ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 9

1. అంతట ప్రభువు మోషేతో “వెళ్ళి ఫరోతో 'హెబ్రీయులదేవుడు యావే నీకు ఈ వర్తమానమును పంపెను. నన్ను ఆరాధించుటకు నా ప్రజను పంపుము.

2. నీవు వారిని వెళ్ళనీయకుండ ఇంకను అడ్డగించినచో,

3. పొలములలో ఉన్న నీ పశువులు అనగా గుఱ్ఱములు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, గొఱ్ఱెలు యావే పంపు రోగమువలన నాశనమైపోవును. వానికి చావు తెగులు తగులును.

4. ప్రభువు యిస్రాయేలీయుల పశువులనుండి ఐగుప్తుదేశీయుల పశువులను వేరు చేయును. యిస్రాయేలీయుల పశువులలో ఏ ఒక్కటియు చావదు.

5. ప్రభువు కాలమును కూడ నిర్ణయించెను. రేపే ఈ దేశమునకు ఈ కీడు మూడునని ఆయన వచించెను' అని చెప్పుము” అని పలికెను.

6. మరునాడే యావే తాను చెప్పినటు చేసెను. ఐగుప్తుదేశీయుల పశువులన్నియు చచ్చెను. యిస్రాయేలీయుల పశువులలో ఒక్కటి కూడ చావలేదు.

7. ఫరో ఈ ఉపద్రవమును గూర్చి విచారణ జరిపి జరిగినదంతయు గుర్తించెను. యిస్రాయేలీయుల పశువులలో ఒక్కటిగూడ చావదయ్యెను. అయినప్పటికి ఫరో హృదయము ఇంకను మొండికెత్తెను. అతడు ప్రజలను పోనీయడయ్యెను.

8. యావే మోషే అహరోనులతో "మీరు గుప్పిళ్ళ నిండ ఆవపు బూడిదను తీసికొనుడు. ఫరో కన్నుల యెదుటనే మోషే దానిని మింటివైపు చల్లవలయును.

9. అది సన్నని పొడియై ఐగుప్తుదేశమంతట వ్యాపించి మనుష్యులకు, జంతువులకు బొబ్బలు పుట్టించును. ఆ బొబ్బలు చిదిగి గాయములగును” అనెను.

10. ప్రభువు ఆజ్ఞాపించినట్లే వారిరువురు ఆవము నుండి బూడిద తీసికొని ఫరోరాజు ఎదుట నిలిచిరి. మోషే దానిని మింటివైపు చల్లెను. ఆ బూడిద మనుష్యులకు జంతువులకు బొబ్బలు పుట్టించెను. అవి పగిలి వ్రణములయ్యెను.

11. మాంత్రికులు మోషే ఎదుట నిలువలేకపోయిరి. ఐగుప్తు దేశీయులందరివలె వారికిని శరీరమందంతటను బొబ్బలు పుట్టెను.

12. కాని యావే ఫరోను కఠినగుండె గలవానినిగా చేసెను. ఆయన ముందు చెప్పినట్లే ఫరో, మోషే అహరోనుల మాటలు వినలేదు.

13. తరువాత యావే మోషేతో “పెందలకడలేచి ఫరో సముఖమునకు వెళ్ళి, అతనితో 'హెబ్రీయుల దేవుడగు యావే నీకు ఈ వార్తను పంపెను. నన్ను సేవింప నా ప్రజను పోనిమ్ము.

14. ఈసారి నిన్నును, నీ కొలువువారిని, నీ ప్రజను సకల శిక్షలకు గురి చేయుదును. అప్పటికిగాని సర్వప్రపంచములో నా వంటివారు ఎవరునులేరని నీకు తెలిసిరాదు.

15. నేను చేయిచేసుకొని నిన్ను, నీ జనమును మహా రోగములతో పీడించియుందునేని నీవు ఈపాటికే ఈ భువిపై కానరాకుండ నాశనమైయుండెడివాడవు.

16. కాని నీకు నా బలమును చూపించుటకు నేల నాలుగు చెరగుల నా నామమును ప్రసిద్ధము చేయుటకు నిన్ను ప్రాణములతో వదలితిని.

17. ఇప్పటికిని నీవు నా ప్రజలను పోనీయక నిన్నునీవు గొప్ప చేసికొనుచున్నావు.

