ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Exodus 15

1. అప్పుడు మోషే, యిస్రాయేలీయులు యావే పేరిట ఈ గీతము పాడిరి: “యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభువు మహా విజయమును సాధించెను. ఆయన గుఱ్ఱమును రౌతును సముద్రమున కూలద్రోసెను.

2. యావే నా బలము, నా కీర్తనము. ఆయనయే నా రక్షకుడు, యావే నా దేవుడు, ఆయనను స్తుతింతును. యావే నా పితరులదేవుడు, ఆయనను శ్లాఘింతును.

3. యావే యుద్దశూరుడు, ఆయన పేరు ప్రభువు.

4. ఫరోరాజు సైన్యమును రథబలమును ఆయన సముద్రమున కూలద్రోసెను. ఫరోరౌతులలో మొనగాండ్రందరు రెల్లు సముద్రములో మునిగిపోయిరి.

5. అగాధజలములు వారిని కప్పివేసెను. వారు రాయివలె నీటమునిగిరి,

6. యావే! నీ దక్షిణహస్తము బలవైభవముతో అలరారును. యావే! నీ దక్షిణహస్తము శత్రువులను తుత్తునియలు చేయును.

7. ప్రభూ! నీ మహిమాతిశయమువలన నీ శత్రువులను అణగదొక్కుదువు. నీ క్రోధాగ్ని రగుల్కొని నీ శత్రువులను చెత్తవలె దహించును.

8. నీ ముక్కురంధ్రముల ఊపిరికి నీళ్ళు ఉవ్వెత్తుగా లేచి రాశిగా ఏర్పడినవి. జలములు నిలువు గోడలవలె నిలిచినవి. సముద్రగర్భమున అగాధజలములు పేరుకొనిపోయినవి.

9. 'నేను తరిమితరిమి వారిని పట్టుకొందును. కొల్లసొమ్ము పంచుకొందును. తనివిదీర వారి సొత్తును అనుభవింతును. కత్తి దూసి వారిని తునుమాడెదను' అని శత్రువు తలచెను.

10. కాని నీవొక్కసారి ఊపిరి వదలితివోలేదో, సముద్రము శత్రువులను కప్పివేసెను. భయంకర జలములలో శత్రువులు సీసమువలె మునిగిపోయిరి.

11. యావే! దైవములలో నిన్ను పోలినవాడెవడు? నీవలె పరిశుద్దుడై తేజరిల్లువాడెవడు? నీవలె మహాకార్యములు చేయువాడెవడు? అద్భుత క్రియలుచేసి భయంకరుడై వెలయువాడెవడు?

12. నీవు నీ దక్షిణ హస్తమును చాచితివి. భూమి వారిని మ్రింగినది.

13. నీవు విముక్తిచేసిన ప్రజను కృపతో తోడ్కొనిపోయితివి. బలముచేత ఆ ప్రజలను నీ పవిత్ర ఆలయమునకు నడిపించితివి.

14. నీ చరితము విని సకలజాతి జనులు వణకిపోవుదురు. ఫిలిస్తీయులు వేధనపాలగుదురు.

15. ఎదోము నాయకులు కలవరమొందుదురు. మోవాబు మొనగాండ్రు గజగజలాడుదురు. కనాను దేశీయులు కలవరపడుదురు.

16. యావే! నీ ప్రజలు, నీవు చేరదీసిన ప్రజలు, ముందుకు సాగిపోవునపుడు నీ శత్రువులను భయకంపములు ముంచిఎత్తును. నీ బాహుబలమువలన వారు రాయివలె కదలకుందురు.

17. యావే! నీ చిరకాల నిలయమైన కొండమీద, నీవు నివాసముగా చేసికొన్న నెలవున, స్వయముగా నీ పవిత్ర ఆలయమును నిర్మించినచోట, నీ ప్రజను తోడ్కొనివచ్చి పాదుకొల్పెదవు.

18. నాటికి, నేటికి, ఏనాటికి యావే ఒక్కడే యేలిక.”

19. ఫరోరాజు రథములును, రథాశ్వములును, రౌతులును సముద్రమున ప్రవేశించినపుడు యావే వారి మీదకి నీటిని మరల్చెను. కాని యిస్రాయేలీయులు సరాసరి సముద్రములో పొడినేలమీద నడచి ముందుకుపోయిరి.

20. అప్పుడు అహరోను సోదరి ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేపట్టినది. స్త్రీలెల్లరు తంబురలు ధరించి నాట్యముచేయుచు ఆమెను అనుసరించిరి.

21. ఆమె ఈ విధముగా పల్లవినందుకొని పాడినది: “యావేను కీర్తింపుడు, ఆయనకు మహావిజయము సిద్ధించినది, యావే గుఱ్ఱమును, రౌతును సముద్రమున కూలద్రోసెను.”

22. మోషే రెల్లుసముద్రము వద్దనున్న విడిది నుండి యిస్రాయేలీయులను ముందుకు నడిపించెను. వారు షూరు అరణ్యమునకు వెళ్ళిరి. ఆ అడవిలో యిస్రాయేలీయులకు మూడు రోజులపాటు త్రాగుటకు నీరు దొరకలేదు. వారు మారాకు చేరిరి.

23. అక్కడి నీరు చేదుగా ఉండుటచే దానిని త్రాగలేకపోయిరి. ఆ నీటివలననే ఆ చోటికి మారా' అను పేరు వచ్చినది.

24. యిస్రాయేలీయులు మోషేను చూచి గొణిగిరి, “మేమేమి త్రాగవలయును?” అని అతనిని అడిగిరి.

25. మోషే యావేకు మొర పెట్టుకొనెను. యావే అతనికి ఒక చెట్టును చూపెను. మోషే దానిని నీటిలో వేయగా నీళ్ళు తియ్యనివయ్యెను. యావే ఆ చోటనే వారికి కట్టడలు చేసెను. జీవితవిధులు నిర్ణయించెను.  అక్కడనే వారిని పరీక్షించెను.

26. అప్పుడు యావే “మీ దేవుడయిన యావే ప్రవచనములను శ్రద్ధగా విని, ఆయన దృష్టికి ధర్మముగానున్న దానినే ఆచరించినయెడల, ఆయన ఆజ్ఞలను శిరసావహించి ఆయన చేసిన కట్టడలను తప్పకుండ నడుచుకొన్నయెడల, నేను ఐగుప్తుదేశీయులనువలె మిమ్ము ఏ అరిష్టము పాలుచేయను. మీకు ఉపశమనము కలిగించు యావేను నేనే” అని చెప్పెను.

27. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. ఆ ప్రదేశమున పండ్రెండు నీటి బుగ్గలు కలవు. డెబ్బది ఖర్జూర వృక్షములు ఉన్నవి. అక్కడ నీటి అంచుననే వారు దిగిరి.