1-3. ప్రభువు మోషే, అహరోనులతో ఇట్లు నుడివెను: “మీరు యిస్రాయేలీయులకు ఇట్లు ఆజ్ఞా పింపుడు. మీరు భూమిమీది జంతువులలో గిట్టలు చీలియుండి, నెమరువేయు వానినెల్ల భుజింపవచ్చును.
4-6. ఈ క్రింది జంతువులకు గిట్టలు చీలియుండుట లేక నెమరువేయుట అను ఏదో ఒక లక్షణము మాత్రమే కలదు. కనుక మీరు వానిని భుజింపరాదు. ఒంటె, పొట్టికుందేలు, కుందేలు నెమరువేయునుగాని వానికి గిట్టలు చీలియుండవు. కనుక అవి అశుచికరమైనవి.
7. పందికి గిట్టలు చీలియుండునుగాని అది నెమరువేయదు. కనుక అది అశుచికరమైనది.
8. ఇట్టి జంతువుల మాంసమును మీరు భుజింపరాదు. వాని శవములనుకూడ ముట్టుకోరాదు. అవి అశుచికరమైనవి.
9. జలచరములలో పొలుసులు, రెక్కలు గల వానిని మీరు భుజింపవచ్చును. అవి నదులలోగాని, సముద్రములలోగాని జీవించుచుండవచ్చును.
10. కాని జలచరములలో రెక్కలు, పొలుసులులేని వానిని మీరు భుజింపరాదు.
11. అవి అశుచికరమైనవి. మీరు వానిని ఆరగింపరాదు, వాని కళేబరములను గూడ ముట్టుకోరాదు.
12. పొలుసులు, రెక్కలు లేని జలచరములును అశుచికరమైనవి.
13-19. పక్షులలో ఈ క్రిందివి మీకు హేయమైనవి. కనుక మీరు వానిని భక్షింపరాదు. రాబందు, పెద్దబోరువ, క్రౌంచము, గ్రద్ద, రకరకముల తెల్ల గ్రద్దలు, రకరకముల కాకులు, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, రకరకముల డేగలు, పైడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, రకరకములైన కొంగలు, కుకుడుగువ్వ, గబ్బిలము.
20-21. నాలుగుకాళ్ళతో నడచు కీటకములు అశుచికరమైనవి. కీటక జాతిలో నేలమీద గెంతుచు పోవుటకు కాళ్ళమీద తొడలుగలవి మాత్రమే మీకు భుజింపదగినవి.
22. అనగా రకరకముల మిడుతలు, టిట్టిభములు, గొల్లభామపురుగులు.
23. మిగిలిన నాలుగుకాళ్ళ కీటకములనెల్ల అశుచికరమైన వానినిగా భావింపుడు.
24-28. ఈ క్రింది జంతువులను ముట్టుకొనిన వారు సాయంకాలమువరకు శుద్ధిని కోల్పోవుదురు. వాని కళేబరములను తొలగించువారు సాయంకాలము వరకు శుద్ధినికోల్పోవుదురు. పైపెచ్చు వారు తమ బట్టలనుగూడ ఉతుకుకొనవలయును. చీలినగిట్టలును, నెమరువేయు గుణమునులేని నాలుగు కాళ్ళ జంతువులు, పంజాలుగల ప్రాణులు అశుచికరములు. ,
29-30. నేలమీద ప్రాకెడి చిన్న జంతువులలో ఈ క్రిందివి మీకు అశుచికరమైనవి. చిన్న ముంగిస, ఎలుక, తాబేలు, బల్లులు, నేలముసలి, అడవి ఎలుక, తొండలు.
31. ఈ ప్రాణుల కళేబరములను ముట్టుకొనిన వారు సాయంకాలమువరకు శుద్ధిని కోల్పోవుదురు.
32. వాని కళేబరములు పడిన వస్తువులు అనగా కొయ్యపనిముట్లు, దుస్తులు, చర్మములు, గోనెలు మొదలగునవి అశుచికరములగును. అట్టి వస్తువులను నీటిలో ముంచవలయును. అవి సాయంకాలము వరకు శుద్ధినికోల్పోవును. తదుపరి శుద్ధియగును.
33. ఈ ప్రాణుల కళేబరములు, కుండలోపడిన యెడల దానిలోని పదార్ధములన్నియు అశుచికరములగును. ఆ కుండను బద్దలు చేయవలయును.
34. ఆ కుండలోని నీళ్ళుసోకిన భోజనము అశుచికరమగును. దానిలో పోసిన ద్రవపదార్ధములు కలుషిత మగును.
35. మృతజంతువు దేనిమీద పడినను అది అశుచికరమగును, అది పొయ్యిమీదగాని కుంపటి మీదగాని పడినచో వానిని పగులగొట్టవలయును.
36. కాని చెలమలు, బావులు, కుంటలు మాత్రము మృతజంతువులు పడగా నీరు ఎక్కువగా ఉండుట వలన శుద్ధి నికోల్పోవు. కాని మృతదేహమునకు తగిలినది అపవిత్రమగును.
37. మృతదేహములు పడిన విత్తుకట్టు విత్తనములు కూడ శుద్దిని కోల్పోవు.
38. కాని నానియున్న విత్తనములమీద కళేబరములు పడెనేని అవి అశుద్ధి అగును.
39. మీరు తినదగిన జంతువేదైన చనిపోయిన యెడల దానిని ముట్టుకొనువాడు సాయంకాలము వరకు శుద్ధినికోల్పోవును.
40. దాని మాంసము భుజించువాడు బట్టలు ఉతుకుకోవలయును. అతడు సాయంకాలము వరకు శుద్ధినికోల్పోవును. దాని కళేబరమును తొలగించువాడు బట్టలు ఉతుకుకోవలయును. అతడు సాయంకాలము వరకును శుద్ధిని కోల్పోవును.
41. నేలమీద ప్రాకెడు జంతువులు హేయమైనవి కనుక మీరు వానిని భుజింపరాదు.
42. కడుపుతో ప్రాకెడు జంతువులును, నాలుగుకాళ్ళతో గాని మరి ఎక్కువ కాళ్ళతోగాని నేలమీద ప్రాకెడు జంతువులును హేయమైనవి.
43. ప్రాకుజీవరాసులలో దేనినైనను తిని మిమ్మును మీరు అశుద్ధపరచుకొనగూడదు. మీరు అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రతను కలుగజేసి కొనగూడదు.
44. యావేనైన నేను మీకు ప్రభుడను. నేను పవిత్రుడను కనుక నా వలన మీరును పవిత్రులైతిరి. కనుక మీరు ఈ ప్రాకెడు జంతువులవలన శుద్ధిని కోల్పోవలదు.
45. ప్రభుడనైన నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొనివచ్చినది మీకు దేవుడనగుటకే. నేను పవిత్రుడను గనుక మీరుకూడ పవిత్రులై యుండుడు.”
46. భూచరములు, జలచరములునైన సమస్త జంతువులను, పక్షులను గూర్చిన నియమములు ఇవి.
47. శుచికరమైన వానిని అశుచికరమైన వానినుండి వేరుపరచుటకును, తినదగినవానిని, తినగూడని వానినుండి విభజించుటకును ఈ నియమములు ఉద్దేశింపబడినవి.