ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జెకర్యా

1. దర్యావేషు పారశీకమునకు రాజుగానున్న కాలము రెండవయేడు ఎనిమిదవనెలలో ప్రభువు తన వాక్కును జెకర్యా ప్రవక్తకు వినిపించెను. అతడు బెరాకియా కుమారుడు, ఇద్ధో మనుమడు.

2. సైన్యములకధిపతియైన ప్రభువు జెకర్యాను ప్రజలతో ఇట్లు చెప్పుమనెను: “ప్రభుడనైన నేను మీ పూర్వులపై మిగుల ఆగ్రహము చెందితిని.

3. కాని ఇపుడు నేను మీతో చెప్పునదేమనగా మీరు నా వైపు మరలుడు, నేను మీవైపు తిరుగుదును.

4. మీరు మీ పూర్వులవలె ప్రవర్తింపవలదు. పూర్వ కాలముననే ప్రవక్తలు 'మీరు దుష్కార్యములుచేయుచు పాపపు జీవితము జీవింపవలదు' అని వారిని హెచ్చరించిరి. కాని వారు నా మాటవినలేదు, నాకు విధేయులు కాలేదు.

5. మీ పూర్వులుకాని ఆ ప్రవక్తలు కాని ఇపుడులేరు.

6. అయినను నేను నా సేవకులైన ప్రవక్తలద్వారా వినిపించిన ఆజ్ఞలు, హెచ్చరికలు నెరవేరగ మీ పూర్వులు గతించిన పిదపగూడ మిగిలియున్నవికదా! వారపుడు పశ్చాత్తాపపడిరి. సైన్యములకధిపతియు ప్రభుడనైన నేను నా సంకల్పము చొప్పున వారిని తమ ప్రవర్తనకు తగినరీతిగానే శిక్షించితినని వారు అంగీకరించిరి.”

7. దర్యావేషు పరిపాలన రెండవయేట షేబాతు అనబడు పదునొకండవనెల ఇరువది నాలుగవదినమున రాత్రి దర్శనమున ప్రభువు నాకు ఈ సందేశము నెరిగించెను.

8. నేను ప్రభువుదూత ఎఱ్ఱని గుఱ్ఱము నెక్కిపోవుటను గమనించితిని. అతడు ఒక లోయలో గొంజిచెట్ల నడుమ ఆగెను. అతని వెనుక ఎరుపు, ముదురు గోధుమ, తెలుపురంగుగల గుఱ్ఱములు ఉండెను.

9. “అయ్యా! ఈ అశ్వముల భావమేమిటి?” అని నేనతనిని అడిగితిని, అతడు "నేను వాని భావము నీకెరిగింతును.

10. భూమిని పరిశీలించి చూచుటకుగాను ప్రభువు వానిని పంపెను” అని అనెను.

11. అంతటవి గొంజిచెట్ల నడుమనున్న దేవదూతతో “మేము ప్రపంచమంతట తిరిగి చూచితిమి. లోకమంతయు నెమ్మదితోను శాంతితోను ఒప్పుచున్నది” అని అనెను.

12. అపుడు దేవదూత "సైన్యములకధిపతియైన ప్రభూ! ఇప్పటికి డెబ్బది యేండ్ల నుండి నీవు యెరూషలేము మీదను, యూదా నగరముల మీదను ఆగ్రహము చెందియుంటివి. నీవు ఆ పట్టణములపై దయచూపుటకు ఇంకెంత కాలము పట్టును?” అని అడిగెను.

13. ప్రభువు ఓదార్పు మాటలతో అతనికి జవాబు చెప్పెను.

14. దేవదూత నన్ను సైన్యములకధిపతియైన ప్రభువు పలుకులను ఇట్లు ప్రకటింపుము అనెను: “నాకు యెరూషలేముపట్ల గాఢమైన ప్రేమాదరములు కలవు.

15. నెమ్మదిని, శాంతిని అనుభవించుచున్న అన్యజాతులపై నేను ఆగ్రహము చెందితిని. నేను నా ప్రజలపై కొద్దిగా కోపించితిని. కాని ఆ జాతులు వారి బాధలను అధికము చేసెను.

16. కావున నేను యెరూషలేముపై దయచూపుటకు ఈ నగరమునకు తిరిగివచ్చితిని. నా దేవళమును పునరుద్దరింతురు. యెరూషలేమును తిరిగి నిర్మింతురు.”

17. మరియు దేవదూత నన్నిట్లు ప్రకటింపుము అనెను: “సైన్యములకధిపతియైన ప్రభువు పలుకులివి: నా నగరములు మరల పెంపుచెందును. నేను యెరూషలేమును మరల ఆదుకొందును. దానిని మరల నా దానినిగా చేసికొందును.”

18. అంతట నేను మరియొక దర్శనమున నాలుగు కొమ్ములను చూచితిని.

19. నేను "అయ్యా! వీని భావమేమి?” అని నాతో సంభాషించు దేవదూత నడిగితిని. “అవి యూదావారిని, యిస్రాయేలువారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన మహాశక్తులను సూచించునని” అని అతడు చెప్పెను.

20. అపుడు ప్రభువు నాకు నలుగురు కమ్మరి వారిని చూపించెను.

21. “వీరేమి చేయవచ్చిరి?" అని నేను ప్రభువును ప్రశ్నించితిని. “వీరు యూదాను నాశనము చేసి దాని ప్రజలను చెదరగొట్టిన జాతులను భయపెట్టి సంహరించుటకు వచ్చిరి” అని జవాబిచ్చెను.

1. నేను మరియొక దర్శనమున లంబసూత్ర మును చేతబట్టుకొనియున్న నరుని చూచితిని.

2. నేను అతనిని “నీవెచటికి పోవుచున్నావు?” అని అడుగగా అతడు “నేను యెరూషలేమును కొలిచి దాని పొడవును, వెడల్పును తెలిసికోగోరుచున్నాను” అని అనెను.

3. అంతట నాతో మాట్లాడు దేవదూత ముందునకు నడుచుచుండగా మరియొక దేవదూత అతని చెంతకు వచ్చెను.

4. మొదటి దేవదూత రెండవ వానితో “నీవు శీఘ్రమేపోయి ఆ లంబసూత్రమును చేతబట్టుకొనియున్న యువకునితో ఇట్లు చెప్పుము: యెరూషలేమున చాలమంది మనుష్యులును, చాల పశువులును వసించును. గనుక దానికి ప్రాకారము పనికిరాదు.

5. ప్రభువే దానికి అగ్ని ప్రాకారముగ నుండి దానిని కాపాడుదుననియు, తాను దాని మధ్య వైభవోపేతముగా వసింతుననియు అని మాట యిచ్చెను”. ఇది ప్రభువు వాక్కు

6. ప్రభువు తన ప్రజలతో ఇట్లనెను: “నేను మిమ్ము నలుదిక్కులకు చెదరగొట్టితిని. కాని ప్రవాసులారా! , మీరు ఇపుడు ఉత్తరదేశము నుండి తప్పించుకొని తిరిగిరండు.

7. బబులోనియాలో వసించు సియోను ప్రజలారా! మీరు తప్పించుకొనిరండు.

8. సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కిది: మిమ్ము ముట్టుకొనినవాడు తన కంటిపాపను ముట్టుకొనినట్లేయని యెంచి తనకు ప్రసిద్దితెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజాతులయొద్దకు నన్ను ఈ సందేశము చెప్పబంపెను.

