ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 6

1. అప్పుడు యిస్రాయేలీయుల వలన భయముచే యెరికో పట్టణవాసులు నగరద్వారమును గట్టిగా మూసివేసిరి. లోపలివారు బయటికి పోలేదు, బయటి వారు లోపలికి రాలేదు.

2. అంతట యావే యెహోషువతో “నేనిప్పుడు యెరికో నగరమును, యెరికో రాజును నీకు కైవసము చేసియున్నాను.

3. మీ యోధులు, పరాక్రమశాలులు పట్టణమును ఒక సారి చుట్టిరావలెను. అటుల మీరు ఆరు రోజులు చేయవలెను.

4. ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలి కొమ్ము బాకాలను పట్టుకొని దేవుని మందసము ముందు నడువవలెను. ఏడవరోజు యాజకులు బాకాలను ఊదుచుండగా మీరు ఏడుసార్లు పట్టణము చుట్టిరండు.

5. ఆ బాకాల ధ్వని విని మీ జనులందరు యుద్ధనాదములతో కేకలు వేయవలెను. అప్పుడు కోటగోడ దానియంతట అదియే నేలకూలును. వెంటనే మీ జనులు లోనికిపోయి నగరమును వశము చేసికోవలెను” అనిపలికెను.

6. నూను కుమారుడగు యెహోషువ యాజకులను పిలిచి “మీరు నిబంధన మందసమును మోసికొనిపొండు. ఏడుగురు యాజకులు ఏడుబాకాలు పట్టుకొని యావే నిబంధనమందసము ముందువెళ్ళుడు” అని చెప్పెను.

7. ప్రజలతో “మీరు ముందుకు పొండు. పట్టణము చుట్టు నడువుడు. ఆయుధములు ధరించిన వీరులు యావే మందసమునకు ముందుగా నడువుడు” అని పలికెను.

8. ప్రజలు యెహోషువ ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఏడుగురు యాజకులు ఏడు బాకాలు ఊదుచు యావే సాన్నిధ్యమున ముందు సాగుచుండగా యావే నిబంధన మందసము వారిని అనుసరించెను.

9. ఆయుధములను ధరించిన వీరులు బాకాలను ఊదు యాజకులకు ముందుగా నడచిరి. మిగిలిన దండు మందసము వెనుక నడచెను. ఈ రీతిగా బాకాలు మ్రోగుచుండగా జనులు ముందుకు సాగిరి.

10. అప్పుడు యెహోషువ “నేను చెప్పువరకు మీరు కేకలు వేయవలదు. ఒక్కమాట కూడ మాట్లాడవలదు. మీ కంఠమునుండి ఏ శబ్దమును రాకూడదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలెను” అని ప్రజలకు ఆనతిచ్చెను.

11. యెహోషువ ఆజ్ఞాపించిన ప్రకారము యావే మందసము నగరమును ఒకసారి చుట్టివచ్చెను. ఆపై ప్రజలు శిబిరమునకు తిరిగి వచ్చి అక్కడ రాత్రి గడపిరి,

12. యెహోషువ ఉదయమున లేచెను. యాజకులు యావే మందసము నెత్తుకొనిరి.

13. ఏడుగురు యాజకులు ఏడుబాకాలను ఊదుచు యావే మందసము ముందునడచిరి. ఆయుధములు ధరించిన వీరులు వారిముందు నడచిరి. మిగిలిన దండు యావే మందసము వెనుక నడచెను. ఈ రీతిగా బాకాలు మ్రోగుచుండగా దండుకదలెను.

14. రెండవరోజు నగరముచుట్టు ఒకసారి తిరిగి వారు శిబిరమునకు మరలివచ్చిరి. అటుల ఆరు రోజులు చేసిరి.

15. ఏడవరోజు ఉదయమున లేచి మునుపటివలె కోటగోడచుట్టు ఏడుసార్లు తిరిగిరి. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు కోటచుట్టు తిరిగిరి.

