ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హొషేయ చాప్టర్ 13

1. పూర్వము ఎఫ్రాయీము తెగవారు మాటలాడినప్పుడు యిస్రాయేలులోని ఇతర తెగలవారు భయపడెడివారు. వారి ఖ్యాతి అట్టిది. కాని బాలును కొలిచిరి కాన ఆ తెగవారికి చావుమూడును.

2. ఆ ప్రజలింకను పాపము మూటకట్టుకొనుచునే ఉన్నారు. వారు పోత విగ్రహములు చేసి పూజించుచున్నారు. నరమాత్రులు చేసిన వెండిబొమ్మలను కొలుచుచున్నారు. వానికి బలులర్పింపుడని చెప్పుచున్నారు. దూడలను ముద్దు పెట్టుకొనుచున్నారు.

3. కావున ఆ ప్రజలు ప్రొద్దునపట్టిన మంచువలెను, వేకువనే విచ్చిపోవు పొగమంచువలెను కనుమరుగు అగుదురు. కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టువలె కొట్టుకొని పోవుదురు. కిటికీలోగుండా పోవు పొగవలె అంతర్థానమగుదురు.

4. ప్రభువు ఇట్లనుచున్నాడు: మీ ప్రభుడను దేవుడనైన నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చితిని. నేనుతప్ప మీకు అన్యదైవములేడు. మీ రక్షకుడను నేనే.

5. నీరులేని మరుభూమిలో నేను మిమ్మాదరించితిని.

6. కాని మీరు మంచినేలను చేరుకొనగానే సంతుష్టిజెంది గర్వాత్ములై నన్ను విస్మరించితిరి.

7. కావున నేను సింహమువలె మీపై పడుదును. చిరుతపులివలె మీ త్రోవ ప్రక్కన పొంచియుందును.

8. పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటివలె మీ పైబడి మిమ్ము చీల్చివేయుదును. సింగమువలె మిమ్ము మ్రింగివేయుదును. వన్యమృగమువలె మిమ్ము ముక్కలు ముక్కలుగా చీల్చెదను.

9. యిస్రాయేలీయులారా! నిన్ను ఆదుకొను నాకు విరోధివై నిన్నునీవే పతనము చేసుకొనుచున్నావు.

10. మీరు "మాకు రాజు, అధిపతులు కావలెను” అని కోరితిరి. కాని ఇపుడు మీ రాజులేమైరి?

11. నేను కోపముతో మీకు రాజులనొసగినట్లే, ఆగ్రహముతో వారిని నిర్మూలింతును.

12. యిస్రాయేలీయుల దోషము మూటకట్టబడియున్నది. వారి పాపములు దాచబడినవి.

13. ప్రసవకాలమున వేదన కలిగినట్లు అతనికి వేదనకలుగును. బిడ్డపుట్టు సమయమున , బయటకురాని శిశువువలె అతడు బుదిహీనుడై వృద్దిలోనికి రాడయ్యెను

14. అయినను నేను వారిని పాతాళమునుండి రక్షింపగోరితిని, మృత్యువునుండి వారిని విమోచింపనాశించితిని. మరణమా! నీ అరిష్టములు ఎక్కడున్నవి? పాతాళమా! నీ వినాశనము ఎచటనున్నది? అయినను నాకు వారియెడల సానుభూతి కలుగుటలేదు.

15. యిస్రాయేలీయులు రెల్లువలె ఎదిగినను, నేను వారిపై ఎడారినుండి తూర్పు వేడిగాలి తోలింతును. ఆ గాలివలన వారి చెలమలును, నీటి బుగ్గలును వట్టిపోవును. అది విలువగల వారి వస్తువులనెల్ల అపహరించును

16. తన దేవుడనైన నాపై తిరుగుబాటు చేసెనుగాన సమరియా శిక్షననుభవించును. ఆ నగర పౌరులు పోరున చత్తురు. అందలి చంటిబిడ్డలను నేలకు విసరికొట్టుదురు. గర్భవతుల కడుపు చీల్చివేయుదురు.