1. యిస్రాయేలీయులు యోర్దాను నదికి తూర్పు వైపున ఎడారియందు వసించుచుండగా మోషే పలి కిన పలుకులివి. అప్పుడు వారు సూఫు చెంత యోర్దాను ఆవలి అరాబాలోయలో మకాము చేయుచుండిరి. వారికి ఒకవైపు పారాను మరియొకవైపు టో ఫెలు, లాబాను, హసేరోతు, దీసహాబు నగరములు కలవు.
2. హోరేబు నుండి సెయీరు కొండమీదుగా కాదేషు బార్నెయాకు పదకొండురోజుల ప్రయాణము.
3. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చిన నలు వదియవయేడు పదునొకండవనెల మొదటి రోజున ప్రభువు ఆజ్ఞాపించిన సంగతులన్నింటిని మోషే వారికి ఎరిగించెను.
4. అప్పటికే మోషే హెష్బోనున పరిపాలనము చేయుచున్న అమోరీయరాజు సీహోనును, అష్టారోతు, ఎద్రెయి నగరములలో పరిపాలనము చేయు బాషానురాజు ఓగును ఓడించియుండెను.
5. ప్రజలు యోర్దానునకు తూర్పు దిశన మోవాబు మైదానమున వసించుచుండగా మోషే ఈ ఉపదేశమును వినిపించెను. అతడిట్లు నుడివెను:
6. “మనము హోరేబువద్ద నివసించుచుండగా ప్రభువు మనతో 'మీరు ఈ కొండయొద్ద చాలకాలము మకాము పెట్టితిరి.
7. ఇక గుడారములెత్తి పయనము కట్టుడు. మీరు అమోరీయుల మన్నెమునకును, అరాబా చుట్టుపట్లగల ఎడారియందును, పీఠభూములందును, లోయ దక్షిణ ప్రాంతములందును, మధ్యధరా సముద్ర తీరమునందును వసించు జనులకడకు పొండు. నేగేబునకు, కనాను దేశమునకు, లెబానోను మండలమున యూఫ్రటీసు మహానది వరకు పొండు.
8. ప్రభుడనైన నేను ఆ నేలను మీ పితరులగు అబ్రహాము, ఈసాకు, యాకోబులకును వారి సంతానమునకును ధారాదత్తము చేయుదునని వాగ్దానము చేసితిని. మీరు వెళ్ళి ఆ దేశమును స్వాధీనము చేసికొనుడు” అనెను.
9. మరియు మోషే ఇట్లు పలికెను: “నేనొక్కడనే మీ బరువు మోయజాలను.
10. ప్రభువు కృపవలన , మీరు ఆకాశమునందలి చుక్కలవలె లెక్కకందని రీతిగా వ్యాప్తి చెందితిరి.
11. మీ పితరుల దేవుడు మిమ్మింకను వేయిరెట్లు అధికముగా విస్తరిల్లజేయునుగాక! తన మాట చొప్పున మిమ్ము దీవించుగాక!
12. కాని నేనొక్కడినే ఎలా మీ బరువు మోయగలను? మీ జగడములు ఎట్లు తీర్పగలను?
13. మీ తెగలనుండి వివేకము, విజ్ఞానముగల అనుభవశాలురను ఎన్నుకొనుడు. నేను వారిని మీకు పెద్దలుగా నియమింతును అని మీతో చెప్పితిని.
14. నేను చెప్పినట్లు చేయుటకు మీరు ఒప్పుకొంటిరి.
15. కనుక నేను మీ తెగలనుండి వివేకము, అనుభవము గలవారిని ఎన్నుకొని మీకు పెద్దలుగా నియమించితిని. వారు మీలో వేయిమందికి, నూరుమందికి, ఏబదిమందికి, పదిమందికి నాయకులైరి. ఇంకను మీ తెగలకు అధికారులనుగూడ నియ మించితిని.
16. అప్పుడే నేను మీ న్యాయాధిపతులతో 'మీరు ప్రజల తగవులను జాగ్రత్తగా వినుడు. స్వజాతీయుల జగడములనుగాని, మీతో కలిసి వసించు విజాతీయుల జగడములనుగాని న్యాయసమ్మతముగా పరిష్కరింపుడు. మీరెవరియెడల పక్షపాతము చూపింప వలదు.
17. అధికునకు, అల్పునకు ఒకేరీతిని తీర్పు చెప్పుడు. ఎవరికిని భయపడకుడు. మీ నిర్ణయములు దేవుని నిర్ణయములు. ఏ వివాదమైన మీకుతెగనిచో నాయొద్దకు కొనిరండు. నేనే దానిని తీర్తును' అని చెప్పితిని.
18. అదే సమయమున మీరు చేయవలసిన ఇతర కార్యములను గూర్చియు మీకు ఆదేశించితిని.
19. మనము హోరేబు నుండి బయలుదేరితిమి. మీరెల్లరును కన్నులార చూచిన ఆ విశాలమును, భయంకరమునైన ఎడారిగుండ పయనించితిమి. దేవుడైన యావే ఆజ్ఞ ప్రకారము అమోరీయుల కొండ ప్రదేశములగుండ నడచి కాదేషుబార్నెయా చేరితిమి.
20. అప్పుడు నేను మీతో 'మనము అమోరీయుల మన్నెము చేరితిమి. మన పితరుల దేవుడు ఈ నేలను మనకిచ్చెను.
21. కనుక మీరు మీ పితరుల దేవుడు నుడివినట్లు వెళ్ళి ఆ భూమిని ఆక్రమించుకొనుడు. మీరు భయపడకుడు, నిరుత్సాహపడకుడు' అని నుడివితిని.
22. కాని మీరెల్లరు నా చెంతకువచ్చి 'వేగుచూచి వచ్చుటకై ముందుగా మనవారిని కొందరిని పంపుదము. మనము ఏ త్రోవనుపోవలయునో, అచట ఏఏ పట్టణములు తగులునో వారే మనకు తెలియజేయుదురు' అని పలికిరి.
23. మీ సలహానుమన్నించి నేను ఒక్కొక్క తెగకు ఒక్కని చొప్పున మొత్తము పండ్రెండుగురు వేగుల వాండ్రను ఎన్నుకొంటిని.
24. వారు ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయవరకు వేగుచూచిరి.
25. అచట పండు పండ్లనుగూడ కొనివచ్చి మనకు చూపిరి. 'దేవుడు మనకిచ్చిన నేలసారవంతమైనది' అని చెప్పిరి.
26. అయినను మీరు దేవుని ఆజ్ఞ పెడచెవినిబెట్టి ఆ నేలకు పోవుటకు అంగీకరింపరైతిరి.
27. మీరు గొణుగుచు 'ప్రభువునకు మనమనిన గిట్టదు కనుకనే అతడు మనలను ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి ఈ అమోరీయుల వశముచేసి వారిచే చంపింపనున్నాడు.
28. మనము అక్కడికి పోనేల? అటవసించు ప్రజలు మనకంటె బలశాలురనియు, ఆజానుబాహులనియు, వారి పట్టణ ప్రాకారములు ఆకాశమునంటుచున్న వనియు, అక్కడ అనాకీయులు వసించుచున్నారనియు మన వేగులవాండ్రు చెప్పగా వింటిమి. ఈ వార్తలు వినగా మన గుండె నీరగుచున్నది' అని సణుగుకొంటిరి.
29. నేను మిమ్ము హెచ్చరించుచు 'వారిని గూర్చి మీరు దిగులు పడవలదు, వారికి భయపడవలదు,
30. మిమ్ము నడిపించు ప్రభువే మీ పక్షమున పోరాడును. ఆయన ఐగుప్తున మీ కోపు తీసికోలేదా?
31. మీరు ఎడారిగుండ పయనించి ఇచటికి చేరినపుడు త్రోవ పొడుగున ప్రభువు మీకు బాసటయై యుండెను. తండ్రి కుమారునివలె ఆయన మిమ్ము మోసికొనివచ్చెను' అని పలికితిని.
32. కాని నేనెంత మొత్తుకొన్నను మీరు యావేను నమ్మరైతిరి.
33. మీ ప్రయాణమున ఆ ప్రభువు మీకు ముందుగా వెళ్ళి మీకు విడిదిని వెదకెడువాడు. రేయి మీకు త్రోవ చూపించుటకై మీ ముందు నిప్పుకంబములో, పగలు మేఘస్తంభములో పయనించెడివాడు.
34. మీ గొణగుడు విని యావే మండిపడెను.
35. 'ఈ దుర్మార్గపుతరములో ఒక్కడుకూడ వారి పితరులకు నేను వాగ్దానము చేసిన సారవంతమైన నేలపై అడుగు పెట్టజాలడు.
36. యెపున్నె కుమారుడు కాలేబు మాత్రము ఆ దేశము చేరుకొనును. అతడు నాపట్ల విశ్వాసము చూపెను కనుక కాలేబు వేగుచూచిన దేశమును అతనికిని అతని వంశజులకును ఇచ్చెదను' అని ఒట్టు పెట్టుకొనెను.
37. మీవలన ప్రభువు నామీద గూడ విరుచుకొనిపడి 'నీవు ఆ భూమిని చేరజాలవు సుమా!
38. నీ సేవకుడును, నూను కుమారుడునగు యెహోషువ ఆ దేశమున కాలిడును. అతనిని ప్రోత్స హింపుము. ఆ ప్రదేశమును యిస్రాయేలీయులకు వారసభూమిగా పంచి ఇచ్చువాడు అతడే' అని చెప్పెను.
39. మరియు 'మీ చిన్నపిల్లలను శత్రువులు పట్టుకొందురేమోయని నీవు భయపడితివి. అన్నెముపున్నెము ఎరుగని ఆ పసికందులు ఆ దేశము చేరుదురు. నేను ఆ నేలను వారికిత్తును. వారు దానిని స్వాధీనము చేసికొందురు.
40. మీరు మాత్రము వెనుదిరిగి ఎడారి మార్గముపట్టి రెల్లుసముద్రమువైపు వెళ్ళిపోవలసినదే.' అనెను.
41. అప్పుడు మీరు నాతో 'మేము ప్రభువు యెడల అపరాధము చేసితిమి. ఆయన ఆజ్ఞాపించినట్లే శత్రువులమీదికి యుద్ధమునకు పోయెదము' అని యంటిరి. మీరందరును ఆయుధములను ధరించి, ఆలోచింపక మన్నెముమీదికి వెడలిరి.
42. కాని ప్రభువు నాతో 'వీరిని యుద్ధమునకు పోవలదని చెప్పుము. నేను వారికి తోడ్పడను. శత్రువులు వారిని ఓడింతురు' అని చెప్పెను.
43. నేను ఆ సంగతి మీతో చెప్పితినిగాని మీరు లెక్కచేయరైరి. ప్రభువు ఆజ్ఞను ధిక్కరించి తలబిరుసుతనముతో మన్నెము మీదికి దాడిచేసిరి.
44. అప్పుడు ఆ కొండమీద వసించు అమోరీయులు కందిరీగలవలె వెడలివచ్చి, మిమ్ము హోర్మా వరకును తరిమికొట్టి సెయీరున ఓడించిరి.
45. మీరు తిరిగివచ్చి యావే ఎదుట కన్నీరు గార్చిరి. అయినను ప్రభువు మీ వేడికోలు ఆలింపనులేదు, మిమ్ము పట్టించుకొననులేదు.
46. కనుక మీరు చాలనాళ్ళు కాదేషుననే పడి యుండవలసి వచ్చినది.
1. కనుక యావే ఆజ్ఞాపించినట్లే మనమెల్లరము వెనుదిరిగి ఎడారిగుండ నడచి రెల్లు సముద్రమువైపు వెళ్ళితిమి. చాలనాళ్ళు సేయీరు మన్నెమున తిరుగాడితిమి.
2-3. అంతట ప్రభువు నాతో 'మీరు ఈ కొండలలో చాలనాళ్ళు గడిపిరి. ఇక ఉత్తర దిశకు పొండు.
4. ఈ ప్రజలతో నీవిట్లు చెప్పవలయును. మీరు మన దాయాదులగు ఏసావు వంశజులు నివసించు సెయీరు గుండ ప్రయాణము చేయవలయును. వారు మిమ్ముచూచి భయపడుదురు.
5. కాని మీరు వారిని రెచ్చగొట్టరాదు. నేను వారి నేలలో బెత్తెడైనను మీకీయను. సెయీరు మన్యమును పూర్వమే ఏసావు వంశజులకు ఇచ్చితిని.
6. ఆ దేశమున మీరు తినుతిండికి, త్రాగునీటికి వారికి సొమ్ము చెల్లింపుడు' అనెను.
7. మీరు చేయు కార్యములనెల్ల ప్రభువు దీవించెను. ఈ విశాలమైన ఎడారిగుండ పయనించు నపుడు అతడు మిమ్ము కాపాడెను. ఈ నలువదియేండ్లు ప్రభువు మీకు చేదోడువాదోడుగా నుండెను. అతని కృపవలన మీకు ఏమియు తక్కువ కాలేదు.
8. ఆ రీతిగా మనము సేయీరు దాటితిమి. ఏసోన్గ్‌బేరు, ఎలాతు మైదాన మార్గమునుండి మృత సముద్రమునకు పోవు మార్గమును వీడి మోవాబునకు పోవు త్రోవపట్టితిమి.
9. అప్పుడు ప్రభువు 'మీరు మోవాబు ప్రజలను రెచ్చగొట్టి యుద్ధమునకు ప్రేరేపింప వలదు. నేను ఆరు పట్టణమును పూర్వమే లోతు వంశజులకు ఇచ్చితిని. వారి నేల మరల మీకీయను' అని చెప్పెను.
10. పూర్వము ఏమీయులు అనబడు వారు చాలమంది అచట జీవించిరి. వారు అనాకీయులు వలె ఆజానుబాహులు.
11. అనాకీయులు వలె వారికిని రేఫాయీమీయులని కూడ పేరు. అయినను మోవాబీయులు వారిని ఏమీయులనియే పిలిచెడి వారు.
12. పూర్వము ఇచట హోరేయులు అనువారు కూడ వసించిరి. కాని ఏసావువంశజులు వారిని వెలుపలకు తరిమి నాశనముచేసి ఆ దేశమును ఆక్ర మించుకొనిరి. అట్లే యిస్రాయేలు ప్రజలును ప్రభువు తమకిచ్చిన నేలమీదినుండి శత్రువులను తరిమి వేసితిరిగదా!
13-14. అంతట మనము ప్రభువు ఆజ్ఞపై సేరేదు నది దాటితిమి. కాదేషు బార్నెయా నుండి సేరెదు నది చేరుటకు మనకు ముప్పదియెనిమిదేండ్లు పట్టినది. ప్రభువు సెలవిచ్చినట్లే ఈ కాలమున మన ప్రజలలో యుద్ధము చేయగలవారందరును చనిపోయిరి.
15. ప్రభువుహస్తము వారి మనుగడకు అడ్డుతగిలెను. కనుక వారెల్లరు గతించిరి.
16-17. ఆ రీతిగా యుద్ధము చేయగలవారందరును కన్నులు మూయగా ప్రభువు నాతో 'నేడు మీరు ఆరు పట్టణము మీదుగా మోవాబు దాటిపోవలయును.
18-19. ఆ పిమ్మట మీరు లోతు వంశజులైన అమ్మోనీయుల మార్గమున వెళ్ళునపుడు మీరు వారిని రెచ్చగొట్టి పోరునకు ప్రేరేపింపవలదు. నేను వారిదేశమును మీకీయను. దానిని ఏనాడో వారికిచ్చివేసితిని' అని అనెను.
20. ఈ దేశమునకు గూడ రేఫాయీము అని పేరు. పూర్వమిచట రేఫాయీమీయులు వసించిరి. కాని అమ్మోనీయులు వారిని 'సమ్సుమ్మీయులు' అని పిలిచెడివారు.
21. వారు అనాకీయులవలె చాల పెద్దజాతి, ఆజానుబాహులు. కాని ప్రభువు వారిని నాశనముచేయగా అమ్మోనీయులు ఆ దేశమును ఆక్రమించుకొని అచట స్థిరపడిరి.
22. అట్లే ప్రభువు హోరీయులను నాశనముచేయగా ఏసావు సంతతి వారు వారికి చెందిన సేయీరు దేశమును ఆక్రమించు కొని అందు స్థిరపడి, నేటికిని అచటనే వసించుచున్నారు గదా!
23. అదే విధముగా అవ్వీయులు దక్షిణమున గాజా వరకు స్థిరపడియుండిరి. కఫ్తోరు నుండి కఫ్తోరీయులు వెడలివచ్చి అవ్వీయులను వధించి వారి దేశమున స్థిరపడిరి. ఆ రీతిగా మనము మోవాబు దాటిన తరువాత ప్రభువు నాతో
24. మీరిచట నుండి బయలుదేరిపోయి అర్నోను ఏరుదాటుడు. అమోరీయుడును హెష్బోను రాజగు సీహోనును మీ వశము చేసితిని. అతని రాజ్యమును మీకిచ్చితిని. మీరు అతని మీదపడి ఆ దేశమును ఆక్రమించుకొనుడు.
25. నేటి నుండి ప్రజలందరికి మీరనిన భయము పుట్టింతును. మీ పేరు వినగనే అన్ని జాతులు భీతితో కంపించి పోవును' అని పలికెను. ,
26. అప్పుడు నేను కెడెమోతు ఎడారినుండి హెష్బోను రాజగు సీహోనునకు ఇట్లు శాంతి సందేశము పంపితిని.
27. 'మేము నీ దేశముగుండ ప్రయాణము చేయనెంచుచున్నాము. ' మేము రాజమార్గములోనే వెళ్ళెదము. త్రోవనుండి కుడిఎడమలకు బెత్తెడైనను కదలము.
28-29. మీ దేశమున తినిన తిండికి, త్రాగిన నీటికి రూకలు చెల్లింతుము. మేము యోర్దాను దాటి దేవుడు మాకిచ్చిన నేలను చేరుకోవలెను. సేయీరున నివశించు ఏసావు వంశజులు, ఆరున వసించు మోవాబీయులు మాకు దారియిచ్చిరి.'
30. కాని సీహోను మనకు దారి ఈయడయ్యెను. మీ దేవుడైన ప్రభువు ప్రేరణమువలన అతడు మొండికెత్తి గుండె బండచేసికొనెను. కనుక నేడు జరిగినట్లుగా ప్రభువు అతనిని మన వశముచేసెను.
31. అప్పుడు ప్రభువు నాతో సీహోనును అతని దేశమును మీచేతికి అప్పగించితిని. ఈ నేలను జయించి స్వాధీనము చేసి కొనుడు' అని చెప్పెను.
32. అంతట సీహోను జనమును ప్రోగుచేసికొని వచ్చి యాహాసువద్ద మనలను ఎదిరించెను.
33. ప్రభువు అతనిని మనచేతికి చిక్కించెను. కనుక మనము ఆ రాజును అతని కుమారులను, ప్రజలను చంపితిమి.
34. అతని పట్టణములను పట్టుకొంటిమి. అచటి స్త్రీ పురుషులను, పిల్లలను ఒక్కరినిగూడ తప్పిపోనీయకుండ అందరిని శాపము పాలుచేసి మట్టుబెట్టితిమి.
35. ఆ నగరములను కొల్లగొట్టి అచటి పశువులమందలను తోలుకొని వచ్చితిమి.
36. అర్నోను లోయ అంచుననున్న అరోయేరు పట్టణము మొదలుకొని గిలాదు వరకును గల ప్రతి నగరము మనకు లొంగిపోయెను. వానినన్నిటిని ప్రభువు మన వశముచేసెను.
37. అయినను అమ్మోనీ యుల దేశమునుగాని, యబ్బోకు నదీతీరమునుగాని, మన్యముననున్న నగరమునుగాని, ప్రభువు నిషేధించిన మరి ఏ ప్రాంతమునుగాని మనము సమీపింపలేదు.
1. తదనంతరము ఉత్తర దిక్కుగా నడచి బాషాను మండలము చేరుకొంటిమి. అప్పుడు ఆ దేశమునేలు రాజు ఓగు బాషాను జనమును ప్రోగుజేసికొనివచ్చి ఎడ్రెయి వద్ద మనలను ఎదిరించెను.
2. ప్రభువు నాతో 'నీవు ఇతనికి భయపడవలదు. ఈ రాజును, ఇతని ప్రజలను, దేశమును మీ వశముచేసితిని. హెష్బోనున వసించిన అమోరీయ ప్రభువు సీహోనును వలె ఇతనిని గూడ ఓడింపుము' అని చెప్పెను.
3. ఆ రీతిగా ప్రభువు ఓగురాజును అతని జనులందరిని మన చేతికి చిక్కించెను. మనము ఒక్కరిని మిగిలింపక అందరిని వధించితిమి.
4. ఒక్కదానిని కూడ వదలి పెట్టకుండ వారి పట్టణములన్నిటిని పట్టుకొంటిమి. అవి అన్నియు కలిసి అరువది నగరములు. అవి యర్గోబు సీమలోనున్నవి. బాషాను రాజగు ఓగు పరిపాలించినది అచటనే.
5. అవియన్నియు సురక్షిత పట్టణములు. వాటికి ఎత్తయిన ప్రాకారములు, కవాటములు, ఆ కవాటములకు లోపలినుండి బిగించుటకు గడియలు కలవు. ఇదిగాక అరక్షిత పట్టణములు చాల కలవు.
6. హెష్బోను రాజగు సీహోను నగరములవలె ఈ పట్టణములను గూడ శాపము పాలుచేసి, నాశనము చేసితిమి. అందలి స్త్రీ, పురుషులను, పిల్లలను చంపితిమి.
7. ఆ నగరములను దోచుకొని అచటి పశువులమందలను తోలుకొనివచ్చితిమి.
8. ఆ రీతిగా మనము ఇద్దరు అమోరీయ రాజుల నుండి యోర్దాను తూర్పుసీమను వశము చేసికొంటిమి. ఆ నేల అర్నోనునది అంచునుండి హెర్మోను కొండ వరకు వ్యాపించియున్నది.
9. (ఈ కొండనే సీదోనీయులు సిర్యోను అని, అమోరీయులు సెనీరు అని పిలుచుదురు.)
10. పీఠభూమిలోని నగరములన్నిటిని, గిలాదు అంతటిని, ఓగు రాజు ప్రధాన పట్టణములైన సల్కా ఎద్రెయిల వరకు వ్యాపించియున్న బాషాను రాజ్యమును అంతటిని మనము జయించితిమి.
11. (ఓగురాజు రేఫా జాతిలో చివరివాడు. అతనికి ఇనుముతో చేసిన పడకమంచము కలదు. ప్రామాణికమైన కొలమానము ప్రకారము దాని పొడవు తొమ్మిది మూరలు. వెడల్పు నాలుగుమూరలు. అమోరీయులకు చెందిన రబ్బా నగరమున నేటికిని దానిని చూడవచ్చును.)
12. అర్నోనులోయ అంచులలోని అరెయోరు పట్టణమునకు ఉత్తరదిక్కున గల భాగమును, గిలాదు కొండభాగము సగమును ఆ సమయమున ఆక్రమించుకొంటిమి. నేను గిలాదు పీఠభూమిలో సగమును, అందలి పట్టణములను రూబేను, గాదు తెగలకిచ్చితిని.
13. మనష్షే అర్ధతెగకు గిలాదున మిగిలిన భాగమును, ఓగు రాజు దేశమైన బాషానును ఇచ్చితిని. అర్గోబు సీమను, బాషానును కలిపి రేఫా మండలమని పిలిచెడి వారు.
14. గెషూరు, మాకా సరిహద్దుల వరకుగల అర్గోబు మండలమునంతటిని మనష్షే వంశజుడైన యాయీరు స్వాధీనము చేసికొనెను. అతడు అచటి నగరములన్నిటికి తన పేరు పెట్టెను. కనుక నేటికిని అవి యాయీరునగరములు అనియే పిలువబడుచున్నవి.
15. మనష్షే తెగవాడైన మాకీరునకు నేను గిలాదును ఒసగితిని.
16. రూబేను, గాదు తెగలకు గిలాదు నుండి అర్నోను నదివరకు విస్తరించియున్న దేశమును ఇచ్చితిని. ఈ నది మధ్యభాగమే వారికి దక్షిణపు సరిహద్దు. ఉత్తరపు సరిహద్దు యబ్బోకు నదివరకును, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును ఉన్నది.
17. పశ్చిమమున యోర్దానునది వారికి సరిహద్దు. మరియు వారి నేల ఉత్తరమున కిన్నెరతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండచరియల దిగువగా దక్షిణమున మృతసముద్రము వరకు ఉన్న అరాబా ప్రదేశమున వ్యాపించియుండెను.
18. ఆ సమయమున నేను మీతో ఇట్లు చెప్పితిని. 'యోర్దానుకు తూర్పునగల ఈ దేశమును ప్రభువు మీకు స్వాధీనము చేసెను. మీలో యుద్ధము చేయగలవారందరును ఆయుధములు చేపట్టి తోటి యిస్రాయేలీయుల కంటెను ముందుగాపోయి నదిని దాటుడు.
19. మీ భార్యలు, పిల్లలు, మందలు మాత్రము నేను మీకొసగిన నగరములలోనే ఉండ వచ్చును. మీకు చాలమందలున్నవని నేనెరుగుదును.
20. ప్రభువు యోర్దానునకు పశ్చిమముననున్న దేశమును మీ తోటియిస్రాయేలీయులకు ఇచ్చెను. మీరు ఈ ప్రదేశమున ఉన్నట్లే వారుకూడ ఆ నేలను ఆక్రమించుకొని అచట సుఖముగా స్థిరపడువరకు మీరు వారికి సహాయము చేయవలయును. ఆ పిమ్మట నేను మీకిచ్చిన ఈ దేశమునకు మీరు తిరిగి రావచ్చును.'
