడ త్రాగి మీ నగ్నత్వమును ప్రదర్శింతురు. మీ శిక్షయను మద్యమును ప్రభువు మీకు అందించును. మీ కీర్తి అపకీర్తిగా మారిపోవును.

17.మీరు లెబానోనునకు చేసిన హింస మీ మీదకే వచ్చును మీరు దాని పశువులను బెదిరించితిరి , కాన ఇప్పుడు ఆ పశువులు మీకు భీతి పుట్టించును. మీరు హత్యలు చేసి, దేశములందు, దాని నగరములందు, వసించు ప్రజలను హింసించిరి కాన మీకు ఇది సంభవించును.

18. వడ్రంగి విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? కళాకారుడు మూగబొమ్మను చేసి, దానియందు నమ్మిక ఉంచుటవలన ప్రయోజనమేమి? అబద్దములను బోధించు పోతవిగ్రహములందు విశ్వాసము ఉంచుటవలన ప్రయోజనమేమి?

19. కొయ్యముక్కతో నీవు మేల్కొనుమని మూగ రాతిబండతో నీవు లెమ్మని పలుకు వారికి అనర్థము తప్పదు. ఆ బొమ్మ మీకు సందేశము చెప్పగలదా? వెండిబంగారములతో కప్పినను విగ్రహమునకు ప్రాణము లేదు కదా! ప్రతిమవలన ప్రయోజనమేమి?

20. కాని ప్రభువు తన పవిత్రమందిరమున ఉన్నాడు. లోకమంతయు ఆయనెదుట మౌనముగా ఉండునుగాక!