1. దేవుడు మోషేకును, యిస్రాయేలీయులకును మేలు చేసెననియు, వారిని ఐగుప్తుదేశమునుండి కొనివచ్చెననియు మిద్యాను యాజకుడును మోషే మామయునగు యిత్రోకు తెలిసెను.
2. కనుక అతడు మోషే భార్య సిప్పోరాను ఆమె కుమారులిద్దరిని అతని కడకు తోడ్కొని వచ్చెను. అంతకు ముందు మోషే సిప్పోరాను పంపివేసియుండెను.
3. మోషే ఆ కుమారులలో ఒకనికి “నేను పరదేశములో అపరిచితునివలె యుంటిని” అనుకొని గెర్షోము' అను పేరు పెట్టెను.
4. రెండవ వానికి “నా తండ్రి దేవుడే నాకు ఆదరువు. ఆయనయే ఫరోరాజు కత్తికి ఎరకాకుండ నన్ను కాపాడెను” అనుకొని ఎలియెజెరు' అని పేరు పెట్టెను.
5. మోషే మామ యిత్రో అతని భార్యను బిడ్డలను వెంటబెట్టుకొని ఎడారిలో దేవునికొండ దగ్గర దిగిన మోషే కడకు వచ్చెను.
6. “నీ భార్యతో ఇద్దరు బిడ్డలతో మీ మామ యిత్రో నిన్ను చూడవచ్చెను” అన్నమాట మోషే చెవిని పడెను.
7. మోషే తన మామను కలిసికొనుటకు ఎదురువెళ్ళెను. మామ ఎదుట వంగి దండము పెట్టి అతనిని ముద్దాడెను. ఒకరి యోగక్షేమమును ఒకరు తెలిసికొనిన తరువాత వారు గుడారమునకు వచ్చిరి.
8. అప్పుడు మోషే తన మామతో యిస్రాయేలీయులను రక్షించుటకై యావే ఫరోను ఐగుప్తు దేశీయులను ఎట్లు కష్టములపాలు చేసెనో, త్రోవలో వారెట్లు కడగండ్లుపడిరో, యావే వారినెట్లు రక్షించెనో పూసగ్రుచ్చినట్లు చెప్పెను.
9. యిస్రాయేలీయులను ఐగుప్తీయుల నుండి విడిపించి, వారికి యావే చేసిన మేలంతయు విని యిత్రో హర్షించెను.
10. “ఐగుప్తు దేశీయులనుండి ఫరోరాజు నుండి నిన్ను రక్షించిన దేవుడు, ఐగుప్తు దేశీయులనుండి యిస్రాయేలీయులను రక్షించిన దేవుడు స్తుతింపబడునుగాక!
11. యిస్రాయేలీయులను అహంకారముతో హింసించియున్న ఐగుప్తుదేశీయులను అణచివేసిన యావే దేవాదిదేవుడని నేడు తెలిసికొంటిని” అని అతడనెను.
12. మోషే మామ యిత్రో దేవునికి దహనబలిని, బలులను సమర్పించెను. దేవుని సమ్ముఖమున మోషే మామతోపాటు విందులో పాల్గొనుటకై అహరోను యిస్రాయేలు పెద్దలందరితో వచ్చెను.
13. మరునాడు మోషే యిస్రాయేలీయులకు తీర్పులు తీర్చుటకు కొలువుతీరెను. ఉదయమునుండి సాయంకాలమువరకు వారు అతని చుట్టు నిలబడిరి.
14. మోషే యిస్రాయేలీయులకొరకు పడిన పాటులెల్ల చూచి అతని మామ యిత్రో “ఈ ప్రజల కొరకు నీవు ఈ బరువెల్ల నెత్తికెత్తుకొననేల? ఉదయమునుండి సాయంకాలమువరకు వీరందరు చుట్టు నిలిచియుండ నీవొక్కడవే ఇక్కడ కూర్చుండనేల?” అనెను.
15. దానికి మోషే మామతో “ఏల అందువా? దేవునిచిత్తము తెలిసికొనుటకై ఈ జనులు నా వద్దకు వత్తురు.
16. వారి నడుమ తగవులు వచ్చినపుడు వారు నా కడకు వత్తురు. నేనేమో ఇద్దరినడుమ పుట్టిన తగవులు తీర్తును. దేవుడు నిర్ణయించిన విధులను ఆజ్ఞలను వారికి తెలియజేయుదును” అని చెప్పెను.
17. మోషే మామ అతనితో “నాయనా! ఈ పని అంతయు నీమీద వేసికొనుట మంచిదికాదు.
18. ఇట్లయినచో నీవు తట్టుకొనలేక నలిగిపోదువు. నీతోపాటు ఈ ప్రజలును నలిగిపోదురు. ఈ పని నీ తలకు మించినట్టిది. దీనిని నీవొక్కడవే చేయజాలవు.
19. నా ఉపదేశమును పాటింపుము. దేవుడు నీకు తోడుగా ఉండును. నీవు దేవునియెదుట ఈ ప్రజలకు ప్రతినిధిగా ఉండుము. వారి తగవులను గూర్చి ఆయనతో చెప్పుము.
20. దేవుడు నిర్ణయించిన విధులను, ఆజలను వారికి బోధింపుము. వారు నడువదగిన త్రోవను వారికి చూపుము. చేయదగిన పనులను వారికి తెలుపుము.
21. ఈ ప్రజలందరలో సమర్థులను, దైవభీతిగల వారిని, విశ్వాసపాత్రులను, లంచగొండులు కానివారిని ఏరి వారికి నాయకులనుగా చేయుము. వేయిమందికి, వందమందికి, ఏబదిమందికి, పదిమందికి ఒక్కొక్కని చొప్పున నాయకులను నిర్ణయింపుము.
22. ఎల్లవేళల ఆ నాయకులే తీర్పులు చేయుచు ఈ ప్రజలకు తోడ్పడు దురు. వారు పెద్ద పెద్ద తగవులను నీకడకు కొనివత్తురు. చిన్నచిన్న తగవులకు వారియంతటవారే తీర్పులు చెప్పుదురు. దీనివలన నీ పని తేలిక అగును. నీ బరువును వారుకూడ మోసినవారగుదురు.
23. ఇట్లు చేసిన నీవును శ్రమకు తట్టుకొందువు. ప్రజలును తృప్తి పడుచు ఇండ్లకు వెళ్ళుదురు. దేవుడును ఈ పద్ధతినే నిర్ణయించునుగాక!” అనెను.
24. మోషే మామ మాటలువిని అతడు చెప్పినట్లే చేసెను.
25. యిస్రాయేలీయులనుండి సమర్థులను ఏరి వారికి నాయకులునుగా చేసెను. వేయిమందికి, వందమందికి, ఏబదిమందికి, పదిమందికి ఒక్కొక్కని చొప్పున న్యాయాధిపతులను ఏర్పరచి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నిర్ణయించెను.
26. ఎల్లవేళల ఆ నాయకులు తీర్పులుచెప్పుచు ప్రజలకు సాయపడుచుండిరి. వారు పెద్ద పెద్ద తగవులను మోషే కడకు కొనితెచ్చుచుండిరి. చిన్నచిన్నతగవులను వారియంతట వారే తీర్చుచుండిరి.
27. అప్పుడు మోషే తన మామ వెళ్ళిపోవుటకు ఒప్పుకొనెను. అతడు తిరిగి స్వదేశమునకు వెళ్ళిపోయెను.