1. ప్రభూ! నీవు మాకు దూరముగా ఉండనేల? ఆపత్కాలమున మా కంటబడకుండ దాగియుండనేల?
2. దుష్టులు అహంకారముతో దరిద్రులను హింసించు చున్నారు. వారు తాము పన్నిన పన్నాగములలో తామే చిక్కుకొందురు గాక!
3. దుష్టుడు తన దురాశలను గూర్చి గొప్పలు చెప్పుకొనును. దురాశాపరుడు ప్రభువును శపించి నిరాకరించును.
4. దుర్మార్గుడు గర్వభావముతో "ప్రభువు నన్ను శిక్షింపడు, అతడేమి పట్టించుకొనడు, దేవుడు లేడు” అని తలంచును.
5. దుర్మార్గుడు పట్టినదెల్ల నెరవేరును. అతడు దేవుని తీర్పును అర్ధము చేసికొనడు. తన విరోధులను అవహేళనము చేయును.
6. నేను కదిలించబడను, ఆపద చూడను,అని అతడు తన హృదయములో అనుకొనును.
7. అతని పల్కులు శాపములు, వంచనలు, బెదరింపులతో నిండియుండును. ద్వేషపూరిత దుష్టవాక్కులు అతడి నోటి నుండి తేలికగా వెలువడును.
8. అతడు మాటు స్థలములో దాగియుండి, నిర్దోషుల మీదికి దుమికి వారిని రహస్యముగా హత్య చేయును.నిస్సహాయులైన వారికై పొంచి చూచుచుండును.
9. సింహమువలె పొదలో దాగుకొనియుండి అభాగ్యుని కొరకు పొంచి చూచుచుండును. వానిని తన వలలో చిక్కించుకొని లాగుకొనిపోవును.
10. అతడు అభాగ్యుని మీదికి దుమికి వానిని వశము చేసికొనును. దుర్బలుడు అతని బలమునకు లొంగిపోవును.
11. 'దేవునికి జ్ఞప్తియుండదు, అతడు ముఖము అటు త్రిప్పుకొని ఎప్పటికి నన్ను చూడదు? అని ఆ దుర్మార్గుడు తలంచును.
12. ప్రభూ! నీవు లెమ్ము! నీ బలము ప్రదర్శింపుము.పీడితులను విస్మరింపకుము.
13. దుష్టుడు దేవుని నిర్లక్ష్యము చేసి, "అతడు నన్ను శిక్షింపడులే అని తలంచుట యుక్తమా?
14. కాని నీవు అన్ని గమనింతువు.నరుల బాధలను, విచారములను తెలిసికొందువు. అభాగ్యులు, అనాథలు నీ మరుగుజొత్తురు.వారికి సహాయము చేసి తప్పక ఆదుకొందువు.
15. ప్రభూ! నీవు దుష్టుల భుజమును విరగగొట్టము. దుష్టులు అదృశ్యమగు వరకు వారిని ఏరివేయుము.
16. ప్రభువు కలకాలము రాజుగా ఉండును.అన్యజాతి వారు అతని దేశమున నశింతురు.
17. ప్రభూ! నీవు పేదల కోరికలు తెలిసి కొందువు. వారికి బలమును ఒసగుదువు. వారి వేడుకోలును ఆలింతువు.
18. అనాథలకు, పీడితులకు న్యాయము చేకూర్తువు. నీవు భూమి మీద వారి భయాందోళనలను తొలగింతువు.
1. యావే! నీ మందిరమున వసింపగల వాడెవడు? నీ పవిత్ర పర్వతము మీద నిలువగల వాడెవడు?
2. నిందారహితముగా జీవించు వాడు, ధర్మమును పాటించు వాడు, హృదయపూర్వకముగా సత్యము పల్కు వాడు,
3. ఇతరుల మీద కొండెములు చెప్పని వాడు, స్నేహితునికి కీడు చేయని వాడు, ఇరుగుపొరుగువారి మీద నిందలు మోపని వాడు,
4. దేవుడు తిరస్కరించినవారిని అనాదరము చేయు వాడు, దైవభక్తులను గౌరవించు వాడు, నష్టము వాటిల్లినను, తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకొనువాడు,
5. అప్పిచ్చి వడ్డీ తీసికొనని వాడు, లంచము పుచ్చుకొనక నిర్దోషులకు అన్యాయము చేయని వాడు. ఇట్టి వానికి హాని జరగదు.
1. నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుంటిని. ఎట్టకేలకు అతడు నా వైపు వంగి, నా వేడుకోలును ఆలించెను.
2. వినాశనకరమైన గోతినుండి, బురదగుంటలనుండి అతడు ఆయన నన్ను బయటికి లాగెను. నన్ను కొండకొమ్మున నిలిపి, నాకు భద్రత కల్పించెను.
3. అతడు నాకు కొత్త పాటను నేర్పెను. అది. ప్రభువును స్తుతించుపాట. ఈ ఉదంతమునెరిగి అనేకులు ప్రభువునకు భయపడుదురు. అతనిని విశ్వసింతురు.
4. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. దబ్బర దైవములను కొలుచు గర్వాత్ములతో చేతులు కలపని జనుడు భాగ్యవంతుడు.
5. నా దేవుడవైన ప్రభూ! నీవు మా కొరకు పెక్కు సత్కార్యములు చేసితివి. మా మేలుకొరకు పెక్కుఆలోచనలు తలపోసితివి. నీ వంటివాడు మరొకడు లేడు. నేను నీ ఉపకారములను వివరింపబూనినచో అవి నేను వర్ణింపగలిగిన . దానికంటే ఎక్కువగా నుండును.
6. నీవు బలిని, సమర్పణమును కోరలేదు. దహనబలిని పాపపరిహారబలిని అభిలషింపలేదు. కాని నీ మాటలు ఆలకించుటకు నాకు చెవులొసగితివి.
7. అప్పుడంటిని: “లేఖనములలో నన్ను గురించి వ్రాయబడినట్లు, ఇదిగో నేను వచ్చియున్నాను.
8. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము , నా యెదలో పదిలముగా నిలిచియున్నది.
9. భక్త సమాజమున నేను నీ రక్షణను ప్రకటన చేసితిని. ప్రభూ! నీ కార్యమును నేను ఏనాడును విస్మరింపనని నీకు తెలియును.
10. నీ రక్షణను గూర్చిన శుభసమాచారమును నేను పదిలముగా దాచియుంచలేదు. నీ నమ్మదగినతనమును, నీ సహాయమును నేనెల్లవేళల జనులకు , తెలియజేయుచునే యుంటిని. నీ కరుణను గూర్చియు, నీ విశ్వసనీయతను గూర్చియు నేను భక్తసమాజమున చెప్పుచునే యుంటిని.
11. కనుక ప్రభూ! నీవు ఏనాడు నా మీద ఎనలేని దయజూపకుండ ఉండజాలవు. ఆ నీ స్థిరమైన ప్రేమయు, విశ్వసనీయతయు నన్ను సదా కాపాడును.
12. నాకు లెక్కింపనలవిగాని ఆపదలు వాటిల్లినవి. నా పాపములు చీకటివలె నన్ను క్రమ్ముకొనినవి. కనుక నేను కళ్ళువిప్పి చూడజాలకున్నాను. నా దోషములు , నా తలమీది వెంట్రుకలకంటె ఎక్కువగానున్నవి. కావున నేను ధైర్యమును కోల్పోయితిని.
13. ప్రభూ! నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. నాకు సాయపడుటకు శీఘ్రమే రమ్ము. "
14. నా ప్రాణములు తీయజూచు వారెల్లరు అవమానమున మునిగి, అపజయము పొందుదురుగాక! నా కీడును జూచి ఆనందించువారెల్లరు సిగ్గుపడి వెనుదిరుగుదురుగాక!
15. నన్నుచూచి 'అహహ' అని ఎగతాళి చేయువారు తలవంపులు తెచ్చుకొని భీతిల్లుదురుగాక!
16. కాని నీ చెంతకు వచ్చు వారందరును పరమానందము చెందుదురుగాక! నీ రక్షణమును అభిలషించువారు అందరును 'ప్రభువు మహాఘనుడు' అని యెల్లవేళల వాకొందురుగాక!
17. ప్రభూ! నేను దరిద్రుడను, దీనుడను నీవు నన్ను జ్ఞప్తియందుంచుకొనుము. నాకు సహాయుడవును, రక్షకుడవును నీవే. కనుక ప్రభూ! జాగుచేయక నన్ను ఆదుకొనుము”.
1. దేవా! సెలయేటి నీటికొ రకు దప్పిగొనిన దుప్పివలె నా హృదయము నీ కొరకు తపించుచున్నది.
2. సజీవుడవగు దేవుడవైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది. ఆ నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది.
3. దివారాత్రములు నా కన్నీళ్ళే నాకు ఆహారమైనవి. నీ దేవుడేడీ అని నిరంతరము జనులు నన్నడుగుచున్నారు.
4. పూర్వపు సంఘటనములు జ్ఞప్తికి వచ్చినపుడు నా హృదయము ద్రవించిపోవుచున్నది. ఎ నేను భక్తబృందములతో కలిసి . దేవళమునకు వెళ్ళెడివాడను. వారు ఆనందనాదముతో స్తుతులు పాడుచు ప్రభువును కీర్తించుచు పోవుచుండగా, నేను ఆ ప్రజలను నడిపించుకొని పోయెడివాడను.
5. నా మనసా! ఇప్పుడింతగా విచారము చెందనేల? ఇంతగా నిట్టూర్పులు విడువనేల? ప్రభువుపై నమ్మకము పెట్టుకొనుము. నీ సహాయకుడు రక్షకుడైన దేవుని మరల స్తుతించుము.
6. ప్రభూ! నేను మానసికవిచారమున మునిగియుండి నిన్ను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. యోర్దాను సీమ నుండి, హెర్మోను పర్వత ప్రాంతము నుండి, మీసారు కొండ చేరువ నుండి ప్రభూ! నేను నిన్ను స్మరించుకొనుచున్నాను. జలపాతములు హోరుమని శబ్దించుచున్నవి.
7. అగాధ జలప్రవాహములు ఒకదానినొకటి పిలుచుకొనుచున్నట్లు ఉన్నవి. వాని కెరటములు నా మీదికి లేచి నన్ను ముంచివేసినవి.
8. పగటిపూట ప్రభువు నన్ను ప్రేమతో చూచునుగాక! రాత్రివేళ నేనతనిని స్తుతించుకీర్తన నాకు తోడుగా ఉండును. నా జీవనదాత దేవునికి అదియే నా స్తుతి ప్రార్ధన.
9. “నీవు నన్ను విస్మరింపనేల? శత్రువుల పీడనము వలన నేను నిరంతరము బాధలు అనుభవింపనేల?” అని నా శిల, అశ్రయనీయుడైన దేవునితో నేను మనవి చేయుదును.
10. బహుబాధాకరమైన గాయపు పోటువలె, నా విరోధులు నిరంతరము నన్ను ఎత్తిపొడుచుచున్నారు. “నీ దేవుడెక్కడ?” అని చులకన చేయుచున్నారు.
11. నా మనసా! ఇప్పుడింతగా విచారము చెందనేల? ఇంతగా నిట్టూర్పులు విడువనేల? ప్రభువుపై నమ్మకము పెట్టుకొనుము. నీ సహాయకుడు రక్షకుడైన దేవుని మరల స్తుతించుము.
1. దేవా! నేను నిర్దోషినని నిరూపింపుము. నీవు నా తరపున వాదించి, భక్తిహీనులైన నరులనుండి నన్ను కాపాడుము. కొండెగాండ్రులను దుష్టులునయిన నరులనుండి నన్ను రక్షింపుము.
2. దేవా! నాకు ఆశ్రయదుర్గమవు నీవే. నీవు నన్నేల చేయి విడచితివి? నా శత్రువుల పీడనము వలన నేను నిరంతరము బాధలనను అనుభవింపనేల?
3. నీ వెలుగును, నీ సత్యమును ఇచటికి పంపుము. అవి నాకు దారిజూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాసస్థలమైన దేవళమునకును నన్ను తోడుకొని పోవునుగాక!
4. అప్పుడు దేవా! నేను నీ బలిపీఠము వద్దకు వత్తును. నాకు పరమానందమును ఒసగువాడవు నీవే. నా దేవుడవైన ప్రభూ! నేను తంత్రీవాద్యము మీటుచు నిన్ను కీర్తింతును.
5. నా మనసా! ఇప్పుడింతగా విచారము చెందనేల? ఇంతగా నిట్టూర్పులు విడువనేల? ప్రభువుపై నమ్మకము పెట్టుకొనుము. నీ సహాయకుడు రక్షకుడైన దేవుని మరల స్తుతించుము.
1. దేవా! నీవు పూర్వము మా పితరుల కాలమున చేసిన మహాకార్యములను గూర్చి మేము చెవులార వింటిమి. మా పితరులు వానిని మాకు విన్పించిరి.
2. నీవు అన్యజాతులను తరిమివేసి , వారి దేశమున నీ ప్రజలను నెలకొలిపితివి. అన్యులను శిక్షించి, నీ వారిని వృద్ధిలోనికి తీసికొని వచ్చితివి.
3. నాడు నీ జనులు ఖడ్గముతో ఈ గడ్డను గెలువలేదు. స్వీయబలముతో విజయమును సాధింపలేదు. నీ బలము వలన, నీ సామర్థ్యము వలన, నీ సాన్నిధ్య ప్రభావము వలన వారికి విజయము సిద్ధించినది. నీ జనులను నీవు కటాక్షించితివి.
4. నాకు రాజువును దేవుడవునైన ప్రభూ! యాకోబునకు విజయము నొసగినది నీవే.
5. నీ శక్తివలన మేము విరోధులను జయించితిమి. నీ నామమున మమ్మెదిరించిన వారిని ఓడించితిమి.
6. నేను నా వింటిని నమ్ముకొనలేదు. నా ఖడ్గము నాకు విజయము సాధించి పెట్టలేదు.
7. నీవే విరోధుల నుండి మమ్ము రక్షించితివి. మమ్ము ద్వేషించువారిని ఓడించితివి.
8. కనుక మేమెల్లవేళల నిన్ను తలంచుకొని గర్వింతుము. సదా నీకు స్తుతులర్పింతుము.
9. కాని నీవు మమ్మిపుడు చేయివిడచి అవమానమున ముంచితివి. "మా సైన్యములతో ఇపుడు పోరునకు పోవైతివి.
10. నీవు మేము మా వైరులకు వెన్నిచ్చి పారిపోవునట్లు చేసితివి. వారు మా సొత్తును కొల్లగొట్టుకొనిపోయిరి.
11. శత్రువులు మమ్ము గొఱ్ఱెలనువలె వధించునట్లు చేసితివి. అన్యదేశములలో మమ్ము చెల్లాచెదరు చేసితివి.
12. నీ ప్రజలను అల్పమూల్యమునకు అమ్మివేసితివి. ఈ అమ్మకము వలన నీకెట్టి లాభమును కలుగదయ్యెను.
13. ఇరుగుపొరుగువారు మమ్ము ! గేలి చేయునట్లు చేసితివి. వారు మమ్ము చూచి నవ్వునట్లు చేసితివి.
14. అన్యజాతులు మమ్ము వెక్కిరించునట్లు చేసితివి. వారు మమ్ము చూచి నిరసనతో తలయాడించుచున్నారు.
15-16. విరోధులు నన్ను నిందింపగా, ప్రతిపక్షులు నన్ను దూషింపగా, నేను నిరంతరము అవమానమునకు గురియగుచున్నాను. అవహేళనము నన్ను పూర్తిగా కప్పివేసినది.
17. మేము నిన్ను విస్మరింపకున్నను, నీవు మాతో చేసికొనిన నిబంధనము మీరకున్నను, మాకీతిప్పలు వచ్చినవి.
18. మేము నిన్ను విడనాడలేదు, . నీ మార్గమునుండి వైదొలగలేదు.
19. ఐనను నీవు మమ్ము నక్కలు తిరుగాడుచోట నిస్సహాయులనుగా వదలివేసితివి. గాఢాంధకారమున పడద్రోసితివి.
20. మేము మా దేవుడైన నిన్ను మరచి అన్యదైవములను కొలిచియున్నచో
21. నరుల హృదయాలలోని రహస్యాలు తెలిసిన నీవు తప్పక గుర్తించి యుండెడివాడవేకదా?
22. ఇప్పుడు నిన్నుబట్టి శత్రువులచేత మేము నిరంతరము వధింపబడుచున్నాము. వారి దృష్టిలో మేము వధకు తగినట్టి గొఱ్ఱెలమైతిమి.
23. ప్రభూ! నీవింకను నిద్రింపనేల? మేల్కొనుము! లెమ్ము! మమ్ము శాశ్వతముగా విడనాడకుము.
24. నీ ముఖమును మాకు కన్పింపకుండ దాచుకోనేల? నీవు మా వ్యధలను హింసలను విస్మరింపనేల?
25. మేము క్రుంగి నేలకు ఒరిగితిమి. విరోధులతో ఓడిపోయి, దుమ్ములో పడియుంటిమి.
26. నీవు లెమ్ము! మమ్మాదుకొనుము! . నీకు మా పట్ల ప్రేమ కలదు కనుక మమ్ము రక్షింపుము.
1. ప్రభువే మనకు ఆశ్రయము, బలమునైనవాడు ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును.
2. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగరగర్భమున కూలినను,
3. సాగరజలములు రేగి ఘోషించి, నురగలు క్రక్కినను, సముద్రజలములు పొంగి కొండలు చలించినను మనము భయపడనక్కరలేదు.
4. మహోన్నతుని పవిత్ర మందిరమును, దేవుని నగరమును, తన పాయలతో ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు.
5. దేవుడా పట్టణమున వసించును గనుక అది నాశనము కాదు. వేకువ జాముననే అతడు పురము నాదుకొనును.
6. అన్యజాతులు ఆర్భాటము చేసిరి, రాజ్యములు చలించెను. కాని ప్రభువు సింహనాదము చేయగా భూమి ద్రవించెను.
7. సైన్యములకు అధిపతియైన ప్రభువు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా నున్నాడు.
8. రండు, ప్రభువు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు.
9. ఆయన నేల నాలుగు చెరగుల పోరులు రూపుమాపును. విల్లులను విరిచివేసి బల్లెములను విరుగగొట్టును. రథములను తగులబెట్టును.
10. “మీరు నిశ్చలముగానుండి, నేను దేవుడనని తెలిసికొనుడు. సకల జాతులలోను సర్వభూమి మీదను నేనే సార్వభౌముడను” అని అతడు వచించుచున్నాడు.
11. సైన్యములకు అధిపతియైన ప్రభువు మనకు అండగా నుండును. యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానుండును.
1. నిఖిల జాతులారా! చప్పట్లు కొట్టుడు. జయజయ నాదములతో ప్రభువును కీర్తింపుడు.
2. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు. అతడు విశ్వధాత్రిని పాలించుమహారాజు.
3. అతడు అన్యజాతులు మనకు లొంగిపోవునట్లు చేయును. వారిని మనకు పాదాక్రాంతులను చేయును.
4. మనకు భుక్తమైయున్న ఈ దేశమును అతడు మనకొరకు ఎన్నుకొనెను. ప్రభువునకు ప్రీతిపాత్రులైన యిస్రాయేలు ప్రజలు ఈ గడ్డను చూచి గర్వపడుదురు.
5. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును.
6. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. మన రాజును కీర్తించి స్తుతింపుడు.
7. అతడు విశ్వధాత్రికిని రాజు. రమ్యముగా కీర్తనలుపాడి అతనిని వినుతింపుడు.
8. ప్రభువు తన పవిత్రసింహాసనమును అధిరోహించి అన్యజాతులను పరిపాలించును.
9. అన్యజాతుల నాయకులువచ్చి అబ్రహాము దేవుని కొలుచు ప్రజలతో కలసిపోవుచున్నారు. భూమి మీద రాజులెల్లరు ప్రభువునకు చెందినవారే. ఆయన మహోన్నతముగా ప్రస్తుతింపబడును.
1. ప్రభువు ఘనుడు. మన దేవుని పట్టణమునను, ఆయన పవిత్ర పర్వతము మీదను ఆ ప్రభువును ఘనముగా కీర్తింపవలయును.
2. దైవనిలయమైన సియోను ఉన్నతమును, సుందరమునైన పర్వతము. విశ్వధాత్రికి అది ప్రమోదము చేకూర్చును. అది ఉత్తర దిక్కునగల మహారాజు నగరము.
3. ఈ నగర దుర్గములందు ప్రభువు తన రక్షణను వెల్లడిచేసెను.
4. రాజులు ఏకమై సియోనుమీదికి దండెత్తి వచ్చిరి.
5. వారు ఆ పురమును జూచి విస్తుపోయిరి, భయపడి పారిపోయిరి.
6. ఆ పట్టణమును గాంచి గడగడ వణకిరి. ప్రసవవేదనము అనుభవించు స్త్రీవలె బాధ చెందిరి.
7. తర్షీషునకు పోవు నావలు తూర్పు గాలికి కంపించునట్లు వారు కంపించిరి.
8. దేవుడు చేసిన కార్యమును మనము ముందే వినియుంటిమి. సైన్యములకు అధిపతియైన ప్రభుని పట్టణమున ఇప్పుడా సంఘటనను కన్నులారా చూచితిమి. దేవుడు ఆ నగరమును కలకాలము కాపాడును.
9. ప్రభూ! మేము నీ దేవాలయమున నీ ప్రేమను ధ్యానించుకొందుము.
10. నీ కీర్తివలె నీ నామము నేల అంచుల వరకు వ్యాపించును. నీ కుడిచేయి విజయముతో నిండియున్నది.
11. నీ తీర్పు, కట్టడలు ధర్మబద్దమైనవి కనుక సియోను పర్వతము, యూదా నగరములు హర్షించును.
12. సియోను చుట్టును తిరిగి దాని బురుజులను లెక్కపెట్టుడు.
13. దాని కోటగోడను గమనింపుడు. దాని దృఢత్వమును పరిశీలింపుడు.
14. అప్పుడు మీరు ఈ దేవుడు కలకాలము మనకు దేవుడగునని రాబోవు తరముల వారికి తెలియచేయ గలుగుదురు. అతడెల్లకాలము మనకు మార్గదర్శియై నడిపించును.
1. సకలజాతి ప్రజలారా! ఈ సంగతిని వినుడు. భూమి మీద వసించు సకల జనులారా! ఈ విషయమును ఆలింపుడు.
2. అధికులు, సామాన్యులు, ధనికులు, పేదలు ఎల్లరును వినుడు.
3. నేను విజ్ఞాన వాక్యములు పలికెదను. నా హృదయ భావములు వివేకము గలవి.
4. నేను సామెతను ఆలించిన మీదట పొడుపుకథను తంత్రీవాద్యముపై పాడి వివరింతును.
5-6. తమ కలిమిని నమ్ముకొని, తమ మహాసంపదలను గూర్చి గొప్పలు చెప్పుకొను దుష్టులైన శత్రువులు నన్ను చుట్టుముట్టగా నాకు వాటిల్లు ఆపదలను గూర్చి నేనేమాత్రము భయపడను.
7. నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణములు నిలబెట్టుకోలేడు. దేవునికి సొమ్ము చెల్లించి అసువులు నిలుపుకోలేడు.
8. నరుడు తన ప్రాణములు నిలుపుకొనుటకు ఎంత మూల్యము చెల్లించినను చాలదు.
9. అతడు శాశ్వతముగా జీవించుటకును, సమాధిగోతిని తప్పించుకొనుటకును, ఎంత సొమ్ము చెల్లించినను చాలదు.
10. జ్ఞానులును గతింతురనియు, బుద్దిహీనులును, మూర్చులునుకూడ చత్తురనియు, ఎల్లరును తమ సొత్తును తమ అనుయాయులకు వదలి పోవలసినదే అనియు నరునికి తెలియును.
11. వారి సమాధులే వారికి శాశ్వత గృహములు. . వారు తమ గోరీలలోనే సదా వసింతురు. ఒకప్పుడు వారికి సొంత భూములున్నను ప్రయోజనము లేదు.
12. నరుని వైభవములు అతని ప్రాణములను కాపాడజాలదు. అతడు వధకు గురియైన మృగమువలె చావవలసినదే.
13. తమ్ము తాము నమ్ముకొనువారికి, తమ సంపదల మీద తాము ఆధారపడు వారికి పట్టు గతి యిట్టిది.
14. మృత్యువే వారికి కాపరియై గొఱ్ఱెలను వలె వారిని పాతాళలోకమునకు తోలుకొని పోవును. ఉదయమున నీతిమంతులు వారిని గెలుతురు. అపుడు వారి ఆడంబరము అంతరించును. పాతాళమే వారికి నివాసమగును.
15. కాని ప్రభువు పాతాళలోకము బారినుండి నా ప్రాణములను కాపాడి, నన్ను స్వీకరించును.
16. ఎవడైనను ధనవంతుడై తన సంపదలను పెంచుకొనెనేని, అతడింటి వైభవము వృద్ధిచెందెనేని నీవు భయపడనక్కర లేదు.
17. అతడు చనిపోయినపుడు ఆ సొత్తును తనవెంట కొనిపోజాలడు. అతని సంపద అతనివెంట పోదు,
18-19. నరుడు తన మనుగడ వలన తాను సంతృప్తి పొందినను, తన విజయములకుగాను తాను ఇతరులనుండి పొగడ్తలు పొందినను, చనిపోయి తన పూర్వులను చేరుకోవలసినదే. అచట కలకాలము వెలుగును కోల్పోవలసినదే.
