1-2. ప్రభువునకు అపవిత్రమైన అగ్నిని సమర్పించి అహరోనుని ఇద్దరు కుమారులు ప్రాణములు కోల్పోయిన పిదప ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను: “నీ సోదరుడైన అహరోనుతో ఇట్లు చెప్పుము. అతడు ప్రత్యేక కాలమున మాత్రమే అడ్డుతెర దాటి లోపలి గర్భగృహముననున్న మందసము మీది కరుణా పీఠము చెంతకుపోవచ్చును. ఈ ఆజ్ఞ మీరెనేని అతడు చచ్చును. నేను కరుణాపీఠము మీద మేఘములో సాక్షాత్కరింతును.
3. పాపపరిహారబలికిగాను కోడెను, సంపూర్ణ దహనబలికిగాను పొట్టేలును కొనివచ్చిన పిదప వాటితో అతడు గర్భగృహములోనికి ప్రవేశింప వచ్చును.
4. అటుల ప్రవేశింపకముందు అతడు స్నానముచేసి పవిత్రములయిన నారచొక్క ఒంటికి ఆనియుండు నారలాగు, నారకడికట్టు, నార తలపాగా ధరింపవలయును.
5. యిస్రాయేలు సమాజము పాపపరిహారబలి కొరకు రెండుమేకపోతులను, సంపూర్ణదహన బలి కొరకు ఒక పొట్టేలును కొనివచ్చి అహరోనునకు ఈయవలయును.
6. అతడు తన స్వంత పాపములను తొలగించుటకై మొదట కోడెను పాపపరిహారబలిగా అర్పించుచూ తనకును, తన కుంటుంబమునకును ప్రాయశ్చిత్తము చెల్లించును.
7. పిమ్మట రెండు మేకపోతులను సమావేశపుగుడార ప్రవేశద్వారమువద్ద, ప్రభువు సాన్నిధ్యమున నిలబెట్టవలెను.
8. అపుడు అహరోను, ప్రభువు నిమిత్తము మరియు అసాసేలు' నిమిత్తము రెండుమేకలమీద రెండుచీట్లు వేయవలయును,
9. ప్రభువు నిమిత్తము చీటిపడిన మేకను అహరోను తీసుకొనివచ్చి పాపపరిహారబలిగా అర్పింవలయును.
10. అసానేలు నిమిత్తము చీటిపడిన మేకను ప్రజలపాపములకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని ఎడారిలోనికి తోలివేయుటకు ప్రభువు సమక్షమున దానిని ప్రాణములతో ఉంచవలయును.
11. అహరోను తన పాపములకును, తన ఇంటి వారి పాపములకును పరిహారముగా కోడెను బలియిచ్చిన పిదప,
12. ప్రభువు సన్నిధిలోనున్న ధూపపీఠముమీది నిప్పుకణికలతో నింపబడిన ధూప పాత్రమును, తన గుప్పిళ్ళతో మేలిమి సాంబ్రాణిని గైకొని అడ్డుతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావ కుండునట్లు
13. అతడు ప్రభువు ఎదుట సాంబ్రాణి పొగవేసి ఆ పొగమబ్బుతో మందసముమీది కరుణా పీఠమును కప్పివేయవలయును.
14. అటు తరువాత అతడు చేతివ్రేలితో కోడెనెత్తురును కొంత తీసికొని కరుణాపీఠము మీద తూర్పువైపు చిలుకరింపవలయును. కరుణాపీఠము ఎదుట నేలమీద ఏడు మార్లు చిలుకరింపవలయును.
15. ఆ తరువాత అతడు ప్రజల పాపపరిహార బలికొరకు నియమింపబడిన మేకను వధించి దాని నెత్తురును గూడ అడుతెర లోపలికి కొనిపోవలయును. కోడె నెత్తురునువలె ఈ మేకనెత్తురునుగూడ కరుణా పీరముమీదను, దానిముందటను చిలుకరింపవలయును.
16. ప్రజల పాపమువలనను, వారి అపవిత్రతవలనను, అతిక్రమములవలనను మైలపడిపోయిన పరిశుద్ధస్థలమునకు అతడు ఈరీతిగా నిష్కృతి చేయవలయును. శిబిరము మధ్యలోనుండు సమావేశపుగుడారము ప్రజల అపవిత్రతవలన మైలపడిపోయినది. దానికిని అహరోను పై రీతిగానే ప్రాయశ్చిత్తము చేయవలయును.