21. తదనంతరము నేను యెహోషువతో “ప్రభువు ఆ ఇద్దరు రాజులకు ఏమిచేసెనో నీవు కన్నులార చూచితివి గదా! మీరు వెళ్ళుచున్న దేశముల రాజులకుగూడ ఆయన అదేగతి పట్టించును.
22. కనుక మీరు ఆ రాజులకు భయపడవలదు. మీ ప్రభువు మీ పక్షమున వారితో పోరాడును' అని చెప్పితిని.
23-24. అంతట నేను యావేతో 'ప్రభూ! నీ మహత్తును, బలమును ఈ దాసునకు తెలియజేయ బూనితివి. నీవు చేసిన మహాకార్యములు, అద్భుతములు చేయగల దేవుడు భూమ్యాకాశములందు ఒక్కడును లేడు.
25. ప్రభూ! నన్ను యోర్దాను దాటి సారవంతమైన ఆవలినేలను కన్నులార చూడనిమ్ము. పర్వతములతో అలరారు ఆ సుందరదేశమును ఆ లెబానోను కొండలను తనివితీరచూడనిమ్ము' అని మొరపెట్టుకొంటిని.
26. కాని మీ మూలముగా ప్రభువు నామీద మండిపడి నా మొరవినడయ్యెను. ఆయన 'ఓయి! నీ వేడికోలు ఇకచాలు! ఈ సంగతి నా యెదుట మరలఎత్తవద్దు.
27. నీవు పిస్గా కొండనెక్కి పడమరవైపు, ఉత్తరము వైపు, దక్షిణమువైపు, తూర్పువైపును పరికింపుము. ఆ దేశమును జాగ్రత్తగా పరిశీలించి చూడుము. నీవు మాత్రము యోర్ధాను దాటిపోజాలవు.
28. నీవు యెహోషువకు ఉపదేశము చేయుము. అతనికి ప్రోత్సాహము కలిగించి బలపరుపుము. ప్రజలను నడిపించు కొనిపోయి నీవు చూచిన ఈ నేలను వారిచే ఆక్రమింప చేయువాడు అతడే' అని పలికెను.
29. అపుడు మనము బేత్పేయోరు నగరమెదుట లోయలో దిగియుంటిమి.
1. యిస్రాయేలీయులారా! నేడు నేను మీకు బోధించుచున్న చట్టములను, విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకొసగిన నేలను స్వాధీనము చేసికొందురు.
2. మీ దేవుడైన యావే ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో మీరు ఏమియును చేర్చరాదు. వానినుండి ఏమియును తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు.
3. బాలు పెయోరు కొండ వద్ద ఏమి జరిగినదో మీ కంటితోనే చూచితిరిగదా! అచట బాలు పెయోరును ఆరాధించిన వారినందరిని ప్రభువు నాశనము చేసెను.
4. కాని నిండుహృదయముతో ప్రభువును అనుసరించిన వారందరు నేటికిని బ్రతికి యున్నారు.
5. ప్రభువైన దేవుడు నన్నాజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను, చట్టములను బోధించితిని. మీరు ఆక్రమించుకొని స్వాధీనము చేసికొనబోవు నేలమీద ఈ ఆజ్ఞలన్నిటిని పాటింపుడు.
6. మీరు ఈ విధులన్నిటిని అనుసరింతురేని ఇతరజాతులు మీరెంత వివేకవంతులో, ఎంతవిజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులనుగూర్చి విన్నపుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము, విజ్ఞానము అబ్బినదిగదా! అని విస్తుపోవుదురు.
7. ఔనుమరి! మనదేవుడు పిలువగానే పలుకును. ఏ జాతిజనులకైనను, ఎంత గొప్పజాతి జనులకైనను వారి దేవుడు మనదేవునివలె చేరువలో నున్నాడా?
8. ఏ జాతికైనను, ఎంత గొప్పజాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధులవంటి ఆజ్ఞలు, చట్టములు కలవా?
9. కాని జాగ్రత్త! ఆనాడు మీరు కన్నులార గాంచిన అంశములను మరువకుడు. జీవితాంతము వానిని జ్ఞప్తియుంచుకొనుడు. వానిని మీ కుమారులకు, మనుమలకు గూడ తెలియజేయుడు.
10. నాడు మీరు హోరేబు కొండచెంత మీ దేవుని సమక్షమున నిలుచుండి యుంటిరి. అప్పుడు ప్రభువు నాతో 'నీవు ప్రజలను ప్రోగుజేయుము. వారికి నా ఆజ్ఞలను బోధింతును. ఈ నేలమీద జీవించినంతకాలము వారు నాకు విధేయులై ఉండవలయును. వారు నాకు భయపడవలయునని తమ బిడ్డలకుగూడ బోధింప వలయును' అని పలికెను.
11. అప్పుడు మీరెల్లరు కొండదిగువన నిలువబడియుంటిరి. ఆ కొండమీద దట్టమైన కారుమబ్బులు క్రమ్ముకొనియుండెను. అది ఆకాశము వరకు నిప్పులు క్రక్కుచుండెను.
12. ఆ నిప్పుమంటల నడుమనుండి ప్రభువు మీతో సంభా షించెను. మీరు ప్రభువు సంభాషణధ్వని వింటిరిగాని ఏ రూపమును మీరు చూడలేదు, స్వరమును మాత్రమే వింటిరి.
13. అప్పుడు ప్రభువు తన నిబంధనమును మీకు ప్రకటించెను. మీరు ఆ ఒడంబడికను అనగా పది ఆజ్ఞలను పాటింపవలయునని ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞలను ఆయన రెండు రాతిపలకల మీద వ్రాసి ఇచ్చెను.
14. మీరాక్రమించుకొని స్వాధీనము చేసికొన బోవు నేలమీద ఈ విధులను, చట్టములను పాటించునట్లుగ నేను మీకు బోధింపవలయునని ప్రభువు కట్టడ చేసెను.
15. ఆనాడు ప్రభువు హోరేబు కొండమీది నిప్పు మంటల నడుమ నుండి మీతో మాటాడినపుడు మీరు ఏ రూపమును చూడరైతిరి. కనుక జాగ్రత్త వహింపుడు.
16-18. మీరెట్టి ఆకారముతోనైన విగ్రహములను చేసి పాపము మూటగట్టుకొనకుడు. స్త్రీ పురుషులు, భూమిమీది జంతువులు, ఆకాశమున ఎగురుపక్షులు, నేలమీద ప్రాకు పురుగులు, నీటిలో సంచరించు చేపలు- వేని విగ్రహములను చేయకుడు.
19. మీరు ఆకాశమున కన్పించు సూర్యచంద్రనక్షత్రాదులకు భ్రమసిపోయి వానికి ఆరాధనలర్పించి సేవలు చేయ రాదు. ప్రభువు వాని ఆరాధనను భూమిమీది నానా జాతులకు వదలివేసెను.
20. కాని మిమ్ము మాత్రము అతడు ఐగుప్తుదేశమున ఇనుప కొలిమినుండి తరలించు కొనివచ్చెను. ఎందుకో తెలియునా? మీరు ఈనాడు అయినట్లుగా అతని సొంత ప్రజలగుట కొరకే.
21. మీ కార్యములను బట్టి ప్రభువు నామీద మండిపడెను. నేను యోర్దాను దాటననియు ప్రభువు మీకొసగబోవు సారవంతమైన నేలమీద అడుగుపెట్టననియు ఆయన శపథము చేసెను.
22. నేను యోర్ధాను దాటకుండా, ఈ దేశముననే కన్ను మూయుదును. మీరు మాత్రము యోర్ధాను దాటి ఆ సారవంతమైన నేలను భుక్తము చేసికొందురు.
23. కనుక జాగ్రత్త! మీ ప్రభువు మీతో చేసికొనిన ఒడంబడికను విస్మ రింపకుడు. ఆయన నిషేధించిన విగ్రహములను, రూపములను చేయకుడు.
24. ఏలయన, మీ ప్రభువైన యావే దహించివేయు అగ్నివంటివాడు, అసూయాపరుడైన ' దేవుడు.
25. మీరు ఆ నేలమీద చాలకాలము వసించి కుమారులను, మనుమలను కన్నపిదప కూడ ఏ ఆకారముతోనైనను విగ్రహములనుచేసి పాపము కట్టుకొనకుడు. ఇది ప్రభువు సహింపని దుష్కార్యము కనుక మీరతని కోపమును రెచ్చగొట్టుదురు.
26. మీరు ఈ ఆజ్ఞను పాటింపరేని నాశనమైపోయెదరని భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. మీరు యోర్ధానునకు ఆవలివైపున స్వాధీనము చేసికొన బోవు భూమిపై ఎక్కువకాలము మనజాలరనియు, మొదలంట నాశనమై పోవుదురనియు ప్రమాణము చేసి చెప్పుచున్నాను.
27. ప్రభువు మిమ్ము అన్యదేశ ములలో ఇతరజాతులనడుమ చెల్లాచెదరుచేయును. మీలో కొద్దిమంది మాత్రమే అట మిగులుదురు.
28. అచట నరుల చేతిపనియైన రాతి, కొయ్యవిగ్రహములు న్నవి కదా! చూచుటకును, వినుటకును, భుజించుట కును, వాసన చూచుటకును ఆ బొమ్మలకు శక్తిలేదు. మీరు గూడ వానిని సేవింపవలసియుండును.
29. అక్కడి నుండి మీరు మీ ప్రభువైన దేవునికొరకు వెదకుదురు. కాని పూర్ణహృదయముతో వెదకుదురేని ఆయనను కనుగొందురు.
30. నేను పేర్కొనిన కష్టము లన్నియు వాటిల్లును. మీకు బాధలు సంభవించగ చిట్టచివరకు మీరు ప్రభువునొద్దకు తిరిగివచ్చి ఆయన మాటవిందురు.
31. మీ ప్రభువైన దేవుడు కనికరము గల దేవుడు. కాబట్టి మిమ్ము చేయివిడువడు, నాశనము చేయడు. మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనమును విస్మరింపడు.
32. భూతకాలమును, మీ పుట్టుకకు ముందటి కాలమును, దేవుడు నరుని సృజించిన ఆదికాలమును పరిశీలింపుడు. నేల నాలుగుచెరగులు గాలించినను ఇంతటి మహావాక్కు ఎందైనగలదా? ఇంతటి మహా భాషణము ఎందైన వినిపించినదా?
33. మీరు తప్ప మరి ఏ జాతియైనను నిప్పుమంటల నడుమనుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికి యున్నదా?
34. ఏ దేవుడైన ఒక జాతి నడుమనుండి మరియొక జాతిని తరలించుకొనివచ్చెనా? కాని మీరు కన్నులార చూచుచుండగనే మీ దేవుడు శోధనలతోను, సూచకక్రియలతోను, అద్భుతములతోను, యుద్ధముతోను, తన బాహుబలముతోను, చాచిన కరముతోను, మహాభయంకర కార్యములతోను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చెను గదా!
35. ప్రభువు తప్ప మరియొక దేవుడు లేడని రుజువుచేయుట కొరకే ఆయన ఈ కార్యములను చేసెను.
36. మీకు ఉపదేశము చేయుటకొరకే ఆయన ఆకాశము నుండి తన భాషణమును వినిపించెను. ఈ భూమిమీద ఆయన మీకు తన మహాగ్నిని చూపించెను. ఆ అగ్నినుండి మీరు ఆయన వాక్కు వింటిరి.
37. ప్రభువు మీ పితరులను ప్రేమించెను. కనుక వారి సంతానమైన మిమ్మునుకూడ చేపట్టెను. స్వయముగా తన మహాబలముతో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొనివచ్చెను.
38. మీరు బయల్వెడలివచ్చినప్పుడు మీకంటె సంఖ్యావంతులును, శక్తిమంతులునైన జాతులను ఆయన మీ ఎదుటనుండి తరిమివేసి వారి దేశములను మీకిచ్చెను. నేటికి మీరు వానిని అనుభవించుచున్నారు.
39. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. మీది ఆకాశము నగాని, నేల మీదగాని, క్రిందగాని యావేయే దేవుడు గాని మరియొక దేవుడు లేడు.
40. నేను ఆదేశించినట్లుగనే మీరు ఆయన ఆజ్ఞలను, చట్టములను పాటింపుడు. అప్పుడు మీకును, మీ తరువాతి సంతానమునకును క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయనున్న నేలమీద మీరు దీర్ఘాయుష్మంతులై కలకాలము వర్థిల్లుదురు.”
41. అంతట మోషే యోర్దానునకు తూర్పున మూడు పట్టణములు ప్రత్యేకించెను.
42. ఎవడైన తన పొరుగువాని పై పగలేకయే వానిని యాదృచ్ఛికముగా చంపినయెడల ఈ పట్టణములకు పారిపోయి అచట తలదాచుకొనవచ్చును.
43. ఆ పట్టణములివి: రూబేను తెగల ఎడారి పీఠభూములలోని బేసేరు, గాదు తెగల గిలాదు మండలములోని రామోతు, మనష్షే తెగల బాషాను మండలమునందలి గోలాను.
44. మోషే యిస్రాయేలీయులకు ఇచ్చిన ధర్మ శాస్త్రము ఇది.
45. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చిన తరువాత మోషే వారికి నిర్దేశించిన విధులు, చట్టములు ఇవి.
46. వారు యోర్ధాను నదికి తూర్పున లోయలో బెత్పెయోరు నగరముచెంత ఉన్నప్పుడు అతడు ఈ కట్టడలు చేసెను. ఈ నగరము హెష్బోనున పరిపాలనము చేసిన అమోరీయరాజగు సీహోను దేశమునగలదు. మోషే, యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలి వచ్చినప్పుడు ఈ రాజును ఓడించిరి.
47. యిస్రాయేలీయులు సీహోను దేశమునే గాక బాషాను రాజగు ఓగు దేశమునుగూడ స్వాధీనము చేసికొనిరి. ఇతడు మరియొక అమోరీయరాజు. యోర్డానునకు తూర్పున రాజ్యము చేయుచుండెడి వాడు.
48. వారు స్వాధీనముచేసికొనిన దేశము అర్నోను నది అంచుననున్న అరోయేరు పట్టణము నుండి ఉత్తరమున సిర్యోను అనగా హెర్మోను కొండ వరకు వ్యాపించియుండెను.
49. మరియు యోర్దానునకు తూర్పున నున్న భాగముకూడ మృతసముద్రము వరకును, పిస్గా కొండలవరకును ఈ దేశముననే చేరియుండెను.
1. మోషే యిస్రాయేలీయులందరిని చేరబిలిచి వారితో ఇట్లనెను: “యిస్రాయేలీయులారా వినుడు! నేడు నేను మీకు ఉపదేశించు ఆజ్ఞలను, చట్టములను ఆలింపుడు. వీనిని నేర్చుకొని మీ అనుదిన జీవితమున పాటింపుడు.
2. హోరేబు వద్ద మన ప్రభువైన దేవుడు మనతో నిబంధనము చేసికొనెను.
3. మన పితరులతో మాత్రమేకాదు, నేడు ఇచట బ్రతికియున్న మన అందరితోను ఈ నిబంధనము చేసికొనెను.
4. కొండ మీద నిప్పుమంటల నడుమనుండి ప్రభువు మీతో ముఖాముఖి సంభాషించెను.
5. అప్పుడు నేను మీకును, ప్రభువునకును మధ్య నిలుచుండి ఆయన పలుకులు మీకెరిగించితిని. మీరు ఆ అగ్నికి భయపడి కొండమీదికి వెళ్ళరైతిరి.
6. అప్పుడు ప్రభువు ఇట్లనెను: నేను మీ దేవుడనైన ప్రభుడను. దాస్యనిలయమైన ఐగుప్తునుండి మిమ్ము తోడ్కొనివచ్చినది నేనే.
7. మీకు నేనుతప్ప మరియొక దేవుడులేడు.
8. పైన ఆకాశమునందే గాని, క్రింది నేలమీదయే గాని, నేల క్రిందిసముద్రముననే గాని ఉన్న ఏ వస్తువు ప్రతిరూపమునుగాని, విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు.
9. మీరు విగ్రహములకు మ్రొక్కి వానిని పూజింపరాదు. మీ ప్రభుడనైన నేను, అసూయపరుడనైన దేవుడను. నన్ను ద్వేషించువారిని నేను శిక్షింతును. వారి వంశజులనుకూడ మూడునాలుగు తరములవరకు శిక్షింతును.
10. కాని నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించువారిని వేయితరములదాక కరుణింతును.
11. మీ దేవుడైన ప్రభువు నామమును దుర్వినియోగము చేయకుడు. ప్రభుడనైన నేను, నా నామమును దుర్వినియోగము చేయువారిని శిక్షించి తీరుదును.
12. “మీ ప్రభుడనైన నేను ఆజ్ఞాపించినట్లే మీరు విశ్రాంతిదినమును పాటింపుడు. దానిని పవిత్రముగా ఉంచుడు.
13. మీరు ఆరుదినములు శ్రమించి మీ పనులన్నియు చేసికోవచ్చును. .
14. కాని ఏడవ దినమునాడు మీ దేవుడనైన నాకు విశ్రాంతిదినము. ఆనాడు మీరును, మీ కొడుకులును, కుమార్తెలును, దాసదాసీజనమును, ఎద్దు, గాడిద మొదలైన పశువు లును, మీతో వసించు పరదేశులును పనిచేయరాదు. మీ దాసదాసీజనము కూడ మీవలె విశ్రాంతి తీసికోవలెను.
15. మీరు ఒకప్పుడు ఐగుప్తున బానిసలుగా ఉంటిరని గుర్తుంచుకొనుడు. ప్రభుడనైన నేను మహా బలముతో, చాచిన బాహువుచేత మిమ్ము అచటి నుండి తోడ్కొనివచ్చితిని. కనుకనే మీ ప్రభుడనైన నేను మీరు విశ్రాంతిదినమును పాటింపవలెనని ఆజ్ఞాపించు చున్నాను.
16. మీ ప్రభుడనైన నేను ఆదేశించినట్లే మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అటులచేసినయెడల నేను మీ కొసగబోవు నేలమీద మీరు దీర్ఘాయుష్మంతులై క్షేమముగా జీవింతురు.
17. హత్య చేయరాదు.
18. వ్యభిచరింపరాదు.
19. దొంగిలింపరాదు.
20. పొరుగు వానికి వ్యతిరేకముగా అబద్ద సాక్ష్యము చెప్పరాదు.
21. పొరుగు వాని భార్యను ఆశింపరాదు. పొరుగువాని ఇంటినిగాని, పొలమునుగాని, దాసదాసీ జనమునుగాని, ఎద్దు, గాడిద మొదలైన పశువులను గాని మరి అతనిది ఏదయినగాని ఆశింపరాదు.'
22. మీరు కొండ చెంత సమావేశమయినపుడు మీ ప్రభువు మీకు ఆదేశించిన ఆజ్ఞలివి. నిప్పుమంటల నడుమ నుండి దట్టమయిన కారుమబ్బునుండి గంభీర స్వరముతో ఆయన మీతో మాట్లాడెను. ఈ పలుకులు పలికినపిమ్మట ప్రభువు ఇంకేమియు చెప్పలేదు. ఈ ఆజ్ఞలను రెండు రాతిపలకలపై వ్రాసియిచ్చెను.”
23. “ఆ రీతిగా కొండ మంటలతో నిండియుండగా, కారుచీకటినుండి మీకు భాషణము వినిపింపగా, మీ తెగనాయకులు, పెద్దలు నా చెంతకు వచ్చి
24. 'మేము ప్రభువు నిప్పుమంటల నడుమ నుండి మాట్లాడగావింటిమి. ఆయన తన మహత్త్వమును మహిమను మా యెదుట ప్రదర్శించెను. దీనినిబట్టి దేవుడు నరునితో సంభాషించినను నరుడు బ్రతికి ఉండగలడని నేడు గుర్తించితిమి.
25. కాని మేమిపుడు మరల ప్రాణాపాయము తెచ్చుకోనేల? ఆ మహాగ్ని మమ్ము భస్మము చేయగలదు. ప్రభువు భాషణ మరియొకసారి వింటిమా మేమెల్లరమును తప్పక చనిపోవుదుము.
26. సజీవుడైన దేవుడు నిప్పుమంటల నడుమ నుండి భాషింపగా విని బ్రతికియున్నవారు, మేము తప్ప దేహధారులైన నరులలో ఇంకెవ్వరైన ఉన్నారా?
27. కనుక నీవు వెళ్ళి మన దేవుడైన ప్రభువు సెలవిచ్చు ఆజ్ఞలెల్ల విని తిరిగివచ్చి వానిని మాకెరిగింపుము. మేము ఆ ఆజ్ఞల ప్రకారము నడుచుకొందుము' అని చెప్పిరి.
28. ప్రభువు మీ మాటలాలించి నాతో 'నేను ప్రజల పలుకులు వింటిని. వారు చెప్పినది సమంజసముగనే ఉన్నది.
29. వారి హృదయములు ఎల్లప్పుడును ఈ రీతిగనే యుండిన ఎంత బాగుండును! వారెల్లప్పుడు నాకు భయపడి నా ఆజ్ఞలను పాటించిన ఎంత సమంజసముగానుండును! అప్పుడు వారికిని, వారి సంతానమునకును అభ్యుదయము కలుగును.
30. ఇక వారిని తమ గుడారములకు వెడలిపొమ్మని చెప్పుము.
31. కాని నీవిచటనే నిలువుము. నా ఆజ్ఞలు, విధులు, చట్టములు నీకు ఎరిగింతును. నీవు ఈ ఆజ్ఞలెల్ల వారికి బోధింప వలయును. నేను ఈ ప్రజలకు ఒనగబోవు నేలమీద వారు ఈ నియమములన్నియు పాటింపవలయును' అని నుడివెను.
32. కనుక యిస్రాయేలీయులారా! ప్రభువు ఆదేశించిన ఈ ఆజ్ఞలనెల్ల ఒక్క పొల్లుకూడ తప్పకుండ జాగ్రత్తగా పాటింపుడు.
33. ప్రభువు మీకు నిర్దేశించిన మార్గము వెంట పయనింపుడు. అప్పుడు మీరు క్షేమముగా బ్రతుకుదురు. మీరు స్వాధీనము చేసికొనబోవు నేలమీద చిరకాలము జీవింతురు.”
1. “ప్రభువు నన్ను మీకు ఉపదేశింపుమనిన ఆజ్ఞలు, విధులు, చట్టములు ఇవియే. మీరు స్వాధీ నము చేసికొనబోవు భూమిమీద వీనినెల్ల ఆచరింపుడు.
2. మీరు ఎల్లవేళల ప్రభువునకు భయపడుదురేని, నేనాదేశించిన ఈ ఆజ్ఞలనెల్ల శిరసావహింతురేని మీ వంశజులు కలకాలము బ్రతికిపోయెదరు.
3. కనుక యిస్రాయేలీయులారా! ఈ ఉపదేశమును ఆలింపుడు. ఈ ఆజ్ఞలు చేకొనుడు. అప్పుడు మీకు క్షేమము కలుగును. మన పితరుల దేవుడు వాగ్దానముచేసిన పాలుతేనెలు జాలువారు నేలమీద మీరు బహుగా వృద్ధి చెందుదురు.
4. యిస్రాయేలీయులారా వినుడు! మన ప్రభుడైన దేవుడు ఏకైక ప్రభువు.
5. మీ ప్రభువైన దేవుని పూర్ణహృదయముతోను, పూర్ణఆత్మతోను, పూర్ణశక్తితోను ప్రేమింపుడు.
6. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుడు.
7. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను, బయటనున్నను, విశ్రాంతి తీసికొనుచున్నను, లేచు నప్పుడును వీనినిగూర్చి ముచ్చటింపుడు.
8. ఈ ఆజ్ఞలను ఎల్లపుడు జ్ఞప్తియుంచుకొనుటకై గురుతుగా మీ చేతులమీదను, బాసికమువలె మీనొసటిమీదను కట్టుకొనుడు.
9. మీ ఇంటిద్వార బంధములమీదను, పురముఖద్వారములమీదను వీనిని వ్రాసికొనుడు."
10. “ప్రభువు మీ పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ప్రమాణముచేసినట్లే ఆ దేశమును మీకిచ్చును. అచ్చట మీరు నిర్మింపని విశాలమైన మంచిపట్టణములు ఉండును.
11. అచటి ఇండ్లలో మీరు చేకూర్చని మంచివస్తువులెన్నో మీకు ఇత్తును. మరియు అచట మీరు త్రవ్వకున్నను త్రవ్వి యున్నబావులు, మీరు నాటని ఓలివుతోటలు, ద్రాక్ష తోటలు ఉండును. వాని పండ్లను మీరు సంతృప్తిగా భుజింతురు.
12. కాని దాస్యగృహమైన ఐగుప్తునుండి మిమ్ము తోడ్కొని వచ్చిన ప్రభువును విస్మరింతురేమో జాగ్రత్త!
13. మీరు ఆ ప్రభువునకు భయపడుడు. ఆయనకు మ్రొక్కుడు. ఆయన పేరు మీదుగానే బాస చేయుడు.
14. “మీరు మీ చుట్టుపట్లనున్న జాతుల దైవములను పూజింపరాదు.
15. మీ మధ్య వసించు ప్రభువు అసూయపరుడైన దేవుడు. మీరు ప్రభువు కోపమును రెచ్చగొట్టుదురేని ఆయన మిమ్ము ఈ నేల మీది నుండి అడపొడ కానరాకుండ తుడిచివేయును.
16. మునుపు మస్సావద్ద చేసినట్లుగా, ప్రభువును మరల పరీక్షకు గురిచేయవలదు.
17. ప్రభువు ఆదేశించిన విధులు, ఆజ్ఞలు, చట్టములు శ్రద్ధతో పాటింపుడు.
18. ప్రభువు దృష్టికి న్యాయమును, ఉత్తమమునైన కార్యములను మాత్రమే చేయుడు. అప్పుడు మీకు క్షేమముకలుగును. ఆయన మీ పితరులకు వాగ్దానము చేసిన సారవంతమైన దేశమును మీరు స్వాధీనము చేసికొందురు.
