1. యావే మోషేతో "ఫరో దగ్గరకు వెళ్ళుము. ఫరోను, అతని కొలువువారిని కఠినహృదయులుగా నేనే చేసితిని. కావుననే నేను వారికి నా సూచక క్రియలను చూపగలిగితిని.
2. అందుచేతనే నేను ఏ విధముగా ఐగుప్తుదేశీయులను కఠినులనుగా చేసితినో, వారి ఎదుట నేను ఏ సూచకక్రియలను చేసితినో వానినెల్ల నీవు కథలుగా నీ పుత్రపౌత్రులకు చెప్పగలవు. నేనే యావేనని మీరెల్లరును తెలిసికోగలరు” అని చెప్పెను.
3. అంతట మోషే అహరోనులు ఫరో దగ్గరకు వెళ్ళి, అతనితో “హెబ్రీయుల దేవుడయిన యావే నీకు ఈ వార్త పంపెను 'ఎంతకాలము నీవు నాకు లొంగక మొండిపట్టుపట్టెదవు? నన్ను సేవించుటకు నాప్రజను పోనిమ్ము.
4. నీవు నాప్రజను వెళ్ళనీయకున్న రేపు నేను నీ దేశము మీదికి మిడుతల దండును పంపెదను.
5. ఆ దండు నేలయన్నది యిసు మంతయునైన కనబడకుండ దానిని కప్పివేయును. అది వడగండ్లవాన బారినబడక మిగిలిన దానినెల్ల నాశనము చేయును. పొలములలో మొలిచిన ప్రతి చెట్టును తినివేయును.
6. నీ సౌధములలో, నీ కొలువు వారి ఇండ్లలో, ఐగుప్తుదేశీయుల గృహములలో మిడుతలదండు నిండును. నీ తాతముత్తాతలుగాని, వారి పూర్వులుగాని ఈ దేశమున పాదుకొన్న నాటి నుండి అటువంటి మిడుతలదండును చూచి యెరుగరు' అని ఆయన చెప్పుమనెను” అని పలికిరి. ఈ మాటలు చెప్పిన వెంటనే మోషే ఫరో సమ్ముఖమును వీడి వెళ్ళెను.
7. అప్పుడు ఫరో కొలువువారు అతనితో “ఇతడు ఎంతకాలము మనకు గుండెలపై కుంపటిగా నుండును? వారి దేవుడయిన యావేను సేవించుటకు ఈ మూకలను పంపివేయరాదా? వీరి మూలమున ఐగుప్తుదేశము వల్లకాడైపోయినదని నీవింకను గ్రహింపలేదా?" అనిరి.
8. కావున ఫరో మోషే అహరోనులను తిరిగి పిలిపించెను. అతడు వారితో “మీరు వెళ్ళి మీ దేవుడయిన యావేను సేవింపవచ్చును. కాని ఎవరెవరు వెళ్ళవలయును?" అని పలికెను.
9. దానికి మోషే “మా పిన్నలు పెద్దలు వెళ్ళుదురు. మా కుమారులు. కుమార్తెలు వెళ్ళుదురు. మా మందలు వెళ్ళును మేము యావేకు పండుగ జరుపుకోవలయును" అనెను.
10. కాని ఫరో అతనితో “యావే మీకు మేలుచేయునుగాక. నేను మాత్రము మీ స్త్రీలను. పిల్లలను పోనీయను. మీరేదో ఎత్తుగడ వేయుచున్నారు.
11. మీలో మగవారు మాత్రము వెళ్ళి మీ దేవుని సేవించుకొనుడు. మీరు కోరునది ఇదియే కదా!” అనెను. ఇట్లనుచు ఫరో వారిని తన సమక్షమునుండి వెడలగొట్టెను.
12. అప్పుడు యావే మోషేతో “నీవు ఐగుప్తు దేశముమీదికి నీచేతిని చాపుము. వెంటనే మిడుతల దండు దిగివచ్చి వడగండ్లవాన బారినపడక మిగిలిన పచ్చి మొక్కలనెల్ల తినివేయును” అనెను.
13. మోషే ఐగుప్తుదేశము మీదికి తన కఱ్ఱనెత్తెను. యావే దేశము మీద తూర్పుగాలి వీచునట్లు చేసెను. అది రేయింబవళ్ళు వీచెను. ప్రొద్దుపొడుచుసరికి తూర్పుగాలి వెంట మిడుతలదండు దిగెను.
14. మిడుతలు ఐగుప్తుదేశము అంతట దండు విడిసెను. అవి లెక్కకు అందనట్లుగా వచ్చి దేశమునిండ వ్రాలెను. అటువంటి మిడుతల దండును ఇంతకు ముందు ఎవరును చూడలేదు. ఇకముందు ఎవ్వరును చూడబోరు.
15. నేలయంత నలుపెక్కునట్లుగా మిడుతలు ముసురుకొనెను. అవి దేశములో వడగండ్ల వాన బారినపడక మిగిలిన పైరులను, పండ్లను తిని వేసెను. ఐగుప్తుదేశమంతట పొలములలో పచ్చిమొక్క గాని, పచ్చని చెట్టుగాని మిగులలేదు.
16. వెంటనే ఫరో మోషేను అహరోనును పిలిపించెను. అతడు వారితో “నేను మీ దేవుడైన యావేకును, మీకును ద్రోహము చేసితిని.
17. ఈసారికి నా పాపము క్షమింపుడని మిమ్ము ప్రార్ధించుచున్నాను. నన్ను ఈ చావునుండి కాపాడుమని మీ దేవుడైన యావేను ప్రార్థింపుడు” అనెను.
18. మోషే ఫరో సమక్షమునుండి వెళ్ళిపోయి యావేకు విన్నపములు చేసెను.
19. అప్పుడు యావే గాలివాలును మరల్చి పడమటినుండి పెనుగాలి వీచునట్లు చేసెను. మిడుతలు ఆ గాలిలో చిక్కుకొని పోయి రెల్లు సముద్రములో కూలెను. ఐగుప్తుదేశములో మచ్చుకు ఒక్క మిడుతకూడ మిగులలేదు.
20. కాని యావే ఫరో హృదయము ఇంకను మొండికెత్తునట్లు చేసెను. అతడు యిస్రాయేలీయులను ఇంకనూ వెళ్ళనీయడాయెను.
21. అప్పుడు యావే మోషేతో “నీవు నీ చేతిని మింటివైపు చాపుము. కన్ను పొడుచుకొన్న కానరాని కటికచీకటి ఐగుప్తుదేశమునెల్ల కప్పును” అని చెప్పెను.
22. కావున మోషే తన చేతిని మింటివైపు చాచెను. మూడు రోజుల పాటు ఐగుప్తుదేశమందతట కటికచీకటి కమ్మెను.
23. ఆ మూడు రోజులు ఎవ్వరు ఎవ్వరిని చూడలేకపోయిరి. కాలుకదపలేకపోయిరి. యిస్రాయేలీయులున్న చోట మాత్రము వెలుగు ప్రకాశించెను.
24. అపుడు ఫరో మోషేను పిలిపించి అతనితో “వెళ్ళుడు. యావేను సేవించుకొనుడు. కాని మీ మందలు ఇక్కడనే ఉండవలయును. మీ పిల్లలు మీతోకూడ వెళ్ళవచ్చును” అని అనెను.
25. దానికి మోషే అట్లయిన మా దేవుడయిన యావేకు బలులు, దహనబలులు సమర్పించుటకు నీవే మాకు మందలను ఈయవలసివచ్చును.
26. కావున మా మందలు మా వెంటరాక తప్పదు. ఒక్కగిట్టకూడ ఇక్కడ మిగిలి పోరాదు. మా దేవుడయిన యావేకు మా మందల నుండే బలులు అర్పింపవలయును. బలిప్రదేశము చేరినగాని మేము యావేకు ఎట్టి ఆరాధన చేయవలయునో మాకు తెలియదు” అనెను.
27. కాని యావే ఫరోను ఇంకను కఠినహృదయునిగా చేసెను. అతడు యిస్రాయేలీయులను పోనీయడయ్యెను.
28. ఫరో “నా ఎదుటినుండి పో! జాగ్రత్త! ఇక ఎప్పుడును నీ ముఖము చూపకు. చూపిననాడు నీకు చావుతప్పదు” అని మోషేను గద్దించెను.
29. “సరే కానిమ్ము. నేనిక నీ ముఖము చూడను” అని మోషే అనెను.