ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 5

1. తరువాత మోషే అహరోనులు ఫరోకడకు వెళ్ళి అతనితో “యిస్రాయేలు దేవుడైన యావే 'అరణ్యములో నా పేర ఉత్సవము జరుపుకొనుటకు నా ప్రజలను పోనిమ్ము' అని అడుగుచున్నాడు” అని చెప్పిరి.
2. ఫరో “ఎవరా యావే? అతడు చెప్పిన మాటకు చెవియొగ్గి నేనేల యిస్రాయేలీయులను పంపవలెను? అతడెవడో నాకు ఏమియు తెలియదు. నేను యిస్రాయేలీయులను వెళ్ళిపోనీయను” అనెను.
3. అంతట వారు “హెబ్రీయుల దేవుడు మాకు ప్రత్యక్ష మయ్యెను. మూడుదినములపాటు అరణ్యమున ప్రయాణముచేసి మా దేవుడైన యావేకు బలి అర్పించుటకు సెలవిమ్ము. కానిచో ఆయన మహారోగములతో కాని, ఖడ్గముతోకాని మామీద విరుచుకొనిపడును” అని బదులు చెప్పిరి.
4. ఐగుప్తుదేశ ప్రభువు “మోషే! అహరోనూ! మీరు యిస్రాయేలీయులను పనిపాటలు మాన్పించుటలో అర్థమేమయినా ఉన్నదా? పొండు! మీ ఊడిగములేవో మీరు చూచుకొనుడు” అని వారితో అనెను.
5. అతడు ఇంకను “ఈ జనము ఎక్కువగా విస్తరించిరి. వారిని కష్టపడకుండ చేయవలెననియా మీ కోరిక!” అనెను.
6. ఆనాడే ఫరో ఐగుప్తుదేశీయ దాసాధ్యక్షులకు, యిస్రాయేలీయులగు పర్యవేక్షకులకు ఆజ్ఞలిచ్చుచు,
7. “ఇప్పటిదాక మీరే ఈ జనులకు ఇటుకలు చేయుటకై గడ్డిని సమకూర్చితిరి. ఇకముందు ఆ పనిచేయవలదు. వారినే వెళ్ళి తమకు కావలసిన గడ్డిని ప్రోగుజేసికొననిండు,
8. అంతేకాదు. వారు మునుపుచేసినన్ని ఇటుకలు చేయునట్లు చూడుడు. ఆ లెక్క ఏమాత్రము తగ్గరాదు. వారు సోమరిపోతులు. కావుననే - మమ్ము వెళ్ళనిండు. మా దేవునకు బలి అర్పింపనిండు అని మొరుగుచున్నారు.
9. వారిని మునుపటికంటె అధికముగా శ్రమపెట్టుడు. అటులయిన గాని వారు తమపనికి అంటిపెట్టుకొనియుండరు. కల్ల బొల్లివాగుడు విను తీరికలేకుండ ఉందురు” అనెను.
10. దాసాధ్యక్షులును పర్యవేక్షకులతోపాటు యిస్రాయేలీయులతో మాట్లాడుటకు వెళ్ళిరి.
11. వారు “నేను ఇకముందు గడ్డి సమకూర్పననియు, వెళ్ళి మీకు కనబడినచోట మీరే గడ్డిని ప్రోగుజేసికొనుడనియు, మొత్తముమీద ఇటుకలలెక్క ఏమాత్రము తగ్గరాదనియు ఫరో ఆజ్ఞాపించెను” అని చెప్పిరి.
12. అందుచేత యిస్రాయేలీయులు గడ్డిదుబ్బులు కోయుటకై ఐగుప్తుదేశమందంతట చెల్లాచెదరయిరి.
13. దాసాధ్యక్షులు వారిని పీడించిరి. వారితో “మీకు గడ్డిని సమకూర్చి ఇచ్చినప్పుడు చేసినన్ని ఇటుకలు ఇప్పుడును చేయవలెను” అనిరి. 
14. ఫరో దాసాధ్యక్షులు తాము యిస్రాయేలీయులమీద నియమించిన పర్యవేక్షకులను కొరడాలతో కొట్టి “ఎప్పటిమాదిరిగా నేడుకూడ మీరు పూర్తిగా లెక్కకు సరిపోవునట్లు ఇటుకలు చేయింపలేదేల?” అని అడిగిరి.
15. యిస్రాయేలీయుల పర్యవేక్షకులు ఫరో కడకువెళ్ళి ఫిర్యాదుచేసిరి. వారు అతనితో “మీరు మీ దాసులను ఈ విధముగా బాధింపనేల? 
16. మీ దాసులకు గడ్డిని సమకూర్పరు. అయినను ఇటుకలు చేయుడని గద్దింతురు. ఇప్పుడు మీ దాసులను కొరడాలతో కొట్టిరి. తప్పు మీ ప్రజలయందే నున్నది” అని అనిరి.
17. ఫరో వారితో “మీరు సోమరిపోతులు, సోమరిపోతులు కావుననే యావేకు , బలి అర్పించుటకు మమ్ము వెళ్ళనిండు అని అనుచున్నారు. 
18. వెంటనే మీరు మీ పనికిపొండు. ఎవ్వరు ఏ గడ్డిని మీకీయరు. కాని మీరు మాత్రము లెక్కచొప్పున చేయవలసిన ఇటుకలను చేయక తప్పదు” అని అనెను.
19. తాము రోజువారిగా చేయుచున్న ఇటుకల లెక్కలో తగ్గింపు ఉండదని వినిన తర్వాత యిస్రాయేలు పర్యవేక్షకులు తమకు ఎంత కష్టదశ కలిగెనో తెలిసి కొనిరి.
20. వారు ఫరో సమ్ముఖమునుండి మరలి వచ్చుచు బయట తమకొరకు వేచియుండిన మోషేను అహరోనును కలిసికొనిరి.
21. ఆ పర్యవేక్షకులు వారితో “మీరు చేసిన యీ పనికి గాను యావే మీకు తగిన శిక్షవేయునుగాక! ఫరోరాజుకు, అతని కొలువు వారికి మా వాసన గిట్టుటలేదు. వారు మమ్ము ద్వేషించునట్లు చేసితిరి, మా గొంతులు కోయుటకు వారి చేతులకు కత్తులు ఇచ్చితిరి” అని అనిరి.
22. అపుడు మోషే యావేను ఆశ్రయించెను. అతడు “ప్రభూ! వీరిని ఇంత కటికతనముతో చూచుచున్నావేల? ఇంతకు నన్నిక్కడికి ఎందుకు పంపితివి?
23. నేను ఫరోను దర్శించి అతనితో నీ పేర మాట్లాడినప్పటి నుండి అతడు ఈ జనులను చంపుకొని తినుచున్నాడు. నీవేమో నీ ప్రజలను ఉద్దరించుటకు కాసింత ప్రయత్నమైన చేయవైతివి” అని యావేకు విన్నవించెను.