1. మోషే తన మామయు మిద్యాను యాజకుడగు యిత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొనిపోయి, దేవునికొండ హోరేబు కడకువచ్చెను.
2. అక్కడ ఒక పొద మధ్యనుండి వెలువడు నిప్పుమంట రూపమున యావేదూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను. పొదయేమో మండుచుండెను. కాని అది కాలిపోవుటలేదు.
3. అంతట మోషే "నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయును. పొద ఏల కాలిపోవుటలేదో తెలిసికొనవలయును” అని తలంచెను.
4. ఆ విధముగా పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమినుండి “మోషే! మోషే!" అని పిలిచెను. అతడు “చిత్తము ప్రభూ!” అనెను.
5. దేవుడు “దగ్గరకు రాకుము. చెప్పులు విడువుము. నీవు నిలుచున్న ఈ తావు పవిత్రభూమిసుమా!
6. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను” అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను.
7. అంతట దేవుడైన యావే “ఐగుప్తుదేశములో నా ప్రజలు అనుభవించు బాధలు నేను కన్నులార చూచితిని. దాసాధ్యక్షుల బారినుండి విడిపింపుమని వారుచేసిన మనవి నా చెవినబడినది. వారు పడుపాట్లు గుర్తించితిని.
8. ఐగుప్తుదేశీయుల ఇనుప పిడికిళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగివచ్చితిని. వారిని ఆ దేశమునుండి భాగ్యవంతమైన, సువిశాలమైన, పాలుతేనెలు జాలువారునదైన కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులకు నిలయమైయున్న దేశమునకు చేర్చుదును.
9. యిస్రాయేలీయుల ఆక్రందన నా చెవినిబడెను. ఐగుప్తుదేశీయులు వారినెట్లు పీడించు చున్నారో కన్నులార చూచితిని.
10. కావున రమ్ము. ఐగుప్తుదేశమునుండి నా ప్రజలయిన యిస్రాయేలీయులను వెలుపలికి తీసికొనివచ్చుటకై నిన్ను ఫరో రాజు వద్దకు పంపెదను” అని మోషేతో అనెను.
11. అంతట మోషే దేవునితో “ఫరోరాజు కడకు వెళ్ళుటకుగాని, యిస్రాయేలీయులను ఐగుప్తుదేశము నుండి తీసికొని వచ్చుటకుగాని నేనెవ్వడను?” అనెను.
12. దేవుడు “నేను నీకు తోడైయుందును. నిన్ను పంపినది నేనేయని నీవు తెలిసికొనుటకు గుర్తు ఇదియే! ఐగుప్తుదేశమునుండి ఈ ప్రజలను తోడ్కొని వచ్చిన తరువాత మీరు ఈ కొండమీద నన్ను ఆరాధింపవలెను” అనెను.
13. అపుడు మోషే దేవునితో “అయినచో నేను యిస్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి మీ పితరులదేవుడు నన్ను మీకడకు పంపెనని చెప్పవలయునుగదా! అపుడు వారు ఆ దేవుని పేరేమి? అని నన్నడిగినచో నేనేమి చెప్పవలయును?” అనెను.
14. దేవుడు మోషేతో “నేను ఉన్నవాడను” అనెను. మరియు “ఉన్నవాడు నన్ను మీకడకు పంపెనని యిస్రాయేలీయులతో చెప్పుము” అనెను.
15. ఇంకను దేవుడు మోషేతో “యిస్రాయేలీయులతో నీవు ఇట్లు చెప్పవలెను. మీ పితరులదేవుడు, అబ్రహాముదేవుడు, ఈసాకుదేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వ కాలములందును ఇదియే నా నామము. ఇకముందు తరములవారు అందరును నన్ను ఈ నామమునే పిలుతురు.
16. నీవు వెళ్ళి యిస్రాయేలీయుల పెద్దలను ఒకచోట చేర్చి వారితో “మీ పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఈసాకుదేవుడు, యాకోబుదేవుడైన యావే నాకు ప్రత్యక్షమయ్యెననియు ఆయన మీతో 'నేను మిమ్ము చూడవచ్చితిని. ఐగుప్తుదేశీయులు మీకు పెట్టిన యాతనలన్నిటిని గమనించితిని.
17. మీరు పీడింప బడుచున్న ఐగుప్తుదేశమునుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించుచున్న దేశమునకు, పాలు తేనెలుజాలువారు దేశమునకు మిమ్ము చేర్చనిశ్చ యించితిని' అని వారితో చెప్పుము.
18. వారు నీ మాటలు విందురు. అప్పుడు నీవు యిస్రాయేలీయుల పెద్దలతో ఐగుప్తుదేశ ప్రభువు సమ్ముఖమునకు వెళ్ళవలయును. వెళ్ళి 'హెబ్రీయుల దేవుడైన యావే మాకు ప్రత్యక్షమయ్యెను. కావున మూడురోజులపాటు అడవిలో ప్రయాణముచేసి మా దేవుడైన యావేకు బలిసమర్పించుకొనుటకు మాకు సెలవిమ్ము' అని అతనితో చెప్పవలయును.
19. తనకంటె పైచేయి వాడు వచ్చి గొంతుమీద కూర్చున్నగాని ఐగుప్తుదేశ ప్రభువు మిమ్ము పోనీయడని నాకు తెలియును. కావున నేను నా బలమును చూపుదును.
20. ఐగుప్తుదేశములో నేను అద్భుతకార్యములుచేసి దానిని దెబ్బకొట్టుదును. ఇక ఆ తరువాత అతడు మిమ్ము పోనిచ్చును.
21. నేను యిస్రాయేలీయులను ఐగుప్తుదేశీయుల కంటికి గౌరవింపదగినవారినిగా చేయుదును. కావున మీరు ఆదేశమును వీడునపుడు వట్టి చేతులతో వెళ్ళరు.
22. మీలో ప్రతి స్త్రీయు తన పొరుగున ఉన్న స్త్రీని, తన ఇంటనున్న ప్రతి స్త్రీని వెండినగలు, బంగారునగలు, వస్త్రములడిగి పుచ్చుకొనును. దానితో మీరు మీ కుమారులను, కుమార్తెలను అలంకరింతురు. ఈ విధముగా మీరు ఐగుప్తుదేశీయులను దోచు కొందురు” అనెను.