1. నేను షారోనున పూచిన గులాబీని. కొండకోనలో వికసించిన లిల్లీని.
2. ముండ్లతుప్పలలో లిల్లీ పుష్పమెట్లో, యువతులలో నా ప్రియురాలట్లు.
3. తోటలోని చెట్లలో ఆపిలు వృక్షమెట్లో, యువకులలో నా ప్రియుడట్లు. అతని నీడలో విశ్రమించుట నాకిష్టము. అతని ఫలములు కడు మధురముగా ఉండును.
4. అతడు తన విందుశాలకు నన్ను తోడుకొని వచ్చెను. నా మీద తన ప్రేమధ్వజమును నెలకొల్పెను.
5. ఎండుద్రాక్షామోదకములతో మీరు నా సేద తీర్పుడు ఆపిలుపండ్లతో మీరు నా బడలికలు తొలగింపుడు. ప్రేమ వలననే నేను మిక్కిలి సొలసియున్నాను.
6. అతడు తన ఎడమ చేతిని నా తలక్రిందనుంచి తన కుడిచేతితో నన్ను ఆలింగనము చేసికొనును.
7. యెరూషలేము కుమార్తెలారా! జింకల పేరు మీదుగాను, లేళ్ళ పేరు మీదుగాను నేను ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. నా ప్రియురాలు స్వయముగా మేలుకొనువరకు, మీరామెకు నిద్రాభంగము కలిగింపవలదు.
8. నా ప్రియుని పిలుపు విన్పించుచున్నది. అతడు పర్వతముల మీదుగా పరుగెత్తుకొని వచ్చుచున్నాడు. కొండల మీదుగా, దుముకుచు వచ్చుచున్నాడు.
9. నా ప్రియుడు లేడి వంటివాడు. జింకపిల్ల వంటివాడు. అదిగో! అతడు మన గోడచెంతనే నిలుచుండియున్నాడు. గవాక్షముగుండ తొంగిచూచుచున్నాడు, గోడలోని సందుగుండ లోపలికి పారజూచుచున్నాడు.
10. నా ప్రియుడు నాతో మాట్లాడుచు ఇట్లనుచున్నాడు: “ప్రేయసీ! లెమ్ము! సుందరాంగీ! నా వెంట రమ్ము!
11. హేమంతము గతించినది, వర్షాకాలము దాటిపోయినది, వానలిక కురియవు.
12. పొలమున పువ్వులు పూయుచున్నవి. మధురగీతములు ఆలపించు సమయము ఆసన్నమైనది. పొలమున పావుర స్వరము విన్పించుచున్నవి.
13. అంజూరపు మొదటికాపు పక్వమైనవి. ద్రాక్షపూతబట్టి సువాసనలు గుబాళించుచున్నది. ప్రేయసీ! లెమ్ము! సుందరాంగీ! నా వెంట రమ్ము!
14. నీవు కొండ నెఱ్ఱెలలో బీటలువారిన కొండబండల సందులలో, దాగుకొనిన పావురమువంటిదానవు. నీ ముఖమును నాకు చూపించుము. నీ స్వరమును నాకు విన్పింపుము. నీ ముఖము సుందరమైనది. నీ నాదము మధురమైనది”.
15. మీరు గుంటనక్క పిల్లలను పట్టుకొనుడు. అవి పూతపట్టిన మన ద్రాక్షతోటను పాడుచేయుచున్నవి.
16. నా ప్రియుడు నావాడు, నేనతనిదానను. అతడు లిల్లీ పూలు పూచినచోట తన మందను మేపును.
17. ప్రియా! నీవు లేడివలెను, కొండమీది జింకపిల్లవలెను చూపట్టుము. నీవు నా చెంతకు తిరిగి రమ్ము. ఉదయ వాయువులు వీచినవరకు చీకట్లు గతించినవరకు నాతో ఉండుము.