17. పవిత్రస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోయినది మొదలు, అతడు తన నిమిత్తమును, తన ఇంటివారి నిమిత్తమును, యిస్రాయేలీయుల సమస్తసమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటకు వచ్చువరకు ఏ మనుష్యుడును సాన్నిధ్యపు గుడారములో ఉండరాదు.
18. అంతట అహరోను ప్రభువు సాన్నిధ్యమునున్న బలిపీఠము చెంతకువచ్చి దానికి కూడ ప్రాయశ్చిత్తము చేయవలయును. ఎద్దునెత్తురును, మేకనెత్తురును కొద్దిగా తీసికొని ఆ పీఠము కొమ్ములకు పూయవలయును.
19. చేతి వ్రేలితో ఆ నెత్తురును ఏడుమార్లు పీఠముమీద చిలుకరింపవలయును. ఈ రీతిగా అతడు యిస్రాయేలీయుల అపవిత్రతనుండి బలిపీఠమును శుద్ధిచేసి దానిని పవిత్రము చేయును.
20. పవిత్రసలమునకును, సమావేశపు గుడారమునకును, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసిన పిదప అహరోను అసాసేలు కొరకు ఉద్దేశింపబడిన రెండవమేకను కొనిరావలయును.
21. అతడు ఆ మేక మీద చేతులు చాచి యిస్రాయేలీయుల అక్రమములను, నేరములను, పాపములను ఒప్పుకొని వానినెల్ల దాని తలమీద మోపవలయును. ఆ పిమ్మట ముందుగానే నియమింపబడిన ఒక మనుష్యునిచే దానిని ఎడారికి తోలింపవలయును.
22. ఆ మేక ప్రజల పాపముల నెల్ల తనపై వేసికొని ఎడారికి మోసికొనిపోవును.
23. తదుపరి అహరోను గుడారమునకు తిరిగి వచ్చి మునుపు గర్భగృహమున ప్రవేశించుటకు గాను తాను తాల్చియున్న నారవస్త్రములను తొలగించి వానిని అచట వదలివేయును.
24. అతడు పవిత్ర స్థలమున స్నానముచేసి సొంతబట్టలను తాల్చి వెలుపలికి వచ్చి తన పాపములకును, ప్రజలపాపములకును నిష్క్రతిగా దహనబలులు అర్పింపవలయును.
25. ఆ పశువుల క్రొవ్వును పాపపరిహారబలిగా పీఠముమీద కాల్చి వేయవలయును.
26. అసాసేలు నిమిత్తము చీటిపడిన మేకను తోలివచ్చినవాడు బట్టలు ఉతుకుకొని స్నానముచేసి శిబిరమునకు రావచ్చును.
27. పరిహారబలిగా అర్పింపబడిన కోడెనెత్తురును, మేకనెత్తుటిని పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు గర్భగృహములోనికి కొనిపోయిరిగదా! వాని కళేబరములను శిబిరము వెలుపలికి కొనిపోవలయును. అచట వానిచర్మమును, మాంసమును, పేడను కాల్చివేయవలయును.
28. వానిని దహించినవాడు బట్టలు ఉతుకుకొని స్నానము చేసిన తరువాత శిబిరమునకు తిరిగివచ్చును.
29. ఇవి మీకు శాశ్వతనియమములు కావలయును. ఏడవనెల పదియవదినము యిస్రాయేలీయులును, వారితో వసించు పరదేశులును పనిని విరమించుకొని ఉపవాసము ఉండవలయును.
30. ఆ దినమున మిమ్ము శుద్ది చేయుటకుగాను మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడును. దాని వలన మీ పాపములెల్ల తొలగి మీరు దేవుని ఎదుట దోషములేని వారగుదురు.
31. అది మీకు విశ్రాంతి దినము, ఉపవాసదినము. ఈ నియమములు మీకు కలకాలము వర్తించును.
32. అభిషేకము పొంది తన తండ్రికి అనుయాయిగా నియమింపబడిన ప్రధానయాజకుడు మాత్రమే పై ప్రాయశ్చిత్తము జరుపుటకు అర్హుడు. అతడు పవిత్ర నారవస్త్రములను ధరించి,
33. పవిత్ర స్థలమునకును, సమావేశపు గుడారమునకును, పీఠమునకును, యాజకులకును, ప్రజలకును ప్రాయశ్చిత్తము చేయును.
34. ఈ నియమములు మీకు కలకాలము వర్తించును. యిస్రాయేలీయుల పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు ఈ కట్టడను ఏడాదికి ఒకమారు జరిపింపవలయును.” మోషే ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసెను.