ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 9

1-2. యోర్డానునకు ఈవలి ప్రక్క కొండలలోను, లోయలలోను, లెబానోను వైపునగల మహాసముద్ర తీరమున వసించు హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలైన జాతులవారి రాజులందరు జరిగిన సంగతులు విని తమలో తాము ఏకమై యెహోషువతోను యిస్రాయేలీయులతోను యుద్ధము చేయ జతకట్టిరి.

3. యెహోషువ యెరికో, హాయి పట్టణములను నాశనము చేసెనని గిబ్యోనీయులు వినినప్పుడు,

4. వారు కపటోపాయమునకు పూనుకొని, రాయబారులమని వేషము వేసుకొని, పాత గోతాములను, పిగిలి పోగా మరలకుట్టిన ద్రాక్షసారాయపు తిత్తులను గాడిదలమీద వేసికొని పయనమై వచ్చిరి.

5. పాత బడిపోయి, కుట్టువడిన చెప్పులను, చినిగి చీలికలైన బట్టలను తొడుగుకొని వచ్చిరి. వారు తెచ్చుకొనిన రొట్టెలుగూడ ఎండి పొడుమగుచుండెను

6. అలా వచ్చి గిబ్యోనీయులు, గిల్గాలు శిబిరమున యెహోషువను కలసికొనిరి. అతనితోను యిస్రాయేలీయులతోను “మేము దూరదేశమునుండి వచ్చితిమి. మీరు మాతో ఒడంబడిక చేసికొనుడు” అని అనిరి.

7. కాని యిస్రాయేలీయులు వారిని “మీరు మా దాపుననే వసించుచున్నారేమో! మరి మీతో ఒడంబడిక చేసికొనుటెట్లు?” అని అడిగిరి.

8. వారు యెహోషువతో “మేము మీ దాసులముకదా!” అని యనిరి. యెహోషువ “మీరెవరు? ఎచటినుండి వచ్చుచున్నారు?” అని ప్రశ్నించెను.

9. వారు అతనితో, “నీ దాసులమైన మేము దూరప్రాంతములనుండి వచ్చితిమి. నీవు కొలుచు యావే పేరు వింటిమి. ఆ దేవుడు ఐగుప్తీయులను ఎట్లు మట్టుపెట్టెనో తెలిసికొంటిమి.

10. యోర్దానునకు ఆవలివైపునున్న అమోరీయ రాజుల నిద్దరను, హెష్బోను రాజగు సీహోనును, అష్టారోతున వసించు బాషాను రాజగు ఓగును ఎట్లు అణగదొక్కెనో తెలిసికొంటిమి.

11. మా పెద్దలు, పౌరులు మాతో 'మీరు దారి బత్తెములు తీసికొని పయనమైపోయి ఆ ప్రజలను కలసికొని, మేము మీ దాసులము కనుక మాతో ఒడంబడిక చేసికొనుడు' అని విన్నవింపుడనిరి.

12. ఇదిగో! మేము తెచ్చుకొనిన రొట్టెలను చూడుడు. మీ యొద్దకు రావలెనని పయనము కట్టిన దినమున వీనిని మా ఇండ్లనుండి తెచ్చుకొంటిమి. అపుడవి వేడిగనే యుండినవి. కాని ఇపుడు ఎండిపోయి పొడుమగుచున్నవి.

13. ఈ తిత్తులును ద్రాక్షసారాయము పోసినపుడు క్రొత్తవియే. కాని ఇప్పుడవి పిగిలిపోవుచున్నవి. ఈ దీర్ఘప్రయాణము వలన మా దుస్తులు, పాదరక్షలు కూడ పాడయిపోయినవి” అని చెప్పిరి.

14. యిస్రాయేలు నాయకులు గిబ్యోనీయులు సమర్పించిన భోజనపదార్థములను పుచ్చుకొని భుజించిరి. వారు యావేను సంప్రదింపలేదు.

