ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 2

1. నూను కుమారుడగు యెహోషువ ఇద్దరు వేగుల వారిని పిలిపించెను. యెరికోకు పోయి వేగు నడపుడని షిత్తీము నుండి రహస్యముగా వారిని పంపెను. వారు వెళ్ళి, రాహాబు అను ఒక వేశ్య ఇంట ప్రవేశించి బసచేసిరి.

2. దేశములో వేగు నడపుటకు కొందరు యిస్రాయేలీయులు రాత్రి పట్టణములో ప్రవేశించిరని యెరికో రాజునకు తెలిసెను.

3. “నీ ఇంట బసచేసిన వారిని బయటికి పంపుము. వారు దేశములో వేగునడపుటకు వచ్చిన వారు” అని రాజు రాహాబు వద్దకు వార్త పంపెను.

4. ఆ స్త్రీ గూఢచారులను దాచియుంచి, “మనుష్యులు మా యింటికి వచ్చినమాట నిజమే. కాని వారెచ్చటి నుండి వచ్చిరో నేనెరుగను.

5. రాత్రి నగరద్వారము మూయువేళ వారు బయటికి వెళ్ళిరి. ఎచ్చటికి వెళ్ళిరో నాకు తెలియదు. మీరు తొందరగా వారిని వెంటాడినచో పట్టుకొనగలరు” అని పలికెను.

6. అంతక ముందే ఆమె గూఢచారులను మిద్దెమీదికెక్కించి జనుపకట్టెల ప్రోగులో దాచియుంచెను.

7. రాజభటులు వారికొరకు యోర్దాను నది వైపు రేవు మార్గముల వరకు వెంటాడిరి. రాజభటులు బయటికి పోయినంతనే కోట తలుపులు మూయబడెను.

8. వేగులవారు పండుకొనుటకు ముందు ఆమె మిద్దెమీదికి పోయి వారితో,

9. “యావే ఈ దేశము మీకిచ్చెను. మీరన్నమాకు భయము కలుగుచున్నది. ఈ దేశజనులందరు మిమ్ము చూచి భీతిచే గడగడ వణకుచున్నారు.

10. మీరు ఐగుప్తుదేశము నుండి వచ్చునపుడు మీ ఎదుట యావే ఎఱ్ఱసముద్రమును ఇంకించెను. యోర్దానునది ఒడ్డున అమోరీయ రాజులగు సీహోనును, ఓగును మీరు నాశనము చేసితిరి.

11. ఈ సంగతులన్నియు మేము వింటిమి. విన్నప్పుడు మా గుండెలు చెదరిపోయెను. మిమ్ము ఎదుర్కొనుటకు ఇక మావారిలో ఎవరికిని సాహసము లేదు. ఏలయన, మీ దేవుడైన యావే పైన ఆకాశమందును, క్రిందభూమి యందును దేవుడే.

12. నేను మీయెడ దయచూపితిని. మీరుకూడ నాతండ్రి ఇంటిలోని వారిపై కనికరము చూపింతుమని యావేపై ప్రమాణము చేయుడు.

13. నా తల్లిదండ్రులను, సోదరులను, అక్కచెల్లెండ్రను, వారి బంధుమిత్రులను చంపకుండ రక్షింతుమని నాకు నిజమైన గుర్తునిండు” అని పలికెను.

14. అందుకు వారు “మా ప్రాణములు ఒడ్డి మీ ప్రాణములు కాపాడెదము. నీవు మాత్రము మా రహస్యమును వెల్లడింపకుము. యావే ఈ దేశమును మాకిచ్చినపుడు మేము నిన్ను దయతో, విశ్వాసముతో ఆదరింతుము” అనిరి.

15. రాహాబు గృహము పట్టణపు గోడకు ఆనుకొనియుండెను. అందుచే ఆమె కిటికీనుండి త్రాడువేసి వేగులవారిని క్రిందికి దింపెను.

16. “మిమ్ము తరుమబోయిన వారు తిరిగి వచ్చువరకు మూడుదినములు కొండ లలో దాగికొనుడు. పిమ్మట మీత్రోవన మీరు వెళ్ళుడు” అని చెప్పెను.

17. అంతట వారు "మేము చెప్పినట్లు చేసినగాని మేము చేసిన ప్రమాణమును నిలుపుకొని జాలము.

18. మేము మీ దేశములో ప్రవేశించునపుడు మాకు గుర్తుగా నుండుటకు మమ్ము దింపిన ఈ కిటికీకి ఎఱ్ఱనితాడును కట్టుము. నీ తల్లిదండ్రులను, సోదరులను, నీ కుటుంబము వారినందరిని నీ ఇంట చేర్చుకొనుము,

19. నీ ఇంటి నుండి బయటికిపోవు వ్యక్తి అపాయమునకు గురియగును. దానికి మమ్ము లను నిందింపరాదు. నీ ఇంటనున్నవారిలో ఎవరికైన అపాయము కలిగినచో మేము జవాబుదారులము.

20. ఈ రహస్యమును నీవు వెల్లడించినచో నీవు మాచే చేయించుకొనిన ప్రమాణమునకు బద్దులముకాము” అని పలికిరి.

21. అందులకు ఆమె “మీరు చెప్పినట్లే చేయుదును” అని వారిని పంపించెను. వారు వెళ్ళిన తరువాత ఆ ఎఱ్ఱని తాడును కిటికీకి కట్టెను.

22. గూఢచారులు కొండలపైకి పోయి మూడు రోజుల పాటు అచట దాగికొని ఉండిరి. రాజభటులు త్రోవ పొడుగున వారిని వెదకిరి. కాని వారు కనిపింపక తిరిగివచ్చిరి.

23. రాజభటులు తిరిగివచ్చిన తరువాత గూఢచారులిద్దరు కొండలు దిగి, నదినిదాటి నూను కుమారుడగు యెహోషువ దగ్గరకు వెళ్ళి జరిగిన దంతయు విన్నవించిరి.

24. “యావే ఆ దేశమునెల్ల మన చేతులకు అప్పగించియున్నాడు. మనలను తలచుకొని ఆ దేశప్రజలప్పుడే తల్లడిల్లిపోవుచున్నారు” అని చెప్పిరి.