ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 22

1. ఎవడయిన ఎద్దునో, గొఱ్ఱెనో దొంగిలించి చంపినను, అమ్మినను అతడు ఆ ఎద్దునకు బదులుగా ఐదు ఎద్దులను, ఆ గొఱ్ఱెకు మారుగా నాలుగు గొఱ్ఱెలను ఈయవలయును.

2-4. దొంగ దొంగిలించిన సొమ్ము తిరిగి చెల్లింపవలయును. వాడు త్రాడు బొంగరము లేనివాడయినచో దొంగిలించిన సొమ్ము చెల్లించుటకు వానిని అమ్మదగును. దొంగిలించినది ఎద్దుగాని, గాడిదగాని ప్రాణముతో దొంగ దగ్గర ఉన్నచో వాడు వానికి రెట్టింపు సొమ్ము చెల్లింప వలయును. కన్నము వేయుచున్నపుడు దొంగను పట్టుకుని చావగొట్టినయెడల, అది హత్య క్రిందికి రాదు. కాని ప్రొద్దుపొడిచిన తరువాత దొంగను చావగొట్టినచో అది హత్యయేయగును.

5. ఒకడు చేనునందునో, ద్రాక్షతోటనందునో మేయుటకు గొడ్లను వదలినపుడు అవి వేరొకరి చేను మేసినచో, వాని యజమానుడు తన చేనునుండి, తన తోటనుండి సమానమైన పంటను పరిహారముగా చెల్లింపవలయును. ఆ పశువులు చేను మొత్తము మేసినయెడల వాని యజమానుడు నష్టపడిన వాని పొలములో పండిన మంచిపంటతో, ద్రాక్షతోటలో విరుగగాచిన మంచిద్రాక్షకాపుతో సమమైన సొమ్మును నష్టపరిహారముగా చెల్లింపవలయును.

6. నిప్పురగుల్కొని గట్టిగాదము అంటుకొనుట వలన పంటకుప్పగాని, చేనుమీది నిలువు పైరుగాని, చేను మొత్తముగాని కాలిపోయినచో, నిప్పు పెట్టినవాడు పూర్తిగా నష్టమును చెల్లింపవలయును.

7. ఒకడు మరియొకని వద్ద కుదువ పెట్టిన సొమ్మును గాని, వస్తువును గాని దొంగిలించినచో దొంగ పట్టుబడినపుడు వాడు రెట్టింపు సొమ్ము ఇచ్చు కొనవలయును.

8. దొంగ దొరకనిచో సొమ్ము దాచిన ఇంటివాడు దేవునియెదుట తాను పొరుగువాని సొమ్ము ముట్టుకోలేదని ప్రమాణము చేయవలయును.

9. గాడిద, ఎద్దు, గొఱ్ఱె, వస్త్రములు మొదలగు వాని విషయమునగాని, ఒక వస్తువు పోయినపుడు ఎవడైన అది నాదని చెప్పినపుడుగాని వివాదము సంభవించినచో ఆ వివాదమును దేవుని సన్నిధికి కొనిపోవలయును. దోషియని దేవుడు చాటినవాడు రెండవవానికి రెట్టింపు సొమ్మును ముట్టజెప్పవలయును.

10. ఒకానొకడు గాడిదనుగాని, ఎద్దునుగాని, గొఱ్ఱెనుగాని, మరి ఏ పశువునైనాగాని కాపాడుటకు రెండవవానికి అప్పగించినచో అది చనిపోయినను, గాయపడినను, ఎవడును చూడకుండ తోలుకొని పోబడినను తగినసాక్ష్యము లభించనంతవరకు రెండవ వాడు మొదటివాని సొమ్మును అపహరించెనో లేదో తెలిసికొనుటకు ఆ రెండవవాడు దేవుని ముందు చేయు ప్రమాణమే ఆధారము.

11. సొమ్ము స్వంతదారుడు ఆ ప్రమాణమును ఒప్పుకొనవలయును. రెండవవాడు నష్టపరిహారము చెల్లింపనక్కరలేదు.

