ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దానియేలు చాప్టర్ 13

1. బబులోనియాలో యోవాకీము అను నరుడుండెడివాడు.

2. అతడు హిల్కియా కుమార్తెయైన సూసన్నను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె. దైవభక్తికలది.

3. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్రనియమముల ప్రకారము జీవింపవలెనని నేర్పిరి.

4. యోవాకీము చాల సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారులు ఆ తోటలో ప్రోగయ్యెడివారు. వారు యోవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు.

5-6. వ్యాజ్యములు కలవారు యోవాకీము ఇంటికి వచ్చెడివారు. అచట ఇద్దరు న్యాయమూర్తులు తీర్పుచెప్పెడివారు. ఆ సంవత్సరము యూదులనుండి ఇద్దరు పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారినిగూర్చి ప్రభువు “బబులోనియాలో దుష్టత్వ మున్నది. న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారు” అని ముందే పలికియుండెను.

7. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సూసన్న తన భర్తతోటలో పచార్లు చేసెడిది.

8. న్యాయాధిపతులు ఇద్దరును ఆమె ప్రతిదినము తోటలో సంచరించుటను గమనించు చుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను.

9. వారికి ప్రార్ధనమీద ప్రీతిపోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి.

10.వారిరువురికిని సూసన్నపై మరులు పుట్టెను. కాని ఒకరికొకరు తమ కోరికలను తెలియనీయరైరి.

11. సూసన్నను కూడవలెనను కోరికను వెలిబుచ్చుటకు వారు సిగ్గుపడిరి.

12. వారు ప్రతిదినము ఆమెను చూచుటకు ఆశతో కనిపెట్టుకొని యుండెడివారు.

13. వారు ఒక రోజు మధ్యాహ్నము 'భోజనమునకు వేళయైనది, ఇక యింటికి పోవుదుము'. అని ఒకరితో నొకరు చెప్పుకొని,

14. ఎవరిదారిన వారు వెళ్ళిపోయిరి. కాని ఇరువురును సూసన్నను చూచుటకు తిరిగివచ్చి, తలవని తలంపుగా ఒకరినొకరు కలిసి కొనిరి. మొదట ఇద్దరును తామచటికి వచ్చుటకు ఏదో ఒక దొంగ కారణమును చెప్పిరి. అటుపిమ్మట ఇద్దరును తమకు సూసన్నమీద కోరిక కలదని ఒప్పుకొనిరి. వారు సూసన్న ఒంటరిగా దొరకు వరకు వేచియుందుమని నిశ్చయించుకొనిరి.

15-17. కావున తగిన సమయము కొరకు కాచుకొనియుండిరి.

18. ఒకదినమున సూసన్న అలవాటు ప్రకారము ఇద్దరు చెలికత్తెలతో తోటలోనికి పోయెను. అపుడచట ఆ ఇద్దరు న్యాయాధిపతులుతప్ప మరిఎవరును లేరు. వారు దాగుకొనియుండి సూసన్నను పొంచిచూచుచుండిరి. ఆ దినము చాలవేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పనికత్తెలతో “మీరు నాకు కొంచెము చమురును, పరిమళతైలమును తెచ్చి పెట్టుడు. నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసిఉంచుడు” అని చెప్పెను. వారు తోట తలుపులను మూసివేసి సూసన్న కోరిన సామగ్రిని తెచ్చుటకై ప్రక్కదారిగుండ వెలుపలికి వెళ్ళిరి. ఆ ఇద్దరు పెద్దలు తోటలో దాగియున్నారని వారికి తెలియదు.

19. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగియున్న తావునుండి వెలుపలికి వచ్చి సూసన్నయొద్దకు పరుగెత్తిరి.

20. ఆమెతో, “ద్వారములు మూసిఉన్నవి. మనలనెవరును గమనింపరు. మేము నీపై మరులుకొని కామాగ్నితో మాడిపోవు చున్నాము. కావున నీవు మా కోర్కె తీర్చుము.

21. నీవిందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతోనుండెననియు, కావుననే నీవు పనికత్తెలను పంపి వేసితివనియు కూటసాక్ష్యము పలుకుదుము” అనిరి.

