ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

malachi 1

1. ప్రభువు మలాకీ ద్వారా యిస్రాయేలు ప్రజలకు వినిపించిన సందేశమిది:

2. ప్రభువు తన ప్రజలతో “నేను మిమ్ము ఎల్లప్పుడును ప్రేమించుచునే యుంటిని” అని చెప్పుచున్నాడు. కాని వారు “నీవు మమ్ము ఏ రీతిన ప్రేమించితివి?" అని పలుకుదురు. ప్రభువు ఇట్లనును: “ఏసావు, యాకోబునకు అన్నకదా! కాని నేను యాకోబును ప్రేమించితిని.

3. ఏసావును ద్వేషించితిని. ఏసావు పర్వతసీమను నాశనముచేసి వన్యమృగముల పాలుచేసితిని.”

4. ఏసావు వంశజులైన ఎదోమీయులు, శత్రువులు మా పట్టణములను నాశనముచేసిరి. కాని మేము వానిని మరల నిర్మించుకొందుము అని పలికినచో సైన్యములకధిపతియగు ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు. “వారిని తిరిగి కట్టుకోనిండు, నేను ఆ నగరములను మరల కూలద్రోయుదును. ఇతర ప్రజలు ఎదోమీయులను దుష్టదేశమనియు, ప్రభువు సదా కోపించు జాతి అనియు పిల్తురు.

5. యిస్రాయేలీయులు ఈ సంగతినెల్ల తమ కంటితో చూతురు. వారు ప్రభువు యిస్రాయేలు పొలిమేరలకు ఆవల కూడ ఘనుడుగా చలామణి అగుచున్నాడని చెప్పుకొందురు.”

6. సైన్యములకధిపతియగు ప్రభువు యాజకులతో ఇట్లనుచున్నాడు: “కుమారుడు తండ్రిని గౌరవించును, సేవకుడు యజమానుని గౌరవించును, నేను మీకు తండ్రిని. మీరు నన్నేల గౌరవింపరు? నేను మీకు యజమానుడను. మీరు నాకేల భయ పడరు? మీరు నన్ను చిన్నచూపు చూచుచున్నారు. అయినను 'మేము నిన్నేరీతిన చిన్నచూపు చూచితిమి?" అని మీరడగుచున్నారు.

7. నా బలిపీఠముపై అపవిత్రమైన ఆహారమును అర్పించుటద్వారా మీరు నన్ను చిన్నచూపు చూచుచున్నారు. అయినను మీరు 'మేము నిన్నెట్లు కించపరచితిమి?' అని ప్రశ్నించుచున్నారు. 'నా భోజనపుబల్లను హీనపరచుట ద్వారానే' అని నేను చెప్పుచున్నాను.

8. మీరు కుంటిదియో, గ్రుడ్డిదియో, జబ్బుగానున్నది యోయైన పశువును నాకు బలిగా నిచ్చినపుడు అది తప్పుకాదా? మీరు అట్టిదానిని నీ అధికారికి అర్పించినచో అతడు మీపట్ల దయచూపునా? మీ కోర్కెలు తీర్చునా? అని సైన్యములకధిపతియగు ప్రభువు అడుగుచున్నాడు.

9. యాజకులారా! ప్రభువును మీపై దయచూపుమని వేడుకొనుడు. అది మీ వల్లననే జరిగెను కదా! ఇట్టి అర్పణమును అర్పించుట ద్వారా ఆయన మీలో ఎవరినైన అంగీకరించునా? అని సైన్యములకధిపతియగు ప్రభువు చెప్పుచున్నాడు.

10. సైన్యముల కధిపతియగు ప్రభువు ఇట్లు అనుచున్నాడు. మీరు నా బలిపీఠముపై నిరుపయోగముగా నిప్పులను సిద్ధము చేయకుండునట్లు ఎవరైనా దేవాలయ ద్వారములు మూసివేసినచో ఎంత బాగుండును! నాకు మీపై ప్రీతి లేదు. నేను మీ బలులను అంగీకరింపను.

11. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకును నా నామము వివిధ జాతులలో ఘనముగా యెంచబడును. వారు ఎల్లయెడల నాకు సాంబ్రాణి పొగవేసి నిర్మలమైన అర్పణమును అర్పించుదురు. ఏలయన నా నామము సమస్తజాతులలోను ఘనమైనది. సైన్య ములకధిపతియగు ప్రభువు వాక్కు ఇది.

12. కాని మీరు 'నా భోజనపు బల్ల అపవిత్రమైనది' అను మీ మాటలతోనే దానిపైని ఆహారమును హేయమైన దానిగాచేసి దానిని తృణీకరించుచున్నారు.

13. మీరు ఈ కార్యములన్నిటివలన మేము అలసిపోతిమి అనుకొని నా భోజనపుబల్లను తృణీకరించుచున్నారు. నన్ను తేలికభావముతో చూచుచున్నారు. మీరు కుంటి దానినో, జబ్బుగానున్నదానినో, దోచబడినదానినో నాకు బలిపశువుగా కొనివచ్చుచున్నారు. అట్టి అర్పణను మీచేతులనుండి నేను అంగీకరింతునను కొనుచున్నారా? ఇది ప్రభువు వాక్కు

14. నేను ఘనుడనైన మహారాజును. నా నామము సమస్తజాతులయందును భయంకరమైనది అని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నాకు బలియిత్తునని ప్రమాణము చేసిన మగపశువును మందలోనుంచుకొని, లోపముతో గూడిన దానిని అర్పించు మోసగాడు శాపగ్రస్తుడు."