1. అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను.
2. “మిమ్ము దాస్యనిలయమైన ఐగుప్తుదేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే. నేనే మీ దేవుడను.
3. మీకు నేనుతప్ప మరొక దేవుడు లేడు.
4. పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమి యందు, భూమి అడుగుననున్న నీళ్ళయందును ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు.
5. మీరు వానికి మ్రొక్కరాదు. వానిని పూజింపగూడదు. మీ దేవుడను యావేను అయిన నేను రోషముగలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు మూడు, నాలుగు తరములవరకు దండింతును.
6. కాని నన్ను ప్రేమించి, నా నియమములను పాటించువారిని వేయితరముల వరకు కరుణింతును.
7. మీరు మీ దేవుడయిన యావే నామమును దుర్వినియోగపరుపరాదు. తన నామమును దుర్వినియోగ పరుచువానిని యావే దండింపక మానడు.
8. విశ్రాంతిదినమును గుర్తుంచుకొనుడు. దానిని పవిత్రము చేయుడు.
9. ఆరురోజులపాటు మీ పనులెల్ల చేసికొనవలయును.
10. ఏడవరోజు మాత్రము మీ దేవుడు అయిన యావేకు పవిత్రమయిన విశ్రాంతిదినము. ఆ రోజు మీరుగాని, మీ కుమారులుగాని, కుమార్తెలు గాని, పనివారుగాని, పశువులుగాని, మీ ఇంటనున్న పరదేశీయులుగాని ఏ పనియు చేయకూడదు.
11. యావే ఆరురోజులలో ఆకాశమును, భూమిని, సముద్రమును వానియందుండువానిని సృష్టించెను. ఆయన ఏడవరోజు విశ్రమించెను. కావున యావే ఆ రోజును దీవించి పవిత్రమయిన దానినిగా చేసెను.
12. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లయిన మీ దేవుడయిన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు.
13. హత్య చేయరాదు.
14. వ్యభిచరింపరాదు.
15. దొంగతనము చేయరాదు.
16. పొరుగువానికి వ్యతిరేకముగా అబద్దపుసాక్ష్యము చెప్పరాదు.
17. మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు. పొరుగువాని భార్యనుగాని, దాసునిగాని, దాసినిగాని, ఎద్దునుగాని, గాడిదనుగాని, మరి అతనిది ఏదైనను గాని ఆశింపరాదు.
18. యిస్రాయేలీయులందరు పొగలుచిమ్ము ఆ కొండను, ఆ ఉరుములను, ఆ మెరుపులనుకని, ఆ కొమ్ముబూర మ్రోతను విని గజగజలాడిరి. వారు దూరముగా నిలబడిరి.
19. వారు మోషేతో “నీవే మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడెనా మేము చచ్చుట తథ్యము” అనిరి.
20. అంతట మోషే వారితో “భయపడకుడు. దేవుడు మిమ్ము పరీక్షింపవచ్చెను. ఇట్లయినగాని దైవభీతి మీ మనస్సులలో శాశ్వతముగా నిలువదు. మీరు పాపము చేయకుండ ఉందురు” అనెను.
21. అప్పుడు మోషే దేవుడున్న కారుమబ్బును సమీపించెను. ప్రజలు మాత్రము దూరముగనే నిలబడిరి.
22. యావే మోషేతో నీవు యిస్రాయేలీయు లతో ఈ మాట చెప్పుము: “నేను ఆకాశమునుండి మీతో మాట్లాడుట మీ కనులార చూచితిరికదా!
23. నన్ను కొలుచుచూ మీరు వెండితోగాని, బంగారము తో గాని, విగ్రహములనుచేసి వానిని పూజింపరాదు”.
24. “మీరు నా కొరకు మట్టితో బలిపీఠము నిర్మింపవలయును. దానిమీద మీ గొఱ్ఱెలనుగాని, ఎద్దులనుగాని దహనబలులుగా, సమాధానబలులుగా సమర్పింపవలెను. నేను ఆరాధనస్థలము నిర్ణయించిన తావులన్నిట నేను మీకడకు వచ్చి మిమ్ము దీవింతును.
25. మీరు నా కొరకు రాయితో బలిపీఠమును నిర్మించి నచో చెక్కడపురాతిని వాడకుము. మీ పనిముట్లు రాళ్ళకు తగిలిన అవి మైలపడును.
26. మీరు మెట్ల మీదుగా నా బలిపీఠము మీదికి ఎక్కగూడదు. ఆ విధముగా ఎక్కినచో మీ దిగంబరత్వమును చూపిన వారగుదురు.”