1. మోషే కొండమీద జాగుచేయుట యిస్రాయేలీయులు చూచినపుడు, వారు అహరోను కడకువచ్చి “లెమ్ము! మమ్ము నడిపించుటకు ఒక క్రొత్తదేవరను చేసి పెట్టుము. మమ్ము ఐగుప్తునుండి నడిపించుకొని వచ్చిన ఆ మోషే యున్నాడే, అతనికి ఏమాయెనో మాకు తెలియదు” అనిరి.
2. అహరోను వారితో “మీ భార్యలు, కొడుకులు, కుమార్తెలు ధరించు బంగారు చెవిపోగులను ప్రోగుచేసికొని నా వద్దకు రండు” అనెను.
3. కనుక ప్రజలందరు తమ చెవిపోగులను అహరోను కడకు కొనివచ్చిరి.
4. అతడు ఆ పోగులను కరిగించి మూసలో పోసి దూడను తయారుచేసెను. దానినిచూచి ప్రజలు ఉత్సాహముతో “యిస్రాయేలూ! నిన్ను ఐగుప్తునుండి నడిపించుకొని వచ్చిన దేవర ఇతడే” అని అరచిరి.
5. ప్రజల కోరిక నెరిగి అహరోను ఆ బంగారు దూడ ముందట ఒక బలిపీఠమును నిర్మించెను. అతడు “రేపు ప్రభువు పేరిట పండుగ జరుపుకొందము” అని జనులతో చెప్పెను.
6. ఆ ప్రజలు మరునాడు వేకువనే దహన బలులు, సమాధానబలులు అర్పించిరి. అంతట వారు తినిత్రాగి ఆటపాటలకు పూనుకొనిరి.
7. ప్రభువు మోషేతో “నీవు కొండదిగి క్రిందికి పొమ్ము. నీవు ఐగుప్తునుండి నడిపించుకొని వచ్చిన నీ ప్రజలు భ్రష్టులైరి.
8. వారు కన్నుమూసి తెరచునంతలో నా ఆజ్ఞమీరిరి. పోతదూడను ఒకదానిని తయారుచేసికొని దానిని బలులతో ఆరాధించిరి. యిస్రాయేలూ! ఐగుప్తునుండి మిమ్ము తోడ్కొనివచ్చిన దేవర ఇతడేయని పలికిరి.
9. ఈ ప్రజలతీరు నాకు తెలియును. వీరికి తలబిరుసు ఎక్కువ.
10. నీవు నాకు అడ్డురావలదు. నా కోపము గనగనమండి వారిని బుగ్గిచేయును. కాని నీ నుండి నేనొక మహా జాతిని పుట్టింతును” అనెను.
11. కాని మోషే తన ప్రభువైన దేవునికి మొర పెట్టి “ప్రభూ! నీ కోపాగ్ని ఈ ప్రజలమీద రగుల్కొన నేల? నీవు మహాశక్తివలన, బాహుబలము వలన ఈ ప్రజలను ఐగుప్తునుండి తరలించుకొని రాలేదా?
12. 'యావే యిస్రాయేలీయులను ఐగుప్తునుండి తరలించు కొనివచ్చినది, మోసముతో వారిని కొండలలో మట్టు పెట్టి అడపొడ కానరాకుండ చేయుటకేగదా అని ఐగుప్తీయులు ఆడిపోసికోరా?' కనుక నీ కోపాగ్నిని అరికట్టుము. ఈ ప్రజలను నాశనము చేయవలయునను తలంపు వీడుము.
13. నీ సేవకులు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? 'నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రములవలె లెక్కకందకుండునట్లు చేసెదను. నేను మాటయిచ్చినట్లే ఈ నేలనంతటిని మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వతముగ భుక్తమగును అని నీ పేరు మీదుగనే నీవు వాగ్ధానము చేయలేదా!” ” అని మనవిచేసెను.
14. కనుక ప్రభువు తన తలంపు మార్చుకొనెను. అతడు యిస్రాయేలీయులకు తలపెట్టిన కీడు విరమించుకొనెను.
15. మోషే కొండ దిగివచ్చెను. ఇరువైపుల వ్రాసిన శాసనముల సాక్ష్యపుపలకలు రెండు అతని చేతిలోనుండెను.
16. ఆ పలకలు దేవుడు చేసినవి. వానిమీద చెక్కిన వ్రాత దేవునివ్రాత.
17. యెహోషువ కొండక్రింద ప్రజలు కేకలు వేయుట విని మోషేతో “మన శిబిరమునుండి ఏదో యుద్ధనాదము వినిపించుచున్నది” అనెను.