16. ఏడవసారి యాజకులు బాకాలను ఊదు చుండగా యెహోషువ “యావే యెరికో నగరమును మీ వశము చేసెను. యుద్ధనాదము చేయుడు” అనెను.

17. యెహోషువ ప్రజలతో “ఈ నగరము, నగరములోని సమస్తము యావే శాపమునకు గురి అయ్యెను. మనము పంపిన వేగులను దాచి రక్షించినది కావున రాహాబు అను వేశ్యయు, ఆమె ఇంటివారును మాత్రమే బ్రతుకుదురు.

18. మీరు శాపవిషయమున జాగ్రత్తతో నుండుడు. శాపమునకు గురియైన దేనిని మీరు దురాశచే ముట్టరాదు. ముట్టినచో యిస్రాయేలీయుల శిబిరమునకు గూడ ఆ శాపము తగిలి గొప్ప ఆపద సంభవించును.

19. వెండిబంగారములు ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు అన్నియు యావేకు చెందును. కావున వానిని యావే ధనాగారములో ఉంచవలెను” అని చెప్పెను.

20. అంతట యాజకులు బాకాలూదగా ప్రజలు కేకలు వేసిరి. బాకాలమ్రోత విని ప్రజలు యుద్ధనాదము చేయగా కోటగోడ కుపు కూలిపడెను. తక్షణమే ప్రజలు నేరుగా పట్టణములో జొరబడి పట్టణమును ఆక్రమించుకొనిరి.

21. స్త్రీలు, పురుషులు, బాలురు, వృద్ధులు, ఎద్దులు, గొఱ్ఱెలు, గాడిదలు - ఇదియదియనక, శ్వాసించు ప్రతిదానిని సంహరించి శాపముపాలు చేసిరి.

22. అప్పుడు యెహోషువ ఆ దేశమున వేగు నడపిన మనుష్యులనిద్దరను పిలిచి “ఆ వేశ్య ఇంట ప్రవేశించి ఆమెను, ఆమెకు సంబంధించిన వారినందరిని తీసికొనిరండు. మీ శపథము నెరవేర్చుకొనుడు” అని చెప్పెను.

23. వేగునడపిన పడుచువారు రాహాబు ఇంటికిబోయి ఆమెను, ఆమె తల్లిదండ్రులను సహోదరులను, ఆమెకు సంబంధించిన వారిని అందరను వెలుపలికి కొనివచ్చిరి. వారు ఆమె బంధువులను అందరను బయటికి తీసికొని వచ్చి సురక్షితముగా యిస్రాయేలీయుల శిబిరమునకు చేర్చిరి.

24. వారు పట్టణమును, పట్టణములోని సమస్తమును తగులబెట్టిరి. వెండి బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రములను మాత్రము యావే మందిరమందలి ధనాగారమునకు చేర్చిరి.

25. కాని రాహాబు అను వేశ్యను, ఆమె తండ్రి కుటుంబము వారిని, ఆమె బంధువులనందరను యెహోషువ రక్షించెను. యెరికోలో వేగు నెరపుటకు యెహోషువ పంపిన వేగులవారిని ఇద్దరను దాచి కాపాడుటచేత రాహాబు నేటివరకు యిస్రాయేలీయుల నడుమ బ్రతుకు చున్నది.

26. అప్పుడు యెహోషువ “యెరికో పట్టణమును మరల కట్టించువాడు యావే శాపమునకు గురియగునుగాక! ఎవడైన దానికి మరల పునాదులు వేసినచో వాని పెద్దకొడుకు మరణించునుగాక! ద్వారములెత్తినచో వాని చిన్నకొడుకు గతించునుగాక!" అని ప్రజలచే యావే ముందు ప్రమాణము చేయించెను.

27. యావే ఇట్లు యెహోషువకు తోడైయుండుట చేత అతని కీర్తి దేశమంతట వ్యాపించెను.