ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దానియేలు చాప్టర్ 11

1. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు నేను స్థిరపరచబడుటకును, బలపరచ బడుటకును అతనియొద్ద నిలబడితిని. 

2. ఇపుడు నేను నీతో చెప్పబోవు సంగతులు నిజమైనవి. ఆ దేవదూత మరియు ఇట్లనెను: “ఇంకను ముగ్గురు రాజులు పారశీక దేశమును పాలింతురు. అటుపిమ్మట నాలుగవరాజు వచ్చును. అతడు అందరికంటెను ధనవంతుడు. అతడు సంపదలను బలమును మిక్కుటముగా బడసి గ్రీకు రాజ్యమును సవాలుచేయును.

3. అటుతరువాత పరా క్రమశాలియైన రాజు ఉద్భవించును. అతడు పెద్ద రాజ్య మును పాలించును. తనకిష్టము వచ్చిన కార్యములెల్ల చేయును.

4. అతని రాజ్యాధికారము ఉత్కృష్టదశను అందుకొనిన వెంటనే అతని సామ్రాజ్యము ముక్కలు ముక్కలై నాలుగు భాగములగును. అది అతని వంశపు వారికిగాని, తాను నియమించిన పరిపాలనాధిపతు లకుగాని విభాగింపబడదు. అతని అధికారము వ్రేళ్ళతో పెరికివేయబడును. అతని వంశపువారు దానిని పొందరు. కాని అన్యులు పొందుదురు.

5. అయితే దక్షిణదేశపు (ఐగుప్తు) రాజు బలశాలి అగును. కాని అతని సైన్యాధిపతి అతనికంటెను బలాడ్యుడై అతనికంటెను పెద్ద రాజ్యమునేలును.

6. చాల ఏండ్ల తరువాత దక్షిణదేశపురాజు, ఉత్తరదేశపు (సిరియా) రాజుతో పొత్తు కుదుర్చుకొని తన కుమార్తెనతనికిచ్చి పెండ్లి చేయును. కాని ఆ పొత్తు దీర్ఘకాలము నిలువదు. ఆ కుమార్తెను, ఆమె పెనిమిటిని, కుమారుని, ఆమెతో వెళ్ళిన సేవకులను వధింతురు.

7. తదనంతర మామె బంధువులలో ఒకడు రాజగును. అతడు ఉత్తర దేశపు సైన్యము మీదికి దాడిచేయును. వారి కోటలో ప్రవేశించి వారినోడించును.

8. అతడు సిరియనుల దేవతావిగ్రహమును ఐగుప్తునకు కొనిపోవును. ఆ దేవతలకు అర్పించిన వెండి, బంగారు పరికరములు తీసికొనిపోవును. చాల ఏండ్లు శాంతి నెలకొనిన తరువాత,

9. సిరియారాజు ఐగుప్తురాజు మీదికి దాడిచేయును. కాని అతడు ఓడిపోయి వెనుకకు తిరిగి వచ్చును.

10. సిరియారాజు కుమారులు యుద్ధమునకు సన్నద్దులై పెద్దసైన్యమును ప్రోగుచేసికొందురు. వారిలో నొకడు ఉప్పొంగు ప్రవాహమువలె వచ్చి శత్రువుల కోటను ముట్టడించును.

11. కాని ఐగుప్తురాజు ఆగ్రహము చెంది, సిరియారాజు మీదికి దండెత్తి అతని మహాసైన్యమును పట్టుకొనును.

12. అతడు తన విజయమును, తాను చంపిన అసంఖ్యాక సైన్య మును చూచి గర్వించును. కాని అతని విజయ మెక్కువ కాలము కొనసాగదు.

13. సిరియారాజు వెడలిపోయి పూర్వముకంటె పెద్ద సైన్యమును ప్రోగుచేసికొనును. తగిన తరుణము లభించినపుడు అతడు ఆయుధములతో కూడిన మహా సైన్యముతో తిరిగివచ్చును.

14. అప్పుడు చాలమంది ఐగుప్తురాజు మీద తిరుగబడుదురు. దానియేలూ! మీ జాతినుండి కూడ కొందరు హింసాప్రియులు తాము చూచిన ఒకానొకదర్శనము కారణముగా తిరుగు బాటు చేయుదురు. కాని వారెల్లరును ఓడిపోదురు.

15. సిరియారాజు సురక్షితపట్టణమును ఆక్రమించి దానిని పట్టుకొనును. ఐగుప్తు సైనికులు పోరును కొన సాగింతురు. వారిలో శూరులుకూడ బలమును కోల్పోవుదురు.