20. నరుని వైభవములు అతని ప్రాణములను కాపాడజాలవు. అతడు వధకు గురియైన మృగములవలె చావవలసినదే.
1. దేవాధిదేవుడైన ప్రభువు సంభాషించుచున్నాడు. ఆయన తూర్పునుండి పడమరవరకు గల విశ్వధాత్రిని పిలుచుచున్నాడు.
2. సౌందర్యనిధియైన సియోను పట్టణమునుండి ఆయన వెలుగు ప్రకాశించుచున్నది.
3. మన ప్రభువు విచ్చేయును. మౌనముగా నుండడు. ఆయన ముందట సర్వమును దహించు అగ్ని చూపట్టును. ఆయన చుట్టును పెనుతుఫాను వీచుచుండును.
4. ఆయన తన ప్రజలకు తీర్పుచెప్పును. ఆ తీర్పునకు భూమ్యాకాశములను సాక్షులుగా పిల్చును.
5. “బలి అర్పణపూర్వకముగా నాతో నిబంధనము చేసికొనిన నా పవిత్ర ప్రజను ప్రోగుచేయుడు” అని ఆయన ఆదేశించును.
6. ప్రభువు న్యాయవంతుడనియు , ఆయనే స్వయముగా న్యాయము చెప్పుననియు ఆకాశము చాటుచున్నది.
7. “నా ప్రజలారా! నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. యిస్రాయేలీయులారా! నేను మీపై నేరము తెచ్చుచున్నాను. నేను మీ దేవుడనైన ప్రభుడను.
8. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. మీరు నిరంతరము నాకు దహనబలులు అర్పించుచునే ఉన్నారు.
9. అయినను మీ కొట్టములనుండి ఎద్దులుగాని, మీ మందలనుండి మేకపోతులుగాని నాకు అక్కరలేదు.
10. వన్యమృగములు నావే. వేలకొలది కొండలమీది పశువులును నావే.
11. ఆకాశమున ఎగురుపక్షులన్నియు నావే. పొలమున తిరుగాడు జంతువులన్నియు నావే.
12. నాకు ఆకలి వేసినచో నేను మీతో చెప్పను. ఈ జగత్తును దానిలోని సకలవస్తువులును నావేకదా?
13. నేను ఎడ్లమాంసము తిందునా? మేకలనెత్తురు త్రాగుదునా?
14. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులనెడు బలిని అర్పింపుడు. మహోన్నతునికి మీరు చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లింపుడు.
15. అటుపిమ్మట మీ ఆపదలలో మీరు నాకు మొర పెట్టుడు. నేను మీ ఇక్కట్టులు తొలగింతును. మీరు నన్ను కీర్తింపవచ్చును”.
16. కాని దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును: “మీరు నా ఆజ్ఞలను వల్లెవేయనేల? నా నిబంధనమును గూర్చి మాట్లాడనేల?
17. మీరు నా శిక్షణమును అనాదరము చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారుగదా!
18. దొంగ కంటబడగనే మీరు వానితో పొత్తు సేయుదురు. వ్యభిచారులతో సాంగత్యము చేయుదురు.
19. మీరు సులువుగా ఇతరులను ఆడిపోసికొందురు. మీ నాలుక కల్లలాడును.
20. మీరు మీ సోదరులను నిందించుటకుగాను, మీ తల్లి కుమారుని మీదనే తప్పులెన్నుటకుగాను సిద్ధముగానుందురు.
21. మీరిట్టికార్యములు చేసినను నేను మౌనముగానుంటిని. కనుక మీరు, నేనును మీ వంటివాడనే అని యెంచితిరి. కాని మీ ముందర వీటన్నిటిని ఉంచి మిమ్ము గద్దించెదను.
22. నన్ను లెక్కచేయని ప్రజలారా! ఈ విషయమునాలింపుడు, లేదేని నేను మిమ్ము చీల్చివేసెదను. అప్పుడు మిమ్మెవ్వడును రక్షింపలేడు.
23. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతిమార్గమున నడచువానిని నేను రక్షింతును.”
1. ప్రభూ! నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము.
2. నా దోషములనుండి నన్ను పూర్తిగా కడిగి వేయుము. నా పాపములనుండి నన్ను శుద్ధిచేయుము.
3. నా అపరాధములు నాకు తెలియును. నేనెల్లపుడు నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునేయుందును.
4. నీకే, కేవలము నీకే ద్రోహముగా నేను పాపము చేసితిని. నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసితిని. నీవు నాకు తీర్పుచెప్పుట న్యాయమే. నన్ను దోషిగా నిర్ణయించుట సబబే.
5. నేను పుట్టినప్పటినుండియు పాపాత్ముడనే. మా అమ్మ కడుపున పడినప్పటి నుండియు కిల్బిషాత్ముడనే.
6. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము.
7. హిస్సోపు కొమ్మతో నన్ను ప్రక్షాళింపుము. నేను శుద్దుడనగుదును. నన్ను కడుగుము, నేను మంచుకంటె తెల్లనగుదును.
8. నన్ను నీ సంతోషోల్లాసములతో నింపుము. అప్పుడు నీవు నలుగగొట్టిన ఎముకలు సంతసించును.
9. నా దోషముల నుండి నీ మోమును ప్రక్కకు త్రిప్పుకొనుము. నా పాతకములనెల్ల తుడిచివేయుము.
10. దేవా! నాలో నిర్మలహృదయమును సృజింపుము. నూతనమును, స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము.
11. నన్ను నీ సన్నిధినుండి గెంటివేయకుము. నీ పరిశుద్దాత్మను నాలోనుండి తీసివేయకుము.
12. నీ రక్షణానందమును నాకు మరల దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము.
13. అపుడు నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదును. వారు నీ యొద్దకు తిరిగివత్తురు.
14. నా రక్షకుడైన దేవా! నన్ను రక్తాపరాధమునుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును.
15. ప్రభూ! నీవు నా పెదవులను విప్పుము. నేను నీ స్తుతులను ఉగ్గడించెదను.
16. నీవు బలులవలన సంతుష్టిచెందవు. నేను దహనబలి నర్పించినచో నీవు ప్రీతిజెందవు.
17. దేవా! నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగినలిగినట్టిదియు ' వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు.
18. నీవు నెనరుతో సియోనును ఆదుకొనుము. యెరూషలేము గోడలను పునర్నిర్మింపుము.
19. అప్పుడు నీవు దహనబలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలులవలన సంతృప్తి చెందుదువు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలనర్పింతురు.
1. వీరుడా! నీవు నీ చెడ్డ పనులను గూర్చి విఱ్ఱవీగనేల? ప్రభువు నిత్యము కృపజూపును.
2. నీవు దినమెల్లయు ఇతరులను నాశనము చేయుటకు పన్నాగములు పన్నుచున్నావు. నీ నాలుక క్షురకత్తివలె పదునైనది. నీవు ఇతరులకు ద్రోహము తలపెట్టితివి.
3. నీవు మంచికంటె చెడ్డనెక్కువగా అభిలషించితివి. సత్యముకంటె అసత్యమును ఎక్కువగా ఆదరించితివి.
4. మోసపు నాలుక కలవాడా! నీవు నీ పలుకులతో ఇతరులను నాశనము చేయుచున్నావు.
5. కనుక ప్రభువు నిన్ను నిత్య నాశనమునకు గురిచేయును. అతడు నీ ఇంటినుండి నిన్ను మెడబట్టి గెంటివేయును. జీవవంతుల లోకమునుండి నిన్ను పెరికివేయును.
6. ఈ ఉదంతమును జూచి న్యాయవంతులు భయభ్రాంతులగుదురు. వారు నిన్ను పరియాచకము చేయుచు ఇట్లందురు:
7. "ఇడుగో! దేవుని ఆశ్రయింపని నరుడు! ఇతడు తన బహుళ సంపదలను నమ్ముకొనెను. తన దుష్కార్యములే తనకు బలమొసగునని యెంచెను”.
8. నా మట్టుకు నేను దేవుని మందిరమున ఎదుగు ఓలివుచెట్టువలె ఉన్నాను. నేను ప్రభువు కృపను సదా నమ్మెదను.
9. దేవా! నీవు నాకు చేసిన మేలునకుగాను నేను నీకు నిత్యము వందనములు అర్పింతును. మంచితనముగల నీ నామమును భక్తసమాజమున ప్రకటింతును.
1. మూర్ఖులు “దేవుడు లేడు” అని యెంతురు. వారెల్లరును దుష్టులై ఘోరకార్యములను చేసిరి. మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యెను.
2. జ్ఞానముకలిగి తనను వెదకువారు ఎవరైన ఉన్నారేమో చూతమని దేవుడు ఆకసమునుండి నరులవైపు పారజూచును.
3. కాని జనులెల్లరును తప్పుత్రోవ పట్టిరి, ఎల్లరును దుష్టులైరి. మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యెను.
4. నా ప్రజలను భోజనమువలె మ్రింగివేయుచు, దేవునికి ప్రార్థన ఏ మాత్రము చేయని దుష్టులకు జ్ఞానము ఇసుమంతయు లేదా?
5. దేవుడు ఆ భక్తిహీనుల ఎముకలను చిందరవందరచేయును. అచ్చోట ఆ దుష్టులు ఘోరమైన భయమువాత పడుదురు. దేవుడు వారిని నిరాకరింపగా వారు అవమానమున మునుగుదురు.
6. సియోనునుండి యిస్రాయేలును రక్షించు నాథుడెవడు? ప్రభువు తన ప్రజలకు అభ్యుదయము దయచేసినపుడు యాకోబు సంతతియెల్ల సంతసించును. యిస్రాయేలీయులెల్లరు ప్రమోదము చెందుదురు.
1. దేవా! నీ శక్తితో నన్ను రక్షింపుము. నీ బలముతో నాకు న్యాయము చేయుము.
2. దేవా! నా మొర వినుము, నా పలుకులాలింపుము.
3. గర్వితులు నా మీదికి వచ్చుచున్నారు. క్రూరులు నా ప్రాణములు తీయగోరుచున్నారు. వారు దేవుని లక్ష్యము చేయుటలేదు.
4. కాని దేవుడే నాకు సాయము చేయును. ప్రభువే నన్నాదుకొనును.
5. దేవుడు నా శత్రువుల దుష్టత్వమును వారి మీదికే త్రిప్పికొట్టునుగాక! ఆయన నమ్మదగినవాడు కనుక నా విరోధులను నాశనము చేయునుగాక!
6. ప్రభూ! నేను సంతసముతో నీకు బలినర్పింతును. శ్రేష్ఠమైన నీ నామమునకు గాను నీకు వందనములు అర్పింతును.
7. సకల ఆపదలనుండియు నీవు నన్ను కాపాడితివి. నేను నా శత్రువుల ఓటమిని గాంచితిని.
1. దేవా! నా మొర వినుము. నా విన్నపమును పెడచెవిని పెట్టకుము.
2. నా వేడుకోలును ఆలించి నాకు ప్రత్యుత్తరమిమ్ము నేను చింతలవలన మిక్కిలి అలసిపోతిని. శత్రువుల బెదరింపు కేకలకును దుష్టులపీడనకును నేను జంకెదను.
3. వారు నన్ను బాధపెట్టుచున్నారు. నా మీద ఆగ్రహము చెందుచున్నారు.
4. నా హృదయము లోలోపలనే వేదననొందుచున్నది. మృత్యుభయము నన్నావరించినది.
5. నేను భీతితో కంపించుచున్నాను. వెరపు నన్ను చుట్టుముట్టినది.
6. “పావురమునకువలె నాకును రెక్కలుండిన , ఎంత బాగుగానుండెడిది. నేనెగిరిపోయి విశ్రాంతినొందెడివాడనుకదా!
7. దూరముగా ఎగసిపోయి ఎడారిలో వసించెడి వాడనుకదా!
8. వడివడిగా దూసుకొనిపోయి పెనుగాలినుండియు, తుఫానునుండియు తప్పించుకొనెడివాడనుగదా!” అని నేను తలంచితిని.
9. ప్రభూ! నీవు శత్రువులను నాశనముచేసి వారి భాషను తారుమారు చేయుము. పట్టణమున హింసయు కొట్లాటలును కన్పించుచున్నవి.
10. విరోధులు దివారాత్రములు ప్రాకారములమీద నడచుచు, నగరము చుట్టును తిరుగాడుచున్నారు. పట్టణము నేరములతోను, దుష్కార్యములతోను నిండియున్నది.
11. పురము వినాశనమునకు నిలయమైనది. సంతవీధులు పీడనకును, వంచనకును ఆటపట్టులైనవి.
12. విరోధి ఎవడైన నన్ను అవమానించినచో నేను సహించియుండెడివాడను, ప్రత్యర్థి ఎవడైన నన్ను కించపరచినచో నేను అతని కంటబడకుండ దాగుకొనియుండెడి వాడను.
13. కాని నాకు సరిసమానుడవు, సహచరుడవు, చెలికాడవునైన నీవే ఇట్లు చేసితివి.
14. నీవును, నేనును ఆప్యాయముగా సుద్దులు చెప్పుకొనెడివారము. భక్తసమూహముతో గూడి దేవాలయమునకు వెళ్ళెడివారము.
15. మృత్యువు నా శత్రువుల పైకి హఠాత్తుగా దిగివచ్చునుగాక! వారు సజీవులుగానే పాతాళమునకు పోవుదురుగాక! దుష్టత్వము వారి నివాసములో, హృదయములోనున్నది.
16. నా మట్టుకు నేను దేవునికి మొరపెట్టెదను. అతడు నన్ను కాపాడును.
17. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేనతనికి ఫిర్యాదు చేయుచు అంగలార్చెదను. అతడు నా వేడుకోలునాలించును.
18. బహు శత్రువర్గములు నాతో సల్పు పోరాటమున అతడు నా ప్రాణములను సురక్షితముగా కాచికాపాడును.
19. అనాదికాలము నుండియు పరిపాలనము చేయుచున్న దేవుడు నా మొరనాలించి వారిని ఓడించును. ఆ విరోధులు, దేవునికి భయపడరు, పరివర్తనము చెందరు.
20. నాతోటివాడు తన మిత్రులమీదికి దాడిచేసెను. అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోడయ్యెను.
21. అతని పలుకులు వెన్నకంటెను మెత్తగా నుండును. కాని అతని యెదలో ద్వేషమున్నది. అతని మాటలు తైలము పూసినట్లుగా మృదువుగా నుండును. కాని అవి ఒరనుండి వెలికితీసిన కత్తులవంటివి.
22. నీ భారమును ప్రభువు మీద మోపుము ఆయన నిన్ను భరించును. ఆయన సజ్జనుని ఎన్నడును కలత జెందనీయడు.
23. దేవా! నీవు ఆ నరహంతలను, ఆ వంచకులను, వారి ఆయుష్కాలము ఇంకను సగమైనను ముగియకమునుపే లోతైన గోతిలో పడత్రోయుదువు. నేను మాత్రము నిన్నే నమ్మెదను.
1. దేవా! నా మీద దయజూపుము. శత్రువులు నా మీదికి వచ్చుచున్నారు. నిరంతరము నన్ను అణచివేయుచున్నారు.
2. దినమెల్లను విరోధులు నా మీదికి దాడి చేయుచున్నారు. నా మీద పోరాడువారు అనేకులున్నారు.
3. నాకు భయము కలిగినపుడెల్ల నేను నిన్నాశ్రయింతును.
4. నేను దేవుని విశ్వసించి ఆయన వాగ్దానములు నుతింతును. ఆయనను నమ్మి భయమును విడనాడెదను. మానవమాత్రులు నన్నేమి చేయగలరు?
5. నేను దినమెల్ల ఏ పనికి పూనుకొనినను నా విరోధులు నన్ను వేధించుచున్నారు. వారి ఆలోచనలన్నియు నాకు కీడు చేయవలయుననియే.
6. వారెల్లరును ఏకమై రహస్యముగా దాగియుండి నేను చేయుపనులెల్ల పొంచి చూచుచున్నారు. నా ప్రాణములు తీయవలయుననియే వారి కోరిక.
7. ఇట్టి దోషమునకుగాను వారు శిక్షను అనుభవింపవలదా? దేవా! నీ కోపముతో ఆ ప్రజలను నాశనము చేయుము.
8. నీవు నా వేదనలను గుర్తించితివి. నా అశ్రుబిందువులను నీ సీసాలో పోసియుంచితివి? వానిని నీ గ్రంథమున లిఖించలేదా?
9. నేను నీకు మొరపెట్టగానే నా శత్రువులు వెనుదిరిగి పారిపోవుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును.
10. నేను దేవుని విశ్వసించి అతని వాగ్దానమును వినుతింతును. ప్రభువు వాగ్దానమును కీర్తింతును.
11. ఆయనను నమ్మి భయమును విడనాడెదను. మానవమాత్రులు నన్నేమి చేయగలరు?
12. దేవా! నేను నా మ్రొక్కులను చెల్లించుకొందును. నీకు కృతజ్ఞతార్పణమును అర్పింతును.
13. నీవు నన్ను మృత్యువునుండి కాపాడితివి. నా అడుగులు తడబడి పడిపోకుండ రక్షించితివి. కనుక దేవునిసన్నిధిలో నడచెదను. సజీవులమీద ప్రకాశించు వెలుగులో నడయాడెదను.
1. ప్రభూ! నా మీద దయజూపుము, నా మీద దయజూపుము. నేను నిన్నాశ్రయించితిని. అపాయములెల్ల తొలగిపోయిన దాక నేను నీ రెక్కలమాటున దాగుకొందును.
2. నా అక్కరలెల్ల తీర్చువాడును, . మహోన్నతుడునైన దేవునికి నేను మొరపెట్టెదను.
3. అతడు ఆకసమునుండి నా మొర విని నన్ను కాపాడునుగాక! నా మీదికి ఎత్తి వచ్చువారిని అడ్డగించునుగాక! తన కరుణను విశ్వసనీయతను నా చెంతకు పంపునుగాక!
4. నేను సింగముల నడుమ చిక్కుకొంటిని. అవి నన్ను మ్రింగుటకు కాచుకొనియున్నవి. వాటి కోరలు బాణములవలెను, బల్లెములవలెను ఉన్నవి. వాటి నాలుకలు వాడియైన కత్తులవలె ఉన్నవి.
5. దేవా! నీవు మింటికి పైగా ఎగయుము.ఈ భూమినంతటిని నీ తేజస్సుతో నింపుము.
6. విరోధులు నా పాదములకు ఉరులు పన్నిరి. నేను విచారమువలన క్రుంగిపోతిని. వారు నన్ను కూల్చుటకు గోతిని త్రవ్విరి. కాని తాము త్రవ్విన గోతిలో తామే కూలిరి.
7. దేవా! నా హృదయము స్థిరముగా నున్నది, నా హృదయము దృఢముగా నున్నది. నేను నీపై పాటలు పాడి నిన్ను స్తుతింతును.
8. నా ప్రాణమా! మేలుకొనుము! వీణతంత్రీవాద్యము మేల్కొనునుగాక! నేను ఉషస్సును మేలుకొల్పెదను.
9. ప్రభూ! నేను వివిధజాతులనడుమ “నిన్ను వినుతించెదను. బహుజనులనడుమ నిన్ను స్తుతించెదను.
10. నీ కృప ఆకాశమంత ఉన్నతమైనది. నీ విశ్వసనీయత మేఘమండలమంత ఎత్తైనది.
11. దేవా! నీవు మింటికి పైగా ఎగయుము, ధాత్రినంతటిని నీ తేజస్సుతో నింపుము.
1. న్యాయాధిపతులారా! మీరు న్యాయయుక్తముగా తీర్పు తీర్చుచున్నారా? తీర్పు చెప్పుచున్నారా?
2. లేదే, మీ యెదలో పరపీడనము గూర్చియే తలపోయుచున్నారు. మీరు భూమిమీద దౌర్జన్యములు జరుపుచున్నారు.
3. ఈ దుర్మార్గులు పుట్టినప్పటినుండియు పెడత్రోవనే పట్టిరి. తాము జన్మించినప్పటి నుండియు అబద్దములే చెప్పిరి.
4-5. వారికి పామునకువలె విషముండును. పాములు పట్టువాని స్వరమును వినక, నేర్పరియైన మాంత్రికుని మంత్రములకు లొంగక,మొండిదైయుండు నాగుబామువలె వారును చెవులు మూసికొనిరి.
6. దేవా! నీవు వారి మూతిపండ్లు రాలగొట్టుము. ఆ సింగముల కోరలు ఊడబెరుకుము.
7. వారు కారిపోయెడి నీరువలె ఇంకిపోవుదురుగాక! కాలి క్రిందపడి నలిగిపోయెడు గడ్డివలె ఎండిపోవుదురుగాక!
8. తాను స్రవించిన జిగటద్రవంలో తానే కరిగిపోవు నత్తవలెను, గర్భస్రావము కాగా వెలుగునుగాంచజాలని పిండము వలెను నాశనమగుదురుగాక!
9. మీ కుండలు పచ్చివైనను, ఎండినవైనను, వాటికి ముండ్లకంప సెగ తగలకమునుపె, ప్రభువు వారిని పొట్టునువలె ఎగురగొట్టునుగాక!
10. దుర్మార్గులకు పడు శిక్షను జూచి సజ్జనులు సంతసింతురు. ఆ దుష్టుల నెత్తుటిలో తాము కాళ్ళు కడుగుకొందురు.
11. “పుణ్యపురుషులకు బహుమతి లభించుననియు, లోకములో న్యాయముచేయు దేవుడొకడున్నాడు” అనియు జనులు చెప్పుదురు.
1. ప్రభూ! శత్రువుల బారినుండి నన్ను కాపాడుము. నా మీదికి దుమికి వచ్చు వారినుండి నన్ను రక్షింపుము.
2. దుష్టులనుండి నన్నాదుకొనుము. నరహంతలనుండి నన్ను సంరక్షింపుము.
3. వారు నా ప్రాణములు తీయుటకు పొంచియున్నారు. నేనెట్టి పాపముగాని, అపరాధముగాని చేయకున్నను నిష్కారణముగా బలాఢ్యులు ఏకమై నన్నెదిరించుచున్నారు.
4. నా వలన ఎట్టి తప్పు లేకున్నను, వారు నా మీదికి ఎత్తి వచ్చుటకు సంసిద్ధులగుచున్నారు.
5. సర్వశక్తిమంతుడవును, యిస్రాయేలు దేవుడవునైన ప్రభూ! నీవు మేలుకొని, నన్నాదుకొనుము, నా అగచాట్లు నీవే చూడుము. నీవు మేలుకొని అన్యజాతులను శిక్షింపుము. దుష్టులైన ద్రోహులను మన్నింపకుము.
6. వారు సాయంకాలము మరల వచ్చెదరు. కుక్కలవలె మొరుగుచు నగరమున తిరుగాడెదరు.
7. వారి పలుకులు వినుము. వారి నాలుకలు కత్తులవలెనున్నవి. వారు “మా మాటలెవరును వినరులే” అని తలంచుచున్నారు.
8. కాని ప్రభూ! నీవు వారిని చూచి నవ్వుదువు. నీవు అన్యజాతులనెల్ల అపహాసము చేయుదువు.
9. నాకు బలమును దయచేయు దేవా! నేను నిన్నే నమ్ముకొంటిని. నాకు రక్షణ దుర్గమవు నీవే.
10. నన్ను కృపతో చూచు దేవుడు నా చెంతకు వచ్చునుగాక! నేను నా శత్రువుల పతనమును కన్నులార చూతునుగాక!
11. ప్రభూ! జనులు ఆ దుష్టులను విస్మరింపక మునుపే నీవు వారిని సంహరింపుము. మాకు రక్షాకవచమైన ప్రభూ! నీ బలముతో వారిని చెల్లాచెదరుచేసి నాశనము చేయుము.
12. వారి నోటనున్న దోషములు, వారి పెదవుల మీది మాటలు అన్నియు పాపపూరితములే. వారు శాపములు పలుకుచున్నారు, కల్లలాడుచున్నారు. కనుక వారు తమ అహంకారమున తామే చిక్కుకొందురు గాక!
13. నీ కోపముతో వారిని నాశనము చేయుము, సర్వనాశనము చేయుము. అప్పుడు దేవుడు యాకోబును పాలించుచున్నాడనియు లోకమంతటిని ఏలుచున్నాడనియు ఎల్లరును గ్రహింతురు.
14. శత్రువులు సాయంకాలము మరల వచ్చెదరు. కుక్కలవలె మొరుగుచు నగరమున తిరుగాడుదురు.
15. తిండికొరకు ఎల్లయెడల తిరుగుదురు. చాలినంత కూడు దొరకనిచో గొణగుదురు.
16. కాని నేను నీ బలమును ఉగ్గడింతును. ప్రతి ఉదయము నీ కరుణను కీర్తించెదను. నీవు నాకు రక్షణదుర్గముగా నుంటివి. నేను ఆపదలో చిక్కినపుడు నాకు ఆశ్రయమైతివి.
17. నాకు బలమును దయచేయు దేవా! నేను నిన్ను సన్నుతించెదను. నన్ను ప్రేమతో పోషించుదేవుడవు నీవే, స్థిరమైన ప్రేమను చూపించు దేవుడవు నీవే
1. దేవా! మమ్ము విడనాడితివి, మమ్ము ఓడించితివి, మాపై కోపించితివి. ఇపుడు మమ్ము తిరిగి ఉద్దరింపుము.
