ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 8

1. అప్పుడు యావే యెహోషువతో ఇట్లనెను: “భయపడకుము. ధైర్యము వహింపుము. నీ వీరులనందరిని తోడ్కొని హాయి పట్టణము మీదికి పొమ్ము. ఆ పట్టణపు రాజును, అతని ప్రజలను, నగరమును, దేశమును నీకు అప్పగించితిని.

2. యెరికో నగరమును, యెరికోరాజును నాశనము చేసినట్లే హాయి నగరమును, దాని రాజును నాశనముచేయుము. మీరు హాయిప్రజల సంపదను, పశువులను మూకుమ్మడిగా దోచుకొనవచ్చును. మీరు పట్టణము వెనుక పొంచియుండి నగరమును ధ్వంసము చేయవలయును” అని చెప్పెను.

3. యెహోషువ వీరులతో పోయి హాయిని ముట్టడించుటకు సిద్ధపడెను. అతడు ముప్పది వేలమంది మహావీరులను ఎన్నుకొని వారిని రాత్రివేళ పంపించెను.

4. వారితో, “మీరు పట్టణమునకు సమీపమున పడమరన పొంచియుండి సంసిద్ధముగా నుండుడు.

5. నేనును, నాతో ఉన్నవారును పట్టణమును సమీపించెదము. హాయి ప్రజలు మునుపటివలె మమ్ము ఎదుర్కొందురు. అప్పుడు మేము వారి యెదుట నిలు వక పారిపోయెదము.

6. మునుపటివలె వీరు మనయెదుట నిలువజాలక పరుగెత్తుచున్నారను కొని వారు పట్టణమునువీడి బహుదూరము మమ్ము వెంటాడెదరు.

7. అప్పుడు పొంచియున్న మీరు బయటికి వచ్చి పట్టణమును ఆక్రమించుకొనుడు. మీ దేవుడైన యావే దానిని మీ వశము చేయును.

8. మీరు పట్టణమును పట్టుకొని వెంటనే తగులబెట్టుడు. ఇది ప్రభువాజ్ఞ. మీరు నేను చెప్పినట్లు చేయుడు” అని పలికి వారిని పంపించెను.

9. వారు వెళ్ళి హాయి పట్టణమునకు పడమటి వైపున బేతేలుకును, హాయికిని మధ్య పొంచియుండిరి. ఆ రాత్రి యెహోషువ ప్రజల మధ్య బసచేసెను.

10. మరునాడు వేకువజామున లేచి అతడు హాయి పట్టణము మీదికి దాడికి వెడలెను. అతడు, యిస్రాయేలు పెద్దలు ప్రజల ముందు నడచిరి.

11. అతనితోనున్న యుద్ధ వీరులందరు బయలుదేరి నగరము ఎదుటి భాగమునకు కదలి హాయికి ఉత్తరమున డేరా వేసిరి. వారికి హాయికి మధ్య ఒక లోయ కలదు.

12. యెహోషువ సుమారు ఐదువేల మందిని పట్టణమునకు పశ్చిమమందు బేతేలుకును హాయికిని నడుమ పొంచియుండ నియమించెను.

13. నగరమునకు ఉత్తర దిక్కున యెహోషువ, జనులు నిలుచుండిరి. పొంచియున్నవారు పడమటివైపు నుండిరి. యెహోషువ ఆ రాత్రి లోయలోనే గడపెను.

14. హాయిరాజు శత్రువులను చూచిన వెంటనే అతడును, ఆ పట్టణ ప్రజలును పెందలకడనే లేచి వారు ముందుగా నిర్ణయించుకొనిన విధముగా ఆరబాకు అభిముఖముగానున్న పల్లములో యిస్రాయేలీయులను ఎదుర్కొనుటకు త్వరపడి తనవారితో బయలుదేరెను. పట్టణమునకు పడమటివైపున శత్రువులు పొంచియున్న సంగతి అతనికి తెలియదు.

15. యెహోషువ, యిస్రాయేలీయులు వారి యెదుట నిలువజాలనట్లు నటించుచు ఎడారివైపునకు పారిపోయిరి.

16. హాయి ప్రజలు నగరమును అరక్షితముగా వదలిపెట్టి పెనుకేకలతో వారిని తరుముచు చాలదూరము పోయిరి.

17. యిస్రాయేలీయులను వెంటాడుచు పోని వాడొక్కడును హాయిలోనేగాని, బేతేలులోనేగాని లేడు. నగరమును అరక్షితముగా విడిచి, వారు యిస్రాయేలీయుల వెంటబడిరి.

18. అప్పుడు యావే “నీ చేతనున్న ఈటెను హాయివైపు చాపుము. నగరమును నీకు వశము చేసెదను” అని యెహోషువతో చెప్పెను. యెహోషువ తన చేతనున్న బల్లెమును నగరమువైపు చాపెను.

19. అతడు తన చేయిచాపిన వెంటనే పొంచియున్న వారు గబగబ మరుగునుండి వెలువడి పరుగెత్తుకొని పోయి పట్టణమున ప్రవేశించి దానిని ఆక్రమించుకొని తగులబెట్టిరి.