15. యెహోషువ గిబ్యోనీయులతో శాంతిని పాటింతునని బాసచేసి వారిని చంపనని ఒడంబడిక చేసికొనెను. యిస్రాయేలు నాయకులు ప్రమాణపూర్వకముగా ఆ ఒడంబడికను ధ్రువపరచిరి.

16. కాని ఒడంబడిక ముగిసిన మూడు రోజులలోనే ఆ వచ్చినవారు ఆ సమీపమున యిస్రాయేలీయుల చెంతనే వసించుచున్నారని తెలియవచ్చెను.

17. యిస్రాయేలీయులు తమ శిబిరమునుండి వెడలి వచ్చి మూడవరోజున గిబ్యోను, కెఫీరా, బెరోతు, కిర్యత్యారీము అను గిబ్యోనీయుల పట్టణములు చేరుకొనిరి.

18. కాని వారు ఆ పట్టణములను ముట్టడింపలేదు. యిస్రాయేలు నాయకులు తమదేవుడైన యావే పేర గిబ్యోనీయులతో శాంతిని పాటింతుమని బాస చేసిరి గదా! కాని యిస్రాయేలు ప్రజలు మాత్రము తమ నాయకులమీద గొణగుకొనిరి.

19. యిస్రాయేలు నాయకులు “మనము యావే పేర ఈ ప్రజలకు ప్రమాణము చేసితిమి. కనుక ఇపుడు వీరిని చంపరాదు,

20. మనము వారితో చేసిన ప్రమాణము వలన మనమీదికి దైవాగ్రహము రాకుండునట్లు ఆ ప్రమాణము ప్రకారము వారిని బ్రతుక నిత్తుము అని నిశ్చయించుకొనిరి.

21. కాని వారు యిస్రాయేలు సమాజమునకు వంటచెరకు నరుకుకొని రావలెను. నీళ్ళు తోడుకొనిరావలయును” అని సంపూర్ణ సమాజమున పలికిరి. సమాజము అందులకు అంగీకరించెను.

22. యెహోషువ గిబ్యోనీయులను పిలువనంపి “మీరు మా సమీపమునే వసించుచు దూరప్రాంతములనుండి వచ్చితిమని చెప్పి మమ్ము మోసగించిరి.

23. నేటి నుండి మీరు శాపగ్రస్తులగుదురు గాక! నేను కొలుచు దేవుని మందిరమున బానిసలైయుండి వంటచెరకు, నీళ్ళుతోడి మోసికొని రండు” అనెను.

24. వారు యెహోషువతో “నీ దాసులమైన మేము ఇట్లు కపటోపాయము పన్నుటకు కారణము కలదు. నీ దేవుడైన యావే యిటవసించు ప్రజలను నాశనముచేసి ఈ దేశమును నీవశము చేయుమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞ ఇచ్చెనని నీ దాసులకు అగత్యముగా తెలియవచ్చినది. మీరు మా సమీపమునకువచ్చిరి. కనుక ఇక మమ్ము చంపి వేయుదురని భయపడితిమి.

25. మేమిపుడు మీ చేతులలోని వారము. మమ్మెట్లు చేయదలచుకొంటిరో అటులనే చేయుడు” అనిరి.

26. యెహోషువ యిస్రాయేలీయుల బారినుండి గిబ్యోనీయులను రక్షించెను గనుక వారు చావు తప్పించుకొనిరి.

27. కాని నాటినుండి యెహోషువ వారిని యిస్రాయేలు సమాజమునకు వంట చెరకు నరుకుకొని రావలయుననియు, నీళ్ళుతోడుకొని రావలెననియు ఆజ్ఞాపించెను. పైగా యావే ఎక్కడ ఆరాధింపబడినను అక్కడ వారు యావే బలిపీఠమునకు పై రీతిగనే ఊడిగము చేయవలెనని ఆజ్ఞాపించెను. నేటివరకును ఆ నియమము చెల్లుచునే యున్నది.