1. ఎవడైనను ప్రభువునకు ధాన్యబలిని అర్పింపగోరిన గోధుమపిండిని గైకొని దానిమీద ఓలివునూనెను పోసి, సాంబ్రాణిని ఉంచవలయును.
2. అతడు ఆ పిండిని అహరోను కుమారులైన యాజకులవద్దకు కొనిరావలయును. యాజకుడు దానినుండి పిడికెడు పిండిని, చేరెడు ఓలివునూనెను, మొత్తము సాంబ్రాణిని తీసికొని బలిపీఠముమీద దహించును. దహింపబడిన ఈ కొద్దిభాగము అర్పణగా తెచ్చిన పూర్తి భాగమునకు జ్ఞాపకార్థమగును. అది ప్రభువునకు అర్పింపబడిన బలి అగును. ఈ దహనబలి సువాసనవలన ప్రభువు సంతుష్టి చెందును.
3. ధాన్యబలిలో మిగిలిన పిండి అహరోనునకు, అతని కుమారులకు చెందును. ప్రభువునకు అర్పింపబడిన దహనబలిలోనిది కనుక ఆ మిగిలినపిండి పరమపవిత్రమైన నైవేద్యమగును.
4. మీరు పొయ్యిమీద కాల్చి రొట్టెలను బలిగా సమర్పించునపుడు వానిలో పులియజేయు పదార్థమును చేర్పరాదు. నూనె కలిపిన పిండితో తయారైన లావుపాటి రొట్టెలుకాని, నూనె చిలుకరించిన పలుచని రొట్టెలుగాని తయారుచేయవచ్చును.
5. మీరు పెనముమీద కాల్చిన రొట్టెలను బలిగా అర్పించునపుడు ఓలివునూనె కలిపిన మొత్తము గోధుమపిండితో వానిని చేయవలయును. కాని పులియజేయు పదార్థమును చేర్పరాదు.
6. ఆ రొట్టెను ముక్కలుగా చేసి వాటి మీద నూనెపోసి బలిగా అర్పింపుడు.
7. మీరు కుండలో కాల్చిన రొట్టెలను అర్పించునపుడు ఓలివునూనె కలిపిన గోధుమపిండితో వానిని చేయవలయును.
8. ఈ రీతిగ తయారైన బలి వస్తువును కొనివచ్చి యాజకునకు ఇండు. అతడు దానిని బలిపీఠము చెంతకు తీసికొనివచ్చును.
9. యాజకుడు ఆ బలి ప్రభువునకు అర్పితమైనదని సూచించుచు దానిలో కొంతభాగమును తీసికొని బలిపీఠముమీద దహించును. ఆ దహనబలి సువాసనవలన ప్రభువు సంతృప్తి చెందును.
10. ఆ ధాన్యబలిలో మిగిలిన భాగము అహరోనునకును, అతని కుమారులకును చెందును. ప్రభువునకు అర్పింపబడిన దహనబలిలోని భాగము కనుక అది పరమపవిత్రమైన నైవేద్యమగును.
11. మీరు ప్రభువునకు అర్పించు ధాన్యబలులలో పులియజేయు పదార్థమును చేర్పరాదు. పులియజేయు పదార్థమునుగాని, తేనెనుగాని ప్రభువునకు దహన బలిగా అర్పింపరాదు.
12. అయినను ఆ ధాన్యములను ప్రభువునకు ప్రథమఫలములుగా అర్పింపవచ్చును. కాని ప్రభువునకు సంతుష్టి కలిగించు సువాసనగల బలిగా వానిని బలిపీఠముమీద దహింప రాదు.
13. మీరు సమర్పించు ధాన్యబలులు అన్నిటిలోను ఉప్పును చేర్పవలయును. మీ దేవుని నిబంధనములో విధింపబడిన ఉప్పు ప్రతి ధాన్యబలిలో ఉండవలయును. కనుక ప్రతి బలిలో తప్పనిసరిగా ఉప్పును చేర్పుడు.
14. మీరు ప్రభువునకు ధాన్యములో ప్రథమ ఫలములు అర్పించునపుడు పచ్చని వెన్నులనుండి గట్టి ధాన్యమును వేయించి, విసిరి అర్పింపుడు.
15. ఓలివు నూనెను, సాంబ్రాణిని వానిలో చేర్పుడు.
16. ఆ బలి ప్రభువునకు అర్పితమైనదని సూచించుచు యాజకుడు ధాన్యములో కొంత భాగమును, నూనెలో కొంత భాగమును, సాంబ్రాణిని తీసికొని బలిపీఠము మీద దహించును. అది ప్రభువునకు దహనబలిఅగును.