9. 'నేను నా బాహువును మీపై ఆడించగా, మీరు మీదాసులకు దోపుడు సొమ్మగుదురు' ఈ కార్యము జరిగినపుడు ఎల్లరును సైన్యములకధిపతియైన ప్రభువు నన్ను పంపెనని గ్రహింతురు.

10. ప్రభువు ఇట్లనుచున్నాడు: 'సియోను కుమార్తె! నీవు సంతసముతో పాటలు పాడుము నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను'

11. ఆ కాలమున పెక్కుజాతులు ప్రభువువద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన మీ నడుమ వసించును. ఆయనే నన్ను పంపెనని మీరు గ్రహింతురు.

12. ప్రభువు పవిత్రదేశమున యూదా మరల ప్రభువు స్వాస్త్యమగును ఆయన యెరూషలేమును మరల ఎన్నుకొనును.

13. ఆయన తన పవిత్రనివాస స్థానమునుండి విజయము చేయుచున్నాడు. ప్రభువు ఎదుట ఎల్లరును మౌనము వహింతురుగాక!

1. ప్రభువు మరియొక దర్శనమున ప్రధాన యాజకుడగు యోహోషువ దేవదూత ముందు నిలుచుండి యుండుటను నాకు చూపించెను. యోహోషువ మీద నేరము మోపుటకై సాతాను అతని కుడి ప్రక్కన నిలుచుండియుండెను.

2. దేవదూత అతనితో “సాతానూ! ప్రభువు నిన్ను ఖండించునుగాక! యెరూషలేమును కోరుకొను ప్రభువు నిన్ను గద్దించును గాక! ఈ నరుడు నిప్పునుండి బయటకు తీసిన కొరివి వలె ఉన్నాడు” అని అనెను.

3. యోహోషువ మురికిబట్టలతో దేవదూత ముందట నిలుచుండియుండెను.

4. దేవదూత తన యెదుట నిలుచుండియున్న పరిచారకులతో “మీరితనికి మురికిబట్టలు తొలగింపుడు” అని చెప్పెను. అంతట అతడు యోహోషువతో “నేను నీ పాపములను తొలగించితిని. నీకు ప్రశస్థమైన దుస్తులు ఇత్తును” అని అనెను.

5. అతడు యోహోషువ తలమీద తెల్లనిపాగా పెట్టుడని ఆ పరిచారకులను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ప్రభువుదూత అచట నిలుచుండి యుండగా వారు యోహోషువకు ప్రశస్థమైనదుస్తులు తొడిగించిరి.

6. అటుపిమ్మట దేవదూత యోహోషువతో ఇట్లనెను:

7. "సైన్యములకధిపతియగు ప్రభువు పలుకులివి. నీవు నా ఆజ్ఞలను పాటించి నేను నీకు నియమించిన బాధ్యతలు నెరువేరువేని నా దేవళము పైనను, దాని ఆవరణములపైనను అధికారము నెరపుదువు. నేను నా సన్నిధిలోనుండు దేవదూతల మనవులను ఆలించినట్లే నీ మనవులను గూడ ఆలింతును.

8. ప్రధానయాజకుడగు యోహోషువా! అతని తోడి యాజకులారా! మీరెల్లరును వినుడు. మీరు భావి శుభమునకు సూచకముగా ఉందురు. నేను చిగురు అనబడు నా సేవకుని కొనివత్తును.

9. నేను యెహోషువ యెదుట ఒక్క రాతి నుంచేదను. దానికి ఏడు కన్నులుండును. దానిపై లేఖనమును చెక్కుదును. ఒక్క రోజులోనే నేను ఈ దేశము యొక్క పాపమును పరిహరింతును.

10. ఆ దినము వచ్చినపుడు మీరెల్లరును ఒకరినొకరు పిలుచుకొనుచు సుఖశాంతులతో మీ అంజూరపుచెట్ల క్రిందను, ద్రాక్షల చెట్ల క్రిందను కూర్చుందురు” ఇదియే సైన్యముల కధిపతియగు ప్రభువు వాక్కు

1. నాతో మాటలాడు దేవదూత నాయొద్దకు తిరిగివచ్చి నన్ను నిద్రించువానిని లేపినట్లుగా లేపెను.

2. అతడు “నీ కేమి కనిపించుచున్నది?” అని నన్నడిగెను. నేను ఇట్లంటిని: “నాకు బంగారముతో చేసిన దీపస్తంభము కనిపించుచున్నది. దానిపై నూనెపోయు పాత్రమున్నది. ఆ స్తంభముపై ఏడు దీపములున్నవి. ఒక్కొక్క దీపమునకు వత్తులనుంచు నాలుకలు ఏడున్నవి.

3. దీపస్తంభమునకు కుడిఎడమలందు ఒక్కొక్కటి చొప్పున రెండు ఓలివుచెట్లు కలవు.”

4. ఇట్లు చెప్పి, నేను "అయ్యా! వీని భావము ఏమిటి?” అని దేవదూత నడిగితిని.

5. “వీని అర్థము నీకు తెలియదా?” అని అతడు నన్ను ప్రశ్నించెను. “తెలియదు” అని నేనంటిని.

6. దేవదూత నాతో ఇట్లనెను. సెరుబ్బాబెలునకు ప్రభువు సెలవిచ్చు సందేశమును ఇట్లు చెప్పుమనెను: "సైన్యబలమువలన కాదు, నీ సొంతబలమువలనను కాదు. కేవలము నా ఆత్మవలననే నీకు విజయము కలుగును- ఇదియే సైన్యములకధిపతియగు ప్రభువు వాక్కు

7. ఉన్నతపర్వతములు కూడ సెరుబ్బాబెలునకు సమతలమైన ప్రదేశమగును. అతడు ఆలయ నిర్మా ణము చేయును. దానికతడు పైన చివరిరాయి పెట్టించునపుడు జనులందరు ఆనందముతో 'ఇది వరమే! ఇది వరానుగ్రహమే!' అని ధ్వానము చేయుదురు.

8. ప్రభువు నాకు మరల తన సందేశమును ఇట్లు వినిపించెను:

9. “సెరుబ్బాబెలు ఈ మందిరమునకు పునాదులెత్తెను. అతడు దాని నిర్మాణమును పూర్తిచేయును. ఈ కార్యము జరిగినప్పుడు సైన్యములకధిపతియైన ప్రభువు నిన్ను వారి చెంతకు పంపెనని నా ప్రజలు గ్రహింతురు.

10. ఆ వారు కొద్దిపాటి పనియే జరిగినదని నిరుత్సాహపడుచున్నారు. అయినను సెరుబ్బాబెలు దేవాలయనిర్మాణమును కొన సాగించుటను చూచి వారు ప్రమోదము చెందుదురు.” అ దేవదూత “ఏడుదీపములు లోకము నంతటిని పరిశీలించి చూచు ప్రభువు ఏడుకన్నులు” అని చెప్పెను.

11. “దీపస్తంభమునకు ఇరువైపులనున్న రెండు ఓలివుచెట్ల భావమేమిటి?

12. ఓలివుతైలము కారుచున్న రెండు బంగారు గొట్టముల ప్రక్కనున్న ఆ రెండు ఓలివుకొమ్మల అర్థమేమిటి?” అని నేనడిగితిని.

13. “వాని భావము నీకు తెలియదా?” అని అతడు నన్ను ప్రశ్నించెను. “తెలియదు” అని నేను చెప్పితిని.

14. "ఈ రెండు సర్వలోకాధిపతియైన ప్రభువు తనను సేవించుటకుగాను అభిషేకించిన యిరువురు మనుష్యులను సూచించును” అని అతడు పలికెను.

1. నేను మరల కన్నులెత్తి చూడగా ఆకసమున ఎగురుచున్న గ్రంథపుచుట్ట కనిపించెను.

2. “నీకేమి కనిపించుచున్నది” అని దేవదూత నన్నడిగెను. నేను “ఆకసమున ఎగురు గ్రంథపుచుట్ట కనిపించు చున్నది. అది ఇరువదిమూరల పొడవు పదిమూరలు వెడల్పు కలిగియున్నది” అని చెప్పితిని.

3. అంతట అతడు ఇట్లనెను: “దీనిపై వ్రాసిన శాపము దేశమంతటిమీదికిని పోవును. గ్రంథపుచుట్ట ఒక ప్రక్క ప్రతిదొంగయు దేశమునుండి బహిష్కరింప బడునని చెప్పుచున్నది. మరియొక ప్రక్క అబద్ద ప్రమాణములు చేయు ప్రతివాడును దేశమునుండి బహిష్కరింపబడునని నుడువుచున్నది.

4. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: నేనీ శాపమును దేశముమీదికి పంపుదును. అది ప్రతి దొంగయింటను, అబద్ద ప్రమాణముచేయు ప్రతివాని ఇంటను ప్రవేశించును. అది వారి ఇండ్లలోనుండి పోయి వారి ఇండ్ల దూలములను, రాళ్ళనుగూడ నాశనము చేయును.”

5. నాతో మాటలాడు దేవదూత బయల్వెడలి, నాతో ఇట్లనెను: “నీ కన్నులెత్తి ఆ వచ్చుదానిని చూడుము” అనెను.

6. "అది ఏమిటి?” అని నేను ప్రశ్నించితిని. అతడు “అది ఒక కొలతబుట్ట'. అది భూలోకమంతటను జరుగు వారి వ్యవహారమును సూచించును” అని చెప్పెను.

7. ఆ బుట్టకు సీసపు మూతకలదు. నేను చూచుచుండగా ఆ మూత తీయబడెను. బుట్టలో నొక స్త్రీ కూర్చుండియుండెను.

8. దేవదూత “ఈ స్త్రీ దుష్టత్వమును సూచించును” అని చెప్పెను. అతడు ఆమెను బుట్టలోనికి నొక్కి దానిపై మరల సీసపుమూత బరువు పెట్టెను.

9. నేను చూచుచుండగా ఇరువురు స్త్రీలు నా చెంతకు ఎగిరివచ్చిరి. వారికి సారసపక్షికివలె బలమైన రెక్కలుండెను. వారు ఆ బుట్టను భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి మోసికొనిపోయిరి.

10. వారా బుట్టనెచటికి తీసికొని పోవుచున్నారని నేను దేవదూతను ప్రశ్నించితిని.

11. అతడిట్లు చెప్పెను: “దానిని షీనారు నగరమునకు కొనిపోవుచున్నారు. అచట దానికొక దేవళమును నిర్మింతురు. ఆ దేవళము పూర్తియైనప్పుడు ఆ బుట్టను దానిలో పెట్టి పూజింతురు."

1. నేను కన్నులెత్తి చూడగా ఈ దృశ్యము కనిపించెను. నాలుగు రథములు రెండు కంచుకొండల నుండి వెలుపలికి వచ్చుచుండెను.

2-3. మొదటి రథమును ఎఱ్ఱగుఱ్ఱములును, రెండవదానిని నల్లగుఱ్ఱములును, మూడవదానిని తెల్లగుఱ్ఱములును, నాలుగవదానిని చుక్కలు కలిగిన గుఱ్ఱములును లాగుచుండెను.

4. అపుడు "అయ్యా! ఈ రథముల భావమేమిటి?” అని నేను దేవదూతనడిగితిని.

5. “ఇవి నాలుగు ఆత్మములు. ఇవి ఇప్పుడే సర్వలోకాధిపతియైన ప్రభువు సమక్షమునుండి వచ్చినవి” అని అతడు చెప్పెను.

6. నల్లగుఱ్ఱములులాగు రథము ఉత్తరదిక్కున నున్న బబులోనియాకు పోవుచుండెను. తెల్లగుఱ్ఱములు లాగునది దానిననుసరించి వెంటపోవుచుండెను. చుక్కలుగలిగిన గుఱ్ఱములులాగునది దక్షిణదేశమునకు పోవుచుండెను.

7. చుక్కలుకలిగిన గుఱ్ఱములు కాలు కదపి భూమిని పరిశీలింపబోవుటకు త్వరపడుచున్నట్లు కనిపించెను. దేవదూత “మీరు వెళ్ళి భూలోకమంతట పరీక్షించిచూడుడు” అని వానితో చెప్పెను.

8. అంతట దేవదూత "ఉత్తరదిక్కుననున్న బబులోనియాకు వచ్చిన అశ్వములు ప్రభువు ఆత్మను ఉపశమింపచేసినవి” అని నాతో చెప్పెను.

9. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

10. “బబులోనియా ప్రవాసమునుండి వచ్చిన హెల్దయి, తోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా ఇంటనున్నారు. వారచట దిగియున్న దినముననే నీవు ఆ ఇంటికి వెళ్ళి,

11. వారినడిగి వెండి బంగారములు తీసుకొని, కిరీటము చేసి యెహోసాదాకు పుత్రుడును, ప్రధానయాజకుడునైన యెహోషువా శిరస్సునలంకరింపుము.

12. సైన్యములకధిపతియైన ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము. “చిగురు అనబడు నరుడు తానున్నచోటనే వృద్ధి చెందును. అతడు ప్రభువు మందిరమును పునర్నిర్మించును.

13. ఆ జనుడు దేవళమునుకట్టి రాజ గౌరవమును బడసి సింహాసనాసీనుడై పాలించును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయును'. ఈ ఇరుబాధ్యతలమధ్య శాంతిసామరస్యములు నెలకొని యుండును.

14. ఆ కిరీటము హెల్దయి, తోబియా, యెదాయా, యోషీయాల కీర్తికి జ్ఞాపకార్థముగా దేవాలయమున ఉండును.

15. దూరముననున్నవారు తిరిగివచ్చి ప్రభువు దేవాలయ నిర్మాణమున తోడ్పడుదురు. దానిని పునర్నిర్మించినపుడు సైన్యములకధిపతియైన ప్రభువు నన్ను పంపెనని మీరు గుర్తింతురు. మీరు మీ దేవుడైన ప్రభువు యావే ఆజ్ఞలు పాటింతురేని ఇదియంతయు జరుగును”.

1. దర్యావేషు పరిపాలనాకాలము నాలుగవయేట, కిస్లేవు అను తొమ్మిదవ నెలలో నాలుగవదినమున ప్రభువు నాకు తన సందేశము వినిపించెను.