20. హాయి ప్రజలు వెనుదిరిగి చూడగా పట్టణము నుండి పొగ ఆకాశమునకు ఎగబ్రాకుచుండెను. ఎడారివైపు పరుగెత్తిపోవుచున్న యిస్రాయేలీయులు తమను తరుముచున్న వారిపై తిరుగబడుచుండిరి. అందుచే హాయి ప్రజలలో ఒక్కనికిని ఎటుపోవుటకు వీలు కాలేదు.

21. పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనుటయు, నగరమునుండి పొగ ఆకాశమునకు లేచుటయు, యెహోషువయు యిస్రాయేలీయులును చూచి హాయి ప్రజలను ముట్టడించి ఎదుర్కొనిరి.

22. నగరమున నున్న యిస్రాయేలు వీరులు వెనుక నుండి వచ్చి హాయి ప్రజలపైబడిరి. ఈ రీతిగా హాయి నగర ప్రజలు అన్నివైపుల శత్రువులచేత ముట్టడింప బడిరి. ఒక్కడిని గూడ ప్రాణములతో మిగులనీయకుండ యిస్రాయేలీయులు అందరిని మట్టు పెట్టిరి.

23. హాయి రాజు మాత్రము ప్రాణములతో పట్టుపడెను. అతనిని యెహోషువ దగ్గరకు తీసికొని వచ్చిరి.

24. ఎడారిలోనికి తమ్ము వెంబడించిన హాయి ప్రజలను మైదానములో పూర్తిగా తమ కత్తులకు ఎరచేసిన తరువాత యిస్రాయేలీయులు హాయి నగరమునకు తిరిగి వచ్చి అందరిని సంహరించిరి.

25. నాడు హతులైన హాయి స్త్రీ పురుషుల సంఖ్య పన్నెండు వేలమంది.

26. హాయి నివాసులందరు శాపగ్రస్తులైన యెరికో ప్రజలవలె నాశనమగువరకు యెహోషువ తాను చాచిపట్టుకొనిన బల్లెమును వెనుకకు తీయలేదు.

27. యావే యెహోషువకు ఆజ్ఞయిచ్చిన ప్రకారము యిస్రాయేలీయులు హాయి పశువులను, కొల్లగొట్టిన సొమ్మును మాత్రము గైకొనిరి.

28. అంతట యెహోషువ హాయిని తగులబెట్టెను. అది పూర్తిగా పాడువడి నేటికిని అట్లే శూన్యప్రదేశముగా నున్నది.

29. యెహోషువ హాయి రాజును చెట్టుకు వ్రేలాడ దీయించెను. మాపటివేళ శవమును చెట్టు నుండి దింప నాజ్ఞాపించెను. పీనుగును నగరద్వారము ముందు పడవేసి దాని మీద పెద్ద రాళ్ళగుట్టను పేర్చిరి. నేటికిని ఆ గుట్ట అచటనున్నది.

30-31. అప్పుడు యెహోషువ యిస్రాయేలు దేవుడైన యావేకు ఏబాలు కొండమీద ఒక బలి పీఠము కట్టించెను. యావే సేవకుడైన మోషే యిస్రాయేలీయులను ఆజ్ఞాపించిన విధంగా, ధర్మశాస్త్రము ప్రకారము, ఇనుప పనిముట్లు తాకని, చెక్కని ముడి రాళ్ళతో ఆ బలిపీఠమును కట్టించెను. ఆ దినమున, వారు ఆ బలిపీఠముపై యావేకు దహనబలులు, సమాధానబలులు సమర్పించిరి.

32. మోషే యిస్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమును యెహోషువ రాళ్ళపై చెక్కించెను.

33. అప్పుడు నిబంధన మందసమునకు ఇరువైపుల, నిబంధన మందసమును మోయు లేవీయ యాజకుల ముందట, తమ పెద్దలతో, నాయకులతో, న్యాయాధిపతులతో, స్వపరభేదము లేకుండ యిస్రాయేలీయులందరును తమ తమ స్థానములలో నిలుచుండిరి. వారిలో సగముమంది గెరిసీముకొండ ఎదుటను, సగము మంది. ఏబాలుకొండ ఎదుటను, తమ తమ స్థానములలో నిలుచుండిరి. యావే సేవకుడైన మోషే యిస్రాయేలీయులు దీవెన పొందునపుడు ఇట్లు నిలువవలెనని మొదటనే ఆజ్ఞాపించియుండెను.

34. తరువాత యెహోషువ ధర్మశాస్త్ర నియమములన్నిటిని ఆశీర్వచనములను, శాపవచనములను కూడ చదివి వినిపించెను.

35. స్త్రీలు, పిల్లలు పరదేశులు వినుచుండగా సర్వజనము ఎదుట యెహోషువ మోషే ఆజ్ఞాపించిన నిబంధనలన్నిటిని ఒక్కమాట కూడ విడువక చదివి వినిపించెను.