1. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అపుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండియు అంతటి విపత్కాలమెన్నడును సంభవించి యుండలేదు. ఆ కాలము సమీపించినపుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడినవారు జీవింతురు.
2. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలమంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్యజీవముబడయుదురు. మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు.
3. జ్ఞానులైన నాయకులు ఆకాశము నందలి జ్యోతులవలె వెలుగుదురు. పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పినవారు కలకాలము వరకును నక్షత్రములవలె ప్రకాశింతురు.
4. ఆ దేవదూత నాతో “దానియేలూ! నీవు ఇపుడు ఈ గ్రంథమును మూసివేసి దానికి ముద్ర వేయుము. ఆ ముద్ర లొకాంతమువరకును ఉండును. ఈ మధ్య కాలమున చాలమంది విషయమును అర్థము చేసి కోగోరి వ్యర్థప్రయత్నము చేయుదురు” అనెను.
5. అంతట నేను నది ఈవలి ఒడ్డు మీద ఒకనిని ఆవలి ఒడ్డు మీద ఒకనిని అనగా ఇద్దరు నరులు నిలుచుండియుండుట చూచితిని.
6. వారిలో నొకడు నారబట్టలుతాల్చి, నది ఎగువభాగమున నిలిచియున్న దేవదూతను కాంచి "అయ్యా! ఈ అద్భుత సంఘటనములు ముగియుటకు ఇంకను ఎంతకాలము అని అడిగెను.
7. ఆ దేవదూత చేతులు ఆకాశమునకెత్తి నేను వినుచుండగా నిత్యుడైన దేవుని పేరుమీదుగా బాస చేసి ఇట్లనెను: “ఇంకను ఒకకాలము, రెండుకాలములు, అర్థకాలము పట్టును. దేవుని ప్రజలను హింసించుట పూర్తియైనపుడు ఈ కార్యములెల్ల ముగియును.” ,
8. నేను అతని పలుకులు వింటినిగాని వాని భావమునర్థము చేసికోజాలనైతిని. కనుక "అయ్యా! ఈకార్యములెట్లు ముగియును?” అని అతడినడిగితిని.
9. అతడు నాతో “దానియేలూ! నీవిక వెడలి పొమ్ము. అంతము వచ్చువరకు ఈ పలుకులను రహస్యముగను, గోప్యముగను ఉంచవలెను.
10. చాల మంది ప్రజలు శుద్ధిని పొందుదురు. దుష్టులు ఈ సంగతులను అర్థము చేసికొనక దుష్కార్యములు చేయుచునే యుందురు. జ్ఞానులు మాత్రము ఈ విషయములను అర్థము చేసికొందురు.
11-12. ప్రతిదినము అర్పించుబలిని ఆపివేసిన నాటినుండి, అనగా దేవాలయమున హేయమైన విగ్రహమును నెలకొల్పిన నాటినుండి వెయ్యిన్ని రెండు వందల తొంబది దినములు గడచును. వెయ్యిన్ని మూడు వందల ముప్పది ఐదు దినములు గడచు వరకును విశ్వాసపాత్రులుగా ఉండువారు ధన్యులు.
13. దానియేలూ! నీవు చివరివరకు విశ్వాస పాత్రుడవుగానుండుము. అటుపిమ్మట నీవు మరణింతువు. తదనంతరము మరల లేపబడి నీ వంతులో నిలువబడి లోకాంతమున బహుమతిని పొందుదువు" అని చెప్పెను.