ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నిర్గమకాండము

1. తమతమ కుటుంబములతో యాకోబు వెంట ఐగుప్తు దేశమునకు వెళ్లిన యిస్రాయేలీయుల పేర్లివి:
2. రూబేను, షిమ్యోను, లేవి, యూదా,
3. ఇస్సాఖారు, సెబూలూను, బెన్యామీను,
4. దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
5. యాకోబు సంతతివారు మొత్తము దెబ్బది మంది. అంతకు ముందే యోసేపు ఐగుప్తు దేశమున ఉండెను.
6. కొంత కాలముకు యోసేపు, అతని సోదరులు, వారితరము వారందరు మరణించిరి.
7. యిశ్రాయేలీయులు పెక్కు మంది బిడ్డలను కని లెక్కకు మిక్కుటముగా పెరిగిరి. వారు అసంఖ్యాకముగా పెరిగి విస్తరిల్లి ప్రబలులైరి. నేల యీనినట్లు ఎక్కడ చూచిన యిశ్రాయేలీయులే.
8. అప్పుడు యోసేపు పుట్టు పూర్వోత్తరాలు తెలియని ఒక క్రొత్తరాజు ఐగుప్తు దేశమున సింహాసనమునకు వచ్చెను.
9. ఆ రాజు తన పరిజనులతో "ఈ యిశ్రాయేలీయుల సంతతి మనకంటె విస్తారమై బలిష్టముగానున్నది.
10. వారు ఇక ముందు పెరగకుండు నట్లు మనము కనుగలిగి నడచుకొనవలెను. కానిచో, యుద్దములు వచ్చినపుడు వారు మన శత్రువుల పక్షమున చేరి మనల నెదిరింతురు. మన దేశము నుండి తప్పించుకొని పారిపోయెదరు" అనెను.
11. ఆ మాటలను బట్టి రాజాధికారులు యిశ్రాయేలీయులచే వెట్టిచాకిరి చేయించి, వారిని అణద్రొక్కుటకై, వారి మీద దాసాధ్యక్షులను నియమించిరి. ఈ విధముగా యిస్రాయేలీయులు ఫరోరాజునకు, గిడ్డంగులుండు నగరములైన పీతోమును, రామెసేసును నిర్మించిరి.
12. అణచివేసి, రాచిరంసాన పెట్టిన కొలది, యిస్రాయేలీయులు నూరంతలుగా పెరిగి విస్తరిల్లిరి. ఐగుప్తు దేశీయులు యిస్రాయేలీయులను చూచి చీదరించుకొనిరి; వారికి భయపడిరి.
13. వారు నిర్ధాక్షిణ్యముగా యిస్రాయేలీయులను బానిసలుగా చేసిరి.
14. వెట్టిచాకిరితో ఇటుక పనులు, మట్టి పనులు, అన్నిరకముల పొలము పనులను చేయించి, వారి బ్రతుకును భరింపరానిదిగా చేసిరి . బండపనులన్నిటిని వారి నెత్తిన రుద్దిరి.
15. తరువాత ఐగుప్తు రాజు షీప్రా, పూవా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడెను.
16. "మీరు హెబ్రీయ స్త్రీలకు కాన్పుచేయునపుడు వారికి, ఏ బిడ్డ పుట్టునో కనుకలిగి ఉండుడు. మగపిల్లవాడైనచో వెంటనే చంపుడు. ఆడుపిల్లమైనచో ప్రాణములతో వదలుడు" అని చెప్పెను.
17. కాని, మంత్రసానులు దైవభీతి కలవారు. కనుక, వారు రాజాజ్ఞలను మీరిరి. పుట్టిన మగపిల్లలను చంపరైరి.
18. అందుచేత, ఐగుప్తు రాజు మంత్రసానులను పిలిపించి 'మీరీ పని ఏల చేసితిరి? మగపిల్లలనేల ప్రాణములతో వదలితిరి?" అని అడిగెను.
19. "ప్రభూ! హెబ్రీయ స్త్రీలు, ఐగుప్తు స్త్రీలవంటివారు కాదు. వారు బలము కలవారు. మంత్రసాని రాక ముందే సులభముగా ప్రసవింతురు" అని చెప్పిరి.
20. దేవుడు ఆ మంత్రసానులపట్ల కనికరము చూపెను. యిశ్రాయేలీయులు పెరిగి పెరిగి మహా శక్తిమంతులైరి.
21. మంత్రసానులు దేవుని నమ్ముకొన్నవారు అగుటచే, ఆయన వారి వంశములను కూడ నిలిపెను.
22. అంతట, ఫరోరాజు "హెబ్రీయులకు పుట్టిన మగ పిల్లలను నైలు నదిలో పారవేయుడు. ఆడ పిల్లలను మాత్రము బ్రతుకనిండు" అని తన ప్రజల నాజ్ఞాపించెను.

1. లేవి తెగవాడు ఒకడు ఆ తెగలోని స్త్రీనే భార్యగా స్వీకరించెను.

2. ఆమె గర్భవతియై ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారమువంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వానిని మూడునెలలపాటు ఎవరికంట పడకుండా దాచెను.

3. ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరుపలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగటమన్నుపూసి తారుపూసెను. ఆ పెట్టెలో బిడ్డనుంచి, దానిని నైలునది నీటిఅంచున జమ్ముదుబ్బుల నడుమ ఉంచెను.

4. ఆ శిశువునకు ఏమిజరుగునో చూడదలచి వాని సోదరి పెట్టెకు కొంచెము దూరముగా నిలుచుండెను.

5. ఫరోరాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున తిరుగాడు చుండిరి. అప్పుడు ఆమె దుబ్బుల నడుమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు తన బానిస పిల్లను పంపెను.

6. రాజపుత్రి ఆ పెట్టెను తెరచిచూడగా ఏడ్చుచున్న మగకందు కనిపించెను. ఆమెకు అతని మీద జాలిపుట్టినది. ఆమె “వీడు హెబ్రీయుల బిడ్డడై యుండును” అనెను.

7. శిశువు సోదరి “రాజకుమారీ! వెళ్ళి ఒక హెబ్రీయదాదిని తీసికొని వత్తునా? ఆ దాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచునుగదా!” అనెను.

8. ఫరో కుమార్తె “వెళ్ళుము” అని శిశువు సోదరితో చెప్పగా, ఆ బాలిక వెళ్ళి ఆ బిడ్డతల్లినే కొనివచ్చెను.

9. అంతట ఫరోకూతురు ఆ తల్లితో “ఈ బిడ్డను తీసికొని వెళ్ళుము. నాకొరకు వీనికి పాలుగుడుపుము. నీకు జీతముముట్టునట్లు చూతును" అని చెప్పెను. ఆ హెబ్రీయ స్త్రీ శిశువును కొనిపోయి పాలిచ్చి పెంచెను.

10. శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత ఆమె అతనిని రాజకుమారి కడకు తీసికొని వచ్చెను. రాజపుత్రి అతనిని కన్నకొడుకు మాదిరిగా చూచుకొనెను. “ఇతనిని నీటినుండి బయటికి తీసితిని" అనుకొని ఆమె అతనికి 'మోషే'' అను పేరు పెట్టెను.

11. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కన్నులారచూచెను. అపుడు ఐగుప్తుదేశీయుడు ఒకడు తన దేశీయుడైన హెబ్రీయుని కొట్టుటను మోషే చూచెను.

12. అతడు చుట్టును పరికించెను. కనుచూపుమేర లోపల ఎవ్వరును లేరు. వెంటనే మోషే ఆ ఐగుప్తు దేశీయుని మీదపడి వానిని చంపి ఇసుకలో పాతిపెట్టెను.

13. మరునాడు కూడ మోషే అచ్చటికి వచ్చి ఇద్దరు హెబ్రీయులు తన్నుకొనుట చూచెను. మోషే తప్పుచేసిన వానితో “నీవు తోడి హెబ్రీయుని కొట్టనేల?” అనెను.

14. ఆ దోషి “మాకు అధికారిగా, ధర్మమూర్తిగా నిన్ను నిలిపినవారు ఎవరయ్యా! ఐగుప్తుదేశీయుని చంపి నట్లు నన్నుకూడ చంపవలెనని అనుకొనుచున్నావా?” అనెను. తాను చేసినపని అపుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను.

15. ఫరోరాజు ఈ విషయము వినెను. అతడు మోషేకు మరణశిక్ష విధించెడివాడే, కాని మోషే మిద్యాను దేశమునకు పారిపోయెను. ఆ దేశమున అతడొక బావివద్ద కూర్చుండెను.

16. మిద్యానుదేశపు యాజకునకు ఏడుగురు కుమార్తెలు కలరు. వారు అదే సమయమున నీళ్ళు తోడుకొనుటకు వచ్చిరి. తమ తండ్రి మందలకు నీళ్ళు పెట్టుటకై తొట్లు నింపిరి.

17. కాని కొందరు గొఱ్ఱెల కాపరులు వచ్చి ఆ యువతులను తరిమివేసిరి. మోషే వారితరపున నిలిచి వారికి బదులుగా తానే వారి మందలకు నీళ్ళు పెట్టెను.

18. అంతట ఆ ఏడుగురు పడుచులు తమ తండ్రి రవూవేలు కడకు తిరిగి వెళ్ళిరి. అతడు “నేడు ఇంత పెందలకడనే ఎట్లు తిరిగివచ్చితిరి?” అని కుమార్తెలను అడిగెను.

19. వారు “ఐగుప్తుదేశీయుడొకడు గొఱ్ఱెలకాపరుల బారినుండి మమ్ము కాపాడెను. అతడే మాకు బదులుగా నీళ్ళుతోడి మందలకు పోసెను” అనిరి.

20. రవూవేలు “అతడు ఎక్కడ ఉన్నాడు? అతనిని అక్కడనే ఏల విడిచి వచ్చితిరి? మనతోపాటు భుజించుటకు రమ్మనుడు” అని కుమార్తెలకు చెప్పెను.

21. ఈ విధముగా మోషే రవూవేలు వద్ద కుదురుకొనెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషేకిచ్చి పెండ్లి చేసెను.

22. ఆమె ఒక కొడుకును కనెను. మోషే "నేను ఈ పరదేశమున అపరిచితుడుగా ఉన్నాను” అని అనుకొని ఆ బిడ్డకు 'గెర్షోము” అని పేరు పెట్టెను.

23. ఏండ్లు దొరలిపోయినవి. ఐగుప్తుదేశ ప్రభువు చనిపోయెను. యిస్రాయేలీయులు బానిసతనమున మునిగి మూలుగుచు సహాయము కొరకు ఆక్రందించిరి. వారి ఆక్రందనము దేవుని చెవినబడెను.

24. దేవుడు వారి మూలుగు వినెను. తాను అబ్రహాముతోను, ఈసాకుతోను, యాకోబుతోను చేసికొనిన ఒడంబడికను గుర్తు తెచ్చుకొనెను.

25. దేవుడు యిస్రాయేలీ యుల దుస్థితినిగాంచి వారిని కరుణించెను.

1. మోషే తన మామయు మిద్యాను యాజకుడగు యిత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొనిపోయి, దేవునికొండ హోరేబు కడకువచ్చెను.
2. అక్కడ ఒక పొద మధ్యనుండి వెలువడు నిప్పుమంట రూపమున యావేదూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను. పొదయేమో మండుచుండెను. కాని అది కాలిపోవుటలేదు.
3. అంతట మోషే "నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయును. పొద ఏల కాలిపోవుటలేదో తెలిసికొనవలయును” అని తలంచెను.
4. ఆ విధముగా పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమినుండి “మోషే! మోషే!" అని పిలిచెను. అతడు “చిత్తము ప్రభూ!” అనెను.
5. దేవుడు “దగ్గరకు రాకుము. చెప్పులు విడువుము. నీవు నిలుచున్న ఈ తావు పవిత్రభూమిసుమా!
6. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను” అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను.
7. అంతట దేవుడైన యావే “ఐగుప్తుదేశములో నా ప్రజలు అనుభవించు బాధలు నేను కన్నులార చూచితిని. దాసాధ్యక్షుల బారినుండి విడిపింపుమని వారుచేసిన మనవి నా చెవినబడినది. వారు పడుపాట్లు గుర్తించితిని.
8. ఐగుప్తుదేశీయుల ఇనుప పిడికిళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగివచ్చితిని. వారిని ఆ దేశమునుండి భాగ్యవంతమైన, సువిశాలమైన, పాలుతేనెలు జాలువారునదైన కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులకు నిలయమైయున్న దేశమునకు చేర్చుదును.
9. యిస్రాయేలీయుల ఆక్రందన నా చెవినిబడెను. ఐగుప్తుదేశీయులు వారినెట్లు పీడించు చున్నారో కన్నులార చూచితిని.
10. కావున రమ్ము. ఐగుప్తుదేశమునుండి నా ప్రజలయిన యిస్రాయేలీయులను వెలుపలికి తీసికొనివచ్చుటకై నిన్ను ఫరో రాజు వద్దకు పంపెదను” అని మోషేతో అనెను.
11. అంతట మోషే దేవునితో “ఫరోరాజు కడకు వెళ్ళుటకుగాని, యిస్రాయేలీయులను ఐగుప్తుదేశము నుండి తీసికొని వచ్చుటకుగాని నేనెవ్వడను?” అనెను.
12. దేవుడు “నేను నీకు తోడైయుందును. నిన్ను పంపినది నేనేయని నీవు తెలిసికొనుటకు గుర్తు ఇదియే! ఐగుప్తుదేశమునుండి ఈ ప్రజలను తోడ్కొని వచ్చిన తరువాత మీరు ఈ కొండమీద నన్ను ఆరాధింపవలెను” అనెను.
13. అపుడు మోషే దేవునితో “అయినచో నేను యిస్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి మీ పితరులదేవుడు నన్ను మీకడకు పంపెనని చెప్పవలయునుగదా! అపుడు వారు ఆ దేవుని పేరేమి? అని నన్నడిగినచో నేనేమి చెప్పవలయును?” అనెను.
14. దేవుడు మోషేతో “నేను ఉన్నవాడను” అనెను. మరియు “ఉన్నవాడు నన్ను మీకడకు పంపెనని యిస్రాయేలీయులతో చెప్పుము” అనెను.
15. ఇంకను దేవుడు మోషేతో “యిస్రాయేలీయులతో నీవు ఇట్లు చెప్పవలెను. మీ పితరులదేవుడు, అబ్రహాముదేవుడు, ఈసాకుదేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వ కాలములందును ఇదియే నా నామము. ఇకముందు తరములవారు అందరును నన్ను ఈ నామమునే పిలుతురు.
16. నీవు వెళ్ళి యిస్రాయేలీయుల పెద్దలను ఒకచోట చేర్చి వారితో “మీ పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఈసాకుదేవుడు, యాకోబుదేవుడైన యావే నాకు ప్రత్యక్షమయ్యెననియు ఆయన మీతో 'నేను మిమ్ము చూడవచ్చితిని. ఐగుప్తుదేశీయులు మీకు పెట్టిన యాతనలన్నిటిని గమనించితిని.
17. మీరు పీడింప బడుచున్న ఐగుప్తుదేశమునుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించుచున్న దేశమునకు, పాలు తేనెలుజాలువారు దేశమునకు మిమ్ము చేర్చనిశ్చ యించితిని' అని వారితో చెప్పుము.
18. వారు నీ మాటలు విందురు. అప్పుడు నీవు యిస్రాయేలీయుల పెద్దలతో ఐగుప్తుదేశ ప్రభువు సమ్ముఖమునకు వెళ్ళవలయును. వెళ్ళి 'హెబ్రీయుల దేవుడైన యావే మాకు ప్రత్యక్షమయ్యెను. కావున మూడురోజులపాటు అడవిలో ప్రయాణముచేసి మా దేవుడైన యావేకు బలిసమర్పించుకొనుటకు మాకు సెలవిమ్ము' అని అతనితో చెప్పవలయును.
19. తనకంటె పైచేయి వాడు వచ్చి గొంతుమీద కూర్చున్నగాని ఐగుప్తుదేశ ప్రభువు మిమ్ము పోనీయడని నాకు తెలియును. కావున నేను నా బలమును చూపుదును.
20. ఐగుప్తుదేశములో నేను అద్భుతకార్యములుచేసి దానిని దెబ్బకొట్టుదును. ఇక ఆ తరువాత అతడు మిమ్ము పోనిచ్చును.
21. నేను యిస్రాయేలీయులను ఐగుప్తుదేశీయుల కంటికి గౌరవింపదగినవారినిగా చేయుదును. కావున మీరు ఆదేశమును వీడునపుడు వట్టి చేతులతో వెళ్ళరు.
22. మీలో ప్రతి స్త్రీయు తన పొరుగున ఉన్న స్త్రీని, తన ఇంటనున్న ప్రతి స్త్రీని వెండినగలు, బంగారునగలు, వస్త్రములడిగి పుచ్చుకొనును. దానితో మీరు మీ కుమారులను, కుమార్తెలను అలంకరింతురు. ఈ విధముగా మీరు ఐగుప్తుదేశీయులను దోచు కొందురు” అనెను.

1. అప్పుడు మోషే వారు నన్ను నమ్మరు, నా మాటలు వినరు. యావే నీకు ప్రత్యక్షము కాలేదని నాతో అందురు అని బదులివ్వగా

2. యావే “నీ చేతిలో ఉన్నదేమి?” అని మోషేను అడిగెను. అతడు “కఱ్ఱ” అని బదులు పలికెను.

3. యావే “దానిని నేలమీద పడవేయుము” అనెను. మోషే కఱ్ఱను నేలమీద పడవేయగా అది పాముగా మారెను. మోషే వెనుకంజవేసెను.

4. యావే “నీ చేయిచాచి దాని తోకపట్టుకొనుము” అనెను. మోషే చేయిచాచి దానిని పట్టుకొనెను. అతని చేతిలో పాము కఱ్ఱగామారెను.

5. యావే మోషేతో “ఇక ఇట్లే చేయుము. అప్పుడు వారు తమ పితరులదేవుడు, అబ్రహాముదేవుడు, ఈసాకు దేవుడు, యాకోబుదేవుడు అయిన యావే నిజముగా 'నీకు ప్రత్యక్షమయ్యెనని నమ్ముదురు” అనెను.

6. మరల యావే మోషేతో మాట్లాడుచు “నీ చేతిని మీ రొమ్మున ఉంచుకొనుము” అని చెప్పెను. మోషే తనచేతిని రొమ్మున ఉంచుకొనెను. అతడు దానిని వెలుపలికి తీసినపుడు కుష్ఠమయమై మంచు వలె తెల్లగా అయ్యెను”

7. యావే “తిరిగి నీ చేతిని రొమ్మున పెట్టుకొనుము” అనెను. మోషే తిరిగి తన చేతిని రొమ్మున పెట్టుకొనెను. దానిని వెలుపలికి తీసినపుడు అది మిగిలిన అతని శరీరమువలె యథాప్రకారముగా అయ్యెను.

8. అప్పుడు యావే “వారు మొదటి సూచననుబట్టి నిన్నునమ్మక, నీ మాట వినకపోయినను ఈ రెండవసూచనయైన వారికి నమ్మకము పుట్టించును.

9. వారు ఈ రెండు సూచనలు నమ్మనిచో, నీ మాటలు వారి చెవికి ఎక్కనిచో నైలునది నుండి నీరు తెచ్చి పొడినేల మీద పోయుము. ఆ నీరు నేలమీద నెత్తురుగా మారును” అని అతనితో అనెను.

10. అంతట మోషే యావేతో “ప్రభూ! నీవు ఈ దాసునితో మాట్లాడుటకు ముందుగాని, తరువాత గాని ఏనాడును నేను నా జీవితములో మాట నేర్పరిని కాను. బండనాలుకవలన తడవుకొనుచు మాట్లాడువాడను” అనెను.

11. దానికి యావే “మానవునకు నోరిచ్చినది ఎవరు? అతనిని మూగవానిగాగాని, చెవిటివానిగాగాని, చూపుగలవానిగాగాని, చూపులేని వానిగాగాని చేసినది ఎవరు? యావేనైన నేనుకానా?

12. నీవిక వెళ్ళుము. మాట్లాడుటకు నేను నీకు సాయము చేయుదును. నీవు ఏమిచెప్పవలయునో బోధింతును” అనెను.

13. అయితే మోషే “ప్రభూ! నీకు ఇష్టమైన వానిని మరొకనిని పంపుము” అనెను.

14. ఈ మాటలకు యావే మోషేమీద మండిపడెను. “నీ సోదరుడును, లేవి తెగవాడునగు అహరోను ఉన్నాడు కదా! అతడు మంచి మాటకారి అని నేనెరుగుదును. ఇదిగో! అతడిప్పుడే నిన్నుకలసికొనుటకు వచ్చు చున్నాడు. నిన్ను చూచినపుడు అతని హృదయము ఆనందముతో నిండును.

15. నీవు అతనితో మాటలాడుము. ఏ సందేశము పలుకవలెనో అతనికి చెప్పుము. మాట్లాడుటకు మీయిరువురికి నేను తోడ్పడుదును. మీరిరువురు ఏమిచేయవలయునో తెలియ జేసెదను.

16. అతడే నీకు బదులుగా ప్రజలతో మాట్లాడును. అతడే నీ వాణియగును. నీవేమో అతనిని ఉత్తేజపరచు దేవునివంటివాడవు అగుదువు.

17. ఈ కఱ్ఱను చేతపట్టుకొనుము. దీనితో నీవు సూచకక్రియలు చేయుదువు” అనెను.

18. పిమ్మట మోషే తనమామ యిత్రో కడకు తిరిగివచ్చి అతనితో “ఐగుప్తుదేశములోనున్న నా చుట్టపక్కాలు బ్రతికియున్నారో లేరో తెలిసికొనవల యును. వారికడకు తిరిగి వెళ్ళుటకు నాకు సెలవిమ్ము" అనెను. యిత్రో మోషేతో “నాయనా! ప్రశాంతముగా వెళ్ళిరమ్ము" అని పలికెను.

19. విద్యాను దేశములో యావే మోషేతో “ఇక వెళ్ళుము. ఐగుప్తుదేశమునకు తిరిగిపొమ్ము. నిన్ను చంపగోరిన వారెల్లరును చనిపోయిరి" అనెను.

20. కావున మోషే తన యిల్లాలిని, కుమారులను తోడ్కొని వారిని ఒక గాడిదమీద ఎక్కించుకొని, ఐగుప్తుదేశమునకు తిరిగి బయలుదేరెను. అతడు దైవదండమును చేతపట్టుకొనెను.

21. యావే మోషేతో “ఇప్పుడు నీవు ఐగుప్తుదేశమునకు తిరిగి వెళ్ళుచున్నావు గదా! నేను నీకు ప్రసాదించిన అద్భుత శక్తులన్నిటిని ఫరోరాజు సమ్ముఖమున చూపుము. నేనే అతని గుండె బండబారునట్లు చేయుదును. కావున అతడు యిస్రాయేలీయులను వెళ్ళనీయడు.

22. అప్పుడు నీవు ఫరోతో యావే ఇట్లు చెప్పుచున్నాడు: 'యిస్రాయేలు నా కుమారుడు. నాకు మొట్టమొదట పుట్టినవాడు.

23. నన్ను ఆరాధించుటకు నా కుమారుని వెళ్ళనిమ్మని నిన్ను ఆజ్ఞాపించితిని. కాని అతడు వెళ్ళుటకు నీవు అంగీకరింపకున్నావు. కావున నేను నీ కుమారుని, నీకు మొట్టమొదట పుట్టినవానిని చంపెదను' అని చెప్పుము” అనెను.

24. ప్రయాణముచేయుచు మోషే రాత్రికి విడిది చేసినపుడు యావే అతనిని కలిసికొని చంపివేయ జూచెను.

25. వెంటనే సిప్పోరా ఒక పదునైన చెకుముకి రాతిని తీసికొని కుమారుని చర్మాగ్రము కోసి దానిని మోషే పాదములకు తాకించి “నిజముగా నీవు నాకు నెత్తురుపొత్తుగల పెనిమిటివైతివి” అని అనెను.

26. యావే మోషేను చంపక విడిచెను. ఈ సున్నతివలననే ఆమె “నెత్తురుపొత్తుగల పెనిమిటి” అని అనెను.

27. యావే అహరోనుతో “నీవు మోషేను కలిసి కొనుటకు ఎడారికి పొమ్ము” అనెను. కావున అహరోను వెళ్ళి దేవునికొండ దగ్గర మోషేను కలిసికొని అతనిని ముద్దాడెను.

28. యావే తనను పంపునపుడు తెలుపమనిన మాటలు, చేయుమనిన సూచకక్రియలు మోషే అహరోనునకు తెలియజెప్పెను.

29. అప్పుడు మోషే అహరోనులు వెళ్ళి యిస్రాయేలీయులలో ఉన్న పెద్దల నందరిని ప్రోగుజేసిరి.

30. యావే మోషేతో పలికిన పలుకులు అన్నింటిని అహరోను వారికి చెప్పేను. వారు చూచుచుండగనే సూచకక్రియలు చేసెను.

31. ఆ ప్రజలందరకు విశ్వాసము కలిగెను. యావే యిస్రాయేలీయులను చూడవచ్చెననియు, వారు పడుపాటులను కన్నులార చూచెననియు తెలిసికొని వారు తలలు వంచి దేవుని ఆరాధించిరి.

1. తరువాత మోషే అహరోనులు ఫరోకడకు వెళ్ళి అతనితో “యిస్రాయేలు దేవుడైన యావే 'అరణ్యములో నా పేర ఉత్సవము జరుపుకొనుటకు నా ప్రజలను పోనిమ్ము' అని అడుగుచున్నాడు” అని చెప్పిరి.
2. ఫరో “ఎవరా యావే? అతడు చెప్పిన మాటకు చెవియొగ్గి నేనేల యిస్రాయేలీయులను పంపవలెను? అతడెవడో నాకు ఏమియు తెలియదు. నేను యిస్రాయేలీయులను వెళ్ళిపోనీయను” అనెను.
3. అంతట వారు “హెబ్రీయుల దేవుడు మాకు ప్రత్యక్ష మయ్యెను. మూడుదినములపాటు అరణ్యమున ప్రయాణముచేసి మా దేవుడైన యావేకు బలి అర్పించుటకు సెలవిమ్ము. కానిచో ఆయన మహారోగములతో కాని, ఖడ్గముతోకాని మామీద విరుచుకొనిపడును” అని బదులు చెప్పిరి.
4. ఐగుప్తుదేశ ప్రభువు “మోషే! అహరోనూ! మీరు యిస్రాయేలీయులను పనిపాటలు మాన్పించుటలో అర్థమేమయినా ఉన్నదా? పొండు! మీ ఊడిగములేవో మీరు చూచుకొనుడు” అని వారితో అనెను.
5. అతడు ఇంకను “ఈ జనము ఎక్కువగా విస్తరించిరి. వారిని కష్టపడకుండ చేయవలెననియా మీ కోరిక!” అనెను.
6. ఆనాడే ఫరో ఐగుప్తుదేశీయ దాసాధ్యక్షులకు, యిస్రాయేలీయులగు పర్యవేక్షకులకు ఆజ్ఞలిచ్చుచు,
7. “ఇప్పటిదాక మీరే ఈ జనులకు ఇటుకలు చేయుటకై గడ్డిని సమకూర్చితిరి. ఇకముందు ఆ పనిచేయవలదు. వారినే వెళ్ళి తమకు కావలసిన గడ్డిని ప్రోగుజేసికొననిండు,
8. అంతేకాదు. వారు మునుపుచేసినన్ని ఇటుకలు చేయునట్లు చూడుడు. ఆ లెక్క ఏమాత్రము తగ్గరాదు. వారు సోమరిపోతులు. కావుననే - మమ్ము వెళ్ళనిండు. మా దేవునకు బలి అర్పింపనిండు అని మొరుగుచున్నారు.
9. వారిని మునుపటికంటె అధికముగా శ్రమపెట్టుడు. అటులయిన గాని వారు తమపనికి అంటిపెట్టుకొనియుండరు. కల్ల బొల్లివాగుడు విను తీరికలేకుండ ఉందురు” అనెను.
10. దాసాధ్యక్షులును పర్యవేక్షకులతోపాటు యిస్రాయేలీయులతో మాట్లాడుటకు వెళ్ళిరి.
11. వారు “నేను ఇకముందు గడ్డి సమకూర్పననియు, వెళ్ళి మీకు కనబడినచోట మీరే గడ్డిని ప్రోగుజేసికొనుడనియు, మొత్తముమీద ఇటుకలలెక్క ఏమాత్రము తగ్గరాదనియు ఫరో ఆజ్ఞాపించెను” అని చెప్పిరి.
12. అందుచేత యిస్రాయేలీయులు గడ్డిదుబ్బులు కోయుటకై ఐగుప్తుదేశమందంతట చెల్లాచెదరయిరి.
13. దాసాధ్యక్షులు వారిని పీడించిరి. వారితో “మీకు గడ్డిని సమకూర్చి ఇచ్చినప్పుడు చేసినన్ని ఇటుకలు ఇప్పుడును చేయవలెను” అనిరి. 
14. ఫరో దాసాధ్యక్షులు తాము యిస్రాయేలీయులమీద నియమించిన పర్యవేక్షకులను కొరడాలతో కొట్టి “ఎప్పటిమాదిరిగా నేడుకూడ మీరు పూర్తిగా లెక్కకు సరిపోవునట్లు ఇటుకలు చేయింపలేదేల?” అని అడిగిరి.
15. యిస్రాయేలీయుల పర్యవేక్షకులు ఫరో కడకువెళ్ళి ఫిర్యాదుచేసిరి. వారు అతనితో “మీరు మీ దాసులను ఈ విధముగా బాధింపనేల? 
16. మీ దాసులకు గడ్డిని సమకూర్పరు. అయినను ఇటుకలు చేయుడని గద్దింతురు. ఇప్పుడు మీ దాసులను కొరడాలతో కొట్టిరి. తప్పు మీ ప్రజలయందే నున్నది” అని అనిరి.
17. ఫరో వారితో “మీరు సోమరిపోతులు, సోమరిపోతులు కావుననే యావేకు , బలి అర్పించుటకు మమ్ము వెళ్ళనిండు అని అనుచున్నారు. 
18. వెంటనే మీరు మీ పనికిపొండు. ఎవ్వరు ఏ గడ్డిని మీకీయరు. కాని మీరు మాత్రము లెక్కచొప్పున చేయవలసిన ఇటుకలను చేయక తప్పదు” అని అనెను.
19. తాము రోజువారిగా చేయుచున్న ఇటుకల లెక్కలో తగ్గింపు ఉండదని వినిన తర్వాత యిస్రాయేలు పర్యవేక్షకులు తమకు ఎంత కష్టదశ కలిగెనో తెలిసి కొనిరి.
20. వారు ఫరో సమ్ముఖమునుండి మరలి వచ్చుచు బయట తమకొరకు వేచియుండిన మోషేను అహరోనును కలిసికొనిరి.
21. ఆ పర్యవేక్షకులు వారితో “మీరు చేసిన యీ పనికి గాను యావే మీకు తగిన శిక్షవేయునుగాక! ఫరోరాజుకు, అతని కొలువు వారికి మా వాసన గిట్టుటలేదు. వారు మమ్ము ద్వేషించునట్లు చేసితిరి, మా గొంతులు కోయుటకు వారి చేతులకు కత్తులు ఇచ్చితిరి” అని అనిరి.
22. అపుడు మోషే యావేను ఆశ్రయించెను. అతడు “ప్రభూ! వీరిని ఇంత కటికతనముతో చూచుచున్నావేల? ఇంతకు నన్నిక్కడికి ఎందుకు పంపితివి?
23. నేను ఫరోను దర్శించి అతనితో నీ పేర మాట్లాడినప్పటి నుండి అతడు ఈ జనులను చంపుకొని తినుచున్నాడు. నీవేమో నీ ప్రజలను ఉద్దరించుటకు కాసింత ప్రయత్నమైన చేయవైతివి” అని యావేకు విన్నవించెను.

1. అప్పుడు యావే మోషేతో “నేను ఫరోకు చేయబోవుదానిని నీవే చూచెదవు. చివరకు యిస్రాయేలీయులను పంపునట్లుగానే నేను అతనిపై ఒత్తిడి తెత్తును. అతడు వారిని తన దేశమునుండి తోలి వేయును” అనెను.

2-3. దేవుడు మోషేతో మాట్లాలాడెను. ఆయన అతనితో “నేనే ప్రభుడను. సర్వశక్తిమంతుడగు దేవునిగా నేను అబ్రహామునకు, ఈసాకునకు, యాకోబునకు ప్రత్యక్షమైతిని. కాని యావే అను నా నామమున మాత్రము వారికి నన్ను ఎరుకపరచు కోలేదు.

4. కొంతకాలము వారు పరదేశులుగా వసించిన కనాను మండలమును వారికిచ్చుటకు నేను వారితో ఒడంబడిక చేసికొంటిని.

5. ఇక ఐగుప్తు దేశీయులు బానిసలుగా చేసిన యిస్రాయేలీయుల ఆక్రందనను నేను చెవులారవింటిని. నా ఒడంబడికను గుర్తు తెచ్చుకొంటిని.

6. కావున యిస్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి 'నేనే ప్రభుడను. ఐగుప్తుదేశీయులు మీనెత్తికెత్తిన బరువు తొలగింతును. వారి దాస్యము నుండి మీకు విముక్తి కలిగింతును. నా బాహువుచాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ము దాస్యము నుండి విడిపింతును.

7. మిమ్ము నా ప్రజగా స్వీకరింతును. నేను మీకు దేవుడనగుదును. ఐగుప్తుదేశములో మిమ్ము కష్టముల బారినుండి తప్పించిన మీ దేవుడను, ప్రభుడను “నేనే” అని మీరు తెలిసికొందురు.

8. అబ్రహామునకు, ఈసాకునకు, యాకోబునకు ఇత్తునన్న దేశమునకే నేను మిమ్ము తోడ్కొని పోవు దును. ఆ దేశమును మీకు సొంతసొత్తుగా ఇత్తును. నేనే ప్రభుడను' అని చెప్పుము” అనెను.

9. మోషే ఈ మాటలను యిస్రాయేలీయులకు చెప్పెను. కాని వారు మనోవ్యధవలనను, క్రూరదాస్యము వలనను సహనమును కోల్పోయి ఉండుటచే, అతని మాటలు లక్ష్యము చేయరైరి.

10. అపుడు దేవుడు మోషేతో భాషించెను.

11. ఆయన అతనితో “నీవు వెళ్ళుము. ఈ దేశమును వదలిపోవుటకు యిస్రాయేలీయులను విడిపింపుమని ఫరోతో చెప్పుము” అని పలికెను.

12. మోషే ప్రభూ! యిస్రాయేలీయులే నన్ను లెక్కచేయనప్పుడు ఇక ఫరో నా నత్తిమాటలు వినునా?"" అని పలికెను.

13. ఈ విధముగా దేవుడు మోషేతో, అహరోనుతో మాటలాడెను. ఐగుప్తుదేశమునుండి యిస్రాయేలీయులను తోడ్కొని పోవుటకుగాను, యిస్రాయేలీయుల వద్దకు, ఫరోవద్దకు వెళ్ళుడని వారిని ఆజ్ఞాపించెను."

14. వారిరువురి కుటుంబముల మూలపురు షులు వీరు: యిస్రాయేలు పెద్దకొడుకైన రూబేను కుమారులు హోనోకు, పల్లు, హెస్రోను, కర్మీ అను వారు రూబేను వంశీయులు.

15. షిమ్యోను పుత్రులు: యెమూవేలు, యామీను, ఒహదు, యాకీను, సొహరు మరియు కనానీయురాలి కుమారుడగు షావులు. వీరు షిమ్యోను వంశీయులు.

16. లేవి కుమారులు క్రమముగా గెర్షోను, కోహాతు, మెరారి అనువారు. లేవి నూటముప్పదిఏడేండ్లు బ్రతికెను.

17. గెర్షోను కుమారులు కుటుంబ క్రమమున లిబ్ని, షిమి అనువారు.

18. హాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనువారు. కోహాతు నూటముప్పది మూడు యేండ్లు జీవించెను.

19. మెరారీ కుమారులు మహ్లి , మూషీ అను వారు. జ్యేష్ఠతనుబట్టి లేవి కుటుంబములవారు వీరే.

20. అమ్రాము తన మేనత్తయగు యోకెబెదును పెండ్లియాడెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాము నూటముప్పది ఏడేండ్లు బ్రతికెను.