16. కనుక సిరియారాజు శత్రు సైనికులను తన ఇష్టము వచ్చినట్లు చేయును. వారతడిని ఎదిరింపరు. అతడు యిస్రాయేలు దేశమున గూడ ప్రవేశించి దానిని పూర్ణముగా స్వాధీనము చేసికొనును.

17. సిరియారాజు తన సర్వసైన్యముతో దండ యాత్ర చేయజూచును. అతడు తన శత్రువు రాజ్యమును నాశముచేయగోరి అతడితో పొత్తు కుదుర్చుకొనును. అతనికి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేయగోరును. కాని అతని పన్నాగములు నెరవేరవు.

18. తరువాత అతడు సముద్రమార్గమున వచ్చి అన్యజాతులమీద దాడి చేయును. చాల జాతులను గెల్చును. కానీ అన్యజాతి  నాయకుడు ఒకడు అతనిని ఓడించి అతని గర్వము నణచును. అతడు సిరియారాజు పొగరును అతని మీదికే త్రిప్పికొట్టును.

19. సిరియారాజు తన దేశములోని కోటకు తిరిగివచ్చును. కాని అతడచట ఓడి పోవును. దానితో అతడు కనుమరుగగును.

20. అతని తరువాత మరియొక రాజు రాజ్య మునకు వచ్చును. అతడు తన ఉద్యోగిని పంపి ప్రజలపై భారమైన పన్నులు విధించును. తన సంపదలను అధికము చేసికోవలెనని అతని కోరిక. కాని ఆ రాజును కొద్దికాలముననే హత్య చేయుదురు. అతనిని బహిరంగముగాగాని, యుద్ధమునగాని చంపరు.

21. అతనికి బదులుగా నీచుడొకడు సిరియాకు రాజగును. అతనికి రాజగు హక్కులేదు. కాని అతడు తలవని తలంపుగా వచ్చి మోసముతో అధికారమును కైవసము చేసికొనును.

22. అతనిని ఎదిరించువారిని ఎవరినైనను, దేవుని ప్రధానయాజకుని గూడ, అతడు రూపుమాపును.

23. అతడు ఒప్పందములద్వారా అన్యజాతులను మోసగించును. తాను చిన్న రాజ్యములనే ఏలినను క్రమముగా బలాఢ్యుడు అగును.

24. ముందుగా హెచ్చరిక చేయకయే అతడొక సంపన్న దేశముపై దాడిచేయును. తన పూర్వులు ఏనాడును చేయని కార్యములను అతడు చేయును. యుద్ధమున దొరికిన కొల్లసొమ్మును, సొత్తును తన అనుచరులకు పంచిఇచ్చును. అతడు కోటలను స్వాధీనము చేసికొనుటకు యత్నము చేయునుగాని, అతనికాలము త్వరగానే ముగియును.

25. అతడు సాహసముతో పెద్ద సైన్యమును ప్రోగుచేసికొని ఐగుప్తురాజుపై దాడిచేయును. ఆ రాజు మహాబలముగల గొప్ప సైన్యములతో ఇతడిని ఎదిరించును. కాని ఆ ఐగుప్తురాజు మోసమునకు లొంగి విజయమును బడయజాలడు.

26. అతనితో భుజించు వారే అతడిని నాశనము చేయుదురు. అతని సైనికులు చాలమంది చత్తురు. అతని సేన హతమగును.

27. అంతట ఇద్దరు రాజులు ఒకే పొత్తున కూర్చుండి భోజనము చేయుదురు. కాని వారి ఉద్దేశములు దుష్టములైయుండును. వారు ఒకరితోనొకరు కల్లలాడుదురు. తగిన కాలమింకను రాలేదు కనుక వారు తమ కోర్కెలను సాధింపజాలరు.

28. సిరియారాజు తాను దోచుకున్న కొల్లసొమ్ముతో తిరిగివచ్చును. మరియు అతడు పవిత్ర నిబంధనమునకు విరోధముగా ఇష్టానుసారముగా వ్యవహరించి తన స్వీయ దేశమునకు తిరిగివచ్చును.

29. అటుపిమ్మట అతడు ఐగుప్తుమీదికి మరల దాడిచేయును. కాని ఈ మారు ఫలితము భిన్నముగా నుండును.

30. కిత్తీయద్వీప (సైప్రస్) ప్రజలు ఓడలతో అతనిమీదికి వచ్చుటవలన అతడు ఓడిపోవును. అంతటతడు పరిశుద్ధ నిబంధనము విషయములో అత్యంత ఆగ్రహముగలవాడై తన ఇష్టానుసారముగా వ్యవహరించును. అతడు వెనుకకు మరలి పరిశుద్ధ నిబంధనమును విడనాడినవారి సలహాను పాటించును.

