ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 5

1. యిస్రాయేలీయులు దాటువరకు వారిముందు యావే యేటి జలములను ఎండజేసిన సంగతి యోర్దానునకు పడమటనున్న అమోరీయ రాజులు, సముద్రతీరమునందలి కనానీయ రాజులు వినిరి. వినినంతనే వారి గుండెలు చెదరిపోయెను. యిస్రాయేలీయులనగానే ఆ రాజుల ఉత్సాహము అడుగంటెను.

2. అప్పుడు యావే రాతి కత్తులు చేయించి యిస్రాయేలీయులకు మరల సున్నతి చేయింపుమని యెహోషువను ఆజ్ఞాపించెను.

3. యెహోషువ రాతి కత్తులు చేయించి 'గిబియెత్ హారలోత్' సున్నతి కొండ వద్ద యిస్రాయేలీయులకు సున్నతి చేయించెను.

4. అతడు వారికి సున్నతిచేయించుటకు కారణమిది. ఐగుప్తుదేశమునుండి బయలుదేరిన వారిలో యుద్ధము చేయు ప్రాయముకలిగిన పురుషులందరు త్రోవలో ఎడారియందు మరణించిరి.

5. ఐగుప్తునుండి వెడలి వచ్చినవారందరు సున్నతి పొందినవారే. కాని ఐగుప్తు దాటి ప్రయాణము చేయునపుడు ఎడారిలో పుట్టిన వారెవ్వరు సున్నతి పొందలేదు.

6. యిస్రాయేలు ప్రజలు నలువదియేండ్లు ఎడారిలో ప్రయాణముచేసిరి. ఆ కాలమున యుద్ధముచేయు ప్రాయమువచ్చిన పురుషులందరును నశించిరి. వారందరు ప్రభువు మాట పెడచెవిని పెట్టినవారే. అందుచే తాను పూర్వులకు ప్రమాణము చేసిన భూమిని వారు కంటితో చూడజాలరని ప్రభువు శపథము చేసెను. అది పాలు తేనెలు జాలువారు నేల.

7. కావున ప్రభువు ఆ నాశనమైన వారికి బదులుగా కలిగించిన రెండవ తరమువారికి యెహోషువ సున్నతిచేసెను. వారు దారిలో సున్నతిని పొందలేదు.

8. అందరు సున్నతి చేయించుకొని ఆరోగ్యము చేకూరు వరకు శిబిరములో విశ్రమించిరి.

9. అప్పుడు యావే “నాటి ఐగుప్తు అపకీర్తిని' నేడు మీ నుండి తొలగించితిని” అని యెహోషువతో చెప్పెను. కాబట్టి నేటివరకు ఆ ప్రదేశము గిల్గాలు' అని పేరుతో పిలువబడుచున్నది.

10. యిస్రాయేలీయులు గిల్గాలులో దిగిరి. ఆ నెల పదునాలుగవరోజు సాయంకాలము యెరికో మైదానములో పాస్కపండుగ చేసికొనిరి.

11. ఆ మరు నాడు ఆ దేశపు పంటను రుచిచూచిరి. పులియని పిండితో రొట్టెలను చేసికొనితినిరి. కంకులను కాల్చుకొని ఆరగించిరి.

12. ఆ దేశపుపంటను వారు మొట్టమొదటి సారిగా తిన్నప్పటినుండి మన్నా ఆగిపోయెను. ఆ మీదట మన్నా కురియలేదు. కనుక ఆ సంవత్సరము నుండి యిస్రాయేలీయులు కనాను దేశపు పంటతోనే జీవించిరి.

13. యెహోషువ యెరికోచెంత నున్నప్పుడు ఒకనాడు కనులెత్తి చూడగా ఎదుట ఒక మనుష్యుడు కనిపించెను. అతడు చేత కత్తిదూసి నిలబడియుండెను. యెహోషువ అతనిని సమీపించి, “నీవు మా వాడవా, లేక శత్రుపక్షము వాడవా?" అని అడిగెను.

14. “నేను యావే సైన్యమునకు నాయకుడనుగా ఇచ్చటికి వచ్చితిని” అని అతడు సమాధానము చెప్పెను. వెంటనే యెహోషువ నేలపై సాగిలపడి అతనికి నమస్కరించి, “ఈ దాసునకు ప్రభువు ఏమి ఆజ్ఞాపించుచున్నాడు?” అని అడిగెను.

15. “నీవు నిలబడిన ఈ ప్రదేశము పవిత్రమైనది. పాదరక్షలను తీసివేయుము” అని యావే సైన్యాధిపతి పలికెను. యెహోషువ అతడు చెప్పినట్లు చేసెను.