ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దానియేలు చాప్టర్ 2

1. నెబుకద్నెసరు పరిపాలనాకాలము రెండవయేట అతనికొక కల వచ్చెను. అది ఆ రాజును కలవర పెట్టుటచే అతడు నిద్రింపజాలడయ్యెను.

2. కనుక అతడు ఆ స్వప్నమును వివరించుటకుగాను తన మాంత్రికులను, శాకునికులను, గారడీవిద్యగలవారిని, కల్దీయులను పిలువనంపెను. వారెల్లరునువచ్చి అతనియెదుట నిలుచుండిరి.

3. అతడు వారితో “నేనొక కలగంటిని. అది నన్ను కలత పెట్టుచున్నది. నేను దాని భావమేమిటో తెలిసికోగోరెదను” అనెను.

4. కల్దీయులు అరమాయికు భాషలో “ప్రభువుల వారు కలకాలము జీవింతురుగాక! మీరు కనిన కలయేమో తెలియజేసినయెడల మేము దాని భావమును వివరింతుము” అనిరి.

5. రాజు వారితో “నేను దానిని మరిచిపోతిని గాని, మీరు నాకు నా కలను దాని భావమునుకూడ తెలియజేయని యెడల నేను మిమ్ము ముక్కలు ముక్కలుగా నరికించి, మీ ఇండ్లను నేలమట్టము చేయింతును.

6. కాని మీరు నా స్వప్నమును దాని అర్థమును తెలియచేయుదురేని నేను మిమ్ము బహుమతులతో సత్కరించి సన్మానింతును. కనుక ఇప్పుడు మీరు నా కలను దాని భావమును తెలియజేయుడు” అని పలికెను.

7. వారు రాజుతో మరల “ప్రభువులవారు తమ కల ఏమో సెలవిచ్చిన మేము దాని భావమును వివరింపగలము” అనిరి.

8. రాజు వారితో “నేను మరిచియుండుట మీరుచూచి, కాలహరణము చేయ జూచు చున్నారు.

9. నా కలను ఎరిగింపలేని మీకెల్లరికిని ఒకటే శిక్షపడును. మనము అబద్దములు చెప్పి కాలము గడపవచ్చునని అంతలో పరిస్థితులు మారునని మీలో మీరు కూడబలుకుకొంటిరి. మీరు నా కల ఏమిటో చెప్పుడు. అప్పుడు మీకు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్ధ్యము కలదని నేను తెలిసికొందును” అనెను.

10. కల్దీయులు రాజుతో “ప్రభువుల వారికి తామెరుగగోరిన విషయమును చెప్పగలవాడెవడును ఈ భూలోకమునలేడు. ఏ రాజును ఏనాడును, ఎంత గొప్పవాడైనను, ఎంత శక్తిమంతుడైనను, తన మాంత్రికులను, శాకునికులను, గారడీవిద్యగలవారిని, కల్దీయులను ఇట్టి ప్రశ్న అడిగియుండలేదు.

11. ప్రభువుల వారడుగునది కష్టమైన ప్రశ్న. దేవతలేగాని నరులెవ్వరును దానికి జవాబు చెప్పలేరు. ఆ దేవతలు నరలోకమున వసింపరు” అని జవాబు చెప్పిరి.

12. ఆ మాటలకు రాజు మహాఆగ్రహముచెంది బబులోనియా జ్ఞానులనెల్ల వధింపుడని ఆజ్ఞాపించెను.

13. కనుక జ్ఞానులనెల్ల వధింపవలెనని శాసనమును ప్రకటించిరి. అందుచే దానియేలును అతని మిత్ర బృందమునుగూడ చంపగోరి వారికొరకు వెతకిరి.

14. అంతట దానియేలు రాజసంరక్షకులకు నాయకుడైన అర్యోకునొద్దకు పోయెను. జ్ఞానులను చంపించువాడతడే. దానియేలు తెలివితోను, నేర్పు తోను మాటలాడుచు,

15. రాజు ఇట్టి కఠినశాసనము ఏల జారీచేసెను” అని అర్యోకు నడిగెను. అతడు జరిగిన సంగతిని చెప్పెను.

16. వెంటనే దానియేలు, రాజు సమక్షమునకు పోయి స్వప్నార్థమును తెలియజేయుటకు కాల వ్యవధిని దయచేయుడని అడిగి, అనుమతి పొందెను.

17. అటుపిమ్మట అతడు ఇంటికిపోయి తన మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజరయాలకు జరిగిన సంగతి పూసగ్రూచ్చినట్లు చెప్పెను.