21. కోహాతు కుమారులు కోరా, నెఫెగు, సిఖ్రి అనువారు.

22. ఉజ్జీయేలు పుత్రులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ అనువారు.

23. అహరోను అమ్మినాదాబు కుమార్తె, నహసోను చెల్లెలునగు ఎలీషెబను పెండ్లియాడెను. ఆమె అతనికి నాదాబును, అబీహూను, ఎలియెజెరును, ఈతామారును కనెను.

24. కోరా కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసాపు. వీరు కోరా కుటుంబములవారు.

26. అహరోను కుమారుడగు ఎలియెజెరు పుతీయేలు కుమార్తెలలో ఒకరిని పెండ్లియాడెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను. కుటుంబక్రమమున లేవి కుటుంబముల మూలపురుషులు వీరు.

26. ఈ అహరోను మోషేలకే దేవుడు “యిస్రాయేలీయులను వారివారి వంశముల ప్రకారముగా ఐగుప్తుదేశము నుండి వెలుపలికి తోడ్కొనిరండు” అని చెప్పెను.

27. యిస్రాయేలీయులను ఐగుప్తుదేశము నుండి వెడలిపోనిమ్మని ఫరోరాజుతో మాట్లాడినది వీరిద్దరే. వీరే అహరోను, మోషేలు.

28-29. ఐగుప్తుదేశమున దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, “నేను ప్రభుడను. నేను మీతో చెప్పిన మాటలనెల్ల ఐగుప్తురాజగు ఫరోతో చెప్పుము” అనెను.

30. మోషే ప్రభువుతో “నేను తడువుకొనుచు మాట్లాడువాడను. ఫరో నా మాటలు వినునా?” అనెను.

1. అంతట దేవుడు మోషేతో “ఇదిగో! చూడుము, నేను నిన్ను ఫరోరాజునకు దేవునివంటి వానినిగా నియమించితిని. నీ సోదరుడు అహరోను నీకు ప్రవక్తగా ఉండును.

2. నేను పలుకుమని నీతో చెప్పినదెల్ల నీవు నీ సోదరుడగు అహరోనుతో చెప్పుము. అతడు ఆ మాటలను ఫరోతో చెప్పి యిస్రాయేలీయులను ఐగుప్తుదేశమునుండి పంపివేయుమని అడుగును. కాని నేను ఫరో హృదయమును కఠినపరతును.

3. అప్పుడు నేను ఐగుప్తుదేశములో అనేక సూచకక్రియలను చూపి, మహత్తర కార్యములను చేయుదును.

4. ఫరో నీ మాట వినడు. నేను ఐగుప్తుదేశముపై నా బలమును చూపుదును. ఆ దేశీయులను నిశ్చయముగా శిక్షించి, నా సేనలును, ప్రజలును అయిన యిస్రాయేలీయులను ఐగుప్తుదేశమునుండి తోడ్కొనివచ్చెదను.

5. ఐగుప్తుదేశముపై నా బలమును చూపి యిస్రాయేలీ యులను వెలుపలకు తోడ్కొనివచ్చినపుడు ఆ దేశీ యులు నేనే ప్రభుడనని తెలిసికొందురు” అనెను.

6. మోషే అహరోనులు ప్రభువుమాట తల దాల్చి ఆయన ఆనతిచ్చినట్లే చేసిరి.

7. ఫరోరాజుతో సంభాషించు నాటికి మోషే వయస్సు ఎనుబది యేండ్లు. అహరోను వయస్సు ఎనుబది మూడేండ్లు.

8. ప్రభువు మోషే అహరోనులతో మాట్లాడుచు,

9. “ఏదీ! మీ అద్భుత శక్తి చూపుడని ఫరో మిమ్మును అడిగినయెడల, మోషే! నీవు అహరోనుతో 'నీ కఱ్ఱను తీసికొని ఫరోముందు పడవేయుము. అది పాము అగును' అని చెప్పవలయును” అని పలికెను.

10. అంతట మోషే అహరోనులు ఫరోరాజు దగ్గరకు వెళ్ళి ప్రభువు ఆనతిచ్చినట్లుగా చేసిరి. అహరోను ఫరో ముందు, అతని కొలువువారి ముందు కఱ్ఱను పడ వేసెను. అది పాముగా మారెను.

11. ఇది చూచిన ఫరోరాజు ఐగుప్తునందలి విజ్ఞానులను, మాంత్రికులను పిలిచెను. వారుకూడ తమ మంత్రములచేత ఆ విధముగనే చేసిరి.

12. వారిలో ప్రతివాడు తన కఱ్ఱను విసరివేసెను. అది పాముగా మారెను. కాని అహరోను కఱ్ఱను వారి కర్రలన్నింటిని మింగివేసెను.

13. అయినప్పటికి ఫరోరాజు కఠినచిత్తుడుగనే ఉండెను. ప్రభువు ముందు చెప్పినట్లుగనే మోషే అహరోనుల మాటలు అతని చెవికి ఎక్కలేదు.

14. అప్పుడు ప్రభువు మోషేతో ఇట్లనెను. “ఫరోరాజు కఠినహృదయుడుగనే ఉన్నాడు. ప్రజను పోనిచ్చుటకు అంగీకరింపకున్నాడు.

15. ఉదయము ననే అతడు నైలునదికి వెళ్ళునపుడు నీవును అతనితో పాటు వెళ్ళుము. ఏటి ఒడ్డున అతనికొరకు వేచియుండుము. నీవు వెళ్ళునపుడు అంతకుముందు పాముగా మారిన కఱ్ఱను గూడ కొనిపొమ్ము.

16. పోయి అతనితో 'హెబ్రీయుల దేవుడైన యావే, అరణ్యములో నన్ను ఆరాధించ నా ప్రజలను పోనిమ్ము' అని నీతో చెప్పుటకు నన్ను పంపెను. కాని ఇంతవరకు నీవు ఆయన మాటలు వినలేదు.

17. కావున ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. ఇక దీనిని బట్టియైన నేను యావేనని నీవు గుర్తింతువు సుమా! నా చేతిలో ఉన్న ఈ కఱ్ఱతో నైలునది నీటిని కొట్టెదను. అది నెత్తురుగా మారును.

18. ఏటిలోని చేపలన్నియు చచ్చును. నది అంతయు కంపుకొట్టును. నైలునదినీరు త్రాగుటకు ఐగుప్తుదేశీయులు ఏవగించుకొందురు.”

19. ప్రభువు మోషేతో “నీవు అహరోనుతో 'నీ కఱ్ఱను చేపట్టి ఐగుప్తుదేశమునందలి జలములు అన్నింటి మీదికి అనగా నదులు, వాగులు, చెరువులు, ఊటగుంటల మీదికి చేయిచాపుము. వానిలోని నీరెల్ల నెత్తురుగా మారును. చివరకు తొట్టులలోను, కుండలలోను ఉన్న నీరు కూడ నెత్తురగును' అని చెప్పుము” అని పలికెను.

20. మోషే, అహరోనులు ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఫరోరాజు అతని కొలువువారు చూచుచుండగనే అహరోను కఱ్ఱనెత్తి నైలు నది నీటిని కొట్టెను. నది నీరంతయు నెత్తురయ్యెను.

21. నదిలోని చేపలన్నియు చచ్చెను. అది కంపు కొట్టెను. ఐగుప్తు దేశీయులు నైలునది నీటిని త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమందంతట నెత్తురు కనిపించెను.

22. కాని ఐగుప్తుదేశీయులైన మాంత్రికులు కూడ తమ మంత్ర బలముచే ఆ అద్భుతకార్యమును చేసిరి. అందుచేత ప్రభువు ముందు చెప్పినట్లుగానే ఫరోరాజు యొక్క హృదయము కఠినము అయ్యెను. అతడు మోషే అహరోనులు చెప్పిన మాటలు వినలేదు.

23. ఫరోరాజు ఈ అద్భుతకార్యమునుగూడ లెక్కచేయక తన సౌధమునకు తిరిగి వెళ్ళెను.

24. అంతట ఐగుప్తు దేశీయులు మంచినీటికై ఏటి ఒడ్డుపొడవున గుంటలు త్రవ్విరి. వారు నైలునదిలోని నీటిని త్రాగలేకపోయిరి.

25. యావే నైలునది నీటిని కఱ్ఱతో కొట్టిన తరువాత ఏడు రోజులు గడిచెను.

1. అప్పుడు యావే మోషేతో “నీవు ఫరోరాజు కడకు వెళ్ళి అతనితో 'యావే నీతో ఈ మాటలు చెప్పుమనెను. నన్ను ఆరాధించుటకు నా ప్రజను పోనిమ్ము.

2. నీవు వారిని పోనీయనిచో నీ దేశమునెల్ల కప్పలతో పీడింతునని తెలిసికొనుము.

3. నైలునది కప్పలతో నిండిపోవును. అవి తీరముదాటి నీ సౌధమునకు ప్రాకును. నీ పడుకగదికి, నీ శయ్యమీదికి ప్రాకును. నీ కొలువులో ఉన్నవారి ఇండ్లకు, నీ ప్రజల పడకయిండ్లకు ప్రాకును. నీ ఇంటి పొయ్యిలోనికి, పిండి పిసుకు తొట్లలోనికి ప్రాకును.

4. చివరకు కప్పలు నీమీదికిని, నీ ప్రజలమీదికిని, నీ దాసుల మీదికిని ప్రాకును' అని చెప్పుము" అని పలికెను.

5. యావే మోషేతో, “నీవు అహరోనుతో నదుల మీదికి, వాగుల మీదికి, ఊటగుంటల మీదికి .నీ కఱ్ఱను  చాపుము. ఐగుప్తుదేశమంత కప్పలతో నిండి పోవునట్లు చేయుము' అని చెప్పుము” అని పలికెను.

6. అహరోను చేయెత్తి ఐగుప్తుదేశములోని జలములమీదికి తన కఱ్ఱను చాచెను. అంతట కప్పలు వచ్చి ఐగుప్తు దేశమునందంతట నిండెను.

7. కాని మాంత్రికులు కూడ తమ మంత్రబలముతో ఐగుప్తుదేశము కప్పలతో నిండునట్లు చేసిరి.

8. ఫరో మోషేను, అహరోనును పిలిపించి “నన్నునూ, నా ప్రజలను కప్పలబారినుండి కాపాడుమని యావేను వేడుడు. యావేకు బలులర్పించుటకై ఈ ప్రజలను పోనిత్తునని మాటయిచ్చుచున్నాను” అనెను.

9. మోషే ఫరోతో “ఏలినవారు అనుగ్రహించిన చాలు. కప్పలు నిన్ను నీ కొలువు వారిని, నీ ప్రజలను వీడిపోవునట్లుగా నేనెప్పుడు ప్రార్థింపవలయునో చెప్పుము. నా ప్రార్థనవలన అవి నిన్ను నీ ఇండ్లను వదలిపోయి నైలునదిలోనే ఉండిపోవును”. అనెను.

10. “రేపే ప్రార్ధింపుము” అని ఫరో పలికెను. “నీవు చెప్పినట్లే జరుగును. దీనినిబట్టి ఎవ్వరును మా దేవుడయిన యావేకు సాటిరారని నీవు తెలిసికొందువు.

11. కప్పలు నిన్ను, నీ సౌధములను, నీ కొలువువారిని, నీ జనులను వదలిపోవును. అవి నదిలోనే ఉండును" అని మోషే పలికెను.

12. మోషే, అహరోను ఫరో సమ్ముఖమునుండి వెళ్ళిపోయిరి, యావే కప్పలతో ఫరోను ముప్పుతిప్పలు పెట్టెను. కావున అతనిని కప్పల బారినుండి కాపాడు మని మోషే ప్రభువునకు మొరపెట్టెను.

13. యావే మోషే ప్రార్ధన ప్రకారముగా చేసెను. ఇండ్లలో, ముంగిళ్ళలో, పొలములలో ఉన్న కప్పలన్నియు చచ్చిపోయెను.

14. ప్రజలు చచ్చిన కప్పలను కుప్పలుకుప్పలుగా ప్రోగుచేసిరి. దేశమంతయు కంపుకొట్టెను.

15. కీడు తొలగినదిగదా అనుకొని ప్రభువు చెప్పినట్లు ఫరో ఎప్పటిమాదిరిగా కఠినహృదయుడయ్యెను. మోషే, అహరోను చెప్పిన మాటలు అతడు వినిపించుకోలేదు.

16. అంతట యావే మోషేతో “నీవు అహరోనుతో 'కఱ్ఱచాచి నేలమీద దుమ్మును కొట్టుము. ఐగుప్తు దేశమునందంతట ఆ దుమ్ము దోమలుగా మారును' అనిచెప్పుము” అని పలికెను.

17. వారు అట్లే చేసిరి. అహరోను కఱ్ఱ చాచి దుమ్మునుకొట్టెను. అంతట మనుష్యులకు, జంతువులకు దోమకాటు మొదలయ్యెను. ఐగుప్తు దేశములో నేలమీది దుమ్మంత దోమలుగా మారెను.

18. మాంత్రికులుకూడ మంత్రబలముతో దోమలను పుట్టించుటకు ప్రయత్నించిరి. కాని వారిచేత కాలేదు. దోమలు మనుష్యులను, జంతువులను కుట్టెను.

19. అందుచేత మాంత్రికులు ఫరోతో “ఇది దైవశక్తివలన పుట్టిన కార్యము” అని చెప్పిరి. కాని ఫరో హృదయము ఇంకను బండబారెను. ప్రభువు ముందుగా చెప్పినట్లే అతడు మోషే అహరోనుల మాటలకు చెవియొగ్గలేదు.

20. అంతట యావే మోషేతో “నీవు వేకువనే లేచి ఫరో నదికి వెళ్ళునపుడు అతనికొరకు వేచి యుండుము. అతనితో 'యావే నీకిట్లు చెప్పుచున్నాడు. నన్ను ఆరాధించుటకు నా ప్రజలను పోనిమ్ము.

21. నీవు నా ప్రజను వెళ్ళనీయనిచో నేను నీమీదికి, నీ కొలువువారిమీదికి, నీ జనములమీదికి, నీ సౌధముల మీదికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తుదేశీ యులు నివసించుచున్న ఇండ్లు, వారు నిలిచిన ప్రదేశ ములన్నియు ఈగలతో నిండిపోవును.

22. కాని అదే సమయమున నా ప్రజలు నివసించు గోషేను మండలమును మాత్రము కాపాడెదను. అక్కడ మాత్రము ఈగపోటు ఉండదు. ఇట్లు చేసినగాని యీ దేశమున అరిష్టములు కలిగించునది ప్రభుడనైన నేనేనని నీవు తెలిసికొనజాలవు.

23. నా ప్రజలను నీ ప్రజలనుండి వేరుచేయుదును. రేపే యీ సూచకక్రియ కనబడును' అని చెప్పుము” అని పలికెను.

24. యావే తాను చెప్పినట్లే చేసెను. ఈగలు గుంపులు గుంపులుగా ఫరో సౌధములలోనికి, అతని కొలువు వారి ఇండ్లలోనికి వచ్చెను. అవి ఐగుప్తుదేశము నందంతట వ్యాపించెను. దేశమంతయు నాశనమయ్యెను.

25. ఫరో మోషేను, అహరోనును పిలిపించి “వెళ్ళుడు ఈ దేశములోనే మీ దేవునికి బలి అర్పింపుడు” అని చెప్పెను.

26. దానికి మోషే “అది మంచిపని కాదు. మేము మా ప్రభువైన దేవునికి పశువులను కొన్నింటిని బలిగా అర్పింతుము. కాని ఆ పశువులను బలియిచ్చుట అనిన ఐగుప్తుదేశీయులు ఏహ్యముగా భావింతురు. ఐగుప్తుదేశీయుల కన్నుల ఎదుటనే వారికి క్రోధము పుట్టించు బలి అర్పించినచో వారు మమ్ము రాళ్ళతో కొట్టి చంపరా?

27. మా దేవుడైన యావే ఆజ్ఞాపించినట్లుగా మేము మూడు రోజులపాటు ఎడారిలో ప్రయాణముచేసి ఆయనకు బలి అర్పించెదము" అని పలికెను.

28. దానికి ఫరో “మీరు ఎక్కువ దూరము పోమనినచో, మీ దేవుడైన యావేకు ఎడారిలో బలి అర్పింప మిమ్ము పోనిత్తును. నా కొరకు మీదేవుని వేడుడు” అని పలికెను.

29. అంతట మోషే “నేను ఇక్కడనుండి వెళ్ళిపోయిన వెంటనే ప్రభువును వేడుకొందును. రేపు ప్రొద్దుట ఈ ఈగలగుంపులు ఫరోను, అతని కొలువువారిని, అతని జనులను వీడిపోవును. కాని ఫరో మాత్రము మరల కపటనాటకమాడి, ప్రభువునకు బలి అర్పింప ప్రజలను వెళ్ళనీకుండ అడ్డగింపరాదు” అనెను.

30. మోషే ఫరోరాజు సమ్ముఖమునుండి వెడలి, యావేను ప్రార్ధించెను.

31. యావే అతడు వేడుకొనినట్లే చేసెను. ఈగలు ఫరోను, అతని కొలువువారిని, అతని ప్రజలను వీడివెళ్ళెను. ఒక్కటిగూడ మిగులలేదు.

32. కాని ఫరో ఈసారి కూడ కఠినచిత్తుడై ప్రజలను పోనీయడాయెను.

1. అంతట ప్రభువు మోషేతో “వెళ్ళి ఫరోతో 'హెబ్రీయులదేవుడు యావే నీకు ఈ వర్తమానమును పంపెను. నన్ను ఆరాధించుటకు నా ప్రజను పంపుము.

2. నీవు వారిని వెళ్ళనీయకుండ ఇంకను అడ్డగించినచో,

3. పొలములలో ఉన్న నీ పశువులు అనగా గుఱ్ఱములు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, గొఱ్ఱెలు యావే పంపు రోగమువలన నాశనమైపోవును. వానికి చావు తెగులు తగులును.

4. ప్రభువు యిస్రాయేలీయుల పశువులనుండి ఐగుప్తుదేశీయుల పశువులను వేరు చేయును. యిస్రాయేలీయుల పశువులలో ఏ ఒక్కటియు చావదు.

5. ప్రభువు కాలమును కూడ నిర్ణయించెను. రేపే ఈ దేశమునకు ఈ కీడు మూడునని ఆయన వచించెను' అని చెప్పుము” అని పలికెను.

6. మరునాడే యావే తాను చెప్పినటు చేసెను. ఐగుప్తుదేశీయుల పశువులన్నియు చచ్చెను. యిస్రాయేలీయుల పశువులలో ఒక్కటి కూడ చావలేదు.

7. ఫరో ఈ ఉపద్రవమును గూర్చి విచారణ జరిపి జరిగినదంతయు గుర్తించెను. యిస్రాయేలీయుల పశువులలో ఒక్కటిగూడ చావదయ్యెను. అయినప్పటికి ఫరో హృదయము ఇంకను మొండికెత్తెను. అతడు ప్రజలను పోనీయడయ్యెను.

8. యావే మోషే అహరోనులతో "మీరు గుప్పిళ్ళ నిండ ఆవపు బూడిదను తీసికొనుడు. ఫరో కన్నుల యెదుటనే మోషే దానిని మింటివైపు చల్లవలయును.

9. అది సన్నని పొడియై ఐగుప్తుదేశమంతట వ్యాపించి మనుష్యులకు, జంతువులకు బొబ్బలు పుట్టించును. ఆ బొబ్బలు చిదిగి గాయములగును” అనెను.

10. ప్రభువు ఆజ్ఞాపించినట్లే వారిరువురు ఆవము నుండి బూడిద తీసికొని ఫరోరాజు ఎదుట నిలిచిరి. మోషే దానిని మింటివైపు చల్లెను. ఆ బూడిద మనుష్యులకు జంతువులకు బొబ్బలు పుట్టించెను. అవి పగిలి వ్రణములయ్యెను.

11. మాంత్రికులు మోషే ఎదుట నిలువలేకపోయిరి. ఐగుప్తు దేశీయులందరివలె వారికిని శరీరమందంతటను బొబ్బలు పుట్టెను.

12. కాని యావే ఫరోను కఠినగుండె గలవానినిగా చేసెను. ఆయన ముందు చెప్పినట్లే ఫరో, మోషే అహరోనుల మాటలు వినలేదు.

13. తరువాత యావే మోషేతో “పెందలకడలేచి ఫరో సముఖమునకు వెళ్ళి, అతనితో 'హెబ్రీయుల దేవుడగు యావే నీకు ఈ వార్తను పంపెను. నన్ను సేవింప నా ప్రజను పోనిమ్ము.

14. ఈసారి నిన్నును, నీ కొలువువారిని, నీ ప్రజను సకల శిక్షలకు గురి చేయుదును. అప్పటికిగాని సర్వప్రపంచములో నా వంటివారు ఎవరునులేరని నీకు తెలిసిరాదు.

15. నేను చేయిచేసుకొని నిన్ను, నీ జనమును మహా రోగములతో పీడించియుందునేని నీవు ఈపాటికే ఈ భువిపై కానరాకుండ నాశనమైయుండెడివాడవు.

16. కాని నీకు నా బలమును చూపించుటకు నేల నాలుగు చెరగుల నా నామమును ప్రసిద్ధము చేయుటకు నిన్ను ప్రాణములతో వదలితిని.

17. ఇప్పటికిని నీవు నా ప్రజలను పోనీయక నిన్నునీవు గొప్ప చేసికొనుచున్నావు.

18. కావున రేపీపాటికి ఐగుప్తురాజ్యమును స్థాపించిన నాటినుండి కనివినియెరుగని గొప్ప వడగండ్లవాన కురిపింతును.

19. నీ పశువులను పొలములోనున్న సకలమును భద్రపరచుకొనుము. ఇంటికిరాక పొలమునందేయున్న ప్రతి మనుష్యుని మీద, ప్రతి పశువుమీద వడగండ్లవాన పడును, పొలములోని పశువులు, జనులు, సర్వనాశమగుదురు' అని చెప్పుము” అని పలికెను.

20. యావే పలుకులకు భయపడి ఫరో కొలువులోని వారు కొందరు తమ బానిసలను, పశువులను ఇండ్లకు త్వరగా రప్పించిరి.

21. యావే మాటలను లెక్కచేయనివారు తమ బానిసలను, పశువులను పొలములోనే ఉండనిచ్చిరి.

22. యావే మోషేతో “నీ చేతిని ఆకాశమువైపు చాపుము. ఐగుప్తుదేశమునందంతట మనుష్యులమీద, పశువులమీద పొలములలో మొలచిన మొక్కలమీద, వడగండ్లవాన పడును” అని చెప్పెను.

23. మోషే మింటివైపు కఱ్ఱనెత్తెను. ప్రభువు ఉరుములతో వడ గండ్లవాన కురిపించెను. యావే ఐగుప్తునేలమీదికి పిడుగుల అగ్నిని పంపెను.

24. ఉరుములు మెరుపులు మిరిమిట్లు గొలుపుచుండగా వడగండ్లవాన కురిసెను. ఐగుప్తుదేశీయులు ఒక జాతిగా ఏర్పడిన నాటినుండి కనివిని ఎరుగని గొప్ప వడగండ్లవాన అది.

25. ఈ రీతిగా వడగండ్ల వాన ఐగుప్తుదేశమున పొలములలో ఉన్న మనుష్యులను జంతువులను నాశనము చేసెను. పైరుపంటలను, చెట్టుచేమలను ఊడ్చివేసెను.

26. హెబ్రీయులు వసించు గోషేను మండలములో మాత్రము వడగండ్లవాన పడలేదు.

27. మోషే అహరోనులను ఫరో పిలిపించి వారితో “ఈసారి, నేను తప్పుచేసితిని. యావే న్యాయవంతుడు. నేను, నాజనులు దోషులము.

28. ఈ పిడుగుల వడగండ్లవానను ఆపుమని యావేను వేడుకొనుడు. ఇక ఈ వానలను మేము భరింపలేము. మిమ్ము పోనిత్తునని మాట ఇచ్చుచున్నాను. ఇక మీరిక్కడ ఉండనక్కరలేదు” అని చెప్పెను.

29. అంతట మోషే “ఈ పట్టణమును వీడిన క్షణముననే నేను యావే వైపు చేతులు చాచెదను. ఆ మీదట ఉరుములుండవు. వడగండ్లవాన పడదు. దీనినిబట్టి ఈ భూమండలమునకు అధిపతి యావే అని నీవు తెలిసికొందువుగాక.

30. అయినను నీవును, నీ కొలువు వారును మా దేవుడయిన యావేకు ఇప్పటికిని భయపడరని నాకు తెలియును” అని అనెను.

31. అప్పుడు జనుము పూతపూచియుండెను. యవ వెన్ను తొడిగియుండెను. కావున ఆ రెండును వడగండ్ల వలన నాశనమయ్యెను.

32. గోధుమలు, మిరప మొలకలు ఎదగలేదు. కావున అవి పాడైపోలేదు.

33. మోషే ఫరోను వీడి నగరము వెలుపలికి వెళ్ళెను. అతడు యావే వైపు చేతులు చాచెను. ఉరుములు ఆగెను. వడగండ్లవాన వెలిసెను. నేలమీద వాన చినుకైన పడలేదు.

34. వానపడుట లేదని వడగండ్లవాన కురియుటలేదని, ఉరుములు నిలిచెనని తెలిసిన తరువాత ఫరో తిరిగి పాపము కట్టుకొనెను, అతడును అతని కొలువువారును కఠినహృదయులైరి.

35. మరల ఫరో కఠినహృదయుడయ్యెను. ఇంతకు మునుపు యావే, మోషేద్వారా చెప్పినట్లుగానే అతడు యిస్రాయేలీయులను పోనీయలేదు.

1. యావే మోషేతో "ఫరో దగ్గరకు వెళ్ళుము. ఫరోను, అతని కొలువువారిని కఠినహృదయులుగా నేనే చేసితిని. కావుననే నేను వారికి నా సూచక క్రియలను చూపగలిగితిని.

2. అందుచేతనే నేను ఏ విధముగా ఐగుప్తుదేశీయులను కఠినులనుగా చేసితినో, వారి ఎదుట నేను ఏ సూచకక్రియలను చేసితినో వానినెల్ల నీవు కథలుగా నీ పుత్రపౌత్రులకు చెప్పగలవు. నేనే యావేనని మీరెల్లరును తెలిసికోగలరు” అని చెప్పెను.

3. అంతట మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్ళి, అతనితో “హెబ్రీయుల దేవుడయిన యావే నీకు ఈ వార్త పంపెను 'ఎంతకాలము నీవు నాకు లొంగక మొండిపట్టుపట్టెదవు? నన్ను సేవించుటకు నాప్రజను పోనిమ్ము.

4. నీవు నాప్రజను వెళ్ళనీయకున్న రేపు నేను నీ దేశము మీదికి మిడుతల దండును పంపెదను.

5. ఆ దండు నేలయన్నది యిసు మంతయునైన కనబడకుండ దానిని కప్పివేయును. అది వడగండ్లవాన బారినబడక మిగిలిన దానినెల్ల నాశనము చేయును. పొలములలో మొలిచిన ప్రతి చెట్టును తినివేయును.

6. నీ సౌధములలో, నీ కొలువు వారి ఇండ్లలో, ఐగుప్తుదేశీయుల గృహములలో మిడుతలదండు నిండును. నీ తాతముత్తాతలుగాని, వారి పూర్వులుగాని ఈ దేశమున పాదుకొన్న నాటి నుండి అటువంటి మిడుతలదండును చూచి యెరుగరు' అని ఆయన చెప్పుమనెను” అని పలికిరి. ఈ మాటలు చెప్పిన వెంటనే మోషే ఫరో సమ్ముఖమును వీడి వెళ్ళెను.

7. అప్పుడు ఫరో కొలువువారు అతనితో “ఇతడు ఎంతకాలము మనకు గుండెలపై కుంపటిగా నుండును? వారి దేవుడయిన యావేను సేవించుటకు ఈ మూకలను పంపివేయరాదా? వీరి మూలమున ఐగుప్తుదేశము వల్లకాడైపోయినదని నీవింకను గ్రహింపలేదా?" అనిరి.

8. కావున ఫరో మోషే అహరోనులను తిరిగి పిలిపించెను. అతడు వారితో “మీరు వెళ్ళి మీ దేవుడయిన యావేను సేవింపవచ్చును. కాని ఎవరెవరు వెళ్ళవలయును?" అని పలికెను.

9. దానికి మోషే “మా పిన్నలు పెద్దలు వెళ్ళుదురు. మా కుమారులు. కుమార్తెలు వెళ్ళుదురు. మా మందలు వెళ్ళును మేము యావేకు పండుగ జరుపుకోవలయును" అనెను.

10. కాని ఫరో అతనితో “యావే మీకు మేలుచేయునుగాక. నేను మాత్రము మీ స్త్రీలను. పిల్లలను పోనీయను. మీరేదో ఎత్తుగడ వేయుచున్నారు.

11. మీలో మగవారు మాత్రము వెళ్ళి మీ దేవుని సేవించుకొనుడు. మీరు కోరునది ఇదియే కదా!” అనెను. ఇట్లనుచు ఫరో వారిని తన సమక్షమునుండి వెడలగొట్టెను.

12. అప్పుడు యావే మోషేతో “నీవు ఐగుప్తు దేశముమీదికి నీచేతిని చాపుము. వెంటనే మిడుతల దండు దిగివచ్చి వడగండ్లవాన బారినపడక మిగిలిన పచ్చి మొక్కలనెల్ల తినివేయును” అనెను.

13. మోషే ఐగుప్తుదేశము మీదికి తన కఱ్ఱనెత్తెను. యావే దేశము మీద తూర్పుగాలి వీచునట్లు చేసెను. అది రేయింబవళ్ళు వీచెను. ప్రొద్దుపొడుచుసరికి తూర్పుగాలి వెంట మిడుతలదండు దిగెను.

14. మిడుతలు ఐగుప్తుదేశము అంతట దండు విడిసెను. అవి లెక్కకు అందనట్లుగా వచ్చి దేశమునిండ వ్రాలెను. అటువంటి మిడుతల దండును ఇంతకు ముందు ఎవరును చూడలేదు. ఇకముందు ఎవ్వరును చూడబోరు.

15. నేలయంత నలుపెక్కునట్లుగా మిడుతలు ముసురుకొనెను. అవి దేశములో వడగండ్ల వాన బారినపడక మిగిలిన పైరులను, పండ్లను తిని వేసెను. ఐగుప్తుదేశమంతట పొలములలో పచ్చిమొక్క గాని, పచ్చని చెట్టుగాని మిగులలేదు.

16. వెంటనే ఫరో మోషేను అహరోనును పిలిపించెను. అతడు వారితో “నేను మీ దేవుడైన యావేకును, మీకును ద్రోహము చేసితిని.

17. ఈసారికి నా పాపము క్షమింపుడని మిమ్ము ప్రార్ధించుచున్నాను. నన్ను ఈ చావునుండి కాపాడుమని మీ దేవుడైన యావేను ప్రార్థింపుడు” అనెను.

18. మోషే ఫరో సమక్షమునుండి వెళ్ళిపోయి యావేకు విన్నపములు చేసెను.

19. అప్పుడు యావే గాలివాలును మరల్చి పడమటినుండి పెనుగాలి వీచునట్లు చేసెను. మిడుతలు ఆ గాలిలో చిక్కుకొని పోయి రెల్లు సముద్రములో కూలెను. ఐగుప్తుదేశములో మచ్చుకు ఒక్క మిడుతకూడ మిగులలేదు.

20. కాని యావే ఫరో హృదయము ఇంకను మొండికెత్తునట్లు చేసెను. అతడు యిస్రాయేలీయులను ఇంకనూ వెళ్ళనీయడాయెను.

21. అప్పుడు యావే మోషేతో “నీవు నీ చేతిని మింటివైపు చాపుము. కన్ను పొడుచుకొన్న కానరాని కటికచీకటి ఐగుప్తుదేశమునెల్ల కప్పును” అని చెప్పెను.

22. కావున మోషే తన చేతిని మింటివైపు చాచెను. మూడు రోజుల పాటు ఐగుప్తుదేశమందతట కటికచీకటి కమ్మెను.

23. ఆ మూడు రోజులు ఎవ్వరు ఎవ్వరిని చూడలేకపోయిరి. కాలుకదపలేకపోయిరి. యిస్రాయేలీయులున్న చోట మాత్రము వెలుగు ప్రకాశించెను.

24. అపుడు ఫరో మోషేను పిలిపించి అతనితో “వెళ్ళుడు. యావేను సేవించుకొనుడు. కాని మీ మందలు ఇక్కడనే ఉండవలయును. మీ పిల్లలు మీతోకూడ వెళ్ళవచ్చును” అని అనెను.

25. దానికి మోషే అట్లయిన మా దేవుడయిన యావేకు బలులు, దహనబలులు సమర్పించుటకు నీవే మాకు మందలను ఈయవలసివచ్చును.

26. కావున మా మందలు మా వెంటరాక తప్పదు. ఒక్కగిట్టకూడ ఇక్కడ మిగిలి పోరాదు. మా దేవుడయిన యావేకు మా మందల నుండే బలులు అర్పింపవలయును. బలిప్రదేశము చేరినగాని మేము యావేకు ఎట్టి ఆరాధన చేయవలయునో మాకు తెలియదు” అనెను.

27. కాని యావే ఫరోను ఇంకను కఠినహృదయునిగా చేసెను. అతడు యిస్రాయేలీయులను పోనీయడయ్యెను.

28. ఫరో “నా ఎదుటినుండి పో! జాగ్రత్త! ఇక ఎప్పుడును నీ ముఖము చూపకు. చూపిననాడు నీకు చావుతప్పదు” అని మోషేను గద్దించెను.

29. “సరే కానిమ్ము. నేనిక నీ ముఖము చూడను” అని మోషే అనెను.

1. యావే మోషేతో ఫరోకు, ఐగుప్తుదేశమునకు ఇంకొక్క ఉపద్రవము మాత్రమే కలిగింతును. దానితరువాత అతడు మిమ్ము ఇక్కడినుండి పోనిచ్చును. పోనిచ్చుట మాత్రమేగాదు, మిమ్ము ఇక్కడినుండి గెంటి వేయును.
2. కాబట్టి మీలో ప్రతిపురుషుడును ప్రతి స్త్రీయు తమ ఇరుగుపొరుగున ఉన్న పురుషుని స్త్రీని అడిగి వెండినగలు బంగారునగలు తీసికొనవలయు నని యిస్రాయేలీయులతో చెప్పుము” అనెను.
3. యావే యిస్రాయేలీయులను ఐగుప్తుదేశీయుల కంటికి గొప్పవారు అగునట్లు చేసెను. అదియునుగాక మోషేఅనునతడు ఐగుప్తుదేశములో గొప్పపలుకుబడి గడించెను. ఫరో కొలువువారికి ప్రజలకు మహాఘన నీయుడాయెను.
4. మోషే ఫరోతో "యావే నీకు ఈ వార్తను పంపెను. అర్ధరాత్రమున నేను ఐగుప్తుదేశము మీదుగ పోవుదును.
5. ఈ దేశములో పుట్టిన మొదటికాన్పు పిల్లలందరును చచ్చెదరు. సింహాసనమునకు వారసుడైన ఫరో మొదటిబిడ్డనుండి, తిరుగటిలో పిండివిసరు పనికత్తె మొదటిబిడ్డ వరకును ఎల్లరును చత్తురు. పశువులలోను తొలిచూలుపిల్లలు చచ్చును.
6. ఐగుప్తు దేశమంతట శోకారావము మిన్నుముట్టును. అట్టి ఆక్రందన ఇంతకుముందు పుట్టలేదు, ఇక పుట్టబోదు.
7. కాని యిస్రాయేలీయులలో మనుష్యుని మీదగాని, పశువుమీదగాని ఒక్క కుక్కకూడా నాలుక ఆడించదు. దీనినిబట్టి యావే యిస్రాయేలీయులను ఐగుప్తు దేశీయుల నుండి వేరుచేసెనని నీవు తెలిసికొందువు.
8. అప్పుడు ఇక్కడనున్న నీ కొలువువారు అందరు నన్ను వెదకుకొనుచు వచ్చి, నా ఎదుట మోకరిల్లి 'నీవును నీ అనుచరులును అందరు వెళ్ళిపొండు' అందురు. అప్పుడుగాని నేను వెళ్ళను” అనెను. ఈ మాటలు పలికి కోపముతో మండిపడుచు ఫరో సమ్ముఖము నుండి మోషే వెడలిపోయెను.
9. “ఐగుప్తుదేశములో నేను ఇంకను నా మహత్కార్యములు విస్తరింపవలయును కనుక నీ మాట ఫరో చెవినదూరదు” అని యావే మోషేతో అనెను.
10. మోషే అహరోనులు ఫరోరాజు కన్నుల ఎదుటనే ఈ మహత్కార్యములన్నిటిని చేసిరి. కాని యావే ఫరో రాజును కఠినహృదయునిగా చేసెను. అతడేమో యిస్రాయేలీయులను తనదేశము విడిచి వెళ్ళనీయలేదు.

