1. యిస్రాయేలీయులారా వినుడు! నేడు మీరు యోర్దానునది దాటి మీకంటె అధిక సంఖ్యాకులును, బలాఢ్యులును అయిన జాతుల దేశములను స్వాధీనము చేసికొందురు. ఆకాశమునంటు ప్రాకారములుగల వారి గొప్పపట్టణములను ఆక్రమించు కొందురు.
2. ఆ జనులు మహాబలవంతులు, ఆజానుబాహులు. మీరు ఇదివరకే వినియున్న అనాకీయ వంశస్తులు. ఆ అనాకీయులను ఎవరెదిరింపగలరు? అనుమాట మీరు వినియున్నారుగదా!
3. ఇప్పుడు మీరు చూచు చుండగనే ప్రభువు దహించుఅగ్నివలె మీకు ముందుగా పోయి వారిని ఓడించి లొంగదీయును. కనుక ప్రభువు మాట యిచ్చినట్లే మీరు ఆ ప్రజలను శీఘ్రముగా తరిమివేసి నాశనము చేయుదురు.
4. కాని ప్రభువు వారిని మీ చెంతనుండి తరిమివేసిన పిదప మీ యోగ్యతను బట్టియే ఆయన వారిని వెడలగొట్టి మీకు ఆ నేలను ఇచ్చెనని భావింపకుడు. కాదు! ఆ ప్రజలు దుర్మార్గులు కనుకనే ప్రభువువారిని అచటనుండి వెడలగొట్టెను.
5. మీరేమో మంచివారు, ధర్మవర్తనులు అన్న భావముతో ప్రభువు వారి దేశమును మీవశము చేయుటలేదు. వారు దుర్మార్గులు కనుకను, తాను మీ పితరులైన అబ్రహాము ఈసాకు యాకోబులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగోరెను కనుకను వారిని పారద్రోలును.
6. ఆయన ఆ సారవంతమైన నేలను మీకిచ్చునది మీ యోగ్యతను బట్టికాదు అని తెలుసు కొనుడు.
7. మీరు ఎడారిలో ప్రభువు కోపమును రెచ్చ గొట్టిన సంగతి మరచిపోవలదు. ఐగుప్తునుండి బయలుదేరినది మొదలు ఇచటికి చేరువరకు మీరు యావేమీద తిరుగబడుచునేయుంటిరి. మీరు వట్టి తలబిరుసు కలిగిన మూక.
8. హోరేబు వద్ద మీరు యావేకు కోపము రప్పింపగా ఆయన మిమ్ము నాశనము చేయసంకల్పించుకొనెను.
9. ప్రభువు మీతో చేసికొనిన నిబంధనమునకు సంబంధించిన రాతి పలకలను కొనివచ్చుటకై నేను కొండ మీదికి వెళ్ళితిని. అన్న పానీయములుకూడ పుచ్చుకొనకుండ నలుబది రాత్రులు నలుబది పగళ్ళు ఆ కొండమీద గడపితిని.
10. ప్రభువు స్వయముగా చేతితో వ్రాసిన రెండు రాతి పలకలను నాకొసగెను. నాడు మీరు కొండయెదుట సమావేశమైనపుడు పర్వతము మీద నిప్పుమంట నడుమ నుండి ప్రభువు మీతో పలికిన పలుకులు వానిమీద వ్రాయబడియుండెను.
11. ఆ రీతిగా నలువది పగళ్ళు నలువది రాత్రులు ముగిసిన పిమ్మట ప్రభువు నిబంధనమునకు చెందిన రెండు రాతి పలకలను నాకొసగెను. అతడు నాతో,
12. “నీవు శీఘ్రముగా క్రిందికి దిగిపొమ్ము. నీవు ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన నీ జనులు విశ్వాసభ్రష్టులైరి. వారు నేను నిర్దేశించిన మార్గమును విడనాడి విగ్రహము నొకదానిని పోత పోసికొనిరి” అని చెప్పెను.
13. ప్రభువు ఇంకను “ఆ ప్రజలు తలబిరుసు జనము.
