ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హగ్గయి చాప్టర్ 1

1. దర్యావేషు పారశీకమునకు చక్రవర్తిగానున్న కాలము రెండవయేట, ఆరవనెల మొదటిదినమున ప్రభువు హగ్గయి ప్రవక్త ద్వారా సందేశమును వినిపించెను. ఆ సందేశము షయల్తీయేలు కుమారుడును, యూదా దేశ పాలకుడునైన సెరుబ్బాబెలు కొరకును, యెహోసాదాకు కుమారుడును, ప్రధానయాజకుడునైన యెహోషువ కొరకును ఉద్దేశింపబడినది.

2. సైన్యములకధిపతియైన ప్రభువు హగ్గయితో “ఈ ప్రజలు దేవాలయమును నిర్మించుటకిది అదను కాదనియు, సమయము ఆసన్నము కాలేదనియు పలుకుచున్నారే” అని చెప్పెను.

3. అంతట ప్రభువు హగ్గయిద్వారా ఈ సందేశము చెప్పెను:

4. “నా ప్రజలారా! నా మందిరము శిథిలమైయుండగా మీరు నగిషీ చెక్క పలకలతో, తెరలతో చక్కగా కట్టుకొనిన గృహములలో వసింపనేల?

5. మీకేమి జరుగుచున్నదో పరిశీలించి చూడుడు.

6. మీరు చాల విత్తనములు చల్లినను కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది. మీరు భుజించుచున్నారు గాని, ఆకలి తీరకయేయున్నది. మీరు ద్రాక్షారసము సేవించుచున్నారు గాని, దాహము తీరకయేయున్నది. బట్టలు తాల్చుచున్నారు గాని, అవి మిమ్కు వెచ్చగానుంచ జాలకున్నవి. కూలివారి కష్టార్జితము కంతగల సంచిలో వేసినట్లున్నది.

7. కావున సైన్యములకధిపతియైన ప్రభువు సెలవిచ్చునది ఏమనగా, “ఈ కార్యములు ఇట్లేందుకు జరుగుచున్నవో బాగుగా పరిశీలించి చూడుడు.

8. మీరిపుడు కొండల లోనికిపోయి కలపను తెచ్చి దేవళమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును. కీర్తిని బడయుదును.

9. మీరు పంట విస్తారముగా పండునను కొంటిరిగాని అతికొద్దిగానే పండెను. మీరు ఆ పంటను ఇంటికి కొనివచ్చినపుడు నేను దానిని ఊదివేసితిని. ఎందులకు? నామందిరము శిథిలమై ఉండగా మీలో ప్రతివాడును తన ఇంటిని చక్కజేసికొన వేగిరి పడుచున్నాడు.

10. కావున మీ చెయిదములను బట్టి ఆకాశము నుండి వానలుపడుటలేదు, భూమిపై పైరులు పండ లేదు.

11. నేను నేలపై బెట్టను కొనివచ్చితిని. కొండలు, పొలములు, ఓలివుతోటలు, ద్రాక్షతోటలు, నేలపై ఎదుగు ప్రతి పైరు, నరులు, పశువులు, మీరు పెంచగోరు ప్రతి పైరు క్షామమునకు గురియయ్యెను.”

12.అపుడు యూదాదేశ పాలకుడైన సెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, ప్రవాసమునుండి తిరిగివచ్చిన వారు ప్రభువైన దేవునిమాటను పాటించిరి. వారు ప్రభువునకు భయపడి ఆయన దూతయైన హగ్గయి ప్రవక్త పలుకులు ఆలించిరి.

13. అపుడు హగ్గయి ప్రభువు సందేశమును ప్రజలకు ఇట్లు వినిపించెను: “నేను మీకు తోడుగా నుందును. ఇది ప్రభుడనైన నా వాక్కు”

14. ప్రభువు యూదాదేశ పాలకుడైన సెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు యెహోషువ మనస్సును, ప్రవాసము నుండి తిరిగివచ్చిన ప్రజలందరి మనస్సులను ప్రేరే పించెను. కావున వారెల్లరును సైన్యములకధిపతియు ప్రభువునైన దేవుని మందిరము మీద పనిచేయ నారంభించిరి.

15. దర్యావేషు చక్రవర్తి పరిపాలనాకాలము రెండవయేట ఆరవనెల ఇరువది నాలుగవ దినమున ఈ కార్యమును మొదలిడిరి.