1. ఐగుప్తుదేశములో ఉన్న మోషేతోను, అహరోనుతోను ప్రభువు ఈ విధముగా చెప్పెను:

2. “అన్ని నెలలలోను ఈనెల మీకు మొదటిదగును. సంవత్సరములో ఈ నెలను మొదటినెలగా పరి గణింపుడు.

3.యిస్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు 'ఈ నెలలో పదియవనాడు ప్రతివ్యక్తి తన కుటుంబమునకై ఒక గొఱ్ఱె పిల్లనుగాని, మేకపిల్లనుగాని అనగా ప్రతి ఇంటికి ఒకగొఱ్ఱె పిల్లను గాని, మేకపిల్లనుగాని తీసుకొనిరావలయును.

4. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబమువారు చాలకపోయినచో కుటుంబయజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలయును. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో, మొత్తముమీద ఎందరు భుజింతురో ముందుగనే నిర్ణయించుకొని ఆ మీదట పశువును ఎన్నుకొనవలయును.

5. పశువు అశుద్ధమైనది కాకూడదు. అది ఒక ఏడాది పోతు అయివుండ వలెను. మేకలనుండి గాని, గొఱ్ఱెలనుండిగాని దానిని ఎన్నుకొనవచ్చును.

6. ఈ నెలలో పదునాలుగవరోజు వరకు ఆ పశువును మీవద్దనే ఉండనిండు. అప్పుడు యిస్రాయేలీయుల సమాజమువారందరు ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలయును.

7. అంతట దాని నెత్తురు తీసికొనిపోయి వారు తాము మాంసము తిను ఇంటివాకిళ్ళ రెండు నిలువుకమ్ముల మీదను, పై అడ్డకమ్మి మీదను పూయవలయును.

8. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలయును. పొంగనిరొట్టెలతో చేదు మొక్కకూర లతో ఆ మాంసమును తినవలయును. 

9. పచ్చిమాంస మును గాని ఉడుకబెట్టిన మాంసమునుగాని తినరాదు. తల, కాళ్ళు, ప్రేగులు వీనితోపాటు పశువును పూర్తిగా నిప్పులలో కాల్చియే తినవలయును.

10. మరునాటి ప్రొద్దుటికి ఆ మాంసములో ఒక్క ముక్కయైనను మిగులరాదు. మిగిలిన దానిని నిప్పులలో కాల్చివేయవలయును.

11. మాంసము ఈ క్రిందివిధముగా తినవలయును. తినునపుడు మీ నడుమునకు దట్టీ ఉండవలయును. కాళ్ళకు చెప్పులు ఉండవలయును. చేతిలో కఱ్ఱ ఉండవలయును. మాంసమును గబగబా తినవలయును. ఇది ప్రభువు పాస్క'బలి.

12. ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమునందు తిరుగాడుదును. ఐగుప్తుదేశమునందలి నరుల, పశువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తుదేశ దేవతలకెల్ల శిక్షలు విధింతును. నేను యావేను!

13. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమియు చేయక మీ ఇండ్లు దాటి పోయెదను. నేను ఐగుప్తుదేశమును నాశనము చేయునప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు.

14. ఈ రోజు మీకు జ్ఞాపకార్ధదినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసికొనవలయును. తరతరముల వరకు శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలయును.

15. ఏడురోజులపాటు మీరు పొంగని రొట్టెలను తినవలయును. మొదటిరోజుననే రొట్టెల పిండిని పులియచేయు పదార్థమును మీ ఇండ్లనుండి పారవేయవలయును. మీలో ఎవ్వడైన మొదటి రోజునుండి ఏడవరోజు వరకు ఏనాడైన పొంగిన రొట్టెలను తినినచో, వాడు యిస్రాయేలీయులనుండి వెలివేయ బడును.

16. మీరు మొదటిరోజున, ఏడవ రోజున పవిత్రసభ చేయవలయును. ఆ రెండు రోజులలో మీరు ఏపనిని చేయరాదు. వంటకమును మాత్రము వండుకొనవచ్చును.

17. మీరు ఈ పొంగనిరొట్టెల పండుగ తప్పక జరుపుకొనవలయును. ఏలయన నేను ఆ దినమే మీ సైన్యములను ఐగుప్తుదేశమునుండి వెలుపలికి చేర్చితిని. యుగయుగములవరకు శాశ్వతముగా ఈ రోజును పర్వదినముగా లెక్కింపుడు.

18. మొదటి నెలలో పదునాలుగవరోజు సాయంకాలమునుండి ఇరువది ఒకటవరోజు సాయంకాలమువరకు మీరు పొంగని రొట్టెలు తినవలయును.

19. ఏడురోజులవరకు మీ ఇండ్లలో రొట్టెలను పులియజేయు పదార్థము ఉండరాదు. మీలో ఎవ్వడైనను పొంగిన రొట్టెలను తినినచో, వాడు స్వదేశీయుడైనను, విదేశీయుడైనను యిస్రాయేలీయుల సమాజమునుండి వెలివేయబడును.

20. మీరు పొంగినరొట్టెలు ఏమాత్రమును తినకూడదు. మీ ఇండ్లన్నిటిలో పొంగనిరొట్టెలనే తినవలయును."

21. అంతట మోషే యిస్రాయేలీయుల పెద్దల నెల్ల రప్పించి వారితో “వెళ్ళి మీమీ కుటుంబములను బట్టి మందలనుండి పిల్లలను ఎన్నుకొనుడు. పాస్కబలిగా వానిని వధింపుడు.

22. చిలుకరించు (హిస్సోపు) కుంచెను తీసికొని పాత్రములోనున్న పశురక్తమున ముంచుడు. ఆ నెత్తురును కుంచెతో వాకిటి నిలువు కమ్ములమీద, పై అడ్డకమ్మిమీద పూయుడు. ప్రొద్దు పొడుచువరకు మీలో ఎవ్వడును గడపదాటి బయటికి పోరాదు.

23. ఐగుప్తుదేశమును నాశనము చేయుటకై యావే అంతట తిరుగాడును. నిలువుకమ్ములమీద, పై అడ్డ కమ్మిమీద నెత్తురు పూతలనుచూచి యావే వాకిలి దాటిపోవును. వినాశకారిని మీ ఇండ్లలోనికి ప్రవేశింపనీయడు.

24. తరతరములవరకు మీరును, మీ సంతతియు ఈ నియమములను విధిగా పాటింప వలయును.

25. యావే తాను మాట ఇచ్చిన భూమికి మీరు చేరుకొనినపుడు ఈ ఆచారమును నిర్వహింపుడు.

26. మీ బిడ్డలు 'ఈ ఆచారమేమి?' అని మిమ్ము అడిగినపుడు మీరు వారితో

27. 'ఇది యావే పాస్కబలి. ఆయన ఐగుప్తుదేశములోని యిస్రాయేలీయుల ఇండ్లమీదుగా దాటిపోయెను. ఐగుప్తుదేశము నెల్ల నాశనము చేసెను. కాని మన యిస్రాయేలీయుల ఇండ్లను వదలివేసెను' అని చెప్పుడు” అనెను. ఆ మాటలువిని యిస్రాయేలీయులు తలలువంచి దేవునికి నమస్కరించిరి.

28. యిస్రాయేలీయులు అక్కడినుండి వెళ్ళిపోయి ప్రభువు మోషే అహరోనులను ఆజ్ఞాపించి నట్లే చేసిరి.

29. అర్థరాత్రి యావే దేవుడు ఐగుప్తు దేశము నందలి తొలిచూలు బిడ్డలనెల్లచంపెను. సింహాసనమునకు వారసుడైన ఫరోరాజు ప్రథమసంతానము మొదలుకొని, చెరసాల చీకటిగదిలో మ్రగ్గుచున్నవాని మొదటిబిడ్డవరకును ఐగుప్తుదేశమునందలి తొలిచూలు పిల్లలందరిని ఆయన చంపెను. పశువుల తొలిపిల్లల నంతటిని నాశనము చేసెను.

30. ఫరోరాజు, అతని కొలువువారు, ఐగుప్తుదేశీయులు ఎల్లరును రాత్రివేళ మేల్కొని లేచినపుడు ఐగుప్తుదేశమందంతట శోకారావము మిన్నుముట్టినది. దేశమున చావుమూడని ఇల్లు అనునదిలేదు.

31. ఆ రాత్రియే ఫరోరాజు మోషే అహరోనులను పిలిపించి "పొండు! మీరును, మీ యిస్రాయేలీయులును వెంటనే నా ప్రజను వదలివెళ్ళుడు. వెళ్ళి మీరు కోరినట్లే యావేను ఆరాధింపుడు.

32. మీరు చెప్పినట్లే మీ మందలను తోలుకొనిపొండు. నన్నుకూడ దీవింపుడు” అనెను.

33. “మీరు వెళ్ళనిచో మేముగూడ చత్తుము” అనుచు ఐగుప్తుదేశీయులు యిస్రాయేలీ యులను తమ దేశమునుండి వెళ్లిపోవలయునని తొందర పెట్టిరి.

34. అంతట యిస్రాయేలీయులు పిండిపులియక మునుపే ఆ పిండిపిసుకు గిన్నెలను మూటలుకట్టి భుజములమీద వేసికొని వెడలిపోయిరి.

35. యిస్రాయేలీయులు మోషే చెప్పినట్లు వెండి, బంగారునగలు, వస్త్రములు ఇమ్మని ఐగుప్తు దేశీయులను అడిగిరి.

36. యావే ఐగుప్తుదేశీయులకు యిస్రాయేలీయుల పట్ల గౌరవము కలుగజేసెను. అందుచేవారు యిస్రాయేలీయులు అడిగినవానినెల్ల ఇచ్చివేసిరి. ఈ విధముగా యిస్రాయేలీయులు ఐగుప్తు ప్రజలను దోచుకొనిరి.

37. యిస్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతు నకు బయలుదేరిరి. వారందరు ఆరులక్షల కాల్బలముగా వెడలిరి. వారి స్త్రీలు, పిల్లలు ఈ లెక్కలో చేర లేదు.

38. పలుఅన్య తెగలవారు అసంఖ్యాకముగా వారిలో వచ్చిచేరిరి. లెక్కలకందని గొఱ్ఱెల మందలు, గొడ్లమందలు వారితో వెళ్ళెను.

39. యిస్రాయేలీయులు ఐగుప్తుదేశమునుండి తెచ్చిన పిండితో పొంగని రొట్టెలు కాల్చుకొనిరి. పిండి పులియకముందే వారు ఐగుప్తు దేశమునుండి నెట్టివేయబడిరి. దారిలో తినుటకు తిండి సిద్ధము చేసికొనువరకునైన వారు ఆ దేశమున నిలువ లేకపోయిరి.

40. యిస్రాయేలీయులు ఐగుప్తుదేశములో గడిపినకాలము నాలుగువందల ముప్పది యేండ్లు.

41. నాలుగువందలముప్పది ఏండ్లు ముగి సిననాడే యావే సైన్యము ఐగుప్తుదేశమును వదలెను.

42. ఐగుప్తుదేశమునుండి తమను తరలించునందు లకు యిస్రాయేలీయులు యావేకు ఆచరింపదగిన జాగరణ రాత్రియిది. యిస్రాయేలీయులు తరతరముల వరకు యావే పేరిట ఈ రాత్రి జాగరణము చేయుదురు.

43. యావే మోషే అహరోనులతో “దీనిని పాస్క నియమముగా భావింపుడు. పరదేశి ఎవ్వడును ఈ పాస్కభోజనము తినరాదు.

44. కాని మీరు సొమ్ముకు కొన్న బానిసకు సున్నతిచేయించిన తరువాత ఈ భోజనమును పెట్టవచ్చును.

45. అన్యజాతివాడుగాని, కూలివాడుగాని ఈ భోజనమును తినరాదు.

46. మీరు అందరును ఒక్క ఇంటినీడనే మాంసమును తినవలయును. ఒక్క మాంసపుముక్కయిన ఇంటినుండి బయటికి తీసికొనిపోరాదు. ఒక్క ఎముకనైన విరుగ గొట్టరాదు.

47. యిస్రాయేలీయుల సమాజమంతయు ఈ పండుగ చేసికొనవలయును.

48. మీవద్దనున్న పరదేశి యెవ్వడైనను యావే పేర పండుగ చేసికొనగోరినచో ముందు అతని కుటుంబమునందలి పురుషులందరు సున్నతి చేయించుకొనవలయును. అప్పుడు అతడు ఈ ఉత్సవములో పాల్గొనవచ్చును. అట్టివాడు మీ దేశమున పుట్టిన వానిక్రిందనే లెక్క. సున్నతి చేసికొననివాడు ఎవ్వడును ఈ పండుగలో పాల్గొనరాదు.

49. మీతో ఉన్న స్వదేశీయులకును, మీలో నివసించు విదేశీయులకును ఈ నియమమే వర్తించును” అనెను.

50. యిస్రాయేలీయులందరు యావే చెప్పినట్లే చేసిరి. ప్రభువు మోషే అహరోనులను ఆజ్ఞాపించినట్లే ఒనర్చిరి.

51. ఆనాడే యావే యిస్రాయేలు సైన్యములను ఐగుప్తుదేశమునుండి తరలించెను.

1-2. ప్రభువు మోషేతో “యిస్రాయేలీయులలో పుట్టిన తొలిచూలు సంతతినెల్ల నాకు అంకితము చేయుము. మానవసంతతియైననేమి, పశుసంతానమైననేమి మొదట పుట్టినది నాదే అగును” అనెను.

3. మోషే యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పెను! “మీరు దాస్యనిలయమైన ఐగుప్తుదేశమునుండి తరలి వచ్చిన ఈ దినమును గుర్తు పెట్టుకొనుడు. యావే తన బాహుబలముతో మిమ్ము ఇచటినుండి నడిపించుకొని వచ్చెను. మీరు పొంగినరొట్టెలు తినరాదు.

4. అబీబు' మాసములో ఈ రోజుననే మీరు ఐగుప్తుదేశమును వీడితిరిగదా!

5. మీ పితరులకు మాటయిచ్చినట్లుగా యావేదేవుడు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించు దేశమునకు, పాలుతేనెలుజాలువారు దేశమునకు మిమ్ము కొనివచ్చినపుడు ఈ నెలలోనే మీరు ఈ ఆచారమును పాటింపవలయును.

6. ఏడురోజుల పాటు మీరు పొంగనిరొట్టెలు తినవలయును. ఏడవ నాడు యావే పేరిట పండుగ జరుపుకొనవలయును.

7. ఈ ఏడు రోజులలో పొంగనిరొట్టెలనే తినవలయును. పిండిని పులియజేయు పదార్థముగాని, పొంగినరొట్టెలుగాని మీ దేశమునందు ఎక్కడ కనబడకూడదు.

8.  ఆ రోజున మీరు మీ కుమారులకు 'మేము ఐగుప్తుదేశమును వీడి వచ్చినపుడు యావే మాకు చేసిన మేలునకు స్మృతి చిహ్నమిది' అని చెప్పుడు.

9. ఈ ఆచారము మీ చేతిమీద గుర్తువలెను, మీ నొసటిపై బాసికమువలెను మీకు జ్ఞాపకార్ధముగా నుండును. ఈ విధముగా మీరు ఎల్లప్పుడును ప్రభు నిబంధనము గూర్చి చెప్పుకొనగలుగుదురు. యావే తన బాహుబలముతో మిమ్ము ఐగుప్తుదేశమునుండి తరలించుకొని వచ్చెనుగదా!

10. ప్రతి సంవత్సరము నియమితకాలమున మీరు ఈ విధిని పాటింప వలయును.

11. మీ తండ్రులకును, మీకును మాట ఇచ్చినట్లుగా యావే మిమ్ము కనానీయుల దేశమునకు కొని వచ్చి దానిని మీకు ఇచ్చినపుడు,

12. మీ తొలిచూలు మగబిడ్డలను ఆయనకు అంకితము చేయవలయును. మీ పశువుల తొలిచూలు పిల్లలలో మగవి యావేకు చెందును.

13. గాడిదకు పుట్టిన తొలిపిల్లకు బదులుగా గొఱ్ఱెపిల్లను దేవునికి అర్పింపవలెను. అటులకానిచో దాని మెడవిరిచి చంపివేయవలయును. మీ తొలి మగబిడ్డలను అందరిని, వెలయిచ్చి విడిపింపవలయును.

14. మీ కుమారుడు 'ఇది యేమి?' అని మిమ్ము అడిగినచో 'యావే తన బాహుబలముతో మమ్ము దాస్యనిలయమయిన ఐగుప్తుదేశమునుండి కొనివచ్చెను.

15. ఫరోరాజు మొండిపట్టుతో మమ్ము ఐగుప్తుదేశమును వదలి వెళ్ళనీయనపుడు, యావే ఆ దేశములో నరులకు, పశువులకు కలిగిన తొలిచూలు పిల్లలనెల్ల చంపివేసెను. ఈ కారణముచే పశువులకు కలిగిన తొలిచూలు పిల్లలను ప్రభువైన దేవునికి సమర్పింతుము. మా కుమారులలో తొలిబిడ్డలను మాత్రము వెలయిచ్చి విడిపింతుము' అని అతనితో చెప్పుడు.

16. మీ చేతిమీది గుర్తువలెను, మీ నొసటి యందలి జ్ఞాపకచిహ్నమువలెను, ఈ ఆచారము మీకు ప్రయోజనకారి అగును. యావే తన బాహుబలముతో మనలను ఐగుప్తుదేశమునుండి తరలించుకొని వచ్చెనుగదా!”

17. ఫరోరాజు యిస్రాయేలీయులు వెళ్ళిపోవుటకు అంగీకరించినపుడు, దగ్గరిత్రోవ అయినప్పటికి దేవుడు వారిని ఫిలిస్తీయుల దేశము మీదుగా పోవు దారిన పోనీయలేదు. ఫిలిస్తీయులతో యుద్ధము సంభవించినచో యిస్రాయేలీయులు గుండెచెదరి తిరిగి ఐగుప్తుదేశమునకే పోవుదురని దేవుడు తలంచెను.

18. ఈ కారణముచే ప్రభువు చుట్టుదారి అయినప్పటికి రెల్లుసముద్రమునకు పోవు ఎడారిబాటన వారిని నడిపించెను. యిస్రాయేలీయులు సర్వాయుధము లను ధరించియే ఐగుప్తుదేశమును వీడిరి.

19. అప్పుడు యిస్రాయేలీయులను ప్రమాణబద్దులుగా చేసిన యోసేపుని అస్థికలను మోషే తనవెంట తీసుకొని పోయెను. “దేవుడు తప్పక మీ కడకు వచ్చును. ఆ రోజున ఇక్కడినుండి నా అస్థికలను మీవెంటకొని పొండు” అని యోసేపు యిస్రాయేలీయులకు చెప్పియుండెను.

20. యిస్రాయేలీయులు సుక్కోతునుండి ఏతాము నకు వెళ్ళి, ఎడారి అంచున విడుదులు చేసిరి.

21. పగలు దారిచూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగు నిచ్చు అగ్నిస్తంభముగా ప్రభువు యిస్రాయేలీయుల ముందు నడచెను. ఆ విధముగా వారు పగలు రేయి ప్రయాణము చేసిరి.

22. పగలు మేఘస్తంభము గాని, రాత్రి అగ్నిస్తంభముగాని యిస్రాయేలీయుల ముందు కదలిపోవుట మానలేదు. ఏతామునుండి రెల్లు సముద్రమునకు

1-2. ప్రభువు మోషేతో “మీరు పోవు దారి నుండి వెనుదిరిగి మిలునకు సముద్రమునకు నడుమ, బాల్సెఫోనునకు ఎదురుగా, పీహహీరోతు ముందట, గుడారములు వేసికొనవలయునని యిస్రా యేలీయులతో చెప్పుము. సముద్రమువద్ద ఈ చోటికి ఎదురుగా మీరు విడిదిచేయవలయును.

3. ఫరో రాజు 'చూడుడు. యిస్రాయేలీయులు నా దేశములో చిక్కుబడి ఉన్నారు. ఎడారి వారిని కప్పివేసినది' అని అనుకొనును.

4. అప్పుడు నేను ఫరోరాజు హృదయమును కఠినము చేయుదును. అతడు వారిని వెంటాడును. ఫరోరాజును అతని సైన్యమును చిందరవందర చేసి నేను కీర్తి తెచ్చుకొందును. ఐగుప్తుదేశీయులు నేనే ప్రభుడనని గుర్తింతురు” అని చెప్పెను. యిస్రాయేలీయులు అటులనే చేసిరి.

5. ఐగుప్తు దేశ ప్రభువైన ఫరోకుయిస్రాయేలీయులు  తప్పించుకొనిపోయిరని తెలిసెను. అతడును, అతని కొలువువారును యిస్రాయేలీయుల విషయమున మనసు మార్చుకొనిరి. “బానిసతనమునుండి యిస్రాయేలీయులను ఏల తప్పించుకొని పోనిచ్చితిమి?” అనివారు అనుకొనిరి.

6. వెంటనే ఫరో రథమును సిద్ధముచేయించి, సైన్యమును వెంటతీసికొని బయలు దేరిపోయెను.

7. అతడు శ్రేష్ఠములైన తన ఆరువందల రథములనేగాక ఐగుప్తుదేశమందున్న ఇతర రథములను కూడ వెంట గొనిపోయెను. ప్రతి రథముమీద రౌతులుండిరి.

8. యావే ఐగుప్తుదేశ ప్రభువు ఫరోను కఠినాత్మునిగా చేసెను. అతడు ఎదిరించి వెడలిపోవు యిస్రాయేలీయులను వెన్నాడెను.

9. ఫరో అశ్వబలము, ఆశ్వికులు, రథబలము, కాల్బలము యిస్రాయేలీయులను తరుముచూ పీహహీరోతు సమీపమున బాల్సెఫోనునకు ఎదురుగా సముద్రము ఒడ్డున వారు విడిదిచేసియున్న ప్రదేశమునకు వచ్చెను.

10. ఐగుప్తు దేశీయులు ఫరో రాజుతో తమను వెన్నాడ వచ్చిరని యిస్రాయేలీయులు గుర్తించిరి. వారికి మిక్కిలి భయము కలుగగా యావేకు మొర పెట్టుకొనిరి.

11. యిస్రాయేలీయులు మోషేతో “ఐగుప్తుదేశములో మమ్ము పూడ్చి పెట్టుటకు చోటుకరవైనదా? ఈ ఎడారిలో చచ్చుటకు మమ్ము తరలించుకొని వచ్చితివిగదా? నీవు ఐగుప్తుదేశమునుండి మమ్ము తీసికొని వచ్చి ఒరుగ బెట్టినది ఏమున్నది?

12. మా జోలికిరావలదు. మేము ఐగుప్తుదేశీయులకు చాకిరి చేయుదుము అని ఆ దేశముననున్నప్పుడే చెప్పలేదా? ఇప్పుడు ఈ ఎడారిలో చచ్చుటకంటె ఐగుప్తుదేశీయులకు ఊడిగము చేయుట మేలుగదా?” అనిరి.

13. దానికి మోషే వారితో “భయపడకుడు. గట్టిగా నిలబడుడు. మిమ్ము రక్షించుటకు యావే ఏమిచేయునో మీరు ఈనాడే కన్నులార చూడగలరు. ఈనాడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తు దేశీయులను ఇక ముందెన్నడు చూడబోరు.

14. యావే మీ పక్షమున పోరాడును. మీరు కదలక మెదలక ఉండుడు” అనెను.

15. యావే మోషేతో “నీవు నాకు మొరపెట్టనేల? ముందుకు నడువుడని యిస్రాయేలీయులతో చెప్పుము.

16. నీ కఱ్ఱను ఎత్తి సముద్రమువైపు నీ చేతినిచాపి, దానిని పాయలుగా చేయుము. యిస్రాయేలీయులు  సముద్రము నడుమ పొడినేలమీద నడచిపోయెదరు.

17. ఇదిగో, నేను నేనే! ఐగుప్తుదేశీయులను కఠినాత్ములనుగా చేయుదును. అందుచే వారు యిస్రాయేలీయులను తరుముదురు. ఫరోరాజు వలనను, అతని రథ బలమువలనను, అశ్వబలమువలనను, కాల్బలము 'వలనను నాకు నేను మహిమ తెచ్చుకొందును.

18. ఫరోరాజువలనను, అతని రథములవలనను, అశ్వముల వలనను, సైన్యములవలనను నేను మహిమ తెచ్చుకొని నప్పుడే ఐగుప్తుదేశీయులు నన్ను ప్రభువుగా గుర్తింతురు” అని చెప్పెను.

19. అప్పుడు యిస్రాయేలీయుల బలగమునకు ముందు నడుచుచున్న యావేదూత వారి వెనుకకు వచ్చిచేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడ వెనుకకు వచ్చి నిలిచెను.

20. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు, యిస్రాయేలీయులకు నడుమ ఉండెను. మేఘమువలన చీకటి క్రమ్మెను. అది యిస్రాయేలీయులకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. యిస్రాయేలీయులు తలపడకుండగనే ఆ రాత్రియంతయు గడిచిపోయెను.

21. మోషే సముద్రముమీదికి చేతిని చాచెను. యావే రాత్రియంతయు బలమైన తూర్పుగాలి వీచి సముద్రము వెనుకకు చుట్టుకొనిపోయి సముద్రగర్భము ఆరిపోవునట్లు చేసెను.

22. జలములు విడిపోగా యిస్రాయేలీయులు పొడినేల మీదనే సముద్రగర్భమున ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడలవలె నిలిచిపోయినది.

23. ఐగుప్తుదేశీయులు యిస్రాయేలీయులను తరిమిరి. ఫరోరాజు రథబలము, రౌతులు, గుఱ్ఱములు, యిస్రాయేలీయులను వెన్నంటి సముద్రగర్భమున ప్రవేశించెను.

24. యావే వేకువ జామున ఆ అగ్నిమేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తుదేశపు సైన్యమువైపు పారజూచెను. ఆ బలగమును గగ్గోలుపడునట్లు చేసెను.

25. ఆయన చక్రములను ఊడిపడునట్లు చేయగా వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. “యిస్రాయేలీయులను వదలి పారిపోవుదమురండు. యావేవారికి తోడుగా నిలచి మనతో పోరాడుచున్నాడు” అని ఐగుప్తుదేశీయులు అనుకొనిరి.

26. అప్పుడే యావే మోషేతో “సముద్రము మీదికి నీ చేతిని చాపుము. సముద్రము ఐగుప్తుదేశీయుల రథబలముమీద, రౌతులమీద తిరిగిపారును” అని చెప్పెను.

27. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. ప్రొద్దు పొడుచునప్పటికి సముద్రజలములు యథాస్థలమునకు మరలివచ్చెను. దానిని చూచి ఐగుప్తుదేశీయులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడద్రోసెను.

28. యిస్రాయేలీయులను వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఫరో సర్వసైన్యమునందలి రథములను, రౌతులను తిరిగివచ్చిన జలములు నిలువున ముంచి వేసెను. ఫరో సైన్యములో ఒక్క పురుగుకూడ బ్రతుక లేదు.

29. కాని యిస్రాయేలీయులు మాత్రము సముద్రములో పొడినేలమీద ముందుకు సాగిపోయిరి. వారికి కుడివైపున ఎడమవైపున నీరు గోడలవలె నిలిచినది.

30. ఆనాడు యావే ఐగుప్తుదేశీయుల బారినపడకుండ యిస్రాయేలీయులను కాపాడెను. యిస్రాయేలీయులు సముద్రతీరముమీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి.

31. ఐగుప్తుదేశీయులకు వ్యతిరేకముగా యావే ఒనర్చిన ఆ మహాకార్యమును యిస్రాయేలీయులు కన్నులార చూచిరి. వారు యావేకు భయపడిరి. యావేను ఆయన దాసుడగు మోషేను నమ్మిరి.

1. అప్పుడు మోషే, యిస్రాయేలీయులు యావే పేరిట ఈ గీతము పాడిరి: “యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభువు మహా విజయమును సాధించెను. ఆయన గుఱ్ఱమును రౌతును సముద్రమున కూలద్రోసెను.

2. యావే నా బలము, నా కీర్తనము. ఆయనయే నా రక్షకుడు, యావే నా దేవుడు, ఆయనను స్తుతింతును. యావే నా పితరులదేవుడు, ఆయనను శ్లాఘింతును.

3. యావే యుద్దశూరుడు, ఆయన పేరు ప్రభువు.

4. ఫరోరాజు సైన్యమును రథబలమును ఆయన సముద్రమున కూలద్రోసెను. ఫరోరౌతులలో మొనగాండ్రందరు రెల్లు సముద్రములో మునిగిపోయిరి.

5. అగాధజలములు వారిని కప్పివేసెను. వారు రాయివలె నీటమునిగిరి,

6. యావే! నీ దక్షిణహస్తము బలవైభవముతో అలరారును. యావే! నీ దక్షిణహస్తము శత్రువులను తుత్తునియలు చేయును.

7. ప్రభూ! నీ మహిమాతిశయమువలన నీ శత్రువులను అణగదొక్కుదువు. నీ క్రోధాగ్ని రగుల్కొని నీ శత్రువులను చెత్తవలె దహించును.

8. నీ ముక్కురంధ్రముల ఊపిరికి నీళ్ళు ఉవ్వెత్తుగా లేచి రాశిగా ఏర్పడినవి. జలములు నిలువు గోడలవలె నిలిచినవి. సముద్రగర్భమున అగాధజలములు పేరుకొనిపోయినవి.

9. 'నేను తరిమితరిమి వారిని పట్టుకొందును. కొల్లసొమ్ము పంచుకొందును. తనివిదీర వారి సొత్తును అనుభవింతును. కత్తి దూసి వారిని తునుమాడెదను' అని శత్రువు తలచెను.

10. కాని నీవొక్కసారి ఊపిరి వదలితివోలేదో, సముద్రము శత్రువులను కప్పివేసెను. భయంకర జలములలో శత్రువులు సీసమువలె మునిగిపోయిరి.

11. యావే! దైవములలో నిన్ను పోలినవాడెవడు? నీవలె పరిశుద్దుడై తేజరిల్లువాడెవడు? నీవలె మహాకార్యములు చేయువాడెవడు? అద్భుత క్రియలుచేసి భయంకరుడై వెలయువాడెవడు?

12. నీవు నీ దక్షిణ హస్తమును చాచితివి. భూమి వారిని మ్రింగినది.

13. నీవు విముక్తిచేసిన ప్రజను కృపతో తోడ్కొనిపోయితివి. బలముచేత ఆ ప్రజలను నీ పవిత్ర ఆలయమునకు నడిపించితివి.

14. నీ చరితము విని సకలజాతి జనులు వణకిపోవుదురు. ఫిలిస్తీయులు వేధనపాలగుదురు.

15. ఎదోము నాయకులు కలవరమొందుదురు. మోవాబు మొనగాండ్రు గజగజలాడుదురు. కనాను దేశీయులు కలవరపడుదురు.

16. యావే! నీ ప్రజలు, నీవు చేరదీసిన ప్రజలు, ముందుకు సాగిపోవునపుడు నీ శత్రువులను భయకంపములు ముంచిఎత్తును. నీ బాహుబలమువలన వారు రాయివలె కదలకుందురు.

17. యావే! నీ చిరకాల నిలయమైన కొండమీద, నీవు నివాసముగా చేసికొన్న నెలవున, స్వయముగా నీ పవిత్ర ఆలయమును నిర్మించినచోట, నీ ప్రజను తోడ్కొనివచ్చి పాదుకొల్పెదవు.

18. నాటికి, నేటికి, ఏనాటికి యావే ఒక్కడే యేలిక.”

19. ఫరోరాజు రథములును, రథాశ్వములును, రౌతులును సముద్రమున ప్రవేశించినపుడు యావే వారి మీదకి నీటిని మరల్చెను. కాని యిస్రాయేలీయులు సరాసరి సముద్రములో పొడినేలమీద నడచి ముందుకుపోయిరి.

20. అప్పుడు అహరోను సోదరి ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేపట్టినది. స్త్రీలెల్లరు తంబురలు ధరించి నాట్యముచేయుచు ఆమెను అనుసరించిరి.

21. ఆమె ఈ విధముగా పల్లవినందుకొని పాడినది: “యావేను కీర్తింపుడు, ఆయనకు మహావిజయము సిద్ధించినది, యావే గుఱ్ఱమును, రౌతును సముద్రమున కూలద్రోసెను.”

22. మోషే రెల్లుసముద్రము వద్దనున్న విడిది నుండి యిస్రాయేలీయులను ముందుకు నడిపించెను. వారు షూరు అరణ్యమునకు వెళ్ళిరి. ఆ అడవిలో యిస్రాయేలీయులకు మూడు రోజులపాటు త్రాగుటకు నీరు దొరకలేదు. వారు మారాకు చేరిరి.

23. అక్కడి నీరు చేదుగా ఉండుటచే దానిని త్రాగలేకపోయిరి. ఆ నీటివలననే ఆ చోటికి మారా' అను పేరు వచ్చినది.

24. యిస్రాయేలీయులు మోషేను చూచి గొణిగిరి, “మేమేమి త్రాగవలయును?” అని అతనిని అడిగిరి.

25. మోషే యావేకు మొర పెట్టుకొనెను. యావే అతనికి ఒక చెట్టును చూపెను. మోషే దానిని నీటిలో వేయగా నీళ్ళు తియ్యనివయ్యెను. యావే ఆ చోటనే వారికి కట్టడలు చేసెను. జీవితవిధులు నిర్ణయించెను.  అక్కడనే వారిని పరీక్షించెను.

26. అప్పుడు యావే “మీ దేవుడయిన యావే ప్రవచనములను శ్రద్ధగా విని, ఆయన దృష్టికి ధర్మముగానున్న దానినే ఆచరించినయెడల, ఆయన ఆజ్ఞలను శిరసావహించి ఆయన చేసిన కట్టడలను తప్పకుండ నడుచుకొన్నయెడల, నేను ఐగుప్తుదేశీయులనువలె మిమ్ము ఏ అరిష్టము పాలుచేయను. మీకు ఉపశమనము కలిగించు యావేను నేనే” అని చెప్పెను.

27. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. ఆ ప్రదేశమున పండ్రెండు నీటి బుగ్గలు కలవు. డెబ్బది ఖర్జూర వృక్షములు ఉన్నవి. అక్కడ నీటి అంచుననే వారు దిగిరి.

1. ఏలీము నుండి యిస్రాయేలు సమాజము ముందుకు సాగిపోయినది. వారు ఐగుప్తుదేశమును వదలిన రెండవ నెలలో పదునైదవనాడు ఏలీమునకు సీనాయికి నడుమనున్న సీను అరణ్యమునకు చేరుకొనిరి.

2. ఆ అడవిలో యిస్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలిడెను.

3. యిస్రాయేలీయులు వారితో “మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుగానుండెడిది. అచ్చట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపార భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్ల ఆకలిచే మలమల మాడ్చి చంపుటకు గాబోలు మీరిద్దరు మమ్ము అక్కడినుండి తోడ్కొ నివచ్చితిరి” అనిరి.

4. అప్పుడు యావే మోషేతో “ఇదిగో! నేను ఆకాశమునుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి బత్తెమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలిసికొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును.

5. ఆరవనాడు వారు రోజువారి బత్తెముకంటె రెండంతలు అధికముగా తెచ్చుకొని భోజనము సిద్ధము చేసికొనవలయును” అనెను.

6. మోషే అహరోనులు యిస్రాయేలీయులతో “ఐగుప్తు దేశమునుండి మిమ్ము తోడ్కొనివచ్చినది యావే అని సాయంకాలమున మీరు తెలిసికొందురు.

7. ఉదయము యావే మహిమను చూతురు. మీరు యావే నెత్తీపై మోపిన నేరములన్నియు ఆయన విన్నాడు. మీరు మామీద గొణుగుటకు మేమెంతవారము?” అనిరి.

8. మోషే వారితో “మీరు కడుపార తినుటకు సాయంకాలము మాంసమును, ఉదయము రొట్టెను యావే మీకిచ్చును. మీరు ఆయనమీద మోపిన నేరములన్నియు ఆయనకు వినిపించినవి. మీరు మామీదకాక ఆయన మీదనే గొణుగుచున్నారు. మేము ఏపాటివారము?” అనెను.

9. మోషే అహరోనుతో “మీరు యావే సన్నిధికి రండు. మీరు మోపుచున్న నేరములు ఆయన వినెను అని యిస్రాయేలు సమాజమునంతటికిని చెప్పుము” అనెను.

10. అహరోను యిస్రాయేలు సమాజముతో మోషే చెప్పుమన్నమాటలు చెప్పుచుండగా వారందరు ఎడారివైపు తిరిగిచూచిరి. వారికి యావే తేజస్సు మేఘమునందు కనబడెను.

11. అప్పుడు యావే మోషేతో మాట్లాడుచు “నేను యిస్రాయేలీయుల సణుగుడు వింటిని.

12. నీవు వారితో 'మీరు ప్రొద్దు గ్రుంకనున్నపుడు మాంసమును, వేకువనే రొట్టెను కడుపార తిందురు. అప్పుడుగాని యావేనైన నేనే మీ దేవుడనని మీకు తెలియదు' అని చెప్పుము” అనెను.

13. సాయంకాలము పూరేడుపిట్టలు వచ్చి వారి విడుదులను కప్పివేసెను. ప్రొద్దుటిపూట విడుదుల చుట్టు మంచుకమ్మియుండెను.

14. పొగమంచంతయు పోయిన తరువాత ఎడారి నేలమీద నూగు మంచువంటి సన్నని పొడి కనబడెను.

15. దానిని చూచి అది ఏమియో తెలియక యిస్రాయేలీయులు “ఇదియేమి?" అని ఒకరినొకరు అడుగుకొనిరి.

16. మోషే వారితో “మీరు తినుటకై దేవుడు ఇచ్చిన ఆహారము ఇదియే! ప్రతివ్యక్తి తన కుటుంబము వారికొరకై తలకొక మానెడు చొప్పున తన అక్కరను బట్టి దానిని సమకూర్చుకొనవలయునని యావే ఆజ్ఞాపించెను” అనెను.

17. యిస్రాయేలీయులు మోషే చెప్పినట్లే చేసిరి. వారిలో కొందరు ఎక్కువగా, మరికొందరు తక్కువగా ప్రోగుచేసికొనిరి.

18. తాము ప్రోగుచేసికొన్న దానిని వారు మానికతో కొలిచినపుడు ఎక్కువగా సమకూర్చు కొనినవానికి ఎక్కువగా మిగిలినది లేదు. తక్కువగా ప్రోగుచేసికొనిన వారికి తగ్గినది లేదు. ఎవనికి ఎంత కావలయునో అంతమాత్రమునే ప్రోగుచేసికొన్నట్లు వారికి తెలిసినది.

19. మోషే వారితో “దీనిలో ఏ కొంచెముగూడ రేపటికై ఎవ్వడును మిగుల్చుకొనరాదు” అనెను.

20. కాని వారిలో కొందరు మోషే మాటవినరైరి. వినకుండ మరునాటికి కొంత అట్టిపెట్టుకొనిరి. అది పురుగుపట్టి కంపుకొట్టెను. మోషే వారి మీద కోపపడెను.

21. ప్రతిదినము ప్రొద్దుటిపూట వారు తమకు కావలసినంత ప్రోగుచేసికొనిరి. ప్రొద్దు వేడియెక్కుసరికి మిగిలినది కరగిపోయెడిది.

22. ఆరవనాడు తలకు రెండుమానికల చొప్పున రెట్టింపు తిండి సమకూర్చుకొనిరి. సమాజములోని నాయకులందరు వచ్చి ఆ మాట మోషేతో చెప్పిరి.

23. అతడు వారితో “ఇది యావే ఆజ్ఞ. రేపు విశ్రాంతి దినము. అది యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనగోరిన దానిని కాల్చుకొనుడు. వండుకొనగోరిన దానిని వండుకొనుడు. మిగిలిన దానిని రేపటికి అట్టిపెట్టుకొనుడు” అని చెప్పెను.

24. మోషే ఆజ్ఞాపించినట్లుగా వారు మిగిలినదానిని మరునాటికి అట్టిపెట్టుకొనిరి. అది కంపు కొట్టలేదు, పురుగుపట్టలేదు.

25. మోషే వారితో “ఈ దినము దానిని తినుడు. ఇది యావేకు సమర్పితమయిన విశ్రాంతిదినము. ఈనాడు బయట మీకు ఏమియు దొరకదు.

26. ఆరురోజులపాటు మీరు ఆహారము ప్రోగుచేసికొనవలయును. విశ్రాంతి దినమైన ఏడవ నాడు మాత్రము మీకు ఏమియు దొరకదు” అని చెప్పెను.

27. ఏడవనాడు కూడ యిస్రాయేలీయులలో కొందరు ఆహారము ప్రోగుచేసికొనుటకు విడుదుల నుండి వెళ్ళిరి. కాని వారికి ఏమియు కనబడదాయెను.

28. అప్పుడు యావే మోషేతో “మీరింకను ఎంత కాలమువరకు నా ఆజ్ఞలను, ధర్మములను పాటింప కుందురు?

29. వినుడు. యావే ఏడవదినమును విశ్రాంతిదినముగా నిర్ణయించెను. ఆనాటికిగూడ సరిపోవుటకు ఆరవరోజుననే ఆయన రెండింతల తిండి సమకూర్చును. ఏడవనాడు ఎవ్వడు ఎక్కడ ఉన్నాడో అక్కడనే ఉండవలయును. ఎవ్వడును తన విడిదిదాటి పోరాదు” అని చెప్పెను.

30. కావున యిస్రాయేలీ యులు ఏడవనాడు అన్ని పనులు మానుకొని విశ్రాంతి తీసికొనిరి.

31. యిస్రాయేలీయులు దానికి 'మన్నా'' అని పేరు పెట్టిరి. అది తెల్లగా కొత్తిమీరగింజవలె ఉండెను, దానిరుచి తేనెతో చేసిన గుళికల భక్ష్యమువలె నుండెను.

32. మోషే యిస్రాయేలీయులతో “ఇది యావే ఆజ్ఞ. మన్నాతో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడు. నేను మిమ్ము ఐగుప్తుదేశమునుండి తోడ్కొనివచ్చినపుడు ఎడారిలో మీకెట్టి తిండి పెట్టితినో మీ వంశీయులు తెలిసికొనుటకై దానిని భద్రపరుపుడు” అని చెప్పెను.

33. మోషే అహరోనుతో “నీవు ఒక పాత్రను తీసికొని దానిని ఒక ఓమెరు మన్నాతోనింపి యావే సన్నిధిని పెట్టుము. దానిని మీ వంశీయులు చూతురు” అనెను.

34. యావే మోషేను ఆజ్ఞాపించినట్లుగనే అహరోను పాత్రలో ఒక ఓమెరు మన్నానుపోసి దానిని నిబంధన మందసము ఎదుటనుంచెను. అది అచట శాశ్వత ముగా ఉండిపోయెను.

35. యిస్రాయేలీయులు తాము నివసింపబోవు దేశము చేరుకొనువరకును, నలువదియేండ్లపాటు మన్నాను భుజించిరి. వారు కనాను దేశము పొలిమేర చేరువరకు దానినే తినిరి.

36. 'ఓమేరు' అనగా ‘ఏపా'లో దశమభాగము.

1. యిస్రాయేలీయులెల్ల యావే ఆజ్ఞ ప్రకారముగా సీను, అరణ్యమునగల విడుదులు ఎత్తివేసి ముందుకుసాగిపోయిరి. వారు రెఫీదీమువద్ద దిగిరి. అక్కడ వారికి త్రాగుటకు నీళ్ళు దొరకలేదు.

2. వారు మోషేతో జగడమాడిరి. “త్రాగుటకు నీరు చూపుము” అని అతనితో అనిరి. మోషే వారితో “మీరు నాతో జగడమాడనేల? యావేను పరీక్షింపనేల?” అనెను.

3. దప్పికచే అల్లాడిపోవుచు ఆ ప్రజలు మోషే మీద నేరము మోపిరి. వారు అతనితో “ఐగుప్తుదేశమునుండి మమ్మేల తోడ్కొని వచ్చితివి? మమ్ములను చంపుటకా? ఇక్కడ మేమును, మా పిల్లలును, పశువులు, దప్పికచే చచ్చిపోవలయునా! ఏమి?” అనిరి.

4. మోషే యావేకు మొరపెట్టుకొనెను. అతడు "నేను ఈ ప్రజలతో ఎట్లు వేగుదును? ఇంక కొంత సేపున్నచో వారు నన్ను రాళ్ళతో కొట్టుదురు” అనెను.

5. అంతట యావే మోషేతో “నీతోపాటు యిస్రాయేలు పెద్దలను కొంత మందిని తీసికొని ఈ ప్రజకు ముందుగా నడచి పొమ్ము, నీవు నదిని కొట్టిన కఱ్ఱను చేతపట్టి వెళ్ళుము.

6. నీవు చూచుచుండగనే నేను హోరేబుకొండల రాతి మీద నిలబడెదను. నీవు కఱ్ఱతో ఆ రాతిని కొట్టుము. వీరందరు త్రాగుటకు రాతినుండి మీరు పుట్టును" అనెను. యిస్రాయేలీయుల పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేసెను.

7. యిస్రాయేలీయులు జగడమాడుటచేతను, వారు యావే మనతో పాటు ఉన్నాడా? లేదా? అని సందేహించుచు యావేను పరీక్షించుటచేతను, ఆ చోటికి 'మస్సా " అని 'మెరీబా' అని పేర్లు వచ్చెను.”

8. రెఫీదీముదగర అమాలేకీయులు యిస్రాయేలీయులతో యుద్ధముచేసిరి.

9. అంతట మోషే యెహోషువతో, “నీవు తగినవీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమాలేకీయులతో యుద్ధము చేయ వెళ్ళుము. నేను దైవదండము చేతపట్టి కొండకొమ్మున నిలిచెదను” అని చెప్పెను.

10. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలెకీయులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోషే, అహరోను, హూరు కొండమీదికి వెళ్ళిరి.

11. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో యిస్రాయేలీయులదే పైచేయిగానుండెను. మోషే చేతులు దింపినపుడు అమాలెకీయులు గెలిచిరి.

12. మోషే చేతులు బరువెక్కెను. అంతట అహరోను, పూరు ఒకరాతిని తెచ్చివేసితిరి, మోషే దానిమీద కూర్చుండెను. అహరోను, హూరు చెరియొకవైపు నిలబడి మోషే చేతులను ఎత్తిపట్టుకొనిరి. ప్రొద్దుగూకు వరకు అవియట్లే నిలచేను.

13. యెహోషువ అమాలెకు బలగమును తన కత్తి పదునుకు బలిచేసెను.

14. అపుడు యావే “ఈ యుద్ధము చిరస్మరణీయముగా ఉండుటకై గ్రంథమున వ్రాసియుంచుము. నేను అమాలెకు అడ పొడ కానరాకుండ చేయుదునని యెహోషువతో చెప్పుము” అనెను.

15. అంతట మోషే ఒక బలిపీఠమును నిర్మించి దానికి "యావే నా ధ్వజము” అను పేరు పెట్టెను.

16. అతడు “యావే ధ్వజమును చేతబట్టుడు. యుగయుగములవరకు యావే అమాలెకుతో యుద్ధముచేయును” అనెను.

1. దేవుడు మోషేకును, యిస్రాయేలీయులకును మేలు చేసెననియు, వారిని ఐగుప్తుదేశమునుండి కొనివచ్చెననియు మిద్యాను యాజకుడును మోషే మామయునగు యిత్రోకు తెలిసెను.

2. కనుక అతడు మోషే భార్య సిప్పోరాను ఆమె కుమారులిద్దరిని అతని కడకు తోడ్కొని వచ్చెను. అంతకు ముందు మోషే సిప్పోరాను పంపివేసియుండెను.

3. మోషే ఆ కుమారులలో ఒకనికి “నేను పరదేశములో అపరిచితునివలె యుంటిని” అనుకొని గెర్షోము' అను పేరు పెట్టెను.

4. రెండవ వానికి “నా తండ్రి దేవుడే నాకు ఆదరువు. ఆయనయే ఫరోరాజు కత్తికి ఎరకాకుండ నన్ను కాపాడెను” అనుకొని ఎలియెజెరు' అని పేరు పెట్టెను.

5. మోషే మామ యిత్రో అతని భార్యను బిడ్డలను వెంటబెట్టుకొని ఎడారిలో దేవునికొండ దగ్గర దిగిన మోషే కడకు వచ్చెను.

6. “నీ భార్యతో ఇద్దరు బిడ్డలతో మీ మామ యిత్రో నిన్ను చూడవచ్చెను” అన్నమాట మోషే చెవిని పడెను.

7. మోషే తన మామను కలిసికొనుటకు ఎదురువెళ్ళెను. మామ ఎదుట వంగి దండము పెట్టి అతనిని ముద్దాడెను. ఒకరి యోగక్షేమమును ఒకరు తెలిసికొనిన తరువాత వారు గుడారమునకు వచ్చిరి.

8. అప్పుడు మోషే తన మామతో యిస్రాయేలీయులను రక్షించుటకై యావే ఫరోను ఐగుప్తు దేశీయులను ఎట్లు కష్టములపాలు చేసెనో, త్రోవలో వారెట్లు కడగండ్లుపడిరో, యావే వారినెట్లు రక్షించెనో పూసగ్రుచ్చినట్లు చెప్పెను.

9. యిస్రాయేలీయులను ఐగుప్తీయుల నుండి విడిపించి, వారికి యావే చేసిన మేలంతయు విని యిత్రో హర్షించెను.

10. “ఐగుప్తు దేశీయులనుండి ఫరోరాజు నుండి నిన్ను రక్షించిన దేవుడు, ఐగుప్తు దేశీయులనుండి యిస్రాయేలీయులను రక్షించిన దేవుడు స్తుతింపబడునుగాక!

11. యిస్రాయేలీయులను అహంకారముతో హింసించియున్న ఐగుప్తుదేశీయులను అణచివేసిన యావే దేవాదిదేవుడని నేడు తెలిసికొంటిని” అని అతడనెను.

12. మోషే మామ యిత్రో దేవునికి దహనబలిని, బలులను సమర్పించెను. దేవుని సమ్ముఖమున మోషే మామతోపాటు విందులో పాల్గొనుటకై అహరోను యిస్రాయేలు పెద్దలందరితో వచ్చెను.

13. మరునాడు మోషే యిస్రాయేలీయులకు తీర్పులు తీర్చుటకు కొలువుతీరెను. ఉదయమునుండి సాయంకాలమువరకు వారు అతని చుట్టు నిలబడిరి.

14. మోషే యిస్రాయేలీయులకొరకు పడిన పాటులెల్ల చూచి అతని మామ యిత్రో “ఈ ప్రజల కొరకు నీవు ఈ బరువెల్ల నెత్తికెత్తుకొననేల? ఉదయమునుండి సాయంకాలమువరకు వీరందరు చుట్టు నిలిచియుండ నీవొక్కడవే ఇక్కడ కూర్చుండనేల?” అనెను.

15. దానికి మోషే మామతో “ఏల అందువా? దేవునిచిత్తము తెలిసికొనుటకై ఈ జనులు నా వద్దకు వత్తురు.

16. వారి నడుమ తగవులు వచ్చినపుడు వారు నా కడకు వత్తురు. నేనేమో ఇద్దరినడుమ పుట్టిన తగవులు తీర్తును. దేవుడు నిర్ణయించిన విధులను ఆజ్ఞలను వారికి తెలియజేయుదును” అని చెప్పెను.

17. మోషే మామ అతనితో “నాయనా! ఈ పని అంతయు నీమీద వేసికొనుట మంచిదికాదు.

18. ఇట్లయినచో నీవు తట్టుకొనలేక నలిగిపోదువు. నీతోపాటు ఈ ప్రజలును నలిగిపోదురు. ఈ పని నీ తలకు మించినట్టిది. దీనిని నీవొక్కడవే చేయజాలవు.

19. నా ఉపదేశమును పాటింపుము. దేవుడు నీకు తోడుగా ఉండును. నీవు దేవునియెదుట ఈ ప్రజలకు ప్రతినిధిగా ఉండుము. వారి తగవులను గూర్చి ఆయనతో చెప్పుము.

20. దేవుడు నిర్ణయించిన విధులను, ఆజలను వారికి బోధింపుము. వారు నడువదగిన త్రోవను వారికి చూపుము. చేయదగిన పనులను వారికి తెలుపుము.

21. ఈ ప్రజలందరలో సమర్థులను, దైవభీతిగల వారిని, విశ్వాసపాత్రులను, లంచగొండులు కానివారిని ఏరి వారికి నాయకులనుగా చేయుము. వేయిమందికి, వందమందికి, ఏబదిమందికి, పదిమందికి ఒక్కొక్కని చొప్పున నాయకులను నిర్ణయింపుము.

22. ఎల్లవేళల ఆ నాయకులే తీర్పులు చేయుచు ఈ ప్రజలకు తోడ్పడు దురు. వారు పెద్ద పెద్ద తగవులను నీకడకు కొనివత్తురు. చిన్నచిన్న తగవులకు వారియంతటవారే తీర్పులు చెప్పుదురు. దీనివలన నీ పని తేలిక అగును. నీ బరువును వారుకూడ మోసినవారగుదురు.

23. ఇట్లు చేసిన నీవును శ్రమకు తట్టుకొందువు. ప్రజలును తృప్తి పడుచు ఇండ్లకు వెళ్ళుదురు. దేవుడును ఈ పద్ధతినే నిర్ణయించునుగాక!” అనెను.

24. మోషే మామ మాటలువిని అతడు చెప్పినట్లే చేసెను.

25. యిస్రాయేలీయులనుండి సమర్థులను ఏరి వారికి నాయకులునుగా చేసెను. వేయిమందికి, వందమందికి, ఏబదిమందికి, పదిమందికి ఒక్కొక్కని చొప్పున న్యాయాధిపతులను ఏర్పరచి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నిర్ణయించెను.

26. ఎల్లవేళల ఆ నాయకులు తీర్పులుచెప్పుచు ప్రజలకు సాయపడుచుండిరి. వారు పెద్ద పెద్ద తగవులను మోషే కడకు కొనితెచ్చుచుండిరి. చిన్నచిన్నతగవులను వారియంతట వారే తీర్చుచుండిరి.

27. అప్పుడు మోషే తన మామ వెళ్ళిపోవుటకు ఒప్పుకొనెను. అతడు తిరిగి స్వదేశమునకు వెళ్ళిపోయెను.

1. ఐగుప్తుదేశమునుండి బయలుదేరిన మూడునెలలకు, మూడవ నెల మొదటిదినమందే యిస్రాయేలీయులు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.

2. వారు రెఫీదీమునుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరుకొనినపిదప అచ్చటనే కొండకు ఎదురుగా విడిదిచేసిరి.

3. మోషే కొండనెక్కి దేవునికడకు వెళ్ళెను. దేవుడు కొండనుండి అతనిని పిలిచి “నా ఈ మాటలను యాకోబు సంతతియగు యిస్రాయేలీయులకు వెల్ల డింపుము.

4. 'నేను ఐగుప్తుదేశీయులను ఏమిచేసితినో మీరు కనులార చూచితిరి. గరుడపక్షి తన పిల్లలను రెక్కలమీద మోసికొనిపోవునట్లే నేనును మిమ్ము మోసికొనివచ్చి నా కడకు చేర్చుకొంటినని మీకు బాగుగ తెలియును.

5. దీనిని బట్టి మీరొకటి గమనింపుడు. మీరు నామాటవిని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకలజాతుల వారిలో మీరే నావారు, నా సొంత ప్రజలు అగుదురు. ఈ భూమండలమెల్ల నాదేకదా?!

6. మీరే నాకు యాజక రూప రాజ్య ము. మీరే నా పవిత్ర ప్రజ' యిస్రాయేలీయులతో నీవు చెప్పవలసిన మాటలు ఇవియే” అనెను.

7. కనుక మోషే వెళ్ళి యిస్రాయేలు పెద్దలందరిని పిలిపించెను. యావే చెప్పుమన్నమాటలెల్ల వారితో చెప్పెను.

8. అప్పుడు యిస్రాయేలీయులందరును ఒక్కగొంతుతో “యావే చెప్పినదంతయు మేము చేయుదుము” అనిరి. మోషే తిరిగి వెళ్ళి యిస్రాయేలీ యుల మాటలను యావేకు విన్నవించెను.

9. యావే మోషేతో “నేను కారుమబ్బులో వత్తును. అట్లయినచో నేను నీతో మాట్లాడుట యిస్రాయేలీయులు జాతిని తన ప్రజగా ఎన్నుకోవచ్చుననుట. అందరు విని ఎల్లప్పుడు నిన్ను నమ్ముదురు” అనెను. మోషే ప్రజల మాటలను యావేకు తెలిపెను.

10. యావే మోషేతో “నీవు యిస్రాయేలీయుల కడకు వెళ్ళి నేడు, రేపు వారిని శుద్ధపరచుము. వారు వారి దుస్తులను ఉతుకుకొనవలయును. 

11. మూడవ నాటికి అందరు సిద్ధముగా ఉండవలయును. మూడవ నాడు ఎల్లరు చూచుచుండగ యావే సీనాయి కొండ మీదికి దిగివచ్చును.

12. నీవు కొండకు హద్దులు ఏర్పరచి వారితో 'జాగ్రత్త! ఎవ్వరును కొండ ఎక్కరాదు. కొండ మొదలు తాకరాదు. ఎవ్వడైనను కొండను ముట్టుకొన్నచో, వానికి చావుమూడును.

13. ఎవ్వడును కొండను చేతితో తాకరాదు. తాకినది మనుష్యుడు కావచ్చు, జంతువుకావచ్చు. ఎవ్వరైనను రాళ్ళతోగాని, బాణములతోగాని కొట్టబడుదురు. తాకిన వారెవ్వరు బ్రతుకరు' అని చెప్పుము. కొమ్ముబూర సుదీర్ఘంగా మ్రోగినప్పుడే వారందరు కొండచెంతకు రావలయును” అనెను.

14. మోషే కొండదిగి ప్రజలకడకు వచ్చెను. అతడు వారిని శుద్ధిచేసెను. వారు దుస్తులు ఉతుకు కొనిరి.

15. అప్పుడు మోషే వారితో “మూడవ నాటికి సిద్ధముగా నుండుడు. స్త్రీని సమీపింపకుడు” అని హెచ్చరించెను.

16. మూడవనాడు ప్రొద్దుపొడువగనే కొండమీద ఉరుములు ఉరిమెను. మెరుపులు మెరిసెను. కారు మబ్బులు క్రమ్మెను. పెద్దనాదముతో కొమ్ముబూర మ్రోగెను. విడుదులలో యిస్రాయేలీయులందరును వణకిపోయిరి.

17. అప్పుడు మోషే దేవుని కలిసి కొనుటకు యిస్రాయేలీయులను విడుదుల నుండి కొనిపోయెను. వారందరు కొండ అంచున నిలబడిరి.

18. యావే అగ్నిరూపమున సీనాయి కొండమీదికి దిగివచ్చుటచే దానిని పొగ చుట్టుముట్టెను. కొలిమి పొగవలె కొండనుండి పొగ పైకిలేచెను. కొండ అంత దద్దరిల్లెను.

19. కొమ్ముబూరఘోత ఉన్న కొలది పెద్దదయ్యెను. మోషే మాట్లాడెను. దేవుడతనికి ఉరుములతో జవాబు చెప్పెను.

20. యావే పర్వతశిఖరము మీదికి దిగివచ్చెను. ఆయన మోషేను కొండకొమ్మునకు రమ్మనెను. మోషే కొండమీదికి ఎక్కిపోయెను.

21. యావే మోషేతో “వెళ్ళి ప్రభువును చూచుటకు ఎవ్వరును హద్దులు దాటి ముందునకు రాగూడదని యిస్రాయేలీయులను హెచ్చరింపుము. వచ్చినచో ఎంతోమంది చచ్చిపోదురు.

22. యావే కడకువచ్చు యాజకులు సైతము శుద్ధి చేసికొనవలయును. అటులకానిచో యావే వారిమీద విరుచుకొనిపడును” అనెను.

23. దానికి మోషే “యిస్రాయేలీయులలో ఎవ్వరును కొండ ఎక్కిరారు. కొండకు హద్దులు ఏర్పరచి పవిత్రమైన దానినిగా చాటింపుము అని నీవు ముందుగానే హెచ్చరించితివి గదా!” అనెను.

24. యావే మోషేతో “కొండ దిగిపొమ్ము. పోయి అహరోనును నీతో పాటు కొనిరమ్ము. ప్రభువును చూచుటకై యాజకులనుగాని, యిస్రాయేలీయులనుగాని హద్దుదాటి రానీయకుము. వచ్చినచో యావే వారిమీద విరుచుకొనిపడును” అనెను.

25. మోషే కొండదిగి వెళ్ళి యిస్రాయేలీయులతో ఆ మాటలు చెప్పెను.

1. అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను.

2. “మిమ్ము దాస్యనిలయమైన ఐగుప్తుదేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే. నేనే మీ దేవుడను.

3. మీకు నేనుతప్ప మరొక దేవుడు లేడు.

4. పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమి యందు, భూమి అడుగుననున్న నీళ్ళయందును ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు.

5. మీరు వానికి మ్రొక్కరాదు. వానిని పూజింపగూడదు. మీ దేవుడను యావేను అయిన నేను రోషముగలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు మూడు, నాలుగు తరములవరకు దండింతును.

6. కాని నన్ను ప్రేమించి, నా నియమములను పాటించువారిని వేయితరముల వరకు కరుణింతును.

7. మీరు మీ దేవుడయిన యావే నామమును దుర్వినియోగపరుపరాదు. తన నామమును దుర్వినియోగ పరుచువానిని యావే దండింపక మానడు.

8. విశ్రాంతిదినమును గుర్తుంచుకొనుడు. దానిని పవిత్రము చేయుడు.

9. ఆరురోజులపాటు మీ పనులెల్ల చేసికొనవలయును.

10. ఏడవరోజు మాత్రము మీ దేవుడు అయిన యావేకు పవిత్రమయిన విశ్రాంతిదినము. ఆ రోజు మీరుగాని, మీ కుమారులుగాని, కుమార్తెలు గాని, పనివారుగాని, పశువులుగాని, మీ ఇంటనున్న పరదేశీయులుగాని ఏ పనియు చేయకూడదు.

11. యావే ఆరురోజులలో ఆకాశమును, భూమిని, సముద్రమును వానియందుండువానిని సృష్టించెను. ఆయన ఏడవరోజు విశ్రమించెను. కావున యావే ఆ రోజును దీవించి పవిత్రమయిన దానినిగా చేసెను.

12. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లయిన మీ దేవుడయిన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు.

13. హత్య చేయరాదు.

14. వ్యభిచరింపరాదు.

15. దొంగతనము చేయరాదు.

16. పొరుగువానికి వ్యతిరేకముగా అబద్దపుసాక్ష్యము చెప్పరాదు.

17. మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు. పొరుగువాని భార్యనుగాని, దాసునిగాని, దాసినిగాని, ఎద్దునుగాని, గాడిదనుగాని, మరి అతనిది ఏదైనను గాని ఆశింపరాదు.

18. యిస్రాయేలీయులందరు పొగలుచిమ్ము ఆ కొండను, ఆ ఉరుములను, ఆ మెరుపులనుకని, ఆ కొమ్ముబూర మ్రోతను విని గజగజలాడిరి. వారు దూరముగా నిలబడిరి.

19. వారు మోషేతో “నీవే మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడెనా మేము చచ్చుట తథ్యము” అనిరి.

20. అంతట మోషే వారితో “భయపడకుడు. దేవుడు మిమ్ము పరీక్షింపవచ్చెను. ఇట్లయినగాని దైవభీతి మీ మనస్సులలో శాశ్వతముగా నిలువదు. మీరు పాపము చేయకుండ ఉందురు” అనెను.

21. అప్పుడు మోషే దేవుడున్న కారుమబ్బును సమీపించెను. ప్రజలు మాత్రము దూరముగనే నిలబడిరి.

22. యావే మోషేతో నీవు యిస్రాయేలీయు లతో ఈ మాట చెప్పుము: “నేను ఆకాశమునుండి మీతో మాట్లాడుట మీ కనులార చూచితిరికదా!

23. నన్ను కొలుచుచూ మీరు వెండితోగాని, బంగారము తో గాని, విగ్రహములనుచేసి వానిని పూజింపరాదు”.

24. “మీరు నా కొరకు మట్టితో బలిపీఠము నిర్మింపవలయును. దానిమీద మీ గొఱ్ఱెలనుగాని, ఎద్దులనుగాని దహనబలులుగా, సమాధానబలులుగా సమర్పింపవలెను. నేను ఆరాధనస్థలము నిర్ణయించిన తావులన్నిట నేను మీకడకు వచ్చి మిమ్ము దీవింతును.

25. మీరు నా కొరకు రాయితో బలిపీఠమును నిర్మించి నచో చెక్కడపురాతిని వాడకుము. మీ పనిముట్లు రాళ్ళకు తగిలిన అవి మైలపడును.

26. మీరు మెట్ల మీదుగా నా బలిపీఠము మీదికి ఎక్కగూడదు. ఆ విధముగా ఎక్కినచో మీ దిగంబరత్వమును చూపిన వారగుదురు.”

1. నీవు యిస్రాయేలీయులకు నిర్ణయింపవలసిన విధులివి.

2. “ఎవడైనను ఒక హెబ్రీయుని దాసునిగా కొనినచో, వాడు ఆరేండ్ల వరకే దాసుడుగా ఉండును. ఏడవయేట నష్టపరిహారము చెల్లింపకయే అతడు స్వతంత్రుడగును.

3. ఆ దాసుడు ఏకాకిగా వచ్చినచో తిరిగి ఏకాకిగనే వెళ్ళును. వివాహితుడుగా వచ్చినచో అతనితోపాటు అతని భార్యయు వెళ్ళి పోవును.

4. యజమానుడు ఒక పిల్లను తెచ్చి దాసునకు పెండ్లి చేసిన యెడల, ఆ పిల్ల కుమారులను, కుమార్తెలను అతనికి కనినయెడల, ఆ కుమారులు కుమార్తెలు, ఆమెయు యజమానుని వశమగుదురు. దాసుడు ఒంటరిగనే యాజమానుని వీడి వెళ్ళవలెను.

5. కాని దాసుడు 'నేను నా యాజమానుని, నా భార్యను, బిడ్డలను ప్రేమించుచున్నాను. స్వతంత్రుడనగుట నాకు ఇష్టములేదు' అని చాటినచో అప్పుడు ఆ యజమానుడు అతనిని దేవునియొద్దకు కొనిపోవలయును.

6. అతనిని తలుపునొద్దకో, ద్వారబంధము కడకో తీసికొని పోయి వాని చెవిని కదురుతో కుట్టవలయును. ఇక ఆ దాసుడు బ్రతికినన్నాళ్ళు ఆ యజమానుని కొలువుననే ఉండును.

7. ఒకడు తన కుమార్తెను బానిసగా విక్రయించిన, ఆమె మగబానిసల మాదిరిగా వెలుపలకు వెళ్ళజాలదు.

8. ఆమె తనను పొందిన యజమానుని సంతోషపెట్టలేకపోయినచో అతడు ఆమెను విడుదల చేయవచ్చును. కాని ఆమెను విదేశీయులకు అమ్ము అధికారము అతనికిలేదు. అటుల చేయుట అన్యాయము.

9. యజమానుడు ఆమెను తన కుమారునికొరకు ఉద్దేశించినచో తన కుమార్తెపట్ల ఎట్లు వ్యవహరింపునో అట్లే ఆమెపట్లను వ్యవహరింపవలయును.

10. ఎవ్వడైనను మారు పెండ్లామును చేర్చుకొనినచో ఆమె కూటికి, గుడ్డకు, దాంపత్యధర్మమునకు లోటు లేకుండ చేయవలయును.

11. ఈ మూడింట అతడు ఆమెను మోసగించిన, ఆమె ఎట్టి సొమ్మును చెల్లింపకయే అతనిని వీడిపోవచ్చును.

12. మనుష్యుని కొట్టి చంపినవానికి మరణమే శిక్ష.

13. కాని ఎవ్వడైనను బుద్ధిపూర్వకముగాగాక దైవవశమున హత్య చేసినయెడల, వాడు పారిపోదగిన చోటును నీకు చూపుదును.

14. కాని ఒకానొకడు ద్రోహబుద్ధితో సాటివానిని చంపినచో, వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను, వానిని ఈడ్చుకొని పోయి చంపవలయును.

15. తల్లినిగాని తండ్రినిగాని కొట్టినవానికి మరణదండనమే శిక్ష,

16. ఒకడు మరియొకనిని బలాత్కారముగా కొనిపోయి అమ్మినను, తన వశమున ఉంచుకొనినను వానికి మరణదండనమే శిక్ష.

17. తల్లినైనను, తండ్రినైనను శపించువానికి మరణ దండనమే శిక్ష.

18. మనుష్యులు కలహించుకొనినప్పుడు, ఒకడు మరియొకనిని రాతితోనైన, పిడికిటితోనైన కొట్టినచో, దెబ్బలు తిన్నవాడు చావక మంచముపట్టి, కొన్నాళ్ళకు లేచి చేతికఱ్ఱతో అటునిటు తిరుగుచుండినయెడల, ఆ కొట్టినవానికి శిక్షలేదు.

19. కాని దెబ్బలు తిన్న వాడు పనిచేయలేని రోజులకు అతడు నష్టపరిహారము చెల్లింపవలయును. వాడు పూర్తిగా కోలుకొనునట్లు చూడవలయును.

20. ఒకడు తన దాసునిగాని, దాసినిగాని చావ మోదినయెడల అతడు దండనమునకు పాత్రుడు.

21. కాని ఒకటి రెండురోజులవరకు ఆ బానిస బ్రతికినచో కొట్టినవానికి దండనము లేదు. వాడు కొనిన బానిస అతని సొత్తేకదా!

22. మనుష్యులు దెబ్బలాటకు దిగినప్పుడు, ఒకడు ఒకానొక గర్భవతిని కొట్టినచో, ఆమెకు ప్రాణహాని లేకపోయినను గర్భస్రావము జరిగిన యెడల, హానికలిగించినవాడు ఆమె భర్త కోరిన నష్టపరిహారమును చెల్లింపవలయును. న్యాయాధిపతుల తీర్పు ప్రకారముగా అతడు సొమ్ము చెల్లింపవలయును.

23-25. కాని హాని జరిగినయెడల ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ శిక్షగా నిర్ణయింపవలయును.

26. ఒకడు తన దాసుని కంటిమీదగాని, దాసి కంటి మీదగాని కొట్టి కన్ను పోగొట్టినయెడల, కంటికి నష్టపరిహారముగా వారిని స్వతంత్రులను చేసి వెళ్ళి పోనీయవలయును.

27. అతడు తన దాసుని పంటిని గాని, దాసి పంటినిగాని ఊడగొట్టిన యెడల పంటికి నష్టపరిహారముగా వారిని స్వతంత్రులను జేసి పోనీయవలయును.

28. ఎద్దు పురుషునిగాని, స్త్రీనిగాని చావక్రుమ్మిన యెడల దానిని రాళ్ళతో చావగొట్టవలయును. దాని మాంసమును తినరాదు. ఎద్దుగల ఆసామి మాత్రము దోషి కాజాలడు.

29. కాని అది మొదటినుండి పోట్ల ఎద్దుగానుండినయెడల, ఎంత హెచ్చరించినను యజమానుడు దానిని అదుపున పెట్టనియెడల అది పురుషునిగాని, స్త్రీనిగాని చావపొడిచినచో ఎద్దును రాళ్ళతో చావగొట్టవలయును. దాని యజమానుని కూడా చంపివేయవలయును.

30. కాని యజమానుడు తన ప్రాణమునకు బదులు ధనము చెల్లించుట పొసగునేని అడిగినంత చెల్లింపవలయును.

31. ఎద్దు బాలునిగాని బాలికనుగాని చావక్రుమ్మినచో, దాని యజమానుడు పై నియమమునే పాటింపవలయును.

32. ఎద్దు దాసునిగాని, దాసిని గాని చావపొడిచినచో దాని ఆసామి వారి యజమానునకు ముప్పది వెండి నాణెములను చెల్లింపవలెను. ఎద్దును రాళ్ళతో చావ గొట్టవలయును.

33. ఒకడు నూతిమీది కప్పును తొలగించుట వలననో లేక నుయ్యిని త్రవ్వి దానిని కప్పకపోవుట వలననో, దానిలో ఎద్దయినను, గాడిదయినను పడి చచ్చినయెడల,

34. నుయ్యి స్వంతదారుడు నష్టము చెల్లింపవలయును. అతడు జంతువు యజమానునకు సొమ్ము చెల్లింపవలయును. అప్పుడు చచ్చిన జంతువు సొమ్ము చెల్లించినవానిది అగును.

35. ఒకని ఎద్దు మరియొకని ఎద్దును చావబొడిచినయెడల యజమానులిద్దరు బ్రతికిన ఎద్దును అమ్మి, వచ్చిన సొమ్మును సమముగా పంచుకొనవలయును. చచ్చిన ఎద్దును కూడ ఇద్దరును పంచుకొనవలయును.

36. కాని, ఎద్దు మొదటినుండి పోట్ల గొడ్డు అని తెలిసియు, యజమానుడు దానిని అదుపున పెట్టనియెడల అతడు ఎద్దుకు ఎద్దును ఈయవలయును. అప్పుడు చచ్చిన ఎద్దు అతనిదే అగును.

1. ఎవడయిన ఎద్దునో, గొఱ్ఱెనో దొంగిలించి చంపినను, అమ్మినను అతడు ఆ ఎద్దునకు బదులుగా ఐదు ఎద్దులను, ఆ గొఱ్ఱెకు మారుగా నాలుగు గొఱ్ఱెలను ఈయవలయును.

2-4. దొంగ దొంగిలించిన సొమ్ము తిరిగి చెల్లింపవలయును. వాడు త్రాడు బొంగరము లేనివాడయినచో దొంగిలించిన సొమ్ము చెల్లించుటకు వానిని అమ్మదగును. దొంగిలించినది ఎద్దుగాని, గాడిదగాని ప్రాణముతో దొంగ దగ్గర ఉన్నచో వాడు వానికి రెట్టింపు సొమ్ము చెల్లింప వలయును. కన్నము వేయుచున్నపుడు దొంగను పట్టుకుని చావగొట్టినయెడల, అది హత్య క్రిందికి రాదు. కాని ప్రొద్దుపొడిచిన తరువాత దొంగను చావగొట్టినచో అది హత్యయేయగును.

5. ఒకడు చేనునందునో, ద్రాక్షతోటనందునో మేయుటకు గొడ్లను వదలినపుడు అవి వేరొకరి చేను మేసినచో, వాని యజమానుడు తన చేనునుండి, తన తోటనుండి సమానమైన పంటను పరిహారముగా చెల్లింపవలయును. ఆ పశువులు చేను మొత్తము మేసినయెడల వాని యజమానుడు నష్టపడిన వాని పొలములో పండిన మంచిపంటతో, ద్రాక్షతోటలో విరుగగాచిన మంచిద్రాక్షకాపుతో సమమైన సొమ్మును నష్టపరిహారముగా చెల్లింపవలయును.

6. నిప్పురగుల్కొని గట్టిగాదము అంటుకొనుట వలన పంటకుప్పగాని, చేనుమీది నిలువు పైరుగాని, చేను మొత్తముగాని కాలిపోయినచో, నిప్పు పెట్టినవాడు పూర్తిగా నష్టమును చెల్లింపవలయును.

7. ఒకడు మరియొకని వద్ద కుదువ పెట్టిన సొమ్మును గాని, వస్తువును గాని దొంగిలించినచో దొంగ పట్టుబడినపుడు వాడు రెట్టింపు సొమ్ము ఇచ్చు కొనవలయును.

8. దొంగ దొరకనిచో సొమ్ము దాచిన ఇంటివాడు దేవునియెదుట తాను పొరుగువాని సొమ్ము ముట్టుకోలేదని ప్రమాణము చేయవలయును.

9. గాడిద, ఎద్దు, గొఱ్ఱె, వస్త్రములు మొదలగు వాని విషయమునగాని, ఒక వస్తువు పోయినపుడు ఎవడైన అది నాదని చెప్పినపుడుగాని వివాదము సంభవించినచో ఆ వివాదమును దేవుని సన్నిధికి కొనిపోవలయును. దోషియని దేవుడు చాటినవాడు రెండవవానికి రెట్టింపు సొమ్మును ముట్టజెప్పవలయును.

10. ఒకానొకడు గాడిదనుగాని, ఎద్దునుగాని, గొఱ్ఱెనుగాని, మరి ఏ పశువునైనాగాని కాపాడుటకు రెండవవానికి అప్పగించినచో అది చనిపోయినను, గాయపడినను, ఎవడును చూడకుండ తోలుకొని పోబడినను తగినసాక్ష్యము లభించనంతవరకు రెండవ వాడు మొదటివాని సొమ్మును అపహరించెనో లేదో తెలిసికొనుటకు ఆ రెండవవాడు దేవుని ముందు చేయు ప్రమాణమే ఆధారము.

11. సొమ్ము స్వంతదారుడు ఆ ప్రమాణమును ఒప్పుకొనవలయును. రెండవవాడు నష్టపరిహారము చెల్లింపనక్కరలేదు.

12. కాని జంతువు రెండవవాని యొద్దనుండి దొంగిలింపబడినచో అతడు దాని యజమానునకు నష్టపరిహారమును చెల్లింపవలెను.

13. క్రూరమృగములు పశువులను చంపినచో రెండవవాడు దాని అవశేషములను సాక్ష్యముగా కొనిరావలయును. అప్పుడు అతడు నష్టపరిహారము చెల్లింపనక్కరలేదు.

14. ఒకడు మరియొకనినుండి పశువును బదులు తీసికొన్నప్పుడు, అది యజమానుని పరోక్షమున గాయపడినను, చనిపోయినను, తీసికొన్నవాడు పూర్తిగా పరిహారము చెల్లింపవలయును.

15. కాని అది యజమానుని సమక్షముననే గాయపడినను లేదా చనిపోయినను తీసికొన్నవాడు నష్టమును భరింపనక్కరలేదు. ఆ జంతువు అద్దెయినచో, అద్దెసొమ్మునే చెల్లింపవలయును.

16. ఒకడు వివాహము నిశ్చయింపబడని కన్యకు మరులుగొల్పి ఆమెతో శయనించినచో, అతడు కన్యా దానమిచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలయును,

17. కాని కన్యతండ్రి అతనికి ఆమెనిచ్చి పెండ్లి చేయ ఇష్టపడనిచో అతడు కన్యతండ్రికి కన్యాశుల్కము చెల్లింపవలయును.

18. మంత్రగత్తెను బ్రతుకనీయరాదు.

19. జంతువును కూడినవానికి మరణదండనమే శిక్ష.

20. యావేకుగాక అన్యదైవములకు బలులు సమర్పించువానిని వెలివేసి కఠినముగా చంపవలయును.

21. మీరు పరదేశికి చెడుచేయరాదు. బాధింప రాదు. ఐగుప్తుదేశములో మీరును పరదేశులుగా ఉంటిరిగదా!

22. మీరు వితంతువులనుగాని, అనాథలనుగాని బాధింపరాదు.

23. నీవు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకొనినపుడు, నేను నిశ్చయముగా వారిమొర ఆలింతును.

24. నా క్రోధాగ్ని రగుల్కొనును. మిమ్ము నా కత్తికి బలిచేయుదును. మీ భార్యలు వితంతువులు అగుదురు. మీ బిడ్డలు అనాథలగుదురు.

25. మీలో ఎవ్వడైనను నాప్రజలలోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో, మీరు వారితో వడ్డీ వ్యాపారివలె వ్యవహరింపరాదు. వానినుండి వడ్డి పుచ్చుకొనరాదు.

26. మీరు మరియొకని నిలువుటంగీని కుదువ సొమ్ముగా తీసికొనినచో దానిని ప్రొద్దుగూకుటకు ముందే అతనికి తిరిగి ఇచ్చివేయవలయును.

27. కప్పుకొనుటకు అతనికడ ఉన్నదదే. అతడు ఒంటిమీద కప్పుకొను నిలువుటంగీ అదే. అతడు ఏమి కప్పుకొని పండుకొనును? అతడు నాకు మొరపెట్టుకొన్నచో నేను అతని మొర ఆలకింతును. నేను దయామయుడను.

28. మీరు దేవుని నిందింపరాదు. మీ ప్రజలలోని అధికారులను శపింపరాదు.

29. మీ పొలము పైరులో తొలివెన్నులను, మీ ద్రాక్ష తోటలో తొలి పండ్లను జాగుచేయక నాకు సమర్పింపవలయును. మీ తొలిచూలు మగబిడ్డలను నాకు అర్పింపవలెను.

30. అట్లే మీ పశువులలో, గొఱ్ఱెలలో తొలిచూలు పిల్లలను నాకు సమర్పింపవలయును. అది ఏడు రోజులపాటు తల్లిదగ్గర ఉండును. ఎనిమిదవనాడు మీరు నాకు దానిని సమర్పింప వలయును.

31. మీరు నాకు అంకితమైన ప్రజలు, కావున క్రూరమృగములు పొలములో చీల్చిచంపిన జంతువు మాంసమును మీరు తినరాదు. దానిని కుక్కలకు పారవేయవలయును.

1. మీరు కల్లమాటలు పుట్టింపరాదు. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో చేయి కలుపరాదు.

2. న్యాయవిరుద్ధముగా తప్పుడు పనులు చేయుటకు మందితో చేరరాదు. వ్యాజ్యములో మంది పక్షమునచేరి సాక్ష్యము పలికి అధర్మమును నెగ్గింప రాదు.

3. పేదవాడను తలంపుతో వ్యాజ్యమున వాని పట్ల పక్షపాతము చూపరాదు.

4. తప్పిపోయిన ఎద్దుగాని, గాడిదగాని నీకు కనబడినచో, అది నీ పగవానిదయినను, నిశ్చయముగా నీవు దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగింప వలయును.

5. నీ పగవాని గాడిద బరువు మోయలేక పడిపోయినపుడు, సాయము చేయుట నీకు ఇష్టము లేకపోయినను, నీవు వానితో కలిసి దానిని రక్షింప వలయును.

6. పేదవాని వ్యాజ్యములో అతనిని మోసగించి తీర్పుచెప్పరాదు.

7. అబద్దమునకు దూరముగా ఉండుము. నిరపరాధినైనను, నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను.

8. లంచములు తీసికొనకుము. లంచము మంచిచూపు గల మనుజులను సైతము గ్రుడ్డివారినిగా చేయును. నిర్దోషియగువాని కార్యమును చెరచును.

9. నీవు పరదేశిని అణగదొక్కరాదు, ఐగుప్తు దేశములో మీరును పరదేశులుగా బ్రతికితిరి కావున పరదేశి మనస్సు ఎట్లు బాధపడునో మీకు తెలియును.

10. ఆరేండ్లపాటు భూమిని సాగుచేసి పంటలు పండింపుడు.

11. కాని ఏడవయేట దానిని సాగు చేయవలదు. బలముకొరకు వదలివేయుడు. ఆ యేడు మీలో పేదలయిన వారు ఆ భూమినుండి ఆహారము సంపాదించుకొందురు. వారు తినివదలిన దానిని మృగములు వచ్చి తినును. మీ ద్రాక్షతోటలను, ఓలివు తోటలను ఇట్లే వదలివేయుడు.

12. ఆరు రోజులపాటు మీరు మీపనులు చేసికొనుడు. ఏడవ రోజు పనిచేయుట మానుడు. ఇట్లయిన మీ ఎద్దులకు, గాడిదలకు తెరపి కలుగును. మీ దాసీపుత్రుడును, పరదేశియును ఊపిరిపోసికొందురు.

13. నేను చెప్పినమాటలనన్నిటిని శ్రద్ధగా పాటింపుడు. మీరు ఇతర దైవములను ఆశ్రయింప గూడదు. వారి పేరైనను మీరెత్తగూడదు.

14. ఏడాదికి మూడుసార్లు మీరు నా పేర పండుగ చేయవలయును.

15. మీరు పొంగని రొట్టెలతో పండుగ చేయవలయును. నేను ఆజ్ఞాపించినట్లే అబీబునెలలో నియమితకాలమున ఏడురోజుల పాటు పొంగనిరొట్టెలను తినుడు. ఆ నెలలో మీరు ఐగుప్తును వీడి వచ్చితిరి. ఎవ్వడును వట్టిచేతులతో నాసన్నిధికి రాకూడదు.

16. మీరు విత్తిన పొలములోని తొలిపంట కోతకు వచ్చినపుడు కోతపండుగ చేసికొన వలయును. సంవత్సరాంతమున మీ కష్టముఫలించి పొలములోనుండి వ్యవసాయఫలములను నీవు ఇంట చేర్చుకొనిన పిదప పంటరాకడ పండుగను చేసికొన వలయును.

17. ఏడాదికి మూడుసార్లు మీ మగవారెల్లరు ప్రభుసన్నిధికి రావలయును.

18. మీరు నాకు జంతుబలులు అర్పించునపుడు పొంగినరొట్టెలను సమర్పింపరాదు. నాకు బలిగా చేసినదాని క్రొవ్వును మరునాటి ప్రొద్దుటివరకు అట్టి పెట్టరాదు.

19. మీరు భూమినుండి పండించిన తొలి పంటలో అతిశ్రేష్ఠమయిన దానిని మీ దేవుడయిన యావే మందిరమునకు తీసికొనిరావలయును. మేక పిల్లను దాని తల్లిపాలలో ఉడుకబెట్టరాదు.

20. మీ ముందు పయనించు నిమిత్తము నేనొక దూతను పంపెదను. ఆయన మార్గమున మిమ్ము కాపాడుచు, నేను సిద్ధపరచిన చోటికి మిమ్ముచేర్చును.

21. అతనిపట్ల భయభక్తులు కలిగి, అతడు చెప్పిన మాటలెల్ల శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరుగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు గావున మీ తప్పును మన్నింపడు.

22. కాని మీరు అతని మాటవిని నేను చెప్పినదెల్ల చేసినచో, మీ శత్రువులకు నేను శత్రువునయ్యెదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును.

23. నాదూత మీకంటె ముందుగా వెళ్ళి అమోరీయులు, హిత్తీయులు, పెరిస్సీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వసించుచోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపుదును.

24. మీరు వారి దైవములకు నమస్కరింపరాదు. సేవింపరాదు. ఆరాధింపరాదు. వారు చేయునది మీరు చేయరాదు. మీరు వారి విగ్రహములను ధ్వంసము చేయుడు.

25. మీరు మీ దేవుడయిన యావేను మాత్రమే పూజింపవలయును. నేను మీ ఆహారమును, పానీయమును దీవింతును. మీకు రోగము అంటకుండ చేయుదును.

26. మీ నేలలో గర్భము పోగొట్టుకొనిన స్త్రీగాని, గొడ్రాలయిన స్త్రీగాని ఉండదు. మిమ్ము పూర్ణాయుషు కలవారినిగా చేయుదును.

27. మిమ్మెదిరించువారికి భయము గొల్పెదను. మిమ్ము ఎదుర్కొనిన వారిని కల్లోలపరతును. మీ శత్రువులు మిమ్మువీడి పారిపోవునట్లు చేయుదును.

28. మీ ఎదుటినుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను పారద్రోలుటకు మీ కంటే ముందుగా పెద్దకందిరీగలను పంపుదును. 

29. ఒక యేడాది కాలముననే మీయొద్దనుండి వారిని పారద్రోలను. అట్లయినచో దేశమంతా బీడయిపోవును. క్రూర మృగములు విస్తరిల్లి మిమ్ము బాధించును.

30. మీ జనసంఖ్య పెరిగి ఆ దేశమును మీరు వశము చేసి కొనువరకు, వారిని క్రమక్రమముగా మీ కంటి ఎదుటినుండి పారద్రోలుచుందును.

31. మీ దేశమునకు రెల్లు సముద్రము, మధ్యధరా సముద్రము, అరేబియా ఎడారి, యూఫ్రటీసునది పొలిమేరలుగా ఏర్పరుతును. ఆ దేశీయులను మీ చేతులకు అప్పగింతును. మీరు వారిని మీ ఎదుటినుండి వెళ్ళగొట్టెదరు.

32. మీరు వారితోను, వారి దైవములతోను ఎట్టి నిబంధనము చేసికొనరాదు.

33. వారు మీ దేశములో నివసింపరాదు. నివసించినచో మిమ్ము రెచ్చగొట్టి నాకు వ్యతిరేకముగా మీచేత పాపములు చేయింతురు. మీరు వారి దైవములను సేవించినచో మీ పాలిటికి ఉరి తెచ్చి పెట్టుకొన్నట్లే.”

1. ఆయన మోషేతో “నీవు, అహరోను, నాదాబు, అబీహు, యిస్రాయేలీయుల డెబ్బదిమంది పెద్దలును నా కడకురండు. మీరు దూరముగనే ఉండి నాకు సాగిలపడుడు.

2. మోషే ఒక్కడే యావే దరికి రావలయును. మిగిలినవారు దూరముగ ఉండవలయును. ఇతర ప్రజ అతనితో కొండయెక్కిరాగూడదు” అని చెప్పెను.

3. మోషే యిస్రాయేలీయుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను, చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరు ఒక్కగొంతుతో “యావే చెప్పిన నియమములన్నిటిని మేము పాటింతుము” అని పలికిరి.

4. మోషే యావే చేసిన నియమములన్నిటిని లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర బలిపీఠమును నిర్మించెను. యిస్రాయేలీయుల పన్నెండుతెగలకు గుర్తుగా పండ్రెండు శిలలను ఎత్తెను.

5. అప్పుడు మోషే దహనబలులు సమర్పించుటకు, సమాధానబలులుగా కోడెలను వధించుటకు, యిస్రాయేలీయులలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను.

6. మోషే కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి, మిగిలిన సగమును బలిపీఠముపై చల్లెను.

7. అతడు నిబంధన గ్రంథమును చదివి యిస్రాయేలీయులకు వినిపించెను. వారు “యావే శాసనములెల్ల మేము అనుసరింతుము. మేము ఆయనకు విధేయులమై ఉందుము” అని అనిరి.

8. అప్పుడు మోషే పళ్ళెము లోని నెత్తురు యిస్రాయేలీయుల మీద ప్రోక్షించి “యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసికొనిన నిబంధనమునకు సంబంధించిన రక్తము ఇదియే” అనెను.

9. అహరోను, నాదాబు, అబీహులతో మరియు డెబ్బదిమంది యిస్రాయేలు పెద్దలతో మోషే కొండమీదికి వెళ్ళెను.

10. వారు యిస్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదములక్రింద ఆకాశమండలము వలె వెలుగుచున్న నీలమణి ఫలకము ఉండెను.

11. యావే ఆ యిస్రాయేలు ప్రముఖులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచిరి. భోజనముచేసి పానీయములు సేవించిరి.

12. యావే మోషేతో "కొండమీదికి వచ్చి నన్ను కలిసికొనుము. నేను నియమములను ధర్మశాస్త్రమును రాతిఫలకముపై వ్రాసి నీకిచ్చెదను. నీవు యిస్రాయేలీ యులకు వానిని బోధింపుము” అనెను.

13. అంతట మోషే, అతని సేవకుడగు యెహోషువ ఇద్దరును లేచి దేవునికొండకు వెళ్ళిరి.

14. మోషే యిస్రాయేలీయుల పెద్దలతో “మేము తిరిగి మీకడకు వచ్చువరకు ఇక్కడనే వేచియుండుడు. అహరోను, హూరు మీ దగ్గరనే ఉందురు. మీ తగవులు తీర్చుకొనుటకు వారి దగ్గరకు వెళ్ళుడు” అని చెప్పెను.

15. పిదప మోషే కొండ మీదికి వెళ్ళెను. మేఘము కొండను క్రమ్మెను.

16. యావే తేజస్సు సీనాయి కొండమీద నిలిచెను. ఆరు రోజులపాటు మేఘము కొండను క్రమ్మెను. ఏడవనాడు యావే మేఘము మధ్యనుండి మోషేను పిలిచెను.

17. యావే తేజస్సు కొండకొమ్మున ప్రజ్వరిల్లుచున్న అగ్నివలె యిస్రాయేలీయుల కన్నులకు కనబడెను.

18. మోషే సరాసరి మేఘమున ప్రవేశించెను. అతడు కొండయెక్కి నలువది పగళ్ళు నలువది రాత్రులుండెను.

1. యావే మోషేతో మాట్లాడుచు,

2. “నాకు అర్పణములను తీసుకొనిరండు” అని యిస్రాయేలీయులతో చెప్పుము. హృదయపూర్వకముగా ఇచ్చువాని నుండియే ఈ అర్పణములు స్వీకరింపుము.

3. యిస్రాయేలీయుల నుండి బంగారము, వెండి, ఇత్తడి,

4. ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్ని, సన్ననార, మేకవెంట్రుకలు,

5. ఎఱ్ఱఅద్దకము వేసిన పొట్టేళ్ళ తోళ్ళు, మేలిమిగట్టితోళ్ళు, తుమ్మకఱ్ఱ,

6. దీపములకు చమురు, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములు, ధూపమునకువలయు సుగంధ ద్రవ్యములు,

7. ప్రధానయాజకుని పరిశుద్ధ వస్త్రమైన ఏఫోదున, వక్షఃఫలకమున పొదుగుటకు కావలసిన లేతపచ్చలు, రత్నములు అర్పణముగా తీసికొనుము.

8. నేను వారిలో నివసించుటకు నాకొక పవిత్ర స్థలమును నిర్మింపుము.

9. నేను నీకు చూపు నమూనా ప్రకారముగా నీవు మందిరమును దాని ఉపకరణములను నిర్మింపవలయును.

10. రెండున్నరమూరల పొడవు, ఒకటిన్నర మూర వెడల్పు, ఒకటిన్నర మూర ఎత్తుగల ఒక మందసమును తుమ్మకొయ్యతో చేయవలయును.

11. దానికి లోపల వెలుపల మేలిమి బంగారపు రేకు అతికించవలయును. దాని అంచులందు బంగారపు రేకు కట్టులుండవలయును.

12. ఆ పెట్టెకై నాలుగు బంగారు కడియములను పోతపోయవలయును. ఒక ప్రక్క రెండు, మరియొకప్రక్క రెండు ఉండునట్లుగా ఆ కడియములను పెట్టి నాలుగుకాళ్ళకు అమర్ప వలయును.

13. తుమ్మకఱ్ఱతోనే మోతకఱ్ఱలను కూడ చేసి వానికి బంగారురేకులను తొడుగవలయును.

14. పెట్టెను మోసికొని పోవుటకు దాని ప్రక్కలనున్న కడియములలో ఆ మోతకఱ్ఱలను దూర్పవలయును.

15. మోతకఱ్ఱలు కడియములందే ఉండవలయును. వానిని బయటికి తీయరాదు.

16. నేను నీకొసగు శాసనములను ఆ మందసపు పెట్టెయందు ఉంచవలయును.

17. రెండున్నర మూరల పొడవు, ఒకటిన్నర మూర వెడల్పుగల కరుణావీఠమును మేలిమి బంగారముతో చేయవలయును.

18. ఈ కరుణా పీఠము రెండుకొనలవద్ద నుంచుటకై రెండు కెరూబీము దూతల ప్రతిమలను' పోతపోసిన బంగారముతో చేయవలయును.

19. కరుణాపీఠమునకు రెండు కొనలవద్ద వాటిని ఉంచవలయును. అవి కరుణా పీఠముతో ఏకాండముగా నుండవలయును.

20. అవి రెక్కలు పైకి విచ్చుకొని ఉండవలయును. అట్లయిన ఆ రెక్కలు కరుణాపీఠమును కప్పివేయును. ఆ ఆకృతులు ఒకదానికొకటి ఎదురుగా నుండి, కరుణా పీఠమువైపు చూచుచుండవలయును.

21. కరుణా పీఠమును మందసపు పెట్టె పైనుంచుము. నేను నీకు ఒసగు శాసనములను ఆ మందసపు పెట్టెలో ఉంచుము.

22. ఆ కరుణాపీఠము నుండియు, శాసనములు గల మందసపు మీదనుండు రెండు కెరూబుదూతల బొమ్మల నడుమ నుండి నేను మిమ్ము కలిసికొందును. అక్కడినుండియే యిస్రాయేలీయుల కొరకు సమస్త నియమములను నీకు ప్రసాదింతును.

23. రెండు మూరల పొడవు, ఒక మూర వెడల్పు, ఒకటిన్నర మూర ఎత్తుగల బల్లను తుమ్మ కఱ్ఱతో చేయవలయును.

24. మేలిమిబంగారపు రేకును దానికి తొడుగవలయును. ఆ బల్ల అంచుల చుట్టు మేలిమి బంగారపుకట్టు ఉండవలయును.

25. బల్లచుట్టు బెత్తెడు వెడల్పుగల బద్దె ఉండవలయును. ఆ బద్దెచుట్టు బంగారపుకట్టు ఉండవలయును.

26. బల్లకొరకు నాలుగు బంగారు కడియములు చేసి వానిని దాని నాలుగుకాళ్ళకుండు నాలుగుమూలలా తగిలింప వలయును.

27. బల్లను మోయు మోతకఱ్ఱలుంచుటకు కడియములు బద్దెకు దగ్గరగా ఉండవలయును.

28. తుమ్మకొయ్యతో మోతకఱ్ఱలను చేసి, వానికి బంగారురేకును తొడిగింపవలయును. వానితో బల్లను మోయవలయును.

29. ఆ బల్లమీద వాడుటకై పళ్ళెములను, ధూపారులను, గిన్నెలను, కూజాలను, పానీయ అర్పణనకు వలయు పాత్రములను మేలిమి బంగారముతో చేయవలయును.

30. నిత్యము నాకు సమర్పింపవలసిన సాన్నిధ్యపు రొట్టెలను బల్లమీద నా ఎదుట ఉంచవలయును.

31. మేలిమిబంగారముతో దీపస్తంభము చేయవలయును. దానిపీఠము, కాండము కమ్మచ్చున తీసిన బంగారముతో నగిషీపనిగా చేయవలయును. ఆ దీపస్తంభముమీది గిన్నెలవంటి మొగ్గలు, దళములు దానితో కలిసిపోయి నగిషీపనిగా ఉండవలయును.

32. దానికి ఇటువైపున మూడు, అటువైపున మూడు మొత్తము ఆరుకొమ్మలుండును.

33. దాని ఆరు కొమ్మలకు ఒక్కొక్క కొమ్మకు బాదము పూల రూపమున నున్న గిన్నెలవంటి మొగ్గలు, దళములు మూడేసి ఉండవలయును.

34. దీపస్తంభము కాండమున కూడ బాదముపూల రూపముననున్న మొగ్గలు, దళములు నాలుగు ఉండవలయును.

35. దీపస్తంభమునకు ప్రతి రెండుకొమ్మల క్రింద ఒక్కొక్క గిన్నె చొప్పున ఉండవలయును.

36. ఆ గిన్నెలు, కొమ్మలు దీప స్తంభముతో ఏకాండము అయివుండవలెను. వీనినన్నిటిని కమ్మచ్చున తీసిన బంగారముతోనే చేయ వలయును.

37. దీపస్తంభమునకు ఏడు దీపములు చేయవలయును. స్తంభమునకు ముందు వెలుగుపడునట్లుగా వానిని దానికి అమర్చవలయును.

38. ఆ దీపములకువలయు కత్తెరయు, పాత్రయు మేలిమి బంగారముతోనే చేయవలయును.

39. దీపస్తంభమును మిగిలిన ఉపకరణములను చేయుటకు నలువది వీసెల మేలిమి బంగారము ఉపయోగించవలయును.

40. కొండమీద నీకు చూపిన నమూనా ప్రకారముగ వీనినన్నిటిని చేయవలయునని గుర్తుంచుకొనుము.

1. ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో, పేనిన సన్ననిదారముతో నేయబడి కెరూబీము దూతల బొమ్మల అల్లిక గలిగిన పదితెరలను నీవు మందిరము కొరకు సిద్ధము చేయవలయును.

2. ప్రతి తెరయు ఇరువది ఎనిమిదిమూరల పొడవు, నాలుగు మూరలు వెడల్పు ఉండవలయును. తెరలన్నిటికి ఇదియే కొలత.

3. తెరలలో ఐదింటిని కలిపి కుట్టవలయును. ఆ తీరునే మిగిలిన ఐదింటిని గూడ కలిపి కుట్టవలయును.

4. ప్రతి ఐదింటిలో చివరితెర అంచులకు ఊదారంగు దారముతో ఉచ్చులు వేయింపుము.

5. మొదటి ఐదు తెరలలో మొదటిదానికి ఏబది ఉచ్చులు, అదే విధముగా రెండవ ఐదుతెరలలో చివరిదానికి ఏబది ఉచ్చులు ఉండవలయును.

6. ఏబది బంగారు గుండీలను చేయించి ఆ ఉచ్చు ముడులన్నిటిని కలిపి వేయుము. అప్పుడు అదంతయు ఏకమందిరమగును.

7. అటు తరువాత మేక వెంట్రుకలతో పదు నొకండు కంబళి తెరలు తయారుచేసి గుడారముగా మందిరముపై కప్పువేయింపుము.

8. ఈ తెరలు ముప్పది మూరల పొడవు, నాలుగుమూరల వెడల్పు ఉండవలయును. అన్నిటికిని అదియే కొలత.

9. వానిలో ఐదింటిని ఒకతెరగా, ఆరింటిని మరియొక తెరగా కుట్టింపుము. ఆరవ తెరను నడిమికి మడిచి దానిలో సగభాగమును గుడారము చూరున అమర్చుము.

10. ఐదు తెరలలో మొదటిదానికి ఏబది ఉచ్చులు, ఆరుతెరలలో కడపటిదానికి ఏబది ఉచ్చులు వేయింపుము.

11. ఏబది ఇత్తడి గుండీలను చేయించి ఆ తెరల రెండుకొనలనున్న ఉచ్చులను కలిపి ఒకే గుడారమగునట్లు ఆ గుండీలను ఉచ్చులకు తగిలించి దానిని కూర్చవలెను.

12. ఒక తెరలో సగభాగము గుడారపు చూరున వ్రేలాడినట్లే మిగిలిన సగభాగము గుడారము చివర వ్రేలాడును.

13. గుడారముగా కప్పిన తెరలు నిలువువైపున మూరెడు పొడవున క్రిందికి మందిరము ఇరువైపుల వ్రేలాడుచుండవలయును.

14. అటుతరువాత పొట్టేళ్ళ చర్మమునకు ఎఱ్ఱని అద్దకమువేసి దానిని గుడారమునకు మీదికప్పుగా వేయుము. దానిమీద మరల మేలురకమైన గట్టితోలు కప్పు వేయింపుము.

15. మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు చట్రములు చేయింపవలయును.

16. ప్రతిచట్రము పదిమూరల పొడవు, మూరన్నర వెడల్పు ఉండవలయును.

17. ప్రతి చట్రమునకు క్రింద సమదూరములో రెండు కొసలు ఉండును. ఈ కొసల సహాయముతో చట్రములన్ని కలిపివేయవచ్చును. చట్రములన్నింటిని ఈ రీతినే రెండు రెండు కొసలతో చేయింపవలయును.

18. గుడారమునకు దక్షిణపువైపు ఇరువది చట్రములు చేయింపుము.

19. నలువది వెండి దిమ్మెలుగూడ చేయించి చట్రములక్రింద జొప్పింపుము. ఒక్కొక్క చట్రపు రెండు కొసలు రెండేసి దిమ్మలలోనికి గ్రుచ్చుకొనిపోవును.

20. ఆ రీతిగనే గుడారపు ఉత్తర భాగమునకు ఇరువది చట్రములు చేయింపుము.

21. నలువది వెండిదిమ్మెలుకూడ చేయించి ఒక్కొక్క చట్రము క్రింద రెండుదిమ్మల చొప్పున అమర్పుము.

22. పడమట, గుడారపు వెనుకటి భాగమునకు ఆరు చట్రములు చేయింపుము.

23. ఆ వెనుకటి భాగపు రెండుమూలలకు రెండుచట్రములు ఉండవలయును.

24. ఈ మూలచట్రములు క్రింది భాగమున ఒక దానితో ఒకటి అతుకుకొని ఉండవలయును. మీది భాగమున గూడ మొదటి కడియమువరకు అవి ఒక దానితోనొకటి అతుకుకొని ఉండవలయును. వెనుకటి మూలచట్రములు రెండింటిని తయారు చేయవలసిన నియమము ఇది.

25. కనుక వీనితో కలిపి మొత్తము ఎనిమిది చట్రములు, వాని క్రింద పదునారు వెండి దిమ్మలు ఉండును.

26. తుమ్మకొయ్యతో అడ్డ కఱ్ఱలను కూడ చేయింపుము.

27. ఉత్తరపువైపున వున్న చట్రములను ఒక్కటిగా కలిపి వేయుటకు ఐదింటిని, దక్షిణపువైపున ఉన్న చట్రములను ఒక్కటిగా కలిపివేయుటకు ఐదింటిని, పడమటివైపున ఉన్న చట్రములను ఒక్కటిగా కలిపి వేయుటకు ఐదింటిని చేయింపుము.

28. మధ్యనున్న అడ్డకఱ్ఱ, చట్రముల సగమెత్తున నడిమికి, ఒక కొని నుండి మరియొక కొనవరకు చట్రములలో దూరి యుండవలయును.

29. చట్రములకు బంగారము పొదిగించి వానికి బంగారుకడియములు వేయింపుము. అడ్డకఱ్ఱలకుగూడ బంగారము పొదిగించి వానిని ఈ కడియములలో దూర్పింపుము.

30. నీకు పర్వతము మీద చూపిన నమూనాప్రకారముగనే గుడారమును నిర్మింపుము.

31. పేనిన దారముతో ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో కళాత్మకముగా నేయబడి, కెరూబీము దూతలబొమ్మల అల్లిక గల అడ్డుతెరను తయారు చేయింపుము.

32. తెరను నాలుగు తుమ్మస్తంభములకు వ్రేలాడదీయుము. ఆ స్తంభములను బంగారముతో పొదిగి, వానికి బంగారు కొక్కెములు అమర్చుము. ఆ స్తంభములను వెండిదిమ్మలలో అమర్చియుంచుము.

33. ఆ అడ్డుతెరను కొక్కెములకు వ్రేలాడదీసి, శాసనములుంచిన మందసమును ఆ అడ్డుతెరవెనుక భాగములో ఉంచుము. ఈ అడ్డుతెర గర్భగృహము నుండి పరిశుద్ధస్థలమును వేరుపరుచును.

34. గర్భ గృహముననున్న శాసనములు గల మందసముమీద కరుణాపీఠము నుంచుము.

35. బల్లను అడ్డుతెర వెలుపల ఉంచుము. దీపస్తంభమును గుడారమునకు దక్షిణ భాగమున బల్లకెదురుగా నిలుపుము.

36. గుడారపు ద్వారమునకు పేనిన దారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో కళాత్మకముగా నేయబడి అల్లిక పనిగల తెరకుట్టింపుము.

37. ఈ తెరకు ఐదు తుమ్మస్తంభములు చేయింపుము. ఆ స్తంభములకు బంగారము పొదిగించి, బంగారు కొక్కెములు అమర్చి వానిని ఐదు ఇత్తడిదిమ్మలలో బిగింపుము.

1. నీవు తుమ్మకొయ్యతో చదరముగానుండు బలిపీఠము నిర్మింపవలయును. అది ఐదుమూరల పొడవు, ఐదుమూరల వెడల్పు, మూడుమూరల ఎత్తు ఉండవలెను.

2. దాని నాలుగు మూలలయందు నాలుగు కొమ్ములను నిలుపుము. ఈ కొమ్ములు పీఠముతో ఏకాండముగా ఉండవలెను. పీఠము అంతటికి ఇత్తడి రేకు పొదిగింపుము.

3. పీఠమునొద్ద వాడుటకై, కాల్చిన క్రొవ్వును ఎత్తుటకు పళ్ళెరములు, గరిటెలు, నీళ్ళు చిలుకరించు గిన్నెలు, ముళ్ళగరిటెలు, నిప్పునెత్తు పళ్ళెరములను ఇత్తడితో చేయింపుము.

4. మరియు పీఠమునకు ఇత్తడితో జల్లెడవంటి తడిక చేయింపుము. ఈ తడికకు నాలుగువైపుల నాలుగు ఇత్తడి కడియములు చేయింపుము.

5. దానిని పీఠపు క్రింది అంచు నుండి సగము ఎత్తువరకు ఉండునట్లు అమర్పుము.

6. పీఠమును మోసికొని పోవుటకై తుమ్మకఱ్ఱతో మోత కఱ్ఱలు చేయించి, వానిని ఇత్తడితో పొదిగింపుము.

7. పీఠమునకు రెండువైపుల ఉన్న కడియములలో వానిని చేర్చి పీఠమును మోసికొనిపోవలయును.

8. పీఠమునకు మధ్య బోలు ఏర్పడునట్లుగా దానిని పలకలతో నిర్మింపుము. నీకు పర్వతముమీద చూపిన నమూనా ప్రకారమే దానిని నిర్మింపుము.

9. నీవు గుడారమునకు చుట్టు ఆవరణము నిర్మింపవలయును. దక్షిణదిశకు పేనిన దారముతో నేసిన నారబట్టతో నూఱుమూరల పొడవుగల తెరను తయారుచేయింపుము.

10. ఇత్తడి దిమ్మలలో కూర్చిన ఇరువది ఇత్తడి కంబములకు దానిని తగిలింప వలయును. ఈ కంబములకు కొక్కెములు, వెండి బద్దలు ఉండవలయును.

11. ఆ రీతిగనే ఉత్తరదిశన నూఱుమూరల పొడవు గల తెరలు ఉండవలయును. ఇరువది ఇత్తడి దిమ్మలలో కూర్చిన యిరువది ఇత్తడి కంబములకు వానిని తగిలింపవలయును. ఈ కంబములకు కొక్కెములు వెండిబద్దలు ఉండును.

12. ఆవరణము వెడల్పు కొరకు పడమటి వైపున ఏబది మూరల పొడవుగల తెరలు, పది కంబములు, పది దిమ్మలు ఉండవలయును.

13. తూర్పు వైపున అనగా ఉదయదిక్కున ఆవరణము ఏబది మూరలు వెడల్పు ఉండవలయును.

14. ఆవరణ ద్వారమునకు ఒక వైపున పదునైదు మూరల పొడవుగల తెరలుండ వలయును. వానిని మూడు దిమ్మేలలో నుంచి మూడు కంబములకు తగిలింపవలయును.

15. ఆ రీతిగనే రెండవ వైపున గూడ పదునైదు మూరల పొడవుగల తెరలు, మూడు దిమ్మలలోనికి జొన్పిన మూడు కంబములు ఉండవలయును.

16. ఆవరణ ప్రవేశమునకు ఇరువది మూరల పొడవుగల మరొక తెర ఉండవలెను. అది ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో పేనిన మంచిదారముతో కళాత్మకముగా నేయబడి అల్లిక పనులు కలదై ఉండవలయును. అది నాలుగు దిమ్మెలలో జొనిపిన నాలుగు కంబములపై ఉండవలయును.

17. ఆవరణము చుట్టు పాతియుంచిన కంబములన్నిటిని వెండిబద్ధలతో కలిపివేయవలయును. ఈ కంబములకు మరల వెండి కొక్కెములు ఇత్తడి దిమ్మలు ఉండవలయును.

18. ఆవరణము నూఱు మూరల పొడవు, ఏబదిమూరల వెడల్పు, ఐదు మూరల ఎత్తు ఉండవలయును. తెరలను పేనిన సన్నని నారదారముతో, దిమ్మలను ఇత్తడితో చేయ వలయును.

19. గుడారమున వాడు పరికరముల నన్నిటికిని, గుడారమునకు, ఆవరణమునకు వాడు మేకులన్నిటిని ఇత్తడితోనే చేయవలయును.

20. దీపమును వెలిగించుటకై దంచితీసిన స్వచ్చమైన ఓలివుతైలము కొనిరమ్మని యిస్రాయేలీయులకు చెప్పుము. గుడారమున నిత్యము దీపము వెలుగుచు ఉండవలయును.

21. అహరోను అతని కుమారులు సాన్నిధ్యవు గుడారమున మందసము ఎదుటనున్న తెర వెలుపల ఈ దీపము వెలిగింపవలయును. అచట నెలకొనియున్న దేవుని సన్నిధిని ఆ దివ్వె సాయంత్రమునుండి ఉదయము వరకు నిత్యము వెలుగుచుండవలయును. యిస్రాయేలీయులును, వారి సంతతివారును ఈ నియమమును సదా పాటింపవలయును.

1. యిస్రాయేలీయులనుండి నీ సోదరుడు అహరోనును, అతని కుమారులను యాజకులుగా నాకు సమర్పింపుము. అహరోను అతని కుమారులు నాదాబు, అబిహు, ఎలియెజెరు, ఈతామారులు నాకు యాజకులగుదురు.

2. నీ సోదరుడు అహరోనుకు పవిత్రవస్త్రములు తయారు చేయింపుము. అవి అతనికి గౌరవమును, శోభను కలిగించును.

3. నేర్పుగల పనివారినందరిని అహరోనునకు వస్త్రములు తయారు చేయుటకు నియమింపుము. వారికి నేను వివేక హృదయమును, జ్ఞానాత్మను ప్రసాదించితిని. ఈ వస్త్రములు ధరించి అతడు నాకు యాజకుడుగా నివేదితుడగును.

4. ఆ పనివారు కుట్టవలసిన వస్త్రములివి: వక్షఃఫలకము, ఏఫోదు అనబడు పరిశుద్ధ వస్త్రము, నిలువుటంగీ, విచిత్ర అల్లిక పని గల చొక్కా తలపాగా, నడికట్టు. ఈ రీతిగా నీ సోదరునికి అతని కుమారులకు పవిత్రవస్త్రములు కుట్టింపవలయును. వానిని ధరించి వారు నాకు యాజకులుగా పనిచేయుదురు.

5. పనివారు బంగారము, ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్ని, పేనిన దారమును వాడుదురు.

6. పనివారు బంగారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్నితో, పేనిన దారముతో, కళాత్మకమైన అల్లికపనితో పరిశుద్ధవస్త్రమును తయారు చేయవలెను.

7. ఈ ఎఫోదు పరిశుద్ధవస్త్రమునకు రెండుఅంచుల రెండు భుజపాశములుండును. వానిని యాజకుని భుజములకు తగిలింపవచ్చును.

8. దానితో కలిపి కుట్టిన నడికట్టునుగూడ బంగారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో, పేనిన దారముతో కళాత్మకముగా తయారుచేయవలయును.

9. రెండు లేత పచ్చమణులను తీసికొని వానిమీద యిస్రాయేలు తెగల పేరులు చెక్కింపుము.

10. జనన క్రమము అనుసరించి ఒక మణిమీద ఆరుగురి పేర్లు, మరియొక మణిమీద ఆరుగురి పేర్లు చెక్కింపుము.

11. మణులు ముద్రలు చెక్కు పనివారిని నియమించి రెండు మణుల మీద యిస్రాయేలు తెగల పేర్లు చెక్కింపుము. అటుపిమ్మట ఆ మణులను బంగారమున పొదిగింపుము.

12. ఈ మణులను ఎఫోదు పరిశుద్ధవస్త్రము భుజపాశములపై అమర్చుము. ఈ మణుల మూలమున యిస్రాయేలీయులు నాకు జ్ఞప్తికి వత్తురు. ఈ రీతిగా అహరోను యిస్రాయేలీయుల పేర్లను తన భుజములపై తాల్చును. ఈ పేర్లు చూచి ప్రభువు యిస్రాయేలీయులను స్మరించుకొనును.

13. మరియు నీవు రెండు రత్నపు రవ్వలను మేలిమి బంగారముతో పొదిగించి, జిలుగుపనిగా బంగారు కడియములను చేయుము.

14. దారపు ముడులవలె వంగిన బంగారుకడియములు గల రెండు బంగారు గొలుసులను గూడ చేయించి వానికి ఆ రత్నపు రవ్వలను తగిలింపుము.

15. నీవు న్యాయ తీర్పు చెప్పు వక్షఃఫలకమును కళాత్మకముగా తయారుచేయవలెను. ఎఫోదు పరిశుద్ధ వస్త్రమువలె, ఇదికూడ ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులు గల ఉన్నితో పేనిన దారముతో, బంగారముతో, అల్లికపనితొ తయారు చేయవలయును.

16. నలుచదరముగానున్న దానిని రెండు మడుతలుగా మడువుము. దాని పొడవు తొమ్మిది అంగుళములు, వెడల్పు తొమ్మిది అంగుళములు ఉండవలయును.

17. వక్షఃఫలకముమీద నాలుగు వరుసలలో మణులు తాపింపుము. మొదటి వరుసలో కురువిందము, పద్మరాగమణి, గరుడపచ్చ ఉండును.

18. రెండవ వరుసలో మరకతము, కెంపు, నీలమణి ఉండును.

19. మూడవ వరుసలో వజ్రము, సూర్యకాంతము, గోమేధికము ఉండును.

20. నాలుగవ వరుసలో సులేమానురాయి, చంద్రకాంతము, వైఢూర్యము ఉండును. ఈ మణులనన్నిటిని బంగారమున పొదిగింపుము.

21. ఈ పండ్రెండు మణుల మీద పండెండుమంది. యిసాయేలుకుమారుల పేరులు ఉండవలయును.

22. మణికొక తెగ చొప్పున పండ్రెండు తెగల పేరులు ఆ మణులమీద ముద్రలుగా చెక్కింపవలయును.

23. వక్షఃఫలకమునకు దారపు ముడులవంటి మెలికలుగల బంగారుగొలుసులు చేయింపుము.

24. రెండు బంగారు ఉంగరములు చేయించి వానిని వక్షః ఫలకము పైభాగములందు తగిలింపుము.

25. బంగారుగొలుసులు రెండింటిని పైరెండు ఉంగరము లకు తగిలింపుము.

26. ఆ గొలుసుల చివరికొనలు రెండు జిలుగుబంగారు జవ్వలకు తగిలించి ఆ గొలుసులు ఎఫోదు పరిశుద్ధవస్త్రము ఉపరిభాగమున నున్న భుజపాశములకు తగిలింపబడును.

27. మరియు రెండు బంగారు ఉంగరములు చేయించి వానిని ఎఫోదు పరిశుద్ద వస్త్రమునకు దాపున, వక్షఃఫలకమునకు క్రిందిభాగము లోపలివైపు తగిలింపుము.

28. ఇంకను రెండు బంగారు ఉంగరములు చేయించి ఎఫోదు పరిశుద్ధవస్త్ర భుజపాశములకు ముందు క్రిందిభాగమున తగిలింపుము. ఈ ఉంగరములు కళాత్మకమైన అల్లికపనిగల ఎఫోదు పరిశుద్ద వస్త్రపు నడికట్టుకు పైగా, దాని కూర్పునొద్ద ఉండవలయును. ఊదాదారముతో వక్షఃఫలకము ఉంగరము లను ఎఫోదు పరిశుద్ధవస్త్రపు ఉంగరములకు బిగియ గట్టవలయును. ఇట్లు చేసినయెడల వక్షఃఫలకము వదులై జారిపోక, నడికట్టుకు పైగా నిలుచును.

29. అహరోను పరిశుద్ధస్థలమున అడుగిడునపుడెల్ల తన రొమ్ముమీద నున్న వక్షఃఫలకములోని యిస్రాయేలీయుల కుమారుల పేరను అనునిత్యము యావే సన్నిధిని జ్ఞాపకార్ధముగా ధరించవలెను.

30. న్యాయవిధానమును నిర్ణయించి చెప్పు వక్షఃఫలకమున ఊరీము, తుమ్మీము పరికరములనుంచుము. అహరోను దేవుని సన్నిధికి వచ్చినపుడెల్ల ఈ పరికరములు అతని ఎదురురొమ్ముపై నుండును. అతడు దేవునిసన్నిధికి వచ్చినపుడెల్ల యిస్రాయేలీయులకు న్యాయవిధానమును నిర్ణయించి చెప్పుటకై ఆ పరికరములను రొమ్ముపై ధరించును.

31. యాజకుడు ఎఫోదు పరిశుద్ధవస్త్రము క్రింద తొడుగుకొను నిలువుటంగీని ఊదారంగు ఉన్నితో చేయింపుము.

32. దాని నడుమ తలదూర్చు రంధ్రము ఉండవలయును. ఈ రంధ్రము చుట్టు, తోలు అంగీ మెడకు కుట్టినట్లుగా, సులభముగా చినుగకుండునట్లు నేత వస్త్రమును గట్టిగా కుట్టవలయును.

33. ఈ అంగీ క్రింది అంచుచుట్టు ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో దానిమ్మపండ్లు కుట్టింపవలయును. వాని నడుమ బంగారుగజ్జెలు అమర్చవలయును.

34. ఈ రీతిగా అంగీ క్రిందిఅంచుచుట్టు దానిమ్మపండ్లు, గజ్జెలు ఒక్కొక్కటి వరుసగా వ్రేలాడుచుండును.

35. అహరోను పరిచర్య చేయునపుడెల్ల ఈ అంగీని ధరించును. అతడు గర్భగృహమున ప్రభుసన్నిధికి వెళ్ళి నపుడుగాని, అచటినుండి వెలుపలికి వచ్చినపుడు గాని ఆ గజ్జెలు మ్రోగగా, ప్రాణాపాయము తప్పి బ్రతుకును.

36. నీవు మేలిమి బంగారముతో పతకమును చేయించి దాని మీద “ప్రభువునకు నివేదితము' అను అక్షరములు చెక్కింపుము.

37. దానిని ఊదాదార ముతో తలపాగాకు ముందరి వైపు కట్టించుము.

38. అహరోను దానిని తననొసట ధరించును. ప్రజలు ప్రభువునకు అర్పించు అర్పణములలో ఏమైన దోష మున్నయెడల ఈ పతకము ఆ దోషమును హరించును. ప్రభువు ప్రజల అర్పణమువలన తృప్తి చెందుటకై అహరోను ఈ పతకమును ఎల్లప్పుడును నొసట తాల్చును.

39. అల్లిక పనియైన చొక్కాను, తలపాగాను సన్ననిదారముతో తయారు చేయింపుము. నడికట్టును అల్లికపనితో తయారు చేయింపుము.

40. అహరోను కుమారులకు చొక్కాలు, నడికట్లు, టోపీలు తయారు చేయింపుము. ఇవన్నియు వారికి గౌరవమును, శోభను కలిగించును.

41. ఈ వస్త్రములను నీ సోదరుడగు అహరోనునకు అతని కుమారులకు తొడుగుము. నీవు వారికి అభిషేకము చేయవలెను. వారిని యాజకులుగా ప్రతిష్ఠించి నా పరిచర్యకు సమర్పింపుము.

42. నడుమునుండి తొడలవరకు గల శరీరభాగమును కప్పివేయునట్లుగా వారికి నారబట్టలతో లాగులు కుట్టింపుము.

43. సాన్నిధ్యపు గుడారమున ప్రవేశించునపుడుగాని పరిశుద్ధస్థలములో పరిచర్యచేయుటకు బలిపీఠమును చేరునపుడుగాని అవి అహరోను, అతని కుమారులమీద ఉండవలయును. అప్పుడు వారు దోషమునుండి, ఆ దోషము వలన కలుగు మరణమునుండి విముక్తులగుదురు. అహరోనునకు అతని సంతతికి ఇది నిత్యనియమము.

1. నాకు యాజకులుగా సేవలు చేయుటకై అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠింపవలసిన నియమమిది. ఎట్టి అవలక్షణములును లేని ఒక కోడెను, రెండు పొట్టేళ్ళను గైకొనుము.

2. పులియని రొట్టెలను, నూనెతో చేసిన పొంగనిరొట్టెలను, నూనె రాచిన పొంగని పలుచని రొట్టెలను గైకొనుము. వీనిని గోధుమ పిండితో చేయవలెను.

3. కోడెను, పొట్టేళ్ళను కొనివచ్చునప్పుడు ఈ రొట్టెలను గూడ గంపలో పెట్టు కొనివచ్చి నాకు సమర్పింపుము.

4. అహరోనును అతని కుమారులను గుడారము గుమ్మము వద్దకు కొనిరమ్ము. వారిని నీటితో శుభ్రము చేయవలయును.

5. అంతట పవిత్రవస్త్రములను తీసికొనుము. చొక్కాను, పరిశుద్ధవస్త్రము తాల్చు నిలువుటంగీని, ఎఫోదు పరిశుద్ధవస్త్రమును, వక్షః ఫలకమును అహరోనునకు తొడుగుము. అతనికి ఎఫోదు విచిత్రమైన అల్లికగల నడికట్టు బిగింపుము.

6. అతని తలమీద తలపాగా పెట్టి పతకమును ఆ పాగాకు కట్టుము.

7. అటు తరువాత అభిషేక తైలమును కుమ్మరించి అతనికి శిరస్సున అభిషేకము చేయుము

8. ఆ పిమ్మట అతనికుమారులను కొనివచ్చి అంగీలు తొడుగుము.

9. వారికి నడికట్లు కట్టి తలల మీద టోపీలు పెట్టుము. నా నిత్యనియమమును అనుసరించి వారు నా యాజకులగుదురు. అహరోనును అతని కుమారులను ప్రతిష్ఠింపవలసిన వైనమిది.

10. ఇక కోడెను గుడారము ఎదుటికి కొనిరమ్ము. అహరోనును అతని కుమారులును దాని తలమీద తమ చేతులుంతురు.

11. గుడారము గుమ్మము నొద్ద ప్రభువు సమక్షమున కోడెను వధింపుము.

12. దాని నెత్తురు కొంత తీసికొని నీ మునివ్రేళ్ళతో బలిపీఠము కొమ్ములకు పూయుము. మిగిలిన నెత్తురునంతటిని బలిపీఠము అడుగున కుమ్మరింపుము.

13. అటు పిమ్మట కోడెప్రేగులను, కాలేయమునకు అంటియున్న క్రొవ్వును, మూత్రగ్రంథులను, వానికి అంటియున్న క్రొవ్వును తీసికొని బలిపీఠముపై నాకు సమర్పణగా దహింపుము.

14. కాని దాని మాంసమును, చర్మ మును, పేడను శిబిరము వెలుపల కాల్చివేయుము. ఇది పాపమును తొలగించు సమర్పణమగును.

15. అటుతరువాత ఒక పొట్టేలిని కొనిరమ్ము. అహరోను అతని కుమారులు దానిమీద తమ చేతులుంతురు.

16. పొట్టేలిని వధించి దాని నెత్తురును బలిపీఠము నాలుగువైపుల చల్లుము.

17. పొట్టేలిని ముక్కముక్కలుగా కోయుము. దాని ప్రేవులను, కాళ్ళనుకడిగి, వానిని దాని మాంసపు ముక్కలమీద, తలమీద పేర్చుము.

18. పిమ్మట పొట్టేలినంతటిని బలిపీఠము మీద దహింపుము. ఇది ప్రభువునకు అర్పించు దహనబలి. దాని సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును. ఇది ప్రభువు కొరకై అగ్నిచే అర్పించిన దహనబలి.

19. ఆ మీదట రెండవ పొట్టేలిని కొనిరమ్ము. అహరోను అతని కుమారులు దానిమీద తమ చేతులుంతురు.

20. పొట్టేలిని చంపి దాని నెత్తురు కొంత తీసికొని అహరోను అతని కుమారుల కుడిచెవుల కొనలమీద, వారి కుడిచేతి బొటన వ్రేళ్ళ మీద, కుడికాళ్ళ బొటన వ్రేళ్ళ మీద పూయుము. మిగిలిన నెత్తురు బలిపీఠము నలువైపుల చల్లుము.

21. బలిపీఠము మీది నెత్తురును అభిషేక తైలమును కొంత తీసికొని అహరోనుమీద అతని కుమారులమీద వారి వస్త్రములమీద చిలుకరింపుము. అతడును, అతని కుమారులును, వారి దుస్తులును ప్రభువునకు ప్రతిష్ఠితమగును.

22. పొట్టేలినుండి క్రొవ్వుగల తోకను, ప్రేవుల మీది క్రొవ్వును, కాలేయముమీది క్రొవ్వును, మూత్ర గ్రంథులను, వాని క్రొవ్వును, కుడితొడను గైకొనుము. ఇది ప్రభువునకు సమర్పించిన పొట్టేలు.

23. ప్రభువు ఎదుటనున్న పులియని రొట్టెల గంపనుండి ఒక రొట్టెను, నూనెతో చేసిన రొట్టెనొకదానిని, ఒక పలుచనిరొట్టెను గైకొనుము.

24. ఈ భక్ష్యములన్నింటిని అహరోను, అతని కుమారుల చేతులలో పెట్టి, వానిని అల్లాడింపబడు అర్పణగా ప్రభువునెదుట ఎత్తి సమర్పింపుమనుము.

25. పిమ్మట వారిచేతులనుండి ఆ భోజనపదార్థములను గైకొని బలిపీఠముమీద దహనబలిగా కాల్చి వేయుము. దాని సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును. అది ప్రభువునకు అర్పించిన దహనబలి.

26. అహరోనునకు ప్రతిష్ఠితమైన పొట్టేలి రొమ్మును తీసుకొని యావే సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా సమర్పింపుము. ఈ భాగము నీకు లభించును.

27. అహరోనును, అతనికుమారులను ప్రతిష్టించునపుడు సమర్పించిన పొట్టేలిరొమ్మును, యాజకుల కొరకై అట్టి పెట్టిన తొడనుగూడ అట్లే అల్లాడింపవలెను.

28. నా నిత్యనిబంధనము ప్రకారము ప్రతిష్టార్పణ భాగములను యిస్రాయేలు ప్రజలు అహరోనునకు, అతని కుమారులకు ఇచ్చి వేయవలయును. యిస్రాయేలు ప్రజలు వారి సమాధాన బలులనుండి యాజకులకు అర్పింపవలసిన భాగమిది. ఈ భాగమును వారు ప్రభువునకే అర్పించినట్లగును.

29. అహరోను మరణానంతరము అతని ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారులకు ఈయవలెను. అతని కుమారులు ఆ వస్త్రములతోనే అభిషేకము పొంది ప్రతిష్ఠితులగుదురు.

30. అహరోను తరువాత యాజకుడగు అతని కుమారుడు పరిశుద్ధస్థలమున పరిచర్యచేయుటకై గుడారమున ప్రవేశించునపుడు ఆ వస్త్రములను ఏడునాళ్ళపాటు ధరించును.

31. యాజకులను ప్రతిష్ఠించునపుడు సమర్పించిన పొట్టేలి మాంసము తీసికొని ఒక పవిత్రస్థలమున వండుము.

32. గుడారపు గుమ్మమునెదుట అహరోను అతని కుమారులు గంపలోని రొట్టెలను, ఆ వండిన మాంసమును భుజింతురు.

33. వారిని ప్రతిష్ఠించి ప్రభువునకు సమర్పించునపుడు ప్రాయశ్చిత్తము చేయుటకు సమర్పించినబలినే వారిచట భుజింతురు. ఇది పవిత్ర భోజనము కనుక ఇతరులు దీనిని భుజింపకూడదు.

34. భుజింపగా ఉదయమునకు మిగిలి పోయిన మాంసమును రొట్టెలను కాల్చివేయవలయును. అది పవిత్రభోజనము కనుక అన్యులెవరును దానిని భుజింపరాదు.

35. అహరోనును అతని కుమారులను నేను ఆజ్ఞాపించిన ప్రకారముగనే ప్రతిష్ఠింపుము. వారి నివేదనము ఏడునాళ్ళు సాగును.

36. ప్రతిదినము పాపపరిహారార్థము ఒక ఎద్దును పాపపరిహారబలిగా సమర్పింపుము. పాప పరిహారార్థము సమర్పించిన బలివలన బలిపీఠము మీదినుండి పాపములను తొలగింతువు. తరువాత పీఠమునకు అభిషేకము చేసి దానిని ప్రభువుకొరకు ప్రతిష్టింపుము.

37. ఏడునాళ్ళు బలిపీఠముమీది పాపములను తొలగించుటకై పాపపరిహార బలులను సమర్పించి ఆ పిమ్మట బలిపీఠమును ప్రభువుకొరకు ప్రతిష్ఠింపుము. అప్పుడు బలిపీఠము పరమపవిత్ర మగును. దానిని అంటినదెల్ల పవిత్రమగును.

38. నీవు బలిపీఠముమీద సమర్పింపవలసిన బలులివి: కలకాలము, ప్రతిరోజు ఏడాది గొఱ్ఱె పిల్లలను రెండింటిని బలిగా సమర్పింపవలయును.

39. వానిలో ఒకదానిని ఉదయము మరియొకదానిని సాయంకాలము సమర్పింపవలయును.

40. ఉదయము అర్పించు గొఱ్ఱెపిల్లతోపాటు అచ్చమైన మూడు పాత్రల ఓలివు నూనెతో కలిపిన పదియవవంతు మంచి గోధుమపిండిని గూడ అర్పింపవలయును. వానితోపాటు మూడు పాత్రల ద్రాక్షాసారాయమును గూడ పానబలిగా ధారపోయవలెను.

41. సాయంకాలము అర్పించు గొఱ్ఱెపిల్లతోపాటు ఉదయమునందువలె భోజన, పానబలులను సమర్పింపవలయును. వీని సువాసన ప్రభువునకు ప్రీతికలిగించును. ఇవి ప్రభువుకొరకై అగ్నిచే కావించిన దహనబలులు.

42. ఈ దహన బలులను అన్ని కాలములందు అన్ని తరములవారు మీతో మాట్లాడుటకు నేను సాక్షాత్కరించు గుడారము గుమ్మమునొద్ద ప్రభుడనైన నాకు సమర్పింపవలయును.

43. అచట నేను యిస్రాయేలీయులకు సాక్షాత్కరించెదను. నా సాన్నిధ్యమువలన ఆ చోటు పవిత్రమగును.

44. గుడారమును, బలిపీఠమును నేను పవిత్రము చేసెదను. నాకు యాజకులుగా పరిచర్యచేయుటకు అహరోనును అతని కుమారులను పవిత్రపరచెదను.

45. నేను యిస్రాయేలీయుల నడుమవసింతును. వారికి దేవుడనై ఉందును.

46. నేను యిస్రాయేలీయులకు ప్రభువును, దేవుడనై వారి నడుమ వసించుటకు ఐగుప్తునుండి వారిని తోడ్కొని వచ్చితినని ఆ ప్రజలు గుర్తించును. అవును, నేను వారి ప్రభుడను, దేవుడను.

1. ధూపము వేయుటకై తుమ్మ కఱ్ఱతో ఒక పీఠమును తయారుచేయుము.

2. అది చదరముగా ఉండవలయును. దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండవలయును. ఆ పీఠము కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలయును.

3. పీఠము ఉపరిభాగమును, నాలుగు అంచులను, కొమ్ములను అచ్చమైన బంగారురేకుతో పొదుగుము. దానిచుట్టు బంగారపుకట్టు గూడ ఉండ వలయును.

4. దానిని మోసికొనిపోవుటకై రెండు బంగారు కడియములను చేయించి వానిని ఆ కట్టుకు క్రింద ఇరువైపుల అమర్పుము. వానిలోనికి మోత కఱ్ఱలను దూర్చి పీఠమును మోసికొని పోవలయును.

5. ఈ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేయించి వానికి బంగారము పొదుగుము.

6. నిబంధన మందసము మీది కరుపీఠము ముందుగల తెరకు ముందట ఈ ధూపపీఠమును ఉంచుము. అక్కడ నేను నిన్ను కలిసికొందును.

7. అహరోను ప్రతిదినము ఉదయము దీపపువత్తులను ఎగద్రోయుటకు వచ్చినపుడు ఈ పీఠముపై కమ్మని సాంబ్రాణిపొగ వేయవలయును.

8. సాయంకాలము దీపములు వెలిగింపవచ్చినపుడు, అతడు పీఠముపై సాంబ్రాణి పొగ వేయవలయును. ఈ రీతిగా మీ తరములన్నింటను నిర్విరామముగా సాంబ్రాణి పొగ వేయవలయును.

9. పీఠముమీద నీవు నిషిద్దమైన సాంబ్రాణిపొగ వేయరాదు. దహించిన పశుబలినిగాని, భోజనబలినిగాని, పానీయబలినిగాని దానిమీద సమర్పింపరాదు.

10. ఏడాదికి ఒకసారి అహరోను ఆ పీఠపు కొమ్ములమీద ప్రాయశ్చిత్తము చేయవలయును, పాపపరిహారముగా సమర్పించిన పశువునెత్తురుతో అహరోను ప్రాయశ్చిత్తము జరుపవలెను. మీ తరతరములకు సంవత్సరమునకొకసారి అతడు దానికొరకు ప్రాయశ్చిత్తము చేయవలయును. ఇది ప్రభువునకు మహాపవిత్రమైనది.”

11. ప్రభువు మోషేతో “నీవు ప్రజల జనాభా వ్రాయించునపుడు ప్రతివాడు తన ప్రాణమునకుగాను ప్రభువునకు పరిహారము చెల్లింపవలయును.

12. ఇట్లు చేసినచో జనాభాలెక్క వ్రాయించినందులకు ప్రజలకు ఏ తెగులును కలుగదు.

13. జనాభాలెక్కలో చేరిన ప్రతివాడును దేవాలయపు తులామానము తూనికచొప్పున అరతులమువెండి చెల్లింపవలయును. ఇది ప్రభువునకు అర్పించు పన్ను.

14. జనాభా లెక్కలో చేరిన ప్రతివాడు, అనగా ఇరువది యేండ్లు మరియు అంతకు పైబడిన ఈడుగల వారందరును ఈ పన్ను చెల్లింపవలయును.

15. మీ ప్రాణములకు పరిహారము గాను ఈ పన్నును యావేకు చెల్లించునపుడు ధనవంతులు ఎక్కువ చెల్లింపనక్కరలేదు. పేదలు తక్కువ చెల్లింపరాదు.

16. ప్రజలనుండి ఈ సొమ్మును ప్రోగు చేసి దానిని గుడారమున కైంకర్యమునకై వినియోగింపుడు. ఈసొమ్ము యావే యిస్రాయేలీయులను స్మరించుకొనునట్లు చేయును. అది మీ ప్రాణములకు గాను చెల్లించిన సొమ్ము” అనెను.

17. ప్రభువు మోషేతో “నీవు ఇత్తడి గంగాళ మును, దానికి ఇత్తడిపీటను చేయింపుము.

18. దానిని నీళ్ళతోనింపి గుడారమునకు, బలిపీఠమునకు మధ్య ఉంచుము.

19. అహరోను అతని కుమారులు దానిలోని నీటితో కాలుసేతులు కడుగుకొందురు.

20. ప్రత్యక్షపు గుడారమున అడుగిడునపుడుగాని, బలిపీఠము మీద అగ్నితో దహనబలులు అర్పించునపుడుగాని ఈ గంగాళములోని నీళ్ళతో కాలుసేతులు కడుగుకొందురేని వారికి ప్రాణహాని కలుగదు.

21. కనుక ప్రాణహాని కలుగకుండవలెనన్న వారు ఈ నీటితో కాలుసేతులు కడుగుకొనవలెను. ఇది యిస్రాయేలీయులు తరతరములవరకు శాశ్వతముగా పాటింప వలసిన నియయము” అని చెప్పెను.

22. ప్రభువు మోషేతో “నీవు మంచి సుగంధ ద్రవ్యములు తీసికొనుము.

23. ఐదువందల తులముల పరిమళద్రవ్యము, రెండువందలయేబది తులముల లవంగిపట్ట, రెండువందలయేబది తులముల నిమ్మగడ్డి, ఐదువందలతులముల మొద్దు లవంగిపట్టను తీసికొనుము.

24. ఈ దినుసులన్నియు దేవాలయపు తులామానము తూకమునకు సరిపోవలయును. ఐదువందల దేవాలయ ప్రామాణిక షెకెల్ ల   ఓలివు నూనె గూడ వానికి చేర్పుము.

25. వీనినన్నిటిని కలిపి సుగంధ ద్రవ్యకారులు తయారు చేసినట్లుగనే సుగంధ తైలమును సిద్ధముచేయుడు. ఇది పవిత్రమైన సుగంధితైలము.

26. దీనితో నీవు సాన్నిధ్యపుగుడారమును, నిబంధనమందసమును,

27. బల్లను, దాని పరికరములను, దీపస్తంభమును, దాని పరికరములను, ధూప పీఠమును

28. దహనబలులు అర్పించు బలిపీఠమును, దాని ఉపకరణములను, గంగాళమును, దానిపీటను అభిషేకింపుము.

29. ఈ రీతిగా నీవు ఈ వస్తువులను ప్రభువునకు నివేదింపుము. అవి మహాపవిత్ర వస్తువులగును. వానిని తాకిన వస్తువులు కూడ పవిత్రమగును.

30. అహరోనును అతని కుమారులనుగూడ ఈ సుగంధతైలముతో అభిషేకించి నాకు నివేదింపుము. అపుడు వారు నాకు కైంకర్యముచేయు యాజకులు అగుదురు.

31. నీవు యిస్రాయేలీయులతో “మీ తరములన్నింటను అభిషేకమునకైవాడు ఈ సుగంధతైలము మహాపవిత్రమైనదిగా ఉండవలయును.

32. దానితో సామాన్య జనమును అభిషేకింపరాదు దానితో మరియొక సుగంధతైలమును తయారు చేయరాదు. అది పవిత్రమైనది గనుక మీరు దానిని పవిత్రవస్తువుగనే భావింపవలయును.

33. ఈ సుగంధ తైలమువంటి తైలమును తయారుచేయు వారును, యాజకులు కానివారిని దీనితో అభిషేకము చేయువారును సమాజమునుండి వెలివేయబడుదురు' అని చెప్పుము” అనెను.

34. ప్రభువు మోషేతో “నీవు జటామాంసి, గోపీచందనము, గంధము, సుగంధ ద్రవ్యములు, అచ్చమైన సాంబ్రాణి, జిగురు సమపాళ్ళలో తీసికొని

35. సుగంధి ద్రవ్యకారులు చేయు రీతిగనే సాంబ్రాణిని తయారుచేయుము. దానిలో ఉప్పు కలుపవలయును. అది నిర్మలముగను, పవిత్రముగను ఉండవలయును.

36. దానిలో కొంతభాగమును మెత్తగా నలుగగొట్టి, పిండిచేసి ఆ పిండిలో కొంతభాగమును గుడారమున నిబంధన మందసమునెదుట నేను నిన్ను కలిసికొను తావున ఉంచుము. ఈ సాంబ్రాణి పరమపవిత్రమైనది.

37. మీ ఉపయోగార్థము ఇదే పాళ్ళతో మరియొక సాంబ్రాణిని తయారు చేసికొనరాదు. ఇది ప్రభువునకు అర్పించిన పవిత్రమైన సాంబ్రాణి.

38. ఈ సాంబ్రాణి వంటి సుగంధ ద్రవ్యములను తయారు చేయువాడు సమాజమునుండి వెలివేయబడును” అని చెప్పెను.

1-2. ప్రభువు మోషేతో “నేను యూదా తెగకు చెందిన హురు మనుమడును, ఊరి కుమారుడగు బేసలేలును ఎన్నుకొంటిని.

3. నేను అతనిని దైవాత్మతో నింపితిని. కనుక అతనికి సుందరమైన వస్తువులను చేయునేర్పు, సామర్థ్యము, తెలివితేటలు లభించును.

4. అతడు సుందరమైన వస్తువుల నమూనాలను తయారు చేసికొని వానిని బంగారముతో, వెండితో. ఇత్తడితో రూపొందింపగలడు.

5. రత్నములను సాన పెట్టి బంగారమున పొదుగగలడు. కొయ్యపై బొమ్మలు చెక్కగలడు. ఈ రీతిగా సుందర వస్తువులన్నిటిని తయారుచేయగలడు.