31. అతని సైనికులు పవిత్రస్థలపు కోటను అపవిత్రపరచి బలి అర్పణలను నిషేధించి దానిలో నాశనముకలుగజేయు హేయమైన విగ్రహమును నెలకొలుపుదురు.

32. అందుకతడు ప్రీతిగొలుపు మాటలతో పవిత్రనిబంధనమును విడనాడినవారిని వశపరచుకొని, వారి మద్దతుబడయును. అయితే దేవునినెరుగువారు బలముకలిగి, అతనితో పోరాడుదురు.

33. ప్రజలలో విజ్ఞానముగల నాయకులు ఇతరులకు ఉపదేశము చేయుదురు. కాని కొంత కాలము వరకు వారిలో కొందరు పోరున కూలుదురు. కొందరిని సజీవముగా దహింతురు. కొందరి ఆస్తులను స్వాధీనము చేసికొని వారిని బందీలను చేయుదురు.

34. ఈ రీతిగా శత్రువులు దైవ ప్రజలను హతమార్చు చుండగా ఆ ప్రజలకు ఒకపాటి సాయము లభించును. కాని చాలమంది స్వార్ధముతో ఆ దైవప్రజల పక్షమును అవలంబింతురు.

35. నియమితకాలము ఇంకను ఆసన్నము కాలేదు కనుక ఆ అంత్యకాలమువరకు దైవ ప్రజలను పరిశీలించుటకును, పవిత్రపరచుటకును వివేకవంతులలో కొందరు హతులగుదురు.

36. సిరియారాజు తన ఇష్టమువచ్చినట్లు ప్రవ ర్తించును. అతడు తాను దైవములందరికంటెను, మహోన్నతుడైన దేవునికంటెను గొప్పవాడనని ప్రగల్బ ములు పలుకును. దేవుడు తనను శిక్షించువరకును అటులనే చేయును. దేవుడు తాను సంకల్పించిన కార్య మును ఖండితముగా నేరవేర్చును.

37. రాజు తన పూర్వులు కొలిచిన దేవతను, స్త్రీలు కొలుచుటకు ఇష్ట పడు దేవతను ఉపేక్షించును. ప్రతి దేవతను నిర్లక్ష్య ముచేసి తానే దేవతలందరికంటెను గొప్పవాడనని ఎంచును.

38. వారికి బదులుగా అతడు కోటలను రక్షించుదేవతను పూజించును. తన పూర్వులు కొలవని దేవతకు వెండి బంగారములను, ఆభరణములను విలువగల కానుకలను అర్పించును.

39. అతడు తన కోటలను రక్షించుటకు పరదేవతలను కొలుచు వారిని వినియోగించును. తనను రాజుగా అంగీ కరించు వారిని మిగుల సత్కరించును. వారికి గొప్ప పదవులిచ్చి, భూములను బహుమతిగానిచ్చును.

40. సిరియా రాజునకు అంత్యకాలము దాపురించినపుడు ఐగుప్తు రాజు అతని మీదికి దాడిచేయును. సిరియారాజు తనగుఱ్ఱములను, రథములను, నావల సమూహములను వినియోగించుకొని, శక్తి కొలది శత్రువు నెదిరించును. అతడు వరద పొంగివచ్చినదో అన్నట్లు చాల దేశముల మీదికి దాడిచేయును.

41. యిస్రాయేలు దేశము మీదికి కూడ దండెత్తి వేలకొలది ప్రజలను సంహరించును. కాని ఎదోము, మోవాబు, అమ్మోనున మిగిలియున్న భాగము మాత్రము అతని దాడిని తప్పించుకొనును.

42. అతడా రాజ్యముల మీదికి దాడిచేసినపుడు ఐగుప్తును కూడ వదలడు.

43. ఐగుప్తున గుప్తమైయున్న వెండిబంగారములను ఇతర విలువగల వస్తువులను అపహరించును. ఇంకను అతడు లిబియాను, కూషు దేశములను గూడ జయించును.

44. అంతట అతడు తూర్పునుండియు, ఉత్తరమునుండియు వచ్చు వార్తలకు కలవరపడి, ఆగ్రహముతో పోరాడి చాలమందిని చంపును.

45. అతడు సముద్ర మునకును, దేవాలయమున్న పర్వతమునకును మధ్య రాజకార్యములను నడుపుటకు , పెద్ద గుడారములు పన్నును. కాని కడకు దిక్కులేని చావు చచ్చును.