2. నీవు నేలను కంపింపజేసి ప్రకంపనలు కల్పించితివి. దాని పగుళ్ళను తిరిగి అతికించి సరిదిద్దుము.
3. నీ ప్రజలను ఘోరమైన కష్టములకు గురిచేసితివి. నీవు మాచే త్రాగించిన మద్యము వలన మేము తూలి పడిపోయితిమి.
4. నీ పట్ల భయభక్తులు కలవారిని నీ చెంతకు చేరదీసితివి. వారిని శత్రువుల విల్లుల బారినుండి కాపాడుటకుగాను నీ జెండాను పైకెత్తితివి.
5. నీ ప్రియ ప్రజలు విమోచింపబడునట్లుగా నీ కుడిచేతితో రక్షింపుము.మాకు జవాబునిమ్ము.
6. ప్రభువు తన దేవళమునుండి మనకిట్లు వాగ్దానము చేసెను; “నేను విజయమును సాధించి షెకెమును పంచి పెట్టెదను. సుక్కోతు లోయను విభజించి ఇచ్చెదను.
7. గిలాదు, మనప్పే మండలములు నావే, ఎఫ్రాయీము నాకు శిరస్త్రాణము, యూదా నాకు రాజదండము.
8. మోవాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము ఎదోము మీదికి నా పాదరక్షను విసరుదును. ఫిలిస్తీయాను ఓడించి అందం విజయనాదము చేయుదును”.
9. సురక్షితమైయున్న నగరములోనికి నన్నెవ్వరు కొనిపోగలరు? ఎదోములోనికి నన్నెవ్వరు తీసికొనిపోగలరు?
10. దేవా! నీవు మమ్ము నిజముగనే పరిత్యజించితివా? మా సైన్యముతో నీవిక యుద్ధమునకు పోవా?
11. శత్రువుల బారినుండి నీవు మమ్మాదుకొనుము. నరుల ఆదుకోలు నిరర్ధకము.
12. దేవుడు మన పక్షమున ఉండెనేని మనము శౌర్యముతో పోరాడెదము. అతడు మన శత్రువుల నెల్ల అణగదొక్కును.
1. ప్రభూ! నీవు నా ఆక్రందనమును వినుము. నా వేడుకోలును ఆలింపుము.
2. సొమ్మసిల్లిన యెదతో నేల అంచుల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేని ఉన్నత పర్వతము మీదికి నీవు నడిపింపుము.
3. నాకు ఆశ్రయదుర్గమవు నీవే. శత్రువుల నుండి నన్ను సంరక్షించు కోటవు నీవే.
4. నేను నీ మందిరమున సదా వసింతును. నీ రెక్కల మరుగున తలదాచుకొందును.
5. దేవా! నీవు నా ఋక్కులను అంగీకరించితివి. నీపట్ల భయభక్తులు చూపువారికి లభించు వారసత్వపు భూమిని నాకును దయచేసితివి.
6. నీవు రాజునకు దీర్ఘాయువు దయచేయుము. అతడు పెక్కుతరముల వరకు బ్రతుకునుగాక!
7. నీసన్నిధిలో కలకాలము రాజ్యము చేయునుగాక! నీ స్థిర ప్రేమ, విశ్వసనీయత అతడిని సంరక్షించునుగాక!
8. నేను నిన్ను సదా కీర్తించెదను. ప్రతిదినము నీకు నా మ్రొక్కులు చెల్లించుకొందును.
1. దేవుని యందు మాత్రమే నా ఆత్మ మౌనముగా నిరీక్షించుచున్నది. నాకు రక్షణను ఒసగువాడు ఆయనే.
2. ఆయన నాకు ఆశ్రయశిల, రక్షణకోట కాగా నేనే మాత్రము కలతజెందను.
3. మీరెల్లరు ఎంతకాలము నా ఒక్కని మీదికి దాడిచేయుదురు? ఒరిగియున్న గోడవలెను, వాలియున్న ప్రాకారమువలెను మీరు నన్ను కూలద్రోయజూతురా?
4. నన్ను పదవీభ్రష్టుని చేయవలెననియే మీ కోరిక, కల్లలాడుట మీకు ప్రీతి. మీరు బయటకి నన్ను ప్రేమించు వారివలె దీవించుచున్నారు. లోలోపల మాత్రము నన్ను శపించుచున్నారు.
5. నా ప్రాణము దేవునియందు మాత్రమే మౌనముగా నిరీక్షించుచున్నది. ఆయనయందే నా నమ్మకము.
6. ఆయన నాకు ఆశ్రయశిల, రక్షణకోట కాగా నేనెంత మాత్రము కలతచెందను.
7. నా రక్షణమును, గౌరవమును ప్రభువు మీదనే ఆధారపడియున్నవి. నాకు బలమైన కోటయు, ఆశ్రయుడును ఆయనే.
8. జనులారా! మీరెల్లవేళల ప్రభువును నమ్ముడు. మీ గోడులు ఆయనకు విన్నవించుకొనుడు. మనకు ఆశ్రయనీయుడు ఆయనే.
9. అల్పులైన నరులు, ఊదిన శ్వాసవంటివారు. ఉన్నతులైన మానవులందరు భ్రమవంటివారు. తక్కెడలో పెట్టి తూచినచోవారు పైకి తేలిపోయెదరు, ఊదిన శ్వాసము కంటె తేలికగా తూగెదరు.
10. దౌర్జన్య చర్యల వలన మీరేమియు పొందలేరు. దొంగతనము వలన ఏమియు సాధింపజాలరు. మీ సంపదలు పెరిగినను మీరు వానిని నమ్మరాదు.
11. బలమును, ప్రేమయు తనకు చెందినవని ప్రభువు ఒకమారు సెలవీయగా నేను రెండుమారులు వింటిని.
12. ప్రభూ! స్థిరమైన ప్రేమ నీకే చెందును. నీవు ప్రతినరుని వాని కార్యములకు తగినట్లుగా సంభావింతువు.
1. దేవా! నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు ఉబలాటపడుచున్నాను. నీ కొరకు ఆశగొనియున్నాను. నీళ్ళు లేక ఎండి మాడియున్న నేలవలె నా ప్రాణము నీ కొరకు దప్పికగొనుచున్నది.
2. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలెననియు, నీ శక్తిని, తేజస్సును కన్నులార 'చూడవలెననియు నాకోరిక.
3. నీ అపారప్రేమ ప్రాణముకంటెను శ్రేష్ఠమైనది. కనుక నేను నిన్ను ప్రస్తుతించెదను.
4. నేను జీవించియున్నంత కాలము నిన్ను స్తుతించెదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్ధన చేసెదను.
5. నీ సాన్నిధ్యమున మధురమైన విందును ఆరగించి, . నా ప్రాణము ఆనందమున సంతృప్తి చెందును. నేను సంతసముతో కీర్తనలు పాడుచు, నిన్ను వినుతింతును.
6. నా పడక మీద నిన్ను స్మరించుకొందును. రేయి నాలుగు జాములు నిన్ను ధ్యానింతును.
7. నీవు నాకు సహాయుడవుగా ఉంటివి కనుక నేను నీ రెక్కలనీడలో సంతసముతో పాటలుపాడెదను.
8. నేను నీకు అంటి పెట్టుకొని నడతును. నీ కుడిచేయి నన్ను ఆదుకొనును.
9. నా ప్రాణములు తీయగోరువారు పాతాళమునకు పోవుదురుగాక!
10. వారు కత్తివాత పడుదురుగాక! నక్కలు వారి శవములను పీక్కొని తినును గాక!
11. రాజు దేవునియందు ఆనందించును. దేవుని పేరుమీదుగా ప్రమాణము చేయు వారందరు సంతసింతురు. దేవుడు కల్లలాడు వారి నోళ్ళు మూయించును.
1. దేవా! నేను ఆపదలో చిక్కి నీకు మొరపెట్టుకొనుచున్నాను, వినుము. శత్రుభయము నుండి నన్ను సంరక్షింపుము.
2. దుర్మార్గుల పన్నాగమునుండి నన్ను కాపాడుము. దుష్టబృందముల నుండి నన్ను రక్షింపుము.
3. వారు తమ వాక్కులకు కత్తులకు వలె పదును పెట్టుచున్నారు. క్రూరమైన పలుకులను, బాణములవలె గుప్పించుచున్నారు.
4. చాటున దాగియుండి, భయము ఏ మాత్రములేక, నిర్దోషులమీద దిడీలున అంబులు రువ్వుచున్నారు.
5. తమ దుష్కార్యములను గూర్చి ఒకరి నొకరు హెచ్చరించుకొనుచున్నారు. మోసపూరితమైన కుట్రలను ఎక్కడ పన్నుదమాయని తమలో తాము చర్చించుకొనుచున్నారు. “మనలను ఎవ్వరు చూచెదరు?
6. చెడు పన్నాగములు పన్ని మనము బాగుగా కుతంత్రములు పన్నితిమి” అని చెప్పుకొనుచున్నారు. మనిషి హృదయము మరియు మనస్సు చాలా లోతైనవికదా!
7. కాని దేవుడు వారిమీద తన బాణములు రువ్వును. వారు హఠాత్తుగా గాయపడుదురు.
8. వారి పలుకులకుగాను దేవుడు వారిని నాశనము చేయును. వారిని చూచువారెల్ల ఆశ్చర్యముతో తల ఊపుదురు.
9. అపుడు అందరు భయపడుదురు. దేవుని కార్యములను గూర్చి మాట్లాడుదురు. అతని కార్యములను తలపోయుదురు.
10. పుణ్యపురుషులు దేవుని తలంచుకొని ఆనందింతురు, అతనిని ఆశ్రయింతురు. సత్పురుషులు అతనిని స్తుతింతురు.
1. దేవా! ప్రజలు సియోనున నిన్ను స్తుతింపవలెను. జనులు తమ మ్రొక్కులను నీకు చెల్లించుకోవలెను.
2-3. నీవు నరుల ప్రార్థనలను ఆలింతువు. ప్రజలెల్లరును తమ పాపములతో నీ చెంతకు రావలసినదే. మా పాపములు మమ్ము క్రుంగదీయునపుడు, నీవు వానిని తుడిచివేయుదువు.
4. నీ దేవాలయమున వసించుటకుగాను నీవే ఎన్నుకొని ఆహ్వానించిన నరుడు ధన్యుడు. నీ వాసస్థలమైన పవిత్రమందిరమునందలి మేలివస్తువులతో మేము సంతృప్తి చెందుదుము.
5. మాకు రక్షకుడవైన దేవా! నీవు నా మొరను ఆలింతువు. నీ అద్భుతకార్యములతో మమ్ము రక్షింతువు. నేల నాలుగుచెరగుల వసించువారును, సాగరముల కావల జీవించువారును నిన్నే నమ్ముదురు.
6. నీవు శక్తితో పర్వతములను నెలకొల్పుదువు. బలమును నడికట్టుగా ధరింతువు.
7. నీవు కడలిహోరును అణచివేయుదువు. సాగరతరంగముల ఘోషను ఆపివేయుదువు. జాతుల తిరుగుబాటును అణగదొక్కుదువు.
8. నీ అద్భుతక్రియలను చూచి భూమిమీద నరులెల్లరును భీతిల్లుదురు. తూర్పునుండి పడమరవరకున్న జనులెల్లరు నీ క్రియలనుగాంచి సంతోషనాదము చేయుదురు.
9. నీవు భూమిని సందర్శించి దానిపై వాన కురియింతువు. దానిని మహా ఐశ్వర్యముతో నింపుదువు. నీ నది నీటితో నిండియుండును. అవి ధాన్యమును ఒసగును, నీవు చేసిన కార్యమిది.
10. నీవు కుండపోతగా వాన కురియించి నేల దుక్కులు తడుపుదువు. మట్టి పెళ్ళలను కరిగించి చదునుచేయుదువు. జల్లులతో మట్టిని నానింతువు. ఆ మట్టినుండి మొలచిన మొలకలకు పెంపును ఒసగుదువు.
11. సంవత్సరమును సమృద్ధి ' అను కిరీటముతో అలంకరించితివి. నీవు నడచిన తావులందెల్ల సమృద్ధి నెలకొనెను.
12. ఎడారి పొలములు పచ్చబడినవి. కొండనేలలలో ఆనందము నెలకొనినది.
13. పచ్చిక పట్టులలో గొఱ్ఱెలమందలు వస్త్రము కప్పినట్లుగా ఉన్నవి. లోయలలో గోధుమపైరు కంబళ్ళు పరచినట్లుగా ఉన్నది. ఆ పొలములెల్ల ఆనందముతో పాటలు పాడుచున్నవి.
1. సకల జనులారా! ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు.
2. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపరపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు,
3. “నీ కార్యములు అద్భుతమైనవి. నీ మహాబలమును చూచి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు.
4. లోకములోని ప్రజలెల్లరు నిన్ను పూజింతురు. నిన్ను కీర్తించి స్తుతింతురు. నీ దివ్యనామమును సన్నుతింతురు” అని మీరు ప్రభువుతో నుడువుడు.
5. రండు, ప్రభువు క్రియలను గమనింపుడు. నరులకొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడుడు.
6. ఆయన సముద్రమును ఎండిననేలగా మార్చెను. మన ప్రజలు నది గుండ నడచిపోయిరి. ఆయన కార్యములకుగాను మనమచట ప్రమోదము చెందితిమి.
7. ఆయన సదా పరాక్రమముతో పరిపాలనము చేయును. జాతులనెల్ల ఒక కంట కనిపెట్టియుండును. తిరుగుబాటుదారులు ఎవరును. అతనిని ఎదిరింపకుందురుగాక!
8. అన్యజాతులారా! మీరు మా దేవుని స్తుతింపుడు. మీ స్తుతి ఎల్లయెడల ప్రతిధ్వనించునుగాక!
9. ఆయన మనలను జీవముతో నింపెను. మనలను పడిపోకుండ కాపాడెను
10. దేవా! నీవు మమ్ము పరీక్షలకు గురిచేసితివి. వెండినివలె మమ్ము పుటమువేసి శుద్ధిచేసితివి.
11. నీవు మేము వలలో చిక్కుకొనునట్లు చేసితివి. మా వీపున పెద్ద బరువులు మోపితివి.
12. మా శత్రువులు తమ రథములను మా మీద తోలునట్లు చేసితివి. మేము అనేక కష్టములను అనుభవించితిమి. కాని ఇప్పుడు మమ్ము సురక్షితమైన తావునకు కొనివచ్చితివి.
13. నేను నీ మందిరమున దహనబలులు అర్పించెదను. నా మ్రొక్కులు చెల్లించుకొందును.
14. నేను ఆపదలో ఉన్నపుడు చేసికొనిన మ్రొక్కుబడులను తీర్చుకొందును.
15. గొఱ్ఱెపోతులను నీకు దహనబలిగా అర్పింతును. దహించిన పొట్టేళ్ళ సుగంధమును నీకర్పింతును. కోడెలను, మేకపోతులను నీకు బలి ఇత్తును.
16. దేవునిపట్ల భయభక్తులు గలవారెల్లరు విచ్చేసి వినుడు. మీకెల్లరకు వినిపింతును.
17. నేను ఆయనకు మొర పెట్టుకొంటిని. ఆయనను కీర్తనలతో స్తుతించుటకు సంసిద్ధుడనైతిని.
18. నా హృదయమున దోషము ఉండెనేని ప్రభువు నా వేడుకోలును ఆలించియుండెడివాడు కాడు.
19. కాని ప్రభువు నిశ్చయముగా నా వేడుకోలును అంగీకరించెను. నా మొర వినెను.
20. దేవుడు నా మొరను పెడచెవిన పెట్టలేదు. నాయెడల కృప చూపుటను మానలేదు. ఆయనకు స్తుతికలుగునుగాక!
1. దేవా! మా మీద దయజూపి మమ్ము దీవింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము.
2. అప్పుడు సకలజాతులు నీ మంచితనమును తెలిసికొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసికొనును.
3. దేవా! అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక! సకలజాతులు నిన్ను కొనియాడునుగాక!
4. అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక! నీవు జాతులకు న్యాయముతో తీర్పుతీర్తువు. భూమి మీది జాతులనెల్ల నడిపించునది నీవే.
5. దేవా! అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక! సకలజాతులు నిన్ను కొనియాడునుగాక!
6. పొలము పంట పండినది. దేవుడు, మన దేవుడు, మనలను దీవించెను.
7. దేవుడు మనలను ఆశీర్వదించెను. నేల నాలుగుచెరగుల వరకునుగల జనులెల్లరు అతనిని గౌరవింతురుగాక!
1. దేవుడు లేచునుగాక! ఆయన శత్రువులు చెల్లాచెదరగుదురుగాక! ఆయనను ద్వేషించువారు పారిపోవుదురుగాక!
2. ఆయన వారిని పొగనువలె చెదరగొట్టునుగాక! నిప్పు ఎదుట మైనమువలె దేవుని ఎదుట దుష్టులు కరగిపోవుదురుగాక!
3. కాని నీతిమంతులు దేవునిగాంచి సంతసింతురు. వారు మహానందము చెందుదురుగాక!
4. ప్రభువు మీద పాటలు పాడుడు, ఆయన నామమును కీర్తింపుడు. మేఘములపై స్వారిచేయు దేవునికి మార్గము సిద్ధము చేయుడు. ఆయన పేరు ప్రభువు, ఆయనను జూచి సంతసింపుడు.
5. పవిత్రమందిరమున వసించుదేవుడు అనాథలకు తండ్రి, వితంతువులకు ఆదరువు.
6. దేవుడు ఒంటరివానికి ఇంటినొసగును. బందీలను చెరనుండి విడిపించి వృద్ధిలోనికి తెచ్చును. అతనిమీద తిరుగుబాటు చేయువారు మాత్రము మరుభూమిలో వసింపవలెను.
7. దేవా! నీవు నీ ప్రజలను నడిపించుచు ఎడారిగుండ కదలిపోయినపుడు
8. సీనాయి దేవుడవైన నిన్నుచూచి, యిస్రాయేలు దేవుడవైన నిన్నుగాంచి భూమి కంపించినది, ఆకసము వర్షించినది.
9. నీవు వానను మిక్కిలిగా కురియించి సొలసియున్న నీ వారసత్వపు భూమికి సత్తువను ఒసగితివి.
10. నీ ప్రజలు ఆ నేలమీద నివాసము ఏర్పరచుకొనిరి. ఉదారబుద్దితో నీవు పేదల అక్కరలు తీర్చితివి.
11-12. దేవుడు ఆజ్ఞ ఇచ్చెను. ‘రాజులు వారి సైన్యములతో పారిపోవుచున్నారు” అని చాలమంది వార్త తీసికొనివచ్చిరి. ఇండ్ల పట్టున స్త్రీలు కొల్లసొమ్ము పంచుకొనిరి.
13. వారు గొఱ్ఱెల దొడ్డిలో నివసించినప్పటికి, ఆ ఉవిదలు వెండితో కప్పిన పావురపు రెక్కలవలె నొప్పిరి. తళతళ మెరయు పావురపు 'బంగారు రెక్కలవలె చూపట్టిరి. మీరు మాత్రము గొఱ్ఱెల దొడ్లలో కాలక్షేపము చేసితిరి.
14. అచట మహోన్నతుడైన ప్రభువు రాజులను చెదరగొట్టి, సొలోమోను కొండమీద మంచు కురియించెను.
15. బాషానుకొండ మహాపర్వతము. అది అనేక శిఖరములతో అలరారు పర్వతము.
16. బాషానూ! నీవు నీ ఉన్నత శిఖరములతో దేవుడు స్వయముగా వసింపగోరిన పర్వతమును చిన్నచూపు చూడనేల? ప్రభువు ఆ కొండమీద శాశ్వతముగా వసించును.
17. ప్రభువు వేలకొలది మహారథములతో సీనాయినుండి తన పవిత్రస్థలమునకు ఏతెంచుచున్నాడు.
18. ఆయన చాలమంది బందీలను వెంటగొని తన ఉన్నతపర్వతమును అధిరోహించెను. తిరుగుబాటుచేయు వారినుండి కానుకలు గైకొనెను. దేవుడైన ప్రభువు అచట నివాసము చేయును.
19. దినదినము మన భారములు మోయు ప్రభువునకు స్తుతి కలుగునుగాక! మనలను రక్షించువాడు ఆయనే!
20. మన దేవుడు రక్షణమును దయచేయువాడు. దేవుడైన యావే మనలను మృత్యువు నుండి తప్పించును.
21. ప్రభువు తన విరోధుల శిరములు పగులగొట్టును. దౌష్ట్యమును విడనాడని వారి కపాలములు బ్రద్దలుచేయును.
22. “నేను బాషానునుండి మీ శత్రువులను మరలించుకొని వచ్చెదను. సముద్రగర్భమునుండి వారిని కొనివచ్చెదను.
23. మీ పాదములను వారి నెత్తుటిలో కడుగుదురు. మీ కుక్కలు వారి రక్తమును నాకును” అని ప్రభువు బాసచేసెను.
24. దేవా! నీ ఊరేగింపును ఎల్లరును జూచిరి. నా దేవుడవు నా రాజువైన నీవు దేవాలయమునకు విజయము చేయుచుండగా ఎల్లరును గాంచిరి.
25. అపుడు కీర్తనలు పాడువారు ముందు నడచిరి. తంత్రీవాద్యములు మీటువారు వెనుక వచ్చిరి. తంబురలు వాయించు యువతులు మధ్య నడచిరి.
26. "భక్తసమాజమున ప్రభువును స్తుతింపుడు. యిస్రాయేలు ఊటనుండి ఉద్భవించిన ప్రజలారా! ప్రభువును వినుతింపుడు.”
27. మొదట చిన్నదైన బెన్యామీను తెగ వచ్చును. తరువాత యూదా నాయకులు తమ బృందములతో వత్తురు. అటుపిమ్మట సెబూలూను, నఫ్తాలి అధిపతులు వత్తురు.
28-29. ప్రభూ! రాజులు కానుకలు తెచ్చెడి యెరూషలేములోని నీ మందిరమునుండి నీ బలమును ప్రదర్శింపుము. నీవు మా పక్షమున వినియోగించిన శక్తిని మరల చూపెట్టుము.
30. రెల్లులోని మృగమును చీవాట్లు పెట్టుము. ఎద్దులగుంపును, దూడలను, జనులను మందలింపుము. వారు నీకు దండము పెట్టి తమ వెండిని నీకు అర్పించువరకును నీవు వారిని గద్దింపుము. యుద్ధకాముకులను చెల్లాచెదరు చేయుము.
31. ఐగుప్తునుండి రాయబారులు వత్తురు. ఇతియోపీయులు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయుదురు.
32. లోకములోని రాజ్యములారా! దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు.
33. పురాతనమైన ఆకాశవాహనముపై స్వారిచేయు ప్రభువును కీర్తింపుడు. అతడు మహానాదముతో గర్జించును, వినుడు.
34. ప్రభువు బలమును చాటుడు, ఆయన బలము యిస్రాయేలీయులను క్రమ్మియున్నది. ఆయన శక్తి ఆకసమున తేజరిల్లుచున్నది.
35. దేవుడు తన మందిరమున ఆశ్చర్యకరుడై ఒప్పును. ఆయన యిస్రాయేలు దేవుడు తన ప్రజలకు శక్తిని, బలమును దయచేయువాడు. ఆ దేవునికి స్తుతి కలుగునుగాక!
1. దేవా! నన్ను రక్షింపుము. నీళ్ళు నా గొంతు వరకు వచ్చినవి.
2. నేను ఊబిగుంటలో దిగబడిపోవుచున్నాను. నా పాదములకు గట్టినేల తగులుటలేదు. నేను లోతైన నీళ్ళలోనికి దిగితిని. కెరటములు నన్ను ముంచివేయుచున్నవి.
3. అరచి అరచి నేను అలసిపోతిని. నా గొంతు బొంగురు పోయినది. నీ సహాయము కొరకు చూచిచూచి కన్నులు వాచినవి.
4. నిష్కారణముగా నన్ను ద్వేషించువారు నా తలమీద వెంట్రుకలకంటె ఎక్కువగనేయున్నారు, నా విరోధులు నామీద కొండెములు చెప్పుచున్నారు. వారు బలవంతులు కనుక నన్ను చంపజూచుచున్నారు. నేను అపహరింపని వస్తువును తిరిగి, ఈయమనుచున్నారు.
5. దేవా! నేను చేసిన పిచ్చిపని నీకు తెలియును. నా తప్పిదములు నీవెరుగనివి కావు.
6. సర్వశక్తిమంతుడవైన ప్రభూ! నిన్ను నమ్మువారికి నా వలన తలవంపులు రాకుండునుగాక! యిస్రాయేలుదేవా! నిన్ను వెదకు వారికి నా వలన అవమానము కలుగకుండును గాక!
7. నీ కారణముననే నాకు అవమానము ప్రాప్తించినది. నీ వలననే నేను నిందను తెచ్చుకొంటిని.
8. నా సోదరులకు నేను పరాయివాడనైతిని. నా తోబుట్టువులకు నేను అన్యుడనైతిని.
9. నీ దేవాలయముపట్ల నాకుగల భక్తి నన్ను దహించివేయుచున్నది. నిన్ను నిందించువారి నిందలు నామీద పడినవి.
