1. నేను పేర్కొనిన దీవెనలు, శాపములు నెరవేరి మీరు వివిధ జాతులమధ్య చెల్లాచెదరైనపుడు ఈ సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొనుడు.
2. మీరు, మీ సంతానము, నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలకు పూర్ణముగా బద్దులై, ప్రభువునొద్దకు పూర్ణహృదయము తోను, పూర్ణఆత్మతోను మరలివత్తురేని,
3. ప్రభువు మీ మీద దయచూపును. ప్రభువు మిమ్ము వివిధ జాతుల మధ్య చెల్లాచెదరు చేసెనుగదా! అచటి నుండి మిమ్ము మరల తోడ్కొనివచ్చును. మీరు మరల అభివృద్ధి చెందునట్లు చేయును.
4. మీరు మిన్నులు పడ్డచోట చెల్లాచెదరైయున్నను, ప్రభువు అచటినుండి గూడ మిమ్ము తోడ్కొనివచ్చును.
5. ఆయన మీ పితరులు స్వాధీనము చేసికొనిన నేలకు మిమ్మును కొనిపోవును. మీరు ఆ దేశమును వశము చేసి కొందురు. ప్రభువు మీ పితరులకంటె గూడ మిమ్ము అధిక సంపన్నులను, అధికసంఖ్యాకులను చేయును.
6. ప్రభువు మీకును, మీ సంతానమునకును విధేయాత్మకములైన హృదయములనొసగును. మీరు ఆయనను పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రేమింతురు. ఆ నేలమీద చిరకాలము జీవింతురు.
7. మిమ్ము ద్వేషించి వీడించు శత్రువుల మీదికే ప్రభువు ఈ శాపములన్నియు దిగివచ్చునట్లు చేయును.
8. కనుక మీరు మరల ఆయనకు విధేయులగుదురు. నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలెల్ల పాటింతురు.
9. ప్రభువు మీ కార్యములెల్ల సఫలముచేసి మిమ్ము పెంపొందించును. మీకు చాలమంది పిల్లలు, చాల మందలు కలుగును. మీ పొలములు సమృద్ధిగా ఫలించును. ఆయన మీ పితరులపట్ల సంతోషించి వారిని పెంపొందించినట్లే, మీ యెడల సంతృప్తి చెంది మిమ్మును కూడ పెంపొందించును.
10. మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన ఆయన ఆజ్ఞలనెల్ల పాటించి పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను ఆయన యొద్దకు మరలి వత్తులేని పై దీవెనలెల్ల బడయుదురు.
11. నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిదికాదు.
12. అదెక్కడనో ఆకాశమున ఉన్నట్టిది కాదు. కనుక “మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశమున కెక్కి పోయి దానిని ఇచటకు కొనివత్తురు?” అని మీరు అడుగనక్కరలేదు.
13. అదెక్కడనో సముద్రములకు ఆవలనున్నట్టిది కాదు. కనుక “మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రములు దాటిపోయి దానిని ఇచటకు కొనివత్తురు?” అని మీరు అడుగనక్కరలేదు.
14. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయములోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనము పాటింపుడు.
15. జీవమును మేలును, కీడును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను.
16. ఈనాడు నేను మీకు విధించిన ప్రభువాజ్ఞలు పాటింతురేని, ఆయనను ప్రేమించి, ఆయనకు విధేయులై ఆయన శాసనములెల్ల నెరవేర్తురేని, మీరు పెంపు చెంది పెద్దజాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసికొనబోవు నేలమీద ప్రభువు మిమ్ము దీవించును.
17-18. కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్యదైవములను పూజింతురేని, తప్పక నశింతురని నేడు నేను నొక్కి వక్కాణించుచున్నాను. మీరు యోర్దానుకు ఆవలివైపున స్వాధీనము చేసికొనబోవు నేలమీద కూడ ఎక్కువకాలము జీవింపజాలరు.
19. ఈ దినము నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవమును మరణమును, ఆశీస్సును శాపమును మీ యెదుట నుంచితిని. కనుక జీవమునెన్నుకొని మీరును, మీ సంతానమును బ్రతికిపొండు.
20. మీరు ప్రభువును ప్రేమింపుడు. ఆయనకు విధేయులుకండు. ఆయనయే మీకు జీవనమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులగు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు దయచేయుదునని వాగ్దానము చేసిన నేలమీద, మీరు చిరకాలము జీవింతురు.”