18. కావున రేపీపాటికి ఐగుప్తురాజ్యమును స్థాపించిన నాటినుండి కనివినియెరుగని గొప్ప వడగండ్లవాన కురిపింతును.

19. నీ పశువులను పొలములోనున్న సకలమును భద్రపరచుకొనుము. ఇంటికిరాక పొలమునందేయున్న ప్రతి మనుష్యుని మీద, ప్రతి పశువుమీద వడగండ్లవాన పడును, పొలములోని పశువులు, జనులు, సర్వనాశమగుదురు' అని చెప్పుము” అని పలికెను.

20. యావే పలుకులకు భయపడి ఫరో కొలువులోని వారు కొందరు తమ బానిసలను, పశువులను ఇండ్లకు త్వరగా రప్పించిరి.

21. యావే మాటలను లెక్కచేయనివారు తమ బానిసలను, పశువులను పొలములోనే ఉండనిచ్చిరి.

22. యావే మోషేతో “నీ చేతిని ఆకాశమువైపు చాపుము. ఐగుప్తుదేశమునందంతట మనుష్యులమీద, పశువులమీద పొలములలో మొలచిన మొక్కలమీద, వడగండ్లవాన పడును” అని చెప్పెను.

23. మోషే మింటివైపు కఱ్ఱనెత్తెను. ప్రభువు ఉరుములతో వడ గండ్లవాన కురిపించెను. యావే ఐగుప్తునేలమీదికి పిడుగుల అగ్నిని పంపెను.

24. ఉరుములు మెరుపులు మిరిమిట్లు గొలుపుచుండగా వడగండ్లవాన కురిసెను. ఐగుప్తుదేశీయులు ఒక జాతిగా ఏర్పడిన నాటినుండి కనివిని ఎరుగని గొప్ప వడగండ్లవాన అది.

25. ఈ రీతిగా వడగండ్ల వాన ఐగుప్తుదేశమున పొలములలో ఉన్న మనుష్యులను జంతువులను నాశనము చేసెను. పైరుపంటలను, చెట్టుచేమలను ఊడ్చివేసెను.

26. హెబ్రీయులు వసించు గోషేను మండలములో మాత్రము వడగండ్లవాన పడలేదు.

27. మోషే అహరోనులను ఫరో పిలిపించి వారితో “ఈసారి, నేను తప్పుచేసితిని. యావే న్యాయవంతుడు. నేను, నాజనులు దోషులము.

28. ఈ పిడుగుల వడగండ్లవానను ఆపుమని యావేను వేడుకొనుడు. ఇక ఈ వానలను మేము భరింపలేము. మిమ్ము పోనిత్తునని మాట ఇచ్చుచున్నాను. ఇక మీరిక్కడ ఉండనక్కరలేదు” అని చెప్పెను.

29. అంతట మోషే “ఈ పట్టణమును వీడిన క్షణముననే నేను యావే వైపు చేతులు చాచెదను. ఆ మీదట ఉరుములుండవు. వడగండ్లవాన పడదు. దీనినిబట్టి ఈ భూమండలమునకు అధిపతి యావే అని నీవు తెలిసికొందువుగాక.

30. అయినను నీవును, నీ కొలువు వారును మా దేవుడయిన యావేకు ఇప్పటికిని భయపడరని నాకు తెలియును” అని అనెను.

31. అప్పుడు జనుము పూతపూచియుండెను. యవ వెన్ను తొడిగియుండెను. కావున ఆ రెండును వడగండ్ల వలన నాశనమయ్యెను.

32. గోధుమలు, మిరప మొలకలు ఎదగలేదు. కావున అవి పాడైపోలేదు.

33. మోషే ఫరోను వీడి నగరము వెలుపలికి వెళ్ళెను. అతడు యావే వైపు చేతులు చాచెను. ఉరుములు ఆగెను. వడగండ్లవాన వెలిసెను. నేలమీద వాన చినుకైన పడలేదు.

34. వానపడుట లేదని వడగండ్లవాన కురియుటలేదని, ఉరుములు నిలిచెనని తెలిసిన తరువాత ఫరో తిరిగి పాపము కట్టుకొనెను, అతడును అతని కొలువువారును కఠినహృదయులైరి.

35. మరల ఫరో కఠినహృదయుడయ్యెను. ఇంతకు మునుపు యావే, మోషేద్వారా చెప్పినట్లుగానే అతడు యిస్రాయేలీయులను పోనీయలేదు.