10. నేను ఉపవాసము చేసి వినమ్రుడనుకాగా, జనులు నన్ను ఆడిపోసికొనిరి.
11. శోకసూచకముగా గోనెతాల్చగా ప్రజలు నన్ను ఎగతాళి చేసిరి.
12. నగరద్వారము వద్ద గుమికూడినవారు నన్ను గూర్చి చెప్పుకొనిరి. త్రాగుబోతులు నా మీద పాటలు కట్టిరి.
13. ప్రభూ! నా మట్టుకు నేను నీకు అనుకూలమైన సమయముననే మనవి చేసికొందును. నీవు మహాకరుణ కలవాడవు. రక్షణమును దయచేయుదువు, అను నమ్మదగినవాడవు. కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము.
14. ఈ ఊబిగుంటలో దిగబడనీకుండ నన్ను కాపాడుము. నా శత్రువులనుండి నన్ను రక్షింపుము. లోతైన నీళ్ళనుండి నన్ను కావుము.
15. జలప్రవాహము నన్ను ముంచివేయకుండునుగాక! అగాధ సముద్రము నన్ను మ్రింగివేయకుండునుగాక! పాతాళము నన్ను కబళింపకుండునుగాక!
16. నీవు మంచివాడవును కృపామయుడవును గనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము. మిగుల జాలికలవాడవు. కనుక నా మొర వినుము.
17. ఈ దాసుని నుండి నీ మొగమును మరుగు చేసికొనకుము. నేను ఆపదలో చిక్కితిని కనుక శీఘ్రమే నాకు ఉత్తరమిమ్ము.
18. నా చెంతకువచ్చి నన్ను రక్షింపుము. నా విరోధులనుండి నన్ను కాపాడుము.
19. నాకు ఎట్టి నిందలు ప్రాప్తించెనో నీకు తెలియును. నాకు అగౌరవము, అవమానము వాటిల్లెనని నీవు ఎరుగుదువు. నా విరోధులనెల్ల నీవు గమనించుచునే ఉన్నావు.
20. పరనిందలు నా హృదయమును ముక్కలు చేసెను. నేను బలమును కోల్పోయితిని. నేను సానుభూతిని ఆశించితిని. కాని అది లభ్యము కాదయ్యెను. ఓదార్పును అభిలషించితిని కాని అది లభింపదయ్యెను.
21. వారు నాకు భోజనమునకు మారుగా విషమును ఒసగిరి. నేను దప్పికగొని యున్నపుడు సిర్కాను ఇచ్చిరి.
22. వారి భోజనపు బల్ల వారికి ఉచ్చు అగునుగాక! వారి ఉత్సవములే వారిని నాశనము చేయునుగాక!
23. వారి కన్నులకు మసకలు క్రమ్మి చూడకుందురుగాక! వారి నడుములు కదలి నిరంతరము ఊగులాడునుగాక!
24. నీ రౌద్రమును వారిపై కుమ్మరింపుము. నీ కోపాగ్ని వారిని తరిమి పట్టుకొనునుగాక!
25. వారి శిబిరములు పాడుపడునుగాక! వారి గుడారములలో ఎవడును వసింపకుండునుగాక!
26. నీవు శిక్షించినవానిని వారు హింసించిరి. నీవు గాయపరచిన వాని బాధలను గూర్చి వారు ముచ్చట్లాడిరి.
27. నీవు వారి పాపములన్నిటిని గణించి ఉంచుము. వారు నీ రక్షణమున పాలుపొందకుండునట్లు చేయుము.
28. సజీవుల గ్రంథమునుండి వారి పేరును కొట్టివేయుదురుగాక! నీతిమంతుల జాబితా నుండి వారి పేరు కొట్టివేయుదురుగాక!
29. నా మట్టుకు నేను దీనుడను బాధామయుడనై ఉన్నాను. ప్రభూ! నీ రక్షణముతో నన్ను ఉద్దరింపుము.
30. నేను గీతములతో ప్రభువును కీర్తించెదను. కృతజ్ఞతాస్తుతులతో ఆయనను శ్లాఘించెదను.
31. ఎద్దునుగాని, ఎదిగిన కోడెనుగాని అర్పించినదాని కంటె ఈ కార్యము ప్రభువునకు ఎక్కువ ప్రీతి కలిగించును.
32. ఈ చెయిదమును చూచి దీనులు సంతసింతురు. దేవుని కొల్చు భక్తులు ఉత్సాహము తెచ్చుకొందురు.
33. ప్రభువు ఆర్తులమొర వినును. ఆయన చెరలోనున్న తన ప్రజలను అనాదరము చేయడు.
34. భూమ్యాకాశములును, సముద్రములును, వానిలోని ప్రాణికోటులును ప్రభుని స్తుతించునుగాక!
35. దేవుడు సియోనును రక్షించును. యూదా పట్టణములను పునర్నిర్మించును. ప్రభుని సేవకులు సియోనున వసించి భూమిని స్వాధీనము చేసికొందురు.
36. ప్రభువు సేవకుల బిడ్డలు ఆ నేలను వారసత్వముగా బడయుదురు. ఆయనను ప్రేమించువారు ఆ తావున వసింతురు.
1. ప్రభూ! నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. నాకు సాయపడుటకు శీఘ్రమే రమ్ము.
2. నా ప్రాణములు తీయజూచువారెల్లరు అవమానమున మునిగి, అపజయము పొందుదురుగాక! నాకు కలిగిన కీడునుచూచి ఆనందించువారు సిగ్గుపడి, వెనుదిరుగుదురుగాక!
3. నన్ను ఎగతాళి చేయువారు తలవంపులు తెచ్చుకొని, భీతిల్లుదురుగాక!
4. కాని నిన్ను వెదకు వారందరును పరమానందము చెందుదురుగాక! నీ రక్షణను అభిలషించువారు అందరును “ప్రభువు మహాఘనుడు” అని ఎల్లవేళల వాకొందురుగాక!
5. దేవా! నేను దరిద్రుడను, దీనుడను. శీఘ్రమే నీవు నా చెంతకు రమ్ము. నాకు సహాయుడవును, రక్షకుడవును నీవే. కనుక ప్రభూ! జాగుచేయక నన్ను ఆదుకొనుము.
1. దేవుడు యిస్రాయేలీయులకు మేలు చేసెను. అతడు విశుద్ధ హృదయులకు మేలు చేసెను.
2-3. గర్వితులను గాంచి అసూయ చెందుటవలనను, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారని గ్రహించుటవలనను నేను ప్రలోభమున చిక్కుకొంటిని. నా పాదములు జారిపడిపోవుట కొంచెములో తప్పినది.
4. ఆ దుష్టులకు ఎట్టి బాధలును లేవయ్యెను. వారు ఆరోగ్యముతో పుష్టిగా నుండిరి.
5. ఇతర నరులవలె శ్రమలను అనుభవింపరైరి. ఇరుగుపొరుగు వారివలె ఇక్కట్టులకు గురికారైరి.
6. కావున వారు అహంకారమను హారమును ధరించిరి, హింస అను వస్త్రమును తాల్చిరి.
7. బలిసిపోయి వారి కన్నులు ఉబ్బిపోవగా హృదయమును కుతంత్రములతో నింపుకొనిరి.
8. ఇతరులను ఎగతాళిచేయుచు చెడుగా మాట్లాడిరి. అహంకారముతో అన్యులను పీడింపనెంచిరి.
9. ఆకాశమువైపు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును.
10. కావున ప్రజలు ఆ దుర్మార్గుల వైపే తిరిగి వారిని పొగడుదురు. వారిలో ఏ దోషమును కనిపెట్టరైరి.
11. “దేవునికి మన సంగతులు ఎట్లు తెలియును? - మహోన్నతునికి జ్ఞానము ఎట్లు అలవడును?” అని ఆ దుష్టుల వాదము.
12. ఇదుగో! దుష్టులు ఇట్టివారు: , వారు సంపన్నులై యున్నారు. రోజురోజునకు ఇంకను సంపన్నులగుచున్నారు.
13. మరి నేను విశుద్దుడనుగా జీవించుటవలన ఫలితమేమి? " ఆ దుష్కార్యములు విడనాడుటవలన లాభమేమి?
14. నేను దినమెల్ల శ్రమలతో వెతచెందితిని.. ప్రతి ఉదయము శిక్షను అనుభవించితిని.
15. "నేనును ఆ దుష్టులవలె మాటలాడెదను” అని అనుకున్నచో నీ ప్రజలకు ఆ తప్పక ద్రోహము చేసియుండెడివాడను.
16. కాని నేను ఈ సమస్యను అర్ధము చేసికోజూచితిని. అది నాకు తలకెక్కదయ్యెను.
17. నేను దేవుని పరిశుద్ధ ఆలయములోనికి పోయి, ధ్యానించినపుడే వారి అంతమునుగూర్చి గ్రహించితిని.
18. నీవు వారిని కాలుజారి , పడిపోవుతావులలో నిలిపితివి. వారికి వినాశము దాపురించునట్లు చేసితివి.
19. ఆ దుష్టులు క్షణకాలములో నాశనమయ్యెదరు. ఘోరవినాశమున కూలి కంటికి కన్పించకుండ పోయెదరు.
20. నిద్రమేలుకొనినవాడు తాను కన్న కలను పట్టించుకోనట్లే ప్రభూ! నీవు నిద్రలేచినపుడు వారిని ఏమాత్రము లక్ష్యము చేయవు.
21. నా హృదయము వ్యధతో నిండిపోయెను. నా అంతరంగము మిగులనొచ్చుకొనెను.
22. నేను మందమతినై విషయము గ్రహింపనైతిని. నీ పట్ల పశువువలె ప్రవర్తించితిని.
23. అయినను నేను నిరంతరము నీకు అంటిపెట్టుకొనియుంటిని. నీవు నా కుడిచేతిని పట్టుకొని నన్ను నడిపించితివి.
24. నీ ఉపదేశముతో నీవు నన్ను నడిపింతువు. కడకు నన్ను నీ తేజస్సులోనికి కొనిపోయెదవు.
25. ఆకాశమున నీవుతప్ప నాకు ఇంకెవరున్నారు? ఈ భూమిమీద నీవు తప్ప మరి ఏమియు నేను కోరుకొనను.
26. నా దేహమును, నా హృదయమును కృశించిపోవుచున్నవి. దేవుడే సదా నాకు ఆశ్రయశిల, నాకు వారసత్వభూమి.
27. కావున నీనుండి దూరముగా వైదొలగువారు చత్తురు. నిన్ను త్యజించువారిని నీవు నాశనము చేయుదువు
28. దేవునిచెంత ఉండుటే నాకు క్షేమకరము. నేను ప్రభువైన దేవుని ఆశ్రయించితిని. అతడు చేసిన కార్యములనెల్ల ప్రకటన చేయుదును.
1. ప్రభూ! మేము నీకు కృతజ్ఞతలర్పింతుము. నీ సామీప్యతనుబట్టి నిన్ను స్తుతింతుము. నీ నామమును ఘనపరతుము. నీ మహా కార్యములను ప్రకటింతుము.
2. “నిర్ణీతదినము వచ్చినపుడు నేను తీర్పుతీర్చెదను. న్యాయయుక్తముగా తీర్పుచెప్పెదను.
3. భూమియు, భూమిమీద వసించువారును గతించినను, నేను భూమి పునాదులను మాత్రము కదలనీయక స్థిరముగా నుంచెదను.
4. నేను గర్వితులతో , మీ ప్రగల్భములు కట్టిపెట్టుడంటిని. దుష్టులతో మీ అహంకారము అణచుకొనుడంటిని
5. మీ మిడిసిపాటును విడనాడుడు, పొగరుబోతుతనముతో మాటలాడకుడు అంటిని” అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
6. న్యాయనిర్ణయము తూర్పునుండిగాని, పడమటినుండిగాని రాదు. ఎడారినుండియైనను హెచ్చింపబడదు.
7. న్యాయము చెప్పువాడు దేవుడే. అతడు కొందరిని తగ్గించి, మరికొందరిని హెచ్చించును.
8. ప్రభువు చేతిలో పానపాత్రము ఉన్నది. దానిలోని ద్రాక్షారసము నురగలు క్రక్కుచున్నది. అది ఔషధ సమ్మిశ్రితమై ఉన్నది. ప్రభువు ఆ రసమును పోయగా దుష్టులెల్ల త్రాగుదురు. దానిని చివరిబొట్టువరకును పీల్చివేయుదురు.
9. నేను నిరంతరము యాకోబు దేవుడైన ప్రభువును స్తుతింతును. ఆయనపై కీర్తనలు పాడుదును.
10. ప్రభువు దుర్మార్గుల బలమును వమ్ముచేసి, సత్పురుషుల బలమును హెచ్చించును.
1. ప్రభువు యూదాలో సుప్రసిద్ధుడు. యిస్రాయేలీయులలో ఆయన నామము ఘనమైనది.
2. షాలేమున అతని గుడారమున్నది. సియోనున అతని నివాసగృహమున్నది.
3. అచట ఆయన శత్రువుల మెరుపు బాణములు, డాళ్ళు, కత్తులు సకలాయుధములు విరుగగొట్టెను.
4. పర్వతముల సౌందర్యముకంటె నీవు మిక్కిలి తేజస్సు గలవాడవు.
5. అచట శూరులైన సైనికులు తమసొమ్ము కొల్లబోగా మరణనిద్ర నిద్రించుచున్నారు. వారి ఆయుధములు వారిని రక్షింపజాలవయ్యెను.
6. యాకోబు దేవా! నీవు గద్దింపగ రథములు, సారథులు దిఢీలున ఆగిపోయిరి.
7. దేవా నీవు భీకరుడవు. నీవు ఆగ్రహము చెందినపుడు నీయెదుట నిలువగల వాడెవడు?
8. నీవు ఆకసమునుండి నీ నిర్ణయములను తెలియచేసినపుడు, లోకములోని పీడితవర్గమును రక్షింపగోరి,
9. నీ న్యాయనిర్ణయములను వెల్లడిచేసినపుడు, భూమి భీతిల్లి నిశ్చలమయ్యెను.
10. నరులు కోపింతురేని వారు నీ ఖ్యాతినే పెంచుదురు. కోపావేశములను నీ నడుముపట్టీగా ధరించుకొందువు.
11. మీరు ప్రభువునకు చేసిన మ్రొక్కుబడులు చెల్లించుకొనుడు. " భీకరుడైన ప్రభువుచుట్టు ప్రోగయిన వారెల్ల ఆయనకు కానుకలు అర్పించుకొనుడు.
12. ఆయన అధిపతుల గర్వము అణచును. భూపతులకు భయము పుట్టించును.
1. నేను ప్రభువునకు బిగ్గరగా మొరపెట్టెదను, స్వరమెత్తి మొరపెట్టెదను, ఆయన నా వేడుకోలును ఆలించును.
2. నేను ఆపదలో చిక్కి ప్రభువునకు మనవి చేసితిని. రేయెల్ల చేతులెత్తి ఎడతెగక ప్రార్థన చేసితిని. అయినను ఉపశాంతిని బడయజాలనైతిని.
3. నేను దేవుని స్మరించుకొని నిట్టూర్పు విడుచుచున్నాను ఆయనను మననము చేయుచు నా ఆత్మ నీరసించిపోయినది.
4. ప్రభువు నా కంటికి కునుకు పట్టనీయలేదు. నేను వ్యాకులముచెంది మాట్లాడజాలనైతిని.
5. నేను పురాతన కాలమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. గతకాలము నాకు గుర్తునకు వచ్చెను.
6. రేయెల్ల ధ్యానముచేసి ఆలోచించి చూచితిని. ఆ మీదట నన్నునేను ఆత్మలో అన్వేషించుకొంటిని.
7. “ప్రభువు నన్ను సదా చేయి విడచునా? ఇక నన్ను ఎప్పటికిని ఆదరింపడా?
8. ఇక నన్ను ప్రేమతో చూడడా? ఆయన వాగ్దానములిక చెల్లవా?
9. దేవుడు తన కరుణను విస్మరించెనా? ఆయన కోపము ఆయన జాలిని అణచివేసెనా?”
10. అంతట నేనిట్లు భావించితిని. 'మహోన్నతుని కుడిహస్తము మారిపోయినది. ఈ విషయము నాకు మిగుల బాధకలిగించుచున్నది.'
11. ప్రభూ! నేను నీ మహాకార్యములను స్మరించుకొందును. పూర్వము నీవు చేసిన అద్భుతములను జ్ఞప్తికి తెచ్చుకొందును.
12. నీ చెయిదములను గూర్చి చింతింతును. నీ చేతలను తలపోసెదను.
13. దేవా! నీ మార్గము పవిత్రమైనది. నీవలె ఘనుడైన దేవుడు ఎవరు?
14. నీవు అద్భుతకార్యములు చేసితివి. . నిఖిల జాతులలో నీ శక్తిని వెల్లడి చేసితివి.
15. యాకోబు యోసేపుల సంతతివారైన నీ ప్రజలను స్వీయబలముతో రక్షించితివి.
16. దేవా! నిన్ను జూచి జలములు భయపడెను. సముద్రాగాధము కంపించెను.
17. మేఘములు వర్షించెను. ఆకాశము గర్జించెను. నలుదిక్కుల నీ బాణములు మెరుపులు మెరిసెను.
18. నీ ఉరుములు గర్జించుచు పరుగిడెను. నీ మెరుపులు లోకమంతటిని వెలిగించెను. భూమి గడగడ కంపించెను.
19. నీవు సాగరముగుండ నడచితివి. లోతైన సముద్రముగుండ సాగిపోయితివి. కాని నీ అడుగుజాడలు మాత్రము కన్పింపరానివి.
20. మోషే అహరోనులద్వారా నీ జనులను మందవలె నడపించుకొని పోయితివి.
1. జనులారా! మీరు నా బోధ వినుడు. నా నోటి పలుకులకు చెవియొగ్గి ఆలింపుడు
2. నేను సూక్తులద్వారా మీతో మాట్లాడెదను. మన పూర్వచరిత్రలోని రహస్యములను మీకు వివరించెదను.
3. మేము విన్న సంగతులు, ఎరిగిన సంగతులు, మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు.
4. ప్రభువు మహాకార్యములు, ఆయన పరాక్రమము, ఆయన అద్భుతకార్యములు మొదలైన అంశములను మన పిల్లలకు తెలియకుండ దాచియుంచరాదు. ఆ సంగతులనెల్ల మన తరువాత తరములవారికి తెలియజేయవలెను.
5. ప్రభువు యాకోబు సంతతికి శాసనములను ఒసగెను. యిస్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రమును దయచేసెను మన పూర్వులు ఆ శాసనములను తమ పిల్లలకు బోధింపవలెననియు,
6. అప్పటికి ఇంకను పుట్టని భావితరముల వారును వానిని నేర్చుకొని మరల తమ బిడ్డలకు నేర్పింపవలయుననియు అతడు ఆజ్ఞాపించెను.
7. ఈ రీతిగా మన ప్రజలు దేవుని నమ్మి అతని కార్యములను జ్ఞప్తియందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు.
8. మన జనులు మన పితరులవలె అవిధేయులై దేవుని మీద తిరుగుబాటు చేయువారు కారాదు. ఆ పితరులు దేవునిమీద ఆధారపడలేదు. ఆయనపట్ల విశ్వాసమును చూపలేదు.
9. విల్లులతో పోరాడు ఎఫ్రాయీము తెగవారు యుద్ధమున వెన్నిచ్చి పారిపోయిరి.
10. వారు దేవుని నిబంధనమును పాటింపలేదు. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపలేదు.
11. వారు ప్రభువు కార్యములను విస్మరించిరి. ఆయన తమకు చూపించిన అద్భుతకార్యములను మరచిపోయిరి.
12. వారి పితరులు చూచుచుండగా ఐగుప్తులోని సోవాను క్షేత్రమున దేవుడు అద్భుతకార్యములను చేసెను.
13. వేరుచేసిన సముద్రము గుండు ఆ పితరులను నడిపించెను. వారికొరకు సాగరజలములను గోడలవలె నిల్పియుంచెను.
14. పగటిపూట మేఘముతోను, రేయెల్ల నిప్పు వెలుగుతోను యాకోబు జనులను నడిపించెను.
15. ఎడారిలో కొండబండలను బ్రద్దలుచేసి త్రాగుటకు వారికి నీరు సమృద్ధిగా ఒసగెను.
16. కొండబండనుండి ఏరు పుట్టించి నీటిపాయను ప్రవహింపచేసెను.
17. కాని వారు దేవునికి ద్రోహముగా పాపము చేయుచు వచ్చిరి. ఎడారిలో మహోన్నతునిమీద తిరుగబడిరి.
18. తమకు నచ్చిన భోజనమును ఒసగుమని దేవుని బుద్ధిపూర్వకముగా సవాలు చేసిరి.
19. “దేవుడు ఎడారిలో భోజనము దయచేయగలడా” అనుచు ఆయనకు వ్యతిరేకముగా మాటలాడిరి.
20. “దేవుడు బండను చరచినపుడు, నీళ్ళు ప్రవాహముగా పారిన మాట నిజమే కాని ఆయన మనకు ఆహారమును కూడ దయచేయగలడా? మాంసమునుగూడ పెట్టగలడా?” అని పలికిరి.
21. ఆ పలుకులు ఆలించి ప్రభువు కోపించెను. ఆయన అగ్ని యాకోబు వంశమును దహించెను. ఆయన కోపము యిస్రాయేలు మీద విరుచుకొనిపడెను.
22. ఆ జనులు దేవుని నమ్మరైరి. . ఆయన తమను రక్షించునని విశ్వసింపరైరి.
23. అయినను ఆయన ఆకాశమునకు ఆజ్ఞను ఒసగెను. అంతరిక్ష కవాటములను తెరచెను.
24. ఆ ప్రజలకు అహారముగా మన్నానుకురియించెను ఆకసమునుండి వారికి ఆహారమును ఒసగెను.
25. నరులు దేవదూతల ఆహారమును ఆరగించిరి. ఆయన వారికి సమృద్ధిగా ఆహారమును దయచేసెను
26. ఆయన ఆకాశమునుండి అమలు తూర్పుగాలిని తోలించెను. తన శక్తితో దక్షిణవాయువును పంపెను.
27. ధూళివలెను కడలి ఒడ్డునున్న యిసుక రేణువుల వలెను, తన ప్రజలమీదికి పక్షులను విస్తారముగా పంపెను.
28. అవి ప్రజలు వసించు శిబిరము మధ్య వారి గుడారముల చుట్టునువాలెను.
29. ప్రజలు ఆ పక్షుల మాంసము భుజించి సంతృప్తి చెందిరి. ప్రభువు వారు కోరుకొనిన భోజనమును దయచేసెను.
30. కాని వారి కోరిక తీరకమునుపే, ఆ భోజనము ఇంకను వారి నోటనుండగనే
31. ప్రభువు కోపము వారిమీద విరుచుకొనిపడెను. వారిలో బలాఢ్యులు చచ్చిరి. యిస్రాయేలీయులలో యువకులు నేలకొరిగిరి.
32. ఇన్ని వింతలు జరిగినను జనులు పాపములు విడనాడలేదు. . ప్రభువు అద్భుతములను నమ్మలేదు.
33. కనుక ప్రభువు వారి దినములు శ్వాసమువలె అదృశ్యమగునట్లు చేసెను. వారి ఆయుషు ఆకస్మికమైన విపత్తుల వలన గతించిపోవునట్లు చేసెను.
34. ప్రభువు ఆ ప్రజలను సంహరింప పూనుకోగా వారు ఆయనను శరణువేడిరి. పశ్చాత్తాపపడి భక్తితో ఆయనను ఆశ్రయించిరి.
35. ప్రభువు తమకు ఆశ్రయశిలా దుర్గమనియు, మహోన్నతుడు తమకు విమోచకుడనియు జ్ఞప్తికి తెచ్చుకొనిరి.
36. కాని వారి మాటలన్నియు వట్టి ముఖస్తుతులు. వారి పలుకులన్నియు బొంకులు.
37. వారి హృదయములు ప్రభువుమీద లగ్నము కాలేదు. వారు ఆయన నిబంధనమును పాటింపలేదు.
38. కాని దేవుడు జాలితో వారి తప్పిదములు మన్నించి వారిని మట్టుపెట్టడయ్యెను. అతడు పలుమారులు తన ఆగ్రహమును అణచుకొనెనేగాని, దానినెంత మాత్రము విజృంభింపనీయడయ్యెను.
39. ఆ జనులు కేవలము నరమాత్రులనియు, ఒకసారి వీచి వెడలిపోయి మరల తిరిగిరాని గాలివలె కేవలము క్షణమాత్ర జీవులనియు అతడు జ్ఞప్తికి తెచ్చుకొనెను.
40. వారు ఎడారిలో ఆయనమీద ఎన్నిసార్లు తిరుగబడలేదు? ఆ మరుభూమిలో ఆయన మనసు ఎన్నిసార్లు కష్టపెట్టలేదు.
41. పలుసార్లు ప్రభువును పరీక్షకు గురిచేసిరి. పవిత్రుడైన యిస్రాయేలు దేవుని మనస్సును చివుక్కుమనిపించిరి.
42. ఆయన శక్తి ఎటువంటిదియో మరచిపోయిరి. ఆయన శత్రువులనుండి తమను విడిపించుటను విస్మరించిరి.