19. ప్రభువు నుడివినట్లే అచటి శత్రువులను ఓడించి మీ ముందునుండి తరిమివేయుదురు.
20. భవిష్యత్కాలమున మీ పిల్లలు ప్రభువు మనకు ఈ శాసనములు, విధులు, నియమములన్నింటిని ఎందుకు విధించెను అని ప్రశ్నించినచో మీరు ఇట్లు సమాధానము చెప్పవలయును.
21. “పూర్వము మనము ఐగుప్తున ఫరోకు బానిసలమైయుండగా ప్రభువు తన బాహుబలముచేత మనలను అచటినుండి తోడ్కొనివచ్చెను.
22. మా కన్నుల ఎదుటనే ఆయన మహాభయంకరమైన అద్భుతక్రియలు చేసి, సూచక క్రియలను కనపరచి ఫరోను, అతని ఉద్యోగులను, ప్రజలను అణగదొక్కెను.
23. తాను పితరులకు వాగ్దానము చేసిన ఈ నేలకు చేర్చుటకై మనలను అచటినుండి తరలించుకొనివచ్చెను.
24. మనము ఈ ఆజ్ఞలెల్లపాటించుచు తనకు భయపడవలయునని ఆయన మనమంచికే కోరెను. అటుల చేసినచో నేడు జరుగుచున్నట్లుగనే మనము క్షేమముగా బ్రతుకుదుము.
25. ప్రభువు ఆదేశించినట్లే ఈ ఆజ్ఞలెల్ల ఆచరింతుమేని అప్పుడు మనము ధర్మబద్దముగా జీవించినట్లగును.”
1. ప్రభువు మిమ్ము ఆ దేశమునకు తోడ్కొని పోవును. మీరు దానిని స్వాధీనము చేసికొందురు. అతడు ఆ దేశజాతులను మీ ఎదుటినుండి వెళ్ళ గొట్టును. మీకంటెను అధికసంఖ్యాకులును, బలాఢ్యులునైన జాతులను ఏడింటిని అతడు పారద్రోలును. ఆ జాతులు ఏమనగా హిత్తీయులు, గెర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు.
2. ప్రభువు ఆ జాతులను మీ వశము చేయును. మీరు వారిని జయించి శాపముపాలు చేయవలయును. వారితో మీరెట్టి ఒడంబడికను చేసికొనరాదు. వారిమీద దయచూపరాదు.
3. మీరు వారితో వియ్యమందు కోరాదు, మీ కుమార్తెలను వారికి ఈయరాదు. వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు తెచ్చుకొనరాదు.
4. అట్టి పెండ్లి వలన వారి ఆడుపడుచులు మీ తనయుల మనసు త్రిప్పుదురు. మీ కుమారులు నన్ను విడనాడి అన్యదేవతలను ఆరాధింతురు. అప్పుడు ప్రభువు మీమీద మండిపడి మిమ్ము ఒక్క క్షణములో నాశనము చేయును.
5. కనుక మీరు వారి బలి పీఠములను కూలద్రోయుడు. పవిత్రశిలలను పగుల గొట్టుడు. అషేరాదేవతా స్తంభములను నరికివేయుడు, విగ్రహములను కాల్చివేయుడు.
6. ఎందుకన మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు. ప్రభువు ఈ భూమిమీది జనులందరిలో మిమ్మే తన సొంత ప్రజగా ఎన్నుకొనెను.
7. మీరు ఇతర జాతులకంటె అధిక సంఖ్యాకు లన్న తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోను స్వల్పసంఖ్యాకులు.
8. అయితే ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను గనుక, మీ పితరులతో తాను చేసికొనిన వాగ్దానమును నిలబెట్టుకోగోరెను గనుక, మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు తన బాహుబలముతో మిమ్ము తోడ్కొనివచ్చెను. ఐగుప్తురాజగు ఫరో దాస్యమునుండి మిమ్ము విడిపించెను.
9. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని కరుణించును. వేయితరముల వరకు వారితో తన ఒడంబడిక నిలుపుకొనును.
10. తనను ద్వేషించు వారిని ఆలస్యము చేయక బహిరంగముగా దండించుటకు ఏమాత్రమును వెనుదీయడు.
11. కనుక నేను ఈనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తు.చ. తప్పకుండ పాటింపుడు.
12. మీరు ఈ ఆజ్ఞలు సావధానముగా విని వీనిని జాగ్రత్తగా పాటింతురేని ప్రభువు పూర్వము మీ పితరులకు మాట ఇచ్చినట్లే మీతో తన ఒడంబడికను కొనసాగించును. మిమ్ము కరుణతో ఆదరించును.
13. ఆ ప్రభువు మిమ్మును ప్రేమించును. ఆయన దీవెననందుకొని మీరు తామరతంపరగ వృద్ధిచెందుదురు. మీ గర్భఫలమును దీవించును. ఆయన ఆశీర్వాదము వలన మీ పొలమునుండి ధాన్యము, ద్రాక్షసారాయము ఓలివునూనె సమృద్ధిగా లభించును. మీ పశువుల మందలు, గొఱ్ఱెలమందలు, మేకల మందలు పెంపుచెందును. ప్రభువు మీకిచ్చెదనని వాగ్దానము చేసిన నేలమీద ఈ భాగ్యములన్నియు మీకు సిద్ధించును.
14. లోకములోని జాతులన్నిటి కంటెను మీరు ధన్యాత్ములగుదురు. మీ ప్రజలలో గొడ్డుమోతుతనము ఉండదు. మీ మందలలో చూలుమోయని పశువులుండవు.
15. ప్రభువు మిమ్ము సకల రోగములనుండి కాపాడును. మీరు ఐగుప్తున ఎరిగియున్న కఠిన రోగములు ఏమియును మీకు సోకజాలవు. ఆయన వానిని మీ శత్రువుల మీదికే మరల్చును.
16. కనుక ప్రభువు మీ చేతికి చిక్కింపనున్న ప్రతిజాతిని మీరు నాశనము చేయవలయును. వారిమీద కనికరము చూపవలదు. వారి దైవములను ఆరాధించితిరా మీరు ఉరిలో చిక్కుకొన్నట్లే.
17. ఈ ప్రజలు మీకంటెను అధిక సంఖ్యాకులనియు వారిని వెళ్ళగొట్టుట అసాధ్యమనియు భావింపకుడు. మీరు వారికి భయపడవలదు.
18. ప్రభువు ఫరోను ఐగుప్తు ప్రజలను ఎట్లు నాశనము చేసెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు.
19. ఆయన ఆ దేశమున పుట్టించిన అరిష్టములను మీరు కన్నులార చూచితిరి. అద్భుతకార్యముల తోను, సూచకక్రియలతోను, హస్తబలముతోను, చాచిన బాహువుతోను ప్రభువు మిమ్ము అచటినుండి తోడ్కొని వచ్చెనుగదా! నేడు మీరు భయపడు ఈ జాతులకు గూడ మీ దేవుడైన ప్రభువు అదేగతి పట్టించును.
20. ఇంకను మిమ్ము తప్పించుకొని దాగుకొనిన వారినిగూడ ప్రభువు కందిరీగలనుపంపి నాశనము చేయించును.
21. మీ దేవుడైన యావే మీకు చేదోడువాదోడుగా మీ మధ్యన ఉన్నాడు. ఆయన బలమైన దేవుడు, భీకరుడైన ప్రభుడు. కనుక మీరు ఆ జాతులకు భయపడనక్కరలేదు.
22. మీరు ఆ నేలను స్వాధీనము చేసికొనుకొలది ప్రభువు అచటి శత్రుజాతులను క్రమ క్రమముగా హతమార్చును. మీరు ఆ జాతులన్నింటిని వెంటనే తుడిచివేయలేరు. అట్లు చేయుదురేని వన్య మృగములు విస్తరిల్లి మిమ్ము పీడించును.
23. ప్రభువు మాత్రము వారిని మీ చేతికి చిక్కించును. వారిని కలవర పెట్టి నాశనము చేయును.
24. ప్రభువు ఆ జాతుల రాజులను మీ చేతికి చిక్కింపగా “మీరు వారి పేర్లను నేల మీదినుండి తుడిచివేయుదురు. ఏ రాజును మిమ్ము ఎదిరింపజాలడు. మీరు అందరిని చంపుదురు.
25. మీరు వారి పూజావిగ్రహములనెల్ల కాల్చివేయవలయును. వానికి పొదిగిన వెండిబంగారములను ఆశింపకుడు, తీసికొనకుడు. అవి మీకు ఉరికాగలవు. ప్రభువు విగ్రహారాధనను అసహ్యించు కొనును.
26. మీరు ఆ ప్రతిమలను మీ ఇండ్లకు కొనివత్తురేమో జాగ్రత్త! వారివలె మీరును శాపము పాలగుదురు. ఆ విగ్రహములు శాపగ్రస్తములు. కనుక మీరు వాటిని నీచాతినీచముగా గణించి అసహ్యించు కొనవలయును.
1. నేడు నేను మీకు ఆదేశించిన ఆజ్ఞలనెల్ల పాటింపుడు. అప్పుడు మీరు బ్రతికిపోయెదరు, పెంపు చెందెదరు. ప్రభువు మీ పితరులకు వాగ్దానము చేసిన దేశమును స్వాధీనము చేసికొందురు.
2. ప్రభువు ఈ నలువది ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జప్తికి తెచ్చుకొనుడు. మీకు వినయము నేర్పుటకు, మీ హృదయములను పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలిసికొనుటకు ఆయన ఈ పయనము ఉపయోగించుకొనెను.
3. ఆయన మీకు అణకువనేర్పెను. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటుపిమ్మట మన్నా భోజనమనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరుగాని, మీ పితరులుగాని ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడనియు, ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కువలన కూడా జీవించుననియు తెలియజేయుటకే ఆయన అటులచే సెను.
4. ఆ నలుబదియేండ్లు మీ ఒంటిమీది దుస్తులు చినుగు పట్టలేదు. మీ కాళ్ళకు బొబ్బలెక్కలేదు.
5. దీనినిబట్టి తండ్రి కుమారునికివలె ప్రభువు మీకు శిక్షణనిచ్చెనని గ్రహింపుడు.
6. కనుక మీరు ప్రభువు ఆజ్ఞలను పాటింపుడు. ఆయన చూపిన త్రోవలో నడువుడు. ఆయనపట్ల భయభక్తులు కలిగిఉండుడు.
7. ప్రభువు మిమ్ము సారవంతమైన దేశమునకు కొనిపోవును. అచట ఏరులు, చెలమలు కలవు. భూగర్భములోని నదులనుండి అచటి లోయలలోనికి, కొండలలోనికి నీళ్ళు ఉబికివచ్చును.
8. అచట గోధుమ, యవ, ద్రాక్షలు, అంజూరములు, దానిమ్మలు పండును, ఓలివునూనె, తేనె లభించును.
9. ఆహారమునకు కొదువ ఉండదు. మీ అవసరములన్నియు తీరును. అచటి శిలలలో ఇనుము దొరకును. కొండల నుండి రాగి త్రవ్వవచ్చును.
10. అచట మీరు కోరు కొన్న పదార్థములన్నియు సంతృప్తిగా భుజింతురు. అంత సారవంతమైన నేలను మీకు అనుగ్రహించినందుకు గాను ప్రభువునకు వందనములు అర్పింపుడు.
11. కాని మీ ప్రభువైన దేవుని మరచిపోయి నేడు నేను మీకు ఆదేశించు ఆజ్ఞలను, విధులను, కట్టడలను అశ్రద్ధ చేయుదురేమో జాగ్రత్త!
12-14. మీరు కోరుకొన్న పదార్థములన్నియు భుజించిన తరువాత, మీరు వసించుటకు సుందరమైన భవనములు నిర్మించుకొనినపిదప, మీ పశువుల, గొఱ్ఱెల మందలు, వెండి, బంగారములు, సిరిసంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విఱ్ఱవీగి మిమ్ము ఐగుప్తు దాస్యగృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు.
15. ఆయన మిమ్ము సుదీర్ఘమును, భయంకరమునై విషసర్పములతోను, తేళ్ళతోను కూడిన ఎడారిగుండ నడిపించుకొనివచ్చెను. నీళ్ళు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిలనుండి నీళ్ళు వెలువరించెను.
16. మీ పూర్వులు కనివిని యెరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను. ఈ రీతిగా ప్రభువు మీకు వినయము నేర్పేను. మిమ్ము పరీక్షించెను. అతడింతగా శ్రమపడినది చివరకు మీకు మేలు చేయుటకే.
17. కనుక మీరు ఏనాడును మా బలము తోనే, మా శక్తితోనే మేము సంపన్నులము అయితిమని భావింపకుడు.
18. మిమ్ము సంపన్నుల చేసినది ప్రభువేయని గుర్తింపుడు. ఆయన మీ పితరులతో చేసికొనిన ఒడంబడికను నేటిదనుక పాటించెను గనుకనే మీరు ఐశ్వర్యవంతులైరి.
19. కనుక ఆ ప్రభువును ఏనాడును విస్మరింపకుడు. అన్యదైవములను ఆరాధించి మ్రొక్కులు చెల్లింపకుడు. అటుల చేయుదురేని మీరెల్లరు మొదలంట నాశనమయ్యెదరని నేడు నేను ప్రమాణముచేసి చెప్పుచున్నాను.
20. మీరు మీ ప్రభువుమాట పెడచెవిని పెట్టుదురేని ఆయన మీ ఎదుటినుండి అన్యజాతులను నాశనము చేసినట్లే మిమ్మును మసి చేసి తీరును.
1. యిస్రాయేలీయులారా వినుడు! నేడు మీరు యోర్దానునది దాటి మీకంటె అధిక సంఖ్యాకులును, బలాఢ్యులును అయిన జాతుల దేశములను స్వాధీనము చేసికొందురు. ఆకాశమునంటు ప్రాకారములుగల వారి గొప్పపట్టణములను ఆక్రమించు కొందురు.
2. ఆ జనులు మహాబలవంతులు, ఆజానుబాహులు. మీరు ఇదివరకే వినియున్న అనాకీయ వంశస్తులు. ఆ అనాకీయులను ఎవరెదిరింపగలరు? అనుమాట మీరు వినియున్నారుగదా!
3. ఇప్పుడు మీరు చూచు చుండగనే ప్రభువు దహించుఅగ్నివలె మీకు ముందుగా పోయి వారిని ఓడించి లొంగదీయును. కనుక ప్రభువు మాట యిచ్చినట్లే మీరు ఆ ప్రజలను శీఘ్రముగా తరిమివేసి నాశనము చేయుదురు.
4. కాని ప్రభువు వారిని మీ చెంతనుండి తరిమివేసిన పిదప మీ యోగ్యతను బట్టియే ఆయన వారిని వెడలగొట్టి మీకు ఆ నేలను ఇచ్చెనని భావింపకుడు. కాదు! ఆ ప్రజలు దుర్మార్గులు కనుకనే ప్రభువువారిని అచటనుండి వెడలగొట్టెను.
5. మీరేమో మంచివారు, ధర్మవర్తనులు అన్న భావముతో ప్రభువు వారి దేశమును మీవశము చేయుటలేదు. వారు దుర్మార్గులు కనుకను, తాను మీ పితరులైన అబ్రహాము ఈసాకు యాకోబులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగోరెను కనుకను వారిని పారద్రోలును.
6. ఆయన ఆ సారవంతమైన నేలను మీకిచ్చునది మీ యోగ్యతను బట్టికాదు అని తెలుసు కొనుడు.
7. మీరు ఎడారిలో ప్రభువు కోపమును రెచ్చ గొట్టిన సంగతి మరచిపోవలదు. ఐగుప్తునుండి బయలుదేరినది మొదలు ఇచటికి చేరువరకు మీరు యావేమీద తిరుగబడుచునేయుంటిరి. మీరు వట్టి తలబిరుసు కలిగిన మూక.
8. హోరేబు వద్ద మీరు యావేకు కోపము రప్పింపగా ఆయన మిమ్ము నాశనము చేయసంకల్పించుకొనెను.
9. ప్రభువు మీతో చేసికొనిన నిబంధనమునకు సంబంధించిన రాతి పలకలను కొనివచ్చుటకై నేను కొండ మీదికి వెళ్ళితిని. అన్న పానీయములుకూడ పుచ్చుకొనకుండ నలుబది రాత్రులు నలుబది పగళ్ళు ఆ కొండమీద గడపితిని.
10. ప్రభువు స్వయముగా చేతితో వ్రాసిన రెండు రాతి పలకలను నాకొసగెను. నాడు మీరు కొండయెదుట సమావేశమైనపుడు పర్వతము మీద నిప్పుమంట నడుమ నుండి ప్రభువు మీతో పలికిన పలుకులు వానిమీద వ్రాయబడియుండెను.
11. ఆ రీతిగా నలువది పగళ్ళు నలువది రాత్రులు ముగిసిన పిమ్మట ప్రభువు నిబంధనమునకు చెందిన రెండు రాతి పలకలను నాకొసగెను. అతడు నాతో,
12. “నీవు శీఘ్రముగా క్రిందికి దిగిపొమ్ము. నీవు ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన నీ జనులు విశ్వాసభ్రష్టులైరి. వారు నేను నిర్దేశించిన మార్గమును విడనాడి విగ్రహము నొకదానిని పోత పోసికొనిరి” అని చెప్పెను.
13. ప్రభువు ఇంకను “ఆ ప్రజలు తలబిరుసు జనము.
14. నేను వారిని సర్వనాశనముచేసి భూమిమీద వారిని రూపుమాపివేయుదును. నేను నీ నుండి మరియొక జాతిని పుట్టింతును. ఆ జాతి వారికంటెను అధిక సంఖ్యాకము, బలసంపన్నము అగును” అని పలికెను.
15. అంతట నేను కొండ దిగివచ్చితిని. అప్పుడు పర్వతము నిప్పులుక్రక్కుచుండెను. నా రెండు చేతులలో రెండు నిబంధన పలకలు ఉండెను.
16. నేను మీవైపు పారజూడగా మీరు అప్పటికే పాపము కట్టుకొని యుంటిరి. పోతదూడను తయారు చేసికొనియుంటిరి. ప్రభువు నియమించిన మార్గమునుండి వైదొలగి యుంటిరి.
17. మీ కన్నుల ఎదుటనే నా రెండు చేతులలోని రాతిపలకలను నేలమీదికి విసరికొట్టి ముక్కముక్కలు చేసితిని.
18. మరల మొదటివలె నేను నలువది పగళ్ళు నలువది రాత్రులు అన్నపానములు కూడ ముట్టుకొనకుండ ప్రభువు ఎదుట సాగిలపడితిని. మీరు యావేకు వ్యతిరేకముగా పాపముచేసి ఆయన కోపమును రెచ్చగొట్టిరి.
19. నేను ప్రభువు తీవ్రకోపమునకు భయపడితిని. ఆయన మిమ్ము నాశనముచేయ సంకల్పించుకొనెను. కాని యావే మరల నా మొర ఆలించెను.
20. ప్రభువు అహరోను మీద గూడ మండిపడి అతనిని నాశనము చేయగోరెను. కాని నేను అహరోను పక్షమున గూడ విన్నపము చేసితిని.
21. మీరు చేసిన ఆ పాపపుదూడను మంటలో పడవేసితిని. దానిని ముక్కలు ముక్కలుగా విరుగగొట్టి పొడిచేసి కొండమీద నుండి పారు సెలయేటిలో కలిపితిని.
22. తబేరా యొద్దను, మస్సా యొద్దను, కిబ్రోతు హట్టావా యొద్దను మీరు ప్రభువునకు కోపము రప్పించితిరి.
23. ఆయన మిమ్ము కాదేషుబార్నెయా నుండి అవతలకుపంపి, తాను మీకు స్వాధీనము చేయనున్న దేశమును ఆక్రమించుకొండని చెప్పెను. కాని మీరు ప్రభువుమీద తిరుగబడి ఆయన మాటను నమ్మరైతిరి. ఆయన ఆజ్ఞను పాటింపరైరి.
24. మీరు ప్రభువు ప్రజలైనప్పటినుండి ఆయనమీద తిరుగ బడుచునేయుంటిరి. ప్రభువు మిమ్ము హతమార్చ బూనెను.
25. కనుక ఆ నలుబది పగళ్ళు, నలుబది రాత్రులు నేను ప్రభువు ఎదుట మొదటిమారువలె సాగిలపడితిని.
26. నేను 'ప్రభూ! నీ సొంతవారైన ఈ ప్రజలను నాశనము చేయకుము. నీవు నీ మహిమవలన దాస్యవిముక్తులనుచేసి, నీ బాహు బలముతో వారిని ఐగుప్తునుండి తోడ్కొని వచ్చితివి కదా!
27. నీ భక్తులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులను స్మరించుకొనుము. ఈ జనుల తలబిరుసు తనమును, దుష్టత్త్వమును, పాపకార్యములను లెక్క చేయకుము.
28. లేనిచో నీవు వాగ్దానముచేసిన దేశమునకు ఈ ప్రజలను చేర్పజాలకపోయితివనియు, ఈ జనులనిన నీకు గిట్టదు కనుక వీరిని సంహరించు టకే ఎడారికి తోడ్కొని వచ్చితివనియు ఐగుప్తీయులు నిన్ను ఆడిపోసికొందురు.
29. నీవు నీ అధికబలము తోను, నీవు చాపిన నీ బాహువుచేతను వీరిని ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చితివి. ప్రభూ! ఈ ప్రజలు నీవారు, నీవు స్వయముగా ఎన్నుకొనిన వారసప్రజలు' అని నేను మనవి చేసితిని.
1. మీ ప్రభువైన యావేను ప్రేమించి ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఎల్లవేళల పాటింపుడు.
2. ఇన్నాళ్ళు ప్రభువునుండి శిక్షణ పొందినది మీరేగాని మీ తనయులు కాదని గుర్తింపుడు. మీరు ఆ ప్రభువు మహత్తును, ఆయన బాహుబలమును, చాచినచేతిని తెలిసికొంటిరి.
3. ఫరోను, ఐగుప్తీయులను అణచి వేయుటకు ఆయన చేసిన అద్భుతకార్యములను కన్నులార చూచితిరి.
4. ఆ ప్రభువు ఐగుప్తు సైనికులను వారి రథములతోను, గుఱ్ఱములతోను మట్టుపెట్టెను. ఆ యోధులు మిమ్ము వెన్నాడుచుండగా ప్రభువు వారిని రెల్లు సముద్రమున ముంచివేసెను. నేటివరకును వారిజాడ తెలియలేదు.
5. మీరిక్కడికి చేరక ముందు ఆయన ఎడారిలో ఏమి చేసెనో మీకెల్లరకు బాగుగా తెలియును.
6. రూబేను తెగకు చెందిన ఎలీయాబు కుమారులు దాతాను, అబీరాములను ప్రభువు ఏమి చేసెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. యిస్రాయేలీయులెల్లరు చూచుచుండగనే నేల నోరువిప్పి వారి కుటుంబము లను, గుడారములను వారి సమస్తవస్తువులను మ్రింగి వేసెను.
7. ప్రభువు చేసిన మహాకార్యములన్నియు మీరు స్వయముగా వీక్షించిరి.
8. నేడు నేను ఆదేశించు ఆజ్ఞలెల్ల మీరు పాటింప వలయును. అట్లు చేయుదురేని మీరు బలముకలిగి నదినిదాటి ఆ దేశమును స్వాధీనము చేసికొనుటకు సమర్థులగుదురు
9. ప్రభువు మీ పితరులకు, వారి సంతతికి దయచేయుదునని వాగ్దానముచేసిన పాలు తేనెలు జాలువారు దేశమున చిరకాలము జీవింతురు.
10. మీరు స్వాధీనము చేసికొనబోవు నేల ఇప్పుడు మీరు వెడలివచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. మీరు అచటి పొలమున పైరు వేసినపుడు కూరగాయల తోటకువలె, కాళ్ళతో నీరు పెట్టెడివారు.
11. కాని యిపుడు మీరు ప్రవేశింపబోవు దేశము కొండలతోను, లోయలతోను నిండినది. అచట వానలే నేలను తడుపును.
12. ప్రభువు ఆ నేలను పరామర్శించు చుండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభువు ఆ నేలను వీక్షించుచుండును.
13. కనుక నేడు నేను మీకు ఆదేశించు ఆజ్ఞలెల్ల పాటింపుడు. ఆ ప్రభువును నిండుమనసుతో ప్రేమించి సేవింపుడు.
14. అప్పుడు ఆయన మీకు సకాలమున తొలకరి వానలును, కడవరివానలును కురిపించును. ఆ ఫలితముగా మీకు ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలివు తైలము సమృద్ధిగా లభించును.
15. మీ పొలమున పశుగ్రాసము దట్టముగా పెరుగును. మీరు కోరుకొన్న భోజనపదార్థములెల్ల లభించును.
16. కాని మీరు మీ మనసున అన్యదైవతములను ఆరాధించి ప్రభువునుండి వైదొలగుదురేమో జాగ్రత్త!
17. అటుల చేసినచో ప్రభువు కోపము మీపై రగుల్కొనును. ఆయన వానలు కురిపింపడు. పొలము పంటలుపండని కారణమున ఆ సారవంతమైన నేలమీద కూడ మీరెల్లరు సత్వరమే నాశనమగుదురు.
18. నేడు నేను మీకు ఆదేశించిన ఆజ్ఞలను మీ హృదయములో నిలుపుకొనుడు. వీనిని జ్ఞాపకార్థముగా మీ చేతులమీద సూచకములుగా, మీ నొసటిమీద బాసికముగా కట్టుకొనుడు.
19. ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను, బయట నున్నను, శ్రమచేయుచున్నను, విశ్రాంతి తీసికొను చున్నను వీనిని గూర్చి ముచ్చటింపుడు.
