ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 8

1. నేడు నేను మీకు ఆదేశించిన ఆజ్ఞలనెల్ల పాటింపుడు. అప్పుడు మీరు బ్రతికిపోయెదరు, పెంపు చెందెదరు. ప్రభువు మీ పితరులకు వాగ్దానము చేసిన దేశమును స్వాధీనము చేసికొందురు.

2. ప్రభువు ఈ నలువది ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జప్తికి తెచ్చుకొనుడు. మీకు వినయము నేర్పుటకు, మీ హృదయములను పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలిసికొనుటకు ఆయన ఈ పయనము ఉపయోగించుకొనెను.

3. ఆయన మీకు అణకువనేర్పెను. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటుపిమ్మట మన్నా భోజనమనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరుగాని, మీ పితరులుగాని ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడనియు, ప్రభువు సెలవిచ్చు ప్రతి వాక్కువలన కూడా జీవించుననియు తెలియజేయుటకే ఆయన అటులచే సెను.

4. ఆ నలుబదియేండ్లు మీ ఒంటిమీది దుస్తులు చినుగు పట్టలేదు. మీ కాళ్ళకు బొబ్బలెక్కలేదు.

5. దీనినిబట్టి తండ్రి కుమారునికివలె ప్రభువు మీకు శిక్షణనిచ్చెనని గ్రహింపుడు.

6. కనుక మీరు ప్రభువు ఆజ్ఞలను పాటింపుడు. ఆయన చూపిన త్రోవలో నడువుడు. ఆయనపట్ల భయభక్తులు కలిగిఉండుడు.

7. ప్రభువు మిమ్ము సారవంతమైన దేశమునకు కొనిపోవును. అచట ఏరులు, చెలమలు కలవు. భూగర్భములోని నదులనుండి అచటి లోయలలోనికి, కొండలలోనికి నీళ్ళు ఉబికివచ్చును.

8. అచట గోధుమ, యవ, ద్రాక్షలు, అంజూరములు, దానిమ్మలు పండును, ఓలివునూనె, తేనె లభించును.

9. ఆహారమునకు కొదువ ఉండదు. మీ అవసరములన్నియు తీరును. అచటి శిలలలో ఇనుము దొరకును. కొండల నుండి రాగి త్రవ్వవచ్చును.

10. అచట మీరు కోరు కొన్న పదార్థములన్నియు సంతృప్తిగా భుజింతురు. అంత సారవంతమైన నేలను మీకు అనుగ్రహించినందుకు గాను ప్రభువునకు వందనములు అర్పింపుడు.

11. కాని మీ ప్రభువైన దేవుని మరచిపోయి నేడు నేను మీకు ఆదేశించు ఆజ్ఞలను, విధులను, కట్టడలను అశ్రద్ధ చేయుదురేమో జాగ్రత్త!

12-14. మీరు కోరుకొన్న పదార్థములన్నియు భుజించిన తరువాత, మీరు వసించుటకు సుందరమైన భవనములు నిర్మించుకొనినపిదప, మీ పశువుల, గొఱ్ఱెల మందలు, వెండి, బంగారములు, సిరిసంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విఱ్ఱవీగి మిమ్ము ఐగుప్తు దాస్యగృహము నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు.

15. ఆయన మిమ్ము సుదీర్ఘమును, భయంకరమునై విషసర్పములతోను, తేళ్ళతోను కూడిన ఎడారిగుండ నడిపించుకొనివచ్చెను. నీళ్ళు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిలనుండి నీళ్ళు వెలువరించెను.

16. మీ పూర్వులు కనివిని యెరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను. ఈ రీతిగా ప్రభువు మీకు వినయము నేర్పేను. మిమ్ము పరీక్షించెను. అతడింతగా శ్రమపడినది చివరకు మీకు మేలు చేయుటకే.

17. కనుక మీరు ఏనాడును మా బలము తోనే, మా శక్తితోనే మేము సంపన్నులము అయితిమని భావింపకుడు.

18. మిమ్ము సంపన్నుల చేసినది ప్రభువేయని గుర్తింపుడు. ఆయన మీ పితరులతో చేసికొనిన ఒడంబడికను నేటిదనుక పాటించెను గనుకనే మీరు ఐశ్వర్యవంతులైరి.

19. కనుక ఆ ప్రభువును ఏనాడును విస్మరింపకుడు. అన్యదైవములను ఆరాధించి మ్రొక్కులు చెల్లింపకుడు. అటుల చేయుదురేని మీరెల్లరు మొదలంట నాశనమయ్యెదరని నేడు నేను ప్రమాణముచేసి చెప్పుచున్నాను.

20. మీరు మీ ప్రభువుమాట పెడచెవిని పెట్టుదురేని ఆయన మీ ఎదుటినుండి అన్యజాతులను నాశనము చేసినట్లే మిమ్మును మసి చేసి తీరును.