ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ద్వితియోపదేశకాండము 31

1. మోషే యిస్రాయేలీయులతో ఇట్లనెను:

2. “నాకిపుడు నూటయిరువది యేండ్లు. నేనిక కార్యభారము వహింపజాలను. నేను యోర్దాను దాటనని గూడ ప్రభువు సెలవిచ్చెను.

3. మీ ప్రభువైన దేవుడు మీకు ముందుగా పోయి అచటి జాతులను నాశనము చేయును. మీరు వారి దేశమును స్వాధీనము చేసికొందురు. యెహోషువ మీకు నాయకుడగునని ప్రభువు నాతో చెప్పెను.

4. ప్రభువు అమోరీయ రాజులగు సీహోను, ఓగులను జయించి వారి రాజ్య ములను నాశనము చేసినట్లే, ఆ శత్రు ప్రజలను కూడ తుదముట్టించును.

5. ప్రభువు వారిని మీ చేతికి చిక్కించును. నేను మిమ్ము ఆజ్ఞాపించినట్లే మీరు వారిని రూపుమాపుడు.

6. మీరు ధైర్యస్టెర్యములను అలవరచుకొనుడు. మీరు వారిని చూచి భయపడవలదు. అధైర్యము చెందవలదు. ప్రభువు మీకు బాసటయై ఉండును. ఆయన మిమ్ము చేయి విడుచువాడు కాడు.”

7. అంతట మోషే యెహోషువను పిలిపించి ప్రజలందరి సమక్షమున అతనితో ఇట్లనెను: “నీవు ధైర్య స్తైర్యములను అలవరచుకొనుము. నీవీ ప్రజలతో వెళ్ళుము. ప్రభువు వారి పితరులకు వాగ్దానము చేసిన దేశమును స్వాధీనము చేసికొనునట్లు చేయుము.

8. నీవు భయపడవలదు. దిగులుపడవలదు. ప్రభువు నీ చేయివిడువడు. ఆయన నీకు నాయకుడగును. నీకు తోడుగా ఉండును” అని యిస్రాయేలీయులందరి ఎదుట యెహోషువతో చెప్పెను.

9. మోషే ఈ ధర్మశాస్త్రమును లిఖించి, దానిని ప్రభువు మందసమును మోయు లేవీయ యాజకులకును, యిస్రాయేలు నాయకులకును ఒప్పజెప్పెను.

10. అతడు వారిని ఇట్లు ఆజ్ఞాపించెను. “ప్రతి ఏడవయేటి చివరన, బాకీలు రద్దయిన కాలమున

11. ప్రభువు ఎంచుకొనిన ఏకైక ఆరాధనస్థలమున ప్రజలు ఆయనను కొలుచుటకు సమావేశమయినపుడు మీరు ఈ ధర్మశాస్త్రమును జనులందరి ఎదుట పఠింపుడు.

12. అప్పుడు స్త్రీలను, పురుషులను, పిల్లలను, మీ నగరములలో వసించుపరదేశులను ప్రోగు చేయుడు. వారెల్లరు ఈ ధర్మశాస్త్రమును విని ప్రభువు పట్ల భయభక్తులు అలవరచుకొని ఆయన ఆజ్ఞలెల్ల పాటింతురు.

13. అంతవరకు ఈ ధర్మశాస్త్రమును ఆలకింపని పిల్లలును అప్పుడు దానిని విందురు. విని, యోర్దాను ఆవల మీరు సొంతం చేసికొనబోవు నేలమీద తాము జీవించినంతకాలము ప్రభువుపట్ల భయభక్తులు చూపుదురు."

14. ప్రభువు మోషేతో “నీవు కన్నుమూయు కాలము సమీపించినది. యెహోషువను పిలువనంపి మీరిరువురు సమావేశపుగుడారము చెంత వేచి యుండుడు. నేను అచట అతనికి ఉపదేశము చేయుదును” అనెను. కనుక మోషే యెహోషువలు సమావేశపు గుడారము చెంత చేరిరి.

15. ప్రభువు గుడారము తలుపునొద్ద మేఘమునందు వారికి ప్రత్యక్షమయ్యెను.