20. మి ద్వారబంధములమీదను, నగరద్వారముల మీదను వీనిని వ్రాసిపెట్టుకొనుడు.
21. ఇట్లు చేయుదురేని ప్రభువు మీ పితరులకు వాగ్దానము చేసిన నేలమీద మీరును, మీ పిల్లలును భువిపై ఆకాశము నిలిచి యున్నంతకాలము చీకుచింతలేకుండ జీవింతురు.
22. నేను మీకు ఉపదేశించిన ఆజ్ఞలనెల్ల జాగ్రత్తగా పాటింపుడు. ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను చేకొని ఆయన మీద నమ్మిక చూపుడు.
23. అప్పుడు ప్రభువు ఈ జాతులనెల్ల మీ ఎదుటినుండి తరిమివేయును. మీకంటె అధిక సంఖ్యాకులు, బలాధ్యు లైన జాతులను మీరు స్వాధీనము చేసుకొందురు.
24. మీరు పాదములు మోపిన నేలయెల్ల మీవశమగును. దక్షిణమున ఎడారినుండి ఉత్తరమున లెబానోను కొండవరకును, తూర్పున యూఫ్రటీసు నదినుండి పడమరయందు మధ్యధరాసముద్రము వరకును, మీ దేశము విస్తరిల్లును.
25. ఏ నరుడు మిమ్మెదిరింప జాలడు. ప్రభువు మాట ఇచ్చినట్లే మీరు వెళ్ళిన తావులందెల్ల ప్రజలు మిమ్ము చూచి భయపడుదురు.
26. మీరు ఆశీర్వాదమును, శాపమును గూడ పొందుమార్గమును నేడు మీకు చూపుచున్నాను.
27. నేను మీకు ఆదేశించిన ప్రభువు ఆజ్ఞలు పాటింతురేని మీరు ఆశీర్వాదము పొందుదురు.
28. కాని ప్రభువు ఆజ్ఞలను ధిక్కరించి నేను చూపిన మార్గమునుండి వైదొలగి ఇదివరకు మీరెరుగని అన్యదైవముల పూజింతురేని, తప్పక శాపముపొందుదురు.
29. ప్రభువు తాను వాగ్దానముచేసిన నేలకు మిమ్ము తోడ్కొనిపోయినపుడు మీరు పై ఆశీర్వాద వచనములను గెరిసీము కొండమీదనుండి, పై శాప వచనములను ఏబాలుకొండ మీదినుండి ఎల్లరకును ప్రకటింపుడు.
30. ఈ కొండలు రెండు యోర్దాను నదికి పశ్చిమమున కనానీయులు వసించు దేశమున కలవు. మరియు అవి గిల్గాలు పట్టణమునకు చెంతగల మోరే క్షేత్రములోని సింధూరవృక్షములకు దాపు లోనేయున్నవి.
31. మీరు నదిని దాటి ప్రభువు మీకిత్తునని బాసచేసిన దేశమును స్వాధీనము చేసికొన బోవుచున్నారు. మీరు ఆ నేలను ఆక్రమించుకొని అచట వసింతురు.
32. అప్పుడు నేడు నేను మీకు విధించిన కట్టడలను, ఆజ్ఞలనెల్ల పాటింపుడు.
1. మీ పితరుల దేవుడైన ప్రభువు మీరు స్వాధీనము గావించుకొన మీకిచ్చిన నేలమీద జీవించి నంతకాలము మీరు పాటింపవలసిన కట్టడలు, ఆజ్ఞలివి:
2. మీరు జయింపబోవు మండలములలోని ప్రజలు పర్వతములమీదను, తిప్పలమీదను, తోపుల లోను నెలకొల్పిన ఉన్నత స్థలములనెల్ల కూలద్రోయుడు.
3. వారి బలిపీఠములను, పవిత్ర శిలాస్తంభములను పడగొట్టుడు. ఆ షేరాదేవత కొయ్యకంబములను నరికివేయుడు. ఆ జనులు పూజించు విగ్రహములను తగులబెట్టుడు. వాని అడపొడ కానరాకుండచేయుడు.
4. కాని మీ ప్రభువైన యావేపట్ల మాత్రము ఇట్లు ప్రవర్తింపరాదు.
5. మీ దేవుడైన యావే మీ సమస్త తెగలలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఎన్నుకొను తావును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలయును.
6. మీ దహన బలులు, సామాన్యబలులు, దశమభాగములు, కానుకలు, మ్రొక్కుబడులు, మీ స్వేచ్ఛార్పణలు, మీ మందలలోని తొలిచూలు పిల్లలు, అన్నిటిని అచటనే అర్పింపవలయును.
7. ఆ తావుననే, మిమ్ము దీవించు ప్రభువు సన్నిధిలోనే, మీరు పండించుకొనిన పంటను కుటుంబసమేతముగా భుజించి ఆనందింపుడు,
8. ఇపుడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతివాడును తనకిష్టము వచ్చినట్లు ప్రభువును ఆరాధించకూడదు.
9. ప్రభువు మీకు ఈయనున్న మండలమును, మీరు సంతోషముగా వసించు దేశమును, మీరింకను స్వాధీనము చేసికొనలేదు.
10. మీరు యోర్దాను నదిని దాటినపిదప ప్రభువు మీకు ఈయనున్న దేశమును ఆక్రమించుకొని అచట వసింతురు. ఆయన శత్రువులనుండి మిమ్ము కాపాడగా మీరు సురక్షితముగా జీవింతురు.
11. దేవుడైన యావే తన నామమునకు నివాసముగా ఏర్పరచుకొనిన తావునకు మాత్రమే నేను మిమ్ము ఆజ్ఞాపించిన వానినన్నింటిని, అనగా మీ దహన బలులును, ఇతరబలులును, దశమభాగములును, కానుకలును, దేవునకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబడులను మీరు కొనిరావలయును.
12. మీరు, మీ పిల్లలు, మీ సేవకులు, మీలో ఏ భాగమైనను భుక్తమైనను పొందక మీ గ్రామమునుండి వచ్చిన లేవీయులతోకూడ అచట ప్రభువుసన్నిధిలో ఆనందింపుడు. ఆ లేవీయులకు సొంత ఆస్తి ఏమియు లేదని గుర్తుంచుకొనుడు.
13. దహనబలులను మీ ఇష్టము వచ్చిన చోటులందు అర్పింపరాదు.
14. మీలో ఒక తెగవారు వసించు మండలమున ప్రభువు ఎన్నుకొను ఏకైక ప్రదేశముననే వానిని అర్పింపవలయును. అచటనే నేను ఆజ్ఞాపించిన ఆరాధనమంతయు జరుగ వలయును.
15. అయినను మీరు వసించు చోటులందెల్ల పశువులను చంపి ఇష్టము వచ్చినట్లు భుజింపవచ్చును. ప్రభువు మీకు దయచేసినన్ని పశువులను చంపి తినవచ్చును. మీరు శుద్ధి చేసికొనిగాని, చేసికొనకగాని ఆ జంతువులనెల్ల జింకనో, దుప్పినో ఆరగించినట్లుగా ఆరగింపవచ్చును.
16. కాని వాని నెత్తురుమాత్రము మీకు ఆహారము కారాదు. దానిని నీటివలె భూమి మీద కుమ్మరింపుడు.
17. మీరు ప్రభువునకు అర్పించిన దానిని మీ ధాన్యమున దశమభాగములుకాని, మీ ద్రాక్షసారాయము ఓలివు నూనె కాని, మీ మందలలో తొలిచూలు పిల్లలుకాని, మీరు మ్రొక్కుబడి చేసికొన్న వస్తువులు కాని, స్వేచ్ఛార్పణములుకాని, మరి ఏ కానుకలు కాని మీ నగరములలో భుజింపరాదు.
18. మీరు, మీ పిల్లలు, మీ సేవకులు, మీ నగరములలో వసించు లేవీయులు, ప్రభువు సమక్షమున, ఆయన తన ఆరాధన స్థలముగా ఎంచుకొనిన ప్రదేశమున మాత్రమే పై వస్తువులను భుజింపుడు. మీరు పండించుకొనిన పంటలను దేవుని సమక్షమున భుజించి ఆనందింపుడు.
19. మీరు ఆ దేశమున జీవించినంతకాలము లేవీయులను కనిపెట్టి ఉండుడు.
20. ప్రభువు మాటయిచ్చినట్లే మీ దేశమును సువిశాలము చేసినపిదప మీరు కోరుకొనినపుడెల్ల మస్తుగా మాంసము భుజింపుడు.
21. మీ దేవుడైన యావే తన నామమును స్థాపించుకొనుటకు ఎన్ను కొనుగ్ధలము మీకు దూరముగా నున్నందున మీరచటికి పోలేనిచో, మీరు కోరుకొనినపుడెల్ల యావే మీకు దయచేసిన పశువులను మీ నగరములందే వధింపవచ్చును. పైన నేను విధించిన నియమము ప్రకారము మీరు వసించు తావుననే పశువులను చంపి మీ ఇష్టము వచ్చినంత మాంసమును మీ ఇంటనే భుజింపవచ్చును.
22. శుద్ది చేసికొనినవారు, చేసికొననివారు ఎల్లరును, జింకనో, దుప్పినో భుజించినట్లుగా ఆ పశువుమాంసమును ఆరగింపవచ్చును.
23. మీరు ఆ పశువులనెత్తురు మాత్రము ఆహారముగా గైకొనరాదు. నెత్తుటిలో ప్రాణముండును. మీరు జంతువు మాంసముతో పాటు దాని ప్రాణమును గూడ భుజింపరాదు.
24. కనుక నెత్తుటిని భోజనమునకు వాడుకొన రాదు. దానిని నీటివలె నేలమీద కుమ్మరింపుడు.
25. మీరు ఈ ఆజ్ఞలను పాటింతురేని ప్రభువు మీవలన సంతుష్టుడగును. అప్పుడు మీకును, మీ సంతానము నకును క్షేమము కలుగును.
26. కాని మీకు నియమింపబడిన బలులు, మ్రొక్కుబడులు మాత్రము ప్రభువు ఎన్నుకొనిన ఏకైక ఆరాధనస్థలముననే చెల్లింపుడు.
27. మీ దహనబలులను అచట ప్రభువు బలిపీఠము మీద అర్పింపుడు. ఇతర బలులుకూడ అచటనే అర్పింపుడు. వానిని అర్పించునపుడు మీరు పశువుల మాంసమును భుజింపవచ్చును. కాని వాని నెత్తుటిని మాత్రము బలిపీఠముమీద కుమ్మరింపవలయును.
28. నేను మీకు విధించిన ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటింపుడు. మీ ప్రభువు ఎదుట ధర్మబద్దముగాను, న్యాయ సమ్మతముగాను ప్రవర్తింతురేని, మీకును మీ సంతతికిని క్షేమము కలుగును.
29. మీరు ఆ దేశమును ఆక్రమించుకొనినపుడు ప్రభువు అచటి జాతులను నాశనము చేయును. మీరు వారి దేశమును స్వాధీనముచేసికొని అచటవసింతురు.
30. ప్రభువు వారిని నాశనము చేసిన పిమ్మట మీరు వారి మతాచారములను అనుసరింపరాదు. అటుల చేయుదురేని మీరు ఉరిలో చిక్కుకొందురు. కనుక ఆ ప్రజలు తమ దైవములను ఎట్లు ఆరాధించిరా అని విచారింపబోకుడు. మీరును అటులనే ఆరాధింపవచ్చును గదా అని భావింపకుడు.
31. ఆ జాతులు తమ దైవములను పూజించినట్లుగా మీరు యావేను కొలువరాదు. వారు తమ ఆరాధనములో ప్రభువు అనహ్యించుకొను ఏవగింపు పనులను చేయుదురు. తమ పిల్లలను మంటలో త్రోసి దైవములకు దహన బలిగా సమర్పింతురు.
32. నేను మీకు విధించిన ఆజ్ఞలెల్ల పాటింపుడు. మీరు వానికి ఏమియు చేర్పకుడు, వానినుండి ఏమియు తొలగింపకుడు.
1. మీ ప్రజలనుండి ఒక ప్రవక్తకాని, కలలు కనువాడుగాని బయలుదేరి మీకొక అద్భుతకార్యమునో, గురుతునో చూపించి,
2. మీరిదివరకు ఎరుగని దైవములను అనుకరించి పూజించుటకు పోవుదము రండు అని మిమ్ము పురికొల్పవచ్చును.
3. మీరు అతని మాటలుగాని, కలలుగాని లెక్కచేయకుడు. ప్రభువు మీరు తనను పూర్ణహృదయముతోను, పూర్ణ ఆత్మతోను ప్రేమింతురో లేదోయని ఆ నరునిద్వారా పరీక్షించుచున్నాడు.
4. మీరు ప్రభువును అను సరించుచు ఆయనకే భయపడుడు. ఆయన ఆజ్ఞలు పాటించుచు ఆయనకే విధేయులుకండు. ఆ ప్రభువు మాట విని ఆయనను అంటిపెట్టుకొని ఉండవలయును.
5. కాని ఆ ప్రభువు ఆరాధనము నుండి మిమ్ము వైదొలగింపజూచిన ఆ ప్రవక్తను లేక కలలు గాంచు వానిని మాత్రము సంహరింపుడు. మిమ్ము దాస్యగృహమునుండి విడిపించినది, ఐగుప్తునుండి తోడ్కొనివచ్చినది ప్రభువేకదా! ఆ దుష్టుడు ప్రభువు నిర్ణయించిన మార్గమునుండి మిమ్ము పెడత్రోవ పట్టించువాడు. కనుక అతనిని మీ నుండి తొలగింప వలయును.
6. మీ సోదరుడుకాని, కుమారుడు లేక కుమార్తె కాని, ప్రియభార్య కాని, ఆప్తమిత్రుడు కాని మీరు, మీ పూర్వులు ఎరుగని అన్యదైవములను ఆరాధించుటకు పోవుదమురండు అని మిమ్ము రహస్యముగా ప్రోత్సహింపవచ్చును.
7. మీకు దాపులోనున్న ప్రజల దైవములను కాని లేక దూరముననున్న ప్రజల దైవములను కాని ఆరాధించుటకు మిమ్ము పురికొల్పవచ్చును.
8. అట్టివాని ప్రలోభమునకు మీరు లొంగరాదు. వాని మాటలు కూడ వినిపించుకోరాదు. అతనిమీద దయచూపరాదు. అతనిని క్షమింపరాదు, అతని తప్పును కప్పిపుచ్చరాదు.
9. అతనిని వెంటనే వధింపుడు. నీవే అతనిమీద మొదటిరాయి విసురుము. తరువాత ఇతరులు రాళ్ళు విసరుదురు.
10. దాస్యగృహమైన ఐగుప్తునుండి మిమ్ము తోడ్కొని వచ్చిన ప్రభువునుండి మిమ్ము వైదొలగింపజూచెను గనుక వానిని మీరు రాళ్ళతో కొట్టి చంపవలసినదే.
11. అప్పుడు యిస్రా యేలీయులెల్లరు ఇది విని భయపడుదురు. వారు మరల అట్టి చెడ్డపని చేయుటకు సాహసింపరు.
12-13. మీరు ప్రభువు మీకొసగిన పట్టణము లలో వసించునపుడు మీలో కొందరు దుర్మార్గులు క్రొత్త దైవములను పూజించుటకు తమ నగరవాసులను మభ్య పెట్టిరని వార్తలు వినిపింపవచ్చును.
14. అప్పుడు మీరు అసలు సంగతి నిజమో కాదో జాగ్రత్తగా విచారింపుడు. కాని అట్టిపని జరిగినమాట నిజమేనని తెలియవచ్చినచో,
15. ఆ పట్టణ ప్రజలనందరిని కత్తితో వధింపుడు. అచటి పశువులనెల్లచంపుడు.
16. ఆ నగరపౌరుల వస్తువులనెల్ల కొనివచ్చి రచ్చబండ వద్ద కుప్పవేయుడు. ఆ నగరమును దానిలోని సమస్త వస్తువులను శాపము పాలుచేసి ప్రభువునకు దహన బలిగా కాల్చివేయుడు. ఆ పట్టణము శాశ్వతముగా పాడుపడిపోవును. మరల అచట ఎవ్వరును గుమ్మము లెత్తరాదు.
17. అటుల శాపముపాలైన నగరము నుండి మీరేమియు తీసికొనరాదు. అప్పుడు ప్రభువు తన తీవ్రకోపమును ఉపసంహరించుకొని మీమీద కనికరము చూపును. ఆయన మిమ్ము కరుణించి పూర్వము తాను మీ పితరులకు వాగ్దానము చేసినట్లే మిమ్ము అధిక సంఖ్యాకులను చేయును.
18. నేడు నేను మీకు విధించిన ఈ ఆజ్ఞలెల్లపాటించి ప్రభువునకు విధేయులగుదురేని, ఆయన సమక్షమున ధర్మబద్ద ముగా జీవింతురేని, మీరు తప్పక అధిక సంఖ్యాకుల గుదురు.
1. ప్రతి ఏడవయేటి తరువాత మీరు ప్రజల ఋణముల రద్దుకు గడువీయవలయును.
2. ఆ గడువు నియమములు ఇవి: తన పొరుగువానికి అప్పు ఇచ్చిన ప్రతివాడు దానికి గడువీయవలయును. ఇది యావేకు గడువు అనబడును. కనుక అప్పిచ్చినవాడు అప్పు తీసుకొనినవానిని నిర్బంధింపరాదు.
3. కాని అప్పుతీసుకొనిన పరదేశీయుని నిర్బంధింపవచ్చును. కాని నీ సహోదరునొద్దనున్న దానిని విడిచిపెట్టవలయును.
4-5. ప్రభువు తాను మీకీయనున్న నేలమీద మిమ్ము దీవించును. మీరు ప్రభువు మాటవిని ఈనాడు నేను మీకు విధించిన ఆజ్ఞలనెల్ల పాటింతురేని ఇక మీలో పేదలు అనువారు ఉండబోరు.
6. ఆయన తాను మాట యిచ్చినట్లే మిమ్ము దీవించును. అప్పుడు మీరు పలుజాతులకు ఋణదాతలు అగుదురుగాని ఎవరికిని ఋణగ్రస్తులుకారు. పలుజాతులను మీరు ఏలుదురుగాని ఎవరును మిమ్ము ఏలజాలరు.
7. ప్రభువు మీకు ఈయనున్న దేశమునందలి నగరములలో తోటియిస్రాయేలీయులలో పేదవాడు ఎవడైనను ఉన్నచో మీరు హృదయములను కఠినము చేసికొనక అతనికి సాయము చేయుడు.
8. ఉదార బుద్దితో అతని అక్కరలు తీర్పుడు.
9. బాకీలు రద్దగు ఏడవ యేడు వచ్చినదన్న నీచభావముతో అతనిని చిన్నచూపు చూచి సహాయముచేయ నిరాకరింపకుడు. అతడు మీమీద ప్రభువునకు మొర పెట్టినచో మీరు దోషులుగా గణింపబడుదురు. అది నీకు పాపమగును.
10. ఎట్టి మనోవిచారమును లేక మీరు ఉదారబుద్ధితో పేదవానికి సాయము చేయుదురేని మీ కార్యములన్నిటిని ప్రభువు దీవించును.
11. దేశమున పేదలేమో ఎప్పుడును ఉందురు. కనుక పేదసాదలైన తోటిజనులకు ఉదారబుద్ధితో సాయము చేయుడని మిమ్మాజ్ఞాపించుచున్నాను.
12. తోటియిస్రాయేలీయుడు, పురుషుడుగాని, స్త్రీగాని మీకు బానిసగా అమ్ముడుపోయినచో ఏడవ యేడు అతనిని దాస్యమునుండి విడిపింపవలయును.
13. నీ ఇంటినుండి వెడలిపోవునపుడు అతనిని వట్టి చేతులతో పంపరాదు.
14. నీ మందల నుండియు, ధాన్యమునుండియు, ద్రాక్ష సారాయము నుండియు అతనికి ఉదారముగా పాలిభాగమిమ్ము. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించినట్లే నీవును అతనిని ఆదుకొనుము.
15. పూర్వము మీరు ఐగుప్తున బానిసలై ఉండగా ప్రభువు మీకు దాస్యవిముక్తి కలిగించెనుగదా! కనుకనే నేడు నేను మీకిట్టి ఆజ్ఞనిచ్చితిని.
16. కాని ఆ బానిసకు నీపట్ల నీ కుటుంబము పట్ల ఇష్టము పుట్టవచ్చును. అతడు నీ ఇంట్లో ఉండుటకు ఇష్టపడవచ్చును.
17. అప్పుడు అతనిని మీ ఇంటి తలుపు చెంతకు తీసికొనిపోయి కదురుతో వాని చెవిని గ్రుచ్చుడు. ఇక అతడు జీవితాంతము నీకు బానిసయగును. బానిసరాలకు కూడ ఇట్లే చేయుడు.
18. మీరు ఏ బానిసనైనను స్వేచ్చతో పంపి వేయవలసి వచ్చినపుడు అనిష్టముతో సణుగుకొనకుడు. అతడు ఆరేండ్లపాటు కూలివానికంటె రెండంతలు అదనముగా నీకు చాకిరిచేసెను. కనుక మీరు అతనిని వెళ్ళిపోనిత్తురేని ప్రభువు మీ కార్యములను దీవించును.
19. మీ మందలలో పుట్టిన ప్రతి తొలిచూలు పోతును ప్రభువునకు అర్పింపుడు. అది కోడెదూడ అయినచో దానిని సేద్యమునకు వాడరాదు. గొఱ్ఱెపిల్ల అయినచో దాని ఉన్నిని కత్తిరించుకోరాదు.
20. ప్రభువు నియమించిన ఏకైక ఆరాధన స్థలమున ఏటేట వానిని కుటుంబసమేతముగా ఆరగింపుడు.
21. ఆ పశువులకు ఏదైన లోపమున్నచో, అనగా అవి కుంటివి, గ్రుడ్డివి, లేక మరి ఏదైన అవలక్షణము గలవి అయినచో, వానినసలు దేవునికి అర్పింపరాదు.
22. మీ ఇంటిపట్టుననే, శుద్ధిచేసికొనిగాని, చేసికొనక గాని, జింకనో, దుప్పినో భుజించినట్లుగా వానిని ఆరగింపుడు.
23. వానినెత్తురు మాత్రము ముట్టు కొనక నేలమీద నీటినివలె కుమ్మరింపుడు.
1. అబీబు నెలలో పాస్కపండుగను కొనియాడి మీ ప్రభువైన దేవుని స్తుతింపుడు. ఆ నెలలో ఒకరాత్రి ప్రభువు మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చెను.
2. ప్రభువు తన నామమునకు నివాసస్థానముగా ఎన్నుకొనిన తావులోనే పాస్కను కొనియాడవలయును. అచట మీ మందలనుండి కొనివచ్చిన బలిపశువును వధింపుడు.
3. ఈ పండుగ చేసికొనునపుడు మీరు పొంగిన రొట్టెలు భుజింపరాదు. ఏడుదినములపాటు పొంగనిరొట్టెలనే ఆరగింపుడు. మీరు ఐగుప్తునుండి త్వరత్వరగా వెడలివచ్చినపుడు పొంగనిరొట్టెలనే భుజించిరికదా! ఆ రొట్టెలు బాధను జ్ఞప్తికి తెచ్చును. వానిని భుజించుటవలన మీరు ఐగుప్తునుండి వెడలి వచ్చిన దినమును జీవితాంతమువరకు జ్ఞప్తియందుంచు కొందురు.
4. మీరు నివసించు ప్రదేశమున ఏడు దినములవరకు పులిసిన పదార్ధము కనిపింపకూడదు. పండుగ మొదటి దినమున చంపిన బలిపశువు మాంసమును ఆ దినముననే భుజింపవలయును. మరునాటికి మిగల్చరాదు.
5. ప్రభువు మీకిచ్చిన ఇతర నగరములలో పాస్కబలిని అర్పింపరాదు.
6. నీ దేవుడైన యావే తన నామమునకు నివాసస్థలముగా ఎన్నుకొనిన తావులోనే బలినర్పింపుడు. సూర్యాస్త మయమున అనగా మీరు ఇగుప్తునుండి బయలు దేరివచ్చిన సమయమున, ఆ బలిని అర్పింపుడు.
7. ప్రభువు ఎన్నుకొనిన ఆరాధనస్థలముననే బలిపశువు మాంసమును వండి భుజింపుడు. ఆ మరుసటిరోజు ప్రొద్దుననే మీ ఇండ్లకు వెడలిపోవచ్చును.
8. మీరు ఆరురోజులపాటు పొంగనిరొట్టెలు తినుడు. ఏడవ రోజున యెల్లరును సమావేశమై ప్రభువును ఆరా ధింపుడు. ఆ రోజున మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.
9. కోతకారునుండి మొదలు పెట్టి ఏడువారముల కాలమును లెక్కింపుడు.
10. ఆ కాలము ముగియగనే ప్రభువును స్తుతించుచు వారములపండుగ చేసికొనుడు. యావే మీకిచ్చిన వానినుండి మీరు ఆయనకు స్వేచ్చగా కానుకలు అర్పింపుడు.
11. మీ పిల్లలతో, సేవకులతో, మీ నగరములందు వసించు లేవీయులతో, పరదేశులతో, అనాథ బాలలతో, వితంతువులతో ప్రభువు సమక్షమున ఆనందించి సంతసింపుడు. నీ దేవుడైన యావే తన నామమునకు నివాసస్థలముగా ఎంచుకొనిన తావుననే ఈ ఉత్సవము జరుపుకొనుడు.
12. ఈ ఆజ్ఞలనెల్ల జాగ్రత్తగా పాటింపుడు. మీరు ఐగుప్తున బానిసలుగా నుంటిరని మరచిపోవలదు.
