1. కోరెషు పారశీకమునకు రాజుగానున్న కాలమున మూడవయేట బెల్తేషాజరు అను మారుపేరు గల దానియేలునకు ఒక సందేశము తెలియపరపపడెను. అది నిజమైనదేగాని దానిభావమును గ్రహించుట మాత్రము చాలకష్టము. దాని భావము అతనికి దర్శనమున తెలియచేయబడెను.
2. ఆ సమయమున నేను మూడువారముల కాలము శోకించుచుంటిని.
3. మంచి భోజనమును గాని, మాంసమునుగాని భుజింపలేదు. ద్రాక్షాసారాయమును సేవింపలేదు. అభ్యంగనము చేసికోలేదు.
4. సంవత్సరము మొదటి నెల ఇరువది నాలుగవ దినమున నేను తిగ్రీసు నదిఒడ్డున నిలిచియుంటిని.
5. నేను పైకి చూడగా నారబట్టలు తాల్చి, మేలిమి బంగారపు నడికట్టు ధరించిన నరుడొకడు కనిపించెను.
6. అతని శరీరము రత్నమువలె మెరయుచుండెను. ముఖము మెరుపువలె మెరయుచుండెను. కన్నులు అగ్నివలె వెలుగుచుండెను. కాలుచేతులు మెరుగు పెట్టిన కంచువలె ప్రకాశించుచుండెను. స్వరము పెద్ద జనసమూహము స్వరమువలెనుండెను.
7. దర్శనమును చూచినవాడను నేనొక్కడినే. నాతోనున్న వారికేమియు కనిపింపలేదు. కాని వారు భయపడి పారిపోయి దాగుకొనిరి.
8. నేను ఒక్కడనే మిగిలియుండి ఆ మహాదర్శనమును చూచితిని. నా బలము సన్నగిల్లెను.నా ముఖరూపము పూర్తిగా మారెను.
9. నేను అతని స్వరమువిని నేలపై బోరగిలపడి స్పృహ కోల్పోతిని.
10. అంతట ఒక చేయి నన్ను పట్టుకొని క్రిందపడియున్న నన్ను మోకాళ్ళ మీదికి, చేతుల మీదికి లేపెను. నేనింకను వణకుచునే యుంటిని.
11. అతడు “దానియేలూ! దేవునికి నీవనిన ఇష్టము. నీవు పైకి లేచి నేను చెప్పునది జాగ్రత్తగా వినుము. దేవుడు నన్ను నీ చెంతకు పంపెను” అనెను. అతడిట్లు పలుకగా నేను లేచి నిలుచుంటిని. కాని యింకను వణకుచునే యుంటిని.
12. అంతటతడు నాతో “దానియేలూ! భయపడకుము. జ్ఞానమును బడయుటకుగాను నీవు దేవుని ఎదుట వినయము ప్రదర్శించిన మొదటినాటి నుండియు ప్రభువు నీ మొరవినెను. నీ ప్రార్థననుబట్టి నేను వచ్చితిని.
13. పారశీక రాజ్యమునకు కావలికాయు దేవదూత ఇరువది ఒక్క దినములు నన్ను ఎదిరించెను. నేను పారశీక దేశమున ఒంటరిగా నుండుట చూచి మిఖాయేలు అను దేవదూత నాకు సాయము చేసెను.
14. నీ ప్రజలకు భవిష్యత్తులో ఏమి జరుగునో నీవు గ్రహించుటకుగాను నేను ఇచ్చటికి వచ్చితిని. ఇది భవిష్యత్తును గూర్చిన దర్శనము” అని అనెను.
15. అతడిట్లు చెప్పగా నేనేమియు బదులు పలుకక నేలవైపు చూడసాగితిని.
16. అంతట నరాకృతిలో నున్న ఆ దేవదూత చేయిచాచి నా పెదవులు ముట్టెను. నేనతనితో అయ్యా! ఈ దర్శనము నన్ను మిక్కిలి బలహీనుని చేసెను. నేను నా వణకును ఆపుకోజాలకున్నాను.
17. నాస్థితి బానిస తన యజమాని ముందు నిలిచియున్నట్లున్నది. నాకు ఊపిరాడుటలేదు. బలమును లేదు. ఇక నేను నీతో ఎట్లు మాట్లాడగలను?” అంటిని.
18. మరల అతడు నన్ను తాకెను. నాకు బలము వచ్చెను.
19. అతడు “దేవునికి నీవు అనిన ఇష్టము కనుక నీవు దేనికి భయపడకుము. చింతింపకుము” అని చెప్పెను. అతడట్లు పలుకగా నాకెక్కువ సత్తువ కలిగెను. నేనతనితో "అయ్యా! నీవు నన్ను ధైర్యపరచితివి, కనుక ఇపుడు నీవు ఆజ్ఞ ఇమ్ము” అని అంటిని.
20-21. అతడిట్లనెను: “నేను నీ చెంతకెందుకు వచ్చితినో నీకు తెలియునా? సత్య గ్రంథమున ఏమి వ్రాయబడియున్నదో నీకు తెలియజేయుటకొరకే. నేనిపుడు తిరిగిపోయి పారశీకదేశమునకు కావలి కాయు దేవదూతతో పోరాడవలెను. తరువాత గ్రీకు దేశమునకు కావలికాయు దేవదూతతో పోరాడవలెను. యిస్రాయేలు దేశమునకు కావలికాయు మిఖాయేలు తప్ప నాకు తోడ్పడువారు ఎవరును లేరు.