2. బేతేలు ప్రజలు షెరెజెరును, రెగెమ్మెలెకును, వారి అనుయాయులను సైన్యములకధిపతియైన ప్రభువు దేవళమునకు పంపిరి. వారు ప్రభువును శాంతిపరచుటకై,

3. “మేము ఇన్ని యేండ్లనుండి చేసినట్లుగా, ఐదవనెలలో ఉపవాసముండి విలపింపవలెనా?” అని మందిరమున నున్న యాజకులను, ప్రవక్తలను మనవి చేయగా,

4. సైన్యములకధిపతియైన ప్రభునివాక్కు నాతో ఇట్లనెను.

5. "నీవు దేశములోని ప్రజలకును, యాజకులకును ఇట్లు చెప్పుము: 'మీరు కడచిన డెబ్బది యేండ్లలోను ఐదు, ఏడవనెలలయందు నాయందు భక్తిగలిగియే ఉపవాసముండి విలపించిరా?

6. మీరు అన్నపానీయములు పుచ్చుకొనినది గూడ స్వీయ తృప్తి కొరకే గదా!

7. యెరూషలేము వృద్ధిచెంది ప్రజలతో నిండియున్నప్పుడు, దాని పరిసరనగరములలో పెక్కుమంది వసించుచున్నపుడు, దాని దక్షిణ భాగమునను, పడమర నున్న కొండపాదులలోకూడ ప్రజలు వసించుచున్నపుడు, ప్రభువు పూర్వప్రవక్తల ద్వారా వినిపించిన సందేశమును మీరు మననము చేసుకొనక ఉండవచ్చునా?

8. ప్రభువువాణి జెకర్యాకిట్లు చెప్పెను:

9. “పూర్వము నేను నా ప్రజలను ఇట్లాజ్ఞాపించితిని. మీరు న్యాయము జరిగింపవలెను. ఒకరియెడలనొకరు దయతోను, జాలితోను మెలగవలెను.

10. వితంతువులను, తండ్రిలేనివారిని, మీ మధ్య వసించు పరదేశులను, పేదలను పీడింపకూడదు. ఒకరికొకరు కీడు తలపెట్టరాదు".

11. కాని నా ప్రజలు మొండితనముతో నా పలుకులు ఆలింపరైరి. వారు తమ చెవులను గట్టిగా మూసికొనిరి.

12. తమ హృదయములను చెకుముకి రాతివలె కఠినము చేసికొనిరి. నేను నా పూర్వ ప్రేషిత ప్రవక్తల ద్వారా చెప్పించిన ఉపదేశమును వారు విననందున నేను వారిపై ఆగ్రహము చెందితిని. ఇదియే సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కు

13. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు: 'వారు నేను పలికిన పలుకులను ఆలింపలేదు. కనుక నేను వారి వేడుకోలును ఆలింపనైతిని.

14. నేను తుఫానువలె వారిని అన్యదేశములకు చెదరగొట్టితిని. వారి భూమి జనావాసములేని మరు భూమి అయ్యెను. వారు తమ సుందరదేశమును ఎడారిచేసికొనిరి.

1. సైన్యములకధిపతియైన ప్రభువువాణి ప్రత్యక్షమై జెకర్యాతో ఇట్లనెను:

2. “మిగుల ఆసక్తితో నేను సియోను విషయములో రోషము కలిగియున్నాను. బహురౌద్రము గలవాడినై దాని విషయములో నేను గాఢానురక్తి కలిగియున్నాను.

3. నేను సియోనుకు మరలివచ్చి దాని నడుమ వసింతును. అది విశ్వసనీయమైన నగరముగా చలామణియగును. సైన్యముల కధిపతియగు ప్రభువు పర్వతమును పవిత్రనగరమని పిల్తురు.

4. పండుముదుసలులు వృద్దులేమి, వృద్దురాండ్రేమి ఇంకను మరల ఊతకట్టి పట్టుకొని యెరూషలేము నగరవీధులలో కూర్చుందురు.

5. ఆ నగర పురవీధులు మరల ఆటలాడుకొను బాలబాలికలతో నిండియుండును. ఇదియే సైన్యములకధిపతియగు ప్రభువు వాక్కు

6. ఈ ప్రజలలో అపుడు శేషించియున్నవారికి ఇది అబ్బురముగానున్నను, నాకును ఆశ్చర్యమని తోచునా?

7. సైన్యములకధిపతియగు ప్రభువు వాణి ఇట్లనెను: నా ప్రజలను బందీలనుగా కొనిపోయిన దేశములనుండి నేను వారిని విడిపించుకొని వత్తును.

8. వారిని తూర్పుపడమరలనుండి తీసికొనివచ్చి యెరూషలేమున పాదుకొల్పుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. న్యాయ యుక్తముగను, విశ్వాసయోగ్యముగను నేను వారిని పాలింతును”.

9. సైన్యములకధిపతియగు ప్రభువు ఇట్లనుచున్నాడు: “నా మందిర నిర్మాణమునకు పునాదులెత్తినపుడు ప్రవక్తలనోట పలుకబడిన పలుకులనే ఈ కాలమునను వినువారలారా! మీరు ధైర్యము తెచ్చుకొనుడు.

10. ఆ కాలమునకు ముందు పేదరికము వలన ఎవడును నరులను, పశువులను కూలికిని, బాడుగకును కుదుర్చుకోజాలడయ్యెను. ఎవనికిని శత్రుభయము తప్పలేదు. ఏలయన, నేను ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుకొనునట్లు చేసితిని.

11. కాని ఇప్పుడు ఈ ప్రజలలో శేషించియున్న వారిపట్ల నేను మునుపు విరోధినైనట్లు ఇపుడు విరోధిగా ఉండను.

12. వారు శాంతితో పైరులు వేసికొందురు. వారి ద్రాక్షలు ఫలించును. నేల పంటలుపండును. వానలు మెండుగా కురియును. నా జనులలో మిగిలియున్న వారికి నేను వీటినన్నింటిని హక్కుభుక్తముగా ఇత్తును”. ఇదియే సైన్యములకధిపతియగు ప్రభువు వాక్కు.

13. యూదా, యిస్రాయేలు ప్రజలారా! పూర్వము అన్యజాతి ప్రజలు మీ పేరును ఎట్లు శాపములలో వాడుకొంటిరో, అటులనే మీ పేరును దీవెనలలో వాడుకొను నట్లు నేను మిమ్ము రక్షింతును. కావున మీరు ధైర్యము నొందుడు, భయపడకుడు.”

14. సైన్యములకధిపతియగు ప్రభువు ఇట్లను చున్నాడు: “మీ పూర్వులు నాకు కోపము రప్పించినపుడు దయచూపక నేను వారిని శిక్షింపనెంచితిని. నా సంకల్పమును మార్చుకోనైతిని.

15. కాని యిప్పుడు నేను యూదా, యిస్రాయేలు ప్రజలకు మేలు చేయ నెంచుచున్నాను. కనుక మీరు భయపడవలదు.

16. మీరు చేయవలసిన కార్యములివి. ఒకరితోనొకరు సత్యము పలుకుడు. మీ న్యాయ స్థానములలో శాంతికి ఆలవాలమైన న్యాయము జరిగింపుడు.