43. ఐగుప్తున ఆయన చేసిన అద్భుతములను సోవాను నగర ప్రదేశమున ఆయన చేసిన అసమాన అద్భుత క్రియలను గుర్తునకు తెచ్చుకోరైరి.
44. ప్రభువు ఐగుప్తీయుల నదులను నెత్తురుగ మార్చెను. కనుక ఆ ప్రజలు వారి యేరుల నుండి నీరు త్రాగలేకపోయిరి.
45. అతడు వారిమీదికి ఈగలను పంపగా అవి వారిని బాధించెను. కప్పలను పంపగా అవి వారిని నాశనము చేసెను.
46. వారి పొలములలోని పంటలను చీడపురుగులపాలు చేసెను. ఆ వారి కాయకష్టము మిడుతల వాత పడునట్లు చేసెను.
47. వారి ద్రాక్షలను వడగండ్లతోను అత్తి చెట్లను మంచుతోను పాడుచేసెను.
48. వారి పశువులను వడగండ్లతోను, మందలను మెరుపులతోను నాశనము చేసెను.
49. భీకరమైన తన కోపాగ్నితో ఆ ప్రజలను పీడించి కడగండ్లపాలు చేసెను. వినాశదూతలను వారి మీదికి పంపెను.
50. అతడు తన కోపమును అణచుకోలేదు. ఆ ప్రజలను ప్రాణములతో వదలివేయలేదు. వారు అంటురోగముల వాతపడునట్లు చేసెను.
51. ఐగుప్తులోని తొలిచూలు పిల్లల నెల్ల హాము గుడారములోని బలమైన ప్రథమ సంతానమునెల్ల సంహరించెను.
52. తన ప్రజలను గొఱ్ఱెల మందనువలె నడిపించుకొనిపోయెను. ఎడారిగుండ వారిని తోడ్కొనిపోయెను.
53. అతడు ఆ ప్రజలను సురక్షితముగా కొనిపోగా వారు భయపడరైరి. వారి శత్రువులు మాత్రము సముద్రమున మునిగిపోయిరి.
54. ప్రభువు ఆ ప్రజలను తన పవిత్ర పర్వతమునకు కొనివచ్చెను. తాను స్వయముగా జయించిన కొండనేలకు తీసికొని వచ్చెను.
55. తన ప్రజల ప్రక్క వసించు స్థానిక జాతులను తరిమివేసెను, యిస్రాయేలు తెగలకు వారసత్వపు భూమిని పంచియిచ్చెను. - ఆ తెగలవారు ఆ నేలమీద గుడారములు పన్నుకొనునట్లు చేసెను.
56. అయినను వారు మహోన్నతుడైన దేవుని మీద తిరుగబడిరి, అతని ఆజ్ఞలను మీరిరి.
57. తమ పితరులవలె విశ్వాసఘాతకులై తిరుగుబాటు చేసిరి. వంకరవిల్లువలె మోసగాండ్రయిరి.
58. కొండలమీద అన్యుల గుళ్ళు కట్టి దేవుని కోపమును రెచ్చగొట్టిరి. విగ్రహములను కొల్చి ఆయనను అసూయకు గురిచేసిరి.
59. ఈ చెయిదములెల్ల చూచి దేవుడు కోపించెను. యిస్రాయేలును పూర్తిగా విడనాడెను.
60. అతడు షిలో నగరములోని తన గుడారమును, ప్రజలనడుమ తాను వసించిన నివాసమును త్యజించెను.
61. తన బలముగా వెలుగొందు మందసమును ప్రవాసమునకు అప్పగించెను. తన తేజస్సయిన మందసమును శత్రువులపాలు చేసెను.
62. తన ప్రజలమీద ఆగ్రహము తెచ్చుకొని, వారు విరోధుల కత్తికి బలియగునట్లు చేసెను.
63. యుద్ధములందు అగ్ని వారి యువకులను దహించివేసెను. వారి యువతులను పరిణయమాడువారు లేరైరి.
64. వారి యాజకులు కత్తివాతపడిరి. వారి వితంతువులు తమ భర్తలకొరకు శోకింపజాలరైరి.
65. అంతట ప్రభువు నిద్రించువాడు మేల్కొనినట్లుగా మేలుకొనెను. మధువును సేవించిన వీరునివలె ఆవేశము తెచ్చుకొనెను.
66. ఆయన శత్రువులను వెనుకకు తరిమికొట్టి శాశ్వత అవమానమునకు గురిచేసెను.
67. ప్రభువు యోసేపు సంతతిని నిరాకరించెను. ఎఫ్రాయీము వంశజులను ఎన్నుకోడయ్యెను.
68. వారికి బదులుగా యూదా తెగను అంగీకరించెను తనకు ప్రీతిపాత్రమైన సియోను కొండను ఎన్నుకొనెను.
69. ఆకాశములోని తన నివాసమునకు పోలికగా ఆ కొండమీద దేవాలయమును కట్టించెను. అది ఎల్లకాలము భూమివలె స్థిరముగా నిల్చియుండునట్లు చేసెను.
70. ఆయన తన దాసుడైన దావీదు నెన్నుకొనెను. గొఱ్ఱెలను కాచుచుండగా అతనిని పిలిపించెను.
71. గొర్రెపిల్లలను మేపుచుండగా అతనిని రప్పించెను. తన సొంత ప్రజలును తాను ఎన్నుకొనినవారునైన యాకోబు ప్రజమీద అతనిని కాపరిగా నియమించెను.
72. దావీదు యదార్ధహృదయుడై ఆ ప్రజలను పాలించెను. నేర్పుతో వారిని నడిపించెను.
1. దేవా! అన్యజాతి ప్రజలు నీ దేశము మీదికి దండెత్తి వచ్చిరి. వారు నీ పవిత్రమందిరమును అమంగళము చేసిరి. యెరూషలేమును ధ్వంసము చేసిరి.
2. నీ దాసుల శవములను పక్షులకు ఆహారము కావించిరి. నీ భక్తుల ప్రేతములను వన్యమృగములకు తిండి గావించిరి.
3. యెరూషలేమునందంతట నెత్తుటిని నీటివలె ఒలికించిరి. పీనుగులను పాతిపెట్టు వాడెవడును లేడయ్యెను.
4. మా చుట్టుపట్లనున్న అన్యజాతివారు మమ్ము అవమానించుచున్నారు. మా ఇరుగుపొరుగువారు మమ్ము గేలిచేసి నవ్వుచున్నారు.
5. ప్రభూ! నీవు ఎంతకాలము మాపై కోపింతువు? కలకాలమునా? నీ ఆగ్రహము అగ్నివలె మండుచుండవలసినదేనా?
6. నిన్ను ఎరుగని అన్యజాతులమీదను, నీకు ప్రార్థన చేయని రాజ్యములమీదను నీ కోపమును కుమ్మరింపుము.
7. ఆ ప్రజలు యాకోబు జనులను సంహరించిరి. వారి నివాసమును నాశనము చేసిరి.
8. మా పూర్వుల పాపములకుగాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి.
9. మాకు రక్షకుడవైన దేవా! నీ నామ కీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము.
10. అన్యజాతి జనులు “మీ దేవుడు ఏడీ” అని మమ్మడుగనేల? వారు నీ దాసుల నెత్తురు ఒలికించిరిగాన నీవా ప్రజలను శిక్షింపగా మేము కన్నులార చూడగోరెదము.
11. చెరలో ఉన్న వారి నిట్టూర్పులు నీకు విన్పించునుగాక! నీ మహాబలముతో మృత్యువువాత పడనున్నవారిని విడిపింపుము.
12. అన్యజాతులవలన నీకు కలిగిన అవమానమునకుగాను నీవు వారికి ఏడంతలుగా ప్రతీకారము చేయుము
13. నీ ప్రజలమును, నీ మందయునైన మేము నీకు సదా కృతజ్ఞత తెల్పుకొందుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము.
1. యిస్రాయేలు కాపరీ! మా మొర వినుము. నీ యోసేపు ప్రజలను మందవలె నడిపించిన నీవు మా వేడుకోలును ఆలింపుము
2. నీవు కెరూబులను దూతల మీద ఆసీనుడవైయుండి ఎఫ్రాయీము, బెన్యామీను, మనష్షే తెగలమీద నీ వెలుగును ప్రసరింపచేయుము. నీ పరాక్రమమును చూపి మమ్ము రక్షించుటకు రమ్ము.
3. దేవా! మమ్ము ఉద్దరింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసెదవేని మేము రక్షణమును బడయుదుము.
4. యావే! సైన్యములకధిపతియైన దేవా! నీవెంతకాలము కోపముతో నీ ప్రజల ప్రార్థనను నిరాకరింతువు?
5. నీవు మా అశ్రువులే మాకు ఆహారము కావించితివి. చాలా కన్నీళ్ళే మాకు పానీయము కావించితివి.
6. మా ఇరుగుపొరుగువారు మా దేశముకొరకు పోట్లాడుకొనునట్లును, మా విరోధులు మమ్ము అపహాస్యము చేయునట్లును చేసితివి.
7. సైన్యములకధిపతియైన దేవా! మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసెదవేని మేము రక్షణమును బడయుదుము.
8. ఐగుప్తునుండి నీవొక ద్రాక్షతీగను గొనివచ్చితివి. అన్యజాతులను వెళ్ళగొట్టి వారి దేశమున దానిని నాటితివి.
9. ఆ తీగ పెరుగుటకు నేలను సరిచేసితివి. అది వేరుపారి నేలయందు అంతట అల్లుకొనెను.
10. దాని నీడ కొండలను కప్పెను. దాని కొమ్మలు ఉన్నతములైన దేవదారుల మీదికి ఎగబ్రాకెను.
11. దాని తీగలు మధ్యధరా సముద్రమువరకు వ్యాపించెను. దాని రెమ్మలు యూఫ్రటీసు నదివరకు సాగెను.
12. దానిచుట్టునుగల గోడను నీవు ఏల పడగొట్టించితివి? ఇపుడు దారిన పోవువారు దాని పండ్లను అపహరింతురు.
13. అడవి పందులు దానిని కాళ్ళతో తొక్కివేయును. వన్యమృగములు దానిని తినివేయును.
14. సైన్యములకధిపతియైన దేవా! నీవు మావైపు మొగము త్రిప్పుము. ఆకాశమునుండి మావైపు పారచూడుము. ఈ ద్రాక్షతీగయొద్దకు వచ్చి దీనిని కాపాడుము.
15. నీవు స్వయముగా నాటిన ఈ తీగను, నీవు బలసంపన్నుని చేసిన నీ ఈ పుత్రుని సంరక్షింపుము.
16. మా శత్రువులు దానిని నరికి నిప్పులో పడవేసిరి. నీ ఆగ్రహమును వారిపై ప్రదర్శించి వారిని నాశనము చేయుము.
17. నీ కుడిప్రక్కన ఉన్న వానిని కాపాడుము. నీవు బలాఢ్యుని చేసిన వానిని రక్షింపుము.
18. మేము మరల నిన్ను విడనాడము. మమ్ము ప్రాణములతో బ్రతుకనిమ్ము, మేము నిన్ను స్తుతింతుము.
19. యావే! సైన్యములకధిపతియైన దేవా! మమ్ము ఉద్దరింపుము. నీ ముఖకాంతిని మామీద ప్రకాశింపజేసెదవేని మేము నీ రక్షణమును బడయుదుము.
1. మనకు బలమైన ప్రభువు పేర ఆనందనాదము చేయుడు. యాకోబు దేవుని పేర ఉత్సాహనాదము చేయుడు.
2. గీతము పాడుచు తప్పెటలు వాయింపుడు. స్వరమండలములను, సితారలను మీటి శ్రావ్యమైన సంగీతము విన్పింపుడు.
3. అమావాస్యనాడు, పూర్ణిమనాడు పండుగను సూచించుచు కొమ్మును ఊదుడు.
4. ఇది యిస్రాయేలీయులకు చట్టము. ఇది యాకోబు దేవుడు నిర్ణయించిన ఆజ్ఞ.
5. ప్రభువు ఐగుప్తుమీదికి యుద్ధమునకు పోయినపుడు యోసేపునకు ఈ కట్టడను విధించెను. నేను గుర్తింపజాలని స్వరము ఒకటి నాకు ఇట్లు విన్పించినది:
6. “మీ భుజముల మీదినుండి బరువును దింపినది నేనే మీ చేతులలోనుండి గంపలను తొలగించినది నేనే
7. మీరు ఆపదలోనుండి నాకు మొర పెట్టగా నేను మిమ్ము ఆదుకొంటిని. ఉరుము దాగుకొను స్థలములోనుండి మీకు బదులు ఇచ్చితిని. మెరీబా జలములవద్ద మిమ్ము పరీక్షించితిని.
8. నా ప్రజలారా వినుడు! నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. అయ్యో! యిస్రాయేలీయులారా! మీరు నా మాటవినిన ఎంత బాగుండును.
9. మీరు అన్యదైవమును కొలువరాదు. పరదైవమునకు మ్రొక్కకూడదు.
10. నేను మీ దేవుడనైన ప్రభుడను. నేను ఐగుప్తుదేశమునుండి మిమ్ము తోడ్కొనివచ్చినవాడను. మీరు నోరు తెరచిన చాలు. నేను మీకు చాలినంత భోజనము పెట్టెదను.
11. కాని నా ప్రజలు నామాట వినుటలేదు. యిస్రాయేలీయులు నాకు అవిధేయులుగా ఉన్నారు
12. కనుక నేను వారిని తమ మొండిపట్టునకు వదలివేసితిని. వారిని తమ ఇష్టము వచ్చినట్లు చేయనిచ్చితిని.
13. నా ప్రజలు నా మాట వినిన ఎంత బాగుండును! యిస్రాయేలీయులు నా మార్గములలో నడచిన ఎంత బాగుండును!
14. నేను వేగిరమే వారి శత్రువులను ఓడించియుందును వారి విరోధులను జయించియుందును.
15. యావేను ద్వేషించువారు ఆయనకు దండము పెట్టియుందురు. వారికి శాశ్వతముగా శిక్షపడియుండెడిది.
16. నేను మిమ్ము మేలైన గోధుమలతో పోషించియుందును. కొండతేనెతో సంతృప్తిపరచి ఉందును.”
1. దేవుడు దేవలోకసభకు అధ్యక్షత వహించియున్నాడు. ఆ దైవముల నడుమనుండి , అతడు తీర్పుచెప్పుచున్నాడు.
2. అన్యాయపు తీర్పుతీర్చుటను, దుష్టులపై పక్షపాతము చూపుటను మీరిక మానుకొనుడు.
3. పేదలకును, అనాథలకును అనుకూలముగా తీర్పుచెప్పుడు. దీనులకును, దరిద్రులకును న్యాయము చేకూర్చి పెట్టుడు.
4. బడుగువారిని, అక్కరలోనున్నవారిని ఆదుకొనుడు వారిని దుర్మార్గుల బారినుండి రక్షింపుడు.
5. మీరు అజ్ఞానులు, మూర్ఖులు, అంధకారమున నడచువారు మీరు నేలపునాదులుకూడ ను ధ్వంసము చేయుచున్నారు.
6. "మీరును దైవములే” అనియు , “మీరెల్లరును యావే పుత్రులే” అనియు నేను వచించితిని.
7. అయినను అందరు నరులవలె మీరును చత్తురు. అందరు అధికారులవలె మీరును కూలుదురు.
8. దేవా! లెమ్ము. భూమికి తీర్పు చెప్పుము. అన్యజనులందరు నీకే భుక్తముగా ఉందురు.
1. ప్రభూ! నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసరార్డిని, దీనుడను.
2-3. నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యువునుండి కాపాడుము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను.
4. నేను నీకు ప్రార్ధన చేయుచున్నాను కనుక నీ ఈ దాసుని సంతోషచిత్తుని చేయుము.
5. ప్రభూ! నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు.
6. ప్రభూ! నా మొర వినుము. నా వేడుకోలును ఆలింపుము.
7. నీవు ప్రత్యుత్తరమిత్తువు కనుకనే ఆపత్కాలమున నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను.
8. ప్రభూ! నీకు సాటిదైవము లేడు. నీవు చేసిన కార్యములను ఎవరును చేయలేరు.
9. నీవు కలిగించిన జాతులెల్ల నీ ఎదుటికి వచ్చి నీకు దండము పెట్టును. నీ నామమును కీర్తించును.
10. నీవు మహనీయుడవు. నీవు మాత్రమే మహత్తరకార్యములు చేయుదువు. నీవు మాత్రమే దేవుడవు.
11. ప్రభూ! నీ మార్గములను నాకు తెలియజేయుము. నేను నమ్మదగినతనముతో నీ త్రోవలలో నడతును. నేను పూర్ణహృదయముతో, నీ నామమును గౌరవింతును.
12. నా దేవుడవైన ప్రభూ! నేను నిండుమనసుతో నీకు స్తుతులు అర్పింతును. నీ నామమును సదా కీర్తింతును.
13. నీవు నాపట్ల అపారమైన కృప చూపితివి. అగాధమైన పాతాళమునుండి నన్ను కాపాడితివి.
14. దేవా! గర్వితులు నా మీదికి ఎత్తివచ్చుచున్నారు. క్రూరబృందము నన్ను చంపజూచుచున్నది. వారు నిన్ను లెక్కచేయువారు కారు.
15. దేవా! నీవు జాలికలవాడవు, కృపామయుడవు, సహనవంతుడవు, దయాపరుడవు, విశ్వసనీయుడవు
16. నీ దృష్టిని నా వైపు మరల్చి నన్ను కనికరింపుము. నీ దాసుడనైన నాకు నీ బలమును దయచేయుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము.
17. నీవు నన్ను అనుగ్రహించితివనుటకు గుర్తును చూపింపుము. నీవు నన్ను ఆదుకొని నాకు ఉపశాంతిని దయచేసితివని గ్రహించి నన్ను ద్వేషించువారెల్ల సిగ్గుచెందుదురు.
1. పవిత్రపర్వతముమీద ప్రభువు తన నగరమును నెలకొల్పెను.
2. అతడు యాకోబు పట్టణములు అన్నిటికంటెను సియోను ద్వారములను ఎక్కువగా అభిమానించును.
3. దైవనగరమా! ప్రభువు నీ మహత్తర కార్యములనుగూర్చి మాట్లాడెను.
4. “ఐగుప్తును బబులోనియాను నన్ను పూజించు దేశములలో చేర్తును, పలానావ్యక్తి ఫిలిస్తీయాలోనో లేక తూరు లోనో లేక యితియోపియాలోనో పుట్టెనని జనులు చెప్పుకొందురు.
5. సియోనును గూర్చి మాట్లాడునపుడు మాత్రము ఎల్లజాతులును అచట పుట్టినవని చెప్పుకొందురు” సర్వోన్నతుడు ఆ నగరమును బలపరచును.
6. ప్రభువు జాతుల జనాభా లెక్కలు వ్రాయించును. “అతడు ప్రతి వానిని సియోను పౌరుని” గనే గణించును.
7. జనులు అచట నాట్యము చేయుచు పాటలు పాడుదురు. “మా ఊటలకు ఆధారము నీవే” నని చెప్పుకొందురు.
1. ప్రభూ! నాకు రక్షకుడవైన దేవా! నేను నీకు పగలు మొరపెట్టుకొనుచున్నాను, రేయి నీ సన్నిధిలోనికి వచ్చుచున్నాను.
2. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక! నీవు నా మొరను ఆలింపుము.
3. నాకు పలుకీడులు దాపురించినవి. నేను మృత్యువువాత పడనున్నాను.
4. నా పేరు మృతలోకమునకు పోవువారి జాబితాలోకి ఎక్కినది. నేను సహాయము లభించని వానివలెనైతిని.
5. జనులు నన్ను విడనాడిరి. నేను మృతులలో కలిసిపోతిని. చచ్చి సమాధిచేరినవారిని నీవిక స్మరింపవు, ఆదరింపవు. నేను అట్టివాడనే అయితిని.
6. నీవు నన్ను నడిగుంటలో పడవేసితివి. లోతైన చీకటి కోనేటిలో పడద్రోసితివి.
7. నీ కోపము నన్ను అణగదొక్కినది. నీ క్రోధతరంగములు నన్ను ముంచివేసినవి.
8. నీవు నా మిత్రులు నన్ను విడనాడునట్లు చేసితివి. వారు నన్ను అసహ్యించుకొనునట్లు చేసితివి. నేను ఈ చెరనుండి బయటపడలేను.
9. శ్రమలవలన నా కంటిచూపు మందగించినది. ప్రభూ! ప్రతి రోజు నేను నీకు మొరపెట్టుచునే యుంటిని. చేతులెత్తి నీకు ప్రార్థన చేయుచునే యుంటిని.
10. నీవు మృతులకొరకు అద్భుతములు చేయుదువా? ప్రేతములు పైకి లేచి నిన్ను స్తుతించునా?
11. సమాధిలో నీ కరుణనుగూర్చి ఎవడు మాట్లాడును? వినాశస్థలములో నీ విశ్వసనీయతను ఎవడు ఉగ్గడించును?
12. చీకటిలో నీ అద్భుతములను ఎవరు గుర్తింతురు? విస్మృతికి గురియైన పాతాళలోకమున నీ న్యాయమును ఎవరు తెలిసికొందురు?
13. కాని ప్రభూ! నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను. ప్రతి ఉదయము నీకు ప్రార్ధన చేయుచున్నాను.
14. ప్రభూ! నీవు నన్ను నిరాకరింపనేల? నీ మొగమును నానుండి మరుగుచేసికోనేల?
15. నేను బాల్యమునుండియు శ్రమలను అనుభవించి చావునకు సిద్ధమైనవాడను, నేను నీ శిక్షలు అనుభవించి అలసిపోయితిని.
16. నీ క్రోధము నన్ను కూల్చివేసినది. నీ దండనములు నన్ను నాశనము చేసినవి.
17. నీ శిక్షాతరంగములు దినమెల్ల నన్ను చుట్టుముట్టినవి. అవి నామీదికి పొంగిపొరలినవి.
18. నీవు నా స్నేహితులను, పరిచితులను నానుండి దూరము చేసితివి. కడకు చీకటి మాత్రమే నాకు చెలికాడయ్యెను.
1. దేవా! నీకు వందనములు అర్పించుట మంచిది మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో స్తుతించుట మేలు.
2-3. తంత్రీవాద్యములతోను, సితారా గానముతోను, వేకువన నీ ప్రేమను, రేయి నీ విశ్వసనీయతను ప్రకటనము చేయుట లెస్స
4. ప్రభూ! నీ చెయిదములకుగాను నేను ఆనందింతును. నీ కార్యములకుగాను నేను సంతసముతో పాటలు పాడుదును.
5. ప్రభూ! నీ కార్యములు ఎంత ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంత లోతైనవి!
6. మూర్ఖులు ఈ సంగతిని గుర్తింపజాలరు. అజ్ఞానులు ఈ అంశమును గ్రహింపజాలరు.
7. దుష్టులు కలుపువలె ఎదిగినను, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చినను వారెల్లరును వేరంట నాశనమగుదురు.
8. ప్రభూ! నీవు కలకాలము , మహోన్నతుడవుగానుందువు.
9. ప్రభూ! నీ శత్రువులు నశింతురు. దుష్కార్యములు చేయువారెల్ల చెల్లాచెదరగుదురు.
10. అడవిఎద్దు కొమ్మువలె నీవు నాకొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నా చర్మముపై అంటితివి.
11. నేను నా శత్రువుల పతనమును ఆశతీరచూచితిని. దుష్టవర్తనుల ఆక్రందనమును వింటిని. "
12. పుణ్యపురుషులు ఖర్జూరములవలె వృద్ధిజెందుదురు. లెబానోను దేవదారులవలె ఎదుగుదురు.
13. వారు దేవుని మందిరమున నాటగా చక్కగా ఎదుగు చెట్లవలె ఉందురు.
14. ముసలితనములోగూడ కాయలు కాయుచు నిత్యము పచ్చగా కళకళలాడుచుందురు.
15. ఆ రీతిగా వారు ప్రభువు నీతిమంతుడనియు, నాకు ఆశ్రయదుర్గమైన దేవునియందు దోషమేమియు లేదనియు రుజువు చేయుదురు.
1. ప్రతీకారము చేయువాడవైన ప్రభూ! ప్రతీకారము చేయువాడవైన ప్రభూ! నీ తేజస్సును కన్పింపనిమ్ము.
2. లోకమునకు న్యాయాధిపతివైన దేవా! నీవు పైకి లేచి గర్వాత్ములకు శాస్తిచేయుము.
3. ప్రభూ!దుర్మార్గులు ఎంతకాలము ఆనందింతురు? ఎంతకాలము ఆనందింతురు?
4. ఎంతకాలము గర్వముతో బింకములాడుచు, తమ దుష్కార్యములను గూర్చి ప్రగల్భములు పలుకుదురు?
5. ప్రభూ! వారు నీ జనులను అణగదొక్కుచున్నారు. నీవు ఎన్నుకొనిన ప్రజలను పీడించుచున్నారు.
6. వితంతువులను మాతో వసించు పరదేశులను చంపుచున్నారు. అనాథబాలలను వధించుచున్నారు.
7. "ప్రభువేమియు చూడడులే, యిస్రాయేలు దేవుడేమియు గమనింపడులే” అనుచున్నారు.
8. జనులారా! మీరు పరమమూర్ఖులు, మందమతులు. మీకు వివేకము ఎప్పుడు అలవడును?
