ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 34

1. అంతట మోషే మోవాబు మైదానమునుండి వెడలిపోయి యెరికో నగరమునకు ఎదురుగానున్న నెబో కొండయందలి పిస్గా శిఖరము నెక్కెను. అచటి నుండి ప్రభువు అతనికి ఆ దేశము నంతటిని చూపించెను. గిలాదు మండలమును దాను నగరము వరకు చూపించెను.

2. నఫ్తాలి మండలమును సంపూర్ణముగా చూపించెను. ఎఫ్రాయీము మనష్షే మండలమును చూపించెను. యూదా మండలమును మధ్యధరాసముద్రము వరకు చూపించెను.

3. దక్షిణ భాగమును, సోవరు యెరికో నగరముల మధ్య గల మైదానమును, ఖర్జురవనముల పట్టణమును చూపించెను. 

4. ప్రభువు మోషేతో “నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులకు బాసచేసి వారి సంతానము నకు ఇచ్చెదనన్న సీమ ఇదియే. నేను నీకు ఆ నేలను చూపించితిని. కాని నీవు అచటకు వెళ్ళజాలవు” అని అనెను.

5. ప్రభువు నిర్ణయించినట్లే దైవభక్తుడైన మోషే మోవాబు మండలముననే గతించెను.

6. ప్రభువు అతనిని బేత్పెయోరు పట్టణము నెదుట మోవాబు లోయలో పాతి పెట్టెను. కాని నేటివరకు అతని సమాధియెవరి కంటనుపడలేదు.

7. చనిపోవునాటికి మోషే వయస్సు నూటయిరువదిఏండ్లు. అయినను అతని దృష్టి మందగింపలేదు, అతని శక్తిసన్నగిల్లలేదు.

8. మోవాబు మైదానమున యిస్రాయేలీయులు మోషే కొరకు ముప్పదినాళ్ళు శోకించిరి. ఆ పిమ్మట శోక దినములు ముగిసినవి.

9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువపై ఉంచెను, గనుక అతడు పూర్ణవిజ్ఞానమును బడసెను. యిస్రాయేలీయులు యెహోషువకు విధేయులై ప్రభువు మోషే ముఖమున ప్రసాదించిన ఆజ్ఞలను పాటించిరి.

10. నాటినుండి మోషేవంటి ప్రవక్త యిస్రాయేలీయులలో మరల పుట్టలేదు. ప్రభువు అతనితో ముఖాముఖి సంభాషించెను.

11. ప్రభువు ఫరోను అతని అధికారులను అతని దేశమును నాశనము చేయుటకై మోషేద్వారా ఎంతటి అద్భుతకార్యములు, ఎట్టి సూచక క్రియలు చేయించెను!

12. యిస్రాయేలీయుల సమక్షమున మోషే ఎంతటి భయంకరమైన మహాకార్యములు నిర్వహించెను!