17. ఒకరి కొకరు కీడు తలపెట్టకుడు. కూటసాక్ష్యము పలుకకుడు. ఇట్టి పనులు నాకు గిట్టవు”. ఇది ప్రభువు వాక్కు

18. సైన్యములకధిపతియగు ప్రభువు వాణి దిగివచ్చి జెకర్యాతో ఇట్లనెను:

19. “నాలుగవ నెలలో ఉపవాసము, ఐదవ నెలలో ఉపవాసము, ఏడవ నెలలో ఉపవాసము, పదియవనెలలో ఉపవాసదినములు ఇకమీదట యూదా ప్రజలకు సంతోషకరములును, ఆనందప్రదములునైన ఉత్సవదినములు అగును. మీరు మాత్రము శాంతిని, సత్యమును ప్రేమింపుడు.”

20. సైన్యములకధిపతియగు ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “మహానగరములనుండి ప్రజలు యెరూషలేమునకు ఏతెంచు కాలము వచ్చుచున్నది.

21. ఒక నగరప్రజలు మరియొక నగరజనుల యొద్దకు వచ్చి 'మేము సైన్యములకధిపతియగు ప్రభువును ఆరాధింప బోవుచున్నాము. ఆయన దీవెనలు అడుగుకో బోవుచున్నాము. మీరును మాతో ఆలస్యము చేయక రండు” అని చెప్పగా వారు 'మేము వత్తుము' అని అందురు.

22. మహాజాతులును, బలసంపున్నులైన ప్రజలును సైన్యములకధిపతియగు ప్రభువును వెదకుటకును, ప్రభువును సమాధాన పరుచుటకును యెరూషలేమునకు వచ్చెదరు.

23. సైన్యములకధిపతియగు ప్రభువు చెప్పునది ఏమనగా, ఆ దినములలో అన్యజాతి ప్రజలు పదిమంది ఒక్క యూదుని చెంగుపట్టుకొని “దేవుడు మీకు తోడుగానున్నాడని వింటిమి. కనుక మేమును మీతోకూడా వచ్చెదము” అని పలుకుదురు.

1. హద్రాకు మండలము, దమస్కు నగరములను గూర్చి వచ్చిన దైవోక్తి. ప్రభువు సమస్తజనులను, యిస్రాయేలీయుల తెగవారినందరిని లక్ష్యపెట్టువాడు కనుక,

2. దాని పొలిమేరలను ఆనుకొనియున్న హమాతును గూర్చియు నైపుణ్యముతో అలరారుతూరు, సీదోనులను గూర్చియు అదివచ్చెను.

3. తూరు తనరక్షణ కొరకు కోటను నిర్మించుకొనెను. ఇసుక రేణువంత వెండిని, వీధులలో కసువంత బంగారమును విస్తారముగా కూడబెట్టుకొనెను.

4. ప్రభువు దాని ప్రాపకమైన సముద్రబలమును నాశనముచేసి, దాని సొత్తునంతటిని పరులచేతికి అప్పగించును, ఆ నగరము అగ్నికి కాలిపోవును.

5. ఈ ఉదంతమును చూచి అష్కేలోను వ్యధచెందును. గాజా దుఃఖించును, ఎక్రోను గూడ తనను నమ్ముకొనునది అవమానమునొందగా భీతి ల్లును. దాని ఆశలు వమ్మగును. గాజా రాజు చచ్చును. అష్కేలోను ఎడారియగును.

6. అష్దోదున సంకరజాతి వసించును. నేను ఫిలిస్తీయుల పొగరు అణగింతునని ప్రభువు పలుకుచున్నాడు.

7. వారిక నెత్తురుతోకూడిన కూడుగాని ఇతర నిషిద్ధ ఆహారములుగాని భుజింపరు. వారిలో మిగిలినవారు నా ప్రజలలో కలిసిపోయి యూదాలో ఒక తెగ అగుదురు. యెబూసీయులవలె ఎక్రోను జనులును నా ప్రజలలో ఒక భాగమగుదురు.

8. నేను కనులారగాంచితిని గనుక బాధించు సేనలను దానిగుండ నడచిపోనీయను. దౌర్జన్యకారులు నా మందిరముమీదికి రాకుండను దానిని కాపాడు కొనుటకై ఒక కావలిశిబిరమును ఏర్పరుతును.

9. సియోను కుమారీ! నీవు మిగులసంతసింపుము. యెరూషలేము కుమారీ! నీవు ఆనందనాదము చేయుము. అదిగో! నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడును, రక్షణగలవాడును దీనుడునై గాడిదపైనను, గాడిదపిల్లపైనను ఎక్కివచ్చును.

10. ప్రభువు ఇట్లనుచున్నాడు: “నేను యిస్రాయేలునుండి రథములను, యెరూషలేమునుండి యుద్ధాశ్వములను తొలగింతును. ధనుస్సులు నాశనమగును. నీ రాజు శాంతివార్త అన్యజనులకు తెలియజేయును ఆయన రాజ్యము సముద్రమునుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నదినుండి నేల అంచులవరకును వ్యాపించును.

11. ప్రభువిట్లనుచున్నాడు: నేను మీతో చేసుకొనిన నిబంధన రక్తమును బట్టి నీళ్ళులేని గుంటవంటిదగు ప్రవాసపు చెరనుండి మీ ప్రజలకు విముక్తి దయచేయుదును.

12. విడుదలకై వేగిరపడు ప్రవాసులారా! మీరు మీ దుర్గమునకు తిరిగి ప్రవేశింపుడు మీరనుభవించిన యాతనలకుగాను నేడు నేను మీకు రెండంతలు మేలుచేయుదును.

13. నేను యూదాను నా ధనుస్సువలె ఎక్కుపెట్టి ఎఫ్రాయమును బాణమువలె సంధించి సియోను! నీ కుమారులనురేపి, యోధుడు ఖడ్గమును ప్రయోగించునట్లు, గ్రీకులతో పోరాడుటకు నిన్ను ప్రయోగింతును.

14. ప్రభువు తన ప్రజలకు పైగా ప్రత్యక్షమగును. అతని బాణములు మెరుపులవలె మెరయును. సైన్యములకధిపతియైన ప్రభువు బాకానూదుచూ, దక్షిణ దిక్కునుండి వచ్చు గాలి దుమారముతో కదలివచ్చును.

15. సైన్యములకధిపతియైన యావే ప్రభువు తన జనులను కాపాడును. వారు తమ శత్రువులను హతము చేయుదురు. ఒడిసెలరాళ్ళతో వారినణగదొక్కుదురు. ఆ ప్రజలు త్రాగి మత్తెక్కినవారివలె పోరున కేకలిడుచు తమ శత్రువులనెత్తురు నొలికింతురు. బలిపశువురక్తము, పాత్రములును, బలిపీఠపు మూలలును నిండునట్లు, రక్తముతో నిండియుందురు.

16. ఆ దినము వచ్చినపుడు ప్రభువు తన ప్రజలను కాపరి మందనువలె కాపాడును. వారు అతని దేశమున కిరీటమునందలి మణులవలె వెలుగొందుదురు.

17. దేశము మనోహరముగను, క్షేమకరముగను రాజిల్లును. ధాన్యముచేత యవ్వనులును, క్రొత్త ద్రాక్షారసముచేత యవ్వనస్త్రీలును వృద్ధినొందుదురు.

1. మీరు వసంతకాలమున వానకొరకు ప్రభువును వేడుడు. అతడే మబ్బులు, జల్లులు పంపి ప్రతివాని పొలము పచ్చబడునట్లు చేయును.

