ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 6

1. “ప్రభువు నన్ను మీకు ఉపదేశింపుమనిన ఆజ్ఞలు, విధులు, చట్టములు ఇవియే. మీరు స్వాధీ నము చేసికొనబోవు భూమిమీద వీనినెల్ల ఆచరింపుడు.

2. మీరు ఎల్లవేళల ప్రభువునకు భయపడుదురేని, నేనాదేశించిన ఈ ఆజ్ఞలనెల్ల శిరసావహింతురేని మీ వంశజులు కలకాలము బ్రతికిపోయెదరు.

3. కనుక యిస్రాయేలీయులారా! ఈ ఉపదేశమును ఆలింపుడు. ఈ ఆజ్ఞలు చేకొనుడు. అప్పుడు మీకు క్షేమము కలుగును. మన పితరుల దేవుడు వాగ్దానముచేసిన పాలుతేనెలు జాలువారు నేలమీద మీరు బహుగా వృద్ధి చెందుదురు.

4. యిస్రాయేలీయులారా వినుడు! మన ప్రభుడైన దేవుడు ఏకైక ప్రభువు.

5. మీ ప్రభువైన దేవుని పూర్ణహృదయముతోను, పూర్ణఆత్మతోను, పూర్ణశక్తితోను ప్రేమింపుడు.

6. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుడు.

7. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను, బయటనున్నను, విశ్రాంతి తీసికొనుచున్నను, లేచు నప్పుడును వీనినిగూర్చి ముచ్చటింపుడు.

8. ఈ ఆజ్ఞలను ఎల్లపుడు జ్ఞప్తియుంచుకొనుటకై గురుతుగా మీ చేతులమీదను, బాసికమువలె మీనొసటిమీదను కట్టుకొనుడు.

9. మీ ఇంటిద్వార బంధములమీదను, పురముఖద్వారములమీదను వీనిని వ్రాసికొనుడు."

10. “ప్రభువు మీ పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ప్రమాణముచేసినట్లే ఆ దేశమును మీకిచ్చును. అచ్చట మీరు నిర్మింపని విశాలమైన మంచిపట్టణములు ఉండును.

11. అచటి ఇండ్లలో మీరు చేకూర్చని మంచివస్తువులెన్నో మీకు ఇత్తును. మరియు అచట మీరు త్రవ్వకున్నను త్రవ్వి యున్నబావులు, మీరు నాటని ఓలివుతోటలు, ద్రాక్ష తోటలు ఉండును. వాని పండ్లను మీరు సంతృప్తిగా భుజింతురు.

12. కాని దాస్యగృహమైన ఐగుప్తునుండి మిమ్ము తోడ్కొని వచ్చిన ప్రభువును విస్మరింతురేమో జాగ్రత్త!

13. మీరు ఆ ప్రభువునకు భయపడుడు. ఆయనకు మ్రొక్కుడు. ఆయన పేరు మీదుగానే బాస చేయుడు.

14. “మీరు మీ చుట్టుపట్లనున్న జాతుల దైవములను పూజింపరాదు.

15. మీ మధ్య వసించు ప్రభువు అసూయపరుడైన దేవుడు. మీరు ప్రభువు కోపమును రెచ్చగొట్టుదురేని ఆయన మిమ్ము ఈ నేల మీది నుండి అడపొడ కానరాకుండ తుడిచివేయును.

16. మునుపు మస్సావద్ద చేసినట్లుగా, ప్రభువును మరల పరీక్షకు గురిచేయవలదు.

17. ప్రభువు ఆదేశించిన విధులు, ఆజ్ఞలు, చట్టములు శ్రద్ధతో పాటింపుడు.

18. ప్రభువు దృష్టికి న్యాయమును, ఉత్తమమునైన కార్యములను మాత్రమే చేయుడు. అప్పుడు మీకు క్షేమముకలుగును. ఆయన మీ పితరులకు వాగ్దానము చేసిన సారవంతమైన దేశమును మీరు స్వాధీనము చేసికొందురు.

19. ప్రభువు నుడివినట్లే అచటి శత్రువులను ఓడించి మీ ముందునుండి తరిమివేయుదురు.

20. భవిష్యత్కాలమున మీ పిల్లలు ప్రభువు మనకు ఈ శాసనములు, విధులు, నియమములన్నింటిని ఎందుకు విధించెను అని ప్రశ్నించినచో మీరు ఇట్లు సమాధానము చెప్పవలయును.

21. “పూర్వము మనము ఐగుప్తున ఫరోకు బానిసలమైయుండగా ప్రభువు తన బాహుబలముచేత మనలను అచటినుండి తోడ్కొనివచ్చెను.

22. మా కన్నుల ఎదుటనే ఆయన మహాభయంకరమైన అద్భుతక్రియలు చేసి, సూచక క్రియలను కనపరచి ఫరోను, అతని ఉద్యోగులను, ప్రజలను అణగదొక్కెను.

23. తాను పితరులకు వాగ్దానము చేసిన ఈ నేలకు చేర్చుటకై మనలను అచటినుండి తరలించుకొనివచ్చెను.

24. మనము ఈ ఆజ్ఞలెల్లపాటించుచు తనకు భయపడవలయునని ఆయన మనమంచికే కోరెను. అటుల చేసినచో నేడు జరుగుచున్నట్లుగనే మనము క్షేమముగా బ్రతుకుదుము.

25. ప్రభువు ఆదేశించినట్లే ఈ ఆజ్ఞలెల్ల ఆచరింతుమేని అప్పుడు మనము ధర్మబద్దముగా జీవించినట్లగును.”