14. నేను వారిని సర్వనాశనముచేసి భూమిమీద వారిని రూపుమాపివేయుదును. నేను నీ నుండి మరియొక జాతిని పుట్టింతును. ఆ జాతి వారికంటెను అధిక సంఖ్యాకము, బలసంపన్నము అగును” అని పలికెను.
15. అంతట నేను కొండ దిగివచ్చితిని. అప్పుడు పర్వతము నిప్పులుక్రక్కుచుండెను. నా రెండు చేతులలో రెండు నిబంధన పలకలు ఉండెను.
16. నేను మీవైపు పారజూడగా మీరు అప్పటికే పాపము కట్టుకొని యుంటిరి. పోతదూడను తయారు చేసికొనియుంటిరి. ప్రభువు నియమించిన మార్గమునుండి వైదొలగి యుంటిరి.
17. మీ కన్నుల ఎదుటనే నా రెండు చేతులలోని రాతిపలకలను నేలమీదికి విసరికొట్టి ముక్కముక్కలు చేసితిని.
18. మరల మొదటివలె నేను నలువది పగళ్ళు నలువది రాత్రులు అన్నపానములు కూడ ముట్టుకొనకుండ ప్రభువు ఎదుట సాగిలపడితిని. మీరు యావేకు వ్యతిరేకముగా పాపముచేసి ఆయన కోపమును రెచ్చగొట్టిరి.
19. నేను ప్రభువు తీవ్రకోపమునకు భయపడితిని. ఆయన మిమ్ము నాశనముచేయ సంకల్పించుకొనెను. కాని యావే మరల నా మొర ఆలించెను.
20. ప్రభువు అహరోను మీద గూడ మండిపడి అతనిని నాశనము చేయగోరెను. కాని నేను అహరోను పక్షమున గూడ విన్నపము చేసితిని.
21. మీరు చేసిన ఆ పాపపుదూడను మంటలో పడవేసితిని. దానిని ముక్కలు ముక్కలుగా విరుగగొట్టి పొడిచేసి కొండమీద నుండి పారు సెలయేటిలో కలిపితిని.
22. తబేరా యొద్దను, మస్సా యొద్దను, కిబ్రోతు హట్టావా యొద్దను మీరు ప్రభువునకు కోపము రప్పించితిరి.
23. ఆయన మిమ్ము కాదేషుబార్నెయా నుండి అవతలకుపంపి, తాను మీకు స్వాధీనము చేయనున్న దేశమును ఆక్రమించుకొండని చెప్పెను. కాని మీరు ప్రభువుమీద తిరుగబడి ఆయన మాటను నమ్మరైతిరి. ఆయన ఆజ్ఞను పాటింపరైరి.
24. మీరు ప్రభువు ప్రజలైనప్పటినుండి ఆయనమీద తిరుగ బడుచునేయుంటిరి. ప్రభువు మిమ్ము హతమార్చ బూనెను.
25. కనుక ఆ నలుబది పగళ్ళు, నలుబది రాత్రులు నేను ప్రభువు ఎదుట మొదటిమారువలె సాగిలపడితిని.
26. నేను 'ప్రభూ! నీ సొంతవారైన ఈ ప్రజలను నాశనము చేయకుము. నీవు నీ మహిమవలన దాస్యవిముక్తులనుచేసి, నీ బాహు బలముతో వారిని ఐగుప్తునుండి తోడ్కొని వచ్చితివి కదా!
27. నీ భక్తులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులను స్మరించుకొనుము. ఈ జనుల తలబిరుసు తనమును, దుష్టత్త్వమును, పాపకార్యములను లెక్క చేయకుము.
28. లేనిచో నీవు వాగ్దానముచేసిన దేశమునకు ఈ ప్రజలను చేర్పజాలకపోయితివనియు, ఈ జనులనిన నీకు గిట్టదు కనుక వీరిని సంహరించు టకే ఎడారికి తోడ్కొని వచ్చితివనియు ఐగుప్తీయులు నిన్ను ఆడిపోసికొందురు.
29. నీవు నీ అధికబలము తోను, నీవు చాపిన నీ బాహువుచేతను వీరిని ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చితివి. ప్రభూ! ఈ ప్రజలు నీవారు, నీవు స్వయముగా ఎన్నుకొనిన వారసప్రజలు' అని నేను మనవి చేసితిని.