ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దానియేలు చాప్టర్ 14

1. అస్తువాగేసురాజు మరణానంతరము పారశీకుడైన కోరెషు అతని రాజ్యమునేలెను.

2. దానియేలు అతడి ఆప్తమిత్రులలోనొకడు. రాజు తన సలహాదారులందరిలోను దానియేలును ఉత్తమునిగా గణించెను.

3. బబులోనీయులకు బేలు అను విగ్రహము కలదు. ప్రతిదినము ప్రజలు ఆ ప్రతిమకు పండ్రెండు కుంచముల మేలిమిపిండిని నలువది గొఱ్ఱెలను, ఏబది కూజాల ద్రాక్షారసమును అర్పింపవలెను.

4. కోరెషు బేలుని దేవునిగా గణించి ప్రతిదినము అతడిని ఆరాధించుటకు వెళ్ళేడివాడు. కాని దానియేలు తన దేవుని మాత్రమే పూజించుచుండెను.

5. ఒకనాడు రాజు “నీవు బేలునెందుకు పూజింపవు?" అని దానియేలునడిగెను. అతడు “నేను నరమాత్రులు చేసిన బొమ్మలను కొలువను. భూమ్యా కాశములను సృజించినవాడును, నరులందరికి అధి పతియును, సజీవుడైన దేవుని మాత్రమే ఆరాధింతును” అని బదులు చెప్పెను.

6. అందుకు రాజు "బేలు సజీవుడైన దేవుడని నీవు నమ్మవా? అతడు ప్రతిదినమును ఏపాటి అన్న పానీయములు పుచ్చుకొనునో నీకు తెలియదా?” అని ప్రశ్నించెను.

7. దానియేలు ఫక్కున నవ్వి “ప్రభువుల వారు మోసపోకుందురుగాక! మీరు సేవించు ఈ బేలు బండారము లోపలమన్ను బయటకంచు మాత్రమే. అతడేనాడును అన్నపానీయములను ముట్టుకొని యెరుగడు” అని పలికెను.

8-10. ఆ మాటలకు రాజు కోపము తెచ్చుకొని : బేలు పూజారులను పిలిపించి వారితో “వినుడు! ఈ అర్పణములన్నిటిని బేలుదేవత ఆరగించుచున్నాడని రుజువు చేయలేని మీరెల్లరును చత్తురు. వీనిని బేలు దేవతయే భుజించుచున్నాడని నిరూపింతురేని, అతడు దేవుడుకాడని పలికినందుకు నేను దానియేలును : చంపింతును”అని చెప్పెను. దానియేలు ఆ షరతుకు అంగీకరించెను. బేలు పూజారులు, వారి ఆలుబిడ్డలు కాకయే డెబ్బదిమంది ఉండిరి.

11. రాజు దానియేలుతో బేలుగుడిలో ప్రవేశించెను. అచట పూజారులు రాజుతో “ఏలికా! మేమందరము బయటికి పోయెదము. మీరే భోజనమును బల్లపై పెట్టుడు. ద్రాక్షారసమును కలుపుడు. మీరు బయటికి వెళ్ళిన పిదప గుడి తలుపులు బిగించి వానికి రాజముద్ర వేయింపుడు.

12. ఉదయము మీరు తిరిగివచ్చిన పిమ్మట బేలు ఆ పదార్థము లన్నింటిని భక్షించియుండడేని మీరు మా తలలు తీయింపుడు, కాని అతడు వానిని భక్షించియుండెనేని, మామీద నేరములు మోపినందులకు దానియేలు తల కొట్టింపుడు” అని అనిరి.

13. ఈ మాటలు చెప్పుటకు పూజారులు ఏ మాత్రమును భయపడలేదు. ఎందుకన, వారు దేవళములోని బల్లక్రింద రహస్య ద్వారమును తయారు చేసి కొని ప్రతిరాత్రి దేవాలయములోనికి పోయి నైవేద్య ములను ఆరగించుచుండిరి.