18. కాని మోషే అతనితో “ఆ నాదము గెలిచినవారి విజయగీతమును కాదు, ఓడిపోయినవారి శోకగీతమును కాదు, అది పాటలుపాడువారి సంగీతనాదము” అని అనెను.
19. మోషే శిబిరమును సమీపించి బంగారు దూడను దానిచుట్టు నాట్యమాడు ప్రజలను చూచి కోపముతో మండిపోయెను. అతడు తన చేతిలోని పలకలను కొండ దిగువున విసరికొట్టి ముక్కముక్కలుగా పగులగొట్టెను.
20. వారు చేసిన బంగారుదూడను అగ్నిలో కాల్చి పిండిచేసెను. ఆ పిండిని నీళ్ళమీద చల్లి యిస్రాయేలీయులచే ఆ నీటిని త్రాగించెను.
21. అతడు అహరోనుతో “ఈ ప్రజలు నీకేమి చేసిరని వీరిచేత ఇంత మహాపాపము చేయించితివి?” అనెను.
22. అహరోను మోషేతో "అయ్యా! నామీద కోపపడ వలదు. ఈ ప్రజలు ఎంతటి దుర్మార్గులో నీకు తెలియును.
23. వీరు నాతో 'మమ్ము నడిపించుటకు మాకొక దేవరను తయారుచేయుము. మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ఆ మోషేయున్నాడే, అతని కేమాయెనో మాకు తెలియదు' అనిరి.
24. నేను వారితో 'బంగారము కలవారు దానిని నాయొద్దకు తీసికొనిరండు' అని అంటిని. వారు తమ బంగారమును తీసికొనివచ్చిరి. నేను ఆ బంగారమును అగ్నిలో పడవేయగా ఈ దూడ బయల్వెడలినది” అని చెప్పెను.
25. మోషే ప్రజలను పరికించి చూడగా వారు కట్టుబాటులో లేరని తెలియవచ్చెను. ఎందుకనగా చుట్టుపట్లనున్న శత్రువుల వలన యిస్రాయేలీయులకు నగుబాట్లు వచ్చునని తెలిసికూడ అహరోను వారిని విగ్రహారాధనకు నడిపెను.
26. కనుక మోషే శిబిర ద్వారమువద్ద నిలుచుండి “ప్రభువు పక్షమును అవలంబించు వారెవరో నాయొద్దకు రండు” అని కేక పెట్టెను. వెంటనే లేవీయులందరు అతనిచుట్టు గుమిగూడిరి.
27. మోషే వారితో “యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఆజ్ఞయిది. మీలో ప్రతివాడు తన కత్తిని నడుమునకు కట్టుకుని శిబిరములో ద్వారము నుండి ద్వారమునకు కదలిపొండు. మీ మీ సోదరులను, చెలికానిని, ఇరుగుపొరుగువారిని చంపివేయుడు” అనెను.
28. లేవీయులు మోషే ఆజ్ఞాపించినట్లే చేసిరి. నాడు యిస్రాయేలులలో మూడువేల మంది చచ్చిరి.
29. మోషే వారితో “మీ కుమారులను సోదరులను చంపి ఈనాడు మిమ్మును మీరే ప్రభువు కైంకర్యమునకై యాజకులనుగా సమర్పించుకొంటిరి. కనుక నేడు మీకు ప్రభువు దీవెన లభించును” అనెను.
30. మరునాడు మోషే ప్రజలతో “మీరు మహా పాతకమునకు ఒడిగట్టితిరి. నేను కొండమీదికెక్కి ప్రభువును కలిసికొందును. ఒకవేళ నేను మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో చూతము” అనెను.
31. అతడు ప్రభువును సమీపించి “ప్రభూ! ఈ ప్రజలు ఘోరపాపము చేసితిరి. వారు బంగారముతో ఒక దేవరను చేసికొనిరి.
32. అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము. అటుల మన్నింపవేని నీవు వ్రాసిన గ్రంథమునుండి నా పేరు కొట్టివేయుము” అని మనవిచేసెను.
33. ప్రభువు అతనితో “పాపము చేసినవాని పేరునే నా గ్రంథమునుండి తొలగింతును.
34. ఇక నీవు వెళ్ళి నేను చెప్పిన తావునకు ఈ ప్రజలను తోడ్కొనిపొమ్ము. నా దూత మిమ్ము నడిపించును. కాని నేను శిక్షవిధించు సమయము వచ్చినపుడు ఆప్రజలను వారి పాపమునకు తగినట్లుగా దండించితీరెదను” అనెను.
35. ప్రజలు అహరోనుచేత దూడను చేయించుకొనిరి. కనుక ప్రభువు వారిని రోగములపాలు చేసెను.