9. చెవిని చేసినవాడు వినలేదా? కంటిని కలిగించినవాడు కనలేదా?
10. అన్యజాతులను మందలించువాడు వారిని శిక్షింపలేడా? నరులకు బోధించువానికి జ్ఞానము లేదా?
11. ప్రజల ఆలోచనలు ప్రభువునకు తెలియును. వారి తలపులు నిరర్ధకమైనవని ఆయనెరుగును.
12. ప్రభూ! నీవు ఉపదేశముచేయు నరుడు ధన్యుడు. నీవు ధర్మశాస్త్రము బోధించుజనుడు భాగ్యవంతుడు
13. కష్టకాలమున నీవు అతనికి చిత్తశాంతిని అనుగ్రహింతువు. దుష్టులు కూలుటకు మాత్రము గోతిని త్రవ్వుదువు
14. ప్రభువు తన జనులను చేయివిడువడు. తాను ఎన్నుకొనిన ప్రజలను పరిత్యజింపడు.
15. సత్పురుషులు మరల నీతిని పాటింతురు. పుణ్యపురుషులెల్లరు న్యాయమును అనుసరింతురు.
16. దుష్టులను ఎదిరించి నా పక్షమున నిల్చినవాడెవడు? దుర్మార్గులకు అడ్డువచ్చి నన్ను సమర్థించినవాడెవడు?
17. ప్రభువు నన్ను ఆదుకొననిచో నా ప్రాణము సత్వరమే మౌనలోకము చేరుకొనియుండెడిది.
18. ప్రభూ! “నేను కాలుజారి పడిపోవుచున్నాను” అని నీతో చెప్పిన వెంటనే నీ కృప నన్ను రక్షించెను.
19. నేను విచారములలో చిక్కుకొనినచో నీవు నన్ను ఓదార్చి సంతోషచిత్తుని చేయుదువు.
20-21. సత్పురుషులమీద కుట్రలుపన్ని, నిర్దోషులకు మరణదండనము విధించి, అన్యాయమును న్యాయముగా చలామణిచేయు దుష్టన్యాయాధిపతులతో నాకు పొత్తులేదు.
22. కాని ప్రభువు నాకు కోట. నా దేవుడు, నేను తలదాచుకొను ఆశ్రయదుర్గము, ఆధారశిల.
23. దుష్టుల దుష్టత్వమునకుగాను ప్రభువు వారిని శిక్షించును. వారి పాపములకుగాను వారిని నాశనము చేయును. మన దేవుడైన ప్రభువు వారిని తుడిచిపెట్టును.
1. ప్రభువు మీద క్రొత్తపాట పాడుడు. విశ్వధాత్రీ! నీవు ప్రభువుమీద పాట పాడుము.
2. ప్రభువు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు.
3. ఆయన కీర్తిని ఎల్లజాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు.
4. ప్రభువు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు. దైవములందరికంటెను ఎక్కువగా గౌరవింపదగినవాడు.
5. అన్యజాతుల దైవములు అందరును వట్టి విగ్రహములు. కాని ప్రభువు ఆకసమును చేసెను.
6. తేజస్సును, ప్రాభవమును ఆయనయెదుట బంటులవలె నిల్చును. శక్తియు, సౌందర్యమును ఆయన మందిరమును నింపును.
7. సకలజాతులకు చెందిన నిఖిల వంశజులారా! మీరు ప్రభువును వినుతింపుడు. కీర్తియు బలమునుగల ప్రభువును కొనియాడుడు.
8. ప్రభువు మహిమాన్వితనామమును స్తుతింపుడు. సమర్పణలతో ఆయన దేవాలయములోనికి రండు
9. పవిత్రవస్త్రములు తాల్చి ప్రభువును వందింపుడు. విశ్వధాత్రీ! అతనిని చూచి గడగడ వణకుము.
10. “ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచెను. అతడు న్యాయబుద్దితో జాతులకు తీర్పుచెప్పును” అని మీరు అన్యజాతులతో నుడువుడు.
11. ప్రభువు విజయము చేయుటను గాంచి ఆకాశము ఆనందించునుగాక! భూమి హర్షించునుగాక! సాగరమును, దానిలోని ప్రాణులును హోరుమని నినదించునుగాక !
12. పొలములును వానిలోని పైరులును సంతసించునుగాక! అరణ్యములలోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక!
13. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును ఆయన న్యాయముగను, నిష్పక్షపాతముగను లోకములోని జాతులకు తీర్పుతీర్చును.
1. ప్రభువు రాజు! జాతులు గడగడ వణకును. ఆయన కెరూబులమీద ఆసీనుడగును. నేల కంపించును.
2. సియోనున ప్రభువు ఘనుడైయున్నాడు. . ఆయన ఎజాతులను మించినవాడు.
3. భీకరమైన ఆయన మహానామమును ఎల్లరు స్తుతింతురుగాక! ఆయన పవిత్రుడు.
4. మహారాజువైన నీవు న్యాయమును ప్రేమింతువు. నీవు ఋజువర్తనమును, నీతిన్యాయమును, ధర్మమును స్థాపించితివి. యాకోబు ప్రజలలో ఈ గుణములను నెలకొలిపితివి.
5. మన ప్రభువైన దేవుని కొనియాడుడు. ఆయన పాదపీఠముచెంత ఆయనను స్తుతింపుడు. ఆయన పవిత్రుడు.
6. మోషే అహరోనులు ఆయన యాజకులు, సమూవేలు ఆయనకు ప్రార్థన చేసినవాడు. వారు ఆయనకు మనవి చేయగా ఆయన వారి వేడికోలును ఆలించెను.
7. మేఘస్తంభమునుండి ఆయన వారితో మాట్లాడెను ఆయన దయచేసిన శాసనములను, కట్టడలను వారు పాటించిరి.
8. మా ప్రభుడవైన దేవా! నీవు ప్రజలమొరలు ఆలించితివి. నీవు ఆ జనుల పాపములకు వారిని దండించినను వారిని మన్నించు దేవుడవని రుజువు చేసికొంటివి.
9. మన ప్రభువైన దేవుని కొనియాడుడు. ఆయన పవిత్రపర్వతముచెంత ఆయనను వందింపుడు. మన దేవుడైన ప్రభువు పవిత్రుడు.
1. నేను కృపను గూర్చియు, న్యాయమును గూర్చియు పాడెదను. ప్రభూ! నా గీతమును నీకు విన్పించెదను
2. నేను ధర్మమార్గమున ప్రవర్తించెదను. నీవు నా చెంతకు ఎపుడు వచ్చెదవు? నేను నా ఇంట విశుద్ధవర్తనుడనుగా జీవించెదను
3. చెడు మీద నేను దృష్టి నిలుపను. దేవునినుండి వైదొలగువారి క్రియలను నేను అసహ్యించుకొందును. వారితో నాకు పొత్తులేదు.
4. కపటాత్ములను నా చెంతకు రానీయను. దుష్టులను అంగీకరింపను.
5. తోడివారిమీద చాటుమాటున చాడీలు చెప్పువాని నోరుమూయింతును. పొగరుబోతును గర్వితుడునైన నరుని నేను సహింపను.
6. విశుద్ధహృదయులను నేను అంగీకరింతును. వారు నా కొలువున ఉండవచ్చును. ఋజువర్తనులైన వారు నాకు సేవకులు అగుదురు.
7. కపటాత్ములకు నా ఇంట తావులేదు. కల్లలాడువాడు నాయెదుట నిలువజాలడు.
8. నేను ప్రతి ఉదయము దేశములోని దుర్మార్గులనెల్ల నిర్మూలింతును. ప్రభువు నగరమునుండి దుర్జనులనెల్ల బహిష్కరింతును.
1. నాప్రాణమా! ప్రభుని స్తుతింపుము. ప్రభూ! నీవు మిక్కిలి ఘనుడవు. నీవు ప్రాభవవైభములను వస్త్రమువలె ధరించితివి.
2. వెలుగును వస్త్రమువలె తాల్చితివి. ఆకాశమును గుడారమువలె వ్యాపింపజేసితివి.
3. మీది జలములమీద ఆయన తన ప్రాసాదమును నిర్మించుచున్నాడు. మేఘములు ఆయన రథములు. వాయురెక్కలమీద ఆయన స్వారిచేయుచున్నాడు.
4. గాలులు ఆయనకు దూతలు, తళతళలాడు మెరుపులు ఆయన బంటులు.
5. ఆయన నేలను దాని పునాదులమీద నెలకొల్పెను . అది ఏనాటికిని కదలదు.
6. ఆ నేలను సముద్రము అను వస్త్రముతో నీవు కప్పితివి. సాగరజలము కొండలను ముంచివేసెను.
7. నీవు గద్దింపగా ఆ జలములు భయపడి పారిపోయెను మేఘగర్జనమువంటి నీ ఆజ్ఞకు వెరచి అవి పరుగిడెను.
8. ఆ నీళ్ళు కొండలనుండి జారి క్రింది లోయలోనికి పారెను. అచటనుండి అవి నీవు నిర్ణయించిన స్థలమును చేరుకొనెను.
9. నీవు ఆ నీళ్ళకు దాటరాని హద్దును నెలకొల్పితివి. అవి ఆ మేరను దాటి వచ్చి, నేలను మరల ముంచివేయవు.
10. ఆయన లోయలలో ఊటలను పుట్టించెను. వాని నీళ్ళు కొండలనడుమ పారును.
11. వన్యమృగములెల్ల ఆ బుగ్గల నీళ్ళు త్రాగును. అడవిగాడిదలు ఆ నీటితో దప్పిక తీర్చుకొనును.
12. ఆ చేరువలో పక్షులు గూళ్ళు కట్టుకొని చెట్లకొమ్మలలో నుండి కూయును.
13. తన ప్రాసాదమునుండి కొండలమీద " వాన కురియించును. నీ చెయిదము ఫలముగా నేల సంతృప్తి చెందును.
14. ఆయన పశువులకొరకు గడ్డిని మొలిపించుచున్నాడు. నరుని ఉపయోగము కొరకు మొక్కలు మొలిపించుచున్నాడు. ఆయన నేలనుండి పంటలుపండించును.
15. ఆయన నరుని సంతోషపెట్టుటకు ద్రాక్షసారాయమును, అతనికి ఆనందము కలిగించుటకు ఓలివు తైలమును అతడిని బలాఢ్యుని చేయుటకు ఆహారమును దయచేయుచున్నాడు.
16. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు పుష్కల వర్షములతో సంతృప్తి చెందును.
17. వానిలో పక్షులు గూళ్ళు కట్టుకొనును. సారసపక్షులు దేవదారులలో గూళ్ళు కట్టుకొనును.
18. ఎత్తయిన కొండలలో అడవిమేకలు వసించును. పర్వతశిఖరములలో కుందేళ్ళు దాగుకొనును.
19. ఋతువులను ఎరిగించుటకు నీవు చంద్రుని చేసితివి. సూర్యునికి తానెప్పుడు అస్తమింపవలెయునో తెలియును.
20. నీవు రేయిని కొనిరాగా చిమ్మచీకట్లు క్రమ్మును. అపుడు వన్యమృగములెల్ల వెలుపల తిరుగాడును.
21. కొదమ సింగములు ఎరకొరకు గర్జించును. అవి దేవుని నుండి తమ ఆహారమును వెదకుకొనును.
22. సూర్యోదయముననే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును.
23. అపుడు నరుడు పనికి బయలుదేరును. అతడు సాయంకాలమువరకు పాటుపడును.
24. ప్రభూ! నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి! నీ చెయిదములన్నిటిని విజ్ఞానముతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండియున్నది.
25. అదిగో విశాలమైన మహాసముద్రము ఆ సాగరములో చిన్నవియు, పెద్దవియునైన ప్రాణులు లెక్కకుమించి జీవించుచుండును.
26. దానిలో ఓడలు సంచరించుచుండును. నీవు ఆడుకొనుటకు చేసిన మకరమును దానిలో నున్నది.
27. ఈ ప్రాణులన్నియు నీమీద ఆధారపడి జీవించును అవి తమకు అవసరమైనపుడు నీ నుండి ఆహారమును బడయును.
28. నీవు వానికి తిండిపెట్టగా. అవి తినును. వానికి ఆహారమును ఈయగా అవి సంతృప్తిగా భుజించును.
29. నీవు మొగము ప్రక్కకు తిప్పుకొనినచో అవి తల్లడిల్లును. వాని ఊపిరి తీసినచో అవి చచ్చును. తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును.
30. కాని నీవు ఊపిరిపోసినచో ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును ఒసగుదువు.
31. ప్రభువు కీర్తి ఏనాటికి మాసిపోకుండునుగాక! ఆయన తన సృష్టిని గాంచి ఆనందించునుగాక!
32. ప్రభువు భూమివైపు పారజూడగా అది కంపించును కొండలను తాకగా అవి పొగలు వెళ్ళగ్రక్కును.
33. నా జీవితకాలమెల్ల ప్రభువుపై కీర్తనలు పాడెదను. నేను బ్రతికియున్నంత కాలము ఆయన స్తుతులు పాడెదను.
34. నా ఈ ఆలోచనలు ప్రభువునకు ప్రియమగునుగాక! నేను ప్రభువునందు ఆనందించెదను.
35. దుష్టులు భూమిమీదనుండి తొలగిపోవుదురుగాక! దుర్మార్గులు కంటికి కన్పింపకుండపోవుదురుగాక! నా ప్రాణమా! ప్రభువును సన్నుతింపుము. మీరెల్లరును ప్రభువును స్తుతింపుడు.
1. మీరెల్లపుడు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాలము నిలుచును.
2. ప్రభువు మహాకార్యములను ఎవ్వడు ఉగ్గడింపగలడు? ఆయనను యుక్తరీతిని ఎవ్వడు సన్నుతింపగలడు?
3. న్యాయమును పాటించువారు, సదా నీతిని అనుసరించువారు ధన్యులు.
4. ప్రభూ! నీవు నీ ప్రజలను అనుగ్రహించునపుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. నీ ప్రజలతోపాటు నన్నును రక్షింపుము.
5. నేను నీవు ఎన్నుకొనిన ప్రజలవృద్ధిని , కన్నులార చూతునుగాక! నీ జనుల సంతోషమున పాలు పొందుదునుగాక! నీకు చెందియున్నందులకుగాను గర్వింతునుగాక!
6. మా పితరులవలె మేమును పాపము చేసితిమి. మేము దుష్టులమును, దుర్మార్గులమునైతిమి.
7. ఐగుప్తున మా పితరులు నీ అద్భుతకార్యములను ఎన్నడును గ్రహింపరైరి. వారు నీ మహాప్రేమను విస్మరించిరి. రెల్లు సముద్రమువద్ద మహోన్నతునిమీద తిరుగబడిరి.
8. కాని తాను వాగ్దానము చేసినట్లే ప్రభువు వారిని రక్షించెను. దానిద్వారా ఆయన తన శక్తిని వెల్లడిచేసెను.
9. ప్రభువు ఆజ్ఞాపింపగనే రెల్లు సముద్రము ఎండిపోయెను. ఆయన తన ప్రజలను కడలిలో పొడినేలమీద నడిపించెను.
10. తమ్ము ద్వేషించు వారినుండి వారిని కాపాడెను. విరోధులనుండి వారిని రక్షించెను.
11. వారి శత్రువులు నీళ్ళలో మునిగిచచ్చిరి. ఒక్కడును తప్పించుకోజాలడయ్యెను.
12. అపుడు ప్రజలు ప్రభువు వాగ్దానములను నమ్మిరి. ఆయనను స్తుతించి కీర్తించిరి.
13. కాని ఆ జనులు ప్రభువు కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన సలహాకొరకు వేచియుండరైరి.
14. ఎడారిలో వారు తమ వాంఛకు లొంగిపోయిరి. అరణ్యములో ప్రభువును పరీక్షకు గురిచేసిరి.
15. ప్రభువు వారి కోరికను తీర్చెను. కాని వారు ఘోరవ్యాధివాత పడునట్లు చేసెను.
16. జనులు శిబిరమున మోషే మీదను ప్రభువు పవిత్రసేవకుడైన అహరోను మీదను అసూయపడిరి.
17. అప్పుడు భూమి నోరువిప్పి దాతానును మ్రింగివేసెను. అబీరాము బృందమును పూడ్చివేసెను.
18. అగ్ని వారి గుంపుమీదికి దిగివచ్చెను. దాని జ్వాలలు ఆ దుష్టులనెల్ల మసిచేసెను.
19. ఆ జనులు హోరేబువద్ద దూడను చేసిరి. పోతపోసిన విగ్రహమును ఆరాధించిరి.
20. ప్రభువు తేజస్సును గడ్డిమేయు ఎద్దు బొమ్మకు మారకము వేసిరి.
21. ఐగుప్తున మహాకార్యములు చేసి తమను రక్షించిన దేవుని విస్మరించిరి.
22. ఆయన ఐగుప్తున అట్టి అద్భుతకార్యములు చేసెను రెల్లు సముద్రము వద్ద అట్టి భీకర కార్యములను చేసెను
23. ప్రభువు ఆ ప్రజలను నాశనము చేయనెంచెను. కాని తాను ఎన్నుకొనిన సేవకుడగు మోషే అతనికి అడ్డుపడి, అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను.
24. వారు ప్రభువు వాగ్దానములను నమ్మరైరి. కనుక, రమ్యమైన దేశమును స్వాధీనము చేసికొన నిరాకరించిరి.
25. ప్రభువు మాట వినక, తమ గుడారములోనే కూర్చుండి గొణగనారంభించిరి.
26-27. వారు ఎడారిలోనే చత్తురని, వారి సంతానము అన్యజాతుల నడుమ చెల్లాచెదరై పరదేశీయులలో కలిసిపోవుదురనియు ప్రభువు నిశితముగా మందలించెను.
28. అటుతరువాత ఆ ప్రజలు పెయోరువద్ద బాలుదేవత ఆరాధనములో పాల్గొనిరి. మృతదేవతలకు అర్పించిన నైవేద్యములను ఆరగించిరి.
29. వారు తమ దుష్కార్యములద్వారా ప్రభువు కోపము రెచ్చగొట్టి అంటురోగము వాతబడిరి.
30. అప్పుడు ఫీనెహాసు లేచి శిక్ష జరిపింపగ ఆ అంటువ్యాధి సమసిపోయెను.
31. ఈ కార్యమువలన అతడు తరతరములవరకును పుణ్యపురుషుడుగా గణుతికెక్కెను.
32. మెరిబా జలములవద్ద ప్రజలు ప్రభువునకు కోపము పుట్టించిరి. వారివలన మోషేకును తిప్పలు వచ్చెను.
33. వారు మోషేను విసిగింపగా అతడు దురుసుగా మాట్లాడెను.
34. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా వారు అన్యజాతి జనులను నాశనము చేయరైరి.
35. అన్యజనులతో సహవాసముచేసి, వారి దుష్టచర్యలను అనుకరించిరి.
36. ఆ ప్రజలు అన్యజనుల విగ్రహములను పూజించి వలలో చిక్కుకొనిరి.
37. తమ పుత్రులను, పుత్రికలను దయ్యములకు బలి ఇచ్చిరి.
38. వారు నిర్దోషులైన తమ బిడ్డలను చంపి కనాను విగ్రహములకు బలి యిచ్చిరి. కనుక ఆ శిశువుల నెత్తురువలన దేశము అపవిత్రమయ్యెను.
39. వారు తమ చెయిదములవలన అపవిత్రులైరి. వారు తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.
40. కనుక ప్రభువు తన ప్రజలమీద కోపపడెను. తాను ఎన్నుకొనిన జనులను అసహ్యించుకొనెను.
41. ఆయన వారిని అన్యజాతులకు అప్పగించెను. వారిని ద్వేషించువారే వారికి పాలకులైరి.
42. శత్రువులు వారిని పీడించి నేలబెట్టి కాలరాచిరి.
43. ప్రభువు చాలసార్లు తన ప్రజలను శత్రువులనుండి విడిపించెను. కాని వారు దేవుని మీద తిరుగుబాటు చేయుటకే నిశ్చయించుకొని పాపములో కూరుకొనిపోయిరి.
44. అయినను ప్రభువు వారి బాధలను అర్థము చేసికొనెను. ఆ ప్రజలు తనకు మొర పెట్టగా వారి వేడికోలును ఆలకించెను.
45. ఆయన వారి మేలెంచి తన నిబంధనమును జ్ఞప్తికి తెచ్చుకొనెను. మహాకృప కలవాడు కనుక వారిమీద దయచూపెను.
46. వారిని బందీలనుగా కొనిపోయినవారు వారిమీద జాలి చూపునట్లు చేసెను.
47. మా దేవుడవైన ప్రభూ! నీవు మమ్ము రక్షింపుము. అన్యజాతులనుండి మమ్ము విడిపింపుము. అప్పుడు మేము సగర్వముగా నీకు వందనములు అర్పించి నీ పవిత్రనామమును సన్నుతింతుము.
48. అనాదికాలము నుండియు అనంతము వరకును యిస్రాయేలు దేవునకు స్తుతికలుగునుగాక! ఇచట ఎల్లరును 'ఆమెన్' అని పలుకవలయును. మీరెల్లరు ప్రభువును స్తుతింపుడు.
1. దేవా! నాహృదయము నిశ్చలముగానున్నది నేను నీపై పాటలు పాడి నిన్ను సన్నుతింతును.
2. నా ప్రాభవము, ప్రభుని కీర్తించును. నా స్వరమండలమును, తంత్రీవాద్యమును మేల్కొనునుగాక! నేను ఉషస్సును మేల్కొల్పెదను.
3. ప్రభూ! నేను వివిధ జాతుల నడుమ నిన్ను స్తుతించెదను. ఆ బహుప్రజల నడుమ నిన్ను వినుతించెదను.
4. నీ కృప ఆకాశమంత ఉన్నతమైనది. నీ విశ్వసనీయత మేఘమండలమంత ఎతైనది.
5. దేవా! నీవు మింటికి పైగా ఎగయుము. ధాత్రినంతటిని నీ తేజస్సుతో నింపుము.
6. మా మొర వినుము, నీ కుడిచేతితో మమ్ము ఆదుకొనుము. అప్పుడు నీవు కృపతో మనుజుజనులు రక్షణమును బడయుదురు.
7. ప్రభువు తన దేవాలయమునుండి మనకు ఇట్లు వాగ్దానము చేసెను: “నేను విజయము సాధించి, షెకెమును పంచిపెట్టెదను. సుక్కోతు లోయను విభజించి యిచ్చెదను.
8. గిలాదు, మనప్పే మండలములు నావే. ఎఫ్రాయీము నాకు శిరస్త్రాణము, .. యూదా నాకు రాజదండము.
9. మోవాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. ఎదోము మీదికి నా పాదరక్షను విసరుదును. ఫిలిస్తీయాను ఓడించి విజయనాదము చేయుదును!".
10. సురక్షితమైయున్న నగరములోనికి నన్ను ఎవ్వరు కొనిపోగలరు? తన ఎదోము లోనికి నన్ను ఎవ్వరు తీసికొనిపోగలరు?
11. దేవా! నీవు మమ్ము నిజముగనే పరిత్యజింతువా? మా సైన్యముతో నీవిక యుద్ధమునకు పోవా?
12. శత్రువులనుండి నీవు మమ్ము ఆదుకొనుము. నరుల తోడ్పాటు నిరర్థకము.
13. దేవుడు మన పక్షమున ఉండెనేని, మనము శౌర్యముతో పోరాడుదుము. ఆయన మన శత్రువులనెల్ల అణగదొక్కును.
1. దేవా! నేను నిన్ను స్తుతింతును. నీవు ఇక మౌనముగా ఉండవలదు.
2. దుష్టులు, కల్లలాడువారు నన్ను నిందించుచున్నారు నామీద చాడీలు చెప్పుచున్నారు.
3. వారు నన్నుగూర్చి చెడ్డగా మాట్లాడుచున్నారు. నిష్కారణముగా నా మీదికి వచ్చుచున్నారు.
4. నేను వారిని ప్రేమించి వారికొరకు ప్రార్థన చేసినను వారు నన్ను ద్వేషించుచున్నారు.
5. నేను వారికి మేలు చేయగా, వారు నాకు కీడు చేయుచున్నారు. నేను వారిని ప్రేమింపగా వారు నన్ను ద్వేషించుచున్నారు.
6. వానిమీద దుష్టుని అధికారిగా నుంచుము. ఎవడైన ఒకడు అతనిమీద నేరము మోపునట్లు చేయుము.
7. అతనికి తీర్పుచెప్పు వారు అతనిని దోషినిగా నిర్ణయింతురుగాక! అతని ప్రార్థనకూడ నేరముగా గణింపబడునుగాక!
8. అతడు అకాల మృత్యువువాత పడునుగాక! అతని ఉద్యోగము మరియొకనికి దక్కునుగాక!
9. అతని బిడ్డలు అనాథలగుదురుగాక! అతని భార్య వితంతువగునుగాక! .
10. అతని బిడ్డలు దేశదిమ్మరులు బిచ్చగాండ్రు అగుదురుగాక! వారు వసించు పాడువడిన కొంపల నుండి వారిని తరిమివేయుదురుగాక!
11. అప్పులవారు అతని ఆస్తిని ఆక్రమించుకొందురుగాక! ను అతడు కష్టించి ఆర్జించిన సొత్తును అన్యులు దోచుకొందురుగాక!