2. ప్రజలు గృహదేవతలను, సోదెకాండ్రను సంప్రతింపగా, వారు వారికి కల్లబొల్లి జవాబులు చెప్పిరి. కలల అర్ధము వివరించువారు మిమ్ము అపమార్గము పట్టించిరి. వారు కలిగించు ఊరటయు నిరుపయోగమైనది. కావున ప్రజలు దారితప్పిన గొఱ్ఱెలవలె తిరుగాడుచున్నారు. కాపరిలేడుగాన, వారు వెతల పాలగుచున్నారు.

3. ప్రభువు ఇట్లనుచున్నాడు: “నా ప్రజలను పాలించు కాపరులపై నేను ఆగ్రహము చెందితిని. నేను వారి నాయకులను దండించి తీరుదును. యూదా ప్రజలు నావారు. సైన్యములకధిపతియు, ప్రభువునైన నేను వారిని ఆదరింతును. వారు బలముగల యుద్ధాశ్వముల వంటివారు అగుదురు.

4. వారినుండి ఒక మణి పుట్టును. దానినుండి ఒక శిబిరపు మేకు పుట్టును.  ఒక యుద్దపువిల్లు తయారగును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును.

5. వారు శూరులవలె తమ విరోధులను వీధులలోని బురదలో పడవేసి తొక్కుదురు. వారి ప్రభువు వారికి తోడుగానుండెను గాన, వారు పోరుసల్పగా శత్రువుల ఆశ్వికులు సిగ్గుతో వెనుదిరుగుదురు.

6. నేను యూదా ప్రజలను తన బలాఢ్యులను చేయుదును. యోసేపు సంతతిని కాపాడుదును. ఆ వారిపై దయజూపి వారినెల్లరిని స్వీయదేశమునకు కొనివత్తును. నేను వారి ప్రభుడనైన దేవుడను,  నేను వారి మనవులను ఆలింపగా, నేను వారిని తిరస్కరించలేదు అను భావము వారికి కలుగును.

7. యిస్రాయేలీయులు శూరులవలె ఒప్పుదురు. ద్రాక్షారసముగ్రోలిన వారివలె సంతసింతురు. వారి సంతతి. ఈ విజయమును జ్ఞప్తియందుంచుకొని ప్రభువు చేసిన కార్యమునకుగాను , హృదయపూర్వకముగా ఉల్లసింతురు.

8. నేను నా ప్రజలను ఈలవేసి పిలిచి ప్రోగుజేయుదును. వారిని సంరక్షింతును. పూర్వమువలెవారిని బహుళ సంఖ్యాకులను చేయుదును.

9. నేను వారిని జాతుల నడుమ చెల్లాచెదరు చేసినను ఆ దూర దేశములలో వారు నన్ను స్మరించుకొందురు. వారును, వారి బిడ్డలును ప్రాణములు దక్కించుకొని స్వీయదేశమునకు తిరిగి వత్తురు.

10. ఐగుప్తు అస్సిరియాలనుండి నేను వారిని తోడ్కొని వత్తును. సొంతభూమిపై వారిని పాదుకొల్పుదును. గిలాదు లెబానోనులలో వారికి పట్టజాలనంత స్థావరము కల్పింతును. దేశమంతయు ఆ జనులతో నిండిపోవును.

11. వారు ఆపత్సముద్రమును దాటునపుడు ప్రభువునైన నేను దాని అలలను అణచివేయుదును. నైలునది గర్భము ఎండిపోవును. అస్సిరియా గర్వమణగును. ఐగుప్తు ప్రాభవము అంతరించును.

12. నేను నా ప్రజలను బలసంపన్నులను చేయుదును. వారు నా నామమును స్మరించి, నాకు విధేయులు అగుదురు. ఇది ప్రభువు వాక్కు 

1. లెబానోనూ! నీ ద్వారములు తెరువుము, అగ్ని నీ దేవదారులను కాల్చివేయును.

2. దేవదారులు కూలినవి, ఆ మహావృక్షములు నాశనమైనవి కనుక తమాలములారా! మీరు శోకింపుడు. దట్టమైన అడవిని నరికివేసిరి. కనుక బాషాను సింధూరములారా! మీరు విలపింపుడు.

3. కాపరులు విచారముతో విలపించుచున్నారు. వారి వైభవము అంతరించినది. ఈ సింహకిశోరములు గర్జించుచున్నవి, వినుడు! యోర్దాను ప్రక్కనున్న వాని అటవీ స్థలము అంతరించినది.

4. నా ప్రభువైన దేవుడు నాతో ఇట్లు చెప్పెను: “నీవు చావునకు గురికానున్న గొఱ్ఱెలకు కాపరివిగా వ్యవహరింపుము.

5. వానిని కొనువారు, వానిని చంపియు శిక్షను తప్పించుకొనుచున్నారు. వానిని అమ్మినవారు, వాని మాంసమును అమ్మి 'మేము సంపన్నులమైతిమి. ప్రభువునకు స్తుతి కలుగునుగాక!' అని పలుకుచున్నారు. ఆ గొఱ్ఱెలను కాయుకాపరులకే వానిపై జాలిలేదు.

6. ప్రభువు ఇంకను ఇట్లనెను: నేనికమీదట దేశనివాసులను దయతో చూడను. నేను ప్రజలెల్లరిని వారి పాలకుల అధీనమున ఉంతును. ఆ పాలకులు దేశమును నాశనము చేయుదురు. వారి బారినుండి నేను దానిని కాపాడను”.

7. కనుక నేను చావునకు గురియైన గొఱ్ఱెలకు కాపరినైతిని. నేను రెండు కఱ్ఱలను తీసికొని ఒక దానికి “అనుగ్రహము” అనియు, మరియొక దానికి “ప్రోగుచేయుట” అనియు పేర్లు పెట్టితిని. అటు పిమ్మట మందనుమేపితిని.

8. ముగ్గురు ఇతర కాపరులు నన్ను ద్వేషించిరి. నేను వారియెడల సహనము కోల్పోయితిని. ఒక్క నెలలోనే ఆ ముగ్గురిని వదలించుకొంటిని.

9. నేను గొఱ్ఱెల మందతో 'ఇక మీదట నేను మిమ్ము మేపను, మీలో చచ్చునవి చచ్చునుగాక! నాశనమగునవి నాశనమగునుగాక! మిగిలినవి ఒకదానినొకటి కబళించివేయునుగాక!' అని చెప్పితిని.

10. అంతట నేను 'అనుగ్రహము' అనబడు కఱ్ఱను విరిచివేసి ప్రభువు జనులందరితో చేసికొనిన నిబంధనమును రద్దుచేసితిని.

11. కనుక ఆ రోజే ఆ నిబంధనము సమాప్తమయ్యెను. నిబంధన రద్దు అయిన దినమున నేను చెప్పినది ప్రభువు వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొనియున్న గొఱ్ఱెలు తెలుసుకొనెను.

12. నేను వారితో “మీకు సమ్మతమైనచో నా వేతనము నాకు చెల్లింపుడు. సమ్మతము కాదేని మీరే ఉంచుకొనుడు' అని అంటిని. వారు ముప్పది వెండినాణెములను నాకు జీతముగా చెల్లించిరి.

13. 'ఎంతో అబ్బురముగ వారు నాకు ఏర్పరచిన క్రయధనమును దేవాలయ కోశాగారమున ఉంచుము' అని ప్రభువు నాతో చెప్పెను. కనుక నేను ఆ ముప్పది వెండినాణెములను దేవాలయ కోశాగారమున ఉంచితిని.