22. సూసన్న నిట్టూర్పు విడచుచు "నేను ఇరకాటమున చిక్కితిని. నేను మీకు లొంగెదనేని, వ్యభిచార దోషమునకుగాను నాకు మరణదండనము విధింతురు. మీకు లొంగనేని, మీ చేతికి చిక్కుదును.

23. కాని ప్రభువునకు ద్రోహముగా పాపము చేయుటకంటె నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు” అని అనెను.

24. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. ఇద్దరు న్యాయాధిపతులు కూడ ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి.

25. వారిలో ఒకడు పరుగెత్తు కొనిపోయి తోట తలుపులు తెరచెను.

26. ఇంటిలోని సేవకులు ఆ కేకలువిని సూసన్నకేమైన ప్రమాదము కలిగినదేమోయని తలంచి ప్రక్కదారిగుండ తోట లోనికి పరుగెత్తిరి.

27. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారామెనుగూర్చి అట్టి సుద్దులెన్నడును విని ఎరుగరు.

28. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమిగూడిరి. ఇద్దరు న్యాయాధిపతులు సూసన్నను చంపింపవలెనను చెడు పన్నాగముతో అచటికి వచ్చిరి.

29. ప్రజలందరును, వినుచుండగా వారు “యోవాకీము భార్యయు, హిల్కియా కుమార్తెయునైన సూసన్నను పిలిపింపుడు” అని పలికిరి.

30. జనులు సూసన్నను పిలిపింపగా ఆమె తన తల్లితండ్రులతోను బిడ్డలతోను, బంధువులతోను వచ్చెను.

31. సూసన్న మిగుల అందగత్తె, సుకుమారి.

32. ఆమె ముసుగు వేసికొనియుండెను. ఆ దుర్నార్గులిదరు ఆమె సౌందర్యమును తనివిదీర చూచుటకు ఆ ముసుగును తొలగింప ఆజ్ఞాపించిరి.

33. ఆమె బంధువులును, ఆమెను చూచిన వారందరును కంటతడి పెట్టుకొనిరి.

34. అంతట ఆ ఇరువురు న్యాయాధిపతులును ప్రజలముందట నిలిచి సూసన్న తలపై తమ హస్త ములనుంచిరి.

35. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశమువైపు పారజూచెను.

36. ఆ ఇరువురు ఆమెను గూర్చి ఇట్లు కూటసాక్ష్యము పలికిరి. “మేము తోటలో పచార్లు చేయుచుండగా ఈమె తన ఇద్దరు చెలికత్తెలతో అచటికి వచ్చెను. ఈమె తోట తలుపులను మూపించి ఆ పనికత్తెలను బయటికి పంపెను.

37. అంతట తోటలో దాగియున్న యువకుడొకడు ఈమె చెంతకురాగా వారు ఇరువురును కలిసి శయనించిరి.

38. మేమప్పుడు తోటలో ఒక మూలనుంటిమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారిచెంతకు పరుగెత్తితిమి.

39. మేము వారిద్దరు కలిసియుండుటను చూచినను, ఆ యువకుని పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటె బలవంతుడు కనుక తోట తలుపులు తెరచుకొని ఉడాయించెను.

40. మేమీ స్త్రీని పట్టుకొని ఆ యువకుడెవడో చెప్పుమని అడిగితిమి. కాని ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము.”

41. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులైయుండిరి. కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నకు మరణదండన విధించిరి.

42. అంతట సూసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు “నిత్యుడవైన దేవా! నీకు రహస్యములెల్ల తెలియును. నీవు ప్రతికార్యమును అది జరుగకముందే తెలిసికొందువు.

43. నాకిపుడు మరణశిక్ష పడినది. కాని నేను నిర్దోషిననియు, ఈ నరులు దుష్టబుద్ధితో కల్లలాడి నామీద నేరముమోపిరనియు నీకు తెలియును. మరి నేను చనిపోవలసినదేనా?"అని పలికెను.

44. ప్రభువు ఆమె మొరాలించెను.

45. జనులామెను వధించుటకు కొనిపోవుచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనిచే మాట్లాడించెను.

