1. జనులందరు యోరాను నదిని దాటుట పూర్తియైన తరువాత యావే యెహోషువతో
2-3. “ఈ జనులనుండి తెగకు ఒక్కని చొప్పున పండ్రెండు మందిని ఎన్నుకొనుము. యోర్దాను నడుమ యాజకులు నిలిచిన చోటునుండి పండ్రెండురాళ్ళను తీసికొని పోయి, రాత్రి బసచేయుచోట ఉంచుడని వారిని ఆజ్ఞాపింపుము" అని పలికెను.
4. అంతట యెహోషువ, యిస్రాయేలీయుల నుండి తెగకు ఒకని వంతున పండ్రెండు మందిని ఎన్నుకొని వారిని పిలచి ఇట్లు చెప్పెను.
5. “యోర్దాను నది మధ్యకు పోయి మీ దేవుడైన యావే మందసము నిలిచిన స్థలము నుండి యిస్రాయేలీయుల తెగల లెక్క చొప్పున మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రాతిని భుజమున పెట్టుకుని తీసుకొనిరండు” అని చెప్పెను.
6. ఈ రాళ్ళు మీకు జ్ఞాపకచిహ్నముగా నుండును. రాబోవు కాలమున ఈ రాళ్ళెందుకని మీ పిల్లలు అడిగినప్పుడు,
7. 'యావే నిబంధన మందసము యోర్దాను నదిని దాటుచుండగా ఆ మందసము ఎదుట నదీ ప్రవాహము ఆగిపోయెను. ఆ రాళ్ళు యిప్రాయేలీయులకు ఆ విషయమును ఎల్లప్పుడును గుర్తుచేయుచుండును' అని వారికి చెప్పుడు.”
8. యిస్రాయేలీయులు యెహోషువ చెప్పినట్లు చేసిరి. యావే యెహోషువతో చెప్పినట్లు తెగల లెక్క చొప్పున యోర్దాను నది నడుమనుండి పండ్రెండు రాళ్ళను తీసికొని శిబిరమునకు మోసికొనిపోయి అచ్చటపాతిరి.
9. యెహోషువ యోర్దానునది నడుమ నిబంధన పెట్టె మోయు యాజకులు నిలబడిన చోట కూడ పండ్రెండు రాళ్ళను పాతించెను. అవి నేటికిని అక్కడ కలవు.
10. ప్రజలతో చెప్పుమని యావే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించిన ప్రకారము నెరవేరు వరకు యాజకులు నిబంధనమందసమును మోయుచు యేటినడుమ నిలుచుండిరి. ప్రజలు తొందరగా నదిని దాటిరి.
11. జనులందరు దాటిన తరువాత నిబంధన మందసముతో యాజకులు దాటిరి.
12. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధ తెగలవారిలో జనులు మోషే వారిని ఆజ్ఞాపించినట్లు ఆయుధములు ధరించి, యిస్రాయేలు ప్రజల ఎదుట యుద్ధసన్నద్దులై నదిని దాటిరి.
13. యుద్ధమునకు యోగ్యులైన యోధులు దాదాపు నలువదివేల మంది ఆయుధములు ధరించి ప్రభువు సన్నిధిలో యెరికో మైదానము వైపు యుద్ధముచేయుటకే నదిని దాటిరి.
14. ఆనాడు యిస్రాయేలీయుల ముందు యావే యెహోషువను ఘనపరచి, వారు మోషేను గౌరవించినట్లు అతనియెడలను జీవితకాలమంతయు గౌరవము కలిగియుండునట్లు చేసెను.
15-16. “నిబంధన పెట్టెను మోయుచున్న యాజకులను యోర్దాను నది నుండి బయటికి రమ్మని చెప్పుము” అని యావే యెహోషువను ఆజ్ఞాపించెను.
17. "నది నుండి వెలుపలకురండు” అని యెహోషువ యాజకులతో పలికెను.
18. యావే నిబంధనపు పెట్టెను మోయుచున్న యాజకులు నదినుండి పైకివచ్చి గట్టుపై కాలుమోపగానే నదిలోని నీరు మునుపటి చోటికి చేరుకొని పూర్వపురీతినే గట్లు పొర్లి ప్రవహించెను.
19. మొదటినెల పదవరోజున జనులు యోర్దాను నుండి వెడలివచ్చి యెరికో పట్టణమునకు తూర్పు వైపునున్న గిల్గాలులో దిగిరి.
20. నదినుండి తెచ్చిన పండ్రెండురాళ్ళను యెహోషువ గిల్గాలులో నిలిపెను.
21. అతడు యిస్రాయేలీయులతో, “రాబోవు కాలమున మీ పిల్లలు ఈ రాళ్ళెందుకని మిమ్ము అడిగి నప్పుడు
22-23. 'యిస్రాయేలీయులు ఎండిన నేలపై యోర్దానును దాటిరి. మేము దాటు వరకు మా దేవుడైన యావే యోర్దాను నీళ్ళను ఇంకించెను. పూర్వము మా దేవుడైన యావే మేము దాటు వరకు రెల్లుసముద్రపు నీళ్ళను కూడ ఇట్లే ఇంకించెను.
24. భూమిమీద సకలజాతి జనులు యావే బాహుబలమును గుర్తించి ఆ ప్రభువుపట్ల భయభక్తులు చూపుటకొరకు అతడిట్లు చేసెను' అని చెప్పుడు” అని పలికెను.