12. ఎవడును అతనికి దయచూపకుండునుగాక! అతని అనాథ సంతానమునెవడును ఆదుకొనకుండునుగాక!
13. అతని సంతతి నాశనమగునుగాక! ? ఒక్క తరములోనే అతని పేరు మాసిపోవునుగాక!
14. ప్రభువు అతని పితరుల పాపములను జ్ఞాపకముంచుకొనునుగాక! - అతని తల్లి అపరాధములను మన్నింపకుండునుగాక!
15. ప్రభువు వారి తప్పులను ఎల్లవేళలలో జ్ఞాపకముంచుకొనునుగాక! అమలు వారి పేరును భూమి మీదనుండి తుడిచివేయునుగాక!
16. అతడేనాడును దయాపరుడుగా మెలగలేదు. పేదలను, ఆర్తులను, నిస్సహాయులను హింసించి చంపెను.
17. శాపవచనములు అతనికి ఇష్టము. అతనికి శాపము కలుగునుగాక! అతడు దీవించుటకు ఇష్టపడలేదు. అతనికి దీవెనలు ప్రాప్తింపకుండునుగాక!
18. అతడు శాపములను అంగీవలె తొడుగుకొనెను. ఆ శాపములు నీటివలె అతని దేహములోనికి చొచ్చుకొనిపోవునుగాక! తైలమువలె అతని ఎముకలలోనికి ప్రవేశించునుగాక!
19. ఆ శాపములను అతడు బట్టలవలె కప్పుకొనునుగాక! నిత్యము నడికట్టువలె ధరించునుగాక!
20. నా శత్రువులకు, నన్నుగూర్చి చెడుగా మాట్లాడువారికి ప్రభువు ఇట్లు శాస్తిచేయునుగాక!
21. నా దేవుడవైన ప్రభూ! నీ నామము నిమిత్తము నన్ను ఆదుకొనుము. నీ స్థిరమైన కృప మంచిది కనుక నన్ను కాపాడుము
22. నేను బలహీనుడను, దరిద్రుడను. నా హృదయము గాఢ సంతాపమున మునిగియున్నది.
23. నేను సాయంకాలపు నీడవలె గతింపనున్నాను. నన్ను మిడుతనువలె ఎగురగొట్టిరి.
24. ఉపవాసముచేత నా మోకాళ్ళు బలమును కోల్పోయినవి, నేను చిక్కిసగమైతిని.
25. నేను నవ్వులపాలయితిని. జనులు నన్ను గేలిచేయుచు తల ఆడించుచున్నారు
26. నా దేవుడవైన ప్రభూ! నీవు నన్ను ఆదుకొనుము. నీవు కృపామయుడవు గాన నన్ను రక్షింపుము.
27. అది నీ హస్తమువలననే చేయబడినదని వారు తెలుసుకొందురు. ఓ ప్రభూ! ఇది నీవే చేసితివి.
28. వారి శాపములకు బదులుగా , నీవు నాకు దీవెనలిత్తువు. నన్ను హింసించువారు ఓడిపోవుదురుగాక! నీ దాసుడనైన నేను సంతసింతును గాక!
29. నా శత్రువులు నగుబాట్లు తెచ్చుకొందురుగాక! అవమానమును బట్టనువలె తాలురు గాక!
30. నేను ప్రభువును పెద్దగా స్తుతింతును. భక్తసమాజమున ఆయనను కీర్తింతును.
31. ఆయన పేద నరుని కోపు తీసికొని మరణశిక్ష విధించు వారినుండి అతనిని కాపాడును.
1. ప్రభువు వా ప్రభువుతో ఇట్లనెను: “నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయువరకు నీవు నా కుడిపార్శ్వమున ఆసీనుడవు కమ్ము"
2. ప్రభువు సియోనునుండి నీ రాజ్యాధికారమును విస్తృతము చేయును. నీవు నీ శత్రువులను పరిపాలింపుమని ఆయన వాకొనును.
3'. యుద్ధసన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్దాలంకృతులై అరుణోదయ గర్భములోనుండి పుట్టు మంచుబిందువులవలె నీయొద్దకు వచ్చెదరు.
4. ప్రభువు బాసచేసెను, అతడు మాట తప్పడు. “నీవు మెల్కీసెదెకువలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడవుగానుందువు.”
5. ప్రభువు నీ కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయనకు కోపము వచ్చినపుడు . రాజులను నాశనము చేయును.
6. అతడు జాతులకు తీర్పుచెప్పును. యుద్ధభూమిని శవములతో నింపును. భూమిమీద రాజులనెల్ల ఓడించును.
7. దారిప్రక్కనున్న యేటినుండి నీళ్ళు త్రాగి విజయసిద్ధి వలన తలయెత్తుకొని నిలబడును.
1. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువుపట్ల భయభక్తులు చూపువాడు, ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు.
2. అతని పిల్లలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు నీతిమంతుని సంతానము దీవెనలు బడయును.
3. అతని కుటుంబము సిరిసంపదలతో అలరారును. అతని నీతి కలకాలము వృద్ధిచెందును.
4. దయ, జాలి, నీతికల సజ్జనునికి చీకటిలోకూడ వెలుగు ప్రకాశించును.
5. అతడు వడ్డీ తీసికొనకయే అప్పిచ్చును. తన కార్యములనెల్ల న్యాయబుద్ధితో నిర్వహించును.
6. నీతిమంతుడు ఏనాడును కదలింపబడడు. అతని పేరు శాశ్వతముగా ఉండిపోవును.
7. స్థిరవిశ్వాసమును, ప్రభువునందు నమ్మకము కలవాడు కనుక అతడు తనను గూర్చిన దుర్వార్తలకు జడియడు.
8. అతని హృదయం స్థిరమైనది, తన శత్రువుల విషయమున తన కోరిక నెరవేరువరకు భయపడడు.
9. అతడు పేదలకు ఉదారముగా దానము చేయును. సదా అతని నీతి నిలిచియుండును. వాని కొమ్ము ఘనతనాంది హెచ్చింపబడును.
10. దుష్టులు అతనిని గాంచి కోపింతురు. పండ్లు పటపట కొరుకుదురు. అటుపిమ్మట నాశనమై పోవుదురు. వారి ఆశలును వమ్మైపోవును.
1. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు సేవకులారా! ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నుతింపుడు.
2. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక!
3. సూర్యోదయమునుండి సూర్యాస్తమయమువరకు ప్రభువు నామము వినుతింపబడునుగాక!
4. ప్రభువు జాతులన్నింటిని మించినవాడు ఆయన తేజస్సు ఆకాశమునకు పైన వెలుగొందుచుండును.
5. మన దేవుడైన ప్రభువువంటివాడు ఎవడు? ఆయన మహోన్నతస్థానమున వసించును.
6. అయినను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును.
7. ఆయన పేదలను దుమ్ములోనుండి పైకిలేపును. దీనులను బూడిదనుండి లేవనెత్తును.
8. వారిని రాజుల సరసన, తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును.
9. ఆయన గొడ్రాలు తన ఇంట మన్నన పొందునట్లు చేయును. ఆమెకు బిడ్డలను ఒసగి సంతుష్టి కలిగించును. మీరు ప్రభువును స్తుతింపుడు.
1. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చినపుడు, యాకోబు వంశజులు అన్యభాషగల జనులనుండి బయల్వెడలినపుడు
2. యూదా ప్రభువునకు పవిత్రస్థలము అయ్యెను. యిస్రాయేలు అతడి సొంత రాజ్యము అయ్యెను.
3. సముద్రము ఆయనను చూచి పారిపోయెను. యోర్దాను వెనుకకు మరలెను.
4. కొండలు పొట్టేళ్ళవలె గంతులు వేసెను. తిప్పలు గొఱ్ఱెపిల్లలవలె దుమికెను.
5. సముద్రమా! నీవు పారిపోనేల? యోర్డానూ! నీవు వెనుకకు మరలనేల?
6. పర్వతములారా! మీరు పొట్టేళ్ళవలె గంతులు వేయనేల? తిప్పలారా! మీరు గొఱ్ఱెపిల్లలవలె దుముకనేల ?
7. ధాత్రీ! నీవు ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో కంపింపుము.
8. ఆయన రాతిని నీటిమడుగుగా మార్చెను. కఠినశిలను నీటిబుగ్గను చేసెను.
1. ప్రభూ! మాకు మహిమ తగదు. నీ కృపవలనను నీ విశ్వసనీయత వలనను నీ నామమునకే మహిమ తగియున్నది.
2. అన్యజాతి వారు “మీ దేవుడేడి” అని మనలను అడుగనేల?
3. మన దేవుడు ఆకాశముననున్నాడు. ఆయన తనకు ఇష్టము వచ్చిన కలలు కార్యమెల్ల చేయును.
4. వారి విగ్రహములు వెండిబంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను.
5. వానికి నోళ్ళున్నవి కాని అవి మాట్లాడలేవు. కన్నులున్నవి కాని చూడలేవు.
6. చెవులున్నవి కాని వినలేవు. ముక్కులున్నవి కాని వాసన చూడలేవు.
7. చేతులున్నవికాని స్పృశింపలేవు. కాళ్ళున్నవి కాని నడువలేవు. వాని గొంతునుండి ఒక్కమాటయు వెలువడదు.
8. ఆ బొమ్మలను మలచినవారు, వానిని నమ్మువారు, వానివంటివారే అగుదురు.
9. యిస్రాయేలీయులారా! మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును, ఆదుకోలువై ఉన్నాడు.
10. అహరోను వంశజులారా! మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును, ఆదుకోలువై ఉన్నాడు.
11. ప్రభువుపట్ల భయభక్తులు చూపువారలారా! మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును, ఆదుకోలువై ఉన్నాడు.
12. ప్రభువు మనలను జ్ఞప్తికి తెచ్చుకొని దీవించును. ఆయన యిస్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశజులను ఆశీర్వదించును.
13. అల్పులు, ఘనులు అను తారతమ్యము లేక తనపట్ల భయభక్తులు చూపువారినెల్లరిని ఆశీర్వదించును.
14. ప్రభువు మీ సంతానమును, మీ బిడ్డల సంతానమునుగూడ వృద్ధిచేయునుగాక!
15. భూమ్యాకాశములను చేసిన దేవుడు మిమ్ము దీవించునుగాక!
16. ఆకాశము ప్రభువునకు చెందియున్నది. భూమిని మాత్రము ఆయన నరులకు ఇచ్చివేసెను.
17. మృతులు ప్రభువును స్తుతింపలేరు. వారు మౌన లోకమును చేరుకొనిరి.
18. కాని బ్రతికియున్న మనము మాత్రము ఇప్పుడును ఎప్పుడును ప్రభువును స్తుతింతుము. మీరు ప్రభువును స్తుతింపుడు.
1. ఎల్లజాతులారా! ప్రభువును స్తుతింపుడు. ఎల్లప్రజలారా! అతనిని కీర్తింపుడు.
2. మనపట్ల ఆయనకు మిక్కుటమైన కృప కలదు, ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు.
1. ఆపదలలో నేను ప్రభువునకు మొరపెట్టితిని. ఆయన నా వేడికోలును ఆలించెను.
2. ప్రభూ! కల్లలాడు వారినుండియు మోసగాండ్రనుండియు నన్ను కాపాడుము.
3. బొంకులాడు వారలారా! ప్రభువు మీకేమి చేయునో తెలియునా? ఆయన మిమ్ము ఎట్లు శిక్షించునో తెలియునా?
4. వాడిబాణములతోను, గనగనమండు నిప్పుకణికలతోను, ఆయన మిమ్ము దండించును.
5. అయ్యో! మీతో కలిసి జీవించుట మెషెక్కున, కేదారున వసించుట వంటిది.
6. శాంతిని మెచ్చని జనుల నడుమ నేను దీర్ఘకాలము జీవించితిని.
7. నేను శాంతిని గూర్చి మాటలాడగా వారు కయ్యమునకు కాలుదువ్వెడివారు.
1. నేను నా కన్నులనెత్తి కొండలవైపు పారజూచుచున్నాను. నాకు ఎచటినుండి సహాయము లభించును?
2. భూమ్యాకాశములను సృజించిన ప్రభువునుండి నాకు సాయము లభించును.
3. ఆయన నిన్ను కాలుజారి పడనీయడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు.
4. యిస్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు.
5. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. ఆయన నీ కుడి ప్రక్కన నిల్చి నిన్ను రక్షించును.
6. పగలు నీకు సూర్యునివలన హానికలుగదు. రేయి చంద్రునివలన కీడుకలుగదు.
7. ప్రభువు నిన్ను సకల ఆపదలనుండి కాపాడును. నిన్ను సురక్షితముగానుంచును.
8. ఆయన నీ రాకపోకలన్నింటను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును.
1. “మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము” అని జనులు పల్కగా నేను ఆనందము చెందితిని.
2. యెరూషలేమూ! మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి.
3. యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించిరి.
4. యిస్రాయేలు తెగలు, ప్రభువు తెగలు, ఇచటికి ఎక్కివచ్చి ప్రభువు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును.
5. ఇచట న్యాయ సింహాసనములు, దావీదు వంశజుల న్యాయసింహాససములు నెలకొనియున్నవి.
6. యెరూషలేమునకు శుభము కలుగునట్లు ప్రార్ధింపుడు “నిన్ను అభిమానముతో చూచువారు వర్ధిల్లుదురుగాక! .
7. నీ ప్రాకారములలో శాంతి నెలకొనునుగాక! నీ ప్రాసాదములు సురక్షితముగా నుండునుగాక!”
8. నా మిత్రులు బంధువులకొరకు నేను యెరూషలేముతో “నీకు శాంతి కలుగునుగాక!” అని పలుకుదును.
9. మన ప్రభువైన దేవుని మందిరముకొరకు నేను నీకు అభ్యుదయము కలుగవలెనని ప్రార్థింతును.
1. ప్రభూ! స్వర్గమునందు ఆసీనుడైనవాడా! నేను నీ వైపు కన్నులెత్తియున్నాను.
2. సేవకుల కన్నులు యజమానుని చేతిమీదను, సేవకురాండ్రు కన్నులు యజమానురాలి చేతిమీదను నిల్చియుండునట్లే, మన దేవుడైన ప్రభువు మనలను కరుణించువరకును, మన కన్నులను ఆయనమీద నిలిపి ఉంచుదము
3. ప్రభూ! మాకు దయచూపండి. మమ్ము కరుణించండి. మేము చాల అవమానములకు గురియైతిమి.
4. ధనవంతులు మమ్ము చాల నిందించిరి. గర్వాత్ములు మమ్ము గేలిచేసిరి.
1. ప్రభువును నమ్మువారు సియోను కొండవలె నిశ్చలముగను, శాశ్వతముగను నిలుతురు.
2. కొండలు యెరూషలేమును చుట్టియున్నట్లుగా ఇప్పుడును ఎప్పుడును ప్రభువు తన ప్రజలను చుట్టియుండును.
3. దుష్టులు ధర్మాత్ముల నేలను పరిపాలింపజాలరు. పరిపాలింతురేని, ధర్మాత్ములును దుష్టులగుదురు.
4. ప్రభూ! ఋజుమార్గవర్తనులును, సజ్జనులును అయినవారికి నీవు మేలు చేయుము.
5. కాని వక్రమార్గమునపోవు కుటిలవర్తనులను దుష్టులతో కలిపివేయుము. యిస్రాయేలీయులకు శాంతి కలుగునుగాక!
1. ప్రభువుపట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడచు నరులు ధన్యులు.
2. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును, అభ్యుదయమును బడయుదువు.
3. నీలోగిట నీ భార్యఫలించిన ద్రాక్ష తీగవలెనుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఓలివు పిలకలవలె ఒప్పుదురు.
4. దేవునిపట్ల భయభక్తులుగల నరుడు ఇట్టి దీవెనలు బడయును.
5. నీ జీవితకాలమందెల్ల ప్రభువు సియోనునుండి నిన్ను దీవించునుగాక! నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక
6. నీ బిడ్డల బిడ్డలను కన్నులారా చూతువుగాక! యిస్రాయేలీయులకు శాంతి కలుగునుగాక!
1. “నా బాల్యము నుండియు శత్రువులు నన్ను మిక్కిలి హింసించిరి.” యిస్రాయేలీయులు ఈ పలుకులను పునశ్చరణము చేయుదురుగాక!
2. “నా బాల్యమునుండి శత్రువులు నన్ను హింసించిరి కాని వారు నన్ను జయింపజాలరైరి.
3. వారు నా వీపును పొలమువలె దున్ని, దాని మీద పొడుగైన చాళ్ళుచేసిరి.
4. కాని ధర్మాత్ముడైన ప్రభువు దుష్టుల బానిసత్వమునుండి నన్ను తప్పించెను.
5. సియోనును ద్వేషించువారందరును సిగ్గుచెంది పరాజయమును పొందుదురుగాక!
6. వారు ఇంటికప్పు మీద మొలచిన గడ్డివలె పెరగకముందే ఎండిపోవుదురుగాక!
7. ఆ గడ్డిని ఎవరును కోయరు, కట్టలు కట్టరు.
8. ప్రభువు మిమ్ము దీవించుగాక! ప్రభువు పేరుమీదుగా మేము మిమ్ము దీవింతుము అని దారిన పోవువారెవ్వరును వారితో పలుకరు.”
1. ప్రభూ! అగాధస్థలములనుండి నేను నీకు మొర పెట్టుచున్నాను.
2. ప్రభూ! నా మొర వినుము. నీ చెవియొగ్గి నా వేడికోలును ఆలింపుము.
3. ప్రభూ! నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు?
4. కాని నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీపట్ల భయభక్తులు చూపుదుము.
5. నేను ప్రభువు కొరకు ఆశతో వేచియున్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మితిని.
6. కావలి వారు వేకువజాము కొరకు వేచియున్న దానికంటెను ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు వేచియున్నది.
7. యిస్రాయేలీయులు ప్రభువును నమ్ముదురు గాక! ఆయన దయకలవాడు. సమృద్ధిగా రక్షణమును ఒసగువాడు.
8. సమస్త పాపముల నుండియు యిస్రాయేలీయులను రక్షించువాడు.
1. ప్రభూ! నా హృదయము గర్వముతో ఉప్పొంగుటలేదు. నా కన్నులకు పొరలు కమ్మలేదు. మహత్తర విషయములతోగాని, నాకు అంతుబట్టని సంగతులతోగాని, నేను సతమతమగుటలేదు.
2. నా హృదయము నిమ్మళముగను ప్రశాంతముగను ఉన్నది. పాలు మాన్పించిన శిశువు తల్లి రొమ్ము మీద ప్రశాంతముగా పరుండియున్నట్లే నా హృదయమును నాలో నిమ్మళముగానున్నది.
3. యిసాయేలీయులారా! మీరు ఇప్పుడును ఎప్పుడును ప్రభువును నమ్ముడు.
1. ప్రభూ! దావీదును, అతడు అనుభవించిన శ్రమలను జ్ఞప్తియందుంచుకొనుము.
2. అతడు నీకు చేసిన శపథమును, బలాఢ్యుడవగు యాకోబు దేవుడవైన నీకు చేసిన ప్రమాణమును జ్ఞప్తియందుంచుకొనుము.
3-5. “ప్రభువునకు ఒక స్థానము సిద్ధము చేయువరకు బలాఢ్యుడగు యాకోబు దేవునికి వాసస్థలము తయారుచేయువరకు, నేను ఇంటికి పోను, పడుకనెక్కను, నేను నిద్రింపను, రెప్పవాల్పను” అని దావీదు బాస చేసెను.
6. ఎఫ్రాతాలో మనము మందసమునుగూర్చి వింటిమి యెయారీము పొలములలో దానిని కనుగొంటిమి
7. "ప్రభువు మందిరమునకు పోయి, ఆయన పాదపీఠమునొద్ద ఆయనను పూజింతము” అనుకొంటిమి.
8. ప్రభూ లెమ్ము! నీ బలసూచకమైన మందసముతో నీ విశ్రాంతిస్థలమునకు కదలిరమ్ము.
9. నీ యాజకులు సదా నీతిని పాటింతురుగాక! నీ భక్తులు సంతసముతో పాడుదురుగాక!
10. నీ దాసుడైన దావీదును జూచి నీవు ఎన్నుకొనిన రాజును చేయివిడువకుము.
11. ఆడినమాట తప్పని నీవు దావీదునకు ఇట్లు బాసచేసితివి. “నీ కుమారుడు రాజై నీ తరువాత పరిపాలనము చేయును.
12. నీ తనయులు నా నిబంధనములు అనుసరించి నేను ఉపదేశించిన ఆజ్ఞలను పాటింతురేని వారి పుత్రులును నీ సింహాసమును అధిరోహించి శాశ్వతముగా పరిపాలనము చేయుదురు”.
13. ప్రభువు సియోనును ఎన్నుకొనెను. దానిని తన వాసస్థలముగా చేసికొనెను.
14. అతడిట్లు పలికెను: “ఇది నాకు సదా విశ్రాంతిస్థలమగును. ఇది నేను కోరుకొనిన వాసస్థలము.
15. నేను సియోను పౌరుల అవసరములెల్ల తీరును. ఆ నగరములోని పేదలకు ఆహారము పెట్టుదును.
16. దానిలోని యాజకులకు రక్షణమును ఒసగుదును. దానిలోని భక్తులు సంతసముతో పాటలు పాడుదురు.
17. ఇచట నేను దావీదు వంశజుని ఒకనిని నెలకొల్పుదును. నా అభిషిక్తుని కొరకు నేనచట ఒక దీపము సిద్ధము చేయుదును.
18. అతని శత్రువులను అవమానమున ముంచెదను అతని కిరీటము అతనిమీదేయుండి తేజరిల్లును”.
1. సోదరులెల్లరును కూడి ఐకమత్యముతో జీవించుట చాల మంచిది. చాల రమ్యమైనది.
2. అట్టి జీవితము అహరోను తలమీదినుండియు, గడ్డమునుండియు కారి అతని అంగీ, మెడపట్టీమీద పడు విలువగల అభ్యంగనతైలము వంటిది.
3. అట్టి జీవితము సియోను కొండలమీద హెర్మోను మంచువంటిది. ఆ సియోనున ప్రభువు తన దీవెనను ఒసగును. శాశ్వత జీవమును దయచేయును.
1. ప్రభువు సేవకులెల్లరును, రాత్రి ప్రభువు మందిరమున పరిచర్యచేయువారు ఎల్లరును ప్రభువును స్తుతింపుడు.
2. మీరు పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి ప్రభువును స్తుతింపుడు.
3. భూమ్యాకాశములను సృజించిన ప్రభువు సియోనునుండి మిమ్ము దీవించునుగాక!
1-2. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువును సేవించువారలారా! ప్రభువు మందిరములో, మన దేవుని మందిరపు అవరణములలో పరిచర్యలు చేయువారలారా! ప్రభువు నామమును స్తుతింపుడు.
3. ప్రభువు మంచివాడు కావున ఆయనను స్తుతింపుడు. ఆయన దయాపరుడు కనుక ఆయన నామమును స్తుతింపుడు. అది సుందరమైనది.
4. ఆయన యాకోబును ఎన్నుకొనెను. యిస్రాయేలును తన జాతిని చేసికొనెను.
5. ప్రభువు మహామహుడనియు, ఎల్లవేల్పులకంటె అధికుడనియు నాకు తెలియును.
6. ఆకాశమునందును, భూమిమీదను, సముద్రమునను, పాతాళమునను, ఆయన తనకు ఇష్టము వచ్చిన కార్యములెల్ల చేయును.
7. ఆయన నేల అంచులనుండి మబ్బులు లేపును. మెరుపులతో గాలివానలు కలిగించును. తన కొట్లలోనుండి గాలిని కొనివచ్చును.
8. ఐగుప్తున నరులకును, పశువులకును పుట్టిన తొలిచూలు పిల్లలనెల్ల ఆయన హతము చేసెను.
9. ఆ దేశమున సూచకక్రియలను, అద్భుతములను చేసి ఫరోను అతని ఉద్యోగులను శిక్షించెను.
10. అన్యజాతులను పెక్కింటిని నాశనముచేసెను. బలాడ్యులైన రాజులను వధించెను.
11. అమోరీయుల రాజగు సీహోనును బాషాను రాజగు ఓగును, కనాను మండల రాజులను నాశనము చేసెను.
12. వారి భూములను తన ప్రజలైన యిస్రాయేలునకు భుక్తము చేసెను.
13. ప్రభూ! నీ పేరు శాశ్వతముగా నిలుచును. ఎల్లతరములు నిన్ను స్మరించును.
14. ప్రభువు తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకుల మీద నెనరు చూపును.
15. అన్యజాతుల విగ్రహములను వెండి బంగారములతో చేసిరి. మానవమాత్రులు వానిని మలచిరి.
16. అవి నోళ్ళున్నను మాట్లాడలేవు. కళ్ళున్నను చూడలేవు.
17. చెవులున్నను వినలేవు. వాని గొంతులలో ఊపిరి లేదు.
18. ఆ విగ్రహములను మలచినవారును, వాని మీద ఆధారపడు వారును వాని వంటి వారే అగుదురుగాక!
19. యిస్రాయేలీయులారా! ప్రభువును స్తుతింపుడు. అహరోను వంశజులారా! ప్రభువును స్తుతింపుడు.
20. లేవి వంశజులారా! ప్రభువును స్తుతింపుడు. ప్రభువుపట్ల భయభక్తులు చూపువారలారా! ఆయనను స్తుతింపుడు.