14. పూజారులు వెళ్ళిపోయిన తరువాత రాజు బేలు దేవతకు భోజనమర్పించెను. అంతట దానియేలు బూడిదను తెచ్చి దేవళములోపల చల్లుడని తన సేవకులను ఆజ్ఞాపించెను. సేవకులు బూడిద చల్లుటను రాజుతప్ప మరియెవరును చూడలేదు. అటుపిమ్మట అందరు వెలుపలికి పోయి దేవాలయ ద్వారమును మూసి రాజముద్రవేసి వెళ్ళిపోయిరి. -

15. ఆ రేయి పూజారులు అలవాటు ప్రకారము తమ ఆలుబిడ్డలతో రహస్యద్వారముగుండ దేవాల యములోనికి వచ్చి దేవతకర్పింపబడిన భోజనము నారగించి పానీయమును త్రాగిరి.

16. మరుసటిరోజు వేకువనే రాజు, దానియేలును మందిరమునకు పోయిరి.

17. రాజు “రాజముద్రలు భద్రముగానున్నవా?” యని దానియేలు నడిగెను. 'ఉన్నవి' అని అతడు జవాబు చెప్పెను.

18. గుడి తలుపులు తెరువగనే రాజు ఖాళీ బల్లలను చూచి “బేలు దైవమా! నీవు నిక్కముగా గొప్ప వాడవు. నీ యందు మోసమేమియు లేదు” అని బిగ్గరగా అరచెను.

19. కాని దానియేలు నవ్వి “ప్రభువుల వారు దేవళములోనికి పోవుటకు ముందు ఈ నేలవైపు పార జూచి ఇచటి పాదముద్ర లెవరివో గుర్తింపుడు” అనెను.

20. రాజు “ఇచట పురుషుల, స్త్రీల, పిల్లల పాదముద్రలు కనిపించుచున్నవి” అని చెప్పెను.

21. అంతట అతడు మిగుల ఆగ్రహము చెంది పూజారులను, వారి కుటుంబసభ్యులను బంధించి నా యెదు టికి కొనిరండని ఆజ్ఞాపించెను. వారు తాము ప్రతి రాత్రి బల్లమీద పెట్టిన భోజనమును తినుటకు దేవళములోనికి ప్రవేశించు రహస్యద్వారమును రాజునకు చూపించిరి.

22. రాజు ఆ పూజారులను చంపించి బేలుదేవత విగ్రహమును దానియేలు వశము చేసెను. అతడు ఆ ప్రతిమను, దేవళమును గూడ నాశనము చేయించెను.

23. బబులోనియా దేశములో పెద్ద సర్పమొకటి యుండెను. ఆ దేశ ప్రజలు దానిని ఆరాధించెడివారు.

24. రాజు దానియేలుతో “నీవు ఈ సర్పము సజీవమైన దైవముకాదని అనజాలవుకదా! కావున దీనిని పూజింపుము” అని అనెను.

25. దానియేలు “నేను ప్రభువును ఆరా ధించెదను. ఆయన మాత్రమే సజీవుడైన దేవుడు.

26. ఏలినవారు అనుమతినిత్తురేని నేను ఖడ్గమును గాని, దండమునుగాని వినియోగింపకయే ఈ సర్పమును చంపుదును” అని పలికెను. రాజు “నేను నీకు అనుమతిని ఇచ్చితిని” అని అనెను.

27. దానియేలు కీలును క్రొవ్వును వెంట్రుకలను కలిపి ఉడుకబెట్టెను. ఆ పదార్థమును ఉండలుచేసి పాముచే తినిపించెను. ఆ ఉండలను తినగా ఘటసర్పము పొట్టపగిలెను. అంతట దానియేలు రాజుతో “మీరు పూజించు దైవములిట్టివారే” అనెను.