13. మీ కళ్ళములలోని ధాన్యము మీ తొట్టిలోని ద్రాక్షసారాయము ఇల్లు చేరినపిదప ఏడురోజులపాటు గుడారములపండుగ చేసికొనుడు.
14. మీ పిల్లలతో, సేవకులతో మీ నగరములలో వసించు లేవీయులతో, పరదేశులతో, అనాథ బాలబాలికలతో, వితంతువులతో ప్రభువు సమక్షమున ఆనందించి సంతసింపుడు.
15. ప్రభువు ఎంచుకొనిన ఆరాధనస్థలముననే ఏడురోజుల పాటు ఆయన పేరిట పండుగ చేసికొనుడు. ప్రభువు మీ పంటను, మీ కృషిని దీవించును. గనుక మీరెల్లరు సంతసింపుడు.
16. మీ మగవారందరు ఏడాదికి మూడుమార్లు అనగా పులియనిరొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, గుడారములపండుగలోను మీ దేవుడైన యావే ఎంచుకొనిన స్థలమున మీ మగవారందరు ఆయన సన్నిధిలో కనపడవలయును. ఎవరును వట్టిచేతులతో వచ్చి ప్రభువును దర్శింపరాదు.
17. మీ ప్రభువు మిమ్ము దీవించిన దానికి అనుగుణముగా మీరును ఆయనకు కానుకలు కొనిరండు.
18. ప్రభువు మీకు ఈయనున్న నగరములన్నింటను మీ తెగలకు న్యాయాధిపతులను, అధికారు లను నియమింపుడు. వారు నిష్పాక్షికముగా తగవులు తీర్పవలయును.
19. వారు న్యాయము చెరుపరాదు. జనుల ముఖము చూచి తీర్పుచెప్పరాదు. లంచములు పుచ్చుకొనరాదు. లంచము బుద్ధిమంతుల కళ్ళనుకూడ పొరలు క్రమ్మునట్లు చేయును. వారిచే తప్పుడు నిర్ణయములు చేయించును.
20. మీరు ఖండితముగా న్యాయమును పాటింపవలయును. అప్పుడు మీరు ప్రభువు ఈయనున్న నేలను స్వాధీనము చేసికొని అచట నివసించుదురు.
21. మీ దేవుడైన యావేకు మీరు కట్టు బలిపీఠముచెంత అషీరాదేవతకు స్తంభమును నాట రాదు.
22. విగ్రహారాధనకు గాను శిలాస్తంభమును నెలకొల్పరాదు. అట్టి స్తంభమును ప్రభువు ఏవగించుకొనును.
1. ప్రభువు ఆ అన్యజాతులను మీ వశము చేసి వారి దేశమును మీకు ఈయగా మీరు వారి నగరములను, గృహములను స్వాధీనము చేసికొని వానియందు నివసింపమొదలిడిన పిదప,
2-3. ఆ దేశమును మూడుభాగములుగా విభజింపుడు. ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క నగరమును ప్రత్యేకింపుడు. ఆ నగరములను సులువుగా చేరుకొనుటకు మార్గములు ఉండవలయును. నరహంతకులు ఆ నగరములకు పారిపోయి తలదాచుకోవచ్చును.
4. ఎవడైన బుద్ధి పూర్వకముగాగాక పొరపాటున తోటినరుని చంపెనేని ఆ ఆశ్రయపట్టణములకు పారిపోయి ప్రాణరక్షణ కావించు కోవచ్చును.
5. ఉదాహరణకు ఇరువురు మనుష్యులు వంటచెరకు కొరకు అడవికి వెళ్ళిరను కొందము. వారిలో ఒకడు చెట్టును నరుకుచుండగా గొడ్డలిపిడి ఊడి తోటివానికి తగిలి వాడు చనిపోయెననుకొందము. ఆ హంతకుడు పై నగరములలో తలదాచుకొని ప్రాణములు కాపాడుకోవచ్చును.
6. ఒక్క పట్టణమేయున్నచో ఆ పట్టణము చాలదూరమున ఉన్నచో హతుడైన వానిబంధువు పగతీర్చుకోగోరి హంతకుని వెన్నాడి దారిలోనే పట్టుకొని కోపావేశముతో సంహరింపవచ్చును. కాని హంతకునికి చచ్చిన వానిపట్ల వైరములేదు. తాను అతనిని బుద్ధిపూర్వకముగా చంపలేదు. కనుక అతడు చంపదగినవాడు కాడు.
7. కావుననే హంతకుల కొరకు మూడుపట్టణములను ప్రత్యేకింపుడని నేను మిమ్ము ఆజ్ఞాపించు చున్నాను.
8. ప్రభువు మీ పితరులకు మాటయిచ్చినట్లే మీ దేశమును విస్తృతముకావించి తాను ప్రమాణము చేసిన భూమినంతటిని మీ వశముచేసిన పిదప,
9. మరి మూడుపట్టణములను కూడ ప్రత్యేకింపుడు. ఈనాడు నేను విధించిన విధులన్నిటిని మీరు పాటించిన యెడల ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరింతురేని, మరి మూడుపట్టణములను తప్పక మీ పరము చేయును.
10. ప్రభువు మీకొసగిన ఆ నేలమీద నిర్దోషులెవరును ప్రాణమును కోల్పోరు. మీరు నిరపరాధులను చంపిన పాపమునబోరు.
11. కాని యెవడైన తన పొరుగువాని మీద వైరము పెట్టుకొని వాని కొరకు పొంచియుండి వాని మిదబడి చచ్చునట్లు కొట్టి పై పట్టణములకు పారిపోయననుకొందము.
12. అప్పుడు అతని ఊరి పెద్దల వానిని పట్టించి చనిపోయిన వాని బంధువునకు అప్పగింపవలయును. ఆ బంధువు అతనిని వధించి పగతీర్చుకొనును.
13. అట్టి వానిమీద మీరు దయ చూపరాదు. మీరు యిస్రాయేలు దేశమున నిర్దోషుల వధను పూర్తిగా వారింతురేని మీకు క్షేమము కలుగును.
14. నీవు స్వాధీనపరచుకొనునట్లు, యావే నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో, పూర్వులు మీ పొరుగువారి పొలమునకు పాతిన గట్టు రాళ్ళను తొలగింపకుడు.
15. మానవుని దోషిగా నిర్ణయించుటకు ఒక్కని సాక్ష్యము చాలదు. ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యము పలికిననే గాని ఎవనినైన దోషిగా నిర్ణయింపరాదు.
16-17. ఎవడైన కపటముతో మరియొకని మీద నేరముమోపెనేని వారు ఇరువురును ప్రభువు ఎన్నుకొనిన ఆరాధనస్థలమునకు పోవలయును. అప్పుడు అచ్చట అధికారములోనున్న యాజకులు, న్యాయాధిపతులు వారికి తీర్పుచెప్పుదురు.
18. న్యాయాధిపతులు ఆ తగవును జాగ్రత్తగా పరిశీలింతురు. కాని అభియోక్త తోటియిస్రాయేలీయుని మీద అన్యాయముగా నేరము మోపెనని తేలిన యెడల,
19. అభియోక్త తన సహోదరునికి ఎట్టి శిక్ష ప్రాప్తింప తలంచునో అట్టి శిక్షనే అభియోక్తకు విధింపవలయును. ఈ రీతిగా ఈ దుష్కార్యమును అణచివేయవలయును.
20. ఇతరులు ఈ సంగతివిని భయపడి మరల ఇట్టి పాడుపనికి పాల్పడరు.
21. ఇట్టి తగవులలో మీరు జాలి చూపరాదు. ఎంతటి కీడుచేసిన వారికి అంతటి ప్రతీకారము చేయుడు. కనుక ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు శిక్ష,
1. మీరు యుద్ధమునకు పోయినపుడు శత్రు సైన్యమునందలి గుఱ్ఱములను, రథములను చూచిగాని లేక మీకంటే గొప్పదియగు విరోధిబల మును చూచిగాని భయపడకుడు. మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన ప్రభువే మీకు బాసటయై ఉండును.
2. మీరు యుద్ధము ప్రారంభింపకముందు యాజకుడు ముందునకు వచ్చి మీ సైన్యమును ఇట్లు హెచ్చరింప వలయును:
3. 'యిస్రాయేలీయులారా వినుడు! మీరిపుడు శత్రువులతో తలపడి పోరాడనున్నారు. మీరు వారిని చూచి భయపడవలదు. ధైర్యము కోల్పోవలదు, కలవరపడవలదు.
4. ప్రభువు మీతో వెడలివచ్చి మీ తరపున పోరాడును. శత్రువులనుండి మిమ్మును రక్షించును.”
5. అటుపిమ్మట సైనికోద్యోగులు భటులను ఇట్లు హెచ్చరింతురు: , “క్రొత్తగా ఇల్లు కట్టి ఇంకను గృహప్రవేశము చేయనివాడు ఎవడైనా మీలోనున్నాడా? అతడు యుద్ధమున చనిపోయినయెడల మరియొకడు గృహప్రవేశము చేయును. కనుక అతడు ఇంటికి వెళ్ళిపోవచ్చును.
6. క్రొత్తగా ద్రాక్షతోటను నాటించి ఇంకను దాని ఫలములను అనుభవింపనివాడు ఎవడైనా మీలోనున్నాడా? అతడు యుద్ధమున చనిపోయినచో మరియొకడు ఆ ఫలములను అనుభవించును. కనుక అతడు ఇంటికి వెళ్ళిపోవచ్చును.
7. ప్రధానము జరిగిపోయి ఇంకను పెండ్లి ముగించుకొననివాడు , ఎవడైన మీలోనున్నాడా? అతడు యుద్ధమున చనిపోయినచో మరియొకడు ఆ వధువును పెండ్లియాడును. కనుక అతడు ఇంటికి వెళ్ళిపోవచ్చును.”
8. సైనికోద్యోగులు ఇంకను ఇట్లు హెచ్చరింతురు: “మీలో పిరికివాడు, గుండెదిటవు లేనివాడు ఎవడైన ఉన్నచో ఇంటికి వెళ్ళిపోవచ్చును. అతనిని చూచి తోటియోధులుకూడ ధైర్యము కోల్పోవుదురు.”
9. ఈ రీతిగా అధికారులు హెచ్చరించిన పిమ్మట సైనికదళములకు నాయకులను నియమింపవలయును.
10. మీరు ఏ నగరముమీదికైనను దండెత్తినపుడు మొదట ఆ పట్టణ ప్రజలు మీకు లొంగిపోయి ప్రాణములు కాపాడుకొనుటకు శాంతి ఒప్పందమునకు అవకాశము నిండు.
11. అలా వారు మీకు లోబడి నగరద్వారములు తెరతురేని, ఇక వారు మీకు పన్ను చెల్లించి బానిసలై వెట్టిచాకిరి చేయుదురు.
12. కాని ఆ ప్రజలు మీకు లొంగక పోరునకు తలపడుదురేని మీరు వారి నగరమును ముట్టడింపుడు.
13. ప్రభువు ఆ నగరమును మీ చేతికి చిక్కించును. మీరు అందలి మగ వారినెల్ల వధింపుడు.
14. కాని అచటి స్త్రీలను, పిల్లలను, మందలను, వస్తువులను కొల్లసొమ్మును మీరు స్వాధీనము చేసికోవచ్చును. ప్రభువు మీ చేతికి చిక్కించిన శత్రువుల కొల్లసొమ్మునెల్ల మీరు అనుభవింపవచ్చును.
15. మీ చుట్టుపట్ల ఉన్న జాతుల పట్టణ ములు గాక, మీకు చాల దూరముననున్న పట్టణము లను మాత్రమే ఈ రీతిగా పట్టుకొనుడు.
16. కాని ప్రభువు మీకు ఇవ్వనున్న దేశము నందలి వివిధజాతుల నగరములను మీరు స్వాధీనము చేసికొనినపుడు మాత్రము అచట శ్వాసగల దేనిని బ్రతుకనీయకూడదు.
17. ప్రభువు మిమ్ము ఆజ్ఞాపించి నట్లే హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలగు వారినెల్ల నాశనము చేయుడు.
18. అప్పుడు వారు తమ దేవతలను ఆరాధించునపుడు చేయు జుగుప్సాకరమైన కార్యములను మీకు నేర్పింపక ఉందురు. మీరును ప్రభువునకు విరుద్ధముగా పాపము కట్టుకొనకుందురు.
19. మీరేదైన పట్టణము మీదికి దండెత్తినపుడు చాలకాలము వరకు దానిని ముట్టడింపవలసి వచ్చినచో అచటి పండ్ల చెట్లను గొడ్డలితో నరికివేయకుడు. వాని పండ్లను ఆరగింపుడు. ఆ చెట్లను మాత్రము నాశనము చేయకుడు. పొలములోని చెట్టును ముట్టడించుటకు అది నరుడాఏమి?
20. కాని పండ్ల చెట్లు కానివానిని మాత్రము మీరు నిరభ్యంతరముగా నరికి వేయవచ్చును. శత్రు పట్టణము లొంగువరకు వాటికొయ్యను ముట్టడికి వాడుకోవచ్చును.
1. ప్రభువు మీకు ఈయనున్న దేశమునందలి పొలమున ఎచటనైనను, ఎవడైనను చంపబడి కనిపించే ననుకొనుడు. హంత ఎవరో మీకు తెలియని పక్షమున
2. అప్పుడు మీ పెద్దలు, న్యాయాధిపతులు వెళ్ళి ఆ శవము కనిపించినచోటికి, ఆ చుట్టుపట్లనున్న పట్టణములకు ఎంతదూరమో కొలిచి చూడవలయును.
3. అచటికి చేరువలోనున్న నగరమేదియోగూడ నిర్ణయింప వలయును. అంతట ఆ దగ్గరి పట్టణపు పెద్దలు ఇంకను కాడికి అలవరుపని ఆవు పెయ్యను ఒకదానిని ఎన్నుకోవలయును.
4. వారు ఆ పెయ్యను ఎప్పుడును వట్టిపోని లోయ దగ్గరకు తోలుకొనిపోయి అచట ఎన్నడును దున్ని విత్తనమువేయని తావున దాని మెడను విరుగదీయవలయును.
5. లేవీయ యాజకులును అచటికి వత్తురు. కలహములకు, దౌర్జన్యమునకు సంబంధించిన తగవులన్నిటిని పరిష్కరించునది వారే. ప్రభువు తనను సేవించుటకును, తన పేరు మీదుగా ప్రజలను దీవించుటకును వారినే ఎన్నుకొనెను.
6. ఆ దగ్గరి పట్టణపు పెద్దలు చచ్చిన పెయ్య మీద చేతులు కడుగుకోవలయును.
7. అటుపిమ్మట వారు “మా చేతులు ఈ రక్తమును చిందించలేదు. మా కన్నులు దీనిని చూడలేదు.
8. ప్రభూ! నీవు ఐగుప్తునుండి తోడ్కొనివచ్చిన ఈ యిస్రాయేలీయుల అపరాధమును మన్నింపుము. నిరపరాధులైన యిస్రాయేలీయుల వధకు మేము బాధ్యులము కాకుందుముగాక!” అని చెప్పవలయును. ఇట్లు చేయుదురేని హత్యాపరాధమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును.
9. మీరు ప్రభువుసమక్షమున ధర్మబద్దముగా జీవింప గోరుదురేని నిరపరాధుల వధను అరికట్టవలయును.
10. ప్రభువు యుద్ధమునందు శత్రువులను మీ చేతికి చిక్కింపగా మీరు వారిని బంధించిరనుకొనుడు.
11. ఆ బందీలలో ఒక రూపవతియైన వనిత కనిపింపగా నీవు ఆమెమీద మోజుపడి ఆమెను వివాహమాడకోరెదవనుకొనుము.
12. అప్పుడు ఆమెను నీ ఇంటికి కొనిపొమ్ము. ఆ వనిత క్షౌరము చేయించుకొని, వ్రేలిగోళ్ళు కత్తిరించుకొని
13. తన బందీబట్టలను మార్చుకొని నీ ఇంటనుండియే చనిపోయిన తల్లి దండ్రులకొరకు నెలరోజులపాటు ఆమెను శోకింపనిమ్ము. అటుపిమ్మట నీవామె వద్దకు పోయి ఆమెను పెండ్లియాడవచ్చును. ఆమె నీకు భార్య అగును.
14. కాని కొంతకాలము గడచిన పిదప నీకు ఆ వనిత ఇష్టముకాదేని ఆమెను స్వేచ్చగా వెళ్ళి పోనిమ్ము. కాని నీవామెను బానిసగా అమ్మి సొమ్ము చేసికోరాదు. నీవు ఆమెను అవమానించితివి కనుక, ఆమెను బానిసవలె చూడరాదు.
15. ఒకనికి ఇద్దరుభార్యలు ఉన్నారనుకొందము. అతనికి ఒకతెయనిన ఇష్టము, మరొక తెయనిన అయిష్టము. ఆ ఇద్దరికిని పుత్రులు కలిగిరనుకొందము. కాని జ్యేష్ఠకుమారుడు ఇష్టములేని భార్యకు పుట్టినవాడు అనుకొందము.
16. అతడు తన ఆస్తిని కుమారులకు పంచియిచ్చునపుడు నచ్చనిదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా నచ్చిన భార్య కుమారుని జ్యేష్ఠునిగా చేయరాదు.
17. తనకు ఇష్టముకాని భార్యకు పుట్టినవానినే జ్యేష్టునిగా అంగీకరించి వానికి తన ఆస్తిలో రెండు వంతులు పంచి ఈయవలయును. మొదట పుట్టిన ఆ పుత్రుడు తండ్రి యవ్వనబలారంభము కనుక జ్యేష్ఠత్వమునకు అర్హుడు అతడే.
18. ఒక తండ్రికి తలబిరుసుతనముతో తిరుగబడు కుమారుడు కలడనుకొందము. అతడు తల్లిదండ్రుల మాట వినడు. వారు తనను శిక్షించినను లొంగడు.
19. అప్పుడు తల్లిదండ్రులు వానిని పుర ద్వారమువద్ద కూర్చొను పెద్దలవద్దకు కొనిపోవలయును.
20. ఆ పెద్దలతో “మా కుమారుడు తలబిరుసు తనముతో తిరుగబడుచున్నాడు. మా మాట వినుట లేదు. వీడు తిండిబోతు, త్రాగుబోతు” అని చెప్పవలయును.
21. అప్పుడు ఆ ఊరి జనులు అతనిని రాళ్ళతో కొట్టి చంపవలయును. ఆ రీతిగా మీరు ఆ చెడును మీ మధ్యనుండి వదిలించుకోవలయును. యిస్రాయేలీయులందరు ఆ సంగతి విని భయపడుదురు.
22-23. మరణశిక్షకు తగిన పాపము చేసిన వానిని ఎవనినైనను ఉరితీసి మ్రానికి వ్రేలాడగట్టినపుడు, అతని శవమును రేయి మ్రానుమీద ఉండనీయరాదు. ఆ దినమే అతనిని తప్పక పాతి పెట్టవలయును. వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్థుడు. అట్టి వాని శవముతో ప్రభువు మీకీయనున్న దేశమును అమంగళము చేయరాదు.
1. నీ పొరుగువాని ఎద్దుకాని, గొఱ్ఱెకాని దారి తప్పుటను చూచినపుడు నీవు ఉదాసీనముగా ఉండవలదు. దానిని యజమానుని ఇంటికి తోలుకొని పొమ్ము.
2. అతడు దూరమున వసించుచున్నచో, లేక అసలు ఆ పశువెవరిదో నీకు తెలియనిచో దానిని నీ ఇంటికి తోలుకొనిపొమ్ము. యజమానుడు వెదుకుచు వచ్చి తోలుకొనిపోవువరకు అది నీ ఇంటనే యుండును.
3. పొరుగువాడు పోగొట్టుకొనిన గాడిదగాని, పై వస్త్రముగాని, లేక మరియేదైనా వస్తువుగాని నీ కంటబడినచో పై నియమమునే పాటింపుము.
4. పొరుగువాని ఎద్దుగాని, గాడిదగాని త్రోవలో కూలబడినచో ఉదాసీనముగా వెళ్ళిపోవలదు. అతనికి సాయపడి ఆ పశువును పైకిలేపుము.
5. స్త్రీ పురుష వస్త్రములనుగాని, పురుషుడు స్త్రీ వస్త్రములనుగాని ధరింపరాదు. ఇట్టిపనులు చేయు వారిని దేవుడైన ప్రభువు అసహ్యించుకొనును.
6. చెట్టుమీదనో, నేలమీదనో నీకు పక్షిగూడు కనిపించినదనుకొనుము. తల్లిపక్షి గ్రుడ్లమీదనో, పిల్లల మీదనో కూర్చుండియున్నది.
7. అప్పుడు నీవు తల్లి పక్షిని పట్టుకొనిపోరాదు. కావలసినచో పిల్లలను తీసికొనిపోయి తల్లిని తప్పక వదలివేయుము. అట్లు చేయుదువేని నీవు చిరకాలము క్షేమముగా జీవింతువు.
8. నీవు క్రొత్త ఇల్లు కట్టినపుడు దానిమీద పిట్టగోడ కూడ కట్టింపవలయును. అప్పుడు ఇంటిమీది నుండి ఎవరైన కాలుజారి క్రిందబడి చనిపోయినచో నీవు బాధ్యుడవుకావు.
9. మీ ద్రాక్షతోటలో వివిధమైన విత్తనములు విత్తరాదు. అట్లు చేయుదురేని ఆ తోటనుండి వచ్చు రాబడి యంతయు దైవార్పణకు అపవిత్రమగును.
10. ఎద్దును, గాడిదను జతచేసి పొలము దున్నకుడు.
11. దీన్నిబట్టలను, నూలుబట్టలను కలిపి కుట్టిన దుస్తులు ధరింపకుడు.
12. మీరు కప్పుకొను పైవస్త్రపు నాలుగు మూలల యందు నాలుగుకుచ్చులు అమర్చుకొనుడు.
13. ఒకడు ఒక యువతిని పెండ్లి చేసుకొని ఆమెను కూడిన పిదప ఆమెను వదలి వేయుననుకొందము.
14. ఆ యువతి శీలవతికాదని, తానామెను కూడినపుడు ఆమె కన్యగా కనిపింపలేదని నేరము మోపెననుకొందము.
15. అప్పుడు ఆ యువతి తల్లి దండ్రులు ఆమె కన్యత్వమును నిరూపించు ఆధారమును పురద్వారము చెంతప్రోగైన పెద్దల యొద్దకు కొనిరావలయును.
16. యువతి తండ్రి ఆ పెద్దలతో “నా కుమార్తెను ఇతనికిచ్చి పెండ్లి చేసితిని. కాని ఇతనికి ఈమెమీద మోజులేదు.
17. నా కుమార్తె శీలవతి కాదనియు, కన్యకాదనియు ఇతడు నేరము మోపెను. కాని ఆమె కన్య అనుటకు ఆధారమిదియే” అని చెప్పి పెద్దలయెదుటనే వధూవరుల శయన వస్త్రమును నేలమీద పరపవలెను.
18. అప్పుడు పెద్దలు ఆ యువకుని కొరడాతో శిక్షింపవలయును.
19. అతనికి నూరువెండినాణెములు అపరాధము విధించి ఆ సొమ్మును యువతి తండ్రికి ఇప్పింపవలయును. యిస్రాయేలు కన్యను అవమానపరచినందులకు ఆ యువకునికి శిక్ష ఇది. ఆ మీదట ఆమె అతనికి భార్యగనే ఉండును. ఇక అతడు ఆమెకు విడాకు లిచ్చుటకు వీలుపడదు.
20. కాని అతడు మోపిన నేరము యథార్థమే అనుకొనుడు. ఆ యువతి కన్యత్వమును నిరూపింప జాలరు అనుకొనుడు.
21. అప్పుడామెను పుట్టినింటి ముంగిటియొద్దకు కొనిపోయి ఆమె ఊరి పౌరులు ఆమెను రాళ్ళతో కొట్టి చంపవలయును. ఆమె తన తండ్రి ఇంటనున్నపుడు వ్యభిచరించి యిస్రాయేలీయు లకు అపకీర్తి తెచ్చెను. ఈ రీతిగా మీరు ఈ చెడును మీ మధ్యనుండి తొలగించుకోవలయును.
22. ఎవడైన వివాహితయైన స్త్రీని కూడుచు పట్టుబడెనేని, అతనిని ఆమెను ఇద్దరిని చంపివేయవలయును. ఈ రీతిగా ఆ చెడును యిస్రాయేలీయుల నుండి వదిలించుకొనుడు.
23. ఎవడైన మరియొకనికి ప్రధానము చేయ బడిన యువతిని నగరమునందు కూడినట్లు తెలియవచ్చినదనుకొనుడు.
24. వారిరువురిని నగరద్వారము చెంతకు కొనిపోయి రాళ్ళతో కొట్టిచంపుడు. నగరము నందే ఉండి సహాయము కొరకు కేకవేయలేదు కనుక ఆ యువతియు, పొరుగువానికి ప్రధానము చేయబడిన బాలికను చెరిచెను గనుక ఆ పురుషుడును చంపదగినవారు. ఈ రీతిగా మీరు ఈ చెడును మీ మధ్యనుండి వదిలించుకొనుడు.
25. కాని, ఎవడైన పొరుగువానికి ప్రధానము చేయబడిన యువతిని పొలమున మానభంగము చేసెననుకొనుడు. అప్పుడు ఆ పురుషుని మాత్రమే చంపివేయవలయును.
26. ఆ యువతిని శిక్షింపరాదు. చంపదగిన నేరమేమియు ఆమె చేయలేదు. ఈ సంఘటన, ఒకడు తోటివాని మీదపడి వానిని చంపుటవంటిది.
27. ఆమె పొలమున వానికి చిక్కినది. అచట ఆమె కేకవేసినను సాయపడుటకు ఎవరును వచ్చి యుండకపోవచ్చును.
28. ఎవడేని ప్రధానము చేయబడని కన్యను బలవంతముగా కూడుచు పట్టుబడెననుకొనుడు.
