1. మీరు కల్లమాటలు పుట్టింపరాదు. అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో చేయి కలుపరాదు.
2. న్యాయవిరుద్ధముగా తప్పుడు పనులు చేయుటకు మందితో చేరరాదు. వ్యాజ్యములో మంది పక్షమునచేరి సాక్ష్యము పలికి అధర్మమును నెగ్గింప రాదు.
3. పేదవాడను తలంపుతో వ్యాజ్యమున వాని పట్ల పక్షపాతము చూపరాదు.
4. తప్పిపోయిన ఎద్దుగాని, గాడిదగాని నీకు కనబడినచో, అది నీ పగవానిదయినను, నిశ్చయముగా నీవు దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగింప వలయును.
5. నీ పగవాని గాడిద బరువు మోయలేక పడిపోయినపుడు, సాయము చేయుట నీకు ఇష్టము లేకపోయినను, నీవు వానితో కలిసి దానిని రక్షింప వలయును.
6. పేదవాని వ్యాజ్యములో అతనిని మోసగించి తీర్పుచెప్పరాదు.
7. అబద్దమునకు దూరముగా ఉండుము. నిరపరాధినైనను, నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను.
8. లంచములు తీసికొనకుము. లంచము మంచిచూపు గల మనుజులను సైతము గ్రుడ్డివారినిగా చేయును. నిర్దోషియగువాని కార్యమును చెరచును.
9. నీవు పరదేశిని అణగదొక్కరాదు, ఐగుప్తు దేశములో మీరును పరదేశులుగా బ్రతికితిరి కావున పరదేశి మనస్సు ఎట్లు బాధపడునో మీకు తెలియును.
10. ఆరేండ్లపాటు భూమిని సాగుచేసి పంటలు పండింపుడు.
11. కాని ఏడవయేట దానిని సాగు చేయవలదు. బలముకొరకు వదలివేయుడు. ఆ యేడు మీలో పేదలయిన వారు ఆ భూమినుండి ఆహారము సంపాదించుకొందురు. వారు తినివదలిన దానిని మృగములు వచ్చి తినును. మీ ద్రాక్షతోటలను, ఓలివు తోటలను ఇట్లే వదలివేయుడు.
12. ఆరు రోజులపాటు మీరు మీపనులు చేసికొనుడు. ఏడవ రోజు పనిచేయుట మానుడు. ఇట్లయిన మీ ఎద్దులకు, గాడిదలకు తెరపి కలుగును. మీ దాసీపుత్రుడును, పరదేశియును ఊపిరిపోసికొందురు.
13. నేను చెప్పినమాటలనన్నిటిని శ్రద్ధగా పాటింపుడు. మీరు ఇతర దైవములను ఆశ్రయింప గూడదు. వారి పేరైనను మీరెత్తగూడదు.
14. ఏడాదికి మూడుసార్లు మీరు నా పేర పండుగ చేయవలయును.
15. మీరు పొంగని రొట్టెలతో పండుగ చేయవలయును. నేను ఆజ్ఞాపించినట్లే అబీబునెలలో నియమితకాలమున ఏడురోజుల పాటు పొంగనిరొట్టెలను తినుడు. ఆ నెలలో మీరు ఐగుప్తును వీడి వచ్చితిరి. ఎవ్వడును వట్టిచేతులతో నాసన్నిధికి రాకూడదు.
16. మీరు విత్తిన పొలములోని తొలిపంట కోతకు వచ్చినపుడు కోతపండుగ చేసికొన వలయును. సంవత్సరాంతమున మీ కష్టముఫలించి పొలములోనుండి వ్యవసాయఫలములను నీవు ఇంట చేర్చుకొనిన పిదప పంటరాకడ పండుగను చేసికొన వలయును.
17. ఏడాదికి మూడుసార్లు మీ మగవారెల్లరు ప్రభుసన్నిధికి రావలయును.