14. అటుపిమ్మట నేను ప్రోగుచేయుట' అనబడు రెండవకఱ్ఱను గూడ విరిచితిని. అందువలన యూదా యిస్రాయేలు ప్రజల ఐక్యము చెడిపోయెను.

15. ప్రభువు నాతో ఇట్లు చెప్పెను: “నీవు ఈసారి నిష్ప్రయోజకుడైన కాపరిగా వ్యవహరింపుము.

16. నేను నా మందకు ఒక కాపరిని నియమించితిని. కాని అతడు నాశనమునకు గురికానున్న మందను కాపాడడు. తప్పిపోయిన గొఱ్ఱెలను వెదకడు. గాయపడిన వానిని నయముచేయడు. చావగా మిగిలిన వానిని మేపడు. పైపెచ్చు అతడు క్రొవ్విన గొఱ్ఱెల మాంసమును తినివేయును. వాని గిట్టలను చీల్చి వేయును.

17. తన మందను విడనాడు నిష్ప్రయోజకుడైన కాపరికి అనర్థము తప్పదు. యుద్ధము అతని బలమును పూర్తిగా నాశనము చేయును. అతని చేయి చచ్చుబడును, కుడికన్ను గ్రుడ్డిదగును”.

1. దైవోక్తి, యిస్రాయేలును గూర్చి ప్రభువు సందేశమిది: ఆయన ఆకాశమును గుడారమువలె విప్పెను. భూమికి పునాదివేసెను. నరునికి ఊపిరి పోసెను. అట్టి ప్రభుని పలుకులివి:

2. “నేను యెరూషలేమును పానపాత్రమువలె చేయుదును. దాని చుట్టుపట్లనున్న వివిధజాతుల ప్రజలు ఆ పాత్రము నుండి మధువును గ్రోలి మత్తెక్కి తూలుదురు. వారు యెరూషలేమును ముట్టడించునపుడు యూదాలోని ఇతర నగరములను గూడ ముట్టడింతురు.

3. ఆ కాలము వచ్చినపుడు నేను యెరూషలేమును సమస్త జనులకు భారమైన రాతినిగా చేయుదును. ఏ జాతియైనను దాని నెత్తబోయనేని గాయపడును. లోకములోని జాతులన్నియు ఏకమై ఆ నగరముపై దాడిజేయ గోరును.

4. అప్పుడు నేను వారి గుఱ్ఱములకు భయము పుట్టింతును. వారి రౌతులు పిచ్చివారగుదురు. నేను యూదా ప్రజలను చల్లనిచూపు చూతును. వారి విరోధుల గుఱ్ఱములను మాత్రము గ్రుడ్డివానిని చేయుదును. ఇదియే ప్రభువు వాక్కు.

5. అప్పుడు యెరూషలేమునందలి అధికారులును, నివాసులును తమ దేవుడైన ప్రభువును నమ్ముకొనుటవలన మాకు బలము కలుగుచున్నదని హృదయమందు చెప్పుకొందురు.

6. ఆ కాలమున నేను యూదా అధిపతులను అడవిలోని కారుచిచ్చువలెను, పండిన పొలములోని మంటవలెను చేయుదును. వారు నలుదిక్కులనున్న జాతులన్నిటిని నాశనము చేయుదురు. యెరూషలేము నందలి ప్రజలు మాత్రము సురక్షితముగా నుందురు.

7. ప్రభువునైన నేను యూదా ప్రజలకు మొదటి విజయము నొసగుదును. కనుక దావీదు సంతతి వారికిని, యెరూషలేము పౌరులకును లభించు కీర్తి ఇతర యూదా ప్రజలకు లభించు కీర్తికంటెను గొప్పది కాజాలదు.

8. ఆ దినములలో ప్రభువు యెరూషలేమున వసించువారిని కాపాడును. వారిలో మిక్కిలి దుర్బలులు కూడ దావీదువలె బలాధ్యులగుదురు. దావీదు వంశజులు దేవునివలెను, జనులదృష్టికి ప్రభువుదూతలవలెను ఉందురు.

9. ఆ కాలమున యెరూషలేముపై దాడిచేయు ప్రతి జాతిని నేను హతమారును.

10. నేను దావీదు వంశజులమీదను, యెరూషలేము నివాసులమీదను అనుగ్రహము నొందించు ఆత్మను, విజ్ఞాపనచేయు ఆత్మను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన వానిమీద దృష్టి యుంచి, ఏకైక కుమారుని కోల్పోయినవారివలె అతని కొరకు విలపింతురు. తొలిచూలు కుమారుని కోల్పోయిన వారివలె అతని కొరకు శోకింతురు.

11. ఆ కాలమున ప్రజలు మెగిద్ధో మైదానమున హదద్ రిమ్మోను కొరకు శోకించునట్లుగానే యెరూషలేమునను శోకింతురు.

12. దేశమున ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా శోకింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగను, వారి భార్యలు ప్రత్యేకముగను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగను, వారి భార్యలు ప్రత్యేకముగను,

13. లేవి కుటుంబీకులు ప్రత్యేకముగను, వారి భార్యలు ప్రత్యేకముగను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగను, వారి భార్యలు ప్రత్యేకముగను శోకింతురు.

14. మిగిలినవారిలో ప్రతి కుటుంబమువారు ప్రత్యేకముగను, వారి భార్యలు ప్రత్యేకముగను శోకింతురు.

1. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: “ఆ కాలము వచ్చినపుడు దావీదు వంశజులను, యెరూషలేము పౌరులను వారి పాపములనుండియు, విగ్రహారాధనమునుండియు శుద్ధిచేయుటకుగాను ఒక ఊటను సిద్ధము చేయుదురు.

2. ఆ కాలమున నేను దేశమునుండి విగ్రహముల నామ రూపములను తొలగింతును. ఆ మీదట వాని నెవడును జ్ఞప్తియందుంచుకొనడు. నేను ప్రవక్తలను గూడ తొలగింతును. విగ్రహారాధనముపట్ల ఆసక్తిని గూడ నిర్మూలింతును.

3. ఆ మీదట కూడ ఎవడైనను ప్రవచనము చెప్పగోరెనేని, అతని సొంత తల్లిదండ్రులే 'నీకు చావు మూడినది. నీవు ప్రభువు మాటలు చెప్పుదునని పలికి అబద్దములు చెప్పుచున్నావు' అని అందురు. అతడు ప్రవచించెనేని సొంత తల్లిదండ్రులే అతనిని కత్తితో పొడిచిచంపుదురు.

4. ఆ కాలము వచ్చినపుడు ప్రవక్తయైనవాడు తన ప్రవచనములను బట్టియు, దర్శనములను బట్టియు సిగ్గుపడును. అతడు రోమ వస్త్రమునుతాల్చి ప్రజలను మోసగింపబూనుకొనడు.

5. అతడు 'నేను ప్రవక్తను కాను, రైతును. చిన్ననాటనే నన్ను కొనినవానియొద్ద పొలము దున్ను కొని బ్రతుకుచున్నాను' అని చెప్పును.

6. ఎవరైన నీ చేతులమధ్య గాయములేమిటివని ప్రశ్నించినచో అతడు 'నా స్నేహితుల ఇంట నేను గాయపడితిని” అని సమాధానము చెప్పును”.

7. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు: “ఖడ్గమా! నా గొఱ్ఱెల కాపరి మీదను, నా సహకారి మీదను పడుము. మంద చెల్లాచెదరగునట్లు కాపరిని హతము చేయుము చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును

8. దేశమంతటను రెండువంతుల జనులు చావగా మూడవవంతు మిగులుదురు.

9. ఆ మూడవవంతు జనులను నేను పరీక్షకు గురిచేయుదును. వారిని కుంపటిలోని వెండివలె శుద్ధిచేయుదును. బంగారమువలె పరీక్షింతును. అప్పుడు వారు నాకు మొఱ్ఱపెట్టగా, నేను వారి మొఱ్ఱనాలింతును. 'మీరు నా ప్రజలు' అని నేను చెప్పుదును, 'ప్రభువు మా దేవుడు' అని వారు చెప్పుదురు.

1. ప్రభువు తీర్పుతీర్చు దినము ఆసన్నమైనది. అప్పుడు శత్రువులు యెరూషలేమును కొల్లగొట్టుదురు. మీ కన్నుల ఎదుటనే ఆ కొల్లసొమ్మును పంచుకొందురు.

2. ప్రభువు వివిధ జాతుల ప్రజలను ప్రోగుజేసికొని వచ్చును. వారు యెరూషలేముపై పోరు సల్పుదురు. శత్రువులు నగరమును స్వాధీనము చేసికొని గృహములను దోచుకొందురు. స్త్రీలను చెరతురు. సగము ప్రజలు ప్రవాసమునకు పోగా మిగిలినవారు పట్టణముననే ఉందురు.

3. అంతట ప్రభువు యుద్ధమునకుపోయి పూర్వమువలెనే శత్రువులతో పోరాడును.

4. ఆ దినమున ఆయన పాదములు యెరూషలేము ఎదుట తూర్పువైపున ఓలివుకొండపై ఉంచగా, అప్పుడు ఓలివు కొండ తూర్పు వైపునకును మరియు పడమర వైపునకును చీలిపోయి సువిశాలమైనలోయ ఏర్పడును. కొండలో సగభాగము ఉత్తరమునకును, సగభాగము దక్షిణమునకును కదలును.

5. కొండ మధ్యగా ఆవలికి ఆసేలు వరకు సాగిపోయెడి లోయగుండ మీరెల్లరును తప్పించుకొని పారిపోవుదురు. యూదా రాజగు ఉజ్జీయాకాలమున భూకంపము కలుగగ మీ పూర్వులు పారిపోయినట్లే మీరును పారిపోవుదురు. అప్పుడు నాదేవుడైన ప్రభువు సమస్త దేవదూతలతో విజయము చేయును.

6-7. ఆ దినమున వెలుగు లేకపోవును, దట్ట మైన చీకటి మాత్రమే ఉండును. ఆ దినము ఒక ప్రత్యేకదినముగా ఉండును. కాని సాయంకాల సమయమున వెలుతురు ఉండును. పగలుగాని, రాత్రిగాని ఉండని ఆ దినము ప్రభువునకు మాత్రమే తెలియును.

8. ఆ దినమున యెరూషలేమునుండి జీవజలము ప్రవహించును. ఆ నీటిలో సగము తూర్పు సముద్రమునకును, సగము పడమటి సముద్రమునకును పోవును. ఆ జలము గ్రీష్మ శీతకాలములందును ప్రవహించును.

9. అప్పుడు ప్రభువు లోకమంతటికిని రాజగును. ఎల్లరును ఆయనొక్కనినే ప్రభువుగా అంగీకరింతురు. “ప్రభువు' అను ఆయన నామము ఒక్కటియే అని తెలియబడును.

10. ఆ పట్టణము బెన్యామీను ద్వారమునుండి మూలద్వారము వరకును వ్యాపించియుండును. (ఈ మూలద్వారమువద్ద పూర్వము మరియొక ద్వారముండెడిది). హనవేలు బురుజునుండి రాజు ద్రాక్ష గానుగల వరకు వ్యాపించియుండును. ఉత్తరమున గెబానుండి దక్షిణమున రిమ్మోనువరకు దేశము సమతలమగును.

11. యెరూషలేము దాని చుట్టుపట్లనున్న దేశములకంటె ఎత్తుగానుండును. జనులెల్ల యెరూషలేము నగరమున సురక్షితముగా వసింతురు. ఆ నగరమునకు ఇక శాపము ఉండదు, దాని నివాసులు నిర్భయముగా నివసింతురు.

12. మరియు యెరూషలేముమీద యుద్ధము చేసిన జనులందరిని ప్రభువు తెగుళ్ళతో మొత్తును. వారు ఉన్నపాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కండ్లరంధ్రములలో ఉండియే కుళ్ళి పోవును. వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళి పోవును.

13. ఆ కాలమున ప్రభువు వారికి భీతిని, కలవరమును పుట్టించును. కనుక వారిలో ప్రతివాడు తమ ప్రక్కవానిని పట్టుకొని కొట్టును.

14. యూదా ప్రజలు యెరూషలేము పక్షమున పోరాడుదురు. వారు సమస్త జాతుల సొత్తును కొల్లగొట్టుదురు. వెండి బంగారములు, వస్త్రములు విస్తారముగా దోచుకొందురు.

15. శత్రువుల శిబిరములోని గుఱ్ఱములు, కంచరగాడిదలు, ఒంటెలు ఇతర జంతువులెల్ల ఘోర వ్యాధికి గురియగును.

16. అప్పుడు యెరూషలేము మీదికి దాడిచేసిన జాతులలో చావక మిగిలియున్నవారెల్లరును ప్రతియేడు యెరూషలేమునకు పోవుదురు. అచట సైన్యములకధిపతియైన ప్రభువును రాజునుగా ఆరాధించి గుడారముల పండుగలో పాల్గొందురు.

17. ఏ జాతియైనను యెరూషలేమునకు పోయి సైన్యములకధిపతియైన ప్రభువును రాజునుగా ఆరాధింపడేని వారి భూమిపై వాన కురియదు.

18. ఐగుప్తీయులు గుడారముల పండుగకు రారేని, ప్రభువు నగరమునకురాని ఇతర జాతులకు కలిగించు వ్యాధులనే వారికిని కలిగించును.

19. ఐగుప్తీయులుకాని, ఇతరజాతులుకాని గుడారముల పండుగలో పాల్గొనలేని ఇట్టి శిక్షకు పాత్రులగుదురు.

20. ఆ కాలమున గుఱ్ఱములజీనుకు కట్టిన గంటలమీద కూడ “ప్రభువునకు సమర్పితము” అని వ్రాయబడి యుండును. దేవళమునందలి వంటపాత్రములును బలిపీఠముచెంతనున్న పాత్రములవలె పవిత్రముగా నుండును.

21. యెరూషలేమునను యూదా దేశమంతటను ఉన్న పాత్రములన్నియు సైన్యములకధిపతియైన ప్రభువు ఆరాధనలో వాడుటకు యోగ్యములగును. బలులర్పించువారు వానిని బలిపశువు మాంసమును వండుటకు వినియోగించుకొందురు. ఆ కాలము వచ్చినపుడు సైన్యముల కధిపతియైన ప్రభువు దేవళమున కనానీయుడు ఎవడునూ కనిపింపడు.