29. ఆ యువతి తండ్రికి ఏబది వెండినాణెములు శుల్కముగా చెల్లింపవలయును. తాను ఆయువతిని కూడెను గనుక అమె అతనికి భార్యయగును. ఇక అతడామెకు విడాకులిచ్చుటకు వీలుపడదు.
30. ఎవ్వడును తన తండ్రి భార్యను, తండ్రికి వరసయైనవారిని పరిగ్రహింపకూడదు. అతడు తన తండ్రి హక్కును భంగపరచుచున్నాడు.
1. ఒకడు ఒక స్త్రీని పెండ్లియాడెననుకొందము. అటు తరువాత ఆమె ఏదో అనుచితకార్యమునకు పూనుకొనినందున అతనికి నచ్చలేదు. కనుక అతడు ఆమెకు విడాకులపత్రము వ్రాసి, ఆమె చేతికిచ్చి ఇంటి నుండి పంపివేసెననుకొందము,
2. ఆమె అతనిని విడనాడి మరియొకనిని పెండ్లి చేసుకొనవచ్చును.
3. ఈ రెండవవానికి కూడ ఆమెమీద ఇష్టము పుట్టని యెడల అతడు కూడ విడాకుల పత్రమువ్రాసి, ఆమె చేతికిచ్చి ఆమెను పంపివేసెననుకొందము. లేదా అతడు గతించెననుకొందము.
4. అప్పుడు మొదట పెండ్లియాడినవాడు ఆమెను మరల స్వీకరింపరాదు. ఆమె అపవిత్రురాలైనది. అట్టి వివాహమును ప్రభువు అసహ్యించుకొనును. దానిద్వారా మీరు ప్రభువు మీకీయనున్న దేశమునకు పాపము సోకునట్లు చేయుదురు.
5. క్రొత్తగా పెండ్లియాడిన వానిని యుద్ధమునకు పిలువరాదు. అతనికి ఎట్టికార్యభారమును ఒప్పజెప్ప రాదు. తాను పెండ్లియాడిన వధువును సంతోషపెట్టుటకు ఒక ఏడాదిపాటు అతనిని ఇంటిపట్టునే ఉండనీయవలయును.
6. ఎవడును ఇతరుని తిరుగలిని కుదువ పెట్టించుకోరాదు. అటులచేసినచో అతని జీవనాధారమునే తాకట్టు పెట్టించుకొన్నట్లు.
7. ఎవడైన తోటి యిస్రాయేలీయుని అపహరించి బానిసగా వాడుకొనిన లేక బానిసగా అమ్మివేసిన ఆ దొంగను పట్టి చంపవలయును. అటులచేసి, ఆ చెడును మీ మధ్యనుండి పరిహరించుడు.
8. కుష్ఠరోగము విషయమున మీరు లేవీయ యాజకుల ఆదేశములన్నిటిని జాగ్రత్తగా పాటింపవలయును. నేను వారికి ఆదేశించిన విధులన్నిటిని అనుసరింపుడు.
9. మీరు ఐగుప్తునుండి వెడలివచ్చునపుడు ప్రభువు మిర్యామునకు ఏమిచేసెనో గుర్తుంచుకొనుడు.
10. నీవు ఇతరునిచేత ఏదైన తాకట్టు పెట్టించుకొని వానికి అప్పిచ్చినయెడల ఆ తాకట్టు పెట్టిన వస్తువును గుంజుకొని వచ్చుటకై వాని ఇంటిలోనికి వెళ్ళకూడదు.
11. నీవు వెలుపలనేయుండుము. అతడు ఆ వస్తువును నీ యొద్దకు కొనివచ్చును.
12. బాకీదారుడు పేదవాడైనచో అతడు నీకు తాకట్టుగా ఇచ్చిన అంగీని రాత్రి నీ ఇంట ఉంచుకోవలదు.
13. ప్రొద్దు గ్రుంకగానే వాని అంగీని వానికి ఇచ్చివేయుము. అతడు దానిని తొడుగుకొని నిద్రించును. నీకు కృతజ్ఞుడై యుండును. అది ప్రభువు దృష్టికి నీకు నీతియగును.
14. నిరుపేదయైన కూలివానిని, అతడు యిస్రాయేలీయుడైనను లేక మీ నగరములలో వసించు పరదేశీయుడైనను అణచివేయరాదు.
15. ప్రతిరోజు ప్రొద్దుగ్రుంకక మునుపే అతని కూలి అతనికి ఇచ్చి వేయుము. అతడు లేనివాడు కనుక ఆ కూలికొరకు కనిపెట్టుకొని యుండును. ఇట్లు చేయవేని అతడు ప్రభువునకు నీమీద మొర పెట్టుకొనును. అప్పుడు నీకు పాపము చుట్టుకొనును.
16. తండ్రులు చేసిన దోషములకు కుమారులకును, కుమారులు చేసిన దోషములకు తండ్రులకును మరణశిక్ష విధింపరాదు. ఎవరి దోషములకు వారినే చంపవలయును.
17. పరదేశులకును, అనాధలకును అన్యాయపు తీర్పు చెప్పరాదు. వితంతువు కట్టుబట్టను తాకట్టు పెట్టించుకోరాదు.
18. మీరు ఐగుప్తున బానిసలె యుండగా ప్రభువు మీకు దాస్యవిముక్తి కలిగించెనని గుర్తుంచుకొనుడు. కనుకనే మిమ్ము ఈ రీతిగ ఆఙ్ఞాపించుచున్నాను.
19. నీవు పొలమున కోతకోయించునపుడు ఒక పనను జారవిడుతువేని దాని కొరకు తిరిగివెళ్ళవలదు. పరదేశులు, అనాధలు, వితంతువులకొరకు దానిని వదలివేయుము. అప్పుడు ప్రభువు నీ కార్యములన్నిటిని దీవించును.
20. నీవు ఓలివుపండ్లను కోయునపుడు మరల రెండవసారికూడ కొమ్మలను గాలింపకుము. జారిపోయినపండ్లను పరదేశులకు, అనాధలకు, వితంతువులకు వదలివేయుము.
21. నీవు ద్రాక్షపండ్లు సేకరించునపుడు మరల రెండవమారు తోటను గాలింపవలదు. జారిపోయిన పండ్లను పరదేశులకు, అనాధలకు, వితంతువులకు వదలివేయుము.
22. మీరు ఐగుప్తులో బానిసలుగా ఉంటిరని మరువకుడు. కనుకనే మీకీయాజ్ఞ విధించితిని.
1. ఇరువురు యిస్రాయేలీయులు తగాదా పడి న్యాయస్థానమునకు వెళ్ళినపుడు అచటి అధిపతులు దోషిని దోషిగా, నిర్దోషిని నిర్దోషిగా నిర్ణయింపవలయును.
2. దోషికి శిక్ష విధింపవలసివచ్చినచో న్యాయాధిపతి అతనిని నేలమీద బోరగిల పరుండ బెట్టించును. అతని అపరాధమునకు తగినన్ని కొరడా దెబ్బలు విధించి కొట్టించును.
3. దోషికి నలుబది దెబ్బలు విధించిన చాలు. అంతకంటె ఎక్కువ దెబ్బలు విధించినచో తన సహోదరుని బహిరంగముగా అవమానపరచినట్లగును.
4. కళ్ళము తొక్కించునపుడు ఎద్దు మూతికి చిక్కము పెట్టరాదు.
5. ఇరువురు సోదరులు కలసి నివసించుచుండగా ఒకడు సంతానములేక చనిపోయినచో, అతని వితంతువు అన్యకుటుంబపు పురుషుని వివాహమాడరాదు. ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను దేవర న్యాయము ప్రకారము పెండ్లి చేసుకొని తన సోదరునికి మారుగా భర్త ధర్మము నెరవేర్చవలెను.
6. ఆమెకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోయిన తన సోదరుని కుమారుడుగా గణింపబడును. ఆ రీతిగా యిస్రాయేలీయులలో అతని కుటుంబము తుడిచి పెట్టుకొని పోకుండా, వర్దిల్లును.
7. కాని ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను చేపట్టనిచో ఆ వితంతువు పుర ద్వారము చెంతప్రోగైన పెద్దలయొద్దకుపోయి 'నా పెనిమిటి సోదరుడు నాకు దేవరన్యాయము జరిగించుటకు ఒప్పుకొనుటలేదు. అతడు తన సోదరుని సంతానము యిస్రాయేలీయులలో వర్ధిల్లుటకు ఇష్ట పడుటలేదు” అని చెప్పవలయును.
8. అప్పుడు పెద్దలతనిని పిలిపించి మాట్లాడవలయును. అతడు అంగీకరింపడేని,
9. ఆ వితంతువు పెద్దలు చూచుచుండగా అతని చెంతకు వెళ్ళి అతని కాలి చెప్పును ఊడబెరుకవలయును. అతని ముఖమున ఉమ్మివేసి 'సోదరునికి సంతానము కలిగింపని వానికట్లే జరుగును' అని పలుకవలయును.
10. ఆ మీదట యిస్రాయేలీయులలో అతని కుటుంబము 'చెప్పు ఊడదీయబడిన వాని కుటుంబము' అని నిందకెక్కును.
11-12. ఇరువురు పురుషులు పోట్లాడుకొనునపుడు వారిలో ఒకని భార్య, శత్రువు దెబ్బల నుండి పెనిమిటిని కాపాడుకొనుటకు ముందుకు వెళ్ళి ఆ శత్రువు జననేంద్రియమును పట్టుకొనెనేని ఆమె చేతిని నిర్దయతో నరికివేయవలయును.
13. మీరు ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉండునట్లు రెండుతూకపురాళ్ళు వాడరాదు.
14. ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా రెండు కొలమానములను ఉపయోగించరాదు.
15. సరియైన తూకపురాయి ఒక్కదానినే, సరియైన కొలమానమునొక్కదానినే మీచెంతన ఉంచుకొనుడు. అప్పుడు యావే మీకు ఈయనున్న ఆ నేలమీద మీరు చిరకాలము జీవింతురు.
16. ఇట్టి మోసములు చేయువానిని దేవుడైన ప్రభువు అసహ్యించుకొనును. అమాలెకీయులను మట్టుపెట్టవలయును
17. మీరు ఐగుప్తునుండి వెడలివచ్చునపుడు అమాలేకీయులు మీకేమి చేసిరో జ్ఞప్తికి తెచ్చుకొనుడు.
18. వారు మీ వెనువెంటవచ్చి మీలో వెనుకబడి నడువలేని దుర్బలులను వధించిరి. ఆ రీతిగా వారు దైవభయము ఏమాత్రము లేక అలసిసొలసియున్న వారిని చంపిరి.
19. యావే మీకు ఆ నేలనిచ్చి మీ చుట్టుపట్లనున్న శత్రువులనుండి మీకు భద్రతను దయచేసినపుడు మీరు ఈ నేలమీద అమాలేకీయుల అడపొడ కానరాకుండచేయుడు. ఈ సంగతి మరచి పోవలదు.
1. మీరు ప్రభువు మీకు ఈయనున్న నేల నాక్రమించుకొని అచట స్థిరపడినపిదప,
2. మీ పొలమున పండినపంటలో ప్రథమ ఫలములను గంపలో పెట్టుకొని ప్రభువు తన నామమునకు మందిరముగా ఎంచుకొనిన ఏకైక ఆరాధనస్థలమునకు కొనిపొండు.
3. అప్పుడు అచట సేవచేయుచున్న యాజకుని వద్దకు పోయి 'నేను ప్రభువు మన పితరులకు వాగ్దానము చేసిన నేలను చేరుకొంటినని నేడు దేవుని ముందు ప్రమాణముచేసి చెప్పుచున్నాను' అని చెప్పుడు.
4. అంతట యాజకుడు నీ గంపను తీసికొని ప్రభువు బలిపీఠము ముందుంచును.
5. అప్పుడు నీవు ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలయును: “ 'మా వంశకర్త దేశ సంచారియగు అరామీయుడు. అతడు కొద్దిమందితో ఐగుప్తునకు వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కాని ఆ కొద్దిమంది బలమైన మహాజాతిగా వృద్ధిచెందెను.
6. ఐగుప్తీయులు మనకు కీడు తలపెట్టి మనలను బాధించిరి. మనచేత వెట్టిచాకిరి చేయించుకొనిరి.
7. మనము మన పితరుల దేవుడైన యావేకు మొరపెట్టగా, యావే దేవుడు మనగోడు వినెను. ఆయన మన కష్టములను, చాకిరిని, మన అణచివేతను కన్నులార చూచెను.
8. దేవుడైన యావే తన హస్త బలమువలనను, చాపిన బాహువులవలనను, సూచకక్రియలవలనను, భయంకర కార్యములతోను, అద్బుతములతోను మనలను ఐగుప్తునుండి తోడ్కొనివచ్చెను.
9. మనలను ఇచటికి కొనివచ్చి పాలుతేనెలు జాలువారు ఈ నేలను మనకు ప్రసాదించెను.'
10. కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంటనుండి ఈ ప్రథమఫలములను ఆయనకు కానుకగా కొనివచ్చితిని" అని ప్రభువు సన్నిధిన చెప్పి, నీ గంపను ప్రభువు నెదుట పెట్టి ఆయనకు మ్రొక్కుము.
11. తదనంతరము నీ కుటుంబముతో, నీ నగరమున వసించు లేవీయులతో, పరదేశులతో కలసి ఉత్సవము చేసికొని ప్రభువు దయచేసిన మేలైన పదార్ధములన్నింటిని అనుభవింపుము.
12. ప్రతి మూడవయేడు మీకు పండిన పంటలో పదియవ వంతును లేవీయులకు, పరదేశులకు, అనాధలకు, వితంతువులకు చెల్లింపవలయును. వారు ఆ పంటను మీ నగరములలో సంతృప్తికరముగా భుజింతురు.
13. అటుల నీవు పదియవ వంతు చెల్లించిన పిమ్మట ప్రభువు సమక్షమున ఇట్లు ఉచ్చరింపుము. 'ప్రభూ! నేను నీకర్పింపవలసిన పదియవవంతు చెల్లించితిని. నీవాజ్ఞాపించినట్లే లేవీయులకు, పరదేశులకు, అనాధలకు, వితంతువులకు దానినొసగితిని. దశమభాగములను గూర్చిన నీ నియమములను నేను మీరలేదు, విస్మరింపలేదు.
14. నేను దుఃఖముగానున్నప్పుడు దానిని భుజింపలేదు. శుద్ధిచేసికొనకయే అంటుకొనలేదు. దానిని మృతపూజలో అర్పణముగా నీయలేదు. ప్రభూ! ఈ పదియవ వంతును గూర్చి నీవు విధించిన ఆజ్ఞలన్నిటిని పాటించితిని.
15. పవిత్రమైన నీ పరమపదము నుండి ఈ యిస్రాయేలు ప్రజలను దీవింపుము. నీవు పితరులకు వాగ్దానము చేసినట్లే మాకు ప్రసాదించిన ఈ పాలుతేనెలుజాలువారు నేలను దీవింపుము.'
16. నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞ లన్నిటిని పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను వీనిని అనుసరింపుడు.
17. నేడు మీరు ప్రభువును మీదేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభువు మార్గములందు నడచుచు, ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలన్నిటిని పాటించి, ఆయనకు విధేయులై యుండుటకు సమ్మతించితిరి.
18. ప్రభువు కూడ తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము తన సొంత ప్రజలనుగా చేసికొనెను. కాని మీరు తన ఆజ్ఞలన్నిటిని చేకొనవలయునని ఆ ప్రభువు కోరిక.
19. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటె మిమ్ము అధికులను చేయును. దానివలన మీకు కీరి ప్రతిష్ఠలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు.
1. మోషే పెద్దలతో కూడి యిస్రాయేలు ప్రజలనిట్లు ఆజ్ఞాపించెను: “నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలన్నిటిని చేకొనుడు.
2. మీరు యోర్దాను దాటి యావే మీకీయనున్న నేలను చేరుకొనినపిదప అచట పెద్దరాళ్ళు పాతి, సున్నము పూయుడు.
3. వాని మీద ఈ ధర్మశాస్త్రనియమములన్నిటిని వ్రాయుడు. ప్రభువు మీ పితరులకు వాగ్దానము చేసిన ఆ పాలు తేనెలు జాలువారునేలను చేరుకొనగనే ఈ కార్యము నిర్వహింపుడు,
4. మీరు యోర్ధాను దాటగనే నేను ఆజ్ఞాపించినట్లు ఏబాలు కొండపైన ఈ రాళ్ళుపాతి వానికి సున్నము పూయుడు.
5. తరువాత అక్కడ ఇనుప పనిముట్లు తాకని కరకురాళ్ళతో, యావేకు బలిపీఠమును నిర్మింపుడు.
6. చెక్కని ఆ కరకురాళ్ళతో యావేకు బలిపీఠము నిర్మించి దానిమీద దహన బలులను అర్పింపుడు.
7. అచటనే సమాధానబలులుకూడ సమర్పించి ఆ నైవేద్యములను ప్రభువు ఎదుట సంతోషముతో ఆరగింపుడు.
8. సున్నముకొట్టిన ఆ రాళ్ళమీద మాత్రము ఈ దైవశాసనములన్నిటిని స్పష్టముగా లిఖింపుడు”.
9. అటుతరువాత మోషే లేవీయ యాజకులతో కలసి ప్రజలతో ఇట్లనెను: “యిస్రాయేలీయులారా! మీరు నా పలుకులెల్ల సావధానముగా వినుడు. నేడు మీరు మీ ప్రభువైన యావేకు చెందిన ప్రజలైతిరి.
10. నేడు నేను మీకు విధించిన కట్టడలను ఆజ్ఞలన్నిటిని పాటించి ఆ ప్రభువునకు విధేయులు కండు.”
11-12. ఆ దినమందే మోషే ప్రజలకు ఇట్లు ఆజ్ఞాపించెను: “మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, యిస్సాఖారు, యోసేపు, బెన్యామీను తెగలవారు గెరిసీము కొండమీద నిలు చుండియుండగా యిస్రాయేలుప్రజ దీవింపబడును.
13. మరియు రూబేను, గాదు, ఆ షేరు, సెబూలూను, దాను, నఫ్తాలి తెగలవారు ఏబాలు కొండమీద నిలుచుండియుండగా యిస్రాయేలు ప్రజ శపింపబడును.
14. లేవీయులు ఈ క్రింది శాపవచనములు పెద్దగా ఉచ్చరింతురు:
15. 'కొయ్యతోగాని, రాతితోగాని, లోహముతో గాని విగ్రహమునుచేసి దానిని రహస్యముగా ఆరాధించు వాడు శాపగ్రస్తుడు. ప్రభువు విగ్రహారాధనను అసహ్యించు కొనును. అప్పుడు ప్రజలందరు 'ఆమెన్' అని జవాబు చెప్పవలయును.
16. 'తల్లిదండ్రులను గౌరవింపనివాడు శాప గ్రస్తుడు. ప్రజలందరు 'ఆమెన్' అని జవాబు చెప్ప వలయును.
17. 'పొరుగువాని పొలమునందలి సరిహద్దు గట్టురాతిని తొలగించువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని జవాబు చెప్పవలయును.
18. 'గ్రుడ్డివానిని అపమార్గము పట్టించువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని జవాబు చెప్పవలయును.
19. 'పరదేశుల, అనాధల, వితంతువుల హక్కులను భంగపరచువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.
20. తండ్రి భార్యను కూడినవాడు శాపగ్రస్తుడు. ఏలయన అతడు తండ్రి హక్కును భంగపరిచినవాడు. ప్రజలందరు 'ఆమెన్' అని జవాబు చెప్పవలయును.
21. 'జంతువులను కూడువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.
22. 'తన సహోదరితో అనగ, తన తండ్రి కుమార్తెతోగాని, తల్లికుమార్తెతోగాని కూడువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.
23. 'అత్తను కూడువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.
24. 'చాటుగా పొరుగువానిని దెబ్బతీయువాడు శాపగ్రస్తుడు.' ప్రజలందరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.
25. 'నిరపరాధికి ప్రాణహాని చేయుటకు లంచము తీసికొనువాడు శాపగ్రస్తుడు. ' ప్రజలందరు 'ఆమెన్' అని చెప్పవలయును.
26. 'ఈ విధికి సంబంధించిన నియమములను గైకొని పాటింపనివాడు శాపగ్రస్తుడు.' ప్రజలెల్లరు 'ఆమెన్' అని బదులు చెప్పవలయును.”
1. మీరు ప్రభువునకు పూర్తిగా విధేయులు కండు. ఈనాడు నేను మీకు విధించు ప్రభునాజ్ఞలను తు.చ. తప్పక పాటింపుడు. అప్పుడు యావే మిమ్ము ఈ భూమిమీది జాతులన్నిటికంటె అధికులను చేయును.
2. మీరు ప్రభువు మాటవిందురేని ఈ క్రింది దీవెనలెల్ల మీమీదికి వచ్చి మీకు ప్రాప్తించును.
3. ప్రభువు మీ నగరములను, మీ పొలములను దీవించును.
4. ఆయన మిమ్ము దీవించి మీకు చాలమంది బిడ్డలను, చాలపంటలను, చాలమంద లను దయచేయును.
5. మీ ధాన్యపు నిల్వను, మీ వంటపాత్రలు దీవెనలతో నిండిపోవును.
6. నీవు లోనికివచ్చునపుడును, వెలుపలికి వెళ్ళునపుడును దీవెనలు బడయుదవు.
7. మీమీదికి దండెత్తివచ్చు శత్రువులను ఓడించును. వారు మీమీదికి ఒక మార్గము వెంట దాడిచేసినచో ఏడుమార్గముల వెంటబడి పారి పోవుదురు.
8. ప్రభువు మీ గిడ్డంగులను దీవించి ధాన్యముతో నింపును. మీ సేద్యమును చల్లనిచూపు చూచును. తాను మీకీయనున్న నేలమీద మిమ్ము ఆశీర్వదించును.
9. మీరు ప్రభువు కట్టడలను, ఆజ్ఞలను పాటించి ఆయన మార్గమున నడతురేని ఆయన తాను మాటి చ్చినట్లే మిమ్ము తన సొంత ప్రజలుగా చేసికొనును.
10. భూమిమీది జాతులెల్ల మీరు ప్రభువు సొంత ప్రజలని గ్రహించి మీ యెదుట గడగడలాడుదురు.
11. ప్రభువు పితరులకు వాగ్దానము చేసిన నేలమీద మీకు చాలమంది పిల్లలను, చాలమందలను, చాల సమృద్ధిగా పంటలను దయచేయును.
12. ఆయన తన కోశాగారమువంటిదైన ఆకాశమునుండి మీ పొలముమీద సకాలమున వర్షములు కురియించును. మీ సేద్యమును దీవించును. మీరు చాలజాతులకు అప్పిత్తురు కాని ఏ జాతికిని మీరు అప్పుపడరు.
13. ఈనాడు నేను మీకు విధించు ప్రభువాజ్ఞలను పాటింతురేని మీరు ఇతర జాతులకు నాయకులు అయ్యేదరు కాని వారికి అనుచరులు కారు. మీరు ఇతరులకు తలగా నుందురుగాని, ఇతరులకు తోకగానుండరు.
14. మీరు ఈ ఆజ్ఞలను ఏమాత్రము ఉల్లంఘింపకయు, ఇతర దైవములనెంత మాత్రమును పూజింపకయు యుండిన యెడల మీరు ఇతరులకు పైచేయిగా నుందురేగాని, ఇతరుల మోచేతి క్రింది నీళ్ళు త్రాగరు.
15. కాని మీరు ప్రభువునకు అవిధేయులై నేనీనాడు మీకు విధించు ఆజ్ఞలను పాటింపరేని, ఈ క్రింది శాపములెల్ల మీ మెడకు చుట్టుకొనును.
16. ప్రభువు మీ నగరములను మీ పొలములను శపించును.
17. మీ ధాన్యపునిల్వను, మీ వంట పాత్రలను లేమితో శపించును.
18. ఆయన మిమ్ము శపించి మీకు బిడ్డలను, పంటలను, మందలను దయచేయడు.
19. మీరు లోనికి వచ్చునపుడును, వెలుపలికి వెళ్ళునపుడును శపింపబడుదురు.
20. మీరు ప్రభువును విడనాడి దుష్కార్యములు చేయుదురేని మీరు చేయుపనులన్నింటను ఆయన మీకు శాపము, నిరుత్సాహము, భంగపాటు కలుగు నట్లు చేయును. మిమ్ము శీఘ్రముగ, సమూలముగ నాశనము చేయును.
21. మీరు స్వాధీనము చేసి కొనబోవు నేలమీద మీరెల్లరు అంటువ్యాధులతో అణగారి పోవునట్లు చేయును.
22. మిమ్ము క్షయతో, జ్వరముతో, వాపులతో, మంటపుట్టించు బొబ్బలతో పీడించును. అనావృష్టితో, వడగాలులతో మిమ్ము బాధించును. మీరు చచ్చువరకు వానిబాధను తప్పించు కోజాలరు.
23. మీ మీది ఆకాశము ఇత్తడివలె పేరుకొనిపోగా వాన చినుకుపడదు. మీ క్రింది నేల ఇనుమువలె గట్టిపడిపోవును.
24. ప్రభువు మీ దేశముమీద వానజల్లులకు మారుగా, గాలి దుమార ములు పంపును. అవి మీ ప్రాణములు తీయును.
25. ప్రభువు మీ శత్రువులు మిమ్ము ఓడించునట్లు చేయును. మీరు మీశత్రువులమీద ఒకమార్గము వెంట దాడిచేసి, ఏడుమార్గముల వెంట మీరు పారిపోవు దురు. లోకములోని జాతులెల్ల మీ దుర్గతిని చూచి భయపడును.
26. ఆకాశమున పక్షులకును, భూమి మీది మృగములకును మీ శవములు ఆహారమగును. వానిని అదలించు వారెవ్వరును ఉండరు.