16. ప్రభువు మోషేతో ఇట్లనెను: “నీవు త్వరలోనే నీ పూర్వీకులను చేరుదువు. నీ మరణానంతరము ఈ ప్రజలు వ్యభిచారులై తాము స్వాధీనము చేసికొనబోవు దేశమునందలి అన్యదైవములను పూజింతురు. వారు నన్ను విడనాడుదురు. నేను వారితో చేసికొనిన నిబంధనమును మీరుదురు.

17. అప్పుడు నా కోపము వారిమీద రగుల్కొనును. నేను వారిని పరిత్యజింతును. వారిని కరుణింపను. వారు ఘోర యాతనలకు గురియై క్రుంగి పోవుదురు. అప్పుడు ఆ ప్రజలు “ప్రభువు మమ్ము చేయివిడిచెను కనుకనే మాకు ఈ అగచాట్లన్నియు ప్రాప్తించినవి” అనియను కొందురు.

18. వారు అన్య దైవములను పూజించి అపచారము చేసినందులకు నేను వారిని ఆదుకొనను.

19. ఇప్పుడు నీవు ఈ పాటను వ్రాసికొనుము. దీనిని యిస్రాయేలీయులకు నేర్పింపుము. ఇది వారిని ఖండించుచు సాక్ష్యమిచ్చును.

20. నేను పితరులకు వాగ్దానము చేసిన పాలుతేనెలు జాలువారు నేలకు వీరిని కొనిపోవుదును. అచట వారు తమకు ఇష్టము వచ్చినది భుజించి సుఖముగా జీవింతురు. కాని వారు నన్ను విడనాడి అన్యదైవములను కొలుతురు. నన్ను లెక్కచేయక నా నిబంధనమును మీరుదురు.

21. ఫలితముగా ఘోరమైన యాతనలు, కష్టములు వారిని పీడించును. అప్పుడు ఈ గీతము వారిని ఖండించి సాక్ష్యమిచ్చును. వీరి సంతానమును కూడ దీనిని విస్మరింపజాలరు. నేను వీరికి వాగ్దానము చేసిన నేలకు వీరిని కొనిపోకమునుపే, వీరి హృదయములలో నున్న ఆలోచనలను ఇప్పుడే గుర్తింపగలను.”

22. మోషే నాడే ఈ గీతమును లిఖించి దానిని యిస్రాయేలీయులకు నేర్పించెను.

23. అంతట ప్రభువు నూను కుమారుడైన యెహోషువతో “నీవు ధైర్య స్టెర్యములను అలవరచుకొనుము. నీవు నేను వాగ్దానము చేసిన దేశమునకు యిస్రాయేలీయులను తప్పక తోడ్కొనివత్తువు. నేను నీకు బాసటయైయుందును” అని పలికెను.

24. మోషే ఈ దైవశాసనములన్నిటిని ఒక గ్రంథమున వ్రాసి,

25. ప్రభువు మందసమును మోయు బాధ్యతగల లేవీయులను ఇట్లు ఆజ్ఞాపించెను:

26. “మీరు ధర్మశాస్త్రమును కొనిపోయి మీ దేవుడైన ప్రభువు మందసముచెంత ఉంచుడు. అది అచట నుండి మిమ్ము ఖండించుచు సాక్ష్యమిచ్చును.

27. మీరు తిరుగుబాటు చేయువారనియు, తలబిరుసుగల జనమనియు నేనెరుగుదును. నేడు నేను బ్రతికియుండగనే మీరు దేవుని మీద తిరుగబడితిరనగా, ఇక నేను చనిపోయినపిదప ఎంతటి అల్లరికైనను పాల్ప డుదురు.

28. మీ తెగనాయకులను పెద్దలను నాయెదుట ప్రోగుచేయుడు. నేను వారికి ఈ సంగతులు చెప్పెదను. వారిని ఖండించి సాక్ష్యము చెప్పుటకు, భూమ్యాకాశములను పిలిచెదను.

29. నేను చనిపోయిన తరువాత మీరు తప్పక దుష్కార్యములు చేయుదురు. నా ఆదేశములను తిరస్కరించుదురనియు, మీరు ప్రభువు ఒల్లని చెడ్డపనులు చేసి ఆయన కోపమును రెచ్చగొట్టుదురనియు కావుననే భవిష్యత్తులో మీకు కీడు వాటిల్లునని నాకు తెలియును”

30. అంతట యిస్రాయేలు సమాజమంతయు ఆలకించుచుండగా మోషే ఈ క్రింది గీతమును సాంతముగా వినిపించెను: