ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

malachi 3

1. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు: నా మార్గమును సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును. అపుడు మీరెదురుచూచుచున్న ప్రభువు దిఢీలున దేవళమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శ్రీఘ్రముగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు.

2. కాని అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతనియెదుట నిలబడగలవాడెవడు? అతడు చాకలివాని సబ్బువంటి వాడు. లోహములను శుద్ధిచేయు కంసాలి అగ్నివంటివాడు.

3. అతడు వెండిని పటమువేసి శుద్ధిచేయువానివలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండిబంగారములను పుటము వేసినట్లే ప్రభువుదూత యాజకులను శుద్ధిచేయును. అందువలన వారతనికి యోగ్యమైనబలిని అర్పింతురు.

4. అప్పుడు యూదా, యెరూషలేమువాసులు ప్రభువునకు అర్పించుబలులు పూర్వకాలమునందువలె అతడికి ప్రీతిపాత్రములగును.

5. సైన్యములకధిపతియైన ప్రభువిట్లనుచున్నాడు: “నేను తీర్పుచెప్పుటకుగాను మీ చెంతకురాగా, మాంత్రికుల మీదను, వ్యభిచారుల మీదను, కూటసాక్ష్యము పలుకువారిమీదను, నాకు భయపడక వారి కూలి వారికి జీతము చెల్లింపనివారిమీదను, విధవలను అనాధ శిశువులను పరదేశులను పీడించువారిమీదను, నన్ను గౌరవింపనివారి మీదను బలమైన సాక్ష్య మిచ్చుదును.

6. ప్రభుడనైన నేను మార్పులేనివాడను. కనుకనే యాకోబు వంశజులైన మీరు ఇంకను పూర్తిగా నాశనము కాలేదు.

7. మీ పితరులవలె మీరు నా ఆజ్ఞల నుండి వైదొలిగి వానిని పాటింపరైతిరి. మీరు నా వైపు మరలుడు, నేను మీతట్టు తిరుగుదును. కాని 'నీవైపు మరలవలెనన్న మేమేమి చేయవలయును' అని మీరడుగుచున్నారు.

8. 'దేవుని మోసగించుట ని తగునా?' అని నేను మిమ్ము ప్రశ్నించుచున్నాను. అయినను మీరు నన్ను దోచుకొనుచున్నారు. 'మేము నిన్నెట్లు మోసగించితిమి' అని మీరడుగుచున్నారు. పదియవ వంతు మరియు కానుకలను చెల్లించు విషయమున,

9. మీ ప్రజలందరు నన్ను దోచుకొను చున్నారు. కావున మీరు శాపముపాలగుదురు.

10. మీరు మీ పదియవ పాలును సంపూర్తిగా దేవళమునకు కొనిరండు. అపుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. నేను ఆకాశ ద్వారములు విప్పి ఆశీర్వాదములెల్ల మీపై సమృద్ధిగా కురియింతునో లేదో మీరే చూడవచ్చును.

11. నేను పురుగులు మీ పైరులు తిని వేయకుండునట్లును, మీ ద్రాక్షలు సమృద్ధిగా ఫలించునట్లును చేయుదును.

12. అప్పుడు మీ భూమి ఆనందదాయకమైనదగును. గనుక సమస్త జాతి ప్రజలు మీరు ధన్యులని పలుకుదురు.

13. మీరు నన్ను గూర్చి ఘోరమైన సంగతులు చెప్పితిరని ప్రభువు పలుకుచున్నాడు. కాని 'మేము నిన్నుగూర్చేమి చెప్పితిమి' అని మీరడుగుచున్నారు.

14. మీరు ఇట్లంటిరి: “ప్రభువును సేవించుట నిష్ప్రయోజనము. ఆయన ఆజ్ఞలను పాటించుటవలన లాభమేమి? మేము చేసిన కార్యములకుగాను సైన్యములకధిపతియైన ప్రభువు ఎదుట పశ్చాత్తాపపడుట వలన ప్రయోజనమేమి?

15. మాకు కన్పించునదేమనగా, గర్వాత్ములే సంతోషముగానున్నారు. దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారు. వారు దేవుని సహనమును పరీక్షకు గురిచేసియు, తప్పించుకొని తిరుగుతున్నారు.”

16. అపుడు ప్రభువునకు భయపడువారు తమలో తాము మాటలాడుకొనిరి. అతడు వారి పలుకులు వినెను. ప్రభువునందు భయభక్తులుగలవారి పేర్లు ఆయన సన్నిధిలోనే జ్ఞాపకార్దముగా గ్రంథమున వ్రాయబడెను.

17. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు: “వారు నా ప్రజలగుదురు. నియమింపబడిన దినమున వారునావారై నాకు ప్రత్యేకమైన ఆస్తిగా నుందురు. తండ్రి తనకు ఊడిగముచేయు కుమారునిపట్ల దయజూపినట్లే, నేనును వారిపట్ల దయజూపుదును.

18. అప్పుడు దుర్మార్గులకును సజ్జనులకును ఏమేమి జరుగునో, నన్ను సేవించువారికిని సేవింపనివారికిని ఏమేమిజరుగునో నా ప్రజలు కన్నులారా చూతురు.”