27. ప్రభువు మిమ్ము ఐగుప్తు బొబ్బలతో, గజ్జలలో లేచు గడ్డలతో, మచ్చలతో, గజ్జితో వేధించును. ఆ రోగములు నయముగావు.
28. ఆయన మిమ్ము పిచ్చి వారిని, గ్రుడ్డివారిని చేయును. మిమ్ము భయపెట్టును.
29. మీరు మిట్టమధ్యాహ్నము కూడ రేచీకటి వానివలె త్రోవగానక దేవురింతురు. మీరు ఏ కార్యము చేపట్టి నను అపజయము కలుగును. పరులు మిమ్ము నిరంతరము పీడింతురు. ఎవ్వడును మీకు సహాయము చేయడు.
30. నీకు ప్రధానము చేయబడిన పిల్లను మరి యొకడు కూడును. మీరు కట్టిన ఇంట వసింపజాలరు. మీరు నాటిన ద్రాక్షతోటనుండి పండ్లు సేకరింపజాలరు.
31. మీ ఎద్దును మీ ఎదుటనే కోయుదురు. కాని మీరు దాని మాంసమును భుజింపజాలరు. మీరు చూచుచుండగనే మీ గాడిదను తోలుకొని పోవుదురు. మరల దానిని మీ ఇంటికి కొనిరారు. మీ శత్రువులు మీ గొఱ్ఱెలను, మేకలను తోలుకొనిపోవుదురు. ఎవరును మీకు సహాయము చేయుటకురారు.
32. అన్యజాతిజనులు మీ కుమారులను, కుమార్తెలను, బానిసలనుగా కొనిపోవుదురు. వారి రాకకై మీరు కన్నులులో ఒత్తులు వేసికొని చూతురు. కాని మీరు ఏమియు చేయజాలరు.
33. అన్యజాతి ప్రజలు దండెత్తి వచ్చి మీరు మీ పొలమున చెమటోడ్చి పండించిన పంటను అపహరింతురు. వారు మిమ్ము నిరంతరము పీడించి అణగదొక్కుదురు.
34. మీరు అనుభవించు బాధలనుచూచి మీరు పిచ్చివారై పోవు దురు.
35. ప్రభువు మీ కాళ్ళమీద కుదరని చెడ్డ బొబ్బలు పొక్కించును. తల నుండి కాళ్ళ వరకు మీ శరీరమంత కురుపులతో నిండిపోవును.
36. ప్రభువు మిమ్మును, మీరెన్నుకొనిన రాజును మీకుగాని, మీ పితరులకుగాని తెలియని అన్యదేశము నకు పంపివేయును. అచట మీరు రాతితో, కొయ్యతో చేసిన విగ్రహములను కొలుతురు.
37. అటుల ప్రభువు మిమ్ము చెల్లాచెదరు చేయగా ఆ విదేశములోని ప్రజలు మిమ్ముచూచి విస్మయము చెందెదరు.
38. మీరు చాల విత్తనములను వెదజల్లుదురు. కాని కొద్దిపాటి పంటను మాత్రము సేకరింతురు. ఏలయనగా మిడుతలు మీ పైరును తినివేయును.
39. మీరు ద్రాక్షలునాటి సాగుచేయుదురుగాని, పండ్లనుగాని, ద్రాక్ష సారాయమునుగాని అనుభవింప జాలరు. ఏలయన పురుగులు ఆపండ్లను తినివేయును.
40. మీ పొలమంతట ఓలివుచెట్లను పెంచుదురు. కాని వాని నూనెను వాడుకొనజాలరు. వాని కాయలు రాలిపోవును.
41. మీకు కుమారులు, కుమార్తెలు కలుగుదురు. కాని వారిని మీ చెంత నుండి బందీలుగా కొనిపోయెదరు.
42. మీ చెట్లను, పైరుపంటలను కీటకములు ధ్వంసముచేయును.
43. మీ దేశమున వసించు అన్యదేశీయులు క్రమముగా వృద్ధి చెందుదురు. మీరు మాత్రము క్రమముగా సన్నగిల్లిపోవుదురు.
44. వారు మీకు అరువు ఇత్తురుగాని మీరు వారికి అరువు ఈయ జాలరు. వారు తలలుకాగా, మీరు తోకలవుదురు.
45. ప్రభువునకు అవిధేయులై ఆయన శాసించిన ఆజ్ఞలు పాటింపనందులకు పై కీడులెల్ల మీమీదికి దిగివచ్చి, మీ మెడకు చుట్టుకొని, మిమ్ము నశింప జేయును.
46. మిమ్మును, మీ సంతానమును ప్రభువు శిక్షించుచున్నాడనుటకు ఆ కీడులు శాశ్వత నిదర్శనములుగా నుండును.
47. ప్రభువు మిమ్ము సమృద్ధిగా దీవించినందులకు మీరు ఆయనను సంతోషముతోను, హృదయానందముతోను సేవించి యుండవలసినది. కాని మీరు అటుల చేయరైరి.
48. కనుక మీరు ప్రభువు పంపు శత్రువులకు బానిసలగుదురు. ఆకలి, దప్పిక, బట్టలు లేమియను సకలదారిద్య్రములను అనుభవింతురు. శత్రువులు మిమ్ము దారుణముగ పీడింపగా మీరు నశింతురు.
49. ప్రభువు సుదూరమగు భూదిగంతముల నుండి, ఒక శత్రుజాతి ప్రజను మీమీదికి కొనివచ్చును. వారిభాష మీకు తెలియదు. వారు గరుడపక్షివలె మీ మీద వ్రాలుదురు.
50. ఆ శత్రువులు భయంకరాకారులు, వృద్ధులమీద, యవ్వనస్తులమీద గూడ దయ చూపనివారు.
51. వారు మీమందలను, మీ పొలమున పండిన పంటను తినివేయగా మీరు ఆకలితో చత్తురు. వారు మీ ధాన్యము, ద్రాక్ష సారాయము, ఓలివునూనె, మందలను మిగులనీయరు. కనుక మీరెల్లరు చావ వలసినదే.
52. ఆ శత్రువులు ప్రభువు మీకు ఈయనున్న నేలమీది ప్రతి పట్టణమును ముట్టడింతురు. ఎత్తయి అభేద్యముగా ఉన్న మీ ప్రాకారములు, మీరు వాని నెంతగా నమ్ముకొనియున్నను నేలమట్టమగును. మీ దేశమునందలి గ్రామములన్నింటిని ముట్టడి చేయుదురు.
53. ఆ ముట్టడిలో మీరు ఆకలిబాధ భరింప జాలక ప్రభువు మీకు దయచేసిన బిడ్డలనే తిందురు.
54. శత్రువులు వచ్చి మీ పట్టణములను ముట్టడించి మిమ్ము బాధించుకాలమున, కలవారియింట పుట్టి మృదు స్వభావముతో అతి సుకుమారముగా పెరిగిన మనుష్యుడు కూడ తిండి దొరకక తన పిల్లలను కొందరిని తినివేయును.
55. తన సోదరునికిగాని, ప్రియభార్యకుగాని, చంపక మిగిలియున్న తన పిల్లలకు గాని తాను తిను మాంసములో భాగమీయడు.
56-57. శత్రువులు వచ్చి మీ పట్టణములను ముట్టడించి మీకు ఏమియు దొరకనీయకుండ బాధ పెట్టు కాలమున కలవారింట పుట్టి, చాల సుకుమారముగా పెరిగి, తన అరికాలు నేలపై మోపుటకు అంగీకరించని స్త్రీ సైతము తిండి దొరకక తన కాళ్ళ మధ్య తాను కనబోవు బిడ్డతోపాటు తన గర్భమునుండి వెలువడిన మావిని కూడ తాను రహస్యముగా భక్షింప తన ప్రియభర్తకు గాని, బిడ్డలకుగాని ఆమె జాలినొందనిదై ఆ తిండిలో భాగమీయదు.
58. మీరు ఈ గ్రంథమున వ్రాయబడిన దైవ శాసనములన్నిటిని పాటింపరేని, భయంకరమును, మహిమాన్వితమునైన ఆ ప్రభువు దివ్యనామమునకు భయపడరేని,
59. ప్రభువు మిమ్మును, మీ సంతానమును అంటురోగములతో పీడించును. ఆ రోగములు తిరుగులేనివి, ఘోరమైనవి, శాశ్వతమైనవి.
60. పైగా మీరు ఐగుప్తున చూచిన భయంకర వ్యాధులనుగూడ ప్రభువు మీకు సోకించును. అవి మిమ్ము వదలవు.
61. ఇంకను ప్రభువు ఈ ధర్మశాస్త్ర గ్రంథమున పేర్కొనని రోగములకును, అంటువ్యాధులకును మిమ్ము బలిచేయును. వానివలన మీరెల్లరును చత్తురు.
62. మీరు ఆకాశ నక్షత్రములవలె అసంఖ్యాకులుగా నున్నను, చివరకు కొద్దిమందిమాత్రమే మిగులుదురు. మీ ప్రభువునకు విధేయులు కానందులకు ఇట్టి శిక్ష పొందుదురు.
63. ఇంతవరకు ప్రభువు సంతోషముతో మీకు మేలుచేసి మీ సంఖ్యను హెచ్చించెను. కాని ఇక మీదట ఆయన సంతోషముతో మిమ్ము నాశనముచేసి నిర్మూలనము చేయును. మీరు ఆక్రమించుకొనబోవు దేశమునుండి మిమ్ము ఆయన వ్రేళ్ళతో పెరికివేయును.
64. ప్రభువు మిమ్ము నేల నాలుగు చెరగులందలి నానాజాతుల మధ్య చెల్లాచెదరుచేయును. అచట మీరు గాని, మీ పితరులుగాని ఎరుగని కొయ్యబొమ్మలను, రాతిబొమ్మలను కొలిచెదరు.
65. ఆ దేశమున మీకు కుదురుపాటుగాని, శాంతిగాని లభింపదు. మీ గుండె దడదడలాడును. మీ కళ్ళు మూతలుపడును. నిరాశ మిమ్మావరించును.
66. మీరు నిరంతరము అపాయ ముతో జీవింతురు. రేయింబవళ్ళు మీకు భయము పుట్టును. మీ జీవితము సురక్షితముగానుండదు.
67. మీరు ఉదయకాలమున సాయంకాలము కొరకును, సాయంకాలమున ఉదయముకొరకును కనిపెట్టుకొని యుందురు. మీ హృదయములు అంతటి భయముతో నిండిపోవును. మీరంతటి భయంకరదృశ్యములను చూచెదరు.
68. ప్రభువు మీరు మరల ఐగుప్తునకు వెళ్ళరని చెప్పినను, ఓడలమీద మిమ్ము అచటికి పంపును. అచట మీరు శత్రువులకు బానిసలుగా అమ్ముడు పోవగోరుదురు. కాని మిమ్ముకొనుటకు యిష్టపడు ఒకడైనను ఉండడు.”
69. ప్రభువు మోవాబు దేశమున మోషేను యిస్రాయేలీయులతో చేసికొనుమనిన నిబంధనపు షరతులివి. ప్రభువు హోరేబు చెంత యిస్రాయేలీయు లతో చేసికొనిన నిబంధనము ఉండనేయున్నది.
1. మోషే యిస్రాయేలీయులందరిని ప్రోగుచేసి ఇట్లనెను: “ప్రభువు ఐగుప్తురాజు ఫరోను, అతని ఉద్యోగులను, అతని దేశమును ఏమిచేసెనో మీరు కన్నులార చూచితిరికదా!
2. ప్రభువు పంపిన ఘోర వ్యాధులు, సూచకక్రియలు, అద్భుతకార్యములు మీరెల్లరును చూచితిరికదా!
3. కాని మీరు చూచిన సంఘటనలను అర్థము చేసికొను శక్తిని మాత్రము ఆయన నేటివరకును మీకు ప్రసాదింపలేదు.
4. నేను మీ దేవుడైన యావేనని మీరు తెలుసు కొనునట్లు నలువదియేండ్లపాటు మిమ్మును ఎడారిలో నడిపించితిని. అంతకాలము మీ శరీరముమీది బట్టలు చినిగిపోలేదు. మీ కాలిచెప్పులు అరిగిపోలేదు.
5. అప్పుడు మీకు తినుటకు భోజనము దొరకలేదు. త్రాగుటకు ద్రాక్షసారాయము గాని, ఘాటైన మద్యము గాని లభింపలేదు. అయినను ప్రభువు మీ అవసరముల నెల్ల తీర్చెను. దానివలన ప్రభువే మీ దేవుడని వెల్లడియైనది.
6. మనము ఈ తావు చేరుకొనినపుడు హెష్బోను రాజగు సీహోను, బాషాను రాజగు ఓగు మనమీద యుద్ధమునకు వచ్చిరి. కాని మనము వారిని జయించితిమి.
7. వారి దేశమును స్వాధీనము చేసికొని రూబేను, గాదు, మనష్షే అర్ధ తెగవారికి పంచియిచ్చితిమి.
8. మీరు ఈ నిబంధనపు షరతులన్నిటిని పాటింతురేని తప్పక వర్ధిల్లుదురు.
9-10. నేడు మీరు ప్రభువు ఎదుట ప్రోగైతిరి. మీ తెగనాయకులు, పెద్దలు, అధికారులు, స్త్రీలు, పిల్లలు, మీ చెంతవసించుచు మీకు వంటచెరకు నీళ్ళు మోసికొనివచ్చు పరదేశులెల్లరును ఇచట సమావేశ మైతిరి.
11. మీరు నేడు ప్రభువు మీతో చేసికొనబోవు నిబంధనను అంగీకరింపనున్నారు.
12. ఆయన పూర్వము మన పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు మాట ఇచ్చినట్లే నేడు మనలను, తన సొంత ప్రజలుగా స్వీకరించును. తాను మనకు దేవుడగును.
13. నేడు ప్రభువు మీతో మాత్రమే ఈ నిబంధనము చేసికొనుటలేదు. మీరు మాత్రమే దాని బాధ్యతలను అంగీకరించుటలేదు.
14. నేడు తన సమక్షమున సమావేశమైన మనతోచేసినట్లు, సమావేశము కాని మన సంతానముతో కూడ ప్రభువు ఈ నిబంధనము చేసికొనుచున్నాడు.
15. ఐగుప్తున జీవించుటయనగా ఎట్టిదో, ఇతర జాతుల దేశములగుండా పయనముచేయుట యనగా నెట్టిదో మీకు తెలియును.
16. ఆ ప్రజలు కొయ్యతో, రాతితో, వెండిబంగారములతో చేసికొనిన హేయమైన విగ్రహములను మీరు చూచిరి.
17. కనుక నేడిట ప్రోగైనవారిలో ఏ స్త్రీ గాని, ఏ పురుషుడుగాని, ఏ కుటుంబముగాని, ఏ తెగగాని ప్రభువును విడనాడి అన్యజాతుల దైవములను కొలవకుండునుగాక! మూలము మొలకెత్తి చేదైన విషఫలములు ఫలింపకుండునుగాక!
18. ఈ నియమములన్నిటిని ఆలకించిన పిదపగూడ మీలో ఎవడైన తన హృదయ కాఠిన్యతను బట్టి కన్నుమిన్ను గానక, మద్యము చేత దాహము తీర్చుకొనువానివలె, 'నా ఇష్టము వచ్చినట్లు నేను ప్రవర్తించిన నష్టమేమి లేదులే' అని తలంచుచూ, ప్రభువు నన్ను ఆశీర్వదించునని అనుకొనును.
19. అట్టి ఆలోచనలు కలవానిని ప్రభువు క్షమింపడు. అసూయతో కూడిన ప్రభువు కోపము వానిని దహించివేయును. ఈ గ్రంథమున పేర్కొనబడిన శాపములన్నియు అతని మెడకు చుట్టుకొనును. ప్రభువు అతని పేరును ఆకాశము క్రింద కానరాకుండ చేయును.
20. ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన నిబంధనపు శాపముననుసరించి ప్రభువు యిస్రాయేలు తెగలనుండి అతనిని వేరుచేసి నాశమునకు గురిచేయును.
21. భవిష్యత్తులో రానున్న మీ సంతానము, దూరదేశమునుండి వచ్చిన అన్యజాతి ప్రజలు, ప్రభువు మీ దేశముమీద పంపనున్న రోగములను, అరిష్టములను చూతురు.
22. మీ దేశమంతయు గంధకముతోను, ఉప్పుతోను నిండిన మరుభూమి అగును. అచట ఎవ్వడును పైరువేయడు, అసలు గడ్డి కూడ మొలవదు. పూర్వము ప్రభువు మహోగ్రుడై నాశనము చేసిన సొదొమ గొమొఱ్ఱాలవలె, ఆద్మా సెబోయీముల వలె మీ దేశము భస్మమైపోవును.
23. అప్పుడు సకలజాతులు “ప్రభువు ఈ నేలకింతకీడు చేయనేల? ఆయన ఇంతగా కోపింపనేల?” అని ప్రశ్నింతురు.
24. అందులకు జనులు, “ఈ ప్రజలు తమ పితరుల దేవుడైన ప్రభువు నిబంధనమును కాలదన్నిరి. వీరిని ఐగుప్తునుండి తోడ్కొని వచ్చినపుడు దేవుడు వీరితో చేసికొనిన నిబంధనమును అతిక్రమించిరి.
25. వీరు ప్రభువు అంగీకరింపని అన్యదైవములను సేవించి వాటికి నమస్కరించిరి.
26. కనుక యావే మహోగ్రుడై ఈ ప్రజలను ఈ గ్రంథమున లిఖింపబడిన శాపములన్నిటికి బలి కావించెను.
27. ప్రభువు మహారోషముతో మహాక్రోధముతో వీరిని స్వీయదేశమునుండి పెల్లగించివేసి, అన్యదేశములలో విసరివేసెను. నేటికిని వీరచటనే పడియున్నారు” అని బదులుచెప్పుదురు.
28. రహస్యవిషయములన్నియు ప్రభువునకే తెలియును. కాని ఆయన మనకును, మన సంతతికిని తన శాసనములను శాశ్వతముగా వెల్లడిచేసెను. కనుక మనము ఈ యాజ్ఞలనెల్ల పాటింపవలయును.
1. నేను పేర్కొనిన దీవెనలు, శాపములు నెరవేరి మీరు వివిధ జాతులమధ్య చెల్లాచెదరైనపుడు ఈ సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొనుడు.
2. మీరు, మీ సంతానము, నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలకు పూర్ణముగా బద్దులై, ప్రభువునొద్దకు పూర్ణహృదయము తోను, పూర్ణఆత్మతోను మరలివత్తురేని,
3. ప్రభువు మీ మీద దయచూపును. ప్రభువు మిమ్ము వివిధ జాతుల మధ్య చెల్లాచెదరు చేసెనుగదా! అచటి నుండి మిమ్ము మరల తోడ్కొనివచ్చును. మీరు మరల అభివృద్ధి చెందునట్లు చేయును.
4. మీరు మిన్నులు పడ్డచోట చెల్లాచెదరైయున్నను, ప్రభువు అచటినుండి గూడ మిమ్ము తోడ్కొనివచ్చును.
5. ఆయన మీ పితరులు స్వాధీనము చేసికొనిన నేలకు మిమ్మును కొనిపోవును. మీరు ఆ దేశమును వశము చేసి కొందురు. ప్రభువు మీ పితరులకంటె గూడ మిమ్ము అధిక సంపన్నులను, అధికసంఖ్యాకులను చేయును.
6. ప్రభువు మీకును, మీ సంతానమునకును విధేయాత్మకములైన హృదయములనొసగును. మీరు ఆయనను పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రేమింతురు. ఆ నేలమీద చిరకాలము జీవింతురు.
7. మిమ్ము ద్వేషించి వీడించు శత్రువుల మీదికే ప్రభువు ఈ శాపములన్నియు దిగివచ్చునట్లు చేయును.
8. కనుక మీరు మరల ఆయనకు విధేయులగుదురు. నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలెల్ల పాటింతురు.
9. ప్రభువు మీ కార్యములెల్ల సఫలముచేసి మిమ్ము పెంపొందించును. మీకు చాలమంది పిల్లలు, చాల మందలు కలుగును. మీ పొలములు సమృద్ధిగా ఫలించును. ఆయన మీ పితరులపట్ల సంతోషించి వారిని పెంపొందించినట్లే, మీ యెడల సంతృప్తి చెంది మిమ్మును కూడ పెంపొందించును.
10. మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన ఆయన ఆజ్ఞలనెల్ల పాటించి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను ఆయన యొద్దకు మరలి వత్తులేని పై దీవెనలెల్ల బడయుదురు.
11. నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిదికాదు.
12. అదెక్కడనో ఆకాశమున ఉన్నట్టిది కాదు. కనుక “మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశమున కెక్కి పోయి దానిని ఇచటకు కొనివత్తురు?” అని మీరు అడుగనక్కరలేదు.
13. అదెక్కడనో సముద్రములకు ఆవలనున్నట్టిది కాదు. కనుక “మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రములు దాటిపోయి దానిని ఇచటకు కొనివత్తురు?” అని మీరు అడుగనక్కరలేదు.
14. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయములోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనము పాటింపుడు.
15. జీవమును మేలును, కీడును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను.
16. ఈనాడు నేను మీకు విధించిన ప్రభువాజ్ఞలు పాటింతురేని, ఆయనను ప్రేమించి, ఆయనకు విధేయులై ఆయన శాసనములెల్ల నెరవేర్తురేని, మీరు పెంపు చెంది పెద్దజాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసికొనబోవు నేలమీద ప్రభువు మిమ్ము దీవించును.
17-18. కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్యదైవములను పూజింతురేని, తప్పక నశింతురని నేడు నేను నొక్కి వక్కాణించుచున్నాను. మీరు యోర్దానుకు ఆవలివైపున స్వాధీనము చేసికొనబోవు నేలమీద కూడ ఎక్కువకాలము జీవింపజాలరు.
19. ఈ దినము నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవమును మరణమును, ఆశీస్సును శాపమును మీ యెదుట నుంచితిని. కనుక జీవమునెన్నుకొని మీరును, మీ సంతానమును బ్రతికిపొండు.
20. మీరు ప్రభువును ప్రేమింపుడు. ఆయనకు విధేయులుకండు. ఆయనయే మీకు జీవనమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులగు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు దయచేయుదునని వాగ్దానము చేసిన నేలమీద, మీరు చిరకాలము జీవింతురు.”
1. మోషే యిస్రాయేలీయులతో ఇట్లనెను:
2. “నాకిపుడు నూటయిరువది యేండ్లు. నేనిక కార్యభారము వహింపజాలను. నేను యోర్దాను దాటనని గూడ ప్రభువు సెలవిచ్చెను.
3. మీ ప్రభువైన దేవుడు మీకు ముందుగా పోయి అచటి జాతులను నాశనము చేయును. మీరు వారి దేశమును స్వాధీనము చేసికొందురు. యెహోషువ మీకు నాయకుడగునని ప్రభువు నాతో చెప్పెను.
4. ప్రభువు అమోరీయ రాజులగు సీహోను, ఓగులను జయించి వారి రాజ్య ములను నాశనము చేసినట్లే, ఆ శత్రు ప్రజలను కూడ తుదముట్టించును.
5. ప్రభువు వారిని మీ చేతికి చిక్కించును. నేను మిమ్ము ఆజ్ఞాపించినట్లే మీరు వారిని రూపుమాపుడు.
6. మీరు ధైర్యస్టెర్యములను అలవరచుకొనుడు. మీరు వారిని చూచి భయపడవలదు. అధైర్యము చెందవలదు. ప్రభువు మీకు బాసటయై ఉండును. ఆయన మిమ్ము చేయి విడుచువాడు కాడు.”
7. అంతట మోషే యెహోషువను పిలిపించి ప్రజలందరి సమక్షమున అతనితో ఇట్లనెను: “నీవు ధైర్య స్తైర్యములను అలవరచుకొనుము. నీవీ ప్రజలతో వెళ్ళుము. ప్రభువు వారి పితరులకు వాగ్దానము చేసిన దేశమును స్వాధీనము చేసికొనునట్లు చేయుము.
8. నీవు భయపడవలదు. దిగులుపడవలదు. ప్రభువు నీ చేయివిడువడు. ఆయన నీకు నాయకుడగును. నీకు తోడుగా ఉండును” అని యిస్రాయేలీయులందరి ఎదుట యెహోషువతో చెప్పెను.
9. మోషే ఈ ధర్మశాస్త్రమును లిఖించి, దానిని ప్రభువు మందసమును మోయు లేవీయ యాజకులకును, యిస్రాయేలు నాయకులకును ఒప్పజెప్పెను.
10. అతడు వారిని ఇట్లు ఆజ్ఞాపించెను. “ప్రతి ఏడవయేటి చివరన, బాకీలు రద్దయిన కాలమున
11. ప్రభువు ఎంచుకొనిన ఏకైక ఆరాధనస్థలమున ప్రజలు ఆయనను కొలుచుటకు సమావేశమయినపుడు మీరు ఈ ధర్మశాస్త్రమును జనులందరి ఎదుట పఠింపుడు.
12. అప్పుడు స్త్రీలను, పురుషులను, పిల్లలను, మీ నగరములలో వసించుపరదేశులను ప్రోగు చేయుడు. వారెల్లరు ఈ ధర్మశాస్త్రమును విని ప్రభువు పట్ల భయభక్తులు అలవరచుకొని ఆయన ఆజ్ఞలెల్ల పాటింతురు.
13. అంతవరకు ఈ ధర్మశాస్త్రమును ఆలకింపని పిల్లలును అప్పుడు దానిని విందురు. విని, యోర్దాను ఆవల మీరు సొంతం చేసికొనబోవు నేలమీద తాము జీవించినంతకాలము ప్రభువుపట్ల భయభక్తులు చూపుదురు."