18. అతడు వారితో “మనము పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేయుదము. అతడు మనపై దయచూపి ఈ రహస్యమును మనకు తెలియచేయవలెనని వేడుకొందము. అపుడు మనము బబులోనియాలోని జ్ఞానులతోపాటు చావనక్కరలేదు” అని చెప్పెను.

19. ఆ రాత్రియే దేవుడు ఒక దర్శనములో దానియేలునకు ఆ రహస్యమును తెలియజేసెను. కనుక అతడు పరలోకయధిపతియైన దేవుని ఇట్లు స్తుతించెను:

20. “దేవునకు సదాస్తుతి కలుగునుగాక! ఆయన జ్ఞానమును, బలమును కలవాడు.

21. కాలమును, ఋతువులును ఆయన ఆధీనమున ఉండును. ఆయన రాజులను గద్దెనెక్కించును, కూలద్రోయును. నరులకు జ్ఞానమును, వివేకమును దయచేయును.

22. ఆయన నిగూఢమైన రహస్యములను తెలియజేయును. అంధకారమున దాగియున్న సంగతులు ఆయనకు తెలియును. వెలుగు ఆయనను ఆవరించియుండును.

23. మా పితరులదేవా! నేను నిన్ను స్తుతించి కీర్తింతును. నీవు నాకు వివేకమును, బలమును దయచేసితివి. నీవు మా ప్రార్థన ఆలించి రాజు తెలిసికోగోరిన సంగతిని మాకు ఎరిగించితివి”.

24. అంతట దానియేలు అర్యోకువద్దకు వెళ్ళెను. జ్ఞానులనువధింప రాజతనిని ఆజ్ఞాపించియుండెను. దానియేలు అతడితో “మీరు జ్ఞానులను సంహరించనక్కరలేదు. నన్ను రాజు సముఖమునకు కొనిపొండు. నేనతనికి స్వప్నమును, దాని భావమును వివరింతును” అని చెప్పెను.

25. వెంటనే అర్యోకు దానియేలును రాజు సమక్షమునకు కొనిపోయి, “నేను ప్రభువులవారి స్వప్న భావమును వివరింపగల యూదాప్రవాసి నొకనిని కనుగొంటిని” అని చెప్పెను.

26. రాజు బెల్తేషాజరు అను మారుపేరుగల దానియేలుతో “నీవు నా కలను, దాని అర్థమును తెలియజేయగలవా?” అని అడిగెను.

27. దానియేలు రాజుతో దేవరవారడిగిన రహస్యమును జ్ఞానులు, శాకునికులు, మాంత్రికులు తెలియజేయలేరు.

28. కాని రహస్యములెరిగించు దేవుడు పరలోకమున ఉన్నాడు. ఆయన భవిష్యత్తులో ఏమి జరుగునో దేవరవారికి తెలియజేసెను. ఏలినవారు పడుకపై పరుండియున్నప్పుడు కలలోగాంచిన దర్శనమిది.

29. ఏలిక నిద్రించునపుడు భవిష్యత్తును గూర్చి కలగంటిరి. రహస్యములనెరిగించు దేవుడు జరుగబోవు కార్యములను తమకు తెలియజేసెను.

30. నేను ఇతరులకంటె తెలివైనవాడనని దేవుడు నాకు ఈ రహస్యమును తెలియజేయలేదు. ప్రభువులవారు తమ స్వప్నా ర్గమును ఎరుగుటకును, తమ ఆలోచనల భావమును గ్రహించుటకును ఆయన నాకు ఈ సంగతిని వెల్లడి చేసెను.

31. ఏలికదర్శనమున ఒక మహావిగ్రహము తమ ముందట నిలిచియుండుట గాంచితిరి. అది తళతళ మెరయుచు భీతిగొలుపుచుండెను.

32. దాని తలను మేలిమి బంగారముతో చేసిరి. వక్షమును చేతులను వెండితో చేసిరి. ఉదరమును తొడలను కంచుతో చేసిరి.

33. కాళ్ళను ఇనుముతో చేసిరి. పాదములను కొంతవరకు ఇనుముతోను, కొంత వరకు మట్టితోను చేసిరి.

34. తమరు ఆ బొమ్మవైపు చూచుచుండగా, చేతి సహాయము లేకుండగనే తీయ బడిన ఒకరాయి, ఇనుముతో మట్టితో చేసిన ఆ బొమ్మ కాళ్ళకు తగిలి ఆ కాళ్ళను ముక్కలు ముక్కలు చేసెను.