18. మీరు నాకు జంతుబలులు అర్పించునపుడు పొంగినరొట్టెలను సమర్పింపరాదు. నాకు బలిగా చేసినదాని క్రొవ్వును మరునాటి ప్రొద్దుటివరకు అట్టి పెట్టరాదు.
19. మీరు భూమినుండి పండించిన తొలి పంటలో అతిశ్రేష్ఠమయిన దానిని మీ దేవుడయిన యావే మందిరమునకు తీసికొనిరావలయును. మేక పిల్లను దాని తల్లిపాలలో ఉడుకబెట్టరాదు.
20. మీ ముందు పయనించు నిమిత్తము నేనొక దూతను పంపెదను. ఆయన మార్గమున మిమ్ము కాపాడుచు, నేను సిద్ధపరచిన చోటికి మిమ్ముచేర్చును.
21. అతనిపట్ల భయభక్తులు కలిగి, అతడు చెప్పిన మాటలెల్ల శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరుగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు గావున మీ తప్పును మన్నింపడు.
22. కాని మీరు అతని మాటవిని నేను చెప్పినదెల్ల చేసినచో, మీ శత్రువులకు నేను శత్రువునయ్యెదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును.
23. నాదూత మీకంటె ముందుగా వెళ్ళి అమోరీయులు, హిత్తీయులు, పెరిస్సీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వసించుచోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపుదును.
24. మీరు వారి దైవములకు నమస్కరింపరాదు. సేవింపరాదు. ఆరాధింపరాదు. వారు చేయునది మీరు చేయరాదు. మీరు వారి విగ్రహములను ధ్వంసము చేయుడు.
25. మీరు మీ దేవుడయిన యావేను మాత్రమే పూజింపవలయును. నేను మీ ఆహారమును, పానీయమును దీవింతును. మీకు రోగము అంటకుండ చేయుదును.
26. మీ నేలలో గర్భము పోగొట్టుకొనిన స్త్రీగాని, గొడ్రాలయిన స్త్రీగాని ఉండదు. మిమ్ము పూర్ణాయుషు కలవారినిగా చేయుదును.
27. మిమ్మెదిరించువారికి భయము గొల్పెదను. మిమ్ము ఎదుర్కొనిన వారిని కల్లోలపరతును. మీ శత్రువులు మిమ్మువీడి పారిపోవునట్లు చేయుదును.
28. మీ ఎదుటినుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను పారద్రోలుటకు మీ కంటే ముందుగా పెద్దకందిరీగలను పంపుదును.
29. ఒక యేడాది కాలముననే మీయొద్దనుండి వారిని పారద్రోలను. అట్లయినచో దేశమంతా బీడయిపోవును. క్రూర మృగములు విస్తరిల్లి మిమ్ము బాధించును.
30. మీ జనసంఖ్య పెరిగి ఆ దేశమును మీరు వశము చేసి కొనువరకు, వారిని క్రమక్రమముగా మీ కంటి ఎదుటినుండి పారద్రోలుచుందును.
31. మీ దేశమునకు రెల్లు సముద్రము, మధ్యధరా సముద్రము, అరేబియా ఎడారి, యూఫ్రటీసునది పొలిమేరలుగా ఏర్పరుతును. ఆ దేశీయులను మీ చేతులకు అప్పగింతును. మీరు వారిని మీ ఎదుటినుండి వెళ్ళగొట్టెదరు.
32. మీరు వారితోను, వారి దైవములతోను ఎట్టి నిబంధనము చేసికొనరాదు.
33. వారు మీ దేశములో నివసింపరాదు. నివసించినచో మిమ్ము రెచ్చగొట్టి నాకు వ్యతిరేకముగా మీచేత పాపములు చేయింతురు. మీరు వారి దైవములను సేవించినచో మీ పాలిటికి ఉరి తెచ్చి పెట్టుకొన్నట్లే.”