21. సియోనున, ప్రభువు వాసస్థలమైన యెరూషలేమున ఆయనను స్తుతింపుడు. మీరు ప్రభువును స్తుతింపుడు.
1. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
2. దేవాధిదేవునికి వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
3. ప్రభువులకు ప్రభువైన వానికి వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
4. ఆయన మాత్రమే మహాద్భుతములు చేయును. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
5. ఆయన విజ్ఞానముతో గగనమును సృజించెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
6. జలములపై భూమిని నిర్మించెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
7. మహాజ్యోతులను చేసెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
8. పగటిని పరిపాలించుటకు సూర్యుని చేసెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
9. రేయిని ఏలుటకు తారకాచంద్రులను చేసెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
10. ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను వధించెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
11. యిస్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి కొనివచ్చెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
12. బాహుబలముతోను, పరాక్రమముతోను వారిని వెలుపలికి కొనివచ్చెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
13. ఎర్రసముద్రమును రెండుపాయలుగా చీల్చెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
14. దాని నడుమనుండి యిస్రాయేలీయులను నడిపించుకొని పోయెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
15. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
16. తన ప్రజలను ఎడారిగుండ తోడ్కొనివచ్చెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
17. గొప్పరాజులను సంహరించెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
18. సుప్రసిద్ధులైన ప్రభువులను నాశనము చేసెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
19. అమోరీయులరాజగు సీహోనును చంపెను. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
20. బాషానురాజగు ఓగును హతముచేసెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
21. ఆ రాజుల భూములను తన ప్రజలకు ఇచ్చెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
22. తన సేవకులైన యిస్రాయేలీయులకు వానిని భుక్తము చేసెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
23. మనము దీనావస్థలోనున్నపుడు మనలను జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
24. పీడకులనుండి మనలను విడిపించెను. ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
25. ప్రతి ప్రాణికి భోజనము నొసగును. ఆయన స్థిరమైనకృప కలకాలము ఉండును.
26. ఆకాశమునందలి దేవునికి వందనములు అర్పింపుడు. ఆ ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును.
1. మేము బబులోనియా, నదులచెంత కూర్చుండి, సియోనును తలంచుకొని విలపించితిమి
2. అచటనున్న నిరవంజి చెట్లకు మా తంత్రీవాద్యములను తగిలించితిమి.
3. మమ్ము బందీలుగా కొనిపోయినవారు “మీరు పాటలుపాడి మమ్ము ఉల్లాసపరచుడు” అని అడిగిరి. సియోనునుగూర్చిన గీతములు పాడుడని కోరిరి.
4. కాని అన్యదేశమున మేము ప్రభువు కీర్తనలు ఎట్లు పాడుదుము?
5. యెరూషలేమూ! నేను నిన్ను విస్మరించినచో, నా కుడిచేయి చచ్చుపడునుగాక!
6. నేను నిన్ను మరచిపోయినచో, నా మహానందము యెరూషలేమని ఎంచనిచో, నా నాలుక అంగిటికి కరచుకొనిపోవునుగాక!
7. ప్రభూ!యెరూషలేము పట్టువడిన రోజున ఎదోమీయులు ఏమి చేసిరో చూడుము. వారు “ఆ నగరమును పడగొట్టి , నేలమట్టము చేయుడు” అని పలికిరి.
8. బబులోనియా కుమారీ! నీవు తప్పక నాశమగుదువు. నీవు మాకు చేసిన అపకారములకు నీకు ప్రత్యుపకారము చేయువాడు ధన్యుడు.
9. నీ పసిపిల్లలనెత్తి బండమీద కొట్టువాడు ధన్యుడు.
1. ప్రభూ! నీవు నన్ను పరిశీలించి తెలిసికొనియున్నావు.
2. నేను కూర్చుండుటయు, లేచుటయు నీకు తెలియును. నీవు దూరమునుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు.
3. నేను నడచుచున్నను, పరుండియున్నను నీవు గమనింతువు. నా కార్యములెల్ల నీకు తెలియును.
4. నా నోట మాట రాకమునుపే నేనేమి చెప్పుదునో నీ వెరుగుదువు.
5. ముందువెనుకల నీవు నన్ను చుట్టుముట్టియుందువు. నీ చేతిని నామీద నిలిపియుంతువు.
6. నన్ను గూర్చిన నీ తెలివి అత్యద్భుతమైనది. అది చాల ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది.
7. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షమునుండి ఎచ్చటికి పారిపోగలను?
8. నేను గగనమునకు ఎక్కిపోయినచో నీవు అచటనుందువు. పాతాళమున పరుండియున్నచో అచటను ఉందువు
9. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను,
10. నీవచటను నీ చేతితో నన్ను నడిపింతువు. నీ కుడిచేతితో నన్ను ఆదుకొందువు.
11. నేను “చీకటి నన్ను కప్పివేయవలెననియు, నా చుట్టునున్న వెలుతురు చీకటిగా మారవలెననియు” అని కోరుకొన్నను
12. చీకటి నీకు చీకటి కాజాలదు. నీ ముందట చీకటి పగటివలె ప్రకాశించును. రేయింబవళ్ళు నీకు సరిసమానము.
13. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొందించితివి.
14. నీవు నన్ను అద్భుతముగ కలుగజేసిన భీకరుడవు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. ఈ అంశము నాకు బాగుగా తెలియును.
15. నేను రహస్యస్థలమున రూపము తాల్చినపుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనపుడు, నీ కంటికి మరుగైయుండలేదు.
16. నేను పిండముగా నున్నపుడే నీవు నన్ను చూచితివి నాకు నిర్ణయింపబడిన రోజులన్నియు అవి ఇంకను ప్రారంభము కాకమునుపే నీ గ్రంథమున లిఖింపబడియున్నవి.
17. దేవా! నీ ఆలోచనలను గ్రహించుట ఎంత కష్టము! వాని సంఖ్య అపారమైనదికదా!
18. నేను నీ ఆలోచనలను లెక్కింపబూనినచో అవి ఇసుక రేణువులకంటెను ఎక్కువగా నుండును. నేను మేల్కొనినపుడు ఇంకను నీ చెంతనేయుందును
19. దేవా! నీవు దుష్టులను సంహరించిన ఎంత బాగుండును! దౌర్జన్యపరులు నా జోలికిరాకున్న ఎంత బాగుండును!
20. వారు నిన్ను గూర్చి చెడుగా మాట్లాడుచున్నారు, నీ నామమును దూషించుచున్నారు.
21. ప్రభూ! నిన్ను ద్వేషించువారిని నేను ద్వేషించుటలేదా? నీ మీద తిరుగబడువారిని నేనును అసహ్యించుకొనుటలేదా?
22. నేను వారిని పూర్ణముగా ద్వేషింతును. వారిని నా సొంత శత్రువులనుగా భావింతును.
23. దేవా! నన్ను పరిశీలించి నా హృదయమును తెలిసికొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను గుర్తింపుము.
24. నాలో చెడు ఏమైన ఉన్నదేమో చూడుము. శాశ్వతమార్గమున నన్ను నడిపింపుము.
1. ప్రభూ! దుష్టులనుండి నన్ను రక్షింపుము దౌర్జన్యపరులనుండి నన్ను కాపాడుము.
2. వారు నిరంతరము కుట్రలు పన్నుచున్నారు. కలహములు లేవదీయుచున్నారు.
3. వారి నాలుకలు పాముల నాలుకలవలె పదునుగానున్నవి. వారి నోట నాగుబాము విషమున్నది.
4. ప్రభూ! దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. నన్ను కూలద్రోయుటకు కుట్రలు పన్నెడు దౌర్జన్యపరులనుండి నన్ను రక్షింపుము.
5. గర్వాత్ములు నాకొరకు వలయొడ్డి ఉచ్చులుపన్నిరి. నా మార్గములలో ఉరులుపన్ని నన్ను పట్టుకోజూచిరి.
6. నీవే నా దేవుడవనియు నేను నీకు విన్నవించుకొంటిని. ప్రభూ! నీవు నా మొర వినుము.
7. నా దేవుడవైన ప్రభూ! నీవు బలముతో నన్నాదుకొందువు. నన్ను పోరున డాలువలె కాపాడుదువు.
8. ప్రభూ! దుష్టుల కోర్కెలు తీర్పకుము. వారి పన్నాగములను నెరవేరనీయకుము.
9. నా శత్రువులకు విజయమును దయచేయకుము. వారి బెదరింపులు వారినే నాశనము చేయునట్లు చేయుము.
10. వారిమీద నిప్పుకణికలు కురియునుగాక! వారు గోతిలోపడి మరల పైకి లేవకుందురుగాక!
11. కొండెములు చెప్పువారికి విజయము సిద్దింపకుండునుగాక! చెడు అనునది దౌర్జన్యపరులను వెన్నాడి నాశనము చేయునుగాక!
12. ప్రభూ! నీవు పేదలకోపు తీసికొందువనియు, దీనులకు న్యాయము చేకూర్తువనియు నేను ఎరుగుదును.
13. సజ్జనులు నిన్ను కీర్తింతురు. యదార్థవంతులు నీ సమక్షమున జీవింతురు.
1. ప్రభూ! నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను శీఘ్రమే నాయొద్దకు రమ్ము. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నా వేడికోలును ఆలింపుము.
2. నా ప్రార్ధన సాంబ్రాణి పొగవలెను, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలెను, నీ సన్నిధిని చేరునుగాక!
3. ప్రభూ! నా నోటికి కావలి పెట్టుము. నా పెదవుల వాకిట గస్తీని నియమింపుము.
4. నేను చెడును తలపెట్టకుండునట్లును, దుష్టుల దుష్కార్యములలో పాల్గొనకుండునట్లును, వారి విందులు ఆరగింపకుండునట్లును చేయుము.
5. సజ్జనుడు నన్ను దయతో శిక్షించి మందలించినపుడు, అది నాకు తైలాభిషేకము అగునుగాక! అట్టి అభిషేకమును నేను నిరాకరింపక ఉందునుగాక! దుష్టుల దుష్కార్యములను చూచి నేను నిరంతరము ప్రార్ధన చేయుదును.
6. వారి పాలకులు పర్వత శిఖరము నుండి క్రిందికి త్రోయబడినపుడు నా పలుకుల యథార్థత వెల్లడియగును.
7. తిరుగటిరాయి భూమిమీద పడి బ్రద్దలైనట్లుగా వారి ఎముకలు పాతాళద్వారము చేరువన గుల్లయగును.
8. ప్రభూ! నేను నీ మీద దృష్టి నిల్పి నీ శరణుజొచ్చితిని, నన్ను మృత్యువువాత పడనీయకుము.
9. దుష్టులు నా కొరకు పెట్టిన బోనులనుండి నాకొరకు పన్నిన ఉచ్చులనుండి నన్ను కాపాడుము.
10. దుర్మార్గులు తాముపన్నిన ఉరులలో తామే చిక్కుకొందురుగాక! నేను మాత్రము తప్పించుకొని పోవుదునుగాక!
1. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక! ఆయన నా చేతులు యుద్ధము చేయుటకు నాకు తర్ఫీదు నిచ్చును. నా వ్రేళ్ళు పోరుసల్పుటకు నన్ను సంసిద్ధుని చేయును.
2. ఆయన నన్ను కృపతో చూచువాడు, నాకు ఆశ్రయస్థానము, నాకు రక్షణదుర్గము, నన్ను కాపాడువాడు, నాకు డాలు, నేను నమ్ముకొనినవాడు, నా యేలుబడిలోనున్న జాతులను లొంగదీయువాడు.
3. ప్రభూ! నీవు నరుని గుర్తించుటకు అతడు ఏపాటివాడు? నరమాత్రుని గూర్చి తలంచుటకు అతడు ఎంతటివాడు?
4. నరుడు అల్పమైన శ్వాసమువంటివాడు. అతని రోజులు నీడవలె సాగిపోవును.
5. ప్రభూ! ఆకాశమును చీల్చుకొని క్రిందికి దిగిరమ్ము పర్వతములను తాకుము, వానినుండి పొగ వెలువడును.
6. మెరుపులను మెరపించి నా శత్రువులను పారద్రోలుము. బాణములను గుప్పించి వారిని చిందరవందర చేయుము.
7. ఆకాశమునుండి నీ చేతినిచాచి నన్ను రక్షింపుము. విస్తార జలములనుండి నన్ను బయటికి లాగుము. విదేశీయుల బారినుండి నన్ను కాపాడుము.
8. వారు కల్లలాడువారు, కుడిచేతితో అబద్ద ప్రమాణములు చేయువారు.
9. ప్రభూ! నేను నీపై నూతనగీతము పాడెదను. దశతంత్రీ వాద్యముమీటి నిన్ను కీర్తించెదను.
10. నీవు రాజులకు విజయము దయచేయుదువు. నీ సేవకుడైన దావీదునకు భద్రతను ప్రసాదింతువు.
11. దుష్టుల ఖడ్గమునుండి నన్ను కాపాడుము, అన్యజాతివారినుండి నన్ను రక్షింపుము. వారి నోళ్ళు అబద్దములాడును. వారి కుడిచేయి అబద్దసాక్ష్యము చూపును.
12. మన కుమారులు యవ్వనమును బడసి బలముగా ఎదుగు మొక్కలవలె ఒప్పుదురుగాక! మన కుమార్తెలు ప్రాసాదముల మూలలందు నిల్చియుండు మేలైన స్తంభములవలె అలరారుదురుగాక!
13. మన గాదెలు పలు రకముల ధాన్యములతో నిండియుండునుగాక! బీళ్ళలో మన గొఱ్ఱెలు వేవేల పిల్లలను ఈనునుగాక!
14. మన పశువులు సమృద్ధిగా ఆ దూడలను ఈనునుగాక! శత్రువులు మన గోడలను పగులగొట్టకుందురుగాక! ఏ వలసలు వుండకుండుగాక! మన వీధులలో ఆర్తనాదములు వినిపింపకుండును గాక!
15. ఇట్టి దశను చేరుకొనిన జాతి ధన్యమైనది. ప్రభువును దేవునిగా బడసిన జనులు ధన్యులు.
1. నా రాజువైన ప్రభూ! నేను నీ మాహాత్మ్యమును స్తుతింతును. నీ నామమును సదా సన్నుతింతును.
2. ప్రతిదినము నిన్ను వినుతింతును. కలకాలము నీ నామమును ప్రణుతింతును.
3. ప్రభువు మహామహుడు, అత్యధికముగా కీర్తింపదగినవాడు. ఆయన మాహాత్యమును మనము గ్రహింపజాలము.
4. తరతరముల ప్రజలు నీ చేతలను పొగడుదురు. నీ మహాకార్యములను ప్రకటన చేయుదురు.
5. వారు నీ కీర్తి వైభవములను ఉగ్గడింతురు. నేను నీ అద్భుతక్రియలను ధ్యానింతును.
6. జనులు నీ భయంకర కార్యములను ప్రశంసింతురు నేను నీ మాహాత్మ్యమును వెల్లడిచేయుదును.
7. నరులు ఎనలేని నీ మంచితనమును, పొగడుదురు. నీ కరుణను ప్రస్తుతింతురు.
8. ప్రభువు దయాపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు.
9. ఆయన అందరికి మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును.
10. ప్రభూ! నీవు చేసిన ప్రాణులన్నియు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు.
11. వారు నీ రాజ్యవైభవమును సన్నుతింతురు. నీ ప్రాభవమును ఉగ్గడింతురు.
12. దానివలన నరులెల్లరు నీ మహాకార్యములను తెలిసికొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు.
13. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభువు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్ల కరుణతో నిండియుండును.
14. ఆయన పడిపోయినవారిని లేవనెత్తును. క్రుంగిపోయినవారిని పైకిలేపును.
15. ప్రతి ప్రాణియు ఆశతో నీవైపుచూచును. నీవు వానికి అవసరము కల్గినపుడెల్ల తిండి పెట్టుదువు.
16. నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు.
17. ప్రభువు ప్రతికార్యమును న్యాయముతో చేయును ఆయన చెయిదములెల్ల దయతో కూడియుండును
18. ఆయన తనకు మొర పెట్టువారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే యుండును.
19. తనపట్ల భయభక్తులు చూపువారి కోరికలు తీర్చును. వారి మొరలు ఆలించి వారిని రక్షించును.
20. తన్ను ప్రేమించువారిని కాచి కాపాడును. దుష్టులను మాత్రము సర్వనాశనము చేయును.
21. నేను నిరతము ప్రభువును స్తుతింతును. ఆయన పవిత్రనామమును ప్రాణులెల్ల సదా సన్నుతించునుగాక!
1. మీరు ప్రభువును స్తుతింపుడు. ఓ నా ప్రాణమా! ప్రభువునుస్తుతింపుము
2. నా జీవితకాలమంతయు ప్రభువును కొనియాడుదును నేను బ్రతికియున్నన్నినాళ్ళు ఆయన కీర్తనలు పాడుదును.
3. రాజులను నమ్ముకొనకుము. నరమాత్రుడెవ్వడును నిన్ను రక్షింపజాలడు.
4. నరుడు ఊపిరివిడచి మట్టిలో కలిసిపోవును. ఆ దినమే అతని యత్నములెల్ల వమ్మగును.
5. యాకోబు దేవుని అండగా బడసినవాడు, తన ప్రభువైన దేవునిమీద ఆధారపడువాడు ధన్యుడు.
6. ప్రభువు భూమ్యాకాశసముద్రములను వానిలోని సమస్తవస్తువులను చేసినవాడు, ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును.
7. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. ఆకలిగొనినవారికి ఆహారము పెట్టును. బందీలను చెరనుండి విడిపించును.
8. గ్రుడ్డి వారికి చూపునొసగును.క్రుంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆదరముతో చూచును.
9. మన దేశమునవసించు పరదేశులను కాపాడును. వితంతువులను, అనాథశిశువులను ఉద్దరించును. దుర్మార్గుల పన్నాగములను భంగపరచును.
10. ప్రభువు కలకాలము పరిపాలించును. సియోనూ! నీ దేవుడు నిత్యము రాజ్యపాలనము చేయును. మీరు ప్రభువును స్తుతింపుడు.
1. మీరు ప్రభువును స్తుతింపుడు. మన ప్రభువును కీర్తించుట మంచిది. ఆయనను కీర్తించుట యుక్తము, మనోరంజిత కార్యము.
2. ప్రభువు యెరూషలేమును పునరుద్దరించెను. యిస్రాయేలు బందీలను స్వీయదేశమునకు కొనివచ్చెను.
3. భగ్నహృదయుల బాధలు తీర్చి వారి గాయములకు కట్టుకట్టెను.
4. ఆయన నక్షత్రములను లెక్కపెట్టును, ప్రతి తారకకును పేరు పెట్టును.
5. మన ప్రభువు మహాఘనుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానముకలవాడు.
6. ప్రభువు దీనులను లేవనెత్తును. దుష్టులను నేలకు అణగదొక్కును.
7. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు పాడుడు. తంత్రీవాద్యముతో ఆయనను వినుతింపుడు.
8. ఆయన ఆకాశమును మేఘములతో కప్పును. నేలపై వానలు కురియించును. కొండలపై గడ్డిని ఎదుగజేయును.
9. పశువులకును, కావుకావుమని అరచు కాకి పిల్లలకును గ్రాసమొసగును.
10. ఆయన అశ్వబలమును మెచ్చడు. నరుల శౌర్యమును చూచి మురిసిపోడు.
11. తనపట్ల భయభక్తులు చూపువారనిన, తన కృపకొరకు కాచుకొనియుండు వారనిన ఆయనకు ఇష్టము.
12. యెరూషలేమూ! ప్రభువును స్తుతింపుము. సియోనూ! నీ దేవుని కొనియాడుము.
13. ఆయన నీ కవాటములను బలపరుచును. నీ పౌరులను దీవించును.
14. నీ పొలిమేరలను సురక్షితము చేయును. నాణ్యమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచును.
15. ఆయన భూమికి ఆజ్ఞనిచ్చును. ఆయన వాక్యమువడివడిగా పరుగెత్తుకొనివచ్చును
16. ఆయన నేలపై మంచును దుప్పటివలె పరచును. నూగు మంచును బూడిదవలె వెదజల్లును.
17. వడగండ్లను కంకరవలె కురిపించును. ఆయన పంపు చలినెవడు భరింపగలడు?
18. ఆ మీదట ఆయన ఆజ్ఞనీయగా మంచు కరగును. గాలి వీచునట్లు చేయగా నీళ్ళు పారును.
19. ఆయన తన వాక్కును యాకోబునకు విన్పించును. తన కట్టడలను, ధర్మవిధులను యిస్రాయేలీయులకు ప్రకటించును.
20. అన్యజాతులకు ఆయన ఇట్టికార్యమును చేయలేదు ఆయన ధర్మవిధులు వారికి తెలియవు. మీరు ప్రభువును స్తుతింపుడు.
1. మీరు ప్రభువును స్తుతింపుడు. మహోన్నతస్థానమున వసించువారలారా! ఆకసము నుండి మీరు ప్రభువును స్తుతింపుడు.
2. ప్రభువు దూతలారా! మీరందరు ఆయనను స్తుతింపుడు. ప్రభువు సైన్యములారా! మీరందరు ఆయనను స్తుతింపుడు.
3. సూర్య చంద్రులారా! ఆయనను స్తుతింపుడు. ప్రకాశించు తారలారా! మీరందరు ఆయనను స్తుతింపుడు.
4. మహోన్నతాకాశమా! ప్రభువును స్తుతింపుము. ఆకాశముపైనున్న జలములారా! ఆయనను స్తుతింపుము.
5. అవియెల్ల ప్రభు నామమును స్తుతించునుగాక! ఆయన ఆజ్ఞ ఈయగా అవి పుట్టెను.
6. ప్రభువు తిరుగులేని శాసనముతో ఆ వస్తువులనెల్ల వానివాని స్థలములలో శాశ్వతముగా పాదుకొల్పెను.
7. భూమిమీద వసించువారలారా! మీరు ప్రభువును స్తుతింపుడు. మకరములారా! అగాధజలములారా! ఆయనను స్తుతింపుడు.
8. మెరుపులారా, వడగండ్లలారా, హిమమా, పొగమంచులారా, ఆయన ఆజ్ఞకు లొంగు తుఫానూ
9. కొండలారా, తిప్పలారా, పండ్లతోటలారా, అడవులారా
10. సాధుజంతువులారా, వన్యమృగములారా నేలప్రాకుప్రాణులారా, ఎగురుపక్షులారా
11. రాజులారా, సమస్త ప్రజలారా, అధిపతులారా, సమస్త పాలకులారా
12. యువతీయువకులు, వృద్ధులు, బాలబాలికలు
13. అందరును ప్రభునామమును స్తుతింతురుగాక! ఆయన నామము అన్నిటికంటెను గొప్పది. ఆయన మహిమ భూమ్యాకాశములను మించినది
14. ఆయన తన ప్రజలకు అభ్యుదయమును ప్రసాదించెను. కనుక ఆయన ప్రజలెల్లరును, ఆయనకు ప్రీతిపాత్రులైన యిస్రాయేలీయులెల్లరును, ఆయనను స్తుతింతురు
1. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు. భక్తసమాజమున ఆయనను స్తుతింపుడు.
2. యిస్రాయేలీయులు తమ సృష్టికర్తనుచూచి ఆనందింతురుగాక! సియోను పౌరులు తమ రాజునుగాంచి సంతసింతురుగాక!
3. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక! మృదంగములతో, తంత్రీవాద్యములతో ఆయనను కీర్తింతురుగాక!
4. ప్రభువు తన ప్రజలనుగాంచి ప్రీతిచెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను.
5. ప్రభువు ప్రజలు తమ విజయమునకుగాను సంతసింతురుగాక! రేయెల్ల సంతసముతో గానము చేయుదురుగాక!
6. వారి నోటితో ప్రభుని స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక! వారు రెండంచుల కత్తిని చేతబూని
7. అన్యజాతులకు ప్రతీకారము చేయుదురుగాక! ఇతర జాతులను దండింతురుగాక!
8. వారి రాజులను శృంఖలాలతో బంధింతురుగాక! వారి నాయకులకు ఇనుపసంకెలలు వేయుదురుగాక!
9. వారిని ప్రభువు నిర్ణయించిన శిక్షకు గురిచేయుదురుగాక! భక్తులందరి విజయమిదియే, మీరు ప్రభువును స్తుతింపుడు.
1. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మందిరమున ఆయనను స్తుతింపుడు. విశాలాకాశమున ఆయన బలమును స్తుతింపుడు.
2. ఆయన చేసిన మహాకార్యములకుగాను ఆయనను స్తుతింపుడు. ఆయన మాహాత్మ్యమునకు గాను ఆయనను స్తుతింపుడు.
3. బూరలనూది ఆయనను స్తుతింపుడు. స్వరమండలముతో, సితారతో ఆయనను స్తుతింపుడు.
4. తంబురతో, నాట్యముతో ఆయనను స్తుతింపుడు. తంత్రీవాద్యములతో, పిల్లనగ్రోవితో ఆయనను స్తుతింపుడు.
5. చిటితాళములతో ఆయనను సుతింపుడు గంభీర నాదముగల తాళములతో ఆయనను స్తుతింపుడు.
6. బ్రతికియున్న ప్రాణులెల్ల ప్రభువును స్తుతించునుగాక! మీరు ప్రభువును స్తుతింపుడు.