1. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లను చున్నాడు: “ఏలయన నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమివలె మండుదినము రాబోవుచున్నది. ఆ రోజు గర్వాత్ములు, దుష్టులు గడ్డివలె కాలిపోవుదురు.వారిలో వేరు అయినను, చిగురు అయినను లేకుండా పోవును.
2. కాని నాయెడల భయభక్తులుజూపు మీపై నీతిసూర్యుడు ఉదయించును. అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలుగజేయును. మీరు శాలలనుండి బయటకువచ్చి బీళ్ళకుపోవు లేగలవలె గంతులు వేయుదురు.
3. ఆనియమిత దినమున మీరు దుష్టుల నణగదొక్కగా వారు మీ కాలిక్రింద ధూళివలె నగుదురు.
4. మీరు నా సేవకుడగు మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును,యిస్రాయేలీయులందరును పాటించుటకుగాను హోరేబు కొండపై నేనతనికిచ్చిన చట్టములను విధులను జప్తియందుంచుకొనుడు.
5. ప్రభువు మహాదినము, ఘోరదినము రాకమునుపే నేను ఏలియా ప్రవక్తను మీయొద్దకు పంపుదును.
6. నేను వచ్చి మీ దేశమును శపించి నాశనము చేయకుండునట్లు, అతడు తండ్రుల హృదయములను బిడ్డలవైపును, బిడ్డల హృదయములను తండ్రుల వైపును మరల్చును.”