14. ప్రభువు మోషేతో “నీవు కన్నుమూయు కాలము సమీపించినది. యెహోషువను పిలువనంపి మీరిరువురు సమావేశపుగుడారము చెంత వేచి యుండుడు. నేను అచట అతనికి ఉపదేశము చేయుదును” అనెను. కనుక మోషే యెహోషువలు సమావేశపు గుడారము చెంత చేరిరి.
15. ప్రభువు గుడారము తలుపునొద్ద మేఘమునందు వారికి ప్రత్యక్షమయ్యెను.
16. ప్రభువు మోషేతో ఇట్లనెను: “నీవు త్వరలోనే నీ పూర్వీకులను చేరుదువు. నీ మరణానంతరము ఈ ప్రజలు వ్యభిచారులై తాము స్వాధీనము చేసికొనబోవు దేశమునందలి అన్యదైవములను పూజింతురు. వారు నన్ను విడనాడుదురు. నేను వారితో చేసికొనిన నిబంధనమును మీరుదురు.
17. అప్పుడు నా కోపము వారిమీద రగుల్కొనును. నేను వారిని పరిత్యజింతును. వారిని కరుణింపను. వారు ఘోర యాతనలకు గురియై క్రుంగి పోవుదురు. అప్పుడు ఆ ప్రజలు “ప్రభువు మమ్ము చేయివిడిచెను కనుకనే మాకు ఈ అగచాట్లన్నియు ప్రాప్తించినవి” అనియను కొందురు.
18. వారు అన్య దైవములను పూజించి అపచారము చేసినందులకు నేను వారిని ఆదుకొనను.
19. ఇప్పుడు నీవు ఈ పాటను వ్రాసికొనుము. దీనిని యిస్రాయేలీయులకు నేర్పింపుము. ఇది వారిని ఖండించుచు సాక్ష్యమిచ్చును.
20. నేను పితరులకు వాగ్దానము చేసిన పాలుతేనెలు జాలువారు నేలకు వీరిని కొనిపోవుదును. అచట వారు తమకు ఇష్టము వచ్చినది భుజించి సుఖముగా జీవింతురు. కాని వారు నన్ను విడనాడి అన్యదైవములను కొలుతురు. నన్ను లెక్కచేయక నా నిబంధనమును మీరుదురు.
21. ఫలితముగా ఘోరమైన యాతనలు, కష్టములు వారిని పీడించును. అప్పుడు ఈ గీతము వారిని ఖండించి సాక్ష్యమిచ్చును. వీరి సంతానమును కూడ దీనిని విస్మరింపజాలరు. నేను వీరికి వాగ్దానము చేసిన నేలకు వీరిని కొనిపోకమునుపే, వీరి హృదయములలో నున్న ఆలోచనలను ఇప్పుడే గుర్తింపగలను.”
22. మోషే నాడే ఈ గీతమును లిఖించి దానిని యిస్రాయేలీయులకు నేర్పించెను.
23. అంతట ప్రభువు నూను కుమారుడైన యెహోషువతో “నీవు ధైర్య స్టెర్యములను అలవరచుకొనుము. నీవు నేను వాగ్దానము చేసిన దేశమునకు యిస్రాయేలీయులను తప్పక తోడ్కొనివత్తువు. నేను నీకు బాసటయైయుందును” అని పలికెను.
24. మోషే ఈ దైవశాసనములన్నిటిని ఒక గ్రంథమున వ్రాసి,
25. ప్రభువు మందసమును మోయు బాధ్యతగల లేవీయులను ఇట్లు ఆజ్ఞాపించెను:
26. “మీరు ధర్మశాస్త్రమును కొనిపోయి మీ దేవుడైన ప్రభువు మందసముచెంత ఉంచుడు. అది అచట నుండి మిమ్ము ఖండించుచు సాక్ష్యమిచ్చును.
27. మీరు తిరుగుబాటు చేయువారనియు, తలబిరుసుగల జనమనియు నేనెరుగుదును. నేడు నేను బ్రతికియుండగనే మీరు దేవుని మీద తిరుగబడితిరనగా, ఇక నేను చనిపోయినపిదప ఎంతటి అల్లరికైనను పాల్ప డుదురు.
28. మీ తెగనాయకులను పెద్దలను నాయెదుట ప్రోగుచేయుడు. నేను వారికి ఈ సంగతులు చెప్పెదను. వారిని ఖండించి సాక్ష్యము చెప్పుటకు, భూమ్యాకాశములను పిలిచెదను.
29. నేను చనిపోయిన తరువాత మీరు తప్పక దుష్కార్యములు చేయుదురు. నా ఆదేశములను తిరస్కరించుదురనియు, మీరు ప్రభువు ఒల్లని చెడ్డపనులు చేసి ఆయన కోపమును రెచ్చగొట్టుదురనియు కావుననే భవిష్యత్తులో మీకు కీడు వాటిల్లునని నాకు తెలియును”
30. అంతట యిస్రాయేలు సమాజమంతయు ఆలకించుచుండగా మోషే ఈ క్రింది గీతమును సాంతముగా వినిపించెను:
1. “ఆకాశమా! నా మాటలు వినుము. భూమీ! నా పలుకులు ఆలింపుము
2. నా సందేశము వానచినుకువలె పడును. నా ఉపదేశము మంచువలె కురియును. నా పలుకులు లేబచ్చికపై జల్లులవలె లేబైరులపై తుప్పరలవలె దిగివచ్చును
3. నేను ప్రభువు నామమును స్తుతించెదను ఎల్లరు ఆయన మాహాత్మ్యమును ఉగ్గడింపుడు.
4. ప్రభువు మహాసంరక్షకుడు ఆయన యోగ్యుడు, న్యాయవంతుడు, విశ్వసనీయుడు, నిర్మలుడు, న్యాయమును ధర్మమును పాటించువాడు
5. యిస్రాయేలీయులు ఆయన పుత్రులుగా నుండక దుష్టులు, భ్రష్టులు, కపటాత్మలు, వక్రబుద్ధిగలవారైరి.
6. బుద్దిహీనులారా! మందమతులారా! ప్రభువునకు మీరు చేయు ప్రత్యుపకార మిట్టిదియా? ఆయన మీకు తండ్రి, మిమ్ము సృజించినవాడు. మిమ్మొక జాతిగా తీర్చిదిద్దినవాడు.
7. పూర్వకాలములను స్మరించుకొనుడు. ప్రాచీనయుగములను స్మృతికి తెచ్చుకొనుడు. మీ తండ్రులను అడిగి తెలిసికొనుడు. మీ వృద్ధులను ప్రశ్నించి వినుడు.
8. మహోన్నతుడు వివిధజాతులకు దేశములిచ్చినపుడు ఏ జాతులెచట వసింపవలయునో నిశ్చయించినపుడు యిస్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను
9. కాని యాకోబు సంతతిని మాత్రము ప్రభువు తన సొంత ప్రజలను చేసికొనెను
10. హోరుమను భీకరధ్వనిగల ఎడారిలో ప్రభువు వారిని కనుగొని, ఆయన తన కనుపాపనువలె వారిని సంరక్షించి పెంచి పెద్దజేసెను.
11. గరుడపక్షి పిల్లలనెగిరింపగోరి గూడురేపి తన పిల్లలపైని అల్లాడుచు వానిని చాచిన రెక్కలమీద సురక్షితముగా నిల్పుకొనునట్లే ప్రభువు యిస్రాయేలును కాచికాపాడెను.
12. యిస్రాయేలును నడిపించిన నాయకుడు ప్రభువేగాని అన్యదైవములుకారు.
13. ఆయన వారిని పీఠభూములకు పాలకులను చేసెను. పర్వతముల పంట వారికి భోజనమయ్యెను. కొండచరియలలోని తేనె వారికి ఆహారమయ్యెను. రాతినేలలో వారికి ఓలివుచెట్లు పెరిగెను
14. వారికి మందలనుండి పాలు పెరుగు లభించెను. మంచిమంచి గొఱ్ఱెలు మేకలు బాషాను ఎడ్లు దక్కెను. శ్రేష్ఠమైన గోధుమ మధురమైన ద్రాక్షసారాయము చేకూరెను.
15. యెషూరూను' మస్తుగా భుజించి, బలసిపోయి తిరుగుబాటునకు దిగెను. తమ్ము సృజించిన దేవుని విడనాడిరి. తమ రక్షకుని అనాదరము చేసిరి.
16. వారి విగ్రహారాధనము వలన ఆయనకు అసూయ పుట్టెను. వారి దుష్కార్యములు ఆయనకు కోపము రప్పించెను.
17. వారు దైవములు కాని దైవములకు బలులర్పించిరి. ఆ దైవములు మధ్యలో వచ్చిన క్రొత్త దైవములు, మన పితరులు మ్రొక్కని దైవములు.
18-19. ఆ ప్రజలు తమ సంరక్షకుని మరచిపోయిరి. తమ జీవనదాతను విస్మరించిరి. ఈ సంగతి గుర్తించి ప్రభువు తన కుమారులను కుమార్తెలను విడనాడెను.
20. “నేను వారికి సహాయము చేయను. విశ్వాసములేని ఆ కపటాత్ముల గతి యేమగునో చూతము” అని ఆయన అనుకొనెను. వారు వక్రబుద్ధిగల జాతి, విశ్వాసరహిత సంతానము.
21. వారి విగ్రహములు నాకు అసూయ గొల్పెను. ఆ దైవములుకాని దైవములు నా కోపమును రెచ్చగొట్టెను. నేనును జాతిగాని జాతివలన వారికి అసూయ పుట్టింతును. బుద్దిహీనుల వలన వారికి కోపము రప్పింతును.
22. నా కోపమునుండి చిచ్చుపుట్టును. అది భూమిని దానిమీది పచ్చదనమును దహించును. పాతాళము వరకు పయనము చేయును. పర్వత మూలములను కూడ కాల్చివేయును.
23. నేను వారిని సకల విపత్తులకు గురిచేయుదును. నా బాణములెల్ల వారిపై రువ్వెదను.
24. వారు కరవుతో, జ్వరముతో, ఘోరవ్యాధితో చత్తురు. నేను క్రూరమృగములను విషసర్పములను వారిమీదికి పంపుదును.
25. ఇంటి వెలుపల యుద్ధము వారిని హతము చేయును. ఇంటి లోపల భయము వారిని మట్టుపెట్టును. వారి యువతులు, యువకులు, చంటిబిడ్డలు, ముదుసలులు ఎల్లరు చత్తురు.
26. నేను వారిని సర్వనాశనముచేసి, నేలమీద వారి పేరు వినిపింపకుండ చేయుదుననుకొంటిని.
27. కాని వారి శత్రువులు మాత్రము విఱ్ఱవీగకుందురుగాక! 'మాయంతట మేమే ప్రభువు ప్రజలను జయించితిమి. యావే అనుగ్రహమువలన కాదని పలుకకుందురుగాక!
28. యిస్రాయేలీయులు ఎంతటి మందమతులు! ఎంతటి బుద్దిహీనులు!
29. వారెందుకు ఓడిపోయిరో గ్రహింపజాలకున్నారు. ఏమి జరిగినదో తెలిసికోజాలకున్నారు.
30. తమ ఆశ్రమదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యావే వారిని అప్పగింపని ఎడల ఒక్కడు వేయిమందిని పారద్రోలుట ఎట్లు? ఇద్దరు పదివేలమందిని తరిమికొట్టుట ఎట్లు?
31. కాని, వారి దేవుడు మన దేవుని వంటివాడుకాడు, మన శత్రువులు బుద్ధిహీనులు.
32. వారు సొదొమ గొమొఱ్ఱాలవలె దుష్టులు. చేదైన విషఫలములు ఫలించు ద్రాక్షలవంటివారు.
33. భయంకరమైన సర్పములఘోరవిషముతో చేయబడిన ద్రాక్షసారాయము వంటివారు.
34. కాని యిస్రాయేలీయులు ప్రభువునకు ప్రీతిపాత్రులు అమూల్యులు కాదా!
35. ప్రభువు శత్రువులమీద పగతీర్చుకొనును. వారు తప్పక పతనము చెందుదురు. వారికి వినాశము దాపురించినది,
36. ప్రభువు తన ప్రజలకు న్యాయము జరిగించును. తన సేవకులమీద కరుణజూపును. ఆయన వారి నిస్సహాయతను గుర్తించును. వారెల్లరును నాశనమగుచున్నారని తెలిసికొనును.
37. అప్పుడు ప్రభువు తన ప్రజలను చూచి, “మీరు నమ్మిన ఆ మహాదైవములేరీ?
38. మీరా దైవములకు బలులొసగలేదా? వారిచే ద్రాక్షరసము త్రాగింపలేదా? వారినిప్పుడు మిమ్ము కాచి కాపాడుమనుడు, మిమ్మాదుకొనుటకు రమ్మనుడు” అని అడుగును.
39. 'నే నొక్కడనే ప్రభుడను. నేను తప్ప మరియొక దేవుడు లేడు జీవమునకు మరణమునకు కర్తను నేనే. గాయపరచునదియు నేనే నయముచేయునదియు నేనే. నా కెవ్వరును అడ్డురాజాలరు.
40. నేను సజీవుడనైన దేవుడను గనుక చేయెత్తి ప్రమాణము చేయుచున్నాను
41. తళతళలాడు నా కత్తికి పదును పెట్టి, న్యాయము జరిగింతును. నా శత్రువులమీద పగతీర్చుకొందును. నన్ను ద్వేషించువారిని శిక్షింతును
42. నా బాణములు శత్రువుల నెత్తురు గ్రోలును. నా ఖడ్గము వారి తనువులను భుజించును. నన్నెదిరించు వారెవ్వరు బ్రతుకజాలరు. గాయపడినవారును, బందీలును చత్తురు.'
43. సమస్త జాతుల ప్రజలారా! ప్రభువును స్తుతింపుడు. ప్రభు ప్రజతోపాటు సంతసింపుడు. ఆయన తన భక్తులను వధించిన వారిని శిక్షించును. తన శత్రువులమీద పగతీర్చుకొనును. తన దేశముకొరకును, తన ప్రజలకొరకును ఆయన ప్రాయశ్చిత్తము చేయును.
44. మోషేయు, నూను కుమారుడైన యెహోషువయు ప్రజలు వినుచుండగ పై గీతమును వినిపించిరి.
45. మోషే పై గీతమును వినిపించిన తరువాత ప్రజలతో,
46. “మీరు ఈ ఉపదేశములెల్ల చేకొనుడు. అవి మిమ్ము ఖండించుచు సాక్ష్యమిచ్చును. మీ పిల్లలు ఈ ఆజ్ఞలెల్ల పాటింపవలయునని చెప్పుడు.
47. ఈ ఉపదేశములు వ్యర్ధప్రసంగములు కావు. ఇవియే మీకు జీవము. వీనిని పాటింతురేని మీరు యోర్దానునకు ఆవల స్వాధీనము చేసికొనబోవు నేలమీద చిరకాలము జీవింతురు.”
48-49. ప్రభువు ఆ రోజే మోషేతో “నీవు మోవాబు దేశమున యెరికో పట్టణము చెంతనున్న అబారీముకొండలకు వెళ్ళుము. అట నెబో కొండనెక్కి నేను యిస్రాయేలీయులకు ఈయనున్న కనాను మండలమును పారజూడుము.
50. నీ అన్న అహరోను హోరు పర్వతముమీద చనిపోయి నీ పితరులను కలిసికొనినట్లే, నీవును ఆ కొండమీద చనిపోయి నీ పితరులను చేరుకొందువు.
51. మీరిరువురును యిస్రాయేలు సమక్షమున నన్ను పవిత్రపరపరైరి. మీరు సీను ఎడారిలోని కాదేషు నగరము చెంతనున్న మెరిబా జలములయొద్ద నున్నపుడు ప్రజలు చూచుచుండగా నన్ను అగౌరవపరచితిరి.
52. కనుక నీవు దూరము నుండి మాత్రము ఆ మండలమును పారజూతువు. నేను యిస్రాయేలీయులకు ఈయనున్న ఆ నేలమీద నీవు అడుగు మోపజాలవు” అని చెప్పెను.
1. దైవభక్తుడైన మోషే తాను చనిపోక ముందు యిస్రాయేలు ప్రజలను ఇట్లు దీవించెను:
2. “ప్రభువు సీనాయి నుండి వచ్చెను. ఆయన సేయీరు కొండమీద సూర్యునివలె ఉదయించెను. పారాను కొండమీద ప్రకాశించెను. ఆయన వేవేల పరిశుద్ధ సమూహములనుండి వచ్చెను. ఆయన కుడివైపున నిప్పుమంటలు మెరసెను.
3. ప్రభువు తన ప్రజలను ప్రేమించును. తన వారిని రక్షించును. మనము ఆయన పాదములచెంతకేగుదము. ఆయన ఆజ్ఞలకు బద్దులమగుదుము.
4. మోషే మనకు ధర్మశాస్త్రమును ఇచ్చెను. యిస్రాయేలు ప్రభువు ప్రజ అయ్యెను.
5. యిస్రాయేలు తెగలు వారి నాయకులు సమావేశముకాగా, ప్రభువు వారికి రాజయ్యెను.
6. "రూబేను తెగవారు కొద్దిమందియే అయినను వారెన్నటికిని నశింపకుందురుగాక!”
7. యూదా తెగను గూర్చి మోషే ఇట్లుపలికెను: “ప్రభూ! వారి వేడికోలును ఆలింపుము. వారిని ఇతర తెగలతో చేర్పుము. నీవు వారి పక్షమున పోరాడుము. శత్రువుల నుండి వారిని కాపాడుము.”
8. లేవీ తెగను గూర్చి అతడిట్లు పలికెను: ప్రభూ! నీ తుమ్మీము, నీ ఉరీము నీ భక్తుడును, మస్సా మెరిబా జలములవద్ద నీచే పరీక్షింపబడిన లేవికి ఇమ్ము.
9. వారు తమ తల్లిదండ్రులకంటె, సోదరులకంటె, బిడ్డలకంటె నిన్నధికముగా ప్రేమించిరి. వారు నీ యాజ్ఞలను పాటించిరి. నీ ధర్మశాస్త్రమునకు విధేయులైరి.
10. వారు నీ ఆజ్ఞలు యిస్రాయేలునకు బోధింతురు. నీ సాన్నిధ్యమున ధూపము వేయుదురు. నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పింతురు.
11. ప్రభూ! నీవు వారిని దీవింపుము. వారి కైంకర్యములను అంగీకరింపుము. వారి శత్రువులను తునుమాడి, వారు మరల తలయెత్తకుండునట్లు చేయుము.”
12. బెన్యామీను తెగను గూర్చి అతడిట్లు పలికెను: “ప్రభువు ఈ తెగవారిని ప్రేమించును. దినదినము వారిని సంరక్షించును. తాను వారినడుమ నెలకొనియుండును.”
13. యోసేపు తెగను గూర్చి అతడిట్లు పలికెను: “ప్రభువు వానలతో, భూగర్భజలములతో వారి పొలములను దీవించు గాక!
14. అన్ని ఋతువులందును వారి పొలములు సూర్యరశ్మిసోకి సమృద్ధిగా పండునుగాక!
15. పురాతనములైన వారి కొండలు పండ్లతో నిండియుండునుగాక!
16. వారి పొలములు చక్కగా పండునుగాక! పొదలో కనిపించిన దేవుడు వారిని దీవించునుగాక! సోదరులకు యోసేపు నాయకుడయ్యెను గనుక, అతని తెగకు ఈ దీవెనలన్నియు లభించుగాక!
17. యోసేపు తెగ వృషభమువలె బలమైనది. వారి బలము అడవిఎద్దు కొమ్ముల బలమువంటిది. ఆ కొమ్ములతో వారు శత్రువులను కుమ్మి, దిగంతములకు నెట్టివేయుదురు. ఎఫ్రాయీము తెగలోని పదివేలమంది జనులు, మనష్షేతెగలోని వేయిమంది ప్రజలు అట్టి బలవంతులు.”
18. సెబూలూను తెగను గూర్చి అతడిట్లు పలికెను: “సెబూలూను తెగవారు సముద్ర వ్యాపారముతో వృద్ధిచెందుదురుగాక! యిస్సాఖారు సంపద ఇంటిపట్టుననే పెంపుచెందునుగాక!
19. వారి పర్వతముమీద ప్రజలు ప్రార్థనకు ప్రోగగుదురు. వారచట నీతి బలులర్పింతురు. వారి సంపదలు సముద్రమునుండియు దాని అంచుననున్న ఇసుకదిబ్బలనుండియు లభించును.”
20. గాదు తెగను గూర్చి అతడిట్లు పలికెను: “వారి మండలమును సువిశాలముచేసిన ప్రభువు స్తుతింపబడునుగాక! వారు సింహమువలె పొంచియుండి, శత్రువుల చేతులనో, తలలనో పెరికివేయుదురు.
21. ఆ తెగవారికి మంచి భూములు లభించినవి. వారికి నాయకుల భాగము దక్కినది. వారు ప్రభువు న్యాయమును, విధులను పాటించిరి కనుక ఆయన ప్రజకు నాయకులైరి.”
22. దాను తెగను గూర్చి అతడిట్లు పలికెను: దాను తెగ సింగపుకొదమవలె బాషాను నుండి కుప్పించి దుముకును.
23. నఫ్తాలి తెగను గూర్చి అతడిట్లు పలికెను: “ప్రభువు వారిని సమృద్ధిగా దీవించెను. సముద్రము మరియు దక్షిణము వరకు వారి ప్రాంతము వ్యాపించినది.”
24. ఆషేరు తెగను గూర్చి అతడిట్లు పలికెను: “అన్ని తెగలకంటెను ఆషేరు అధికముగా దీవెనలందెను. సోదరులలో ఆ తెగవారు అగ్రగణ్యులు. వారి పొలమున ఓలివుతోటలు పెంపుచెందును.
25. వారి పట్టణములు ఇనుప కవాటములతోను, ఇత్తడి కవాటములతోను సురక్షితములగునుగాక! కలకాలము వారు భద్రముగా జీవింతురుగాక!”
26.యిస్రాయేలూ వినుము! . మీ దేవునివంటి దేవుడు మరియొకడులేడు. ఆయన వైభవముతో ఆకసమున స్వారిచేయును. మేఘములపై ఎక్కివచ్చి మిమ్ము రక్షించును.
27. పురాతనుడైన ప్రభువు మీకు రక్షణము. ప్రాచీనములైన ఆయన బాహువులు మీకు రక్ష. ఆయన మీ శత్రువులనెల్ల తరిమివేసెను. వారిని నాశనము చేయుడని మీతో చెప్పెను.
28. కనుక యాకోబు సంతతి సురక్షితముగా జీవించును. వారి పొలమున ధాన్యము, ద్రాక్షసారాయము కొల్లలుగా లభించును. అచట సమృద్ధిగా వానలు కురియును.
29. యిస్రాయేలూ! మీరెంత ధన్యాత్ములు! మీవలె విజయము పొందినవారెవరు? ప్రభువు మీకు రక్షణమునిచ్చు డాలు, మీకు విజయము ప్రసాదించు ఖడ్గము, మీ శత్రువులు వచ్చి, మిమ్ము కపటముగా శరణువేడగ మీరు వారి ఉన్నతస్థలములను తొక్కుదురు.”
1. అంతట మోషే మోవాబు మైదానమునుండి వెడలిపోయి యెరికో నగరమునకు ఎదురుగానున్న నెబో కొండయందలి పిస్గా శిఖరము నెక్కెను. అచటి నుండి ప్రభువు అతనికి ఆ దేశము నంతటిని చూపించెను. గిలాదు మండలమును దాను నగరము వరకు చూపించెను.
2. నఫ్తాలి మండలమును సంపూర్ణముగా చూపించెను. ఎఫ్రాయీము మనష్షే మండలమును చూపించెను. యూదా మండలమును మధ్యధరాసముద్రము వరకు చూపించెను.
3. దక్షిణ భాగమును, సోవరు యెరికో నగరముల మధ్య గల మైదానమును, ఖర్జురవనముల పట్టణమును చూపించెను.
4. ప్రభువు మోషేతో “నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులకు బాసచేసి వారి సంతానము నకు ఇచ్చెదనన్న సీమ ఇదియే. నేను నీకు ఆ నేలను చూపించితిని. కాని నీవు అచటకు వెళ్ళజాలవు” అని అనెను.
5. ప్రభువు నిర్ణయించినట్లే దైవభక్తుడైన మోషే మోవాబు మండలముననే గతించెను.
6. ప్రభువు అతనిని బేత్పెయోరు పట్టణము నెదుట మోవాబు లోయలో పాతి పెట్టెను. కాని నేటివరకు అతని సమాధియెవరి కంటనుపడలేదు.
7. చనిపోవునాటికి మోషే వయస్సు నూటయిరువదిఏండ్లు. అయినను అతని దృష్టి మందగింపలేదు, అతని శక్తిసన్నగిల్లలేదు.
8. మోవాబు మైదానమున యిస్రాయేలీయులు మోషే కొరకు ముప్పదినాళ్ళు శోకించిరి. ఆ పిమ్మట శోక దినములు ముగిసినవి.
9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువపై ఉంచెను, గనుక అతడు పూర్ణవిజ్ఞానమును బడసెను. యిస్రాయేలీయులు యెహోషువకు విధేయులై ప్రభువు మోషే ముఖమున ప్రసాదించిన ఆజ్ఞలను పాటించిరి.
10. నాటినుండి మోషేవంటి ప్రవక్త యిస్రాయేలీయులలో మరల పుట్టలేదు. ప్రభువు అతనితో ముఖాముఖి సంభాషించెను.
11. ప్రభువు ఫరోను అతని అధికారులను అతని దేశమును నాశనము చేయుటకై మోషేద్వారా ఎంతటి అద్భుతకార్యములు, ఎట్టి సూచక క్రియలు చేయించెను!
12. యిస్రాయేలీయుల సమక్షమున మోషే ఎంతటి భయంకరమైన మహాకార్యములు నిర్వహించెను!