1. యెహోషువ వేకువజామున లేచి యిస్రాయేలీయులతో షిత్తీమునుండి బయలుదేరెను. వారు యోర్దానునది ఒడ్డును చేరి దాటుటకు ముందు అచట బసచేసిరి.
2-3. మూడు రోజుల తరువాత నాయకులు శిబిరములో తిరుగుచు “మీ దేవుడైన యావే నిబంధన మందసమును లేవీయ యాజకులు మోసికొనిపోవుట మీరు చూచినంతనే మీరున్నచోటు విడిచి పెట్టి ఆ మందసము వెనుక వెళ్ళుడు.
4. కాని మీరు మందసము దగ్గరగా నడువరాదు. దానికి మీకు రెండువేల మూరల ఎడముండవలయును. ఇంతకు ముందు మీరు ఈ త్రోవలో ప్రయాణము చేయలేదు. కనుక మందసమును అనుసరించి వెళ్ళుడు” అని ఆజ్ఞా పించిరి.
5. “మిమ్మును మీరు పవిత్ర పరచుకొనుడు. ఎందుకనగా రేపు యావే మీ మధ్య అద్భుతకార్యములు చేయును” అని యెహోషువ ప్రజలకు చెప్పెను.
6. యెహోషువ “మీరు నిబంధనమందసమును యెత్తుకొని ప్రజలకు ముందు నడువుడు” అని యాజకులతో పలికెను. యాజకులు నిబంధన మందసమును మోయుచు ప్రజలకు ముందునడిచిరి.
7. యావే యెహోషువతో "నేడు నిన్ను యిస్రాయేలు ప్రజల ముందు గొప్పవానిని చేసెదను. నేను మోషేకువలెనె నీకును తోడైయుందునని ఈ ప్రజలు తెలిసికొందురు.
8. నీవు నిబంధనపు పెట్టెను మోయు యాజకులకు 'మీరు యోర్దాను గట్టును సమీపించి నిలబడుడు' " అని ఆనతివ్వవలెను.
9. అప్పుడు యెహోషువ “నా దగ్గరకు రండు. మీ దేవుడైన యావే మాటలు వినుడు.
10. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాట బోవుచున్నది.
11. కనుక సజీవుడైన దేవుడు మీతో నున్నాడని తెలిసికొనుడు. అతడు కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిస్సీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను మీ ఎదుటినుండి తప్పక వెళ్ళగొట్టునని గ్రహింపుడు.
12. కనుక ఇప్పుడు యిస్రాయేలు ప్రజల నుండి తెగనకు ఒకని వంతున పండ్రెండుమందిని ఎన్నుకొనుడు. .
13. సర్వలోకనాథుడగు యావే నిబంధన మందసము నెత్తుకొనిన యాజకుల పాదములు యోర్దాను నీటిలో దిగగనే, యెగువనుండి ప్రవహించు నీరు దిగువ నీరునుండి వేరయి ఒకచోట ప్రోవై నిలుచును” అనెను.
14. యెహోషువ ఆజ్ఞ ప్రకారము యోర్దాను నదిని దాటుటకు ప్రజలు శిబిరము నుండి బయలు దేరిరి. యాజకులు నిబంధన మందసము నెత్తుకొని ప్రజల ముందు నడచిరి.
15-16. యోర్దాను నది కోత కాలమున పొంగి ప్రవహించును. నిబంధన మందసము మోయువారు యోర్ధానులో దిగిరి. వారి పాదములు నీళ్ళనంటగనే యెగువనుండి పారునీరు ఆగిపోయెను. సారెతాను చెంతనున్న ఆదాము వట్టణము వరకు చాలదూరము నీళ్లోకరాశిగా ఏర్పడెను. దిగువవైపు అరబా అనబడు ఉప్పుసముద్రములోనికి ప్రవహించు నీరు పూర్తిగా ఆగిపోయెను. యిస్రాయేలు ప్రజలు యెరికో పట్టణమునకు ఎదురుగా నదిని దాటిరి.
17. యిస్రాయేలీయుల ప్రజలు అందరును ఆరిన నేలపై నదిని దాటిపోవు వరకు నిబంధన మందసమును మోయు యాజకులు నది నడుమ ఎండిన నేలపై నిలబడిరి.