ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 2

1. లేవి తెగవాడు ఒకడు ఆ తెగలోని స్త్రీనే భార్యగా స్వీకరించెను.

2. ఆమె గర్భవతియై ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారమువంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వానిని మూడునెలలపాటు ఎవరికంట పడకుండా దాచెను.

3. ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరుపలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగటమన్నుపూసి తారుపూసెను. ఆ పెట్టెలో బిడ్డనుంచి, దానిని నైలునది నీటిఅంచున జమ్ముదుబ్బుల నడుమ ఉంచెను.

4. ఆ శిశువునకు ఏమిజరుగునో చూడదలచి వాని సోదరి పెట్టెకు కొంచెము దూరముగా నిలుచుండెను.

5. ఫరోరాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున తిరుగాడు చుండిరి. అప్పుడు ఆమె దుబ్బుల నడుమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు తన బానిస పిల్లను పంపెను.

6. రాజపుత్రి ఆ పెట్టెను తెరచిచూడగా ఏడ్చుచున్న మగకందు కనిపించెను. ఆమెకు అతని మీద జాలిపుట్టినది. ఆమె “వీడు హెబ్రీయుల బిడ్డడై యుండును” అనెను.

7. శిశువు సోదరి “రాజకుమారీ! వెళ్ళి ఒక హెబ్రీయదాదిని తీసికొని వత్తునా? ఆ దాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచునుగదా!” అనెను.

8. ఫరో కుమార్తె “వెళ్ళుము” అని శిశువు సోదరితో చెప్పగా, ఆ బాలిక వెళ్ళి ఆ బిడ్డతల్లినే కొనివచ్చెను.

9. అంతట ఫరోకూతురు ఆ తల్లితో “ఈ బిడ్డను తీసికొని వెళ్ళుము. నాకొరకు వీనికి పాలుగుడుపుము. నీకు జీతముముట్టునట్లు చూతును" అని చెప్పెను. ఆ హెబ్రీయ స్త్రీ శిశువును కొనిపోయి పాలిచ్చి పెంచెను.

10. శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత ఆమె అతనిని రాజకుమారి కడకు తీసికొని వచ్చెను. రాజపుత్రి అతనిని కన్నకొడుకు మాదిరిగా చూచుకొనెను. “ఇతనిని నీటినుండి బయటికి తీసితిని" అనుకొని ఆమె అతనికి 'మోషే'' అను పేరు పెట్టెను.

11. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కన్నులారచూచెను. అపుడు ఐగుప్తుదేశీయుడు ఒకడు తన దేశీయుడైన హెబ్రీయుని కొట్టుటను మోషే చూచెను.

12. అతడు చుట్టును పరికించెను. కనుచూపుమేర లోపల ఎవ్వరును లేరు. వెంటనే మోషే ఆ ఐగుప్తు దేశీయుని మీదపడి వానిని చంపి ఇసుకలో పాతిపెట్టెను.

13. మరునాడు కూడ మోషే అచ్చటికి వచ్చి ఇద్దరు హెబ్రీయులు తన్నుకొనుట చూచెను. మోషే తప్పుచేసిన వానితో “నీవు తోడి హెబ్రీయుని కొట్టనేల?” అనెను.

14. ఆ దోషి “మాకు అధికారిగా, ధర్మమూర్తిగా నిన్ను నిలిపినవారు ఎవరయ్యా! ఐగుప్తుదేశీయుని చంపి నట్లు నన్నుకూడ చంపవలెనని అనుకొనుచున్నావా?” అనెను. తాను చేసినపని అపుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను.

15. ఫరోరాజు ఈ విషయము వినెను. అతడు మోషేకు మరణశిక్ష విధించెడివాడే, కాని మోషే మిద్యాను దేశమునకు పారిపోయెను. ఆ దేశమున అతడొక బావివద్ద కూర్చుండెను.

16. మిద్యానుదేశపు యాజకునకు ఏడుగురు కుమార్తెలు కలరు. వారు అదే సమయమున నీళ్ళు తోడుకొనుటకు వచ్చిరి. తమ తండ్రి మందలకు నీళ్ళు పెట్టుటకై తొట్లు నింపిరి.

17. కాని కొందరు గొఱ్ఱెల కాపరులు వచ్చి ఆ యువతులను తరిమివేసిరి. మోషే వారితరపున నిలిచి వారికి బదులుగా తానే వారి మందలకు నీళ్ళు పెట్టెను.

18. అంతట ఆ ఏడుగురు పడుచులు తమ తండ్రి రవూవేలు కడకు తిరిగి వెళ్ళిరి. అతడు “నేడు ఇంత పెందలకడనే ఎట్లు తిరిగివచ్చితిరి?” అని కుమార్తెలను అడిగెను.

19. వారు “ఐగుప్తుదేశీయుడొకడు గొఱ్ఱెలకాపరుల బారినుండి మమ్ము కాపాడెను. అతడే మాకు బదులుగా నీళ్ళుతోడి మందలకు పోసెను” అనిరి.

20. రవూవేలు “అతడు ఎక్కడ ఉన్నాడు? అతనిని అక్కడనే ఏల విడిచి వచ్చితిరి? మనతోపాటు భుజించుటకు రమ్మనుడు” అని కుమార్తెలకు చెప్పెను.

21. ఈ విధముగా మోషే రవూవేలు వద్ద కుదురుకొనెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషేకిచ్చి పెండ్లి చేసెను.

22. ఆమె ఒక కొడుకును కనెను. మోషే "నేను ఈ పరదేశమున అపరిచితుడుగా ఉన్నాను” అని అనుకొని ఆ బిడ్డకు 'గెర్షోము” అని పేరు పెట్టెను.

23. ఏండ్లు దొరలిపోయినవి. ఐగుప్తుదేశ ప్రభువు చనిపోయెను. యిస్రాయేలీయులు బానిసతనమున మునిగి మూలుగుచు సహాయము కొరకు ఆక్రందించిరి. వారి ఆక్రందనము దేవుని చెవినబడెను.

24. దేవుడు వారి మూలుగు వినెను. తాను అబ్రహాముతోను, ఈసాకుతోను, యాకోబుతోను చేసికొనిన ఒడంబడికను గుర్తు తెచ్చుకొనెను.

25. దేవుడు యిస్రాయేలీ యుల దుస్థితినిగాంచి వారిని కరుణించెను.