12. కాని జంతువు రెండవవాని యొద్దనుండి దొంగిలింపబడినచో అతడు దాని యజమానునకు నష్టపరిహారమును చెల్లింపవలెను.

13. క్రూరమృగములు పశువులను చంపినచో రెండవవాడు దాని అవశేషములను సాక్ష్యముగా కొనిరావలయును. అప్పుడు అతడు నష్టపరిహారము చెల్లింపనక్కరలేదు.

14. ఒకడు మరియొకనినుండి పశువును బదులు తీసికొన్నప్పుడు, అది యజమానుని పరోక్షమున గాయపడినను, చనిపోయినను, తీసికొన్నవాడు పూర్తిగా పరిహారము చెల్లింపవలయును.

15. కాని అది యజమానుని సమక్షముననే గాయపడినను లేదా చనిపోయినను తీసికొన్నవాడు నష్టమును భరింపనక్కరలేదు. ఆ జంతువు అద్దెయినచో, అద్దెసొమ్మునే చెల్లింపవలయును.

16. ఒకడు వివాహము నిశ్చయింపబడని కన్యకు మరులుగొల్పి ఆమెతో శయనించినచో, అతడు కన్యా దానమిచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలయును,

17. కాని కన్యతండ్రి అతనికి ఆమెనిచ్చి పెండ్లి చేయ ఇష్టపడనిచో అతడు కన్యతండ్రికి కన్యాశుల్కము చెల్లింపవలయును.

18. మంత్రగత్తెను బ్రతుకనీయరాదు.

19. జంతువును కూడినవానికి మరణదండనమే శిక్ష.

20. యావేకుగాక అన్యదైవములకు బలులు సమర్పించువానిని వెలివేసి కఠినముగా చంపవలయును.

21. మీరు పరదేశికి చెడుచేయరాదు. బాధింప రాదు. ఐగుప్తుదేశములో మీరును పరదేశులుగా ఉంటిరిగదా!

22. మీరు వితంతువులనుగాని, అనాథలనుగాని బాధింపరాదు.

23. నీవు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకొనినపుడు, నేను నిశ్చయముగా వారిమొర ఆలింతును.

24. నా క్రోధాగ్ని రగుల్కొనును. మిమ్ము నా కత్తికి బలిచేయుదును. మీ భార్యలు వితంతువులు అగుదురు. మీ బిడ్డలు అనాథలగుదురు.

25. మీలో ఎవ్వడైనను నాప్రజలలోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో, మీరు వారితో వడ్డీ వ్యాపారివలె వ్యవహరింపరాదు. వానినుండి వడ్డి పుచ్చుకొనరాదు.

26. మీరు మరియొకని నిలువుటంగీని కుదువ సొమ్ముగా తీసికొనినచో దానిని ప్రొద్దుగూకుటకు ముందే అతనికి తిరిగి ఇచ్చివేయవలయును.

27. కప్పుకొనుటకు అతనికడ ఉన్నదదే. అతడు ఒంటిమీద కప్పుకొను నిలువుటంగీ అదే. అతడు ఏమి కప్పుకొని పండుకొనును? అతడు నాకు మొరపెట్టుకొన్నచో నేను అతని మొర ఆలకింతును. నేను దయామయుడను.

28. మీరు దేవుని నిందింపరాదు. మీ ప్రజలలోని అధికారులను శపింపరాదు.

29. మీ పొలము పైరులో తొలివెన్నులను, మీ ద్రాక్ష తోటలో తొలి పండ్లను జాగుచేయక నాకు సమర్పింపవలయును. మీ తొలిచూలు మగబిడ్డలను నాకు అర్పింపవలెను.

30. అట్లే మీ పశువులలో, గొఱ్ఱెలలో తొలిచూలు పిల్లలను నాకు సమర్పింపవలయును. అది ఏడు రోజులపాటు తల్లిదగ్గర ఉండును. ఎనిమిదవనాడు మీరు నాకు దానిని సమర్పింప వలయును.

31. మీరు నాకు అంకితమైన ప్రజలు, కావున క్రూరమృగములు పొలములో చీల్చిచంపిన జంతువు మాంసమును మీరు తినరాదు. దానిని కుక్కలకు పారవేయవలయును.