46. అతడు “ఈమె మరణము నాకు సమ్మతముగాదు” అని బిగ్గరగా అరచెను.

47. అపుడు జనులెల్లరు అతనివైపు తిరిగి, 'మీమాటల భావము ఏమిటి?' అని అడిగిరి.

48. దానియేలు ప్రజలయెదుట నిలుచుండి “యిస్రాయేలీయులారా! మీరెంత మూర్ఖులు! సరిగా విచారణ జరుపకయే యిస్రాయేలు మహిళకు మరణ దండన విధింతురా? మీరు సత్యమును తెలిసికొను ప్రయత్నము గూడ చేయరైతిరి.

49. కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు, ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్దము” అని అనెను.

50. కనుక జనులందరు గబగబ మొదట విచారణ జరిగినచోటికి తిరిగివచ్చిరి. అధికారులు దానియేలుతో “దేవుడు నీకు పెద్దల వివేచనము నొసగెను. నీవు మా సరసన కూర్చుండి నీ భావమును మాకు వివరించి చెప్పుము” అని అనిరి. .

51. దానియేలు “మీరు ఆ ఇరువురు న్యాయాధిపతులను వేరుచేయుడు. నేను వారిలో ఒకొక్కరిని ప్రత్యేకముగా ప్రశ్నింతును” అని చెప్పెను.

52. వారిని వేరుపరచిన తరువాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి “ఓయి! నీకు చెడ్డతనముననే ఏళ్ళు చెల్లినవి. నీవు పూర్వముచేసిన పాపములన్నియు ఇప్పుడు నీ నెత్తిమీదికి వచ్చినవి.

53. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదండనము విధింపరాదని ప్రభువా జ్ఞాపించినను, నీవు నిరపరాధులను శిక్షించి, అపరాధులను వదలిపెట్టితివి.

54. నీవీ స్త్రీని స్పష్టముగా చూచితినని చెప్పుచున్నావు గదా! అట్లయిన ఆ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము” అని అడిగెను. అతడు “మస్తకి వృక్షము క్రింద” అని చెప్పెను.

55. దానియేలు “సరే, నీ అబద్దమే నీ ప్రాణములు తీయును. దేవుడు నిన్ను రెండు ముక్కలుగా నరికివేయుమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను” అని పలికెను.

56. అంతట మొదటి న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి రెండవ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొనివచ్చిరి. దానియేలు అతనిని చూచి "నీవు యూదజాతికి కాక కనానీయులజాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను. కామము నిన్ను పెడత్రోవ పట్టించెను.

57. నీవు యిస్రాయేలు వనితలను చెరచుచుంటివి. వారు భయపడి నీకు లొంగిపోయిరి. కాని ఈ యూదావనిత నీ దౌష్ట్యమునకు లొంగదయ్యెను.

58. నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము" అని పలికెను. అతడు 'సింధూరము క్రింద' అని జవాబు చెప్పెను.

59. దానియేలు “సరే, ఇట్టి బొంకుపలికి నీ కుత్తికమీదికి తెచ్చుకొంటివి. దేవదూత తన కత్తితో నిన్ను రెండుముక్కలుగా తరుగుటకు సిద్ధముగానున్నాడు. అప్పుడు మీ ఇద్దరి పీడ వదలును” అని అనెను.

60. అంతట జనులందరు కోలాహలము చేసి తన్ను నమ్మినవారిని రక్షించు దేవుని కొనియాడిరి.

61. దానియేలు ఆ ఇద్దరు న్యాయాధిపతులు కూట సాక్ష్యము పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారిమీద విరుచుకుపడిరి.

62. కూట సాక్ష్యము పలికినవారు నిందితునికెట్టి శిక్షపడునో అట్టి శిక్షనే అనుభవింపవలెనని మోషే ధర్మశాస్త్రము శాసించు చున్నది. కనుక వారు ఆ ఇద్దరికిని మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధియైన వనిత ప్రాణములు దక్కెను.

63. సూసన్న నిర్దేషియని రుజువయ్యెను. కనుక ఆమె తల్లిదండ్రులు, భర్త దేవుని స్తుతించిరి.

64. నాటినుండి దానియేలు కీర్తి పెరిగి పోయెను.