35. వెంటనే ఇనుము, మన్ను, కంచు, వెండి, బంగారములు పిండి అయ్యెను. అవి వేసవిలో కళ్ళమున కనిపించు పొట్టువలెనయ్యెను. గాలికి ఆ పిండి లేచి పోయెను. తరువాత ఆ ప్రతిమ జాడకూడ కనిపింపలేదు. కాని విగ్రహమును పడగొట్టిన ఆ రాయి కొండవలె పెరిగి భూలోకమంతటను వ్యాపించెను.

36. ఇది కల. ఇక ప్రభువుల వారికి ఈ కల భావమును వివరింతుము.

37. ఏలిక రాజులకు రాజు, పరలోకమందున్న దేవుడు తమరిని చక్రవర్తిని చేసెను. మీకు అధికారమును, శక్తిని, కీర్తిని దయచేసెను.

38. ఆయన మిమ్ము నరలోకమునకును, జంతు పక్షికోటులకును రాజును చేసెను. ఆ బొమ్మ బంగారుతల మీరే.

39. మీ తరువాత మీ సామ్రాజ్యముకంటె చిన్నది మరియొకటి వచ్చును. దాని తరువాత మూడవదిగా కంచుసామ్రాజ్యము వచ్చును. అది లోకమంతటిని ఏలును.

40. దాని తరువాత ఇనుమువలె బలమైన నాల్గవ సామ్రాజ్యము వచ్చును. అది అన్నిటిని పడగొట్టి ముక్కలుచేయును. ఇనుము అన్నిటిని బ్రద్దలు చేయు నట్లే అది పూర్వపు సామ్రాజ్యములన్నింటిని పడగొట్టి ముక్కలుచేయును.

41. మీరు విగ్రహము పాదములు కొంతవరకు ఇనుముతోను, కొంతవరకు మట్టితోను చేయబడి యుండుటను చూచితిరి. అట్లే ఆ నాలుగవ సామ్రాజ్యము రెండుగా చీలిపోవును. మట్టిని ఇనుముతో కలిపిరి. కనుక ఆ రాజ్యమునకు ఇనుమునకు ఉన్నంత బలముండును.

42. బొమ్మ పాదాల వ్రేళ్ళలో ఇనుము, మన్ను కలిసియున్నవి కదా! అట్లే సామ్రాజ్యమున కొంతభాగము బలముగ కొంతభాగము దుర్బలముగ ఉండును.

43. మీరు ఇనుము మట్టితోకలసియుండు టను చూచితిరి. అట్లే ఆ సామ్రాజ్యములోని ఉభయ భాగముల రాజులు వివాహసంబంధము ద్వారా ఐక్యము కాగోరుదురు. అయినను ఇనుము మట్టితో కలియనట్లే ఆ ఉభయ రాజ్యముల రాజులు కలియరు.

44. ఆ రాజుల కాలమున పరలోకాధిపతియైన దేవుడు అంతములేని సామ్రాజ్యమును నెలకొల్పును. అది అజేయమై ఆ రాజ్యములన్నిటిని కూలద్రోసి శాశ్వతముగా మనును.

45. మీరు కొండనుండి చేతిసహాయము లేకయే రాయి తగులుటను చూచితిరి. అది ఇనుము, కంచు, మన్ను, వెండి, బంగారము లతో చేసిన విగ్రహమును పడగొట్టుటను గాంచితిరి. మహాదేవుడు భవిష్యత్తులో ఏమిజరుగునో మీకు తెలియజేయుచున్నాడు. నేను మీకలను దాని భావమును యథాతథముగా తెలియజేసితిని”.

46. అపుడు నెబుకద్నెసరురాజు దానియేలు ముందట సాగిలపడెను. అతనికి బలిని అర్పించి సాంబ్రాణి పొగ వేయవలెనని ఆజ్ఞాపించెను.

47. అతడు దానియేలుతో “నిక్కముగా నీ దేవుడు దేవాధి దేవుడు, రాజాధిరాజు, రహస్యములను బయలు పరచువాడు. నీవు ఈ రహస్యమును వెల్లడి చేయు టయే అందుకు నిదర్శనము” అనెను.

48. అతడు దానియేలునకు ఉన్నతపదవినొసగి ప్రశస్తమైన బహుమతులనిచ్చెను. అతనిని బబులోనియా సంస్థానమునకు అదిపతిగా చేసెను. బబులోనియా జ్ఞానులెల్లరికిని పెద్దను చేసెను.

49. దానియేలు వేడుకోలుపై రాజు షడ్రకును, మేషకును, అబేద్నెగోను బబులోనియా దేశమునకు పర్యవేక్షకులుగా నియమించెను. దానియేలు మాత్రము రాజు ఆస్థానముననే ఉండెను.