28. బబులోనీయలు ఈ సంగతి తెలిసికొని ఆగ్రహముతో రాజు పై తిరుగబడిరి “ఈ రాజు యూదుడయ్యెను. ఇతడు మొదట బేలుదేవతను నాశనముచేసి పూజారులను చంపించెను. ఇప్పుడు మన ఘటసర్పమునుగూడ చంపించెను” అని అరచిరి.

29. వారు రాజును సమీపించి “నీవు దానియేలును మాకు అప్పగింపుము. లేదేని మేము నిన్నును, నీ కుటుంబ మును హతము చేయుదుము” అని బెదరించిరి.

30. వారు రాజును ఒత్తిడి చేయగా అతడు తప్పించు కోజాలక దానియేలును వారికప్పగించెను.

31. ఆ ప్రజలు దానియేలును సింహముల గుంటలో పడద్రోయగా అతడు ఆరురోజులపాటు అందే ఉండెను.

32. ఆ గుంటలో ఏడు సింహము లుండెను. వానికి ప్రతిరోజు ఇద్దరు నరులను, రెండు గొఱ్ఱెలను ఆహారముగా వేసెడివారు. కాని ఈ ఆరు దినములు వానికి ఎట్టితిండియు పెట్టరైరి. అవి దానియేలును తప్పక మ్రింగివేయవలెనని అట్లు చేసిరి.

33. ఆ కాలమున హబక్కూకు ప్రవక్త యూద యాలో నుండెను. అతడు పులుసు వండి రొట్టెను ముక్కలుగాత్రుంచి దానిలో పడవేసెను. ఆ పులుసును పాత్రములో పోసికొని పొలమున పంటకోయు పని వారికి వడ్డించుటకు తీసికొని పోవుచుండెను.

34. అపుడు దేవదూత అతడితో “ఓయి! నీవీ పులుసును తీసికొనిపోయి బబులోనియా దేశమున సింహముల గుంటలోనున్న దానియేలున కిమ్ము” అని చెప్పెను.

35. హబక్కూకు “అయ్యా! నేనెప్పుడును బబులోనియాను చూడలేదు. ఆ సింహముల గుంట జాడయే నాకు తెలియదు” అని పలికెను. )

36. దేవదూత ప్రవక్త తలవెంట్రుకలు పట్టుకొని అతనిని వాయువేగముతో బబులోనియాకు కొని పోయి సింహముల గుంటప్రక్కన దింపెను.

37. హబక్కూకు “దానియేలూ! దానియేలూ! నీవు దేవుడు పంపిన ఈ భోజనమును ఆరగింపుము” అనెను.

38. ఆ మాటలు విని దానియేలు “దేవా! నీవు నన్ను స్మరించుకొంటివి. నిన్ను ప్రేమించువారిని నీవేనాడును చేయి విడువవుగదా!” అని ప్రార్థించెను.

39. అంతటతడు లేచి ఆ పులుసును ఆరగించెను. వెంటనే దేవదూత హబక్కూకును స్వీయదేశమునకు చేర్చెను.

40. దానియేలును సింహములకు మేతగా వేసిన తరువాత ఏడుదినముల పిమ్మట రాజు అతనికొరకు శోకించుటకుగాను సింగములగుంట యొద్దకు వెళ్ళెను. అతడు ఆ గుంటలోనికి తొంగిచూడగా దానియేలు దానిలో కూర్చుండియుండెను.

41. ఆ రాజు “దానియేలు దేవుడవైన ప్రభూ! నీవెంత గొప్పవాడవు! నీవుతప్ప మరియొకదేవుడు లేడు” అని అరచెను.

42. అతడు దానియేలును బయటికి లాగెను. దానియేలు పై కుట్రపన్నినవారిని ఆ గుంటలోనికి త్రోయించెను. అతడు. చూచు చుండగనే సింహములు వారిని మ్రింగివేసెను.