6. దానుతెగకు చెందిన అహీసామాకు కుమారుడగు ఒహోలియాబు బేసలేలునకు తోడైయుండును. మిగిలిన పనివాండ్రకందరికి నా జ్ఞానమును ప్రసాదించితిని. కనుక నేను నీకు ఆజ్ఞాపించిన వస్తువులన్నిటిని వారు సిద్ధముచేయగలరు.

7. సమావేశపుగుడారము, నిబంధన మందసము - దానిమీది కరుణాపీఠము, గుడారపు ఉపకరణములు,

8. బల్ల - దాని ఉపకరణములు, బంగారపు దీపస్తంభము - దాని ఉపకరణములు, ధూపపీఠము,

9. దహన బలులు అర్పించు బలిపీఠము - దాని ఉపకరణములు,

10. ప్రక్షాళనపు గంగాళము - దాని పీట, యాజకుడగు అహరోను, అతని కుమారులు యాజకపరిచర్య చేయునపుడు ధరించవలసిన వస్త్రములు - యాజకుడైన అహరోను యొక్క అమూల్య పరిశుద్ధ వస్త్రములు, అతని కుమారుల వస్త్రములు,

11. అభిషేక తైలము, పరిశుద్ధ స్థలమున వాడు పరిమళపు సాంబ్రాణి మొదలగు. వస్తువులన్నిటిని వారు తయారుచేయుదురు. నేను నిన్ను ఆజ్ఞాపించిన పద్ధతిలోనే వారు ఈ వస్తువులన్నింటిని తయారుచేయవలెను” అనెను.

12. ప్రభువు మోషేతో “యిస్రాయేలీయులను ఇట్లు ఆజ్ఞాపింపుము.

13. 'మీరు నేను నియమించిన విశ్రాంతిదినమును పాటింపవలయును. ప్రభుడనైన నేను మిమ్ము నా ప్రజలుగా చేసికొంటిని అనుటకు ఈ విశ్రాంతిదినము నాకును, మీకును మీ తరతరముల వారికిని మధ్య గుర్తుగా నుండును.

14. కనుక మీరు విశ్రాంతిదినమును పాటింపవలయును. అది మీకు పవిత్రమైనది. దానిని పవిత్రముగా ఎంచని వారందరికి మరణశిక్ష విధింపవలయును. విశ్రాంతి దినమున పనిచేయువారిని సమాజమునుండి వెలి వేయవలయును.

15. మీరు ఆరురోజులు పని చేసికొనవచ్చును. కాని ఏడవరోజు విశ్రాంతిదినము. అది ప్రభువునకు పవిత్రమైనది. ఆ దినమున పనిచేయు వాడు మరణమునకు పాత్రుడగును.

16. యిస్రాయేలీయులు తరతరములవరకు విశ్రాంతిదినమును నిత్యనియమముగా పాటింపవలెను.

17. నాకును యిస్రాయేలీయులకును మధ్య ఈ విశ్రాంతిదినము శాశ్వతచిహ్నముగా ఉండును. ప్రభుడనైన నేను ఆరు రోజులలో భూమ్యాకాశములను సృజించి ఏడవ నాడు పని చాలించి విశ్రమించితిని” అని చెప్పెను.

18. ఈ రీతిగా ప్రభువు సీనాయికొండమీద మోషేతో సంభాషించుట చాలించిన పిదప అతనికి రెండు నిబంధన పలకలను ఇచ్చెను. అవి ప్రభువు స్వయముగా తనవ్రేలితో వ్రాసి యిచ్చిన రాతిపలకలు.

1. మోషే కొండమీద జాగుచేయుట యిస్రాయేలీయులు చూచినపుడు, వారు అహరోను కడకువచ్చి “లెమ్ము! మమ్ము నడిపించుటకు ఒక క్రొత్తదేవరను చేసి పెట్టుము. మమ్ము ఐగుప్తునుండి నడిపించుకొని వచ్చిన ఆ మోషే యున్నాడే, అతనికి ఏమాయెనో మాకు తెలియదు” అనిరి.

2. అహరోను వారితో “మీ భార్యలు, కొడుకులు, కుమార్తెలు ధరించు బంగారు చెవిపోగులను ప్రోగుచేసికొని నా వద్దకు రండు” అనెను.

3. కనుక ప్రజలందరు తమ చెవిపోగులను అహరోను కడకు కొనివచ్చిరి.

4. అతడు ఆ పోగులను కరిగించి మూసలో పోసి దూడను తయారుచేసెను. దానినిచూచి ప్రజలు ఉత్సాహముతో “యిస్రాయేలూ! నిన్ను ఐగుప్తునుండి నడిపించుకొని వచ్చిన దేవర ఇతడే” అని అరచిరి.

5. ప్రజల కోరిక నెరిగి అహరోను ఆ బంగారు దూడ ముందట ఒక బలిపీఠమును నిర్మించెను. అతడు “రేపు ప్రభువు పేరిట పండుగ జరుపుకొందము” అని జనులతో చెప్పెను.

6. ఆ ప్రజలు మరునాడు వేకువనే దహన బలులు, సమాధానబలులు అర్పించిరి. అంతట వారు తినిత్రాగి ఆటపాటలకు పూనుకొనిరి.

7. ప్రభువు మోషేతో “నీవు కొండదిగి క్రిందికి పొమ్ము. నీవు ఐగుప్తునుండి నడిపించుకొని వచ్చిన నీ ప్రజలు భ్రష్టులైరి.

8. వారు కన్నుమూసి తెరచునంతలో నా ఆజ్ఞమీరిరి. పోతదూడను ఒకదానిని తయారుచేసికొని దానిని బలులతో ఆరాధించిరి. యిస్రాయేలూ! ఐగుప్తునుండి మిమ్ము తోడ్కొనివచ్చిన దేవర ఇతడేయని పలికిరి.

9. ఈ ప్రజలతీరు నాకు తెలియును. వీరికి తలబిరుసు ఎక్కువ.

10. నీవు నాకు అడ్డురావలదు. నా కోపము గనగనమండి వారిని బుగ్గిచేయును. కాని నీ నుండి నేనొక మహా జాతిని పుట్టింతును” అనెను.

11. కాని మోషే తన ప్రభువైన దేవునికి మొర పెట్టి “ప్రభూ! నీ కోపాగ్ని ఈ ప్రజలమీద రగుల్కొన నేల? నీవు మహాశక్తివలన, బాహుబలము వలన ఈ ప్రజలను ఐగుప్తునుండి తరలించుకొని రాలేదా?

12. 'యావే యిస్రాయేలీయులను ఐగుప్తునుండి తరలించు కొనివచ్చినది, మోసముతో వారిని కొండలలో మట్టు పెట్టి అడపొడ కానరాకుండ చేయుటకేగదా అని ఐగుప్తీయులు ఆడిపోసికోరా?' కనుక నీ కోపాగ్నిని అరికట్టుము. ఈ ప్రజలను నాశనము చేయవలయునను తలంపు వీడుము.

13. నీ సేవకులు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? 'నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రములవలె లెక్కకందకుండునట్లు చేసెదను. నేను మాటయిచ్చినట్లే ఈ నేలనంతటిని మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వతముగ భుక్తమగును అని నీ పేరు మీదుగనే నీవు వాగ్ధానము చేయలేదా!” ” అని మనవిచేసెను.

14. కనుక ప్రభువు తన తలంపు మార్చుకొనెను. అతడు యిస్రాయేలీయులకు తలపెట్టిన కీడు విరమించుకొనెను.

15. మోషే కొండ దిగివచ్చెను. ఇరువైపుల వ్రాసిన శాసనముల సాక్ష్యపుపలకలు రెండు అతని చేతిలోనుండెను.

16. ఆ పలకలు దేవుడు చేసినవి. వానిమీద చెక్కిన వ్రాత దేవునివ్రాత.

17. యెహోషువ కొండక్రింద ప్రజలు కేకలు వేయుట విని మోషేతో “మన శిబిరమునుండి ఏదో యుద్ధనాదము వినిపించుచున్నది” అనెను.

18. కాని మోషే అతనితో “ఆ నాదము గెలిచినవారి విజయగీతమును కాదు, ఓడిపోయినవారి శోకగీతమును కాదు, అది పాటలుపాడువారి సంగీతనాదము” అని అనెను.

19. మోషే శిబిరమును సమీపించి బంగారు దూడను దానిచుట్టు నాట్యమాడు ప్రజలను చూచి కోపముతో మండిపోయెను. అతడు తన చేతిలోని పలకలను కొండ దిగువున విసరికొట్టి ముక్కముక్కలుగా పగులగొట్టెను.

20. వారు చేసిన బంగారుదూడను అగ్నిలో కాల్చి పిండిచేసెను. ఆ పిండిని నీళ్ళమీద చల్లి యిస్రాయేలీయులచే ఆ నీటిని త్రాగించెను.

21. అతడు అహరోనుతో “ఈ ప్రజలు నీకేమి చేసిరని వీరిచేత ఇంత మహాపాపము చేయించితివి?” అనెను.

22. అహరోను మోషేతో "అయ్యా! నామీద కోపపడ వలదు. ఈ ప్రజలు ఎంతటి దుర్మార్గులో నీకు తెలియును.

23. వీరు నాతో 'మమ్ము నడిపించుటకు మాకొక దేవరను తయారుచేయుము. మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ఆ మోషేయున్నాడే, అతని కేమాయెనో మాకు తెలియదు' అనిరి.

24. నేను వారితో 'బంగారము కలవారు దానిని నాయొద్దకు తీసికొనిరండు' అని అంటిని. వారు తమ బంగారమును తీసికొనివచ్చిరి. నేను ఆ బంగారమును అగ్నిలో పడవేయగా ఈ దూడ బయల్వెడలినది” అని చెప్పెను.

25. మోషే ప్రజలను పరికించి చూడగా వారు కట్టుబాటులో లేరని తెలియవచ్చెను. ఎందుకనగా చుట్టుపట్లనున్న శత్రువుల వలన యిస్రాయేలీయులకు నగుబాట్లు వచ్చునని తెలిసికూడ అహరోను వారిని విగ్రహారాధనకు నడిపెను.

26. కనుక మోషే శిబిర ద్వారమువద్ద నిలుచుండి “ప్రభువు పక్షమును అవలంబించు వారెవరో నాయొద్దకు రండు” అని కేక పెట్టెను. వెంటనే లేవీయులందరు అతనిచుట్టు గుమిగూడిరి.

27. మోషే వారితో “యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఆజ్ఞయిది. మీలో ప్రతివాడు తన కత్తిని నడుమునకు కట్టుకుని శిబిరములో ద్వారము నుండి ద్వారమునకు కదలిపొండు. మీ మీ సోదరులను, చెలికానిని, ఇరుగుపొరుగువారిని చంపివేయుడు” అనెను.

28. లేవీయులు మోషే ఆజ్ఞాపించినట్లే చేసిరి. నాడు యిస్రాయేలులలో మూడువేల మంది చచ్చిరి.

29. మోషే వారితో “మీ కుమారులను సోదరులను చంపి ఈనాడు మిమ్మును మీరే ప్రభువు కైంకర్యమునకై యాజకులనుగా సమర్పించుకొంటిరి. కనుక నేడు మీకు ప్రభువు దీవెన లభించును” అనెను.

30. మరునాడు మోషే ప్రజలతో “మీరు మహా పాతకమునకు ఒడిగట్టితిరి. నేను కొండమీదికెక్కి ప్రభువును కలిసికొందును. ఒకవేళ నేను మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో చూతము” అనెను.

31. అతడు ప్రభువును సమీపించి “ప్రభూ! ఈ ప్రజలు ఘోరపాపము చేసితిరి. వారు బంగారముతో ఒక దేవరను చేసికొనిరి.

32. అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము. అటుల మన్నింపవేని నీవు వ్రాసిన గ్రంథమునుండి నా పేరు కొట్టివేయుము” అని మనవిచేసెను.

33. ప్రభువు అతనితో “పాపము చేసినవాని పేరునే నా గ్రంథమునుండి తొలగింతును.

34. ఇక నీవు వెళ్ళి నేను చెప్పిన తావునకు ఈ ప్రజలను తోడ్కొనిపొమ్ము. నా దూత మిమ్ము నడిపించును. కాని నేను శిక్షవిధించు సమయము వచ్చినపుడు ఆప్రజలను వారి పాపమునకు తగినట్లుగా దండించితీరెదను” అనెను.

35. ప్రజలు అహరోనుచేత దూడను చేయించుకొనిరి. కనుక ప్రభువు వారిని రోగములపాలు చేసెను.

1. ప్రభువు మోషేతో "నీవు ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన ఈ ప్రజలతో కదలిపొమ్ము. నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులతో వారి సంతతి వారికి యిచ్చెదనని మాటయిచ్చిన భూమికి వారిని నడిపించుకొనిపొమ్ము.

2. నేను నీకు ముందుగా నా దూతనుపంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులును, పెరిస్సీయులను, హివ్వీయులును, యెబూసీయులను అక్కడినుండి వెడలగొట్టింతును.

3. మీరు పాలు తేనెలు జాలువారు నేలను చేరుకొందురు. కాని నేను మీతో రాను. మీరు తలబిరుసుగల జనులు గనుక నేను కోపించి దారిలోనే మిమ్ము నాశము చేయుదునేమో!” అని పలికెను.

4. ఆ కఠిన మాటలకు ప్రజలు మిగులచింతించి ఆభరణములు తాల్చుటగూడ మానివేసిరి.

5. ప్రభువు మోషేతో “నీవు యిస్రాయేలీయులతో ఇట్లు నుడువుము: మీకు తలబిరుసెక్కువ. నేను కొద్దికాలముపాటే మీతో పయనించినను మిమ్ము వేరంట పెకలించివేయుట నిక్కము. ఇపుడు మీ ఆభరణములు తీసివేయుడు. ఆ మీదట మిమ్ము ఏమి చేయవలయునో నిర్ణయింతును” అని చెప్పెను.

6. కనుక హోరెబు కొండనుండి యిస్రాయేలీయులు తమ ప్రయాణమున ఆభరణములు పెట్టుకొనలేదు,

7. మోషే గుడారమును తీసికొని వెళ్ళి శిబిరమునకు కొంచెము దూరమున పన్ని, అతడు దానికి సమావేశపు గుడారము' అని పేరిడెను. ప్రభువును సంప్రతింపదలచుకొన్నవారు పాళెమునకు వెలుపల నున్న ఆ గుడారమునకు వెళ్ళెడివారు.

8. మోషే గుడారమునకు పోవునపుడెల్ల యిస్రాయేలీయులందరు లేచి తమ తమ గుడారపు గుమ్మముల ముందట నిలుచుండెడివారు. మోషే సమావేశపు గుడారము ప్రవేశించువరకు రెప్పవాల్పకుండ అతని వైపు చూచు చుండెడివారు.

9. అతడు గుడారమున అడుగిడగనే మేఘస్తంభము దిగివచ్చి గుడారపు గుమ్మమున నిలి చెడిది. ప్రభువు మోషేతో మాట్లాడెడివాడు.

10. సమావేశపుగుడారపు గుమ్మమువద్ద మేఘము కనిపింపగనే యిస్రాయేలీయులందరు లేచి నిలుచుండి తమతమ గుడారముల ద్వారమునుండియే వంగి దండము పెట్టెడివారు.

11. నరుడు తన మిత్రునితో సంభాషించునట్లే ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించెడివాడు. తరువాత మోషే శిబిరమునకు మరలి వచ్చెడివాడు. కాని అతని సేవకుడును నూను కుమారుడును, యువకుడైన యెహోషువ మాత్రము గుడారమును వీడివచ్చెడివాడుకాడు. -

12. మోషే ప్రభువుతో “నీవు నన్ను ఈ ప్రజను నడిపించుకొని పొమ్మనుచున్నావు కాని నీవు నాతో ఎవరిని పంపుదువో తెలుపవైతివి. అయినను నీవు నాతో - 'నేను నిన్ను నీ పేరుతో బాగుగా ఎరుగుదును. నీవు నా అనుగ్రహమునకు పాత్రుడవైతివి', అని పలికితివి.

13. నీవు చెప్పినట్లే నేను నీ దయకు నోచుకొంటినేని, ఈ ప్రజకు నీవేమి చేయగోరెదవో ముందుగనే తెలియజెప్పుము. అప్పుడు నేను నిన్ను అర్ధము చేసికొందును. నీ మన్ననకు పాత్రుడనగుదును. ఈ ప్రజలు గూడ నీవారేగదా!” అనెను.

14. అందులకు ప్రత్యుత్తరముగా ప్రభువు అతనితో “నా సాన్నిధ్యము నీ వెంటవచ్చును. నేను నీకు విశ్రాంతిని ప్రసాదింతును” అనెను.

15. అంతట మోషే “నీ సాన్నిధ్యము నావెంటరాదేని, మమ్ము ఈ తావునువీడి వెళ్ళనీయకుము.

16. నీవు మావెంట రావేని, నేను, ఈ ప్రజ నీ ఆదరమునకు పాత్రులమైతిమని ఎట్లు వెల్లడిఅగును? నీవు మాతో ఉందువేని అపుడు నేనును, ఈ ప్రజలును ఈ ప్రపంచములోని సకలజాతివారికంటెను ధన్యులముగా గణింపబడుదుము” అనెను.

17. ప్రభువు అతనితో “నేను నీవు కోరినట్లే చేయుదును. నీవు నా కటాక్షమునకు నోచుకొంటివి. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును” అనెను.

18. మోషే ప్రభువుతో "దయచేసి నీ తేజస్సును చూడనిమ్ము” అని అడిగెను.

19. ప్రభువు అతనితో “నా మంచితనమంతయు నీ యెదుట సాగిపోనిత్తును. 'యావే' అను నా నామమును నీ ఎదుట ఉచ్చరింతును. నేను నా ఇష్టము వచ్చిన వారిని కటాక్షింతును ఎవనియందు కనికరపడెదనో వానిని కనికరింతును” అని పలికెను.

20. మరియు ప్రభువు అతనితో “కాని నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్నుచూచి బ్రతుకజాలడు.

21.ఇదిగో! ఇట నా ప్రక్క ఒక స్థలమున్నది. నీవు ఈ తావున బండమీదికెక్కి నిలుచుండుము.

22. నా తేజస్సు నీ ముందట సాగిపోవునపుడు నిన్ను ఈ బండనెరియలో దాచి యుంచి, నిన్నుదాటి సాగిపోవువరకు నిన్ను నాచేతితో కప్పియుంతును.

23. అటు తరువాత నా చేతిని తొలగింతును. నీవు నా ముఖమును దర్శింపజాలవు. నా వెనుకతట్టు మాత్రము కనుగొందువు” అని చెప్పెను.

1. ప్రభువు మోషేతో “నీవు మొదటి పలకల వంటి రెండు రాతిపలకలను చెక్కుము. మొదటి పలకలమీద వ్రాసిన ఆజ్ఞలను మరల వానిమీద వ్రాసెదను. నీవు ఆ తొలిపలకలను పగులగొట్టితివి గదా!

2. నీవు సంసిద్ధుడవై రేపటి ఉదయముననే కొండమీదికి రమ్ము. కొండపైన నన్ను కలిసికొనుము.

3. నీతో మరెవ్వరును కొండయెక్కి రాగూడదు. అసలు కొండమీద ఎవరును కనిపింపగూడదు. గొఱ్ఱెల మందలుగాని, పశువుల మందలుగాని కొండ ఎదుట మేయరాదు” అని చెప్పెను.

4. కనుక మోషే మొదటి పలకల వంటి రాతిపలకలను రెండింటిని తయారు చేసెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగనే వానిని తీసికొని మరునాటి ఉదయమున పెందలకడనే కొండమీదికి ఎక్కిపోయెను.

5. ప్రభువు మేఘమునుండి దిగి వచ్చి మోషే యెదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను.

6. ప్రభువు మోషేకు ముందుగా సాగిపోవుచు ఇట్లు ప్రకటించెను. “ప్రభువు! ప్రభువు! ఆయన కరుణామయుడు దయాపరుడునైన దేవుడు. సులభముగా కోపపడువాడుకాడు. నిత్యము ప్రేమ చూపు వాడు, నమ్మదగినవాడు.

7. ఆయన వేవేలమందికి కృపను చూపుచు దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు. అయినను ఆయన నరుల పాపమును సహింపడు. తండ్రుల పాపమునకు కుమారులను, ఆ కుమారుల కుమారులను మూడు నాలుగు తరముల వరకు శిక్షించును.”

8. ఆ మాటలు వినినవెంటనే మోషే నేలకు తలవంచి నమస్కరించెను.

9. అతడు “ప్రభూ! నీకు నా యెడల కటాక్షము కలదేని నీవునాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు! నిజమే. అయినను నీవు మా దోషములను పాపము లను మన్నింపుము. మమ్ము నీ ప్రజగా స్వీకరింపుము” అని మనవిచేసెను.

10. ప్రభువు మోషేతో “నేను మీతో నిబంధనము చేసికొందును. ఈ ప్రపంచమున ఎప్పుడును, ఏ జాతియు కనివిని ఎరుగని మహాద్భుతములు నేను మీ అందరి ఎదుట చేయుదును. నీతోనున్న ఈ ప్రజలెల్లరు ప్రభువు కార్యములను చూచెదరు. నేను మీ ఎదుట చేయునది భీకరమైనది.

11. నేడు నేను మీకిచ్చిన కట్టడలు పాటింపుడు. నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, ఫిలిస్తీయులను, హివ్వీయులను, యెబూసీయులను మీ ఎదుటినుండి తరిమివేయుదును.

12. మీరు ప్రవేశించు దేశము నందలి ప్రజలతో పొత్తు కుదుర్చుకొనకుడు. అటుల పొత్తు కుదుర్చుకొందురేని మీరు వారి ప్రలోభములకు చిక్కుకొందురు.

13. పైపెచ్చు మీరు వారి బలిపీఠములను కూలద్రోయవలయును. వారి విగ్రహములను నాశనముచేసి వారి పవిత్ర కొయ్యస్తంభములను నరికి వేయవలయును.

14. మీరు ఏ అన్యదైవములను ఆరాధింపరాదు. మీ ప్రభువు పేరు 'ఈర్ష్య.' అవును, ఆయన అసూయాపరుడైన దేవుడు.

15. మీకు ఆ దేశవాసులతో పొత్తు పనికిరాదు. ఏలయన ఆప్రజలు వ్యభిచారులవలె తమ దేవతలను ఆరాధించి వారికి బలులు అర్పించునపుడు మిమ్మును ఆహ్వానింపగా మీరును వెళ్ళి వారు అర్పించిన బలులను భుజింతురు.

16. మీరు వారి ఆడుపడుచులను మీ కుమారులకు పెండ్లి చేయగా, ఆ స్త్రీలు తమదేవతలను ఆరాధించునపుడు మీ కుమారులనుగూడ విగ్రహారాధనకు పురికొల్పుదురు.

17. మీరు పోతపోసిన దేవరలను తయారు చేసికొనరాదు.

18. మీరు పొంగనిరొట్టెల పండుగను చేసికొనవలయును. నేను మిమ్ము ఆజ్ఞాపించినట్లు అబీబు మాసమున ఏడునాళ్ళు పొంగనిరొట్టెలు భుజింపవలయును. మీరు ఆ నెలలోనే ఐగుప్తునుండి వెడలి వచ్చితిరి గదా!

19. నరులకుగాని, పశువులకుగాని మొదట పుట్టిన పిల్లలు నాకు చెందవలయును. ప్రతి మొదటి మగబిడ్డయు, పశువుల మందలు, గొఱ్ఱెలమందలు పెట్టిన ప్రతి మొదటి మగదియు నాకు చెందును.

20. గాడిద తొలిపిల్లకు మారుగా గొఱ్ఱపిల్లను అర్పించి ఆ గాడిదపిల్లను విడిపించుకొనవచ్చును, అటుల విడిపింపలేని ఆ గాడిదపిల్ల మెడ విరిచివేయవలయును. మీ తొలిచూలు మగబిడ్డలను గూడ విడిపించు కోవలెను. వట్టి చేతులతో ఎవరును నా సన్నిధికి రాగూడదు.

21. మీరు ఆరునాళ్ళు పనిచేసి ఏడవనాడు విశ్రాంతి తీసికొనుడు. దుక్కులుదున్ను కాలమునందైనను, కోతలుకోయు కాలమునందైనను ఈ నియమమును పాటింపవలయును.

22. మీరు వారములపండుగ అనగా గోధుమ పంట తొలివెన్నులను అర్పించుపండుగను, ఏడాది చివరవచ్చు పంటకూర్చుపండుగను జరుపుకొన వలయును.

23. మీలో మగవారందరును ఏడాదికి మూడు మారులు యిస్రాయేలు దేవుడను, ప్రభుడనైన నా సన్నిధికి రావలయును.

24. నేను మీ శత్రువులను మీ చెంతనుండి తరిమివేయుదును. మీ దేశమును విశాలము చేయుదును. అటుపిమ్మట మీరు ఏటేట మూడుమారులు మీ దేవుడైన ప్రభువు ఎదుట మీరు కనపడబోవునపుడు మీ భూమిని ఎవడును ఆశింపడు.

25. మీరు నాకు పశుబలులు అర్పించునపుడు పొంగిన రొట్టెలు కొనిరాగూడదు. పాస్కపండుగనాడు వధించిన పశువుమాంసమును మరునాటి ఉదయము వరకు అట్టిపెట్టికోకూడదు.

26. మీ భూమియొక్క ప్రథమఫలములలో మొదటివి నీ దేవుడైన ప్రభువు మందిరమునకు కొనిరావలయును. మేకపిల్లను దాని తల్లిపాలలో ఉడుకబెట్టరాదు.”

27. దేవుడైన యావే మోషేతో “నా మాటలను వ్రాయుము. ఈ మాటల ద్వారా నేను నీతోను, యిస్రాయేలీయులతోను నిబంధన చేసికొనుచున్నాను” అనెను.

28. మోషే ప్రభువుతో నలువది పగళ్ళు నలువది రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయము లేవియును ముట్టుకొనలేదు. అతడు పలకమీద నిబంధనవాక్యములు, అనగా పదియాజ్ఞలను వ్రాసెను.

29. మోషే శాసనములుగల రెండు పలకలను గైకొని సీనాయి కొండమీదినుండి దిగివచ్చినపుడు యావేతో మాట్లాడి వచ్చుటవలన అతని ముఖము ప్రకాశించుచుండెను. కాని అతడు దానిని గుర్తింపనే లేదు.

30. అహరోను యిస్రాయేలు ప్రజలు మోషేవైపు చూడగా అతనిముఖము మిలమిల మెరయుచుండెను. కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి.

31. కాని మోషే పిలువగా అహరోను యిస్రాయేలు నాయకులు అతని చెంతకు వచ్చిరి. మోషే వారితో సంభాషించెను.

32. తరువాత యిస్రాయేలీయులందరు మోషే ఎదుటకు వచ్చిరి. ప్రభువు సీనాయి కొండమీద తనకు విన్పించిన ఆజ్ఞలను అన్నిటిని అతడు ప్రజలకు ఎరిగించెను.

33. మోషే వారితో మాట్లాడుట చాలించిన తరువాత తన ముఖముమీద ముసుగు వేసికొనెను.

34. అతడు యావే సన్నిధిన మాట్లాడుటకు వెళ్ళునపుడెల్ల అటనుండి తిరిగి వచ్చు వరకు ముఖముమీది ముసుగును తొలగించెడి వాడు. తిరిగివచ్చిన పిదప ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను యిస్రాయేలీయులకు తెలియజెప్పెడివాడు.

35. యిస్రాయేలీయులు మోషే ముఖము ప్రకాశించు చుండుటను గమనించెడివారు. అతడు మరల ప్రభువు సన్నిధికి వెళ్ళువరకు ముఖమును ముసుగుతో కప్పు కొనెడివాడు.

1. మోషే యిస్రాయేలీయులందరిని ప్రోగుచేసి “యావే మీకు ఆనతిచ్చినకట్టడలివి.

2. మీరు ఆరునాళ్ళు పనిచేసికోవచ్చును. కాని ఏడవనాడు పవిత్రదినము. అది ప్రభువునకు అంకితమయిన విశ్రాంతిదినము. ఆ దినమున ఎవ్వరైనను ఏదైనను పనిచేసినచో మరణమునకు పాత్రులగుదురు.

3. విశ్రాంతిదినమున ఇండ్లలో నిప్పుగూడ రగిలింపరాదు” అని చెప్పెను.

4. మోషే యిస్రాయేలు సమాజముతో ఇట్లనెను: “ప్రభువు ఆజ్ఞ ఇది.

5. మీరు ప్రభువునకు కానుకలు అర్పింపవలయును. ప్రతియొక్కడు హృదయపూర్వకముగా కానుకలను సమర్పింపవలయును. అవి: బంగారము, వెండి, ఇత్తడి లోహములును,

6-9. ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్నిని కొని రండు. 'సన్నని నారబట్టలును, మేకవెంట్రుకలతో నేసినబట్టలును, ఎఱ్ఱని అద్దకము వేసిన పొట్టెలు చర్మములును, నాణ్యమైన గట్టితోళ్ళను, తుమ్మకఱ్ఱ, దీపతైలమును, అభిషేక సుగంధ తైలమును, సువాసనగల సాంబ్రాణిని తయారుచేయుటకు వలసిన సుగంధ ద్రవ్యములను, లేతపచ్చలను, ఎఫోదు పరిశుద్ధ వస్త్రమునకు, వక్షఃఫలకమునకు పొదుగవలసిన మణులను కొనిరండు.

10-19. మీలో నేర్పుగల పనివారందరును ప్రభువు ఆజ్ఞాపించిన పనులు చేయరండు. గుడారమును, దాని డేరాను, కప్పడమును, కొక్కెములను, చట్రములను, బద్దెలను, అడ్డకఱ్ఱలను, స్తంభములను, వాని క్రింది దిమ్మలను, మందసమును దాని మోత కఱ్ఱలను, మందసముమీది కరుణాపీఠమును, వానిని కప్పియుంచు తెరను, రొట్టెలనుంచు బల్లను, దానిని మోయు మోతకఱ్ఱలను, దాని ఉపకరణములను, సన్నిధి రొట్టెలను, వెలుతురునిచ్చు దీపస్తంభమును, దాని పరికరములను, దాని దివ్వెలను, వానికి వాడెడి చమురును, ధూపమును అర్పించు పీఠమును, దానిని మోయు మోతకఱ్ఱలను, అభిషేకతైలమును సువాసన గల సాంబ్రాణిని, గుడారపు ప్రవేశమున నున్న తెరను, దహనబలులు అర్పించు బలిపీఠమును, దాని చుట్టు నున్న ఇత్తడి జల్లెడను, ఆ పీఠము మోయు మోత దాని పరికరములను, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలను, ఆవరణపు స్తంభములను, వాని దిమ్మలను, ఆవరణ ప్రవేశముననున్న తెరను, గుడారము మరియు ఆవరణములందలి తెరల మేకులను, మోకులను, పరిశుద్ధ స్థలమున కైంకర్యము చేయు యాజకుల అమూల్యమైన వస్త్రములను, అనగా యాజకుడగు అహరోనునకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకు వలసిన వస్త్రములను తయారు చేయరండు” అని చెప్పెను.

20. ఆ మాటలు ఆలించి యిస్రాయేలు ప్రజలు అందరు మోషే చెంతనుండి వెడలిపోయిరి.

21. హృదయములో, ఆత్మలో ప్రేరేపితులై ప్రభువునకు కానుకలు అర్పింపగోరిన వారందరు కానుకలు కొనివచ్చిరి. వారు గుడారమును నిర్మించుటకును, అందు కైంకర్యమును చేయుటకును పవిత్రవస్త్రములను తయారు చేయుటకును వలయు సామగ్రినంతటిని కొనివచ్చిరి.

22. యిస్రాయేలు స్త్రీపురుషులు వచ్చిరి. వారు ఇష్టపూర్తిగా బులాకీలను, పోగులను, ఉంగరములను, దండలను, బంగారునగలను కొని వచ్చిరి. ప్రభువునకు బంగారునగలు కానుక పెట్ట గోరిన వారందరును వానిని కొనివచ్చిరి.

23. ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్ని, నారబట్టలు, మేక వెంట్రుకలతో నేసిన బట్టలు, ఎఱ్ఱని అద్దకము వేసిన పొట్టేలు చర్మము, నాణ్యమైన గట్టితోళ్ళు ఎవరెవరి వద్ద ఏమియున్నవో వారు వాటిని తీసుకొనివచ్చిరి.

24. వెండి, ఇత్తడి గలవారు వానిని కొనివచ్చిరి. తుమ్మకఱ్ఱ గలవారు దానిని తీసికొనివచ్చిరి.

25. నేర్పుగల స్త్రీలు నేతకు పూనుకొని ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో పేనినదారమును, నేసిననార బట్టలను తయారు చేసికొనివచ్చిరి.

26. హృదయ ప్రేరేపితులై ప్రావీణ్యముగల స్త్రీలందరు మేక వెంట్రుకలను వడికిరి.

27. ప్రజల నాయకులు లేతపచ్చలను, పరిశుద్ధవస్త్రమునకు, వక్షఫలకమునకు పొదుగవలసిన మణులను,

28. దీపములను, అభిషేకతైలమునకు, సువాసనగల సాంబ్రాణికి వలసిన చమురును, సుగంధ ద్రవ్యములను కొనివచ్చిరి.

29. ఈ రీతిగా హృదయ ప్రేరేపితులైన యిస్రాయేలు స్త్రీపురుషులందరును ప్రభువు మోషేకు ఆజ్ఞాపించిన పరికరములను చేయుటకు వలసిన కానుకలను యిష్టపూర్తిగా కొనివచ్చిరి.

30. మోషే ప్రజలతో “ప్రభువు యూదా వంశమునకు చెందిన హూరు మనుమడును, ఊరి కుమారుడునగు బేసలేలును ఎన్నుకొనెను.

31. అతనిని దైవాత్మతో నింపెను. కనుక అతనికి సుందరమైన వస్తువులనుచేయు నేర్పు సామర్థ్యము, తెలివితేటలు లభించెను.

32. అతడు సుందర వస్తువుల నమూనాలను చేసికొని వెండితో, బంగారముతో, ఇత్తడితో వానిని తయారు చేయగలడు.

33. రత్నములను సాన పెట్టి బంగారమున పొదగగలడు. కొయ్యపై బొమ్మలు చెక్కగలడు. ఈ రీతిగా సుందర వస్తువులన్నిటిని తయారు చేయగలడు.

34. బేసలేలునకును, దాను తెగకు చెందిన అహీసామాకు కుమారుడగు ఒహోలియాబునకును సుందర వస్తువులను చేయునేర్పును, ఆ పనితనమును ఇతరులకు గూడ నేర్పించు బుద్ధిని ప్రభువు దయచేసెను.

35. ప్రభువు వారిద్దరికి రాళ్ళను చెక్కుటకును, సుందరవస్తువుల నమూనాలను తయారుచేయుటకును, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నిని చేయుటకును, నారవస్త్రములు సాదా వస్త్రములు తయారు చేయుటకును జ్ఞానహృదయములను ప్రసాదించెను. వారు సుందర వస్తువులను వేనినైనను చేయగలరు. చిత్రమైన వస్తువులను తయారు చేయగలరు” అని నుడివెను.

1. ప్రభువు గుడారమును నిర్మించుటకు నేర్పును సామర్థ్యమును అనుగ్రహించిన బేసలేలు, ఒహోలియాబు మరియు మిగిలిన పనివారు యావే ఆజ్ఞాపించినట్లే సమస్తకార్యములను చేసి ముగించెదరు.

2. దేవుని నుండి నేర్పును సామర్థ్యమును పొంది గుడారమును నిర్మించుటకు పూనుకొనిన పనివారిని, అనగా బేసలేలును, ఒహోలియాబును, మిగిలిన పనివారిని మోషే పిలువనంపెను.

3. గుడారము కట్టుటకై యిస్రాయేలీయులు కొనివచ్చిన కానుకలను మోషేనుండి వారు స్వీకరించిరి. ప్రజలు ప్రతిదినము కానుకలు కొనివచ్చుచునే యుండిరి.

4. అపుడు గుడారమున ఆయావస్తువులు చేయుపనివారందరు తమ పనులను చాలించి,

5. మోషే వద్దకు వచ్చి అతనితో “ప్రభువు ఆజ్ఞాపించిన వస్తువులు సిద్ధము చేయుటకు అవసరమైన దానికంటె అధిక సామగ్రిని ఈ ప్రజలు తీసికొనివచ్చుచున్నారు” అని చెప్పిరి.

