1. సొలోమోను పరమగీతము.
2. నీ పెదవులతో నన్ను ముద్దు పెట్టుకొనుము. నీ ప్రేమ ద్రాక్షామధువుకంటె శ్రేష్ఠమైనది.
3. నీ దేహపరిమళముసువాసననుగుబాళించుచున్నది నీ పేరు సుగంధమును జ్ఞప్తికి తెచ్చును. కనుకనే యువతులు నిన్ను వలతురు.
4. నన్ను నీ వెంట కొనిపొమ్ము . మనమిరువురము కలిసి పరుగిడుదము. రాజా! నన్ను నీ నివాసమునకు కొనిపొమ్ము. మాకు ఆనందమును ఒనగూర్చువాడవు నీవే. నీ ప్రేమను మధువుకంటె శ్రేష్ఠమైన దానినిగానెంచి కీర్తింతుము. నిన్ను వలచుటయే మేలు.
5. యెరూషలేము కుమార్తెలారా! నేను నల్లనిదాననైనను, సొగసైనదానను. కేదారు నగర గుడారములవలె, సొలోమోను పుర గుడారముల తెరలవలె నేను సొగసైనదానను.
6. నా వర్ణమునకుగాను మీరు నన్ను చిన్నచూపు చూడవలదు, సూర్యరశ్మి నన్ను మాడ్చివేసినది. నా సోదరులు నామీద కోపించిరి, నన్ను ద్రాక్షతోటకు కావలికాయ ఆజ్ఞాపించిరి. నేను నా సొంత ద్రాక్షతోటను కాయకపోతిని.
7. హృదయేశ్వరా! నీవు నీ గొఱ్ఱెలమందను, మేతకొరకు ఎచటికి తోలుకొని , పోయెదవో చెప్పుము. మధ్యాహ్నము ఆ మంద ఎచట విశ్రమించునో తెలుపుము. నేను నీ స్నేహితుల మందలచుట్టు తిరుగుచు, ఒట్టినే నీ కొరకు గాలింపనేల?
8. అందాలరాశీ! నీకు ఆ తావు తెలియనిచో, గొఱ్ఱెలమంద వెంటనే పొమ్ము, కాపరుల గుడారముల చెంతనే, నీ మేకపిల్లలను మేపుకొనుము.
9. ప్రేయసీ! నిన్ను ఫరో అశ్వములలో ఆడుగుఱ్ఱముతో పోలును.
10. నీ చెక్కిళ్ళు కురులమధ్య అలరారుచున్నవి. నీ కంఠము హారముల నడుమ శోభిల్లుచున్నది.
11. మేము నీకు వెండిపూలు తాపించిన సువర్ణహారము చేయింతుము.
12. రాజు విందుశాలలో ఆసీనుడై ఉండెను. నా దేహపరిమళము సువాసనలు వెదజల్లును.
13. నా ప్రియుడు నా రొమ్ముల మధ్య పరుండి, గోపరసమువలె సువాసనలొలుకును.
14. అతడు ఎంగెడి సీమలోని ద్రాక్షతోటల గట్టులమీద పూచిన కర్పూరపు పూగుత్తుల వంటివాడు.
15. ప్రేయసీ! నీ వెంతసొగసుగానున్నావు! ఎంత సుందరముగానున్నావు! నీ కన్నులు పావురములవలెనున్నవి.
16. ప్రియా! నీ వెంత మనోహరముగా ఉన్నావు! ఎంత మనోజ్ఞముగా ఉన్నావు! నవనవలాడు పచ్చనిగడ్డి మన పడక.
17. మన ఇంటి దూలములను , దేవదారు కలపతో చేసిరి. దాని వాసములను , తమాలవృక్షముల కొయ్యతో చేసిరి.