ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హబక్కూకు చాప్టర్ 1

1. ప్రభువు దర్శనమున హబక్కూకు ప్రవక్తకు తెలియజేసిన సందేశము ఇది: ప్రవక్తకు దేవునికి మధ్య సంభాషణము - ప్రవక్త అన్యాయమును గూర్చి ఫిర్యాదు చేయుట

2. ప్రభూ! నీవు నా వేడుకోలును ఆలించుటకును, మమ్ము “హింస” నుండి కాపాడుటకును నేనింకను ఎన్నాళ్లు మొర పెట్టవలెను?

3. నీవు నేనిట్టి అన్యాయమును కాంచునట్లు చేయనేల? నీవు ఆ దుష్కార్యములు చూచి ఎట్లు సహింతువు? నాకు కనిపించునది అంతయు వినాశనము, దౌర్జన్యమే. ప్రజలెల్లయెడల జగడములు ఆడుచున్నారు.

4. ధర్మశాస్త్రము బలహీనమై నిష్ప్రయోజనమైనది. న్యాయమెంత మాత్రమును జరుగుటలేదు. దుష్టులు సజ్జనులను అణగదొక్కుచున్నారు. కావున న్యాయము తారుమారు అగుచున్నది.

5. అపుడు ప్రభువు తన ప్రజలతో ఇట్లనెను: మీరు మీ చుట్టుపట్లగల జాతులను పరిశీలించి చూడుడు. మీరు చూచినదానివలన మీకాశ్చర్యము కలుగును. నేనిపుడొక కార్యమును చేయబోవుచున్నాను. దానిని గూర్చి వినినపుడు మీరు నమ్మజాలరు.

6. నేను బబులోనీయులను పురికొల్పుదును. వారు భీకరాకారులు, ఉద్రేకపూరితులు. అన్యదేశములను జయించుటకుగాను వారు లోకము నాలుగుచెరగులగుండ పయనము చేయుదురు.

7. ఆ జనులను గాంచి ప్రజలు భీతిల్లుదురు. వారు పొగరుతో తమ ఇష్టము వచ్చిన నిర్ణయములు చేయుదురు.

8. వారి అశ్వములు చిరుతపులులకంటె వేగముగా పరుగెత్తును. అవి ఆకలిగొనిన తోడేళ్లకంటె భయంకరమైనవి. వారి రౌతులు దూరదేశములనుండి స్వారిచేయుచు వత్తురు. గరుడపక్షి ఎరమీదికి వడిగా దిగివచ్చినట్లుగా హఠాత్తుగా వచ్చిపడుదురు.

9. వారి సైన్యము దౌర్జన్యములతో దోపిడీ చేయుచు వచ్చును. వారిని గాంచి ఎల్లరును భీతిల్లుదురు. వారి బందీలు ఇసుకరేణువులవలె అసంఖ్యాకులుగా ఉందురు.

10. వారు రాజులను గడ్డిపోచలవలె చూతురు. ఉన్నతాధికారులను గేలిచేయుదురు. ఎట్టి కోటయు వారిని అడ్డగింపజాలదు. మట్టి దిబ్బలు పోసి వారు దానిని పట్టుకొందురు.

11. వారు వాయువువలె వచ్చి మీదపడి అతిక్రమము చేసి దిఢీలున అదృశ్యులగుదురు. వారి బలమే వారికి దైవమని విర్రవీగుదురు.

12. ప్రభూ! నీవు ఆదినుండియు ఉన్నవాడవు.  నీవు పవిత్రుడవు, నిత్యుడవు. నాకు దేవుడవు నన్ను కాపాడు ప్రభుడవైన దేవా! నీవు బబులోనీయులను ఎన్నుకొని వారిని బలాఢ్యులను చేసితివి. వారిచే మమ్ము దండింపబూనితివి.

13. పవిత్రమైన నీ నేత్రములు చెడును చూడజాలవు. చెడుకు పాల్పడు వారిని చూచి నీవు సహింపజాలవు. నీవు ద్రోహబుద్ధి గలవారిని చూచి ఓర్చుకోజాలవుకదా! అట్లయిన వారు తమకంటె న్యాయవంతులైన ప్రజలను నాశనము చేయుచుండగా నీవు నోరు కదపవేమి?

14. చేపలను, నేలపై ప్రాకు పురుగులను నడిపించు నాయకుడు లేడు. నీవు మమ్ములను ఆ ప్రాణులవలె చూడనేల?

15. వారు గాలములు వేసి నరులను చేపలవలె పట్టుకొందురు. " వారిని తమ వలలో చిక్కించుకొని లాగుకొని పోవుదురు. " తాము పట్టుకొనిన వారిని చూచి హర్షధ్వానము చేయుదురు.

16. వారి వలలు వారికి శ్రేష్ఠమైన వానిని అందించును కావున వారు బలులతోను, సాంబ్రాణి పొగతోను తమ వలలను ఆరాధింతురు.

17. వారు సదా తమ వలలను కుమ్మరించి ఖాళీ చేయవలసిదేనా? నిరంతరము నిర్దయతో జాతులను సంహరింపవలసినదేనా?