6. కనుక మోషే “ఆడవారుగాని మగవారుగాని యిక గుడారమును కట్టుటకు కానుకలు కొనిరానక్కర లేదు” అని శిబిరమున వార్త చాటించెను. కనుక ప్రజలు కానుకలు తెచ్చుట మానివేసిరి.

7. వారు అది వరకే తెచ్చిన వస్తుసామగ్రి గుడారమును కట్టుటకు సంపూర్ణముగా సరిపోయెను.

8. పనివాండ్రలో మిగుల నిపుణులైన వారు గుడారమును నిర్మించిరి. వారు పది వస్త్రములతో గుడారమును తయారుచేసిరి. అవి ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో, పేనిన సన్ననిదారముతో నేయబడియుండెను. వాని మీద కెరూబీము దూతల బొమ్మల కళాత్మకమైన అల్లిక ఉండెను.

9. ప్రతి తెర ఇరువది ఎనిమిది మూరల పొడవు, నాలుగు మూరల వెడల్పు ఉండెను. తెరలన్నిటికి ఇదియే కొలత. .

10. మోషే ఈ తెరలలో ఐదింటిని కలిపి కుట్టించెను. ఆ రీతిగనే మిగిలిన ఐదింటినిగూడ కలిపి కుట్టించెను.

11. ప్రతి ఐదింటిలో చివరితెర అంచులకు ఊదా దారముతో ఉచ్చులు వేయించెను.

12. మొదటి ఐదుతెరలలో మొదటి దానికి ఏబది ఉచ్చులు అదే విధముగా రెండవ అయిదుతెరలలో చివరిదానికి ఏబది ఉచ్చులు తగిలించెను.

13. ఏబది బంగారు గుండీలు చేయించి, ఆ ఉచ్చు ముడులన్నింటిని కలిపివేసెను. అప్పుడది ఏకమందిరము అయ్యెను.

14. అటుతరువాత అతడు మేకవెంట్రుకలతో పదునొకొండు కంబళి దుస్తులు తయారుచేయించి గుడారముగా మందిరముపై కప్పు వేయించెను.

15. ఈ తెరలు ముప్పది మూరల పొడవు, నాలుగు మూరల వెడల్పు ఉండెను. అన్నిటికిని అదియే కొలత.

16. వానిలో ఐదింటిని ఒక తెరగా, ఆరింటిని మరియొక తెరగా కుట్టించెను.

17. ఐదు తెరలలో కడపటి దానికి ఏబది ఉచ్చులు, ఆరుతెరలలో కడపటి దానికి ఏబది ఉచ్చులు కుట్టించెను.

18. ఏబది ఇత్తడి గుండీలను చేయించి ఆ తెరల రెండు కొనలనున్న ఉచ్చులను కలిపి ఒకటే గుడారమగునట్లు గుండీలను ఉచ్చులకు తగిలించి దానికి కూర్చెను.

19. ఎఱ్ఱని అద్దకము వేయించిన పొట్టేళ్ళ చర్మముతో గుడారమునకు పైకప్పు వేయించెను. దానిమీద నాణ్యమైన గట్టితోళ్ళతో మరియొక కప్పువేయించెను.

20. అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలుపు చట్రములు చేయించెను.

21. ప్రతిచట్రము పదిమూరల పొడవు, ఒకటిన్నర మూర వెడల్పు ఉండునట్లు చేసెను.

22. ప్రతి చట్రమునకు క్రింద సమదూరమున రెండుకొసలుచెక్కి, వాని సహాయ ముతో చట్రములన్నిటిని కలిపివేసెను. చట్రములన్నిటిని ఈ రీతిగనే రెండుకొసలతో తయారు చేయించెను.

23. గుడారమునకు దక్షిణమువైపున ఇరువది చట్రములు చేయించెను. నలువది వెండి దిమ్మలనుకూడ చేయించి వానిని చట్రముల క్రింద జొన్పించెను.

24. ఒక్కొక్క చట్రపు రెండుకొసలు రెండేసి దిమ్మల లోనికి చొచ్చుకొని పోయెను.

25. ఆ రీతిగనే గుడారపు ఉత్తరభాగమునకు ఇరువది చట్రములు చేయించెను.

26. నలువది వెండిదిమ్మలు గూడ చేయించి ఒక్కొక్క చట్రము క్రింద రెండు దిమ్మల చొప్పున అమర్చెను.

27. పడమర నున్న గుడారపు వెనుక భాగమునకు ఆరుచట్రములు చేయించెను.

28. వెనుకటి భాగపు రెండు మూలలకు రెండు చట్రములు చేయించెను.

29. ఈ మూల చట్రములను క్రింది భాగమునుండి మీది భాగమున మొదటి కడియము వరకు ఒకదానితో ఒకటి కలిసికొని పోవునట్లు చేసెను. అతడు వెనుకటి మూల చట్రములు రెండింటిని తయారుచేసిన వైనమిది.

30. కనుక వీనితో కలిపి ఇవి మొత్తము ఎనిమిది చట్రములు, వానిక్రింద పదునారు వెండి దిమ్మెలు అయ్యెను.

31. అతడు తుమ్మకొయ్యతో అడ్డకఱ్ఱలు  గూడ చేయించెను.

32. ఉత్తరమున నున్న చట్రము లన్నిటిని ఒక్కటిగా కలిపివేయుటకు ఐదింటిని, దక్షిణపువైపున నున్న చట్రములన్నిటిని ఒక్కటిగా కలిపివేయుటకు ఐదింటిని, పడమటవైపున నున్న చట్రములన్నిటిని ఒక్కటిగా కలిపి వేయుటకు ఐదింటిని తయారుచేయించెను.

33. చట్రముల మధ్యనున్న అడ్డకఱ్ఱ, చట్రముల సగమెత్తు నడిమికి ఒక కొననుండి మరియొక కొనవరకు చట్రములలో దూరియుండినట్లు చేయించెను.

34. చట్రములకు బంగారమును పొదిగి, వానికి బంగారు కడియము లను వేయించెను. అడ్డకఱ్ఱలకు గూడ బంగారము పొదిగి వానిని కడియములలో జొన్నించెను.

35. అతడు అడ్డుతెరను తయారు చేయించెను. అది పేనిన దారముతో ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో నేయబడియుండెను. దాని మీద కెరూబీము దూతల బొమ్మల కళాత్మకమైన అల్లిక ఉండెను.

36. ఆ తెరను నాలుగు తుమ్మస్తంభములకు వ్రేలాడ దీసెను. ఆ స్తంభములను బంగారముతో పొదిగి, . వానికి బంగారుకొక్కెములు తగిలించెను. ఆ స్తంభములను వెండి దిమ్మలలో అమర్చెను.

37. గుడారపు ద్వారమునకుగూడ తెరను తయారుచేయించెను. అది ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో నేయబడియుండెను. దానిమీద కళాత్మకమైన అల్లికలు కలవు.

38. ఈ తెరను కట్టుటకు ఐదు తుమ్మస్తంభములను చేయించి వానికి కొక్కెములు తగిలించెను. ఆ స్తంభముల పై భాగములను, వానిలోనుండి దూరిపోవు కఱ్ఱలను బంగారముతో పొదిగించెను. స్తంభములను ఇత్తడి దిమ్మెలలో బిగించెను.

1. బేసలేలు తుమ్మకఱ్ఱతో మందసము చేసెను. దాని పొడవు రెండున్నర మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర, ఎత్తు ఒకటిన్నర మూర ఉండెను.

2. దానికి లోపల వెలుపల మేలిమి బంగారు రేకును అతికెను. దాని అంచులయందు బంగారపురేకు కట్టునుంచెను.

3. ఆ పెట్టెకు నాలుగు బంగారు కడియములు చేయించెను. ఒక ప్రక్క రెండు మరియొక ప్రక్క రెండు ఉండునట్లుగా ఆ కడియములను నాలుగుకాళ్ళకు అమర్చెను.

4. తుమ్మకొయ్యతోనే మోతకఱ్ఱలు గూడ చేయించి వానికి బంగారురేకులు తొడిగించెను.

5. పెట్టెను మోసికొనిపోవుటకై దాని ప్రక్కలనున్న కడియములలో ఆ మోతకఱ్ఱలను దూర్చెను.

6. రెండున్నర మూరల పొడవు, ఒకటిన్నర మూర వెడల్పు గల కరుణాపీఠమును మేలిమి బంగారముతో చేయించెను.

7. ఈ కరుణాపీఠము రెండుకొనలవద్ద కమ్మచ్చున తీసిన బంగారముతో రెండు కెరూబీము దూతలబొమ్మలను తయారు చేసెను.

8. వానిని కరుణా పీఠము రెండుకొనలయందు కరుణాపీఠముతో ఏకాండముగా చేయించెను.

9. ఆ దూతల బొమ్మలు రెక్కలు పైకి విచ్చుకొని కరుణాపీఠమును కప్పివేయు చుండెను. అవి ఒకదానికొకటి ఎదురుగా నుండి కరుణాపీఠమువైపు చూచుచుండెను.

10. అతడు రెండు మూరల పొడవు, ఒక మూర వెడల్పు, ఒకటిన్నర మూర ఎత్తు గల బల్లను తుమ్మకఱ్ఱతో తయారుచేసెను.

11.ఆ బల్లకు మేలిమి బంగారురేకు తొడిగి దాని అంచులచుట్టు మేలిమి బంగారుకట్టు నుంచెను.

12. బల్లచుట్టు బెత్తెడు వెడల్పు గల బద్దెను చేసి ఆ బద్దె చుట్టు బంగారపు కట్టు నుంచెను.

13. నాలుగు బంగారు కడియములను చేసి, నాలుగుకాళ్ళు గల బల్ల నాలుగు మూలల తగిలించెను.

14. దానిని మోసికొనిపోవు మోతకఱ్ఱలు  దూర్చుటకు తగినట్లుగా కడియములను బద్దెకు దగ్గరగా అమర్చెను.

15. ఆ మోతకఱ్ఱలను తుమ్మ కొయ్యతో చేయించి వానికి బంగారురేకు తొడిగెను.

16. ఆ బల్లపైని వాడుటకై పళ్ళెములు, గిన్నెలు, కూజాలు, పానీయార్పణమునకు వలయు పాత్రములను మేలిమిబంగారముతో చేయించెను.

17. అతడు మేలిమి బంగారముతో దీప స్తంభము చేయించెను. దాని పీఠమును, కాండమును కమ్మచ్చున తీసిన బంగారముతో చేయించెను. ఆ కాండముమీదనున్న గిన్నెలవంటి మొగ్గలు, దళములు దానితో కలిసిపోయి నగిషీ పనిగా చేయించెను.

18. దానికి ఈ వైపున మూడు, ఆ వైపున మూడు మొత్తము ఆరు కొమ్మలుండెను.

19. ఆ ఆరు కొమ్మలకు బాదము పూలవలెనున్న గిన్నెలవంటి మొగ్గలును, దళములను అమర్చెను.

20. దాని కాండమున గూడ బాదముపూలవంటి మొగ్గలు దళములు నాలుగు ఉండెను.

21. దీపస్తంభమునందలి ప్రతి రెండు కొమ్మల మొదటిలో ఒక్కొక్క గిన్నె చొప్పున అమర్చెను.

22. ఆ గిన్నెలు, కొమ్మలు, దీపస్తంభము ఏకాండమైయున్నవి. వానినన్నిటిని కమ్మచ్చున తీసిన బంగారము తోనే చేయించెను.

23. అతడు దీపస్తంభమునకు ఏడుదీపములు చేయించెను. ఆ దీపములకు వలయు కత్తెరలు, పళ్ళెములు మేలిమి బంగారముతోనే చేసెను.

24. దీపస్తంభమును దాని ఉపకరణములను చేయుటకు నలువది వీసెల మేలిమి బంగారము పట్టేను.

25. అతడు ధూపము వేయుటకై తుమ్మకఱ్ఱతో ఒక పీఠము తయారుచేయించెను. అది చదరముగా నుండెను. దాని పొడవు ఒకమూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండుమూరలు ఉండెను. ఆ పీఠము కొమ్ములు దానితో ఏకాండమై ఉండెను.

26. అతడు పీఠము మీది భాగమునకు, నాలుగు అంచులకు, కొమ్ములకు అచ్చమైన బంగారురేకును తొడిగెను. పీఠమునకు బంగారుకట్టు వేయించెను.

27. దానిని మోసికొని పోవుటకు రెండు బంగారు కడియములు చేయించి వానిని ఆ కట్టుకు క్రింద ఇరువైపుల అమర్చెను. ఆ కడియములలోనికి మోతకఱ్ఱలు దూర్చి పీఠమును మోసికొని పోవలెను.

28. మరియు తుమ్మకొయ్యతో మోతకఱ్ఱలను చేయించి వానికి బంగారురేకును తొడిగించెను.

29. అతడు అభిషేకమునకు వాడు పరిశుద్దతైలమును తయారుచేయించెను. సుగంధ ద్రవ్యకారులు చేయు రీతిగనే నిర్మలమైన పరిమళపు సాంబ్రాణినిగూడ సిద్ధము చేయించెను.

1. అతడు దహనబలులర్పించుటకై తుమ్మ కొయ్యతో చదరముగానుండు బలిపీఠము తయారుచేసెను. అది ఐదుమూరల పొడవు, ఐదుమూరల వెడల్పు, మూడుమూరల ఎత్తు ఉండెను.

2. దాని నాలుగు మూలలందు నాలుగు కొమ్ములు నిలిపెను. అవి బలిపీఠముతో ఏకాండమైయుండెను. బలిపీఠమునంతటికి ఇత్తడి రేకును తొడిగెను.

3. బలిపీఠమునకు వలయు ఉపకరణములను అనగా పళ్ళెరములు, గరిటెలు, నీళ్ళు చిలుకరించు గిన్నెలు, ముళ్ళగరిటెలు, నిప్పునెత్తు పళ్ళెరములు ఇత్తడితో చేయించెను.

4. మరియు ఇత్తడితో జల్లెడవంటి తడికను చేయించి దానిని బలిపీఠపుటంచు క్రిందనుండి సగమెత్తున అమర్చెను.

5. నాలుగు కడియములు చేయించి వానిని ఇత్తడి తడిక నాలుగువైపుల బిగించెను.

6. తుమ్మకొయ్యతో మోతకఱ్ఱలు చేయించి వానికి ఇత్తడి రేకును తొడిగించెను.

7. ఆ కఱ్ఱలను బలిపీఠమునకు ఇరువైపులనున్న కడియములలో దూర్చి దానిని మోసికొని పోవుదురు. బలిపీఠమునకు మధ్య బోలుగా ఉండునట్లు దానిని పలకలతో నిర్మించెను.

8. సమావేశపుగుడారపు గుమ్మమునొద్ద పరిచర్వ చేయు స్త్రీలు వాడుకొను ఇత్తడి అద్దములనుండి అతడు ఇత్తడి గంగాళమును, దాని ఇత్తడిపీటను తయారు చేసెను.

9. అతడు గుడారమునకు ఆవరణమును నిర్మించెను. ఆవరణము దక్షిణ దిక్కుకు పేనిన దారముతో నేసిన నారబట్టతో నూఱుమూరలు పొడవు గల తెరలు తయారుచేసెను.

10. వానిని ఇరువది స్తంభములకు తగిలించెను. ఆ కంబములను వాని దిమ్మలను ఇత్తడితో చేసెను. ఆ కంబములకు వెండి కొక్కెములును, దూర్పుడు వెండిబద్దలును ఉండెను.

11. ఉత్తర దిక్కుననున్న తెరలు నూఱుమూరలు పొడవు గలవి. ఇరువది ఇత్తడి దిమ్మలలోనికి ఇరువది స్తంభములను దూర్చి వానికి ఈ తెరలను తగిలించెను. ఆ స్తంభములకు గూడ వెండికొక్కెములు, దూర్పుడు వెండి బద్దలు ఉండెను.

12. పశ్చిమవైపుననున్న తెరపొడవు ఏబదిమూరలు. వానిని పది దిమ్మలలో నుంచిన పదిస్తంభములకు తగిలించెను. ఆ స్తంభము లకు వెండికొక్కెములు, దూర్పుడు వెండి బద్దలు ఉండెను.

13. ఆవరణము తూర్పువైపు ఏబది మూరలు వెడల్పు ఉండెను.

14. ఆ ఆవరణ ద్వారమునకు ఒక వైపున పదిహేను మూరలు పొడవుగల తెరలను ఉంచెను. మూడు దిమ్మెలలోనికి జొన్ఫిన మూడు స్తంభములకు వానిని తగిలించెను.

15. ఆ రీతిగనే ఆవరణ ద్వారమునకు ఇంకొక వైపుగూడ తెరలనమర్చెను. కనుక ఆవరణ ద్వారమునకు ఇరువైపుల పదిహేను మూరల పొడవు గల తెరలు. మూడేసి స్తంభములు మూడేసి దిమ్మలుండెను.

16. ఆవరణము చుట్టునున్న తెరలన్నియు పేనిన దారముతో, నారవస్త్రముతోను తయారుచేయబడెను.

17. స్తంభపు దిమ్మెలు ఇత్తడితో చేయబడినవి. స్తంభములకు తొడిగిన రేకులు, స్తంభపు కొక్కెములు, వానిలోనికి దూర్చిన బద్దలు వెండితో చేయబడెను. ఆవరణపు స్తంభములన్నియు వెండిబద్ధలతో కలిపి వేయబడెను.

18. ఆవరణ ద్వారముపై వ్రేలాడుతెర ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో పేనిన సన్నని దారముతో అల్లికపనిగా నేయబడియుండెను. దాని మీద అల్లికలుండెను. అది ఇరువదిమూరల పొడవు, ఆవరణపు తెరలవలె ఐదుమూరల ఎత్తు ఉండెను.

19. అది నాలుగు ఇత్తడి దిమ్మలలో అమర్చిన నాలుగుస్తంభములపై వ్రేలాడుచుండెను. ఆస్తంభముల మీద తొడిగిన రేకు, వాని బద్దెలు, కొక్కెములు వెండితో చేయబడెను.

20. గుడారమునకు దాని చుట్టునున్న ఆవరణమునకు వాడబడిన మేకులన్నియు ఇత్తడితోనే చేసిరి.

21. శాసనములు వ్రాసిన పలకలను గుడారమున ఉంచిరిగదా! ఆ గుడారమును కట్టుటకు వాడిన లోహముల లెక్క యిది. మోషే ఆపై యాజకుడగు అహరోనుని కుమారుడగు ఈతామారు ఈ లెక్కను తయారు చేసెను.

22. ప్రభువు ఆజ్ఞాపించిన రీతిగనే మోషే యూదా తెగకు చెందిన హూరు మనుమడును ఊరీ కుమారుడగు బేసలేలు సమస్తమును తయారు చేసెను.

23. దానుతెగకు చెందిన అహీసామాకు కుమారుడు ఒహోలియాబు అతనికి తోడ్పడెను. అతనికి రాళ్ళపై చెక్కుట, నమూనాలు తయారుచేయుట, ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితోను నారతోను వస్త్రములు చేయుట బాగుగా తెలియును.

24. గుడారమునకు వాడిన ప్రతిష్ఠిత బంగారమంతయు కలిసి పరిశుద్ధస్థలపు తులామానము తూనిక చొప్పున నూటపదహారు మణుగుల, ఐదు వందల ముప్పది తులములు.

25. ఆ బంగారమంతయు ప్రజలు ప్రభువునకు సమర్పించుకొనినదే. యిస్రాయేలు ప్రజల జనాభాలెక్క వ్రాసినపుడు ప్రోగుచేసిన వెండి పరిశుద్ధస్థలపు తులామానము తూనిక చొప్పున నాలుగు వందల మణుగుల, పదునైదువందల డెబ్బది ఐదు తులములు.

26. ఇరువది ఏండ్లు మరియు పైబడి జనాభా లెక్కలో చేరిన పురుషులు ఆరులక్షల మూడు వేల ఐదు వందల యేబది మంది. వీరు ఒక్కొక్కరు అదే తులామానము తూనిక ప్రకారము అరతులము వెండి చొప్పున సమర్పింపగా ప్రోగైన వెండి అదియే.

27. ఆ మొత్తము వెండిలో నాలుగువందల మణుగులు పరిశుద్ధస్థలములోని దిమ్మెలకు, అడ్డుతెర దిమ్మెలు చేయుటకు వాడబడెను. నూరు దిమ్మెలకు ఒక్కొక్క దానికి నాలుగు మణుగుల వెండి వాడబడెను.

28. మిగిలిన పదుహేను వందల డెబ్బది ఐదు తులముల వెండితో స్తంభములు, కొక్కెములు, ఆ స్తంభముల మీదిరేకులు, స్తంభములలో దూర్చినబద్దలు తయారు చేసిరి.

29. ప్రభువునకు అర్పించిన ఇత్తడి రెండు వందల ఎనుబది మణుగుల, రెండువేల నాలుగువందల తులములు.

30-31. దానితో అతడు సమావేశపు గుడారపు గుమ్మమునకు దిమ్మలను, ఇత్తడి బలిపీఠమును, దాని జల్లెడను, దాని ఉపకరణములను, ఆవరణపు దిమ్మెలను, ఆవరణపు ద్వారపుదిమ్మె లను, గుడారపు మేకులను, ఆవరణపు మేకులను తయారు చేసెను.

1. గుడారమున పరిచర్యచేయు యాజకులకు వారు ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో విలువైన వస్త్రములు సిద్ధము చేసెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే అహరోనునకు పవిత్ర వస్త్రములు తయారుచేసెను.

2. అతడు బంగారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్నితో పేనిన సన్నని దారముతో పరిశుద్ధవస్త్రమును తయారుచేసెను.

3. మేలిమి బంగారుతీగలను కత్తిరించి ఆ ముక్కలను ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో సన్నని పేనినదారముతో కళాత్మకమైన అల్లిక పనితో చేర్చి పరిశుద్ధవస్త్రమును తయారు చేసెను.

4. ఆ పరిశుద్ధ వస్త్రమునకు ఇరువైపుల రెండు భుజపాశములు అమర్చెను. వానితో దానిని యాజకుని భుజములకు తగిలింప వీలుగా నుండెను.

5. ఆ వస్త్రముతో కలిపి కుట్టిన నడికట్టుకూడ బంగారముతో ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్నితో పేనిన సన్ననిదారముతో తయారుచేయబడెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించిన రీతిగనే దానిని చేసెను.

6. రెండు లేతపచ్చలను తయారుచేసి వానిని బంగారమున పొదిగించెను. యిస్రాయేలు కుమారుల నామములను వానిమీద ముద్రలవలె చెక్కించెను.

7. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లుగనే ఆ లేతపచ్చలను ఎఫోదు అనబడు పరిశుద్ధవస్త్రపు భుజపాశములతో చేర్చి కుట్టించెను. వానిని చూచి ప్రభువు యిస్రాయేలీ యులను స్మరించుకొనెడివాడు.

8. అతడు ఎఫోదు పరిశుద్ధవస్త్రమువలె కళాత్మకమైన అల్లికపనితో గూడిన వక్షఃఫలకమును కూడ తయారుచేసెను. దానిని బంగారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులుగల ఉన్నితో పేనిన సన్నని దారముతో తయారుచేసెను.

9. ఆ వక్షఃఫలకమును చదరముగా చేసి రెండు మడతలుగా నడిమికి మడచగ దాని పొడవు తొమ్మిది అంగుళములు, వెడల్పు తొమ్మిది అంగుళములు ఉండెను.

10. ఆ ఫలకము మీద నాలుగు వరుసలుగా మణులను తాపించెను. మొదటి వరుసలో కురువిందము, పద్మరాగమణి, గరుడపచ్చ ఉండెను.

11. రెండవ వరుసలో మరకతము, కెంపు, నీలమణి ఉండెను.

12. మూడవ వరుసలో వజ్రము, సూర్యకాంతము, గోమేధికము ఉండెను.

13. నాలుగవ వరుసలో సులేమానురాయి, చంద్రకాంతము, వైఢూర్యము ఉండెను, ఈ మణులనన్నిటిని బంగారమున పొదిగించెను.

14. ఈ పండ్రెండు రత్నములమీద యిస్రాయేలు కుమారుల పేర్లు చెక్కబడియుండెను. ఒక్కొక్కరత్నముమీద ఒక్కొక్క తెగ పేరు ముద్రితమైయుండెను.

15. వక్షఃఫలకమునకు దారపు ముడులవంటి మెలికలు కలిగిన బంగారు గొలుసులు చేయించెను.

16. రెండు జిలుగు బంగారు జవ్వలను, రెండు బంగారు ఉంగరములను చేయించి వానిని వక్షఃఫలకము మీది అంచులకు తగిలించెను.

17. రెండు బంగారు గొలుసులను గూడ చేయించి వానిని ఒక వైపున రెండు ఉంగరములకు తగిలించిరి.

18. మరియొక వైపున రెండు రవ్వలకు తగిలించిరి. ఈ రీతిగా ఆ గొలుసులను ఎఫోదు అనబడు పరిశుద్ధవస్త్రపు ఉపరిభాగమున ఉండు భుజపాశముల మీద తగిలించిరి.

19. మరి రెండు బంగారు ఉంగరములు చేయించి వానిని ఎఫోదు పరిశుద్ధవస్త్రమునకు దాపున, వక్షఃఫలకమునకు క్రిందిభాగమున, దాని లోపలివైపున ఇమిడ్చిరి.

20. ఇంకను రెండు బంగారు ఉంగరములను చేయించి వానిని ఎఫోదు పరిశుద్ధవస్త్ర భుజపాశములకు ముందు, క్రింది భాగమున తగిలించిరి. ఈ ఉంగరములు అల్లిక పనిగల పరిశుద్ధవస్త్రపు నడికట్టుకు పైగా దాని కూర్పునొద్ద ఉండెను.

21. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే వక్షఃఫలకమును దాని ఉంగరములకును, పరిశుద్ధవస్త్రపు ఉంగరములకును ఊదాసూత్రముతో బిగియగట్టిరి. దాని ఫలితముగా వక్షఃఫలకము వదులై జారిపోక నడికట్టుకు పైగా నిలిచెడిది.

22. యాజకుడు ఎఫోదు పరిశుద్ధవస్త్రము తొడుగుకొను నిలువుటంగీని అతడు ఊదా ఉన్నితో తయారుచేసెను.

23. దాని నడుమ తలదూర్చు రంధ్రము ఉంచెను. ఈ రంధ్రముచుట్టు, తోలు అంగీ మెడకు కుట్టినట్లుగా, అది చినుగకుండునట్లు నేత వస్త్రమును గట్టిగాకుట్టెను.

24. అంగీ క్రిందిఅంచుచుట్టు ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో పేనిన సన్నని దారముతో దానిమ్మపండ్లు కుట్టించెను.

25. వాని నడుమ బంగారు గజ్జలు అమర్చెను.

26. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లుగనే అంగీ క్రిందియంచు చుట్టు దానిమ్మపండ్లు, గజ్జెలు ఒక్కొక్కటి వరుసగా వ్రేలాడుచుండెను.

27. అతడు అహరోనునకు అతని కుమారులకు చక్కని నారబట్టతో చొక్కాలను తయారుచేసెను.

28. తలపాగాలు, టోపీలు, లోవస్త్రములను గూడ మంచి నారబట్టతో సిద్ధము చేసెను.

29. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే పేనిన సన్ననిదారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో, అల్లికపనితో నడి కట్టును తయారుచేసెను.

30. మేలిమి బంగారముతో పతకమును చేయించి దానిమీద “ప్రభువునకు నివేదితము” అను అక్షరములు చెక్కించెను.

31. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే ఆ పతకమును తలపాగా మీద పెట్టి ఊదా దారముతో కట్టించెను.

32. ఈ రీతిగా సమాగమపు గుడారము పని యంతయు ముగిసెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించి నట్లే యిస్రాయేలీయులు ఎల్లపనులు చేసి ముగించిరి.

33. గుడారము, కప్పు, పరికరములు, కొక్కెములు, చట్రములు, అడ్డుకఱ్ఱలు, స్తంభములు, దిమ్మెలు,

34. ఎఱ్ఱని అద్దకము వేసిన గొఱ్ఱెతోళ్ళు, నాణ్యమైన గట్టి తోళ్ళు, మందసము ఎదుటితెర,

35. సాక్ష్యపు శాసన ముల పలకలుగల మందసము, దానిమీద కరుణా పీఠము, మోతకఱ్ఱలు,

36. రొట్టెలనుంచుబల్ల, దాని ఉపకరణములు, దేవునికి అర్పించు సముఖపు రొట్టెలు,

37. బంగారపు దీపస్తంభము, దానిమీది దీపములు, దానిపరికరములు, దీపతైలము,

38. బంగారముతో చేయబడిన ధూపపీఠము, అభిషేకతైలము, సువాసన గల సాంబ్రాణి, గుడారపు గుమ్మపు తెర,

39. ఇత్తడి బలిపీఠము, దాని జల్లెడ, మోతకఱ్ఱలు, మిగిలిన పరికరములు, గంగాళము దాని పీట,

40. ఆవరణపు తెరలు, స్తంభములు వాని దిమ్మెలు, ఆవరణ ద్వారపు తెర, దాని త్రాళ్ళు, మేకులు, గుడారమున పరిచర్య చేయుటకు వలయు పరికరములు.

41. పరిశుద్ధ స్థలమున పరిచర్యచేయు యాజకులకు వస్త్రములు అనగా యాజకుడు అహరోనునకు ప్రతిష్ఠిత వస్త్రములు, అతని కుమారులు తాల్చు వస్త్రములు, వీనినన్నిటిని సిద్ధముచేసి యిస్రాయేలీయులు మోషేకడకు కొని వచ్చిరి.

42. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లుగనే యిస్రాయేలీయులు అన్ని పనులుచేసి ముగించిరి.

43. మోషే వారు తయారుచేసిన వస్తువులనన్నిటిని పరీక్షించి చూచెను. అవి అన్నియు ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేయబడియుండెను. కనుక మోషే వానినన్నిటిని ఆశీర్వదించెను.

1-2. ప్రభువు మోషేతో “మొదటినెల మొదటిదినమున సమావేశపు మందిరగుడారమును నిర్మింపుము.

3. శాసనములుగల సాక్ష్యపు మందసమును గుడారమునందుంచి దాని ముందట అడ్డుతెర కట్టుము.

4. బల్లను దాని ఉపకరణములను, దీప స్తంభమును దాని దీపములను కొనివచ్చి గుడారమున నెలకొల్పుము.

5. ధూపమువేయు బంగారుపీఠమును తెచ్చి శాసనములున్న సాక్ష్యపుమందసము ఎదుట నిలుపుము. గుడార గుమ్మమునకు తెర తగిలింపుము.

6. దహనబలులు అర్పించు బలిపీఠమును సమావేశపు గుడారము ముందటనిలుపుము.

7. ఆ బలిపీఠము నకు సమావేశపుగుడారమునకు నడుమ గంగాళ మును ఉంచి దానిని నీటితో నింపుము.

8. గుడారము చుట్టు ఆవరణము నిర్మించి ఆ ఆవరణ ద్వారమునకు తెరకట్టుము.

9. పిమ్మట అభిషేకతైలము తీసికొని మందిర మును దాని పరికరములను అభిషేకించి దేవునికి నివేదింపుము. అప్పుడది పవిత్రమగును. 

10. దహన బలులు అర్పించు పీఠమును, దాని పరికరములను తైలముతో అభిషేకించి దేవునికి నివేదింపుము. అప్పుడది మహాపవిత్రమగును.

11. గంగాళమును దాని పీటను అభిషేకించి దేవునికి నివేదింపుము.

12. అహరోనును, అతని కుమారులను సమా వేశపుగుడారము గుమ్మము నొద్దకు కొనిరమ్ము. వారిని నీటితో శుభ్రముగా కడగవలయును.

13. అహరోనునకు పవిత్రవస్త్రములు తొడిగి అతనిని అభిషేకించి నాకు నివేదింపుము. అటుతరువాత అతడు యాజకుడై నాకు పరిచర్యచేయును.

14. అహరోను కుమారులను కొనివచ్చి వారికి చొక్కాలు తొడిగింపుము.

15. వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. ఈ అభిషేకమువలన వారు తరతరములవరకు నాకు నిత్యయాజకులగుదురు” అని చెప్పెను.

16. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే సమస్తమును నెరవేర్చెను.

17. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి బయలుదేరిన రెండవ సంవత్సరము మొదటి నెల మొదటి రోజున మందిరము నిలువ పెట్టబడెను.

18. యావే మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే గుడారమును నిర్మించెను. అతడు దాని దిమ్మలలో చట్రములను నిలిపి, దాని అడ్డకఱ్ఱలను దూర్చి, స్తంభములను నెలకొల్పెను .

19. ప్రభువు ఆజ్ఞాపించినట్లే అతడు మందిరముమీద గుడారమును పరచి, వానిమీద గుడారపుకప్పును వేసెను.

20. అతడు సాక్ష్యపు శాసనముల పలకలు కొనివచ్చి మందసములో పెట్టెను. ఆ మందసము కడియములలో మోతకఱ్ఱలను దూర్చి దానిమీది కరుణాపీఠము నుంచెను.

21. మందసమును గుడారమున ఉంచి దానిముందట అడ్డుతెరను అమర్చి ప్రభువు ఆజ్ఞాపించినట్లే మందసమును ఇతరుల కంటపడనీయడాయెను.

22. అతడు బల్లను కొనివచ్చి గుడారపు ఉత్తరభాగమున అడ్డుతెర ముందటనుంచెను.

23. ప్రభువు ఆజ్ఞాపించినట్లే దానిమీద నైవేద్యముగా రొట్టెలను అమర్చెను.

24. దీపస్తంభమును గుడారపు దక్షిణ భాగమున బల్లకెదురుగా నిలిపెను.

25. ప్రభువు ఆజ్ఞాపించినట్లే దైవసాన్నిధ్యమున దీపమును వెలిగించెను.

26. బంగారుపీఠమును గుడారమున అడ్డు తెర ముందట నిలిపెను.

27. ప్రభువు ఆజ్ఞాపించినట్లే దానిమీద సువాసనగల సాంబ్రాణి పొగ వేసెను.

28. గుడారపు గుమ్మమునకు తెరనమర్చెను.

29. గుడారపు గుమ్మమునెదుట దహనబలులు అర్పించు బలిపీఠమునుంచెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే ఆ బలిపీఠము మీద దహనబలిని, నైవేద్యమును అర్పించి పైకెగయు సువాసనాభరితహోమముగా సమర్పించెను.

30. యావే మోషేను ఆజ్ఞాపించినట్లు అతడు బలిపీఠమునకు గుడారమునకు మధ్య గంగాళము నుంచెను. కాలుచేతులు కడుగుకొనుటకు దానిని నీటితో నింపెను.

31. మోషే, అహరోను, అతని కుమారులు దానియొద్ద కాలుసేతులు కడుగుకొనిరి.

32. ప్రభువు ఆజ్ఞాపించినట్లే వారు గుడారమున ప్రవేశించినపుడుగాని, బలిపీఠమునొద్దకు వచ్చినపుడు గాని కాలు సేతులు కడుగుకొనిరి.

33. గుడారమునకు, బలిపీఠమునకు చుట్టు ఆవరణమును నిర్మించి, దాని ద్వారముకడ తెరను కట్టెను. ఈ రీతిగా మోషే సమస్త కార్యములను ముగించెను.

34. మేఘము సమావేశపు గుడారమును కప్పి వేసెను. ప్రభు తేజస్సు దానిని నింపివేసెను.

35. మేఘము గుడారమునుకప్పుట వలనను, ప్రభువు తేజస్సు దానిని నింపివేయుటవలనను మోషే గుడారమున అడుగు పెట్టలేకపోయెను.

36. మేఘము గుడారము మీది నుండి పైకి లేచినప్పుడుగాని యిస్రాయేలీయులు ఒక విడిది నుండి మరియొక విడిదికి పయనము కట్టెడివారు కారు.

37. మేఘము పైకి లేవనిచో వారు విడిదినుండి కదలెడివారుకారు. అది పైకిలేచువరకు కనిపెట్టుకొని యుండెడివారు.

38. పగలు ప్రభుమేఘము గుడారముపై నిలిచెడిది. రేయి ఆ మేఘమునుండి నిప్పు వెలిగెడిది. యిస్రాయేలీయులు విడిదినుండి విడిదికి పయనము చేసినంత కాలము, ఆ మేఘమును, ఆ నిప్పును చూచుచునే ఉండిరి.