1. సైన్యములకధిపతియగు ప్రభువు యాజకులతో ఇట్లు చెప్పుచున్నాడు: “ఈ ఆజ్ఞ మీ కొరకే.
2. మీ కార్యములద్వారా మీరు నన్ను గౌరవింపవలెను. మీరు నా మాటవినలేని నేను మిమ్ము శాపము పాలుచేయుదును. మీరు భృతి కొరకు స్వీకరించు వస్తువులనుగూడ శపింతును. మీరు నా ఆజ్ఞలను లెక్కచేయుటలేదు కనుక నేను వాని నిదివరకే శపించితిని.
3. నేను మీ బిడ్డలను శిక్షింతును. మీరు బలి ఇచ్చు పశువుల పేడనే మీ మొగములపై పూయుదును. పేడదిబ్బయొద్దకే మీరు ఊడ్చివేయబడుదురు.
4. అప్పుడు నేనే మీకు ఈ ఆజ్ఞను ఇచ్చితినని మీరు గ్రహింతురు. అప్పుడే నేను లేవీ వంశజులైన యాజకులతో చేసు కొనిన నిబంధనము భగ్నముకాదు-సైన్యములకధిపతియగు ప్రభువు వాక్కు ఇది.
5. నా నిబంధనము ద్వారా నేను వారికి జీవమును, క్షేమమును ప్రసాదించితిని. వారు నన్ను గౌరవించుటకుగాను నేను వారికి ఈ భాగ్యముల నొసగితిని. ఆ కాలమున వారు నన్ను గౌరవించిరి, నన్ను చూచి భయపడిరి.
6. వారు ధర్మమునే గాని అధర్మమును బోధింపలేదు. వారు నాకు స్నేహితులుగా జీవించుచూ నీతిని పాటించిరి. ఇతరులను పాపమార్గములనుండి ప్రక్కకు త్రిప్పిరి.
7. దేవుని గూర్చిన జ్ఞానమును బోధించుట యాజకుల బాధ్యత. యాజకులు సైన్యములకధిపతియగు ప్రభువు వార్తావహులు. కనుక ప్రజలు ఉపదేశముకొరకు వారియొద్దకు పోవలెను.
8. కాని యాజకులైన మీరు దారితప్పితిరి. మీరు ధర్మశాస్త్రపరముగ అనేకులకు అభ్యంతరకరముగా ఉండి నేను లేవీయులతో చేసుకొనిన నిబంధనమును మీరు భగ్నముచేసితిరి.
9. మీరు నా చిత్తమును పాటింపరైరి. ప్రజలకు బోధచేయునపుడు అందరిని సమానముగా చూడరైతిరి. కనుక నేను యిస్రాయేలీయులు మిమ్ము తృణీకరించునట్లును, హీనపరుచునట్లును చేయుదును”.
10. మనకందరికి తండ్రి ఒక్కడుకాదా? ఒక్క దేవుడు మనలనందరిని సృజింపలేదా? అటులయిన మనము ఒకరికొకరము ద్రోహము చేసికోనేల? దేవుడు మన పితరులతో చేసికొనిన నిబంధనమును నిర్లక్ష్యము చేయనేల?
11. యూదా ప్రజలు తాము దేవునికి చేసిన వాగ్దానములను నిలబెట్టుకోలేదు. వారు దేశమందంతటను, యెరూషలేమున కూడ ఘోరకార్యము చేసిరి. దేవునికి ప్రీతిపాత్రమైన పవిత్రస్థలమును అపవిత్రము చేసిరి. వారి పురుషులు అన్యదైవముల కొలుచు యువతులను పెండ్లియాడిరి.
12. ఈ కార్యము చేసినవారిని ప్రభువు యాకోబు సమాజము నుండి తొలగించునుగాక'! వారు సైన్యములకధిపతియగు ప్రభువునకు కానుకలు అర్పించు వారి బృందమున చేరకుందురుగాక!
13. మీరు మరల ఈ కార్యమును చేయుచున్నారు. కన్నీళ్ళతోను, ఏడ్పులతోను, శోకాలాపములతోను ప్రభువు బలిపీఠమును తడుపుచున్నారు. కావున ప్రభువు మీరు తెచ్చుకానుకలను అంగీకరించుటలేదు. ఆయన తనకు అనుకూలముకాని అర్పణములను ఎంతమాత్రమును పరిగణింపడు
14. “ఆయన మా కానుకలను ఎందుకు అంగీకరించుట లేదు?” అని మీరు ప్రశ్నించుచున్నారు. ఎందుకనగా నీవు యువకుడిగానున్నప్పుడు పెండ్లియాడిన భార్యకు ద్రోహము చేసితివని ఆయనకు తెలియును. అందులకు ఆమె పక్షమున ప్రభువే సాక్షి. ఆమె నీ సహచరియైనను నీవు ఆమెకిచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. నీవు ఆమెపట్ల విశ్వసనీయుడవుగా మెలగుదునని దేవునియెదుట బాసచేసితివి. ఆ బాసలో ఆమెకూడ నీతోటి పాత్రురాలేకదా! ఆమె నీ నిబంధన భార్యకదా!
15. దేవుడు నిన్ను ఆమెతో ఏకదేహముగను, ఏకాత్మగను చేయలేదా? ఈ ఏకత్వము ఉద్దేశ్యమేమిటి? దైవప్రజలైన మీకు బిడ్డలు కలుగవలెననియే కదా! కనుక మీలో ఎవడును తాను యవ్వనమున పెండ్లి యాడిన భార్యకు ద్రోహము తలపెట్టకుండునుగాక!
16. యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు: “నేను విడాకులను అసహ్యించుకొందును. ఒకడు తన వస్త్రములను హింసతో కప్పుకొనుట ప్రభువు ఏవగించుకొనును. కనుక మీ మనస్సాక్షిని పరీక్షించుకొని విశ్వాసపాత్రులై మీ భార్యలపట్ల క్రూరముగ ప్రవర్తింపకుడు.” ఇది సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కు,
17. మీరు మీ మాటలతో ప్రభువునకు విసుగు పుట్టించితిరి. కాని “మేము అతడికెట్లు విసుగు పుట్టించితిమి?" అని మీరు ప్రశ్నించుచున్నారు. “దుష్కార్యములు చేయువారు ప్రభువు దృష్టిలో మంచి వారు, వారనిన అతనికి ఇష్టము” అని మీరు పలుకుట ద్వారా, “ఇంకను, న్యాయమును జరిగించు దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు?” అని ప్రశ్నించుట ద్వారా కూడ మీరు ప్రభువునకు విసుగు పుట్టించితిరి.